Read Telavi Aliveeni by BVD Prasadarao in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

దూరవాణి అలివేణి

దూరవాణి అలివేణి

- బివిడి.ప్రసాదరావు

BVD.Prasada Rao

ధ్వజారోహణం తో బ్రహ్మెూత్సవాలు ఆరంభమైనాయి.

ధ్వజ స్థంభంపై గరుడ కేతనాన్ని ఎగురవేశారు, కొద్ది క్షణాల క్రితం.

కన్నులకింపుగా ఉందక్కడి సందడి.

ఎంతో ఆహ్లాదరకంగా ఉంది, తిరుమల కొండపై వాతావరణం.

సన్నని అలజడి మొదలైంది అక్కడ. అటు చూశాను. చాలా మంది ఆడవారే గుంపుగా ఉన్నారు అక్కడ.

ఎవరో, ప్రక్కనున్న అతడిని అడిగాను - "అక్కడ ఏమిటి హడావిడి"

"ప్రసాదం ఇస్తున్నారు సామీ" చెప్పాడు. తిరిగి అతడే చెప్పాడు - "పెసర పులగ ప్రసాదం సామీ. గరుడ కేతనానికి నివేదించే ఆ ప్రసాదం స్త్రీలకి సంతాన ప్రాప్తి నిస్తుంది. అందుకే ఆ ఆరాటం."

చుట్టూ చూశాను. మా వాళ్లు ఎటు వెళ్లారో! ఈ జనంలో వాళ్లతో వేరైయాను, ఎలాగో, ఎప్పుడో.

బస తెలుసు. అందుకే ఆందోళన పడలేదు.

నిదానంగా అటు కదిలాను. కాస్తా దగ్గరగా ఆ ప్రసాద కార్యక్రమం చూద్దామని.

నిజమే, గుంపు అంతా ఆడవారే.

ఎంతో భక్తితో అందుకుంటున్నారు ఆ ప్రసాదాన్ని. కళ్లకు అద్దుకుంటున్నారు. శ్రద్ధగా ఆరగిస్తున్నారు. అర మోడ్పు రెప్పల వెనుక తచ్చాడుతున్న చూపులతో తమ అర చేతుల్ని పరిశీలించు కుంటున్నారు - ఎక్కడైనా ప్రసాదం మిగిలి పోయిందేమోనని. ఉంటే ఒదిగి ఒదిగి దాన్ని నాలుకతో నోటిలోకి చేర్చు కుంటున్నారు. ఖాళీ అయిన అర చేతుల్ని నెత్తిన రాసుకుంటున్నారు.

నా కిదంతా వింతగా తోచడం లేదు. పరిశీలనగా చూస్తున్నాను.

క్షణక్షణం ప్రసాదంకై గుంపు ఎక్కువవుతోంది అక్కడ, నాలోని కుతూహలం లా.

"తప్పుకుంటారా ... తప్పుకోండి ...తప్పుకోండి ..." - వెనుక నుండి గోలగా వినిపించాయి చాలా గొంతులు, ఒక్కసారిగా.

సర్దుకుంటూ అటు చూశాను.

వలయంలా పోలీసులు ... ఆ వలయం - నన్ను దాటుకొని, కాదు కాదు, నెట్టుకొని ముందుకు పోతోంది - ఆ గుంపును చెదరకొడుతూ, నేరుగా ఆ ప్రసాదాన్ని పంచే చోటుకు చేరుకుంది.

చిరాకు అనిపించినా, హుషారుగా అటు చూస్తున్నాను.

ఆ వలయంలో కేంద్రంగా ఉన్న ఒకామె ఆ ప్రసాదాన్నిస్వీకరిస్తోంది. వెనుక నుండి కనబడుతోందామె ...

అరె - ఆ ఆకారం ... ఆకారం ... ఆమె ... ఆమె ...

'ఫోన్ లో అమ్మాయి కదూ ...'

నిజమే, ఆమె ... ఆమె ... 'ఫోన్ లో అమ్మాయే' ...

ఎప్పుటికైనా కనిపించదా అనుకున్నానే కానీ, ఇలా తారస పడుతుందని అనుకోలేదు ...

