ప్రభ ఇంటికి చేరుకునేసరికి చరిత వాళ్లు ఇంకా రాలేదు. అయితే, తాను వెళ్లి కొద్దిసేపటికే రావడంతో ప్రభ బయటకు వచ్చాడు.
“ప్రభ! ఎప్పుడొచ్చావ్? అమ్మను కూడా తీసుకురావాలి కదా!” అంది చరిత.
“అమ్మా, నేను ఉదయమే వచ్చాం. కానీ మీరే ఇంట్లో లేరు,” అన్నాడు ప్రభ.
“ఊరికే పిలిస్తే నువ్వు రావు, అమ్మ అసలే రాదు. అందుకే అల్లుడి కోసం ఈరోజు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారన్నమాట! చాలా సంతోషం రా! పద లోపలికి,” అంటూ నవ్వుతూ ఆహ్వానించింది చరిత.
ప్రభ కూడా చిరునవ్వుతో లోపలికి వెళ్లాడు.
అందరూ కూర్చున్నాక, “ఏం చేయాలి? తప్పదు కదా! మరి, మన అల్లుడెలా ఉన్నాడు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు ప్రభ.
“డాక్టర్లు ఒకసారి చెకప్ చేయించమని చెప్పారు. అందుకే హాస్పిటల్కు తీసుకెళ్లాను. వాడికేం బాగానే ఉన్నాడులే! చూడు, ఎలా నవ్వుతున్నాడో!” అంటూ బాబును చూపించింది చరిత.
అంతలో అక్కడికి వచ్చిన గౌరీని చూసి, “ఆంటీ! బాగున్నారా?” అని పలకరించింది చరిత.
“బాగున్నాను చరితా! బాబును ఇటివ్వు,” అంటూ గౌరీ బాబును తన చేతుల్లోకి తీసుకుంది.“ఛీ! నాన్నా!” అంటూ బాబు ముక్కును పట్టుకుని ముద్దుగా మాట్లాడిస్తూ గౌరీ పక్కన కూర్చున్నాడు ప్రభ.
“ప్రభా! నీ అల్లుడు మీ బావ పోలికా? నా పోలికా?” అని అడిగింది చరిత.
బాబు చెవులు, కాళ్లు, చేతులు నిశితంగా పరిశీలించాడు ప్రభ. ఏదో ఒక పోలిక కనిపిస్తుందేమోనని కాసేపు ఆలోచించి, చివరికి నవ్వేశాడు.
“అక్కా! మరీ ఇంత చిన్నప్పుడే ఎవరి పోలికో చెప్పాలా? ఇందులో కూడా పోటీ ఎందుకు? ఎవరి పోలికలూ లేకుండా వాడిని వాడిలా ఉండనివ్వు. అదే చాలు కదా!” అన్నాడు.
అంటూనే బాబుకు తన చూపుడు వేలును అందించాడు. బాబు దాన్ని గట్టిగా పట్టుకున్నాడు.
“చూశావా అక్కా! వాడికి నేనంటే ఎంత ఇష్టమో!” అంటూ మురిసిపోయాడు ప్రభ.
“అవునురా! నిన్ను ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు? అలాంటిది మీ అల్లుడు ఇష్టపడకుండా ఉంటాడా?” అంటూ లోపలికి వచ్చాడు గుణేష్.
“అదేం లేదులే బావా! ఇష్టపడేవాళ్లు మాత్రమే ఇష్టపడతారు. ఇష్టపడని వాళ్లను బలవంతంగా ఇష్టపడమని చెప్పలేం కదా!” అన్నాడు ప్రభ చిన్నగా నిట్టూరుస్తూ.అతని మాటల్లోని బాధను అర్థం చేసుకున్న చరిత, విషయం మార్చాలనుకుంది.
“ప్రభా! ముందు భోజనం చేయండి. వాడు నిద్రపోతున్నాడు. ఇటివ్వు, ఊయలలో పడుకోబెడతాను,” అంటూ బాబును తీసుకుని ఉయ్యాలలో పడుకోబెట్టింది.
“అక్కా! ఇంతకీ వీడికి ఏ పేరు పెట్టాలని నిర్ణయించారు?” అని అడిగాడు ప్రభ.
“వీడొకడు ప్రశ్నల పుట్ట! ముందు బిర్యానీ తినరా! చల్లారిపోతుంది. మిగతా విషయాలు తర్వాత చెబుతాను,” అంది గౌరీ.
