Read Call by BVD Prasadarao in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • అరె ఏమైందీ? - 21

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

పిలుపు

పిలుపు

- బివిడి.ప్రసాదరావు

BVD.Prasada Rao

అతిశయోక్తి కాదు కాని, నాకు నిర్మల అంటే చాలా ప్రేమ.

శలవు రోజుల్లో ఎటూ వెళ్లక, ఎక్కువగా ఆమె తోనే గడిపేవాడిని, కాలాన్ని.

ఆమె కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేది.

తనూ తన ప్రాణంలా నన్ను చూసుకుంటు ఉండేది.

ఇద్దరం ప్రేమించుకొని, పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకొని, ప్రేమించుకున్నాం (కుంటున్నాం).

"ఏంటలా చూస్తున్నారు"

ఉలిక్కి పడ్డాను.

"అబ్బే, ఏమీ లేదు" తడబడింది నా గొంతుక.

కానీ నిజం అమెకీ తెలుసు.

పెళ్లయిన తర్వాత, ఇద్దరం, రెండు, మూడు సార్లు విడివిడిగా ఉండ వలసి వచ్చింది. అదీ చాలా స్వల్ప కాలం. కానిప్పుడు, మూడ నెలలట! కాన్పు కని తన కన్నవారింటికి వెళ్తుంది నిర్మల.

వాళ్ల నాన్నగా రొచ్చారు, తీసుకు వెళ్లడానికి.

"ఏవైనా పత్రికలు తీసుకు రండి"

వెళ్లాను. కొన్ని పత్రికలు తెచ్చాను. ఆమె కిచ్చాను.

"థాంక్స్" చిర్నవ్వు నవ్వింది నిర్మల.

రైలు గోలగా గోల పెట్టిందప్పుడే.

"వెళ్లగానే ఉత్తరం ..."

"వ్రాస్తానన్నానుగా, వారం కొకటి, సరేనా ... మీరు మాత్రం వేళకు భోం చెయ్యండి. సినిమాలకు తరచుగా వెళ్లకండి. ప్లీజ్"

'అలాగే' అన్నట్టు తలూపాను.

రైలు కదిలిపోయింది.

"మరి, వెళ్లి రానా" ఆమె గొంతులో ఏదో సన్నని జీర.

చెయ్యి ఎత్తాను గాలిలోకి.

ఆమె చెయ్యి ఊపుతోంది.

మా మామయ్యగారు కూడా కిటికీలోంచి బయటికి చెయ్యి తెచ్చారు.

రైలు దూరమైపోతోంది.

దిగులుగా స్టేషన్ బయటికి నడిచాను.

పాన్ షాప్ ముందుకు వెళ్లి, షాప్ వాడితో చెప్పాను - "సోడా ఇవ్వు"

వాడిచ్చాడు.

ఖాళీ బుడ్డీని, చిల్లరను వాడి కందించాను.

రెండడుగులు ముందుకు వేశానో, లేదో, ఎవరో పిల్చినట్టయింది.

ఆగాను. వెనుదిరిగాను.

"ప్రసాద్, బాగున్నావా ... ఏంటలా చూస్తున్నావ్ ... గుర్తు పట్ట ..."

"నువ్వు ... నువ్వు ... దీపవ్ కదూ" ఆమె కడ్డుపడి అడిగాను, కొంత విస్మయంతో.

"ఉఁ. రక్షించావ్. గుర్తు పట్టగలిగావ్" చిన్నగా నవ్వేసింది దీప.

"ఇక్కడే ఉంటున్నావా" అడిగింది వెంటనే.

"ఉఁ. ఉద్యోగరీత్యా ..."

"ఎవర్ని సాగనంపుతున్నావు" దీప అడిగింది.

చెప్పాను.

"అవునా. సరే, తర్వాత కలుస్తాను, నీ అడ్రస్ ఇవ్వు. నా కవతల చాలా పనుంది. వెళ్లాలి" అంది దీప గబగబా.

అడ్రస్ చెప్పాను.

