Read The census is about by BVD Prasadarao in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తపన కొస

తపన కొస

- బివిడి.ప్రసాదరావు

BVD.Prasada Rao

"చాల్లెండి. చోద్యం కాకపోతే ఏమిటి. మనం సినిమాకు వెళ్లడానికని చెప్పానుగా" అన్నాను నేను.

"అది కాదు, వారు మనకు టిక్కెట్లు ఇవ్వడం ఏమిటి, మనను సినిమాకు వెళ్ల మనడం ఏమిటి" అన్నారు మావారు.

"చెప్పాగా, వారు వెళ్లాలని తెచ్చుకున్నారట. కానీ సావిత్రికి ఒంట్లో నలతగా ఉందట. అందుకే వారు వెళ్లలేక మనకు టిక్కెట్లు ఇచ్చారు" అని చెప్పాను సహనంగా.

ఇంతలో కుక్కర్ మూడో విజిల్ వేసింది. వంటగది వైపు కదిలాను.

సావిత్రిది మా పక్క ఇల్లే. కాపురానికి వచ్చి నాలుగు నెలలు ఐనా, ఆమెలో చాలా కలుపుగోలుతనం ఉండడంతో నాతో బాగా కలిసిపోయింది.

మా ఇద్దరు పిల్లలు కూడా సావిత్రి చెంతన చనువుగా, హుషారుగా ఉంటూ ఉంటారు.

సావిత్రికి పిల్లలంటే ఇష్టం. అందుకే పిల్లల్ని ఇట్టే చేరిక చేసుకుంది.

మా పిల్లలు సెలవులకు మా నాన్న గారింటికి వెళ్లారు. అందుకు మా కంటే సావిత్రే తెగ దిగులు చెందింది.

నా వెనుకే వంట గదిలోకి వచ్చిన మా వారు, "వాళ్లింట్లో అంత మంది ఉన్నారు కదా, ఆ టిక్కెట్లు వాళ్లకు ఇవ్వవచ్చు కదా" అని అన్నారు.

"అయ్యో, వాళ్లది ఇల్లా! చిన్న హాస్టల్ లాంటిది కదా. వాళ్లలో ఏ ఇద్దరికని టిక్కెట్లు ఇస్తే, మిగతా వారు గోల చేయరా" అన్నాను చిరాకుగా.

మా వారు ఏమనుకున్నారో ఏమో, వెంటనే వంట గదిలో నించి వెళ్లిపోయారు.

సావిత్రి ఆ ఇంటికి కొత్త కోడలు. ఆమెతో పాటు ఆ రెండు గదుల ఇంటిలో ఆమె అత్తమామలు, ఆమె భర్త, పెళ్లి కావలసిన ఇద్దరు మరుదులు, భర్త చని పోతే ఇద్దరి పిల్లలతో కన్నవారింటికి వచ్చి ఉంటున్న పెద్ద ఆడపడుచుతో పాటు, పెళ్లికి ఎదిగిన మరో ఇద్దరు ఆడపడుచులు ఉంటున్నారు. అందుకే ఆ ఇంటిని అంతా కూడా చిన్న హాస్టల్ అంటారు.

నేను వంట గదిలో పనిని చక్కబెట్టుకొని తిరిగి వచ్చాను. మా వారు నా కోసమే ఎదురు చూస్తున్నట్టు అగుపించారు.

నేను అగుపించగానే, "ఆ సినిమా టిక్కెట్లు ఆ థియేటర్ దగ్గర తిరిగి వారు అమ్మేయ వచ్చు కదా. అదిన్నూ, అది కొత్త సినిమా. టిక్కెట్లు ఇట్టే అమ్ముడు పోతాయి." అన్నారు.

"ఎన్ని సంశయాలండీ బాబూ! మనం వద్దంటే బయట అమ్మేస్తామన్నారు. కొత్త సినిమా అనే కదా, నేనూ టిక్కెట్లు తీసుకున్నది. సరేనా" చెప్పాను అసహనంగా.

మా వారు ఇంకా ఏదో అనబోయారు ...

"టైం ఆరవుతోంది. ముందు మీరు తయారవ్వండీ" అన్నాను - నేను త్వరత్వరగా తయారవుతూ.

ఇక తప్పదన్నట్టు తనూ తయారవ్వడం ప్రారంభించారు - మా వారు.

పది నిముషాల తర్వాత, ఇద్దరం సినిమాకు బయలుదేరాం.