“అడగనీలేమ్మా! వాడి సందేహాన్ని నేను తీర్చేస్తాను,” అంటూ చరిత లోపలికి వెళ్లి ప్లేట్లు తీసుకొచ్చింది.ప్రభ వైపు చూస్తూ చిరునవ్వుతో,
“ప్రభా! నీ అల్లుడి పేరు మా ఇద్దరి పేర్లలోనే ఉంది. కనిపెట్టుకో చూద్దాం!” అంది చరిత.
“ఓహో! అంతేనా? ఒక్క నిమిషం ఉండు అక్కా!” అంటూ ఆలోచనలో పడ్డాడు ప్రభ.
‘గుణేష్... చరిత... ఈ రెండు పేర్లలో ఉన్న అక్షరాలను కలిపితే ఏ పేరు వస్తుంది?’అని మనసులోనే లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టాడు.
అది చూసి చరిత, గుణేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.
“బావా! నువ్వైనా చెప్పరాదా? ఒకవేళ నేను పేరు కనిపెట్టినా, దానికి అర్థం కూడా ఉండాలి కదా!” అన్నాడు ప్రభ.
“అదంతా తర్వాత చూద్దువుగానీ, ముందు భోజనం చేయరా!” అంటూ నవ్వాడు గుణేష్.
“సరే, మీరెవరూ చెప్పొద్దు. నేనే కనిపెడతాను,” అంటూ భోజనం చేయడానికి సిద్ధమైనా, ప్రభ మనసంతా ఆ పేరుమీదే ఉంది.
“ప్రభా! ముందు తినరా!” అన్నాడు చరిత వాళ్ల నాన్న.
“అంకుల్! ఒక్క నిమిషం. మీరు తింటూ ఉండండి. మీరు భోజనం పూర్తి చేసేలోపు నేను పేరు కనిపెడతాను,” అన్నాడు ప్రభ.
‘గుణ... గుణ అనేది బావ పేరు. చరిత... అక్క పేరు. సుచరిత... ఇది కూడా అమ్మాయి పేరు. మరి, ఈ అక్షరాలను కలిపితే...’అంటూ తల గోక్కున్నాడు.
“సుత... సుతుడు అంటే కొడుకు. కానీ ఇదేం పేరులా లేదు. మరి ఏం చేయాలి?” అంటూ మళ్లీ ఆలోచనలో పడ్డాడు.
చివరికి మిగిలిన అక్షరాలను కలిపి,“చరిష్!” అంటూ ఉత్సాహంగా అన్నాడు.వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు.
“ఒరేయ్! ముందు తిను. ఆ తర్వాత చూసుకోవచ్చులే!” అంది చరిత.
“అక్కా! ప్లీజ్... వన్ సెకండ్!” అంటూ చేయి అడ్డం పెట్టి, గూగుల్లో ‘చరిష్’ అనే పేరు అర్థం కోసం వెతికాడు.
కొద్దిసేపటికి ఆ పేరుకు సంబంధించిన వివరాలు కనిపించాయి.
“పేరు: చరిష్. అర్థం: దయ. లింగం: అబ్బాయి. సంఖ్యాశాస్త్రం: మూడు. రాశి: మీనం!” అంటూ అందులో ఉన్న వివరాలను చదివాడు. ఆ వెంటనే, “ఐ గాట్ ఇట్!” అంటూ గట్టిగా అరిచాడు ప్రభ.
“ఏరా! పేరు కనిపెట్టేశావా? అంత గట్టిగా అరిచావేంటి?” అని అడిగింది గౌరీ.
“అవునమ్మా! పేరు చరిష్!” అన్నాడు ప్రభ విజయగర్వంతో. అప్పుడే గుణేష్ చిరునవ్వుతో,
“ఎస్! యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్!” అన్నాడు.
అంతే! ప్రభ ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
“చూశావా అక్కా! నా అల్లుడి పేరు నేనే కనిపెట్టాను!” అంటూ బాబువైపు ప్రేమగా చూశాడు.
ఉయ్యాలలో హాయిగా నిద్రపోతున్న చిన్నారి ముఖాన్ని చూస్తూ, ‘చరిష్... ఎంత చక్కని పేరు!’ అనుకున్నాడు ప్రభ.
రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత అందరూ కాసేపు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చరిత చేసిన వంటలు గుర్తుకొచ్చి ప్రభ నవ్వుతూ,
“అక్కా! ఈరోజు నువ్వు చేసిన వంటలు చాలా రుచిగా ఉన్నాయి. నిజంగా చాలా బాగున్నాయి!” అన్నాడు.