ఎన్నాళ్ల కెన్నాళ్లకు ...

గాలి అందక ఉక్కిరి బిక్కిరైపోతోంది గుండె ...

ఆశ్చర్యంగా ఉంది. ఎవరామె?! - అన్నీ 'హాట్ హాట్'గా చెప్పేస్తోంది ... ఎలా చెప్పగలుగుతోంది ...

ఒక రోజు భాగోతం కాదు. వారం రోజుల నుండి జరుగుతున్న తంతు ఇది.

- ఆ రోజు ...

మొదటిసారిగా - ఫోన్ మ్రోగింది.

రిసీవర్ నెత్తాను - "హలో, ప్రకాశరావు హియర్"

"హలో, వైట్ కలర్ పాంట్, కలర్ షర్ట్ ... కాంబినేషన్ బాగుంది. అన్నట్టు మీ 'పెళ్లి చూపులు' సూపర్బ్." - సన్నగా ఉందా గొంతు. ఐనా స్వీట్ గానే ఉంది.

ఎవరామె?!

"హలో, ఎవరు మీరు" అక్షరాలను కూడబలుక్కుంటూ అడిగాను.

"రేపు 11 గంటలకు మరలా కలుద్దాం, ఫోన్ ద్వారా"

... ఫోన్ పెట్టేసిన ధ్వని.

ఎవరామె! ఎందుకు ఫోన్ చేసినట్టు? -

ఆ మర్నాడు -

ఫోన్ కోసం అంతగా ఎదురు చూడలేదు. నిజానికి డ్యూటీలో పడి కాస్త మరిచానన్నది నిజమే ...

కానీ గడియారం 11 గంటలు కొట్టడం పూర్తి కావడం, ఫోన్ మ్రోగడం ఒకే సారి జరగడంతో కాస్త ఉలిక్కిపడ్డాను.

ఫోన్ ఎత్తాను - "హలో, ప్రకాశరావు హియర్"

"హలో, ఏమిటి ఈ రోజు 'టక్' చేసుకోలేదు? మీకు 'టక్' బాగా కుదురుతోంది. అన్నట్టు నన్నెవరని అడిగారు కదూ ... నా పేరులో 4 అక్షరాలు ఉంటాయి. ఒక అక్షరం మీ పేరులో ఉంది. సరే, మీ 'వరకట్నం' పేలిందిస్మీ"

"తికమక పెట్టక చెప్పండి, ఎవరు మీరు!?" నా మాటలు నాకే గజిబిజిగా విని పించాయి.

"రేపు మరల 11 గంటలకు ... ఓకే"

... ఫోన్ పెట్టేసిన ధ్వని.

- నా కా రోజు నుండి టెన్షన్ ఎక్కువైంది ... ప్రతి రోజు 11 గంటలయ్యేసరికి ఫోన్ మ్రోగడం ... నా గురించి ఏదో తాజా వార్త చెప్పడం ... పిమ్మట తన పేరులో ఒక అక్షరం గురించి ఓ క్లూ చెప్పడం ... తర్వాత నా 'డైలీ బిట్స్'ని మెచ్చుకోవడం ...

ఎవరామె? ... ఎందుకింత ఇంటరెస్టు! ...

- ఆ రోజు, 6వ రోజు ... ఆమెకు నాకు మధ్య ఫోన్ సంభాషణల కార్యక్రమం మొదలై ...

11 అయ్యింది ...

ఫోన్ మ్రోగింది ...

"హలో, ప్రకాశరావు హియర్"

"హలో, వైట్ డ్రస్ కు బ్లూ కలర్ టై బాగా నప్పింది. ఈ రోజు మీరు సింప్లీ సూపర్బ్. అన్నట్టు నిన్నటితో నా పేరులోని అక్షరాలన్నింటికి క్లూలు చెప్పేశాను. వాటిని ఓ వరస క్రమంలో పేర్చుకుంటే నా పేరు తెలుస్తుందని చెప్పాను. తెలుసు కున్నారా? ... సరే, మీ 'రిజర్వేషన్స్' కనువిప్పుస్మీ..."