మా ఇంటి గుమ్మంలో నిల్చుని, సావిత్రి కోసం కేక వేశాను - పక్క ఇంటిలోకి చూస్తూ.

మా వారు మా ఇంటి సందులోని స్కూటర్ తీస్తుండగా -

సావిత్రి తన ఇంటిలోనించి బయటకు వచ్చింది.

నేను ఆమెతో, "మేము సినిమాకు వెళ్తున్నాం. మా ఇల్లు చూస్తుండు. మా ఇంటిలోనే, నువ్వు, మేము వచ్చేంత వరకు ఉండు. మీ అత్త గారితో చెప్పు." చెప్పాన్నేను, చిన్నగా నవ్వుతూ.

"అలాగే" అంది సావిత్రి, ఉత్సాహంగా. ముస్తాబుతో ముచ్చటగా ఉందామె.

ఆమె భుజం తట్టి, మా వారి వద్దకు వెళ్లాను.

ఆయన నన్ను వింతగా చూస్తుండగా, చెప్పాను: "పదండీ" అని, గట్టిగా.

ఆయన స్కూటర్ స్టార్ట్ చేసేశారు. నేను స్కూటర్ వెనుక కూర్చున్నాను.

ఇల్లు దాటిన వెంటనే, "ఏమిటి ఇది! ఇంటికి తాళాలు వేసేయవచ్చు కదా" అని గబుక్కున అడిగారు మావారు.

"ఈ మధ్య ఊర్లో దొంగతనాలు జోరుగా జరుగు తున్నాయిగా. అందుకే ఆమెను ఉండమన్నాను" అని చెప్పాను.

"ఈ మూడు గంటల్లోనే దొందతనం జరిగి పోతోందా" అన్నారు మా వారు.

"దొంగతనంకు అది చాలా కాలం. రోజులు బాగాలేవు. ఆఁ" అన్నాను.

"బీరువా తాళాలైనా ..." అని మా వారు అంటుండగా -

నేను ఒక్కమారుగా కసురుకోవడంతో ఆయన గుప్పున కామ్ అయిపోయారు.

అది మొదలు ఆయన అనీజీగానే మూవ్ అవుతున్నారు.

సినిమా హాలు చేరుకున్నాం.

సీట్లలో కూర్చున్నాం.

మేము మౌనంగానే ఉన్నాం.

సినిమా మొదలైంది.

మా వారి అస్తవ్యస్త కదలికలు నేను గమనిస్తూనే ఉన్నాను.

ఇంటర్వెల్ ఇచ్చారు. కూల్ డ్రింక్ కావాలన్నాను. మావారు లేచారు. నేనూ ఆయన వెనుకే నడిచాను.

"ఏమిటి మూడీగా ఉన్నారు" అడిగేశాను మావారిని - కూల్ డ్రింక్ లతో ఒక పక్కగా నిల్చున్న వెంటనే.

"ఇంటి వైపే నా దృష్టంతా ఉంది" చెప్పారు వారు.

నేను తెల్లబోయాను. అడిగాను, "ఎందుకండీ"

"సావిత్రి వాళ్లు ఇంటి మందంతా మన టీవీ, లైట్లు, ఫాన్లు, వగైరా వాడేసు కుంటూ మన ఇంటిని ఎంతగా చిందరవందర చేసేస్తున్నారో అని" అంటూ -

"పైగా బీరువా తాళాలు గురించి నువ్వు ఏమీ చెప్పలేదాయే" అన్నారాయన.

"అటువంటివి ఏమీ జరగవు లెండి." చెప్పాను వెంటనే.

"అంత కచ్చితంగా నీ కెలా తెలుసు" అడిగారు మావారు.

అసలు విషయం ఇక దాచరాదనుకుంటూ ... "నేనే వాళ్లకు అవకాశం కలిపించాను" చెప్పాను నెమ్మదిగా.

"నువ్వా! ఎందుకు?" అడిగారాయన.

"కొత్త దంపతులు. వాళ్లది ఇరుకు ఇల్లు. వాళ్ల ఇబ్బంది గుర్తించి, సావిత్రికి చెప్పి, కొన్ని గంటల పాటు ఆ భార్యాభర్తలకు మన ఇల్లు అప్ప చెప్పాను" అంటూ అసలు విషయం చెప్పాను.

"అంటే టిక్కెట్లు ..." అడిగారు మావారు.

"నేనే తెప్పించాను" చెప్పాను.

