If green books and stories free download online pdf in Telugu

పచ్చగా ఉంటే

పచ్చగా ఉంటే

బివిడి.ప్రసాదరావు

శ్రీనివాస్ వస్తున్నట్టు ఇ-మెయిల్ పెట్టాడు.

వాడు తెలిపిన ప్రకారం వెళ్లి వాడిని రిసీవ్ చేసుకున్నాను.

ఇద్దరం కారులో మా ఇంటికి వస్తున్నాం.

శ్రీనివాస్, నేను బాల్య స్నేహితులం.

పదవ తరగతి వరకు కలిసి చదువు కున్నాం.

ఆ తర్వాత వాడి నాన్నకు ట్రాన్స్ ఫర్ కావడంతో వాడు వెళ్లి పోయాడు.

అలా మేము విడవలసి వచ్చింది.

ఆ తర్వాత, ఉత్తరాలు ...

ఆ తర్వాత ఫోన్లు ...

ఆ తర్వాత మొబైల్ ఫోన్లు ...

ఆ తర్వాత ఇ-మెయిల్ లతో మేము ముచ్చటించు కుంటూనే ఉన్నాం ఇన్నాళ్లూ.

ఈ మధ్య మేము పర్సనల్ గా కలిసింది మూడే మూడు మార్లు.

ఇప్పటి మా పర్సనల్ కలయిక నాల్గోది. మూడు, నాలుగు కలయికల మధ్య గ్యాప్ రమారమి ఒక పుష్కరం.

శ్రీనివాస్ పిజి చదువు తర్వాత సింగపూర్ వెళ్లిపోయాడు - సుమారుగా పన్నెండేళ్ల క్రితం.

సింగపూర్ నుండి తనింటికి వచ్చి, ఒక రోజు వ్యవధి లోనే నా దగ్గరకు వచ్చాడు.

ఇద్దరం మంచి చదువులే చదివాం. మంచిగా స్థిర పడ్డాం.

మాకు పెళ్లిళ్లూ అయ్యాయి. పిల్లలూ ఉన్నారు.

'ఇక్కడ ప్రాంతాలు బాగా మారిపోయాయిరా. అన్నట్టు అప్పటి మన కాలనీ బాగా మారిపోయిందంటూ తెలిపావు. అది కూడా ఒక పెద్దాయన చలువతో అని తెలిపావు. ఆయన ఉన్నారా? ఆయనను కలవాలిరా' అన్నాడు శ్రీనివాస్ ఉత్సుకతగా.

నేను చిన్నగా నవ్వేశాను.

నిజమే, మేము కలిసి చదువుకున్న రోజుల్లో, ఊరికి దూరంగా, తుప్పలు, పుట్టలు, ఎత్తుపల్లాల భూములు దాటిన తర్వాత మా కాలనీ ఉండేది.

అప్పుడు ఒక భూస్వామి తన భూమిలో ఇల్లు కట్టుకున్నాడు తొలిసారిగా.

పిమ్మట చౌకగా తన చుట్టూ భూములు అమ్మకానికి పెట్టాడు - ఇళ్ల కొరకు.

చాలా మంది ఎగబ్రాకేరు. మా వాళ్లూ అలాగే ప్రాకి అక్కడ ఇళ్లు కట్టేశారు.

ఆ కాలనీ నుండి ఊరులోకి రావడం చాలా యాతనగా ఉండేది.

తప్పక, తిరిగే వాళ్లం.

కుర్రవాళ్లం కనుక మాకు కష్టమనిపించేది చాలా తక్కువ.

ఇప్పుడు ఆ కాలనీ ఊరులో కలిసిపోయింది.

మధ్య అన్నీ ఇళ్లే లేచాయి.

'అప్పటి ఆ కాలనీ మాత్రం బాగా మారిపోయిందిరా. నిజంగా చూసి తీరవల సిందే. అంతటి భాగ్యం ఆ పెద్దాయన మూలంగానే. ఆయన ఊరులోనే ఉన్నారు. కలుద్దాం.' అన్నాను గొప్పగా.

'ఆయన గురించి వివరంగా తెలిపేవాడివి కాదు. ఇంతకీ ఎవరు ఆయన? ఏమిటి ఆయన గొప్ప' అడిగాడు శ్రీనివాస్.

ఆయన అప్పారావుగారు.

స్కూలు మాస్టారుగా ఉద్యోగం చేసి రిటైరయ్యారు.

ఆ రోజుల్లో ఆ కాలనీలోని మీ ఇల్లును కొన్నది ఈ అప్పారావుగారి నాన్నగారే.

అప్పారావుగారు రిటైరయ్యాక ఆ ఇంటికి వచ్చి స్థిర పడ్డారు.

అప్పటికీ ఆ కాలనీ అస్తవ్యస్తంగానే ఉండేది.

