Read Question by BVD Prasadarao in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రశ్న

ప్రశ్న

- బివిడి.ప్రసాదరావు

BVD.Prasada Rao

ఆకాశంలో నల్లని మేఘాలు పాలన చేస్తున్నాయి.

వాటికి ఎదురుగా ప్రతిపక్షనాయకుల్లా చలిస్తున్నాయి తెల్లని మేఘాలు.

రెండింటి మధ్య పర్యవేక్షణ చేస్తూ మధ్య మధ్య గుర్రు గుర్రు మంటున్నాడు సభాపతిలా మేఘుడు.

చిరుజల్లుతో ప్రారంభమై బిర్రబిగుసుకుపోయింది వర్షం.

గాలి.

చలిగాలి.

అబ్బ, భరించలేని గాలి.

పైట తీసి, తల చుట్టూ చుట్టుకున్నాను.

ఒంటరిగా - మసక చీకటిలో నించుని ఉన్నాను.

షెడ్డు రేకులు వర్షానికి పెద్దగా చప్పుడు చేస్తున్నాయి.

భయంగా ఉంది.

జల్లుకి తడ్చిపోతుంది వళ్లు.

ఈదురు గాలిని తట్టుకోలేక పోతున్నాను.

రోడ్డు నిర్మానుష్యంగా ఉంది.

అశక్తత నన్ను పెన వేసుకుంటుంది.

మనసులోనే దేవుడికి మొక్కుకుంటున్నాను.

అటు ఇటు చూస్తున్నాను.

ఇంట్లో నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

చాలా సేపటికి నా దృష్టిలో పడింది -

దూరంగా ఒక కారు.

ఇటే వస్తోంది.

గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాను.

కొంచెం ముందుకు వెళ్లాను.

కారు లైటింగ్ నా మీద పడుతుంది.

ఆపమన్నట్టు చెయ్యి ఊపుతున్నాను.

కీచ్ మంటూ వచ్చి ఆగింది కారు.

ఆశ్చర్యం.

ఎవరై ఉంటారో అనుకుంటూ అనుమానం పడుతున్న నాకు ఆనందం కలిగింది.

స్టీరింగ్ ముందు చిరునవ్వుతో అతను.

అతను మా జూఆలజీ లెక్చరర్, రావుగారు.

"నమస్తే సార్"

"నమస్తే"

"లిఫ్ట్ కావాలి సార్" అని అడగా లనుకున్నాను. కాని, అడగ లేక పోయాను.

మౌనంగా తల దించుకున్నాను.

అతనే అడిగారు.

తలూపాను.

ఫ్రంట్ డోర్ తెరిచారు.

మొహమాటంగా, బిడియంగా లోపలికి వెళ్లాను.

కారు కదిలింది.

తడ్చిఉంది వళ్లు.

దాంతో గాలికి మరీ చలిగా ఉంది.

ముడ్చుకు కూర్చున్నాను.

"ఎటు వెళ్లావ్, కాళిందీ" ముందుకు చూస్తూ అడిగారు రావుగారు.

చెప్పాను - "ఓ స్నేహితురాలు పుట్టిన రోజంటే వెళ్లాను సార్. వస్తున్నప్పుడు బాగానే ఉంది. మధ్యలో ఆపేసింది ఈ వర్షం."

చిన్నగా నవ్వేరు రావుగారు.

అతను పెదాల మధ్య సిగరెట్టును ఇరికించుకున్నారు. ముట్టించారు.

సిగరెట్టు పొగలు కక్కుతుంది.

ఆ పొగలు నా వైపు దూసుకు వస్తున్నాయి.

ఆ పొగ నాకు పడదు.

కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది.

'సిగరెట్టు పారేయమని' చెప్పాలని అనిపించింది.

కాని, ఎలా చెప్పేది?

ఇబ్బందిగా కదులుతున్నాను.

నా పరిస్థితి గ్రహించినట్టుంది రావుగారు.

"పొగ పడదా?" అడిగారు.

బేలగా చూశాను. చిన్నగా తల ఊపాను.

అతను సిగరెట్టును బయటికి విసిరేశారు.

కారు మలుపు తిరిగింది.

"ఏం ప్రజెంట్ చేశావ్, నీ స్నేహితురాలికి" అడిగారు చిరునవ్వుతో.

చెప్పాను.

మళ్లీ మెల్లిగా నవ్వేశారు రావుగారు.

"నువ్వు ఉదయం కాలేజీకి రానట్టుంది" - రెండు క్షణాల తర్వాత అడిగారు.

చెప్పాను.

కారణం అడిగారు.

చెప్పాను.

"ఇప్పుడెలా ఉంది, మీ తమ్ముడికి?"

"కోలుకుంటున్నాడు."

ఒక అబద్ధానికి మరో అబద్ధాన్ని తోడు చేశాను.