వెంటనే, "సావిత్రి మంచి పిల్ల. నమ్మకస్తురాలు. తనకు తీరిక దొరికితే చాలు, మన ఇంటి పనుల్లోనూ, వారిస్తున్నా, చొరవతో కలుగుచేసుకుంటుంది. చేదోడు వాదోడుగా ఉంటుంది. నాకు వీలు కాని అడ్డొచ్చిన ఆ మూడ్రోజులు, మన ఇల్లు ఆలనా చూస్తూ, వంట సాయం కూడా చేస్తోంది. అలాగే ఆమె భర్త కూడా. మంచివాడు. బిల్లులు చెల్లింపుల్లాంటివి చెప్తే, విసుక్కోకుండా వాటిని చెల్లించి, మనకు సహాయపడుతుంటాడు. అడపాతడపా మనకు వెచ్చా ల్లాంటివి కూడా తెచ్చి పెడుతుంటాడు. ఇవన్నీ మీకూ తెలుసుగా" చెప్పాను.

మా వారు మౌనంగా విన్నారు.

తిరిగి, "ఆ కొత్త దంపతులు వీలులేక, తమ సౌఖ్యాన్ని ఎంతగా చెయ్యి జార్చుకుంటూ అవస్థలు పడుతున్నారో నేను గుర్తించాను. రెండు మూడు మార్లు చొరవ తీసుకొని సావిత్రిని ఆ విషయమై కదిపాను కూడా. ఆమె చెప్పలేకనే వాస్తవం ఒప్పుకుంటూ చెప్పింది. జాలేసింది. అందుకే నేనే చొరవ తీసుకొని, ఈ వెసులుబాటు కలిపించాను. సావిత్రి అత్తగారికీ తెలియ చెప్పాను. కనుక, ఆ కొత్త దంపతులే మన ఇంటిని వాడుకుంటారు. పిల్లలు, మరెవరూ వెళ్లరు. పైగా తాళాలన్నీ జాగ్రత్త పరిచాను లెండి" చెప్పాను.

వెంటనే, "నాకు మీ తత్వం తెలుసు. మీతో ముందుగా ఇదంతా చెప్పితే, మీరు కాదంటారని భయం. అందుకే ఇంత హైరానా ..." అన్నాను.

మా వారు, "పద" అన్నారు, హాలులోకి కదులుతూ.

సినిమా తిరిగి మొదలైపోయింది.

సీట్లలో కూర్చున్నాం. పిమ్మట మేము మౌనంగానే ఉండిపోయాం.

సినిమా అవుతూనే ఉంది.

నేను మావారి వంక చూశాను. వారు కామ్ గా సినిమా వైపు చూస్తున్నారు.

మా వారి మూడ్ కుదుట లేక కానీ, లేకపోతే, మేము ఇద్దరం సినిమాకు వస్తే, వారు ఇంత కామ్ గానా ఉండేది! తన పాదాలతో నా పాదాలను నొక్కి పెడు తుంటారు. నా వైపుకు బాగా వాలిపోయి, నా భుజాన్ని తన తలతో నొక్కి గుస గుస లాడుతుంటారు. సడన్ గా ఏవేవో చేస్తారు. అబ్బో ... మహా కాని వారు మా వారు.

పడక గదిలో మహా చురుగ్గా ఉంటారు మావారు. అక్కడ ఆయన వల్లించే గమ్మత్తైన మాటల విరుపులు నాకు భలే ఇష్టం.

సయ్యాట పిదప ... 'చాల్లే సరసం' అంటారు.

నేను కాస్తా ఊపిరి పీల్చుకోగానే, నా మీద మళ్లీ ఉరుకుతారు.

'ఇప్పుడే చాలు అన్నారుగా' అంటాను.

'నే నలా అన్నానా' అమాయకంగా అంటారు మావారు.

'చాల్లే సరసం ... అన్నారుగా' అంటాను.

'అంటే, 'చాలలేదు సరసం' అని డియర్' అంటూ నన్ను ఆక్రమించు కుంటారు వారు, సునాయసంగా.

నా బుగ్గను ఏదో తాకి, చల్లగా అనిపించడంతో, తేరుకుంటూ గమనించాను.

వారు నాకు దగ్గరగా వచ్చి ఉన్నారు. ఆయన పెదాలు నా చెవి దగ్గరగా గుస గుసగా కదులుతూ, "ఐ లవ్ యూ" అన్నారు.

నా మనసు పొంగి, నా ఒళ్లు జలదరించింది. ప్రయత్నంతో సర్దుకు కూర్చున్నాను.