"ఎవరు? ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు!" - రోటీన్ గానే అడిగాను. జవాబు రాదని తెలుసు. కానీ ఏదో ఆశ.

"క్లూలు చెప్పానుగా. పోల్చుకోలేకపోతే నా తప్పా ... ట్రై చెయ్యండి. మరలా రేపు 11 కు ... ఓకే ..." - ఫోన్ కట్ చేసేసింది.

ఎవరామె!!! -

ఒక అక్షరం నా పేరులో ఉందట. ఒక అక్షరం 'మంచి' అని తెలియ జేస్తోందిట. ఒక అక్షరం రాజుగారి సతిలో ఉందట. ఒక అక్షరం తన పేరులోని రెండో అక్షరమట ... ష్ ... ఎవరో?! ... ముడి పడిన వెంట్రుకలా ఉంది ఈ సమస్య ...

నేను కోరి తెచ్చుకోలేదు ... ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చిందీ సమస్య!

"ప్రకాశరావు హియర్"

"హలో, కటింగ్ చేయించుకున్నట్టు ఉంది. కానీ వెనుక జుత్తు ఒత్తుగా ఉంటేనే మీకు బాగుంటుంది. సరే, ఈ రోజు మనకు 7వ రోజు. మీ 'రాజీనామా' ఓ చెంప దెబ్బస్మీ"

"ఏమిటీ తతంగం" సడన్ గా అడిగేయగలిగాను, ఇప్పటికి.

"అబ్బో ... మీకు కోపమా ... ఐనా, నేను దీనిని తతంగం అనుకోవడం లేదు. రేపు మరలా కలుస్తా 11 కు"

నేనూ ఫోన్ పెట్టేశాను.

మళ్లీ ఆమె చెప్పిన క్లూలన్నింటినీ మననంలోకి తెచ్చుకున్నాను.

ప్చ్ ... పేరు తెలియడం లేదు ...

ఇంతకీ ఆమె ఎక్కడ నుండి ఫోన్ చేస్తోంది? నన్ను ఇంత సూక్ష్మంగా పరిశీలి స్తోంది. ఎక్కడ నుండి! మా ఇంటి చుట్టు పక్కల నుండా ... లేక ఆఫీస్ పరిసరాల నుండా ... లేక ...

ఓ ఆలోచన నన్ను ఆకట్టుకుంది. రేపు ఈ ఆలోచనను ఆచరణలో పెట్టి చూడాలి. తద్వారా ఆమె ఎక్కడ నుండి నన్ను పరిశీలిస్తోందో పసి కట్టేయ వచ్చు.

కావాలనే ఇంటి నుండి స్టైలుగా నడుచుకుంటూ వచ్చాను స్కూటర్ వరకు ... కొంత దూరం నడిచాను స్కూటర్ తో. పిమ్మట స్కూటర్ ఎక్కాను. కొంత దూరం తర్వాత స్కూటర్ నాపేశాను. మరలా దాంతో కొంత దూరం నడిచాను. పిమ్మట స్కూటర్ ఎక్కాను. నేరుగా ఆఫీసుకు చేరుకున్నాను. స్కూటర్ ను స్టాండ్ లో ఉంచి, అక్కడ నుండి గేటు వరకు కుంటు కుంటూ నడిచాను. పిమ్మట సాఫీగా నడుచుకుంటూ నా సీటులోకి చేరుకున్నాను.

దీంతో ఆమె ఏ స్పాట్ లో నన్ను పరిశీలిస్తోందీ ఇంచుమించూ పసి గట్టేయ వచ్చు.

ఫోన్ కోసం ఎదురు చూస్తూ, టైం వంక చూస్తూ కూర్చున్నాను.

11 ఐంది.

ఫోన్ మ్రోగింది ...

"ప్రకాశరావు హియర్"

"హలో, ఏమిటీ కుంటుతూ నడుస్తున్నారు ..."

ఆమెకు టక్కున అడ్డు పడ్డాను - "యా. మీరు ఎవరో నేను పోల్చుకో లేక పోయినా, మీరు మాత్రం మా ఆఫీస్ పరిసరాల నుండి నన్ను పరిశీలి స్తున్నారు"

"నో"

"వాట్!"