కానీ కొత్తకొత్త ఇళ్లు మాత్రం చాలా కట్ట బడ్డాయి.

ఒక రోజున - అప్పారావుగారు కాలనీలోని ఇంటింటికీ తిరిగి, ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటమని కోరారు.

ఎవరూ పట్టించుకోలేదు.

మరో రోజు - ఇంటింటి ముందు తనే ఒక్కొక్క మొక్క నాటి, 'కనీసం నీళ్లు రోజూ పోయండి' అని కోరారు.

చాలామంది దానినీ ఖాతరు చెయ్యలేదు. చాలా మొక్కలు చచ్చిపోయాయి.

ఇంకో రోజు - చచ్చిన ఆ మొక్కల చోటున కొత్త మొక్కలు నాటి, నెల వారీ కూలీకి ఇద్దరు కుర్రవాళ్లను పెట్టి, వాటికి నీళ్లు పోయించేవారు ఆయన.

అన్ని మొక్కలు బతికి, పెరిగేలా జాగ్రత్తలు తీసుకొనేవారు ఆయన.

ఆయన పనిని హేళన చేసే వారే ఎక్కువగా అగుపించేవారు.

కొందరు ఆయన మొహం మీదే ఛీదరించుకొనేవారు.

ఇంటి ముందు ఆ మొక్కలు పెరిగి చెట్లు అయితే చెత్తాచెదారం చేరుతోందని అరిచేవారు కూడా.

'అలాగైతే ఆ చెత్తను నేనే తీయిస్తాను. దయచేసి మొక్కలు పెరగనీయండి. అవి చెట్లు అయితే మీకు, మనకు లాభమో, నష్టమో మీకే తెలుస్తోంది' అనేవారు ఆయన.

కానీ అయన అంతరంగం ఏమిటో చెప్పేవారు కాదు.

నిజానికి ఆయన గొప్ప నెమ్మది మనిషి, మిత భాషి.

అప్పటికి ఆయన చేష్టలు వింతగా ఉన్నా, ఇప్పుడు అవి గొప్పవిగా అందరికీ తెలియవస్తోంది.

ఆ చెట్లను ఇప్పుడు ఎవరికి వారం సంరక్షించుకుంటున్నాం అందరం - దిన చర్యలో తొలి మెట్టుగా.

ఆ కాలనీ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా అగుపిస్తోంది.

అక్కడ ఉన్న మాకు గర్వంగా ఉంది.

నా మేరకు నాకు, ఆ చెట్లు మూలంగానే ప్రశాంతత ఏర్పడుతోంది.

చల్ల దనం పుష్కలంగా అందుతోంది. కృత్రిమ వసతులు కంటే ఆ చెట్ల వసతి ఆరోగ్యకరంగా అనిపిస్తోంది.

నిజంగా ఆ చెట్ల వల్ల మా కాలనీలో వ్యాధుల శాతం గణనీయంగా తగ్గింది.

అక్కడ అందరం ఏ టెన్షన్స్ లేక హాయిగా ఉంటున్నామంటే కారణం, 'ఆ చెట్లే' నని నా ప్రగాఢ నమ్మకం.

కారును కాలనీ ముందునే ఆపించాను. డ్రైవర్ ని కారును ఇంటికి తీసుకు వెళ్లమన్నాను - మేము దిగగానే.

నేను, శ్రీనివాస్ ని నడిపించుకుంటూ ఆ కాలనీ లోంచి మా ఇంటికి తీసుకు వెళ్తున్నాను.

నడుస్తుండగా వాడి మొహం చూశాను చాలా మార్లు.

నేను అనుకున్నట్టే వాడు ఆ కాలనీ వాతావరణాన్ని తనివితీరా అనుభవిస్తున్నాడు, ఆహ్లాద పడుతున్నాడు.

మా ఇంటి ముందు వచ్చి ఆగాను.

'ఇదే రా ఇల్లు' అన్నాను.

వాడు ట్రాన్స్ లో నుండి బయటపడినట్టు చలించాడు.

'అప్పుడే వచ్చేశామా?' అంటూ - చుట్టూ కలియచూస్తూ.

నిజానికి మా ఇల్లు ఈ కాలనీలో చిట్టచివరిది. మొదటి నుండి మా వరకు మధ్య పాయల వీధులతో కలుపుకొని ఆరవై గడప ఉంటుంది.

'వండర్ రా. నాలో బడలిక పోయింది. ఏదో అనిర్వచనీయమైన హాయిగా ఉంది. శీతల ప్రాంతంలో ఉన్నట్టు ఉంది. ప్రతి ఇంటి ముందు ఏపైన చెట్టు. చుట్టూ చిక్కని పచ్చదనం ... వావ్' అన్నాడు శ్రీనివాస్ నిండుగా.

'ఇంట్లోకి రా' అన్నాను చిన్నగా నవ్వుతూ.

