Read On the back by BVD Prasadarao in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

వీపు మీద మసి

వీపు మీద మసి

- బివిడి.ప్రసాదరావు

BVD.Prasada Rao

వెంకటరావు రాక నన్ను కుదిపేసింది.

అప్రయత్నంగానే అతడిని లోనికి రమ్మనమన్నాను.

అతడు వచ్చి కుర్చీలో కూలబడినట్టు కూర్చున్నాడు.

ఎన్నాళ్లు అయిందో వెంకటరావును చూసి!

మనిషి బాగా చిక్కిపోయాడు. మాసిన గడ్డం, నూనె పెట్టక బిరుసెక్కి పోయిన జుత్తు, కూరుకు పోయిన బుగ్గలు, లోతుల్లోకి దిగ జారిపోయిన అతడి కళ్లు ...

నాకు చికాకు అనిపించింది.

దుమ్ము పట్టి మరకలు కట్టిన అతడి బట్టలు, స్నానం లేకో ... జబ్బు పడో పాలిపోయిన అతడి శరీరం ... చేతుల్లో కర్రలు ...

అతడిని పూర్తిగా పరిశీలించిన వెను వెంటనే నా కడుపులో తిప్పు మొదలయ్యింది.

తల తిప్పుకున్నాను.

వీథి గుమ్మం ముందున్న గులాబీ మొక్క మీద నా చూపు పడింది. దానికి పువ్వులు నిండుగా ఉన్నాయి.

ఆహ్లాదమైంది.

నాలో తిప్పు తగ్గుతోంది.

అతడు ఎందుకు వచ్చాడో? వచ్చి నప్పటి నుంచీ ఏమీ మాట్లాడడం లేదు.

అప్పుడే నా మనవరాలు వచ్చింది. నా చెంత చేరింది.

వెంకటరావును చూసి, "బూచి" అంది పుసుక్కున.

దానికి మూడేళ్లు. నా రెండో కొడుకు కూతురు.

"తాతా ... బూచోడు" అంటుంది.

తన మూతి మూశాను నా ఎడమ చేత్తో.

నేను ఉద్యోగ రీత్యా గుంటూరులో ఉన్నప్పుడు మా కుడి పక్క వాటాలో ఒక సామాన్య కుటుంబం ఉండేది.

ఆ కుటుంబ యజమాని వెంకటరావు. అతడి భార్య సుశీలమ్మ, కొడుకు కృపారావు, కూతురు జమున.

కృపారావు ఇంటర్మీడియట్ చదువుతుండే వాడు.

జమున పదవ తరగతి చదువు తుండేది.

వెంకటరావు లారీ పార్శిల్ సర్వీసులో చిరుద్యోగి.

పైసా పైసా లెక్కలతో అతడి కాపురం నడుస్తోందని గ్రహించడానికి నాకు అట్టే కాలం పట్ట లేదు.

నా భార్య అన్నపూర్ణ గురించి ముచ్చటిస్తే వెంకటరావు వాటం చాలా మేరకు వెల్లడవుతోంది.

మాకు ఇద్దరూ మగ పిల్లలే. ఆడ పిల్లలు లేరు. అందుకే జమున అంటే అన్నపూర్ణ ఇష్టపడుతోంది. ఎక్కువగా ఆమెతో మెసులుటకు మొగ్గు చూపు తుండేది. చనువుగా ఆమెను తన దరి తీసుకొని ముచ్చట పడి పోతుండేది.

"పండుగకు జమునకూ బట్టలు తీద్దామండి" అంది నాతో ఒక రోజున అన్నపూర్ణ.

"ఆమెకా!" అన్నాను మామూలుగా.

నేను కాదన్నా అన్నపూర్ణ ఒప్పుకోదని నాకు తెలుసు. ఎందుకంటే, వెంకటరావు లేమి ప్రస్తావనగా ఎత్తి, నన్ను కట్టడి చేసుకోగలదని నాకు తెలుసు కనుక.

అయినా నేనన్నాను, "నీ లాంటి వారి అండ అతడికి భారం విలువ, బాధ్యత తెలియనీయడం లేదు." అని.