“మీ బావ నాకు వంటింట్లో చాలా సహాయం చేస్తాడు తెలుసా! నువ్వు కూడా అలా అమ్మకు సాయం చేస్తే, రేపు నీకు కూడా ఉపయోగపడుతుంది వచ్చే వాళ్ళకి పనులు కాస్త సులువవుతాయి కూడా!”
ఆ మాటలకు గుణేష్ కనుబొమ్మలు ఎగరేస్తూ, “అంటే నువ్వు చెబుతున్నది వంటింటి గురించి కాదు, మరేదో విషయం గురించి అన్నమాట!” అన్నాడు.
“అదే కదా బావా! నేను చెబుతున్నది కూడా దాని గురించే!” అంటూ ప్రభ అతని మాటలకు వంత పాడాడు.
“అదేంట్రా ప్రభా! నీకు ఇన్ని విషయాలు అర్థమవుతాయి. కానీ నీకు కాబోయే భార్య గురించి మాత్రం అస్సలు అర్థం కావడం లేదు. ఏదైనా విషయం చెబితే వెంటనే పట్టేస్తావు. కానీ ఈ విషయంలో మాత్రం చాలా స్లో రా బాబూ!” అంటూ పైకి అంది చరిత.
“అనండి... అనండి! ఇలా అంటుంటే ఏదో...” అంటూ మాట మధ్యలో ఆపేశాడు ప్రభ.
“ఏంట్రా ఆలోచిస్తున్నావ్? ఏదైనా మాట్లాడు. ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతుంటావుగా!” అంది చరిత.
“అక్కా! ట్రైనింగ్లో నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఎంత బాగుండేదో! బావ వచ్చాక గలగలా మాట్లాడుతూ, ఏటికి ఎదురీదే ప్రశ్నలు కురిపిస్తున్నావ్!” అన్నాడు ప్రభ.
“అంతేగా మరి! జోడెద్దుల జంట అంటే ఏమనుకున్నావ్?” అంటూ గుణేష్ నవ్వుతూ అక్కడికి వచ్చి కూర్చున్నాడు.
“ఎంతైనా మీ ఇద్దరూ ఇద్దరే బాబూ!” అన్నాడు ప్రభ తల అడ్డంగా ఊపుతూ.
“ఇప్పుడా మాటలన్నీ ఎందుకులే కానీ, అప్పుడు ఆ పరిస్థితులు వేరు... ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు అక్కగా నిన్ను ఒక ఇంటివాడిని చేయాలన్నది నా కోరిక. అర్థమైందా?” అంది చరిత.
అక్క మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ప్రభ అక్కడి నుంచి తప్పించుకోవడానికి చెయ్యి కడుక్కునేకని బయటికి వెళ్తాడు.
కాసేపటి తర్వాత అందరూ పడుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రభ కూడా తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. అయితే ఏదో సందేహం గుర్తొచ్చినట్టు ఒక్కసారిగా రగ్గును ముఖం మీద నుంచి తీసి,
“అక్కా!” అని పిలిచాడు.
“ఏంట్రా మళ్లీ? ఇంకేం సందేహం వచ్చింది? హాయిగా పడుకో!” అంది చరిత.
“డౌట్ ఏమీ కాదు అక్కా! బావ బొట్టు పెట్టుకునే చోట నల్లమచ్చ ఉంది కదా... అది అదృష్టానికి సంకేతమా?” అని అమాయకంగా అడిగాడు ప్రభ.
ఆ మాటకు చరిత నవ్వు ఆపుకోలేకపోయింది.
“నువ్వు సైన్స్ స్టూడెంట్వి కాదురా బాబూ! అసలు మచ్చ ఉన్నా, లేకపోయినా జరగాల్సినవి జరుగుతాయి. వాటికీ మచ్చలకీ సంబంధం ఏముంది?” అంది.
“ఎందుకు సంబంధం లేదు? మా చిన్నప్పుడు ఇలాంటివన్నీ చూసేవాళ్లం. మా అల్లుడికి కుడివైపు మచ్చ ఉంది కాబట్టి అది అదృష్టమే!” అంటూ చరిత నాన్నగారు కూడా చర్చలోకి దిగారు.
