Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రణయ గీతిక - 45

ప్రభా ఊరికి వెళ్లడానికి రెడీ అవుతున్నప్పుడు వచ్చిన చరిత“ప్రభా! నీకు డబ్బేమైనా అవసరమైతే నన్ను అడగరా. నువ్వు అలా ఫీల్ అవ్వకు” అంటూ చరిత ఆప్యాయంగా చెప్పింది.
“ఇల్లు కొనేటప్పుడు చాలా అత్యవసరమైతే బావను, నిన్ను అడగక తప్పదు. కానీ నేను అడగకముందే బావ లక్ష రూపాయలు నా అకౌంట్‌లో వేశారు. ఇక ఇప్పుడు నిన్ను కూడా డబ్బులు అడగడం నాకు ఇష్టం లేదు” అన్నాడు ప్రభ.
“అవునా! అయితే మంచి పని చేశారులే. ఎలాగైనా తొందరగా పనులన్నీ పూర్తి చేసి అమ్మను సొంత ఇంటికి తీసుకెళ్లరా!” అంది చరిత.
“అలాగే అక్కా! బాబును జాగ్రత్తగా చూసుకో. అమ్మను రెడీగా ఉండమని చెప్పు. మనం బయలుదేరాలి” అన్నాడు ప్రభ.
“ప్రభా! ఒక్క నిమిషం ఆగరా! ఎవరో ఒకతను ఫోన్ చేశాడు. అతని పేరు మర్చిపోయాను. ఇంటి అడ్రస్ చెబుతాను” అంటూ చరిత చెప్పడంతో ప్రభ అయోమయంగా చూశాడు.
“ఏంటక్కా! ఇల్లేంటి? అడ్రస్ ఏంటి?” అని అడిగాడు.
“అదేరా! నాకు ఫోన్ చేసిన వ్యక్తి వాళ్ల ఇంట్లో పెంచుకుంటున్న కుక్కకు బాగోలేదని చెప్పాడు. నేనైతే వెళ్లలేను. అశ్విన్ కూడా ఏదో అత్యవసరమైన పని ఉందని బయటకు వెళ్లాడు. ఎలాగూ నువ్వు వచ్చావు కదా! వెళ్లి ఆ కుక్కను చూసి, అవసరమైతే ఇంజెక్షన్ ఇచ్చి లేదా మందులు ఇచ్చి రారా! నీకు పుణ్యం ఉంటుంది” అంది చరిత.
“అక్కా! వాళ్లు ఆ కుక్కను ఇక్కడికి తీసుకురావచ్చు కదా! లేదంటే పక్క ఊరిలో ఉన్న హాస్పిటల్‌కైనా తీసుకెళ్లొచ్చు. దానికోసం వాళ్ల ఇంటికి వెళ్లాలా?” అని ప్రశ్నించాడు ప్రభ.
‘వీడు ఎప్పుడూ రూల్స్ ప్రకారమే ఆలోచిస్తాడు’ అని మనసులో అనుకున్న చరిత,
“అది కాదురా! ఎలాగూ ఊరికి వెళ్తున్నావు కదా! దారిలోనే వాళ్ల ఇల్లు ఉంటుందేమోనని చెప్పాను” అంది.
‘అక్క నన్ను వెళ్లే వరకు వదిలేలా లేదు’ అనుకున్న ప్రభ, చివరకు సరేనన్నాడు.
“సరే అక్కా! నేను వెళ్లి కుక్కకు ట్రీట్మెంట్ చేస్తాను. ఈలోగా బావను అమ్మను తీసుకురమ్మను. అక్కడి నుంచి నేను
అమ్మతో కలిసి నేరుగా మన ఇంటికి వెళ్తాను” అని చెప్పాడు.
“థాంక్యూ రా! ఎలాగో ఒప్పుకున్నావు, అంతే చాలు. అమ్మను మాత్రం నీతోపాటు తీసుకెళ్లకు. అక్కడ ఎందుకు బయట నిలబడటం, అవన్నీ ఎందుకు? మీ బావే అమ్మను తీసుకొస్తాడు. సరేనా?” అంది చరిత.