"ఉఁ. మీరు ఇంటి నుండి బయటకు వస్తున్నప్పుడు సరిగ్గానే నడిచారు. పైగా ఇది వరకటి కంటే కాస్తా ఫోజ్ గానే నడిచారు" అంటూ నా చేష్టలన్నింటినీ ఆమె చెప్పేసింది. పిమ్మట, "ఇప్పుడు చెప్పండి. నేను మిమ్మల్ని ఎక్కడ నుండి పరిశీలిస్తున్నానో ..." - సన్నని నవ్వు వినిపించింది ...

నాకు తల తిరిగినంత పని ఐంది.

"మీరు నన్ను ఇంటి నుండి ఫాలో అవుతున్నారా?!"

"కావచ్చు ... కాకపోవచ్చు"

"ఏమిటో ఇదంతా ..." గుణుస్తున్నట్టు పలికింది నా గొంతు.

"ఓ థ్రిల్ కొరకు"

"వాట్ ..."

"యా"

"హుఁ." పొడిగా అన్నాను.

ఆమె ప్రవర్తన నాకు వింతగా ఉంది. తలాతోకా లేని అమె తీరు నన్ను ఊగిస లాటకు గురి చేస్తోంది.

"చిరాకు పడకండి సర్ ... మీ నోట విందామని ..."

"ఏమిటి ..."

"నా పేరు" మెత్తగా ఉందామె గొంతు.

"భలే వారే ... సూటిగా దొరకరు"

"ఇక దొరుకుతాను"

"ఎలా ... ఎలెలా ..."

"మరో క్లూ ఇస్తాను. పట్టుకోండి"

"మరో క్లూహా"

"సింపుల్ ..."

నేను మాట్లాడలేదు.

"మీ ఇరుగు, పొరుగు, ముందు, వెనుక ... నో ... 'వెనుక' వదిలేయండి ... ఇళ్లల్లో ... ఎవరైతే ... పూర్తి తెల్ల డ్రస్ లో ... జుత్తు విరబోసుకొని ... రేపు ఉదయం ... 6 ... 6-15 మధ్యలో ... డాబా మీద ... అగుపిస్తారో ... వారే వీరు ..." - టక్కున ఫోన్ పెట్టేసిన ధ్వని ...

ఆ రోజు రాత్రి చాలా వరకు కష్టపడ్డాను, నిద్ర పోవడానికి. ప్చ్ ... నిద్ర పోలేక పోయాను ...

నేను రెండు నెలల క్రితం ఈ రెండు గదుల డాబా ఇంటిలో దిగాను, ఉద్యోగ రీత్యా. తల్లిదండ్రులు లేరు. ఒక బస్సు ప్రమాదంలో ఇద్దరూ ఒకే మారు చనిపోయారు. నిరుద్యోగిగా అన్నయ్య, వదినల వద్ద ఉండేవాడిని. ఉద్యోగినై ఒంటరి వాడిని అయ్యాను. హోటల్ భోజనం, ఆఫీస్ వర్క్ ... పిమ్మట కార్టూన్లు గీస్తూ కాలాన్ని నెట్టుకు వస్తున్నాను. ఓ 'డైలీ'లో 'డైలీ బిట్స్' అన్న శీర్షిక క్రింద నేను కార్టూన్లను ఒక్కొక్క సబ్జెక్ట్ మీద వేయడం మొదలు పెట్టి కొద్ది రోజులు కూడా కాలేదు. వాటిని పొగుడుతూ ఈ 'ఫోన్ లో అమ్మాయి' వింతగా పరిచయం పెంచుకోవడం ప్రారంభించింది ...

వాచీ వంక చూసుకున్నాను ... 5-05 ...

ప్చ్ ...

కాలం జారుతోంది, నిదానంగా ... ఎద్దు పుండు కాకికి ఏం తెలుసు ...

బ్రష్ అయిందనిపించుకున్నాను ... యాంత్రికంగా స్నానం కూడా అయిందని పించుకున్నాను ... అలాగే డ్రస్ కూడా ... 'టక్' చేసుకున్నాను ... వైట్ డ్రస్సే నాది కూడా ... తల దువ్వుకున్నాను. పౌడర్ రాసుకున్నాను. ఫెర్ ప్యూమ్ ను జల్లుకున్నాను వంటి మీద అక్కడక్కడ.

