Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తెగింపు లేని ఊహలు, అతి చక్కగా

తెగింపు లేని ఊహలు

- బివిడి.ప్రసాదరావు

BVD.Prasada Rao

"నాకు వేరే కాపురం కావాలి" - ఆమె చెప్పింది.

అతనిలో సన్నని కదలిక చోటు చేసుకుంది.

కొద్ది నిమిషాల క్రితమే వారిద్దరి పెళ్లి చూపుల కార్యక్రమం ముగిసింది.

అతని కోరికపై, వాళ్లిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం పెద్దలు కల్పించారు.

ముఖాముఖీ ని అతను ప్రారంభిం చాడు.

అంతలోనే, ఆమె పై అభిప్రాయాన్ని సూటిగా చెప్పింది.

"శరీరాలు చూసి ఒక అభిప్రాయానికి రావడం, ఐ మీన్ ఈ కొద్దిసేపు పెళ్లి చూపుల తంతు ఎన్నో ఏళ్ల జీవితానికి నాంది కావడం నాకు ఇష్టం కాదు. మీరు ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం అనడం నాకు నచ్చింది. నేను కోరు కుంటున్నదీ అదే. కానీ మీరు మాట్లాడుతూనే 'మీరు నచ్చారు, నేను నచ్చానా?' అనడం నాకు నచ్చలేదు. మొదట మనం ఒకరి అభిప్రాయాల్ని ఒకరం తెలుసు కుందాం. పిమ్మట ఇష్టాఇష్టాల గురించి మాట్లాడదాం" ఆగింది ఆమె.

అతని నుంచి ప్రతిగా మాట రాలేదు.

"18 సంవత్సరాలు నా వాళ్ల మధ్య పెరిగిన నేను, పెళ్లి పేరన మీ వాళ్ల మధ్యకు చటుక్కున వచ్చెయ్యాలి. తద్వారా ఎంతో స్వేచ్ఛను పుటుక్కున కోల్పోవాలి.

మరి మీరు; పెళ్లి పేరన పొందినవి చాలా ఉంటాయి - భార్యగా అసిస్టెంట్ వస్తోంది, స్త్రీ సుఖం వస్తోంది, కానుకలు తెస్తోంది, పిల్లల్ని ఇస్తోంది.

పైగా మీలో ప్రత్యేక మైన కమాండ్ పెరుగుతోంది.

అందుకే నేను అనుకుంటున్నాను - పెళ్లి పేరన భార్యా భర్తలిద్దరూ సమానంగా అన్నింటినీ పంచు కోవాలని.

సో, నా వాళ్ల నుంచి నేను బయటకు వస్తున్నట్టే, మీ వాళ్ల నుంచి మీరూ బయటకు రావాలి. జంటగానే కాపురం చేయాలి. అప్పుడే మీ కెంతో, నా కంతే స్వేచ్ఛ ఉంటుంది. ఇద్దరికీ సపోర్టు సమానంగా ఉంటుంది.

ఇక భార్య, పెళ్లి తర్వాత, తన వాళ్ల బాధ్యతల్ని మోయదే - అదే భర్త అయితే మోయాలి. ఇదేమిటి?! అందుకే నేను అనుకుంటున్నాను; భార్యాభర్తలు తమ వాళ్లకు దూరమై, తమ వాళ్ల బాధ్యతల్ని తమకు చేతనైనంత మేరకు మోయడం సబబు, హర్షనీయం, తమకు కూడా శ్రేయస్కరం" ఆమె మళ్లీ ఆగింది.

అతని నుంచి ప్రతిగా ఈసారీ మాట రాలేదు.

"పొదుపు అంటే నాకు ఇష్టం. అది అన్ని విధాలా ముందు ముందు ఉపయోగ పడుతుంది. కనుక ఒక నిర్దిష్టమైన అంకెను పొదుపు కోసం తప్పక కేటాయించాలి. దానిని నిక్కచ్ఛిగా ఆచరించాలి" ఆగింది ఆమె.

అతని నుంచి ప్రతిగా ఇప్పుడూ మాట రాలేదు.