"నేను కాకపోతే వేరొకరి అండ అతడికి అందకపోదు. అతడి బ్రతుకు ఇరుకై నంత మాత్రాన్న లోకం కూడా ఇరుకు అనుకోకండి" అంది అన్నపూర్ణ నిష్టూరంగా.

నాకు తెలుసు. అన్నపూర్ణ అంతగా అతడిని వెనుకేసుకు రావడానికి జమునే కారణమని.

జమున కూడా తన సొంత తల్లిని 'అమ్మా ... అమ్మా' అని అన్ని మార్లు పిలవదేమో, అన్నపూర్ణను మాత్రం 'అమ్మా' అంటూ నీడలా అంటి పెట్టుకు పోయి తిరుగు తుంటుంది.

చెప్పకేం, ఇది వెంకటరావు 'ఉసికొలుపు' అనే నాకు అనిపిస్తుండేది. మరి అతడి పబ్బం తీరుతోందిగా.

జమున ద్వారా చేబదుళ్లు, మా ఇంటి వంటకాలు, వగైరా వాళ్లింటికి వయ్యారం గా నడుచుకు పోతున్నాయిగా.

నేను ఉసురు మంటున్నా అన్నపూర్ణ పట్టించుకొనేది కాదు.

సర్దుకు పోవడం అలవాటైన వారిలో నేనూ స్థానం పొందానని సరి పుచ్చుకోవడం తప్ప వేరే వెసులుబాటు నాకు ఎన్నడూ తారసపడలేదు.

కాలం తన పని తాను చేసుకు పోతోంది.

జమున పరీక్ష తప్పింది. దానికి అన్నపూర్ణ ఎన్నో రోజులకు తేరుకో గలిగింది. నిజానికి తను కుదుట పడడానికి కారణం వెంకటరావు ఎత్తుగడే అని నాకు తోచింది.

"జమునకు పెళ్లి చేసేయాలను కుంటున్నాను" అని వెంకటరావు చెప్పాడు ఒక రోజున గబుక్కున.

ఆ తర్వాత, "మీ పెంపుడు కూతురుకు మీ చేతుల మీదనే పెళ్లి జరగాలి" అన్న ప్రతిపాదనను అన్నపూర్ణ చెంతకు చేర్చాడు సుశీలమ్మ ద్వారా - జమునను కూడా పంపి.

దాంతో అన్నపూర్ణ ఒక్క మారుగా పొంగి పొర్లి పోయింది.

తెగ హైరానా పడి పోయింది.

ఎట్టకేలకు ఒక ఎలక్ట్రీషియన్ ని వరుడుగా తేగలిగాడు వెంకటరావు, జమునకు.

పెళ్లికి డబ్బును కొంత మేరకు అప్పుగానే సర్దమని నాకు వర్తమానం పంపాడు అన్నపూర్ణ ద్వారానే.

కాదన్నా, అన్నపూర్ణ నా మాటను ససేమిరా అనేసి, "అప్పుగానే కదా, సర్దండి" అని గట్టిగా కోరింది నన్ను.

నేను 'ఉఁ' కొట్టక తప్పలేదు.

అన్నపూర్ణ వత్తిడి మేరకు పాతిక వేలు సర్దాను అప్పుగానే - వడ్డీ లేకుండానే.

జమున పెళ్లి బాగానే గట్టెక్కిపోయింది - అన్నపూర్ణ లాంటివారి చొరవలతో.

జమున అత్తవారింటికి వెళ్తున్నప్పుడు కంటే, ఆమె అక్కడకు వెళ్లిన తర్వాత అన్నపూర్ణను ఓదార్చడం నా వల్ల కాలేదు.

కాలం కరిగిపోతోంది.

జమున పెళ్లికని బట్టలు, ఇంటి సామాగ్రి, ఇతరత్రా అన్నపూర్ణ బాగానే ముట్ట చెప్పిందని నాకు నెమ్మది నెమ్మదిగా తెలియ వచ్చింది.

వెంకటరావు గట్టివాడే అనుకోనా - బ్రతుకు ఎరిగిన వాడే అనుకోనా - నాకు ఏమీ పాలు పోవడం లేదు.

నా మొరను తన వీలువెంబడి తీర్చాడు దేవుడు.

నాకు విజయవాడకు బదిలీ అయింది.

దేవుడుకి ధన్యవాదాలు తెలుపుకున్నాను.