హమ్మయ్య, మావారి మూడ్ గాడీలోకి వచ్చింది.

కాలం భారంగా కదులుతోంది.

చివరకు సినిమా అయిపోయింది.

ఆయన దార్లో అన్నారు, "హోటల్ లో డిన్నర్ చేద్దాం"

"నేను వండేశాను" చెప్పాను.

"సర్లే. నీ టిక్కెట్లు మరి కాస్తా ముచ్చట్లను వారికి అందివ్వనీ" అంటూ -

"నీ మది ఇరుకు కాదుస్మీ" అన్నారు మావారు, ప్రేమగా.

నేను గుప్పున పొంగిపోయాను.

"నీ సరస హృదయం నన్ను గిలిగింతలు పెడుతోందోయ్" అన్నారు మావారు, కొంటెగా.

గుసగుసల్లా నవ్వులు చిందించాను.

మా వారు స్టార్ హోటల్ ముందు స్కూటర్ ఆపారు.

డిన్నర్ చాలా బాగా ఎంజాయ్ చేశాం.

తాపీగా ఇంటికి బయలుదేరాం.

దార్లో మావారు నాకు బారెడు మల్లె పువ్వుల దండ కొని పెట్టారు. విడి మల్లెల పొట్లం కూడా కొన్నారు. ద్రాక్ష, స్వీట్లు కొన్నారు.

మేము సరదాగా ఇంటికి వెళ్తున్నాం.

'సావిత్రి, తన భర్తతో కలిసి, ఎంతటి గాఢమైన అనుభూతుల్లో ఉందో ... మేము తిరిగి వెళ్లడం, వాళ్లను ఏ మాత్రం నొప్పించదు కదా ... మేము వెళ్లే సరికి వాళ్లు సర్దుకుపోయి, మామూలు స్థితిలో ఉండాలి' అనుకున్నాను.

మా వారు ఇంటి ముందు స్కూటర్ ఆపారు.

ఇంటిలో లైట్లు వెలుగుతున్నాయి.

తలుపులు తీసే ఉన్నాయి.

మావారు స్కూటర్ ను సందులోకి నెట్టుకు వెళ్తున్నారు.

నేను ఇంటిలోకి నెమ్మదిగా నడిచాను, డోర్ కర్టెన్ తప్పించుకుంటూ.

సావిత్రి కనిపించింది. వెను వెంటనే హాల్లో, సోఫాలో కూర్చొని ఉన్న నా అత్త మామలు కనిపించారు.

గతుక్కుమన్నాను. అవాక్కైయాను.

"మీరు ఇలా వెళ్లారు, వీరు అలా వచ్చారు" చెప్పింది సావిత్రి.

నేను తేరుకుంటూ, సంతోషాన్ని పైకి ప్రదర్శిస్తూ, వాళ్లను పలకరించాను.

వాళ్లు చెప్పారు - 'మమ్మల్ని చూడాలని, త్వరలో తీర్థ యాత్రలకు వెళ్తున్నా మని చెప్పడానికి తాము వచ్చామ'ని.

నేను చిన్నగా తలాడించేశాను.

సావిత్రి, "హాట్ కేరియర్ లో భోజనాలు ఉంటే, వీరికి వడ్డించాను. వడియాలు వేయించి పెట్టాను. మీకు తిరిగి అన్నం వండి ఉంచాను" అని -

"మరి నేను వస్తాను అక్కా" చెప్పింది నాతో.

నా మనసు గింజుకుంటుంది.

"సారీ" చెప్పాను, సావిత్రికి, మెల్లగా.

చిన్నగా నవ్వుకుంటూ సావిత్రి వెళ్లిపోయింది.

"పిల్ల మంచిదేలా ఉంది. ఐనా, ఎంత పక్కింటిది ఐనా, ఇలా ఇల్లు అప్ప చెప్పావు, ఎందుకు" అన్నారు అత్తయ్య చకచకా.

నేను జవాబు చెప్పలేక, కదలాడుతుండగా, అప్పుడే మా వారు అక్కడకు వచ్చారు.

నేను మెల్లిగా, మౌనంగా, అక్కడ నుండి కదిలి, కాదు, జారుకున్నాను.

మా వారు ఏదో సర్ది చెప్పుతుండడం చెవిన పడుతోంది ...

***

(తొలుత శీర్షిక : ఆరాటం అంచున)

(ముద్రితం:గృహకల్ప పక్ష పత్రిక-15-31,డిసెంబరు,2008)

***