వాళ్ల మాటలు విన్న ప్రభ మనసులోనే నవ్వుకుంటూ,
అమ్మో! వీళ్ల దగ్గర ఏ సందేహం తీర్చుకోవాలన్నా మనకే తలనొప్పి! అనుకున్నాడు.
“సరే, నీ డౌట్ క్లియర్ అయిందిగా! ఇక పడుకో!” అంటూ చరిత ప్రభ వైపు చూసింది.
“అక్కా! నేను బావ దగ్గరికి వెళ్లి పడుకుంటాను. ఇక్కడ నిద్ర పట్టడం లేదు” అన్నాడు ప్రభ.
“అయ్యో! మీ బావ దగ్గరికి వెళ్లి పడుకుంటావా? ఆయన ఓ రెండు మూడుసార్లు కాలు వేస్తే, నీ నిద్ర కాస్తా మాయమైపోతుంది రా! అది కాలా, ఐరన్ రాడ్డా అని అప్పుడే తెలుస్తుంది!” అంటూ చరిత ఆటపట్టించింది.
ఆ మాటలకు గుణేష్ నవ్వుతూ తల ఊపాడు.
“ఒక పని చేయ్! పై బాల్కనీలోకి వెళ్లి పడుకో. చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం... హాయిగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు!” అని సలహా ఇచ్చింది చరిత.
“అమ్మో! ఈ సమయంలో కవులు వర్ణించే ప్రకృతిని చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు!” అన్నాడు ప్రభ.
“ఎందుకురా? ప్రకృతి వర్ణనలు వింటుంటే పైడిబొమ్మ గుర్తుకొస్తుందా?” అంటూ చరిత మరో ప్రశ్న సంధించింది.
“అదిగో! నువ్వు మాట కలిపావంటే చాలు, ఎక్కడో మొదలుపెట్టి చివరికి అదే టాపిక్లోకి లాగుతావు. బొమ్మా లేదు, బొరుసూ లేదు! సరేలే, నేను ఎక్కడో ఒకచోట పడుకుంటాను!” అంటూ తలగడ తీసుకుని హాల్లో ఉన్న సోఫా మీదకు వెళ్లి పడుకున్నాడు ప్రభ.
అతని వెనకే నవ్వుకుంటూ చూసిన చరిత కూడా తన గదిలోకి వెళ్లింది.
అప్పటికే నిద్రలోకి జారుకుంటున్న గౌరీకి చరిత మాటలు వినిపించడంతో కాస్త మెలకువ వచ్చింది.
“ఏం చరితా! మీ తమ్ముడికి ఇంకా పడుకోవాలని లేదా? అర్థరాత్రి దాటుతున్నా వాదనలు వినిపిస్తున్నాయి!” అంది.
“లేదమ్మా! వాడు మాటల్లో పడితే అంతే. సమయం తెలియకుండా మాట్లాడుతూనే ఉంటాడు!” అంది చరిత.
“అది సరే కానీ, ఈ మధ్య వాడు ఇంట్లో మునుపటిలా మాట్లాడటం లేదమ్మా! చాలా మారిపోయాడు. తన గదిలోకి వెళ్లడం, తన పని తాను చేసుకోవడం... అంతే! ఏదో ఆలోచనల్లో ఉన్నట్టుగా అనిపిస్తోంది” అంది గౌరీ కాస్త ఆందోళనగా.
అమ్మ మాటలు విన్న చరిత మనసులో చిన్న అలజడి మొదలైంది.
అమ్మకు ప్రభ ప్రేమ విషయం బహుశా ఇంకా తెలియదేమో! అందుకే వాడి మార్పు గురించి ఇలా చెబుతోంది. ఇప్పుడే చెప్పి అమ్మను ఆలోచనల్లో పడేయడం ఎందుకు? సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. అయినా, ముందు గీతిక నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రభ బాధపడుతున్నాడు. ఇలాంటి సమయంలో పెళ్లి ప్రస్తావన తెచ్చి వాడిని మరింత ఇబ్బంది పెట్టడం ఎందుకు? అనుకుంది.
“సరేలే అమ్మా! వాడు కాస్త అలసిపోయి ఉంటాడు. నువ్వు కూడా పడుకో!” అంటూ మాట మార్చింది.
ఇంతలోనే పక్కనే ఉన్న పసిబాబు ఒక్కసారిగా క్యార్... క్యార్... అంటూ ఏడవడం మొదలుపెట్టాడు.