వాచీ చూసుకున్నాను ... 5-55 ...

మరోసారి తల దువ్వుకున్నాను. మరి కాస్తా పౌడర్ ను రాసుకున్నాను. కాస్త ఫెర్ ప్యూమ్ ను మళ్లీ జల్లుకున్నాను.

డాబా పైకి చేరుకున్నాను. డాబా మధ్యన నించుని చుట్టూ డాబాల వంక చూస్తూన్నాను, ఊపిరి బిగపట్టుకొని.

గుండె బరువెక్కుతోంది. చిరు చెమటలు పోస్తున్నాయి నుదుట మీద.

6-00 గంటలు ...

టెన్షన్ ...

6-05 ...

టెన్షన్ ... టెన్షన్ ...

6-10 ...

టెన్షన్ ... టెన్షన్ ... టెన్షన్ ...

రక్తనాళాల్లో ఉరకలు ... పరుగులు వేస్తోంది రక్తం ...

కళ్లల్లో పల్చటి నీటి పొరలు ...

ముక్కంటా, నోటంటా వెచ్చని ఆవిర్లు ...

సరిగ్గా ... 6-14 ...

తెల్లని డ్రస్ లో, జుత్తు విరబోసుకొని ఓ అమ్మాయి వచ్చింది, ఎదురింటి డాబా పైకి ...

ఆమెకు నాకు మధ్య దూరం ఉన్నా, ఆమె స్పష్టంగా అగుపిస్తోంది నాకు.

అమె నేరుగా తన డాబా మధ్యకు వచ్చి నిల్చుంది హంసలా నడుచుకువచ్చి. నా వంక చూస్తోంది. తలను కాస్త ప్రక్కకు వంచి, ఓ మధురమైన ఫోజులో నించుని, సన్నగా నవ్వుతోంది.

అప్పటికే వర్ణించలేని అనుభూతికి గురయ్యిపోయాను నేను.

నిముషమో, రెండు నిముషాలో గడిచిపోయాయి. పిమ్మట ఆమె కుడి చేతిని పైకి నెమ్మదిగా ఎత్తి, గాలిలో ఊపింది తన అరచేతిని. అంతలోనే డాబా దిగిపోయింది.

ఎంత మధురాతి మధురమైన 'ముఖాముఖీ' ...

ఎదురింటిలోనే ఉన్న 'ఆమె'ను గుర్తించలేక పోయాను.

ఇంతకీ ఆమె పేరు ఏమిటో? క్లూలు ఉన్నా తెలియడం లేదు ... నిజమే ... చుట్టు ప్రక్కల వారి పరిచయం నాకు లేదు. ఉన్నా చూపుల వరకే ...

నేనూ క్రిందకు దిగిపోయాను. కాలం భారంగా నడుస్తోంది ...

టైం కావస్తోంది ఆఫీసుకు. అంత వరకు గది కిటికీ సందుల్లో నుండి ఎదురింటి వైపు చూస్తూనే ఉన్నాను. తలుపులు వేసున్నా, అప్పుడప్పుడూ ఎవరో తెరుస్తుండేవారు, వెంటనే దగ్గరగా లాగేసి బయటకు వెళ్లి పోతుండేవారు. కానీ ఆమె కనిపించలేదు మరి ...

స్కూటర్ తీసి, ఆఫీసుకు బయలుదేరాను, బరువెక్కిన మనసుతో.

ఎదురింటి వంక చూశాను, ఆమె మళ్లీ కనిపిస్తుందేమోనన్న ఆశతో.

ఆమె కనిపించింది. తలుపులు తీసుకొని బయటకు వచ్చింది, మోపెడ్ తో.

నా వంక ఓరగా చూసి, వెంటనే మోపెడ్ ను ముందుకు పోనిచ్చింది.

నేను ఆమె వెనుకనే కదిలాను, స్కూటర్ తో.

కొంత దూరం తర్వాత ఆమె రూట్ మారింది.

