Read Show by BVD Prasadarao in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

  • కిల్లర్

    అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

చూపు

చూపు

- బివిడి.ప్రసాదరావు

BVD.Prasada Rao

"పేరు గుడ్. పలుకు గుడ్. ప్రవర్తన గుడ్ ..." అంటూ చటుక్కున పల్లవి చేతిని తన చేతుల్లోకి తీసుకొని సున్నితంగా నొక్కాడు ఆఫీసర్ రాంజీ.

పల్లవి, "థాంక్స్" అంది, చిన్నగా కుర్చీలో కదులుతూ.

"అన్నీ గుడ్, బట్ చదువు ..." ఆగి, పల్లవి చూపుల్లోకి చూశాడు ఆఫీసర్ రాంజీ.

అతని చూపుల్లో నించి తన చూపులను తప్పిస్తూ, పల్చగా నవ్వింది పల్లవి.

"సరి పెట్టుకోవచ్చులే. ఎనీవే, ముఖ్యంగా పెళ్లి కాలేదు. సో, గుడ్ గుడ్. టోటల్ గా అన్ని విధాల నీవు నచ్చినట్టే నాకు. బట్ ..." అంటూ ఆమె అరచేతి మీది గీతలను స్కెచ్ పెన్నుతో దిద్దుతూ -

"పోస్టులు లేవు. అలాగని నీ లాంటి వారిని వదులు కోవడం అవివేకం అనిపించు కుంటుంది" ఆగి, ఆమెను చూస్తూ -

"మేనేజ్ మెంట్ తో పోట్లాడైనా ఓ కొత్త పోస్టును సృష్టించ దలిచాను, నీ కోసం. సో, నీవు నన్నర్థం చేసుకోవాలి. ఐ మీన్, నీ కోసమే సృష్టిస్తూన్న 'పోస్టు' సక్రమైనదేనని మేనేజ్ మెంట్ గుర్తించేలా నీవు వర్క్ చేయాలి. అందుకు నా పూర్తి సహాయం ఉంటుంది. దానిని నీవు వాడుకోవడంలోనే ఉంటుంది. నీ ..." చెప్పుతున్నాడు.

ఆఫీసర్ రాంజీకి అడ్డు తగిలి, "మీ మేలు మరుగు పర్చను" అంటూ అతని చేతుల్లోనించి తన చేతని స్వాధీన పర్చుకుంది పల్లవి, నేర్పుతో, చిరునవ్వుతో. పిమ్మట కుర్చీలో సర్దుకుంది.

"సీ, పల్లవీ, పొగడ్తలు నాకు రుచించవు. చేతలకే నేనానంద పడతాను"

సన్నగా నవ్వి, అతని చూపులతో తన చూపుల్ని కలిపి చెప్పింది పల్లవి, చిన్నగా, "ముందు ముందు ఆ ఆనందాన్ని మీరు రుచి చూడ గలరు, నా నుంచి"

"ప్రామిస్"

"డబుల్ ప్రామిస్" కంటి రెప్పలను టపటప లాడిస్తూ అంది పల్లవి.

"గుడ్ గుడ్. రేపు సండే. సో, డే ఆఫ్టర్ టుమారోకి 'పోస్టింగ్ ఆర్డర్స్' రడీ చేసి, ఉంచుతా ..."

"థాంక్యూ" అంది పల్లవి.

ఆఫీస్ గేటు ముందు తచ్చాడుతున్న నర్సయ్య, పల్లవి రాకను గుర్తించి, చెట్టు నీడలో ఉంచిన తన రిక్షాను లాక్కొచ్చాడు, ఆమె ముందుకు.

రిక్షాలో కూర్చోగానే పల్లవిని అడిగాడు, "ఏమ్మా, కాయా, పండా" అని.

"పండే" సరదాగా నవ్వుతూ చెప్పింది పల్లవి.

"సత్తెంగా"

"అవును, నర్సయ్య తాతా. సోమవారం నించి ఉద్యోగం లోకి రమ్మన మన్నారు"

"సక్కనైన మాటమ్మా. ఇక నీ కస్టం గట్టెక్కినట్టేనమ్మా. బగవంతుడుకు నేదా మనసు"

రిక్షాను ఆపాడు నర్సయ్య.