"పిల్లలు అంటే నాకు ఇష్టం. అది కూడా చాలా వ్యవధి తర్వాతనే. అదీ ఒక్కరే. ఇక, ఆ వ్యవధిలో కొంతలో కొంత ముందుగా అమర్చుకోవాలి ఆ బిడ్డ కోసం. ఎందుకంటే చదువు, పెళ్లి లాంటి అంశాలు అందనంత ఎత్తుకు పోతున్నాయి. అవి ముందు ముందు ఎలా ఆడిస్తాయో గ్రహించండి" ఆగింది ఆమె.

"చెప్పండి, మాట్లాడండి" - కాస్తా హై పిచ్ లో ఉంది అతని గొంతు.

ఆ గొంతుతో ఆమె ఉలిక్కిపడింది - "ఆఁ" అంది. ఆ ఉలికిపాటుతో ఆమె పోల్చుకుంది ఇంత వరకు తను ఊహల్లో ఉన్నట్టు, తను అతనితో గడగడ మాట్లాడేస్తున్నదంతా వట్టిదేనని.

"ఏమిటీ, అంతగా ఆలోచిస్తున్నారు? మీరు నచ్చారు, నేను నచ్చానా?" - అతను మాట్లాడుతున్నాడు చిన్నగా నవ్వుతూ.

ఆమె నుంచి ప్రతిగా మాట లేదు. ఆమె తలెత్త లేక పోతోంది. అప్పటికే ఆమె చాలా అణకువగా ఒదిగి పోయి ఉంది.

అతను చిరునవ్వుతోనే అక్కడ నుంచి కదిలాడు.

శోభనం గదిలోనూ పెళ్లి చూపుల నాటి ముఖాముఖీ సమయంలో ఒదిగి పోయినట్టే ఒదిగిపోయింది ఆమె.

అతను చిరునవ్వుతోనే, తన వాంఛను చడీచప్పుడూ లేకుండా తీర్చు కున్నాడు.

"నెల తప్పావు. వాంతులు తప్పవు. దానికే మంచం ఎక్కేస్తే ఎలా! బావికి వెళ్లు, నాలుగు బిందెలు నీళ్లు తోడుకురా. బట్టలుతకాలి. వంట చేయాలి. ఈ మూడూ ముగించి, తరువాత ముడుచుకు పడుకో" - అత్త గొంతుతో ఆమె అటు కదిలింది.

"పేపరు పట్రా" - భర్త గొంతుతో ఆమె అటు కదిలింది.

"కాఫీ తేమ్మా. కాస్తా వేడిది తే. ముందు ఇచ్చింది చల్లగా ఉంది. బద్థకంగా ఉంది" - మామ గొంతుతో ఆమె అటు కదిలింది.

"వదినా, ఈ యూనిఫామ్ ఇస్త్రీ చేసి ఇవ్వు. కాలేజీకి టైము కావస్తోంది." - ఆడపడుచు గొంతుతో ఆమె అటు కదిలింది.

"వంకాయ ఏ కలుపూ లేకుండా వండు" - అత్త గొంతుతో ఆమె అటు కదిలింది.

"చదువుకున్నావుగా. ఉదయం, సాయంకాలం మన కాలనీ పిల్లలను రమ్మన మన్నాను. వాళ్లకు ట్యూషన్లు చెప్పు. డబ్బులొస్తాయి. ఇంటి ఖర్చు లకు కలిసొస్తాయి" - భర్త గొంతుకు ఆమె తలూపింది.

"ఆ ఉత్తరం మీ వాళ్లకేగా! వచ్చి, రెండు నెలలు కాలేదు. అప్పుడే అటు దృష్టా? లేచి, పనులు చూడు. తరువాత తీరిగ్గా రాద్దువులే ఉత్తరం" - అత్త గొంతుతో ఆమె కదిలింది.