నిజం చెప్పాలంటే -

ఈ రోజు జూఆలజీ పరీక్ష.

ఏమీ చదవలేదు.

అందుకే వెళ్లలేదు కాలేజీకి.

"ఈసారి కూడా ఈ మంత్లీ టెస్ట్ ఎవరూ బాగా ఆన్నర్ చెయ్యలేదు!" చెప్పారు రావు గారు.

అతని గొంతులో ఏదో బాధ కొట్టి వచ్చినట్టు బయట పడింది.

నేను మౌనంగా వింటున్నాను.

"అసలు నా లెక్చర్ మీ కర్థమవుతుందా?" సడన్ గా అడిగారు రావుగారు.

సీరియస్ గా ఉంది అతని గొంతు.

"బాగానే అర్థమవుతుంది, సార్."

మళ్లీ అబద్ధం చెప్పాను.

లేకపోతే -

ఉన్న నిజాన్ని అతని మొహం ఎదుటే ఎలా చెప్పేది?

రావుగారు అంత బాగా లెక్చర్ ఇవ్వలేరు.

అంటే, నా ఉద్దేశం - బాగా అర్థమైనట్టు చెప్పలేరు.

అతను వచ్చి రెండు నెలల పైగా కావస్తుంది.

ఇతని కన్న ముందు ఉండే శర్మగారు బాగా చెప్పేవారు.

రావుగారిది శర్మగారి కంటే ఒక డిగ్రీ ఎక్కువే.

అయితే ఏం లాభం?

అంతా శూన్యం!

అతని తెలివితేటలు ఇతని వద్ద లేవనిపిస్తుంది.

"క్లాస్ లో ముఖ్యంగా ఆ రాజు బ్యాచీ నించే కామెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి కదూ"

జవాబు ఇవ్వక ఊరుకున్నాను.

"ఆ బ్యాచీ అందరి లెక్చరర్స్ వద్ద అలాగే బిహేవ్ చేస్తూ ఉంటుందా?"

మళ్లీ ఊరుకున్నాను.

ఏం చెప్పేది?

ఏం చెప్పినా ప్రమాదమే!

ఇతను మంచివాడు కాదాయే.

ముక్కోపి మనిషి!

ఆ బ్యాచీని తిడుతూ, తిడుతూ - 'మీకు వ్యతిరేకంగా ఈ క్లాస్ లో చాలా మంది ఉన్నారు. మీ వలన వాళ్లు సఫర్ అవుతున్నా' రంటూ, నా పేరు బయట పెట్టేస్తే-

సరి, గోవిందా, గోవింద.

ఆ బాధ ఎవరు పడతారు.

అందుకే మౌనం వహించేశాను.

కారు సాఫీగా జరిగిపోతుంది.

వర్షం ఇంకా తగ్గు మొహం పట్టలేదు.

కారు ముందు అద్దం మీద చినుకులు పడుతున్నాయి. వాటిని మింగేస్తున్నాయి వైపర్స్.

"కాళిందీ" సడన్ గా పిలిచారు రావుగారు.

తల తిప్పాను.

"నువ్వు సినిమాలు చూస్తూ ఉంటావా?"

ఏం చెప్పేది?

నిజాన్నా! - అబద్ధాన్నా!

చిక్కు ప్రశ్నే వేశారు.

చూస్తాను అంటే -

ఏమంటారో?

చూడను అంటే -

నమ్మరు.

నిజమే, ఎవరు నమ్ముతారు?

ఈ కాలపు పిల్లలు సినిమాలు చూడకుండా ఉండడమే!

"చూస్తానండి, అప్పుడప్పుడు" కాస్తా భయంతో వణికింది నా గొంతు.

"మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?"

చెప్పాను.

"మీ రెంతమంది?"

"ఇద్దరం. నేను, తమ్ముడు."

"తమ్ము డేం చేస్తున్నాడు?"

చెప్పాను.

"వాడికి యం.పి.సి. గ్రూప్ తీయించారంటే, ఇంజనీరింగ్ చదివిద్దామను కుంటున్నారా?"

నవ్వేశాను.

నిజంగా - అదే ఉద్దేశంతో వాడికి ఆ గ్రూప్ తీయించాం. వాడు కూడా కష్టపడుతున్నాడు.

తప్పక వాడికి ఫస్టు క్లాసు వస్తుంది.

మా కలలు వాడి వలన నిజమవుతాయి.

కారు సడన్ గా ఆగింది.

ముందుకు తూగాను.

సర్దుకున్నాను.

"సార్"

"య"

'ఎక్స్ క్యూజ్ మీ. శ్రమ అనుకోకపోతే మరి కొంత దూరం వెళ్తే, మా వీథి. అంత వరకు తీసుకు వెళ్లండి. ప్లీజ్. వర్షం మూలంగా ఆటోలు తిరగడం లేదు, ఆగడం లేదు.' అని అనాలనుకున్నాను.