"హాస్పిటల్ వచ్చేసిందా తాతా" అడిగాడు ఈశ్వర్రావు.

"అయ్యా" అంటూ రిక్షాలోనించి ఈశ్వర్రావును నేర్పుగా దింపుతూ.

"ఆఁ ఆఁ. ఈటు, ఈటయ్యా" అంటూ హాస్పిటల్ లోకి ఈశ్వర్రావును తీసుకు వెళ్తున్నాడు నర్సయ్య, ఓర్పుగా, నేర్పుగా.

"తాతా, నీ బుుణం తీర్చుకోలేనేమో ..." అంటున్నాడు ఈశ్వర్రావు.

"ఏమిటయ్యా. మనిసి అన్నాక, తోటి మనిసి కస్టంన ఉండగా సాయం చేయక పోతే ఆడు మనిసే కాదు..." చెప్పాడు నర్సయ్య.

"నీది ఉన్నతమైన మనసు, తాతా. అందరూ నీలాగే ఉంటే, ఈ లోకంలో కష్టాలే ఉండక పోవచ్చు. వీధిలో ఎవరు లేరు. కానీ నీలా ఒక్కరు ముందుకు వచ్చి, తోడుగా ఉంటున్నారా. సహాయపడు తున్నారా. ఆ వేళ, తెచ్చి, నన్ను ఇంటిలో పడేసి నప్పటి నించి, గుర్తిస్తూనే ఉన్నాను, నీ సహాయాన్ని" అన్నాడు ఈశ్వర్రావు.

"ఏవోనయ్యా, నాను మాత్రం వొకరు కస్టంన ఉంటే, సూడనేను ... మెట్టు, అడుగు నెత్తి ఏయ్యయ్యా" అంటూ జాగ్రత్తగా నడిపిస్తూ డాక్టర్ వద్దకు ఈశ్వర్రావును తీసుకు వెళ్లాడు నర్సయ్య.

"దండమయ్యా" - నర్సయ్య డాక్టర్ కు నమస్కరించి, "డాట్రగారయ్యా" అని చెప్పాడు ఈశ్వర్రావుతో.

"నమస్కారం డాక్టర్ గారూ" ఈశ్వర్రావు చేతులు జోడించాడు.

"రండి. ఎలా ఉంది తలనొప్పి" డాక్టర్ అడిగారు.

చెప్పాడు ఈశ్వర్రావు, "కాస్తా తగ్గినా, అప్పుడప్పుడు నొప్పి జాస్తీగానే వస్తోంది డాక్టర్ గారు"

"ఆ టాబిలెట్స్ వాడుతున్నారా. ఏదైనా ఆపరేషన్ జరగనన్నాళ్లూ ఆ నొప్పి ..."

అడ్డు తగిలి, "చెప్పానుగా డాక్టర్ గారూ. డబ్బు ఇబ్బందే ... అది గట్టెక్కే వరకైనా నొప్పి కాస్తా ఐనా తగ్గే మార్గం చూపండి. ప్లీజ్. వచ్చింది కూడా అందుకే" చెప్పాడు ఈశ్వర్రావు.

"సూడండయ్యా, బాద నావు అవుతే సూడనేం. బుర్రను గోడకేసి కొట్టుకోబోతారు. సూసి అయ్యను బలవంతాన్న ఆపి, పట్టుకొన్నా, లాబం ఉండదు. 'సూపు పోతే పోనీ, ఈ నొప్పి బాద తగ్గతే సాను', అంటూ ఒకటే ఏడుపు, సిన్నోడి మాదిరిగా" చెప్పుతూ కళ్లు వత్తుకుంటున్నాడు నర్సయ్య.

'వర్క్ సాఫీగా సాగడం లేదంటూ, మరో పోస్టు అవసరం ఎంతైనా ఉందని వాదించి, చివరకు మేనేజ్ మెంట్ ను ఒప్పించి, నీకీ జాబ్ ను చూపించ గలిగాను. ఆఁ.' - ఇలా రోజుకు ఒక్క సారైనా ప్రస్తావిస్తాడు ఆఫీసర్ రాంజీ, పల్లవి వద్ద.

అందుకు ఆమె చిరునవ్వుతో 'థాంక్స్' చెప్పుతూ ఆ సంగతిని మరి కొనసాగ నీయదు, నేర్పుగా.