"నాయనమ్మా, ఫోన్ కు డబ్బుల్లేవంటావు. పోనీ ఉత్తరం రాసి వాళ్లని తెప్పించవే. స్కూలుకు సెలవులిచ్చి రెండ్రోజులైపోయాయి" - తన ఇద్దరు కొడుకుల పిల్లలు, తన కూతురు పిల్లల కోసం గోలగా ఆలపిస్తూంటే ఆమె కదిలింది.

"మందులు వాడు తున్నావుగా. దగ్గును కంట్రోలు చేసుకోవాలి మరి. లేచి వచ్చి నా కాళ్లు నొక్కవే, నిద్ర రావడం లేదు" - భర్త గొంతుతో ఆమె అటు కదిలింది.

ఎప్పుడూ ఊహలే బాగుంటాయి.

కానీ తెగింపు లేని ఊహలు వ్యర్థం!

కావాలంటే, 'ఆమె'ను మరోసారి పరిశీలించండి.

***

(ముద్రితం : ఆంధ్రప్రభ వార పత్రిక - 15-3-1999)

***

అతి చక్కగా

- బివిడి.ప్రసాదరావు

ఆ భవనం లోనించి సన్నగా ఏడుపు వినిపిస్తోంది.

ఎవరో ఒకామె ఏడుస్తున్నట్టు ఉంది.

కారణం?

నాలో ఆతృత చొరపడింది.

ఆమె నెవరూ ఓదారుస్తున్నట్టుగాని, చీవాట్లు వేస్తున్నట్టుగాని వినిపించడం లేదు.

లోపల మరో అలికిడి లేదు.

అప్రయత్నంగా అ భవనంలోకి ప్రవేశించాను.

హాలులో నించుని అటు ఇటు చూశాను.

ఎవరూ కనిపించడం లేదు.

ఎదురుగా కనిపిస్తున్న గది వైపు నడిచాను నేరుగా.

ఒకామె మంచం మీద అస్తవ్యస్తంగా పడుకొని ఏడుస్తోంది.

మరోసారి ఆశ్చర్యపోయాను.

ఇంత భవనంలో ఒక్కామె. అందులో ఏదో వ్యథలో!

బయట తలుపులన్నీ పూర్తిగా తెరిచి ఉన్నాయి.

ఏం జరిగిందో ... ఎందుకు బాధ పడుతోందో ...

చిన్నగా దగ్గాను, కొన్ని క్షణాలాగి.

నా ఉనికిని ఆమె గమనించి, ఉలిక్కి పడి, లేచి నించుంది.

"ఏం, ఎవరు" - ఆమె గొంతులోంచి మాట స్పష్టంగా రావడం లేదు. కాస్తా వణుకుతోందామె శరీరం.

"భయపడకు తల్లీ. ఏడుపు బయటకు వినిపిస్తోంది. 'ఏ మాపదో' నని వచ్చేశాను. అది తప్పుగా అనిపిస్తే మన్నించు" అన్నాను.

ఆమె ఏమీ అనలేదు.

"నన్ను చూడగానే అర్థం చేసుకొనే ఉంటావు. నే నొక సన్యాసిని. భిక్షం కోసం ఇంటి ముందు నించున్నాను. లోపలినించి ఏడుపు వినిపించింది. కష్టాల్లో ఉన్న వారికి మాట ఊరడింపుతో ధైర్యం చెప్పడం నా అలవాటు. 'మానవ సేవే మాధవ సేవ' అన్నది నా నమ్మకం కూడా" చెప్పాను.

ఆమె అప్పటికీ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా నా వైపు చూస్తోంది.

"నన్నర్థం చేసుకో తల్లీ. ఇంతింటిలో, ఒంటరిగా ఉన్నావు. ఏం తల్లీ, ఎందుకలా కలత పడుతున్నావు" అడిగాను.

ఆమె అంతలోనే తిరిగి ఏడుపు మొదలు పెట్టింది, మంచంకు దగ్గరగా నేల మీద కూర్చుంటూ.

"ఏడవకు తల్లీ. నిబ్బరం వహించు. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. వా డాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. చెప్పు తల్లీ. ఒంటరిగా ఉన్నావు. ఎవరూ లేరా తల్లీ" అడిగాను.

ఆగి, చెప్పిందామె, "ఉన్నారు" అని.