ప్రభ సరేనన్నట్లు తలూపి, చరిత చెప్పిన అడ్రస్‌కు బయలుదేరాడు.
చరిత చెప్పిన చిరునామాకు చేరుకున్న ప్రభకు ఎదురుగా కనిపించిన భవనం ఆశ్చర్యాన్ని కలిగించింది. చుట్టూ రకరకాల చెట్లు, అందంగా తీర్చిదిద్దిన తోటతో ఆ బంగ్లా ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
గేటు తెరిచి ఉండటంతో బండిని లోపలికి తీసుకెళ్లి, కాలింగ్ బెల్ నొక్కాడు. కానీ ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో చరిత ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేశాడు.
“ఎవరు?” అవతలి నుంచి ఓ గొంతు వినిపించింది.
“మీ ఇంట్లో కుక్కకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చాను” అని చెప్పాడు ప్రభ.
సుమారు పది నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. లోపలి నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చి ప్రభను చూస్తూ,
“సార్! మీరేనా డాక్టర్?” అని అడిగాడు.
“అవును. ఆ కుక్కను ఇటు తీసుకురా” అన్నాడు ప్రభ.
“సార్! అది ఎలుగుబంటిలా బలిసి ఉంటుంది. నా ఒక్కడి వల్ల దాన్ని తీసుకురావడం సాధ్యం కాదు. దయచేసి మీరే లోపలికి రండి. నిన్నటి నుంచి ఏమీ తినడం లేదు. జ్వరంతో మూలుగుతోంది” అని ఆందోళనగా చెప్పాడు.
“అలాగా! ఇంట్లో మీ అయ్యగారో, అమ్మగారో లేరా?” అని అడిగాడు ప్రభ.
“అయ్యగారు పైన ఉన్నారండి. మీరు ట్రీట్మెంట్ మొదలుపెట్టేలోగా వచ్చేస్తారు. రండి సార్!” అంటూ అతన్ని కుక్క ఉన్న బోను దగ్గరకు తీసుకెళ్లాడు.
“దీన్ని బోనులో ఎందుకు పెట్టారు? స్వేచ్ఛగా వదిలేయొచ్చుగా!” అన్నాడు ప్రభ.
“వదిలేశాం సార్! కానీ దానికి ఒంట్లో బాగోలేదేమో, అదే లోపలికి వెళ్లి పడుకుంది” అని సమాధానమిచ్చాడు.
“సరే, తలుపు తెరవండి” అన్నాడు ప్రభ.
ఆ వ్యక్తి బోను తలుపు తెరవగానే కుక్క దీనంగా ప్రభవైపు చూసింది. దాని పరిస్థితిని క్షణం పాటు పరిశీలించిన ప్రభ, జ్వరం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించాడు. ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా బయటకు తీసుకురమ్మని చెప్పాడు.
ఆ వ్యక్తి కుక్కను పట్టుకోగా ప్రభ చికిత్స ప్రారంభించాడు. మొదట మొరగడానికి ప్రయత్నించిన కుక్క, అనారోగ్యం కారణంగా శక్తి లేక నిశ్శబ్దంగా ఉండిపోయింది.
అవసరమైన చికిత్స పూర్తిచేసిన ప్రభ, కుక్క పరిస్థితి కాస్త అదుపులోకి రావడంతో ప్రభ చికిత్స ముగించి, తన చేతిలో ఉన్న టాబ్లెట్లను ఆ వ్యక్తికి అందించాడు.
“ఇదిగోండి... ఈ టాబ్లెట్‌ను నేను చెప్పిన విధంగా వేయండి. కుక్క త్వరగా కోలుకుంటుంది” అని చెప్పాడు.
“సరే సార్! ఒక్క నిమిషం... మా అయ్యగారిని పిలుస్తాను” అని చెప్పి ఆ వ్యక్తి మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్లాడు.