"వస్తా, ప్రసాద్. ఆఁ. అన్నట్టు నువ్వు ఏ టయిమింగ్స్ లో ఇంటి దగ్గర ఉంటావ్" అడిగింది దీప.

"ఉదయమయితే, 10 వరకు ... సాయంకాల మయితే 5 తర్వాత" చెప్పాను. "శలవు రోజుల్లో రోజంతా ఇంట్లోనే ఉంటా" అని కూడా చెప్పాను.

"ఇప్పుడు నీతో పాటు ఇంట్లో ఎవరె వరుంటున్నారు." అడిగింది దీప.

"ప్రస్తుతం నేను ఒక్కడ్నే" చెప్పాను.

"సరే, నేనేదో సమయంలో వస్తా, వీలు చేసుకొని" అంటూ ముందుకు కదిలి పోయింది దీప కింద పెట్టి ఉన్న లగేజీ బేగ్ నందుకొని.

ఆమె వెళ్లిన వైపే చూస్తూ నేనుండి పోయాను.

ఆకాశంలో విమానంలా అయిపోయింది దీప, నా దృష్టికి, కొన్ని క్షణాలోనే.

ముందుకు కదిలాన్నేను.

పావుగంట తర్వాత ఇల్లు చేరుకోగలిగాను.

తాళం తీసుకొని లోనికి వెళ్లాను.

ఈ రోజు శలవు ... ఆఫీస్ కెళ్లక్కరలేదు.

డ్రస్ మార్చుకున్నాను.

మంచం మీద వాలాను.

దీప గుర్తులోనే ఉంది.

నా ఆలోచనలన్నీ ఆమె చుట్టే ...

ఎక్కడకు వచ్చిం దిక్కడకు?

ఎక్కడుంటుం దిప్పుడు?

చాలా కాలమయింది మళ్లీ దీప నాక్కనిపించి.

బహుశా, మరి నా క్కనిపించ దేమో ననుకున్నాను ...

దీప మా వీథిలో, మా ఇంటికి కొంచెం దూరంలో, అద్దింటిలో ఉండే ఓ యల్.డి.సి. గారమ్మాయి.

నా ఇంటర్మీడియట్ పరీక్ష పోవడంతో, అప్పటి వరకు మా నాన్నగారు చూసు కుంటూన్న టైపు ఇనిస్టిట్యూట్ బాధ్యతంతా నా కప్ప చెప్పబడింది.

ఆ రోజుల్లో - దీప తొమ్మిది చదువుతోంది. మా చెల్లాయ్ కు క్లాస్ మేట్.

దీప తల్లిలేని పిల్ల ... తోబుట్టువులు కూడా లేని ఒంటరిది.

అందుకే ఆమంటే మా అమ్మకు ఎంతో జాలి ... మక్కువ ...

కొన్నాళ్లు సాఫీగానే సాగిపోయింది కాలం.

దీప పదవ తరగతి పాసవ్వడం, మా చెల్లాయ్ ఇంటర్ లో చేరడం, నా ఇంటర్ పూర్తి కావడం జరిగి పోయాయి, ఆ మధ్య కాలంలోనే.

దీప కుటుంబ పరిస్థితి బాగా లేక పోవడంతో మరి చదవలేకపోయింది.

రామారావుగారి (దీప తండ్రి) స్వభావం మంచిదైనా, వ్యసనపరులు. తాగుడు కు బానిస. తెచ్చిన జీతంలో సగం తన తాగుడుకే వినియోగించేవారు.

అమ్మ చెప్పడంతో దీపకు టైపు రైటింగ్ నేర్పుతున్నాన్నేను.

పరీక్షక్కూడా అమ్మే డబ్బిచ్చి కట్టించింది దీపచేత.

కానీ, పరీక్షలింకా వారం రోజులున్నాయనగా, రామారావుగారికి ట్రాన్స్ ఫర్ కావడంతో, ఎంతగా చెప్పినా మా మాటను వినక, కూతుర్ని తీసుకు వెళ్లి పోయారు - "మా అమ్మాయి ఉద్యోగం చెయ్యాలా ఏమిటి ... దాని కెందుకీ పరీక్షలు" అంటూ.