విజయవాడకు వచ్చిన కొన్నాళ్లకు అన్నపూర్ణ తేరుకోగలిగింది - జమున ఆలోచనల నుంచి, ముఖ్యంగా పెద్ద కోడలుగా కరుణ రావడంతో.

వెంకటరావు అప్పుగా తీసుకున్నది తిరిగి ఇవ్వడానికి, అదీ తడవ తడవగా చెల్లించడానికి ఎన్నో సంవత్సరాలు తిప్పాడు.

అయినా ఇప్పటికీ పూర్తిగా తీర్చ లేదు.

ఇంకా మూడు వేలు ఇవ్వాలి.

"చాల్లెండీ, ఇంకా ఏం ఇస్తారు. వదిలేయండి. మరి కబుర్లు చెయ్యకండి." అనేది అన్నపూర్ణ చాలా మార్లు.

"తాతా ... తాతా ... బూచి ... చూడు ..." అంటూ నా మనవరాలు నన్ను కదుపు తూంటే, ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చి చూశాను.

'అరె, వెంకటరావు ఏమిటి? అలా ఒరిగిపోయాడు!' అనుకుంటూ, లేచాను - మనవరాలిని పక్కన పెడుతూ.

భయంతో కేక వేశాను.

అన్నపూర్ణ వచ్చింది.

వెంకటరావును చూసి, "అన్నయ్యగారు, ఎప్పుడు వచ్చారండీ" అంటూ -

"అలా పడిపోయారేమిటి?" అంది కంగారుగా.

ఇంతలో కరుణ వచ్చింది.

మా ఆత్రం చూసి, వెంకటరావు చెంతకు వెళ్లి, పరిశీలించింది.

"అయ్యో, ఈయన చనిపోయారు!" అని చెప్పింది.

నేను హడలిపోయాను.

తేరుకుంటూ - ఆ తర్వాత నా కొడుకులు, చిన్న కోడల్ని ఆఫీసుల నుంచి రప్పించాను - ఫోన్లు చేసి.

కృపారావుకూ ఫోన్ చేసి, అతడినీ రప్పించాను - గుంటూరు నుంచి.

"నాన్నకు ఈ మధ్య ఒంట్లో అసలు బాగాలేదు. నేను వెళ్తానన్నా ఒప్పుకోక, చివరి వాయిదా - తనే స్వయంగా ఇచ్చేసి, మీకు పాదాభివందనాలు చేయాలని వచ్చారండీ" చెప్పాడు కృపారావు, భోరున ఏడుస్తూ.

నా కొడుకులు వెంకటరావు మృత దేహాన్ని అతని ఊరుకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు.

టాక్సీ వచ్చింది.

కృపారావుతో అన్నాను, "మీ నాన్న నుంచి నాకు డబ్బు ముట్టలేదు."

కృపారావు తన తండ్రి మృత దేహం వద్దకు వెళ్లాడు. జేబులు తడిమాడు. ఒక జేబులో నుంచి డబ్బు కట్ట తీశాడు. దానిని నాకు అందించాడు.

అవి మూడు వేలు. లెక్క సరి పోయింది.

ఆ డబ్బును నా జేబులో పెట్టుకోబోతుండగా - నా కొడుకులు విసురుగా వచ్చి, చీదరింపుగా నన్ను చూస్తూ, ఆ డబ్బును లాక్కున్నారు.

కృపారావును తీసు కొని, వెంకటరావు మృత దేహం వైపు కదిలారు.

నేను వారించ బోతుండగా - అక్కడే ఉన్న అన్నపూర్ణ గబగబా వచ్చి, నన్ను ఇంట్లోకి లాక్కుపోయి -

"మీ ప్రవర్తన మమ్మల్ని నిజంగా భయపెడుతోందండీ" అంది గట్టిగా.

వెంటనే, "వీపు మీద మసిని గుర్తు ఎరగండి" అంది ఆందోళనగా.

బయట టాక్సీ పోతోన్న శబ్దం ...

అది అన్నపూర్ణ గొంతు ముందు పీలగా అన్పించింది.

భీతుడనయ్యాను.

***

(ముద్రితం : పత్రిక మాస పత్రిక - అక్టోబర్, 2008)

***