కొద్దిసేపటికే ఇంటి యజమాని నారాయణ కిందికి దిగివచ్చాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి తనకు వీపుచూపి నిలబడి ఉండటంతో, అతడే పశువైద్యుడని భావించి పలకరించబోయాడు.
“నమస్తే డాక్టర్‌గారు! ఏ ఊరు నుంచి వచ్చారు?” అని అడగబోతూ అతని దగ్గరకు వచ్చాడు.
అప్పుడే ప్రభ వెనక్కి తిరిగాడు.
అంతే!
ఎదురుగా ఉన్నది ప్రభ అని గుర్తించిన నారాయణ ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రబడింది. మర్యాదగా పలకరించబోయిన అతని పెదవులపై నుంచి మాటలు మారిపోయాయి.
“నువ్వా! నువ్వు డాక్టరువేంటి అసలు? నిన్ను నా ఇంట్లోకి ఎవరు రానిచ్చారు?” అంటూ గట్టిగా అరిచాడు.
నారాయణ మాటలకు ప్రభ ముఖంలోనూ ఆగ్రహం తళుక్కుమంది.
“ఇది నీ ఇల్లని ముందే తెలిసి ఉంటే, నేను ఈ గడప తొక్కేవాడినే కాదు! నీ కుక్కకు బాగాలేదని నువ్వే ఫోన్ చేయించావట కదా! ఇంకెవరూ అందుబాటులో లేక, అక్క నన్ను వెళ్లమంటే వచ్చాను. వచ్చినవాడిని వచ్చినట్టు నా పని నేను చేసుకుపోతే సరిపోయేది. కానీ, నీ కుక్కకు చికిత్స చేయడమే కాకుండా, నీ నోటికి కూడా చికిత్స చేయాల్సి వస్తుందని అనుకోలేదు!” అన్నాడు ప్రభ వ్యంగ్యంగా.
అతని మాటలకు నారాయణ ముఖం మరింత కందిపోయింది.
“నీ కుక్కకు వైద్యం చేయడానికి వచ్చాను తప్ప, నీ అహంకారాన్ని భరించడానికి కాదు! ఇక్కడికి వచ్చినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. నువ్వు ఎదురుపడకపోయి ఉంటే, కనీసం నా వృత్తికి సంబంధించిన సంతృప్తితోనైనా వెళ్లేవాడిని. ఛీ... అనవసరంగా వచ్చి వీడి చేత మాటలు పడాల్సి వచ్చింది!” అంటూ విసుగ్గా తల విదిల్చి, ప్రభ వెనక్కి తిరిగాడు.
అప్పుడే నారాయణ గొంతులో గర్వం ఉప్పొంగింది.
“ఏంట్రా ఛీ అంటున్నావ్? నేనంటే నీకంత చులకనా? నువ్వు చేసేది ఆఫ్ట్రాల్ ఓ అపార్ట్‌మెంట్‌లో కంప్యూటర్ ఉద్యోగం! నా ఇల్లు చూశావుగా... నా హోదా చూశావుగా! నీ స్థాయి ఏంటో, నా స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలి!” అంటూ రెండు చేతులూ చాచి, తన సంపదను ప్రదర్శిస్తున్నట్టుగా నిలబడ్డాడు.
ఆ మాటలు వినగానే ప్రభ అడుగులు ఆగిపోయాయి.
ఇప్పటివరకు అవమానాన్ని దిగమింగుకుంటూ వెనక్కి వెళ్లాలనుకున్న అతని సహనం ఒక్కసారిగా తెగిపోయింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి నారాయణ కళ్లలోకి సూటిగా చూశాడు.
“ఏంట్రా అన్నావ్? నేను చేసే పని ఆఫ్ట్రాలా?” అంటూ ఆగ్రహంతో అతని వైపు అడుగులు వేశాడు ప్రభ.