అలా దీప వెళ్లడానికి ముందు రోజు -

నా గదిలో కూచుని కథను వ్రాసుకుంటున్నాన్నేను.

అప్పటికి రెండు పదుల వరకు వివిధ పత్రికల్లో నా కథలు చోటు చేసు కున్నాయి.

తలుపు చప్పుడయ్యింది.

చిరాగ్గా చూశాను.

అంతలోనే నా చిరాకంతా మంచులా కరిగి పోయింది, దీప గుమ్మం లో కనిపించడం తో.

"రా దీపా"

కుర్చీలో సర్దుకుంటున్నట్టు కదిలాను.

దీప వచ్చింది.

నేను చూపించిన కుర్చీలో కూచుంది, నా కెదురుగా.

"ఏంటిలా వచ్చావు" అడిగాను.

అప్పుడు పావు తక్కువ తొమ్మి దవుతోంది.

అమ్మ, చెల్లాయ్ ఫస్ట్ షో పిక్చర్ కెళ్లారు.

నేను ఇనిస్టిట్యూట్ లో ఎనిమిది వరకు ఉండాలి, కనుక, నేను పిక్చర్ కెళ్ల లేక పోయాను.

నాన్నగారు ఆఫీసు నుంచి రాలేదింకా.

"రేపు వెళ్లి పోతున్నాం" చాలా క్షణాల తర్వాత చెప్పింది దీప. ఆమె గొంతులో స్పష్టంగా దిగులు.

"మరి, నువ్వూ తప్పదంటావా" అడిగాను.

"విన్నావ్ కదా ... నాన్న మొండి వాదనను"

"పరీక్ష ఐన తర్వాత నువ్వు వెళ్తే బాగుంటుంది"

"కుదరదు. నాన్న ఒప్పుకోవడం లేదు"

నే నేమీ మాట్లాడలేక పోయాను.

"ఉత్తరాలు వ్రాస్తుండు" ఆగి అన్నాను.

తల ఎత్తి నా చూపుల్లోకి చూసింది దీప, అంతలోనే తలను దించేసుకుంది. పిమ్మట లేచి నించుంది. నా కో చీటీ నందించింది.

ఆ చీటీ నేను వ్రాసిందే ... ప్రేమ లేఖ అది ... దీపకు వ్రాశాను.

"ప్రసాద్, నీ మనసులో నా కో స్థానాన్ని ఇచ్చి నందుకు సంతోషం. కానీ నాకా అర్హత, అదృష్టం లేవని తెల్సుకోడానికి చాలా వ్వవధి పట్టింది నాకు. నన్ను క్షమించు" అంది నేల చూపులు చూస్తూ.

"దీపా, ఇన్నాళ్లూ మరెందుకు దీనిని నీ వద్ద ఉంచు కున్నావు. ఏం వ్రాశాను దీంట్లో. నా ప్రేమను తిరస్కరించినట్టయితే, దీనిని నా కప్పుడే ఇచ్చేయ మన్నానుగా" చురుగ్గా అడిగాను.

"నిజమే, ప్రసాద్, నే నాడదాన్ని ... నా నిస్సహాయతను అర్థం చేసుకో. ప్లీజ్ ... నన్ను మర్చిపో ... ప్లీజ్" అని ఆవేదన నిండిన గొంతుతో పలికి, బయటికి చరచరా వెళ్లిపోయింది దీప.

నా కామె ప్రవర్తన కొరడాతో చరిచినట్టయింది.

అంతే ... ఆ వెళ్లిపోవడమే వెళ్లిపోవడం ... మళ్లీ ఇన్నాళ్లకు కనిపించింది దీప.

చూడగానే పోల్చుకోలేకపోయాను.

దీప బాగా మారిపోయింది.

కొంచెం ఒళ్లు చేసింది.

ఇది వరకు లేని అందం ఏదో ఆమెలో చోటుచేసుకుందిప్పుడు.

స్టేషన్ వద్ద కెందుకొచ్చిందో ...