పల్లవి సీటును తన రూంలోనే వేయించు కున్నాడు ఆఫీసర్ రాంజీ, 'వర్క్ నేర్పాలి' అన్న ప్రతిపాదనతో. కానీ, ఆమె సీటుకు వచ్చే కాగితాలు అంతంత మాత్రమే. అయినా, ఇదంటూ, ఇలాగంటూ, ఆమె పక్కకు చేరి, సాధ్యమై నంత సేపు అక్కడే నించుంటాడు.

ఆమె వద్దంటూన్న కాఫీలు తెప్పి స్తుంటాడు.

లంచ్ టైంలో, ఆమె క్యారేజీ మీల్స్ చేస్తుండగా, ఆమె ముందు చేరి, ఆమె వారిస్తున్నా, ఆమె తింటున్న మీల్స్ ను చొరవగా తీసి, తింటుంటాడు, అప్పు డప్పుడు.

"హు. ఎన్నాళ్లో శ్రమ పడ్డాను. ఎన్నెన్నో చోట్ల తిరిగాను. డబ్బు కూడా ఖర్చు చేశాను. అంత ప్రయాస పడ్డా, డిగ్రీ ఉన్న నాకే దొరకని ఉద్యోగం, అదీ ఇంటర్ మీడియట్ లో చదువు ఆపేసిన దానికి, వారం రోజుల్లోనే దొరకడం విడ్డూరమే. గమనిస్తున్నావా, తాతా ... ఉద్యోగం వచ్చినప్పటి నించి దానిలో అహం ఎంతగా చోటు చేసుకున్నదో ... ప్రతీ దానికీ సమాధానమే ... విసుగే ..."

"అవేసం వద్దయ్యా ... అమ్మ మంచిది. మీరేదో అనేసుకుంటున్నారు"

"ఆవేశం కాదు తాతా. ఆవేదన. ప్రేమించు కున్నాం. మా పెద్దల తిరస్కారంతో, వాళ్లను వదిలి, పెళ్లి చేసుకున్నాం. గడన కష్టం కావడంతో, ఓ షావుకారు కొట్టులో గుమస్తాగా చేరాను. నే నీ ప్రమాదంకు గురి కాక ముందు వరకు, మా కాపురం సాఫీ గానే సాగిపోయింది. ఆ రోజు ... నా కర్మ కొద్దీ ... ఆ త్రాగుబోతు డ్రయివర్, తన లారీని, పేవ్ మెంట్ మీద నడుస్తూ ఉన్న నా పైకి ఎక్కించేశాడు. దాంతో నా చూపు పోయింది ..."

"అయ్యా, ఏడవకండయ్యా. మల్లీ తల బాద రావచ్చు"

"రానీ తాతా, రానీ. చస్తే బాగుణ్ణు"

"అయ్యో, అంత దిగాన పడిపోతే ఎట్టానయ్యా" గింజు కుంటున్నాడు నర్సయ్య.

ఈశ్వర్రావు ఏడుస్తున్నాడు.

"నేను రేపటి నించి ఓ వ్రతం పాటిస్తున్నాను. రెండు రోజుల పాటు" కూల్ గా చెప్పింది పల్లవి, ఆఫీసర్ రాంజీతో.

"ఎందుకు" టక్కున ప్రశ్నించాడు రాంజీ.

"మీ కోసమే"

"నా కోసమా" ఆశ్చర్యపోయాడు రాంజీ.

"అవును సార్. మీ అవస్త చూస్తున్న నాకు ఆ ఆలోచన వచ్చింది" చెప్పింది పల్లవి.

పొంగి పోతున్నాడు రాంజీ.

"వ్రతంలో మొదటి రోజు, మీరు నాతో మాట్లాడ వచ్చు, నేను మాత్రం మౌనంగా ఉండాలి. రెండో రోజు, నేను మాట్లాడ వచ్చు, మీరు మాట్లాడ కూడదు ..."

ఇంకా పొంగి పోతున్నాడు రాంజీ.

"అరె. అమ్మగారు మర్చిపోనట్టుంది. సెతుమానాలు దేవుడి పటం కాడే వదిలేసారు" అన్నాడు నర్సయ్య.

ఈశ్వర్రావు ఉలిక్కిపడ్డాడు.