నారాయణ మాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా పెదవులపై వెటకారపు నవ్వు పూయిస్తూ,
“ఆఫ్ట్రాల్ కాకపోతే ఏంట్రా? నీకేమైనా డాక్టరేట్ ఉందా? ఎక్కడో ఓ డాక్టర్ దగ్గర జీతానికి పనిచేసే అసిస్టెంట్‌వి అయి ఉంటావు. అంతమాత్రానికే ఇంత పొగరా? నా ఇంటికి వచ్చి నాతోనే ఎదురుతిరిగి మాట్లాడేంత స్థాయి వచ్చిందా నీకు?” అంటూ రెచ్చగొట్టాడు.
ప్రభ కళ్లలో కోపం కనిపిస్తున్నా, అతని గొంతులో మాత్రం స్థిరత్వం తొణికిసలాడింది.
“పొగరు గురించి మాట్లాడుతున్నావు కదా నారాయణా... దానికి స్థాయితో సంబంధం లేదు. చీము, నెత్తురు ఉన్న ప్రతి మనిషికీ ఆత్మగౌరవం ఉంటుంది. కూటికి లేనివాడికైనా, కోట్లు ఉన్నవాడికైనా తనకంటూ ఓ స్థాయి ఉంటుంది. కానీ, ఆ స్థాయిని నిర్ణయించేది జేబులో ఉన్న డబ్బు కాదు... మనిషి ప్రవర్తన!”
ఒక్క క్షణం ఆగి, నారాయణ ఇంటి వైభవాన్ని ఓసారి పరికించి చూశాడు.
“డబ్బున్నవాడిని బంగారు పెట్టెలో పెట్టి పూడ్చరు. డబ్బులేనివాడిని మట్టిలో పూడ్చడానికి నిరాకరించరు. బతికున్నంత కాలం మనుషుల్ని ఆస్తితోనూ, అంతస్తుతోనూ కొలుస్తావేమో... కానీ చివరికి ఇద్దరూ చేరాల్సింది ఈ మట్టిలోకే!” అంటూ నేలవైపు వేలుచూపించాడు ప్రభ.
ఆ మాటలు నారాయణ అహంకారాన్ని గట్టిగా దెబ్బతీశాయి.
“ఏంట్రా! మాటలు తూటాల్లా వస్తున్నాయి! ఏదో ఒకరోజు కష్టాల్లో ఉన్న నా కూతురిని గట్టెక్కించానని, జేజీ తాతయ్యలతో కలిసి నా కూతురినే ఫాలో అవుతావా? నీకింత ధైర్యం ఎలా వచ్చిందిరా?” అంటూ నారాయణ ఆవేశంగా అరిచాడు.
ప్రభ కళ్లలో కోపం కట్టలు తెంచుకుంది.
“ఓహో! కష్టాల్లో ఉన్న నీ కూతురిని నేను గట్టెక్కించానన్న విషయం నీకు తెలుసన్నమాట! మరి, నీ కూతురికి సాయం చేసినవాడికి కనీసం కృతజ్ఞత చెప్పాలన్న సంస్కారం కూడా లేదా? ఎందుకు ఉంటుందిలే... అందుకు కూడా స్థాయి కావాలేమో!” అంటూ వెటకారంగా నవ్వాడు.
నారాయణ ఆ మాటలకు మరింత కోపంగా చూశాడు.
“ఏంట్రా? నాకు సంస్కారం లేదంటావా? నా ఇంట్లో నిలబడి నాకే ఎదురు తిరుగుతున్నావా? నా కూతురి కోసం ఏదో చేశానని నన్నే ప్రశ్నించే స్థాయికి వచ్చావా?” అంటూ గద్దించాడు.
“అసలు ఆ రోజు ఏ పరిస్థితుల్లో నేను తనకు సాయం చేయాల్సి వచ్చిందో పూర్తిగా తెలుసుకున్నావా? నీకు తన పరిస్థితిని వివరించడానికి తను ఎంతగానో ప్రయత్నించింది. కానీ, తన మాట వినకుండా అనుమానించావు! అవమానించావు! చివరికి ఇంటి నుంచి దూరం చేశావు!”
