Read Permeation by BVD Prasadarao in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

శీలము

శీలము

- బివిడి.ప్రసాదరావు

BVD.Prasada Rao

ఆ ఇంటి ముందు పెళ్లిళ్ల పేరయ్య సైకిల్ దిగాడు.

అతని వెంబడి వస్తున్న శేఖర్ రిక్షా దిగాడు - తన తల్లితో.

శేఖర్ తను ధరించిన బట్టల ఇస్త్రీ సరి చేసుకున్నాడు. అతడు ఖాకీ రంగు ఫేంటు, నీలం రంగు షర్టు వేసుకున్నాడు. ఆరోగ్యవంతమైన ఒడ్డూ, పొడుగూ కలిగిన తన ఒంటికి ధరించినవి ముతక బట్టలే ఐనా వారం కొక జత చెప్పున మారుస్తూ ఉంటాడు. దువ్వెన తీసి జుత్తు సవరించుకున్నాడు. పిమ్మట సెకండ్ల ముళ్లు విరిగి ఉన్న చేతి వాచీ లోకి తొంగి చూసి -

"చెప్పిన టైంకి వచ్చేశాం. లోనికి వెళ్దామా" అన్నాడు, పేరయ్యతో.

"శుభం" అంటూ ఆ ఇంటిలోకి నడిచాడు పేరయ్య. అతనిని అనుసరించారు ఆ తల్లి, కొడుకులు.

ఎదురొచ్చిన ఆ ఇంటి వారు, వారిని ఆహ్వానించారు.

హాలులోని సోఫాలో శేఖర్, అతడి తల్లి కూర్చున్నారు. ఆ సోఫాకు చేరువగా ఎదురెదురుగా రెండు కుర్చీలు ఉన్నాయి. అందులో ఒక దానిలో పేరయ్య కూర్చున్నాడు. సోఫాకు ముందున చిన్న టీపాయ్ ఉంది. దాని మీద గులాబీ రంగు గుడ్డ పరిచి ఉంది. దానికి ఎదురుగా పక్కపక్కన రెండు స్టూళ్లూ ఉన్నాయి. ఒక దానిపై ఆ ఇంటి యజమాని కూర్చున్నాడు. అతడికి దగ్గరగా అతడి భార్య నిల్చుని ఉంది.

ఆ హాలు గోడలకు అక్కడక్కడ ఆ ఇంటి పాత తరం వారి ఫోటోలు, కొన్ని దేవుళ్ల ఫోటోలు ఉన్నాయి.

ఆ హాలు నానుకొని పక్కగా చేసి ఒక గది ఉంది. దాని గుమ్మానికి తెల్లటి రంగు కర్టెను వేలాడుతోంది. ఆ గదికి ఎదురుగా ఆ హాలులో నుంచి మిగతా ఇంటికి దారి ఇచ్చినట్టు ద్వారం ఒకటి ఉంది.

పేరయ్య పరిచయ వాక్యాలు ముగించి, "ఘడియలు బాగున్నాయి, అమ్మాయిని చూపించండి." అన్నాడు, ఆ ఇంటి యజమానితో.

అంతట అతడు తన భార్యతో, "అమ్మాయిని తీసుకురా" అని చెప్పాడు.

ఆవిడ వెళ్లి అమ్మాయిని తీసుకువచ్చింది.

ఆ అమ్మాయి పేరు కమల. కమల కనకాంబర రంగు చీర, అదే రంగు జాకెట్టులో పొందికగా ఉంది. వాలు జడ, దానిలో కనకాంబరాల మాల మరింత సొగసు నిస్తున్నాయి ఆమెకు. ఆమె మొహానికి బింబంలాంటి కుంకుమ బొట్టు, ఆమె శోభను రెట్టింపు చేస్తోంది. పైగా ఆమె తడి పెదాల మీది చిరునవ్వు ఆమెకు మరింత కళ నిస్తోంది. తల దించుకొని నిల్చొని ఉన్న ఆమె తీరు కుందనపు బొమ్మను తలపిస్తోంది.

"కూర్చో తల్లీ" చెప్పాడు పేరయ్య.

తండ్రి పక్కన స్టూలుపై కూర్చుంది కమల.

ఆమె వైపు నుండి శేఖర్ చూపు మార్చుకోలేక పోతున్నాడు.

అతడినే గమనిస్తున్న కమల తండ్రి మురిపెంగా ఉత్సాహ పడుతున్నాడు. భార్యతో, "స్వీట్లు పట్రా" అని అన్నాడు.

కమల తల్లి అక్కడనుండి కదిలింది.

"నువ్వూ అబ్బాయిని చూడమ్మా" అన్నాడు పేరయ్య చొరవగా, కమలతో.