నా ఆలోచనలన్నీ దీపకే పరిమిత మయ్యాయి.

చప్పుడు కావడంతో వెళ్లి, తలుపు తీశాను.

ఎదురుగా దీప, చిర్నవ్వుతో.

ఉదయమే కనిపించింది. వస్తానన్నాది కానీ, ఈ రోజే వస్తోందని నేను అనుకోలేదు.

నే నామె వైపు చూస్తూ ఉండిపోయాను - ఏడవుతోంది, ఈ వేళప్పుడు తను రావడమేమిటా అని అనుకున్నాను.

"ఏమిటి ... లోనికి రానిస్తావా, లేదా" మెత్తగా నవ్వుతూ అడిగింది దీప.

తేరుకుంటూ అడ్డు తప్పు కున్నాన్నేను.

లోనికి వచ్చింది దీప.

చనువుగా కుర్చీ లాక్కొని - "కూర్చోవచ్చా" అంటూనే కూర్చుంది.

"కాస్తా తడబాటైనా, అడ్రస్ పట్టేయగలిగాను" చెప్పింది దీప.

నేను ఆమెనే చూస్తున్నాను.

"ఏం టక్కడే ఉండి పోయావ్" అడిగింది కాస్తా ఆశ్చర్యంగానే.

"అబ్బే, ఏమీ లేదు" అంటూనే, కదిలి, "నువ్వు చాలా మారిపోయావు సుమీ" అన్నాను.

ఆమె కెదురుగా కుర్చీలో కూర్చున్నాను.

"నిజంగా" కళ్లింతలు చేసుకొని అడిగి, గలగల నవ్వుతోంది దీప.

"ఉఁ, ఇది వరకు లేని చలాకీతనం నీలో కొట్టొచ్చినట్టగుపిస్తోందిప్పుడు" చెప్పాను.

దీప నవ్వునాపింది. నా కేసి చూస్తోంది.

ఆ చూపుల్లో ఏదో పరివర్తన గుర్తులు నా కగుపిస్తున్నాయి లీలగా. అవి నా కట్టే అర్థం కావడం లేదు.

అర్థం చేసుకోడానికి కూడా అవకాశాన్ని త్రుంచేసింది దీప, మధ్యలోనే - తల దించేసుకొంది.

"తొలి కాన్పా" అడిగింది దీప, కొన్ని క్షణాలాగి.

"ఉ. పెళ్లయి సంవత్సరమే అయింది" చెప్పాను.

దీప తాపీగా ఊపిరి పీల్చుకుంది. స్పష్టంగా పోల్చుకోగలిగాను.

"ఇంతకీ, ఉదయం స్టేషన్ కెందుకొచ్చావు" అడిగాను, అప్పుడే గుర్తుకు వచ్చినట్టు.

"నేను అప్పుడే రైలు దిగాను. అక్కడ నువ్వు కనిపించావ్" చెప్పింది దీప.

నేను తలాడించాను. "నువ్వు ఇక్కడే ఉంటున్నావా" అడిగాను.

అటు ఇటు తన తల ఆడించి, "కథలు వ్రాస్తున్నావా" అని అడిగింది దీప.

"ఉఁ. ఏవో వ్రాస్తున్నాను. ఓ నాలుగు కథలకు ఈ మధ్య బహుమతులు కూడా వచ్చాయి" చెప్పాను, కొంచెం గర్వంగానే.

కొద్దిసేపు మౌనం.

"నీకు పిల్లలా" అడిగాను.

దీప తల ఎత్తి నా వంక చూసి, నవ్వుతూ - "ఏం పిల్లల తల్లిలా అగుపిస్తున్నానా, ఏమిటి" అని ఎదురు ప్రశ్న వేసింది.

నే నేమీ చెప్పలేకపోయాను.

ఆమే చెప్పింది - "ఇద్దరు. గోపి, మణి. విజయవాడలో చదువుకుంటున్నారు. ఓ కాన్వెంటులో చేర్పించి, వారిని చదివిస్తున్నాను."