కాని -

"కాళిందీ, దిగు. ఒకసారి ఇంటిలోకి రా. అయిదు నిమిషాలలో మళ్లీ మీ ఇంటికి దిగ బెట్టేస్తాను" అన్నారు రావుగారు.

తప్పనిసరిగా దిగాను.

ఇంటిలోకి నడిచాను.

అద్దె ఇల్లు.

చిన్న ఇల్లు.

అయినా నీటుగానే ఉంది.

విలువైన ఫర్నిచరే ఉంది.

"కూర్చో."

కూర్చున్నాను కుర్చీలో.

నా ఎదురుగా కూర్చున్నారు రావుగారు.

"నీలూ" పిలిచారు.

వచ్చింది నీలు.

నీలు 10, 12 సంవత్సరాల పిల్ల. పొట్టిగా, నీటుగా ఉంది.

"నీలూ, రెండు కప్పులతో కాఫీ తీసుకురా" చెప్పారు రావుగారు.

"సార్"

"య"

"కాఫీ ..."

"అలవాటు లేదా?"

"ఉఁహుఁ"

"ఏంటి!"

"ఇప్పుడెందుకని ..."

"పర్వాలేదు"

చుట్టూ చూస్తూ కూర్చున్నాను.

ఇంట్లో నీలు తప్ప మరెవరూ లేరా?

ఏమో -

ఎవరూ కన్పించడం లేదు.

అదే అడిగాను.

"అమ్మ గారు ..."

రావుగారు చెప్పారు - "లేరు"

"ఊరికి వెళ్లారా?"

దీర్ధంగా ఓ నిట్టూర్పు విడిచారు రావుగారు.

నీలు వచ్చినంతలో - రావుగారు బయటకు వెళ్లి, వచ్చారు.

అతని చేతిలో ఏదో పాకెట్టు ఉంది.

నీలు వచ్చింది.

రావుగారు తను తెచ్చిన పాకెట్టును టీపాయ్ మీదుంచారు.

నీలు అందించగా, కాఫీ కప్పునందుకున్నాను.

తాగుతున్నాను.

వెచ్చగా అన్పిస్తుంది, వంటికి.

నీలు తిరిగి వచ్చింది, రావుగారు పిలవగా.

నీలు రెండు ఖాళీ కప్పులను తీసుకు వెళ్లి పోయింది.

రావుగారు సిగరెట్టు తీశారు.

ముట్టించబోయి, ఆగారు.

నన్ను చూసి చిన్నగా నవ్వేశారు.

నేనూ మెల్లిగా నవ్వేను.

సిగరెట్టును యాష్ ట్రేలో పడేశారు రావుగారు.

టీపాయ్ మీద పాకెట్టు నందుకున్నారు.

నేను చూస్తూ ఉన్నాను.

పాకెట్టు లోనించి పాల నురుగులాంటి తెల్లటి వూలీవూలీ చీరెను, అదే రంగు జాకెట్టు ముక్కను తీశారు.

ఒకసారి వాటివంక చూశారు.

తలెత్తి నన్ను చూశారు, అంతలోనే.

అదే సమయంలో, అతనికేసి నేను చూస్తూ ఉన్నాను.

తల వంచుకున్నాను.

"కాళిందీ, ఇవి తీసుకో. నీ కోసమే కొన్నాను."

ఉలిక్కి పడ్డాను.

"సార్"

ఆశ్చర్యపోతున్నాను.

"అవును కాళిందీ. ఉదయం నీ కోసం కాలేజీలో చూశాను. నువ్వు రాలేకపోయావు. నీ క్లాస్ మేట్స్ నడిగాను, నీ ఇంటి అడ్రస్ ను. నీ కోసమే బయలు దేరాను. దారిలో కన్పించావు, యాదృచ్ఛికంగా." చెప్పుకు పోతున్నారు రావుగారు.

నా కేమీ అర్థం కావడం లేదు.

అనుమానంగా అతనికేసి చూస్తూ నే నుండిపోయాను.

"తీసుకో కాళిందీ" మళ్లీ అన్నారు రావుగారు.

"సార్"

"నీ కోసమే ... తీసుకో".

మౌనంగా ఉండిపోయాను.

నా కోసం కొన్నారట!?

ఎందుకు?!

"ప్లీజ్"

యాంత్రికంగా అందుకున్నాను.

"నా కెందుకు సార్" - చాలా క్షణాల పిమ్మట అడగగలిగాను.

"నువ్వు నాకు కావాలి కనుక."

చుర్రుమంది నా మనసు.

"సార్"

"ఉఁ. నీ మనసులో నాకు చోటు కావాలి కాళిందీ"

"సార్"

నా కెందుకో భయంగా ఉంది.