నేనూ అటే వెళ్లాను.

ఆమె మోపెడ్ ను స్లో చేసింది.

నేను అదే సమయంలో ఆమె ప్రక్కకు చేరుకున్నాను.

ప్రక్క ప్రక్క వెళ్తున్నాం.

"సారీ" - ఆమె తొలిగా అంది.

"ఎందుకు" ఆశ్యర్యంతో ప్రశ్నించాను.

"ఇటు నుండి మీ ఆఫీస్ కు దూరమని నాకు తెలుసు. బట్, జనం పల్చగా ఉంటారని ఇటు వచ్చాను ఇప్పుడు" అంది ఆమె, చిన్నగా నవ్వుతూనే.

"గుడ్ ఐడియా. కానీ నేనూ ఇటే వస్తానని మీరు అనుకున్నారా" అడిగాను.

"అనుకోవడం ఏమిటి! మీరు తప్పక వస్తారని నాకు తెలుసు" - అదే నవ్వు.

"ఎలా?" - అదే కొంటెతనం.

"అది అంతే" - అదే చిలిపితనం. పిమ్మట గలగల నవ్వింది ఆమె.

"థాంక్స్" సడన్ గా అన్నాను.

"ఎందుకు?"

"రోజూ ఫోన్ ద్వారా పలకరిస్తూ, ఈ రోజు 'సస్పెన్స్' ముడి విప్పి, తద్వారా అరుదైన 'థ్రిల్'ను చవి చూపినందుకు"

కొన్ని క్షణాలపాటు మౌనం మా మధ్య తచ్చాడింది.

"మీ పేరు" గబుక్కున అడిగాను.

"పోల్చుకోలేక పోయారా!"

'అవున'న్నాను. "ప్లీజ్, చెప్పండి" అన్నాను నెమ్మదిగా.

ఆమె చెప్పింది. క్లూలతో సరి చూశాను. సరిపోయింది.

"గుడ్ ఫజిల్. నైస్ నేమ్" మెచ్చుకొనేలా అన్నాను.

"మీరు కార్టూన్లు బాగా వేస్తారు స్మీ." అంది ఆమె.

ఆమె కాంప్లిమెంట్ కు 'థాంక్స్' చెప్పాను.

"ఈ మధ్య మీ 'డైలీ బిట్స్' చాలా బాగుంటున్నాయి"

"థాంక్యూ"

"మీ నుండి ఇంకా విరివిగా కార్టూన్లు రావాలని కోరుకుంటున్నాను"

"షూర్"

"మీ పరిచయం నా కెంతో ఆనందాన్నిస్తోంది" - ఆమె.

"ఈజిట్"

"యా"

పొంగిపోయాను.

ఆమె మా ఆఫీసుకు దగ్గరలో ఉన్న ఓ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. రోజూ నన్ను గమనిస్తుండేదట. అదీ నేను 'డైలీ బిట్స్' కార్టూన్న్ వేస్తున్నానని మా బీట్ పోస్టుమాన్ ఓ సందర్భంలో చెప్పి నప్పటినుండట. నేను ఆఫీసుకు బయలు దేరిన పిమ్మట నా వెనుకే కాలేజీకి బయలుదేరేదట. పిమ్మట 11 గంటలప్పుడు, కాలేజీకి దగ్గరలో ఉన్న పబ్లిక్ బూత్ నుండి నన్ను కలుస్తుండేదట, ఫోన్ ద్వారా. నా ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి తను పెద్దగా తంటాలు పడలేదట.

అప్పటినుండి, ఆమె ప్రోత్సాహం నాకు మెండుగా దొరకడంతో, ఎన్నెన్నో కార్టూన్లు వేస్తున్నాను. ఎన్నెన్నో అచ్చులో వస్తున్నాయి. ఎన్నెన్నో ఆమె మెప్పు పొందుతున్నాయి.

ఆమె ఇంటికి తాళం వేసి ఉండడం నా కంట పడింది, ఒక రోజు ఉదయం.

రాత్రి కనిపించింది. ఇంతలో ఎప్పుడు, ఎక్కడకు వెళ్లారు.