"మరి..."

"... అంతా హాస్పిటల్ కెళ్లారు" చెప్పిందామె.

"అలాగా. ఏం తల్లీ"

"హఠాత్తుగా మా వారికి చూపు పోయింది, ఆ మధ్య. కారు ప్రమాదంలో తలకు బలమైన దెబ్బ తగలడంతో చూపు పోయింది. ఆపరేషన్ చేస్తే, చూపు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్ కూడా అయ్యింది. ఈ రోజు కట్లు విప్పుతారు..."

"మరి, నీవు వెళ్లలేదేం తల్లీ. ఎవరైనా వద్దన్నారా" చొరవగా అడిగాను.

"లేదు, నన్నూరమ్మన్నారు, వాళ్లు హాస్పిటల్ కెళ్తూ. నేనే రాననేశాను. ఏదో సాకు చెప్పేశాను"

"ఏం తల్లీ, అలా ప్రవర్తించావు"

ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు.

"చెప్పు తల్లీ. నీ తండ్రి లాంటివాడ్ని. ఎందుకు అబద్ధమాడేవు తల్లీ"

'ఇద్దరూ చేసినన్నాళ్లు చేశారు. ఇక హాయిగా కాలాన్ని గడపండి' అంటూ తన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మేడ పైన ఒక గది కేటాయించేశారు మా వారు, నేను కాపురంకు వచ్చిన మర్నాడే. పైగా వాళ్లు క్రిందన ఎక్కువ సేపు ఉంటే ఒప్పుకొనేవారు కాదు. రోజుకో రకంగా ... పళ్లు, స్వీట్స్, అవి, ఇవి అంటూ ఏదో తెస్తూ, దగ్గరుండి వాళ్ల చేత తినిపిస్తూ ఉంటారు. తను ఇంట్లో ఉన్నంతసేపు ఇంచుమించుగా వాళ్ల దగ్గరే ఉంటూ ఉంటారు, ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ...

'మాధవి మావారికి చెల్లెలు. తనకు మా తోనే పెళ్లయింది. కొత్త పెళ్లి కొడుకునని, బంధువులంతా ఉన్నారని కూడా యోచించక, మాధవి తన అత్త వారింటికి వెళ్లిపోతున్నప్పుడు కన్నీళ్లు కార్చేశారు మావారు. ఆడపిల్లలా మా వారు అలా ప్రవర్తిస్తారని నేను ముందుగా ఊహించలేకపోయాను. పైగా, ప్రతి రోజు, రెండు పూటలు, తప్పక ఫోన్ లో చెల్లెలతో మాట్లాడుతుంటారు మా వారు. ఏది కొన్నా ఆమెకు ఒక వాటా తప్పక తీస్తుంటారు. ఆ కూడిన వాటాలు, తనే స్వయంగా తీసుకుపోయి, ఆమెకు అందిస్తారు'...

'పెళ్లయిన సంవత్సరంలోనే మేము తల్లిదండ్రులం అయ్యాం. మాకు బాబు పుట్టాడు. బాబు అంటే మా వారికి ప్రాణం. బాబు ఏడిస్తే, తనూ ఏడ్చేస్తారు. బాబు నవ్వితే, తనూ పొంగిపోతారు. బాబు ఏం కావాలన్నా కొనేస్తారు. వాడి విషయంలో లేదని, దొరకదని ఆయన గారు ఎప్పుడూ అనలేదు. కానీ నా కవేవి జరపరు'...

'ఇక, ప్రతిసారి, ఏదో తప్పు చూపిస్తూ, నన్ను మాత్రం క్షణక్షణానికీ కలవర పరుస్తూనే ఉంటారు. ముఖ్యంగా, తన తండ్రిగారికి, నేను వేళకు దిన పత్రిక చదివి వినిపించకపోయినా, తన తల్లిగారికి, నేను వేళకు జడ ముడి వేయక పోయినా, బాబుకి, నేను ఏ వేళలోనైనా అందుబాటులో లేక పోయినా, తేలు కుట్టిన దొంగలా, నా ముందు చిందులు వేస్తూ ఉంటారు మావారు'...