నారాయణ ముఖంలో అసహనం కనిపించింది.
“అది నా కూతురు! తన మంచి చెడులు నాకు తెలుసు. నువ్వొచ్చి నాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు!” అంటూ మధ్యలోనే అడ్డుకున్నాడు.
ప్రభ ఆ మాటలకు మరింత ఆవేశంగా అతని వైపు చూశాడు.
“నీ కూతురే కాబట్టి ఏం చేసినా సరైందనుకుంటున్నావా? తన మాట వినకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా శిక్షించడం ఏం న్యాయం? అసలు నువ్వు కన్నతండ్రివేనా? ఓహ్... నువ్వు కన్నతండ్రివి కాదు కదా! పెంచిన తండ్రివి! అందుకే నీ కూతురి కన్నీళ్లలో నీకు నీ ప్రతిబింబం కనిపించడం లేదేమో! రక్తసంబంధం లేకపోతే ప్రేమ ఉండదని కాదు... కానీ, పెంచిన బంధానికి విలువ ఇచ్చే మనిషివైతే, నీ కూతురి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడివి!”
ఆ మాటలకు నారాయణ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
“ఏంట్రా! నన్నే కన్నతండ్రివి కాదంటావా? నా కూతురిని ఇంతకాలం పెంచి పెద్ద చేశాను! నా ఇంట్లో ఉంచి చదివించాను! ఇవన్నీ నీకు కనిపించడం లేదా? నువ్వెవడివిరా నా బంధాల గురించి మాట్లాడటానికి?” అంటూ కోపంతో ఊగిపోయాడు.
ప్రభ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
“ఇంకో విషయం! నువ్వు చెప్పావు కదా, నేను నీ కూతురిని ఫాలో అవుతున్నానని! అవును, నిజమే! నేను తనను ప్రేమించాను కాబట్టి తన వెంట వెళ్లాను. కానీ, నీ కూతురు మాత్రం నీ అనుమతి లేకుండా ఏ నిర్ణయమూ తీసుకోకూడదని నువ్వు ఆశిస్తున్నావు కదా! తను అలాగే ఆలోచిస్తుంది అయినా తనకంటూ ఓ మనసుంటుందని, ఇష్టాయిష్టాలుంటాయని నీకు తెలియదా? కూతురిని పెంచడం అంటే తన జీవితాన్ని నీ చేతుల్లో బంధించడం కాదు... తన మనసును అర్థం చేసుకోవడం!”
“చాలు! ఇంకొక్క మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు!” అంటూ నారాయణ ముందుకు దూసుకొచ్చాడు.
ప్రభ కూడా అతని కళ్లలోకి సూటిగా చూస్తూ, “నిజం మాట్లాడితే నీకు మర్యాద గుర్తొస్తుందా? నీ కూతురిని అవమానించినప్పుడు మాత్రం ఆ మర్యాద ఎక్కడికి పోయింది?” అంటూ ఎదురు ప్రశ్నించాడు.
ఆ మాటలు నారాయణ అహంకారాన్ని దెబ్బతీశాయి. కోపంతో ఊగిపోతూ ఒక్కసారిగా ప్రభ కాలర్ పట్టుకున్నాడు.
మాటలు మంటలు రేపాయి... ఆత్మగౌరవం ఆగ్రహంగా మారింది... ఆగ్రహం చేతలకు దారితీసింది.
ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ, కాలర్లు పట్టుకుని పెనుగులాడుతున్న సమయంలో వారి అరుపులు గదిలో ఉన్న గీతిక చెవిన పడ్డాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆమె, ఏం జరిగిందోనని కంగారుగా బయటకు వచ్చింది.
ఎదురుగా కనిపించిన దృశ్యం ఆమెను నిర్ఘాంతపరిచింది