"మీ వారేం చేస్తున్నారు"

"లేరు. చనిపోయారు" ఆగి, చెప్పింది దీప.

తర్వాత, కొన్ని క్షణాలు మూగగా ఉండి పోయింది.

"నాన్నగారు బాగున్నారా"

"... ఆయనా పోయారు"

"అరె ... ఇప్పుడెలా"

"ఏమిటి"

"గడన"

"ఫర్వాలేదు. సాగిపోతోంది." చెప్పింది దీప.

ఆమె మాటల్లో ఏదో బాధ వ్యక్తమైంది స్పష్టంగా.

"ఏమిటి, నీ గురించేమీ చెప్పవ్ ... అమ్మ, నాన్న బాగున్నారా" అనడిగింది దీప.

తను మళ్లీ మాటమారుస్తోందని గ్రహించి, 'అఁ' అనేశాను.

"మీ చెల్లెయ్ ఎలా ఉంది. పెళ్లయి పిల్లలా"

"ఆఁ. ఒక బాబు"

"మీ బావగారు ఏం చేస్తున్నారు"

చెప్పాను.

క్షణమాగి, "అది సరే. చాలా సేపయింది నే నొచ్చి, కనీసం మంచి నీళ్లయ్యినా ఆఫర్ చేశావా" నవ్వుతూనే అంది దీప.

నేనూ చిన్నగా నవ్వేశాను.

"అలా నవ్వుతామేమిటి. నే నడగడం తప్పా ... ఈ రాత్రంతా నీ ఆతిధ్యాన్ని స్వీకరించడానికే వచ్చాను. ఆ అదృష్టాన్ని కలిగిస్తావా ... లేక, పొమ్మంటావా"

"భలే దానివే"

టైం చూశాను. ఎనిమిదిన్నర.

"లే. టైం కూడా చాలా అయింది. హోటల్ కెళ్లి అలా అటే పిక్చర్ క్కూడా వెళ్లి వద్దాం" చెప్పాను, నేను లేచి, నిల్చుని.

"అబ్బో ... థాంక్స్" అంది దీప, తనూ లేస్తూ.

గదిలోకి వెళ్లాన్నేను.

డ్రస్ మార్చుకొని వచ్చాను.

ఇద్దరం బయటికి నడిచాం.

బయట తాళం వేసి, దీప ననుసరించాను.

ఇద్దరం పక్కపక్కనే నడుస్తున్నాం.

"హోటల్ తిండేనా" అడిగింది దీప.

'ఉఁ' కొట్టాను.

తర్వాత నేనే అడిగాను - "ఇక్కడేం చేస్తున్నావు."

"నాకు చేతనైంది ..."

"అంటే"

"బతుకుటకు ఎన్నో పాట్లు ... ఫీట్లు ... తప్పవు కదా నాయనా" నవ్వింది దీప.

నేనేమీ అనలేకపోయాను.

పిమ్మట ఏవేవో మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్తున్నాం.

ఒక హోటల్ లోకి దారి తీశాన్నేను.

దీప నన్నుసరించింది.

... మా డిన్నరయిపోయింది.

... పిక్చర్ చూసి, తిరిగి ఇంటికి బయలు దేరాం, రిక్షాలో.

"ఎలా ఉంది సినిమా" అడిగింది దీప.

"ఫర్వాలేదు"

"నన్నడిగితే, ఎలా ఉందో చెప్పలేను" అంది దీప నవ్వుతూ.

నేనూ నవ్వేశాను.

"ఎందుకని అడగవేమి" నా భుజమ్మీద చేత్తో పొడిచి, అడిగింది.

"ఉఁ. చెప్పు" మెల్లిగా అన్నాను.

"నా పక్కన నువ్వుంటే సినిమా ఎలా చూసేది" నా చెవిలో గొణిగింది.

మౌనంగా ఉండిపోయాన్నేను.

"మొద్దబ్బాయ్ వి" విసుక్కొంది దీప.

... డ్రస్ మార్చుకొని వచ్చాను గదిలోంచి.