తేరుకుంటూ అడిగాడు: "తాళిబొట్టు ఒక్కటేనా. కాలి మట్టెలు కూడా వదిలేసిందేమో"

"ఉన్నావయ్యా" చెప్పాడు నర్సయ్య, ఆశ్చర్యపోతూ.

"అయితే, అది కావాలనే వదిలి వేసింది. మర్చిపోయి కాదు. చూడు, తాతా, ఎంతకు సిద్ధమైందో ... అటు వంటి పాపిష్టిదాని సంపాదన తోనా ... మళ్లీ చూపు తెప్పించుకొనేది ... ఛ ..."

ఆఫీసు లోకి అడుగు పెట్టిన పిమ్మట, నేరుగా ఆఫీసర్ రాంజీ వద్దకు వెళ్లింది పల్లవి.

"సర్, ఈ రోజు వ్రతంకు రెండో రోజు. సో, నేను మాట్లాడ వచ్చు. బట్, మీరు మాట్లాడ కూడదు"

రాంజీ అలాగే అన్నట్టు తల ఊపాడు.

"ఈ రోజు నాకు ఎంతో హాయిగా ఉంది. లోన్లీగా మనం ఎక్కడైనా గడపాలని ఉంది" చెప్పింది చాలా లోగొంతుకతో పల్లవి.

మురిసి పోయాడు రాంజీ. కొంత సేపు మౌనంగా గడిపి, పిమ్మట, పెన్ను తీసు కొని - "పల్లవీ, నేను నీ ఏకాంతంను కోరు కుంటున్నాను. నీ కోసం, లేని పోస్టును క్రియేట్ చేయించాను. నువ్వు నా బుుణం తీర్చుకు తీరాలి. సో, మనం లాడ్జి సుధలో కలుసుకొనే ఏర్పాటు చేస్తాను. నీవు అక్కడకు ఓ అర గంటలో వచ్చేసి. నేను ముందుగా వెళ్లి, రూం బుక్ చేసుకు ఉంటాను" అని ఓ కాగితం మీద రాసి ఇచ్చాడు రాంజీ, పల్లవికి.

దాన్ని చూసి - "చాలు సర్, ఈ కాగితం నాకు. హు. ఇక మీ ఆట కట్టు. నన్ను చులకనగా చూసే అవకాశం ఇకపై మీకు హుష్ కాకి. ఇకపై ఏదైనా తప్పుడుగా ప్రవర్తిస్తే, చూడండీ, మిమ్మల్ని ఎలా బజారు లోకి లాగుతానో ... " అంటూ పల్లవి విసురుగా అక్కడ నుండి వెళ్లి పోయింది.

రాంజీ నోట మాట నిజంగా రాలేదు ...

"శారీరకంగా, మానసికంగా చిదిగి పోయాన్నేను. ఇక, వేరే ధ్యాస, కోరిక, ఏమీ నాకు లేవు. చూపు నాకు వద్దు ..."

"సస. అంతగా ఈదైపోకండయ్యా" అంటూ నర్సయ్య అడ్డుపడి - "సూపు ఎన్తో గొప్పదయ్యా" అని చెప్పాడు ఈశ్వర్రావుతో.

"ఒప్పుకోను, తాతా. అది ఉన్నరోజుల్లో, నే నెంతో భ్రమ పడ్డాను. మేడి పండు లాంటి బాహ్యమే తప్ప, లోగుట్టును అది చూపలేక పోయింది. అది పోవడంతో ఎన్నెన్నో నిజాలు గ్రహించగలిగాను ... అది పోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానే తప్ప, బాధ పడడం లేదు" చెప్పాడు ఈశ్వర్రావు.

"అయ్యా, నా మాట, సెప్పనా" అడిగాడు నర్సయ్య.

ఈశ్వర్రావు ఏమీ మాట్లాడలేదు.