కమల మాత్రం చిన్నగా కదిలింది.

తన తల్లి గుసగుసగా ఏదో అనడంతో తేరు కున్నాడు కమలనే చూస్తూన్న శేఖర్. చూపు మార్చుకున్నాడు.

అంతలోనే కమల తల్లి స్వీట్లు ప్లేట్లతో అక్కడకు వచ్చింది. కమలకు మినహా అక్కడ కూర్చున్న వారందరికి ఆ ప్లేట్ల నందించింది. మంచి నీళ్ల గ్లాసులు తెచ్చి, టీపాయ్ మీద పెట్టింది.

ఇంచుమించుగా ఆ సమయంలోనే కమల చిన్నగా తల ఎత్తి శేఖర్ ను రెండు మూడు మార్లు చూడగలిగింది.

కొద్దిగా స్వీటు తిని, నీళ్ల గ్లాసును అందుకున్నాడు శేఖర్.

మిగతా వారు ఇంకా స్వీట్లు తింటూనే ఏవో విషయాలు ముచ్చటించు కుంటున్నారు.

శేఖర్ గ్లాసును కింద పెట్టేసి, "అమ్మాయితో విడిగా మాట్లాడాలని ఉంది" చెప్పాడు కమల తండ్రితో.

అతడు కమల వైపు చూశాడు. ఆమె మౌనంగా ఉంది. పిమ్మట అతడు తన భార్యవైపు చూశాడు. ఆవిడ అతడినే చూస్తోంది.

"ఈ రోజుల్లో మామూలే. విడిగా మాట్లాడుకోవచ్చు. ఆ గది ఖాళీయేగా" అన్నాడు పేరయ్య కలగచేసుకుంటూ.

"ఆఁ, ఆఁ" అన్నాడు కమల తండ్రి అనాలోచనగా, ఆ హాలుకు ఆనుకొని ఉన్న ఆ గదిని చూస్తూ.

శేఖర్ లేచి అటు కదిలాడు వెంటనే.

"నువ్వూ వెళ్లమ్మా" చెప్పాడు కమల తండ్రి.

కమల ఆ గదిలోకి వెళ్లింది నెమ్మదిగా.

శేఖర్ ఆ గదిని చూస్తున్నాడు.

ఆ గదిలో ఒక మూలన మంచం, దాని మీద నీటుగా ఉన్న తెల్లటి దుప్పటి, ఒక దిండు ఉన్నాయి. దానికి కొద్ది దూరంలో టేబులు, దాని మీద పొందికగా కొన్ని పుస్తకాలు పేర్చబడి ఉన్నాయి. వాటి పక్కన గాజు గ్లాసులో నీళ్లలో తేలుతున్న తెల్లటి పెద్ద గులాబీ ఒకటి ఉంది. ఆ టేబులు ముందు కుర్చీ ఉంది.

ఆ కుర్చీని లాక్కొని కూర్చున్నాడు శేఖర్.

ఆ గది గోడలకు తన తల్లిదండ్రుల ఫోటోలు చక్కగా అమర్చుకుంది కమల.

ఆమె మంచం పక్కన నిల్చుని ఉంది.

కాలయాపన చేయక, కమలతో, "ఫిజికల్ గా మీరు బాగున్నారు. నేను నచ్చానా" అని అన్నాడు శేఖర్.

కమల మౌనంగా ఉండి పోయింది.

"చెప్పండి. మీకు నేను నచ్చితే, కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి" చెప్పాడు శేఖర్.

కమల, "చెప్పండి" అంది నెమ్మదిగా.

"అలా కాదు, ఫస్టు నేను నచ్చానా" అడిగాడు శేఖర్.

కమల అతనిని చూస్తూ, "పాయింట్ వైజ్ గా ఎందుకు...మీరు చెప్పాలను కుంటున్నవి చెప్పండి. తదుపరి నా అభిప్రాయాలు చెప్తాను" అని చెప్పింది వినయంగా.

"సరే ...

నేను ప్రాక్టికల్ మనిషిని. నేను ప్లానింగ్ ప్రకారం నడుచుకుంటాను. నడిపించు కుంటాను. భవిష్యత్తును వర్తమానంలోనే సరి చూసుకుంటాను.

నా జీతంలో అర్ధ వాటా ఆర్.డి. చేస్తున్నాను. ఇక మీదట కూడా అది కొన సాగిస్తాను.

మీరూ, మీ జాబును కొనసాగించాలి. ఇక మీ జీతంలో కూడా అర్ధ వాటా ఆర్.డి. చేస్తుండాలి. మిగతా మన జీతాలు మాత్రమే వాడుక కావాలి.