'మొదట ఆ అప్పారావు గారిని కలవాలిరా' అన్నాడు శ్రీనివాస్ ఉత్సుకతగా.

నేను వాడిని ఆ ఇంటికి తీసుకు వెళ్లాను. వారిని పరిచయం చేశాను.

శ్రీనివాస్ చెయ్యి చాచి, 'మీ పట్టుదలకు, కృషికి కంగ్రాట్స్' అన్నాడు, అప్పారావుగారితో.

ఆయన చెయ్యి ఇవ్వలేదు.

తన చెయ్యిని వెనుకకు తీసుకుంటూ, రెండు చేతులు జోడించి - 'చెట్ల పచ్చ దనంలో ఇంతటి గొప్పతనం ఉందా? ఆ ప్రాముఖ్యతను మీరు గుర్తించి, అందరికీ దానిని పంచడం దొడ్డైన విషయం' అన్నాడు శ్రీనివాస్, చిన్నగా - అప్పారావుగారితో.

ఆ వెను వెంటనే దండకంలా ఆయనను పొగడేస్తున్నాడు వాడు.

'పొగడ్తలకు నేను ఇంతా చెయ్యలేదు' అన్నారు అప్పారావు గారు కాసింత చిరాకుగానే - వాడికి అడ్డు పడి.

శ్రీనివాస్ ఠక్కున మాటలు ఆపేశాడు.

నిజమే, అప్పారావుగారు పొగడ్తలను సహించరు.

టీవీ వాళ్లను, పేపర్ వాళ్లను, ప్రభుత్వం వారిని అప్పారావుగారు కటువుగానే పంపించేశారు.

వీలైతే తనలా వాళ్లనీ నడుచుకోమని సలహా కూడా ఇచ్చారు.

ఇవి శ్రీనివాస్ కి నేను తెలిపి ఉండలేదు.

శ్రీనివాస్ ఇంకా ఏదో అనబోతున్నాడు.

'ఇదంతా నా స్వార్థం కోసమే ...' అన్నారు అప్పారావుగారు సడన్ గా.

'స్వార్థమా?' - శ్రీనివాస్ తో నేనూ గొంతు కలిపి అన్నాను కోరస్ గా.

ఆగి, 'నయం కాని జబ్బు నాలో నుంచి బయట పడింది ఒక రోజున. ఆ జబ్బుకు కారణం 'వాతావరణ కాలుష్యమే' అని తేల్చబడింది. ఆకాల మరణం నాకు తప్పదని తేల్చేశారు. క్లాస్ పాఠాలతో పరిసరాలు, పర్యావరణాల గొప్పతనం వాటి పరిరక్షణలు వల్లించే నాకు, అప్పటికి వాటిని ఆచరణలో పెట్టాలని అవగతమైంది. అదే సమయాన నేను ఇక్కడకు వచ్చేయడం జరిగింది. ప్రకృతి లోని కాలుష్యాన్ని నేను రూపుమాపాలంటే నా చోటు ఒక్కటే చాలదు, నా చుట్టూ పరిసరాలన్నీ కాలుష్య రహితమవ్వాలి. అందుకే నా ఇంటి ముందే కాదు, నా చుట్టూ ఉన్న ఇళ్ల ముందు కూడా చెట్లు నిలిచేలా పనిచేశాను. ఓరల్ గా చూస్తే వినేవారు కరు వయ్యారు అప్పటిలో. ఐనా నేను నిరుత్సాహ పడలేదు. ఓర్మితో వ్వవహరించాను. ఫలితం వచ్చింది. నా ఆకాల మరణం మసకయ్యింది. లాభం అందరికీ ఉన్నా ఇది 'నా స్వార్ధమే' అని అప్పుడప్పుడూ తోస్తోంది' చెప్పారు ఆయన.

'అందరికీ మేలు చేశారు, చూపారు మీరు. ఇది గుర్తించలేక పోతున్నవారే స్వార్థపరులు. ఎందుకంటే పచ్చగా ఉంటే ఓర్వలేని వారే మనలో ఎక్కువ. వాళ్లే సిసలైన స్వార్థపరులు' అంటూ,

'సార్, నా అధిక వాగుడుతో మిమ్మల్ని బాధించాను. క్షమించండి' అన్నాడు శ్రీనివాస్ వినయంగా.

నేను చిన్నగా తలాడించాను.

అప్పారావుగారు శ్రీనివాస్ తో ఏదో చెప్పబోతున్నారు.

ఆయన ఏం చెప్తారో నాకు తెలుసు.

అప్పారావుగారు నిజమైన మేలుకోరే మనిషి.

స్వప్రయోజనంలో సామాజిక ప్రయోజనాన్ని ఆశించడం అసామాన్యం, అపూర్వం.

కాదా? -

***

(ముద్రితం : ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం - 19-10-2008)

***

షేర్ చేయబడినవి

NEW REALESED