అది అదునుగా తీసుకొని, నర్సయ్య మాట్లాడేడు - "ఎరుపు, నలుపు, తెలుపు, ఇంకా సానా సానా ఉన్నాయి. సూపు ఉంటేనే కాదా, అవి తెలిసేది. సూపు లేకపోతే, నలుపే తప్ప, మరోటి లేదు కదా. అన్నీ సూస్తేనే మనసు కుదుట పడతాది. పెడ పక్కకు తూగదు. అస్తమానం నలుపు ఒక్కటే అయితే, తప్పుడు అలోసనలు తప్ప, మరోటి తెలవదు. సూడందే ఏదీ తేలుసుకో కూడదు. వొంటికి, మనసుకు సంబందం ఉంటేనే, అలోసన సుబ్బరంగా ఉంటాది. సూపు అవసరం ఎన్తో ఉంది. నేదా వోర్ని బతిమలాడు కోవాలి. ఆల్లపై అదారపడ్డం తప్ప, మరో దారి లేదు. సెప్పిన పని ఎప్పుడూ విసుక్కోక ఆలు సేస్తారని గేరన్టీ నేదు కదా. నాను సెప్పేదేటంటే ..."

"నేనూ చెప్పేది వినండి ... తాళీ, కాలి మట్టెలూ తీసేసి, దేవుడి పటం ముందు పడేశానన్నది నిజమే. కానీ, ఎందుకు? ప్రశాంతంగా ఆలోచన చేసి ఉంటే, నా ప్రవర్తనలో తప్పు కనిపించేది కాదు మీకు. మీరు ఉద్యోగాల వేటలో మగ్గి పోయారు. ఆఫీసర్స్ ప్రవర్తనలపై ఎన్నెన్నో సుదీర్ఘ వ్యాఖ్యానాలు చేసేవారు. కనుక, వేరేగా వివరణ ఇవ్వనక్కర లేదనుకుంటాను నేను. ఆలోచించండి. అవసరం కొద్దీ, మనసును చంపుకొని, పెళ్లి కాని పిల్లగా చెప్పుకొని, ఉద్యోగం పొందాను, తప్ప, మరో భావంతో మాత్రం కాదు. రాపిడి కడలిలో ఊగిసలాడుతూన్న నాకు, చేయూత నిచ్చి, నా కోసం మీ వాళ్లనూ వదులు కొని, నన్ను మీ దరి చేర్చుకున్నప్పుడు, మీ సంపాదన నీడలో స్వేద తీర్చు కుంటున్నప్పుడు, తప్ప, నాలో మరే క్షణంలో కూడా అహం చోటు చేసుకో లేదు, అన్నదే నిజం. చూడండీ, ఓ మనిషిలో, ఎదుట మనిషి మీద అనుమానం తలెత్తకనే పోవాలి. ఎత్తిందా, అది కలతలు, కల్లోలాల వైపే తోస్తోంది తప్ప, మంచి ఆలోచనల వైపు దారి చూపదు ... అందులో భార్యా భర్తల మధ్య అది చేరనే కూడదు ... మరి, నా దురదృష్టం. 'ఎంతో ఉన్నతమైన మనసు మీది' అని భావించుకున్నాను ... కాని, ప్చ్. నేను, మీ రనుకునేలా ... రవ్వంత కూడా దిగజారిపోలేదు. నేను మీరు ప్రేమించిన పల్లవినే, ఇప్పుడు, ఎప్పుడున్నూ. నమ్మండి. ఆపరేషన్ కు ఒప్పుకొండి. లోన్ వచ్చింది. డబ్బులు కట్టేశాను." చెప్పింది పల్లవి, ఈశ్వర్రావుతో.

నర్సయ్య అక్కడే ఉన్నాడు. కానీ ఏమీ మాట్లాడడం లేదు.

ఎప్పటికీ ఈశ్వర్రావు మాట్లాడకపోయే సరికి, "ఏమండీ. చూపు తెప్పించుకొని, ఉద్యోగంలో చేరండి. మీ నీడన నాకు మజిలీ చూపండి" అంది పల్లవి, దీనంగా.

ఈశ్వర్రావు సైగతో పల్లవిని దగ్గరకు పిలుచుకున్నాడు.

ఆమె తన చెంత చేరగానే, ఆమె నడుము చుట్టూ చేతులు చుట్టి, ఆమె పొట్లలో తన తలను పెట్టి, తల్లి ఒడిలో బిడ్డలా ఏడుస్తున్నాడు ... ఇంకా ఏమీ మాట్లాడడం లేదు ...

***

(ముద్రితం : మయూరి వార పత్రిక - 14-3-1986)

***