లోన్సుల్లాంటివి ఎప్పుడూ చేయ కూడదు..." - చెప్పుతున్నాడు శేఖర్.

అతడి మాటలు వింటూన్న కమల ఆలోచిస్తుంది.

"పెళ్లిలో మీ మూలంగా నాకు వచ్చే కేష్, గోల్డ్ - మన ఇద్దరి జాయింట్ ప్రొపర్టీగా పరిగణింపబడాలి. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేద్దాం. అలా వాటి మీద వచ్చే పై విలువ మాత్రం సంతాన అవసరాలకు వాడుకొందాం." అంటూ చెప్పడం ఆపాడు శేఖర్.

కమల తల్లి అక్కడకు కాఫీ గ్లాసుతో వచ్చింది. శేఖర్ కు ఆ గ్లాసును అందించింది. తిరిగి వెళ్లిపోయింది.

"వింటున్నారా" అడిగాడు శేఖర్, కమలను.

తల చిన్నగా ఆడించి, అతడినే చూస్తోంది కమల.

శేఖర్ కాఫీ త్రాగుతున్నాడు.

కమల ఏమీ అనడంలేదు.

శేఖర్ కాఫీని త్రాగేసి, గ్లాసును కింద పెట్టేసి, "ఇక, ఆరోగ్యకరమైనవి తింటూ, వేళకు తగ్గట్టుగా నడుచుకుంటూ, వాకింగ్, మెడిటేషన్ చే్స్తుంటే, ఎప్పుడూ ఆరోగ్యం బాగుంటుంది. వైద్య బిల్లు ఉండదు." అని చెప్పాడు.

కమల మౌనంగా అతని మాటలు వింటున్నది.

"సంతానం - ఒకే ఒకరు చాలనుకోవాలి. అదీ మూడేళ్ల గ్యాప్ ఇచ్చి, అలా ఐతే, ఆ ఒక్కరి ఆలనా పాలనా బాగా సాగుతుంది." అని కూడా చెప్పాడు శేఖర్.

కమల ఏమీ అనడం లేదు.

"ఏమంటారు" ఆగి అడిగాడు శేఖర్.

అప్పుడు, "ఇంతేనా" అని అడిగింది కమల.

"ఆఁ. ఇంతే. ఇవే నేను చెప్పాలనుకున్నవి" చెప్పాడు శేఖర్.

"నాకు కొంత వివరణ కావాలి" అంది కమల.

"అడగండి" అన్నాడు శేఖర్.

"మీరు, నేను, రాబోవు సంతానం ... మన రాబడ్లు, పోకడ్లు ... మాత్రమే చెప్పారు. ఇది గిరి గీసుకున్నట్టుగా ఉంది. సామరస్యంగా లేదు" అంది కమల.

"అంటే" అన్నాడు శేఖర్ ఆశ్చర్యంగా.

"మనమే కుటుంబం కాదు కదా. మీ వాళ్లు, మా వాళ్లు, బంధువులు, ముఖ్యంగా, మీ వాళ్లు ... మన బంధుత్వాలు, సహజంగా ఉండే బాధ్యతలు లాంటివి విస్మరించారు మీరు" చెప్పింది కమల.

ఆమె మాటతీరు చాలా సూటిగా అనిపించింది శేఖర్ కి.

"మా వాళ్లు ... అమ్మ, ఒక్కర్తె ఉంది. నాన్న చనిపోయారు. అమ్మను వేరేగా ఉంచాను. ఆవిడకు ఫామ్లీ పెన్షన్ వస్తోంది. అలాగే నాన్న రిటైర్మెంటుతో వచ్చిన మొత్తం బ్యాంకులో ఎఫ్.డి.గా ఉంచాను. దాని వడ్డీ డబ్బు తను బ్రతికినంత కాలం అమ్మనే వాడు కోమన్నాను.

బంధువులు ... వాళ్లతో రాకపోకలు నాకు పెద్దగా లేవు. ఇక బాధ్యతలు - నా ఇష్ట పరిధిలోనే ఉంటున్నాయి." చెప్పాడు శేఖర్ గర్వంగా.

కమల కదులుతూ, "రండి" అంది.

"మీ అభిప్రాయం చెప్పలేదు" గుర్తు తెచ్చేలా అన్నాడు శేఖర్.

"చెప్తాను. రండి" అంటూ అక్కడనుండి హాలులోకి నడిచింది కమల.

ఆమె వెనుకనే శేఖర్ నడిచాడు.

అక్కడ వారంతా ఆ ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తున్నారు ఆత్రంగా.

శేఖర్ తిన్నగా వెళ్లి తల్లి పక్కన కూర్చున్నాడు.