'అందుకే, అన్నీ తెలిసే నేను వెళ్లలేదు. నిజానికి, మా వారు కట్లు విప్పగానే నన్ను పిలవరు. నాకు తెలుసు. తెలిసి వెళ్లడం ఎందుకు. వెళ్లినా, ఎవర్నో చూస్తానని ఆయన గారు కోరడం, కోరిన మనిషిని ఆయనగారు చూడడం, నేనా దృశ్యాన్ని ఒక ప్రేక్షకురాలినై చూడడం, హుఁ'...

'నాకు మాత్రం, మాధవినే ఆయనగారు చూస్తానంటారేమో అని అనిపిస్తోంది. లేకపోతే, విషయం తెలిసి వచ్చినామెను పోనీయక, ఈ రోజు వరకు ఉండమని ఆయనగారు కోరడం ఎందుకో'...

'కన్నవాళ్లు, తోబుట్టువు, కన్న బిడ్డ ముందు, నేను ... నేను ఆయనగారికి ఎప్పుడూ కనిపించనేమో'...

ఆమె ఏడుస్తోంది...

ఆమె చెప్పిందంతా విని, చిన్నగా నవ్వేసి, నే నిలా అన్నాను: "చూడు తల్లీ, దేనినైనా అర్థం చేసుకొనే బుద్ధి ఉండాలి. యోచన ఉండాలి. ఎటు వంటిదైనా ఎదురుకొనే మనో నిబ్బరం ఉండాలి. అస్తవ్యస్తమైన ఆలోచనలను దరి చేర్చుకోరాదు. ఆవేశం, అసూయలను విడిచి పెట్టాలి. ఏదైనా మన మంచికే అనే ధోరణిలో ఉండాలి. అప్పుడే, మనసుకు శాంతి, ఆనందం. తప్పు తల్లీ, ఏడవకు. నేను చెప్పేది కాస్తా విను. నీవు చెప్పిన సంఘటనలన్నింటి చుట్టూ నీ భర్తే తిరుగుతున్నాడు. అంటే, నీ భర్తే ముఖ్య పాత్రధారి, సూత్రధారి అని నీ వాదన. అవునా, కానీ ..."

అంతలోనే ఫోన్ మ్రోగింది.

హాలులో ఉంది ఫోన్...

ఆమె లేవలేదు.

నేనే కదిలాను.

ఫోనెత్తాను.

అవతల గొంతు విని, రిసీవర్ ను చేత్తో మూస్తూ ...

"తల్లీ, లక్ష్మీ నీ పేరే అనుకుంటా. లక్ష్మీ అంటూ ఎవరో పిలుస్తున్నారు. రా తల్లీ" అన్నాను.

ఆమె లేచి, వచ్చి, నా చేతిలోని రిసీవర్ ను అందుకుంది.

"ఆఁ, లక్ష్మీనే.." అంది.

ఆమెకు చాలా దగ్గరగా నేనున్నప్పటికీ అవతల గొంతు కాస్తా అస్పష్టంగానైనా, వినిపిస్తోంది నాకు అర్థమవుతోంది ...

"నేనోయ్, అమ్మ నడిగాను. నీవు రాలేదని చెప్పింది. ఏం రాలేదూ. డాక్టర్ గార్ని రిక్వెస్టు చేసి, ఎలాగో ఫోన్ తెప్పించుకున్నాను నా దగ్గరకు ... డైల్ చేసి పెట్టింది మాధవి. డాక్టర్ గారు కట్లు విప్పేస్తానంటున్నారు. కొంతసేపు ఆగ మని రిక్వెస్టు చేశాను. ఎందుకో తెలుసా, కట్లు విప్పగానే నిన్నే చూడాలని ఉంది నాకు. రావూ ..."

నవ్వుకున్నాను, అతి చక్కగా.

***

(ముద్రిత కథ పేరు - ఫోన్ మ్రోగింది)

(ముద్రితం : కథాంజలి మాస పత్రిక - జనవరి 1984)

***