ఆలోచనలతో తల బ్రద్దలవుతుందా ...

టెన్షన్ భరించలేక ఆ రోజు సాయంకాలం, ప్రక్కింటి కుర్రవాడ్ని మాటల్లో పెట్టి, ఆమె జాడకై ప్రయత్నించాను.

ఆమె నాన్నగారు వెళ్తున్న బస్సు యాక్సిడెంట్ కు గురైందని, సీరియస్ గా ఉందని టెలిగ్రాం వచ్చిందట. వెంటనే వీళ్లు వెళ్లారట. ఎప్పుడు, ఎక్కడ అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోయాడు వాడు.

వారం తర్వాత - 'ఆమె వాళ్లు ఎవరో వచ్చారని, ఆమె నాన్నగారు చనిపోయారని, సామానంతా తీసుకు పోయార'ని నాకు తెల్సింది, ఆ ప్రక్కింటి కుర్రవాడి వలన, ఒక రోజున. ఆ రోజున నేను రాత్రంతా ఆఫీసులో ఉండి పోయాను, ఆఫీస్ ఇన్ స్ఫెక్షన్ మూలంగా.

"ఎక్కడికి" చటుక్కున ప్రశ్నించాను.

"వాళ్ల తాతయ్యగారింటికి"

"అతనెక్కడ ఉంటున్నారు"

"హైదరాబాద్ లో"

మనసు చివుక్కుమంది.

"వాళ్ల తాతయ్యగారు ఏం చేస్తుంటారు" అడిగాను మరో ప్రయత్నంగా.

తెలీదన్నాడు వాడు.

ఉక్కిరిబిక్కిరై పోతోంది నా మనస్సు.

హైదరాబాద్ లో ఎక్కడని వెదికేది ...

కార్టూన్ల ద్వారా ప్రయత్నించాను.

పత్రికలలో 'ఉత్తరాలు' శీర్షికలో ఏమైనా ఆమె ఆచూకీ తెలుస్తుందని ఆశ పడ్డాను. లాభం లేకపోయింది.

ఆమె అందించిన 'థ్రిల్' ను మరవలేకపోయాను ... కాదు ... మరవలేక పోతున్నాను ... ఆ మధురానుభూతి లోనే నేను కాలాన్ని నెట్టుకు వస్తున్నాను యాంత్రికంగా.

మనసు కుదట పడడం మానేసింది.

కార్టూన్లుకు దూరమైయాను.

"హలో" ఉలిక్కి పడ్డాను. ఆ గొంతుతో తేరుకున్నాను.

దగ్గరగా 'ఆమె' ...

"నన్ను పోల్చుకున్నారా? బాగున్నారా?" చకచక మాట్లాడుతోంది ఆమె, నాతో.

ఆమె ఇప్పుడు పోలీసుల వలయం మధ్య లేదు. ఒంటరిగా, నా ముందు ఉంది.

పోలీసులు దూరంగా ఉన్న జీపు వైపు నడుస్తున్నారు.

ఆ జీపు వద్ద ఓ ఎత్తైన, బలమైన మనిషి నించుని ఉన్నాడు.

"మా వారు, పోలీసాఫీసర్" చెప్పింది ఆమె, అతనిని చూపుతూ.

షాక్ ...

"మీ కార్టూన్లు బొత్తిగా కనిపించడం లేదేమిటి ఎప్పటినుండో. ప్రతి పత్రిక చూస్తున్నాను. వెయ్యండి సార్. ఐ లైక్ దెమ్ ... ఐ లవ్ దెమ్ ... వాటికై ఎదురు చూస్తూ ఉంటా ... బై" అంటూ ఆమె కదిలిందక్కడ నుండి.

వడివడిగా తన భర్త వైపుకు పోతోంది.

అప్పుడే నా మనసు నరాలు తెగాయి చటుక్కున ...

వాటిని ముడి వేస్తున్నాడు నాలోని కార్టూనిస్ట్ - వ్యంగ్యంగా నా మొహంలోకి చూస్తూ, ఎందుకో?...

***

(ముద్రితం : ఆంధ్రప్రభ వార పత్రిక - 31-7-1991)

***