పారిపోవాలని ఉంది.

నా చేతిలోని బట్టలు బరువుగా అన్పిస్తున్నాయి.

రావుగారు లేచారు.

నా గుండె దడదడ లాడుతుంది.

చివుక్కున నేనూ లేచాను.

"కూర్చో కాళిందీ. కూర్చో. కొంచెం సేపు, ప్లీజ్." అంటూ రావుగారు ఒక గదిలోకి వెళ్లారు.

నేను ఇబ్బందిగా కూర్చున్నాను.

వస్తూ, ఒక ఫోటో ఫ్రేం ను తీసుకు వచ్చారు రావుగారు.

నా కందించారు.

ఆశ్చర్యం.

అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసుకుంటున్నట్టుంది.

అటు ఇటు తిప్పి చూశాను.

అది అద్దం కాదు.

ఫోటో ఫ్రేం!

ఆ ఫ్రేంలో ఉన్న ఫోటో -

ఆ ఫోటోలో ఉన్న ఆమె -

అడిగాను.

రావుగారు చెప్పుతున్నారు - "సుశీల ... నా భార్య ..."

షాక్ తగిలినట్టు అయింది నాకు.

నేను ఫోటో కేసి చూస్తూ వింటున్నాను.

"నీకు, సుశీలకు చాలా దగ్గర పోలిక లున్నాయి. కానీ, నీలో ఆమెను చూడడం లేదు. ఆమె ప్రతిరూపాన్ని మాత్రం చూసుకుంటున్నాను ..."

తలెత్తాను.

"సుశీలంటే నా కెంతో ఇష్టం. ప్రేమ. కాని, ఆమె నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. నన్ను ఏకాకిగా చేసేసింది ..."

రావుగారి కళ్లల్లో నీళ్లు.

నా మనసు బరువెక్కిపోతుంది.

"సుశీల తలంపులో పోతూన్న నాకు, నువ్వు కనిపించావు. మళ్లీ నా స్మృతులకు జీవం పోశావు."

తల దించుకున్నాను.

"కాళిందీ"

తలెత్తాను.

"ఈ రోజు, నా సుశీల పుట్టిన రోజు. ఆమె కిష్టమైన బట్టలవి ..." చెప్పి- చాలాసేపు మౌనంగా ఉండి పోయారు రావుగారు.

నా మనసు బాధగా మూలుగుతుంది.

రావుగారి వంక చూస్తూ ఉండి పోయాను.

భారంగా ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు రావుగారు.

కళ్లు తుడ్చుకుంటూ -

"లే, చాలా సేపయింది. ఇంటి దగ్గర గాభరా పడుతుంటారేమో. పద, డ్రాప్ చేస్తాను" అన్నారు.

నేను లేచాను.

భారంగా అతని వెంట నడిచాను.

వర్షం తగ్గు మొహం పడుతోంది.

కారులో కూర్చున్నాను.

మౌనంను మోస్తూ కారు జరిగిపోతుంది.

కారు ఆపి, "ఇదేగా మీ వీథి?" అడిగారు రావుగారు.

"ఉఁ"

నేను దిగిపోయాను.

చేతులు జోడించాను.

వంగి, సీటులోని రావుగారు ఇచ్చిన బట్టలను అందుకున్నాను.

కారు కదిలింది.

టర్న్ తిరిగింది.

చెయ్యి ఊపేరు రావుగారు.

నేనూ ఊపేను.

కారు భారంగా ముందుకు కదిలిపోతోంది.

నేను దిగులుగా కొంతసేపు అక్కడే నిలుచుండిపోయాను.

నా మనసు అదోలా, ఆలోచనలతో అస్తవ్యస్తంగా అయిపోయింది.

నా మస్తిష్కంలో పోటు మొదలైంది.

భారంగా వీథిలోకి కదిలాను.

నడుస్తున్నాను.

అడుగు తర్వాత అడుగు -

ఆలోచన వెంట ఆలోచన -

నాకు తెల్సిన నిజాన్ని చెప్పేయాలనుకున్నాను, రావుగారికి.

కాని అభిమానం అడ్డు పడింది.

నా నోరును నొక్కేసింది.

ఛ - ఛ -

నాలో చెప్పలేనంత ఏవగింపు పుట్టుకు వస్తుంది, చనిపోయిన అమ్మ మీద.

హుఁ -

అందరూ అప్పుడు నానా విధాలుగా అమ్మ గురించి అనుకోవడంలో నిజం, నా కిప్పుడు తెలుస్తోంది -

అమ్మ అంటే దేవతంటారు -

మరి, చేతులు మారిన మా అమ్మ దేవతవుతుందా? -

***

(ముద్రితం : స్వాతి మాస పత్రిక - ఏప్రిల్, 1978)

***