నా మంచంకు కొంచెం దూరంలో దీపకు మడత మంచం వేసి, దుప్పట్లు, దిండ్లు సర్దాను.

"ఎవరికది" అడిగింది దీప.

"నీకు"

"ఏం, నీ పక్కన చోటిస్తే తప్పా"

గమ్మున తలెత్తి ఆమెను చూశాను.

దీప నవ్వుతోంది.

వెళ్లి, మంచి నీళ్లు తాగి వచ్చాను.

దీప నా మంచం మీద పడుకొనుంది.

"నీలా కాదు నేను. రా, చోటిస్తాను నా పక్కన" అంది.

కొంటెగా నా చూపుల్లోకి చూస్తోంది.

చురుక్కుమంది నా మనసు.

చూపులు మార్చుకున్నాను.

"ప్రసాద్, నీకు గుర్తుందా" అడిగింది దీప.

'ఏమిటన్న'ట్టు చూశాను.

"నా కో ప్రేమ లేఖ వ్రాశావు ... గుర్తుందా" అడిగింది దీప.

వెంటనే ఫక్కున నవ్వింది.

చివుక్కుమంది నా మనసు తిరిగి.

చిరాగ్గా ఉంది నాకు.

దీప ఏదో చెప్పబోతూంటే, నే నడ్డు పడ్డాను.

"నాకు నిద్ర వస్తోంది. గుడ్ నైట్" అంటూ మడత మంచం మెక్కాను, పెద్ద లైట్ తీసేసి, చిన్న లైట్ వేసి.

"ప్రసాద్" పిలిచింది దీప.

పలకలేదు నేను.

"నువ్వు కథలు వ్రాయడం అనవసరం ... మానేయ్"

జవాబివ్వలేదు నేను.

"హూఁ" - దీప దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడవడం నా చెవులు పసి కట్టాయి.

... మర్నాడు -

నేను లేచే సరికి దీప ఇంకా నిద్రపోతూనే ఉంది.

పని పిల్ల వచ్చింది. తను చేయవలసిన పనులు తాను చేసేసింది.

పిమ్మట - నా సూచన మేరకు, హోటల్ కెళ్లి కాఫీ, రెండు రకాల టిఫిన్లు తెచ్చిచ్చి, వెళ్లిపోయింది.

నేను బ్రష్ చేసుకుంటున్నాను, దీప లేచి, వచ్చింది, పెరట్లోకి.

"చాలా టయిమ్ అయిందనుకుంటాను ... బాగా నిద్ర పట్టేసింది" అంది.

"ఆలస్యంగా పడుకుంటే, మరింతే" అన్నాను.

దీపకు వేప పుల్ల ఇచ్చాను - "పళ్లు తోముకో ... అది బాత్రూం ..." చెప్పాను.

అటు వెళ్లింది దీప.

... దీప స్నానం చేయనంది. టిఫిన్, కాఫీ తీసుకుంది.

నేనూ తీసుకున్నాను - స్నానం చేసి వచ్చి.

"మళ్లీ ఎప్పుడు కలవడం" అడిగాను.

తల ఎత్తి, చిన్నగా నా కేసి చూస్తూ - "మరి రాను. రాలేను. మరి పర్మిషన్ ఇవ్వరు" అని చెప్పింది.

"పోనీ, నో నొస్తాను. ఎక్కడ కలవమంటావో చెప్పు" అడిగాను.

దీప చెప్పింది.

వెంటనే అంది - "దేనికైనా అదృష్టం ఉంటాలేమో ... కోరి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోడానికైనా ... ఏదైనా మరి కొద్ది రోజులే ఇక్కడ ఉంటాను. ఫిక్సిడ్ ప్రయిస్. ఫిప్టీ ఓన్లీ పెర్ నైట్ ... రావాలనుకుంటే ... రా ... ఆ లాడ్జీకు" అంటూ విసురుగా ముందుకు వెళ్లిపోతూన్న దీప వంక - చూస్తూ నేను -

***

(ముద్రితం : స్వాతి మాస పత్రిక - ఆగష్టు, 1979)

***