కమల తల్లి పక్కకు వెళ్లి నిల్చుంది. తన మనసులో 'మాటలను ఎలా మొద లెట్టాలా' అని తటపటాయిస్తోంది.

"చెప్పండి" అన్నాడు పేరయ్య.

శేఖర్ మాట్లాడడం లేదు.

కమల తన తల్లి వంక చూస్తోంది.

"అబ్బాయ్ చెప్తే బాగుంటుంది" అన్నాడు కమల తండ్రి.

"మీ అమ్మాయే చెప్పాలి. ఆమెతో అన్నీ చెప్పాను" అన్నాడు శేఖర్.

కమల వంక చూస్తూ, "చెప్పమ్మా" అంది శేఖర్ తల్లి.

అప్పుడు కమల - శేఖర్ తల్లితో, "క్షమించండమ్మా, నాకు మీ అబ్బాయి నచ్చలేదు" అని చెప్పింది సూటిగా.

శేఖర్ ఒక్క మారుగా గతుక్కుమన్నాడు.

మిగతా వారు విస్మయంగా చూశారు కమలను.

ముందుగా తేరుకొని, "ఏం జరిగిందమ్మా" అత్రుతగా కమలను అడిగాడు ఆమె తండ్రి.

కమల వెంటనే ఏమీ అనలేదు.

మళ్లీ తన తల్లి ఏదో అనబోతుండగా కమల, "వివరంగా చెప్తాను" అంటూ, "ఇతని భావాల్లో, తల్లి మీద ఆత్మీయత లేదు. బంధువులంటే శ్రద్ధ లేదు. ఇతను డబ్బును అమితంగా ప్రేమిస్తున్నట్టు నాకు అర్థమవు తున్నది..." చెప్పుతోంది కమల.

వింటున్నాడు శేఖర్.

అస్తవ్యస్తంగా కదులుతున్నారు కమల తల్లిదండ్రులు.

పేరయ్య బేజారుగా చూస్తున్నాడు.

"సూటిగా నిష్కర్షగా చెప్పే గుణం మంచిదే. కానీ, అందులో అప్యాయత ఉండాలి. వివేకం ఉండాలి. అవి ఇతనిలో ఉన్నాయన్న నమ్మకం నాకు కుదరలేదు.

ఎదుటి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలనే లక్షణం ఇతనితో నాకు కాన రావడం లేదు. తను అనుకున్నదే జరగాలనుకోవడం, పైగా అదే సరైనది అనుకోవడం ఇతని నైజం అనిపిస్తున్నది. నిజంగా ఇది శోచనీయం.

తల్లిదండ్రులకు, తర్వాత, వచ్చే ఆలికి తగు రీతిన స్థానం ఇవ్వడం పురుష లక్షణం. ఇది ఇతనిలో నాకు కనిపించడం లేదు." అని -

శేఖర్ తల్లితో, "క్షమించమ్మా, మీ అబ్బాయి గురించే ఇలా నా అభిప్రాయాలు చెప్పక తప్ప లేదు." అంది కమల నిర్భయంగా.

కమల తల్లిదండ్రులు దిగ్భ్రాంతులై ఉండిపోయారు.

శేఖర్ లేచి, "రామ్మా" అంటూ బయటకు నడిచాడు.

శేఖర్ తల్లి లేచి వచ్చి, కమలతో, "లేదు, లేదమ్మా. ఇక్కడ నిన్ను తప్పు పట్టేది ఏమీ లేదమ్మా. వీడి బుద్ధికి నేనూ సిగ్గు పడుతున్నాను." అంటూ -

"ఏమైనా, నిజంగా, అరమరికలు లేని నీవు నాకు బాగా నచ్చావమ్మా, కానీ ఇక్కడ కూడా నేను దురదృష్టవంతురాలినే. నువ్వు నాకు ఏమీ కానిదానిగా చేయి జారిపోతున్నావమ్మా. ప్చ్. నాకు బాధగా ఉంది" అంది శేఖర్ తల్లి నొచ్చుకుంటూ.

ఆవిడ వంక ఆత్మీయతతో చూస్తూ, "లేదమ్మా, మీరు అలా భావించ నక్కరలేదు. ఇకపై మనం 'తల్లి, బిడ్డ'ల బంధుత్వాన్ని మనసారా స్వాగతిద్దాం... ఏమంటారు." అంది కమల చనువుగా నవ్వుతూ.

తడి కళ్లతో, అప్యాయంగా కౌగలించుకుంది శేఖర్ తల్లి, కమలను.

***

(తొలుత శీర్షిక : నూరేళ్ల పంట)

(ముద్రితం : జాగృతి వార పత్రిక -15-9-2008)

***