“వీడొకడు! నిద్ర వస్తుందనుకునే సమయానికి సరిగ్గా ఏడుస్తాడు!” అంటూ బాబును ఎత్తుకుని పాలు పట్టించి, లాలించి నిద్రపుచ్చిన తర్వాత తిరిగి పడుకుంది. కానీ ఆమె కళ్లకు మాత్రం నిద్ర పట్టలేదు.
పాపం ప్రభా! మొదటిసారి మనసుకు నచ్చిన అమ్మాయిని చూసి ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇంకా తనవైపు కన్నెత్తి చూడటం లేదు. తన ప్రేమను అర్థం చేసుకోలేదు. అయినా వాడు ఎప్పుడూ తన బాధను బయటపెట్టడు.
ఎలాగో కష్టపడి సొంత ఇల్లు కొనుక్కున్నాడు. ఇక ఆ ఇంటి మరమ్మతులు పూర్తయితే తన సొంత గూటికి చేరిపోతాడు. జీవితం గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. వాడు కష్టపడే మనిషి. ఏ పనినైనా ఇష్టంగా చేస్తాడు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం ఉంది. అలాంటి వాడికి ప్రేమ విషయంలోనే ఈ పరీక్ష ఎందుకో!
పోనీలే... కాలం గడిచేకొద్దీ వాడు జీవితంలో మరింత స్థిరపడతాడు. అప్పుడు తన మనసును అర్థం చేసుకునే అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. కానీ గీతికే వాడి జీవితంలోకి వస్తే ఎంత బాగుంటుందో! అనుకుంటూ నిట్టూర్చింది చరిత.
తెల్లవారుజామున గౌరీ బయలుదేరాలని అనుకుంటుండగా
“ఇంకేం గౌరమ్మా! కొత్త ఇల్లు కొన్నారని విన్నాను!” అంటూ మాట కలిపింది. చరిత.
గౌరీ ముఖంలో ఆనందం తొణికిసలాడింది.
“అవునమ్మా చరితా! ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. సొంతింటి కల ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు నిజమైంది. ఇక మిగిలింది నీ తమ్ముడి పెళ్లి ఒక్కటే!” అంది సంతోషంగా.
“అవునా !” అంటూ చరిత ఆసక్తిగా చూసింది. ఏమీ తెలియనట్టు.
“అవును. ఆల్రెడీ ఒక సంబంధం కూడా చూశాను. అమ్మాయి అమ్మానాన్నలకు మన ప్రభ బాగా నచ్చాడట. ఇక ఒకసారి అమ్మాయిని చూసి రమ్మని వాడితో చెప్పాలి. మరి వాడేమంటాడో చూడాలి!” అంది గౌరీ.
ఆ మాటలు విన్న చరిత ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది.
తన తమ్ముడి మనసులో గీతికకు ఉన్న స్థానాన్ని తలచుకుంటే, ఈ పెళ్లి ప్రస్తావన ఎలా మొదలుపెట్టాలో ఆమెకు అర్థం కాలేదు.
“చరితా! ఏంటమ్మా, ఒక్కసారిగా సైలెంట్ అయిపోయావు? నేను తీసుకున్న నిర్ణయం సరైనదే కదా?” అని అడిగింది గౌరీ.
చరిత తన భావాలను బయటపడనీయకుండా చిన్నగా నవ్వింది.
“అవునమ్మా! మీరు మీ ప్రయత్నం చేయాలి కదా! మీ ఉద్దేశంలో ఎలాంటి తప్పూ లేదు. మీకు నచ్చినట్టుగా చేయండి!” అంది.
ఇంతలో ప్రయాణానికి సిద్ధమై, ఫ్రెష్అప్ అయి వస్తున్న ప్రభ కనిపించాడు.
“నువ్వు నిజంగా మిస్టర్ పర్ఫెక్ట్ రా! ఏ పని ఎప్పుడు చేయాలో ముందే ప్లాన్ చేసుకుంటావా ఏంటి? అప్పుడే బయలుదేరడానికి సిద్ధమైపోయావ్!” అంటూ ఆశ్చర్యంగా అడిగింది చరిత.
“అలా ఏమీ లేదక్కా! వెళ్లాలి కదా! కాస్త ముఖ్యమైన పని ఉంది” అన్నాడు ప్రభ.
“అవునా! ఇంత పొద్దున్నే అంత ముఖ్యమైన పని ఏమొచ్చింది?” అంది చరిత.
“ముఖ్యమైన పని ఉందక్కా. అది కాకుండా ఇంటి మరమ్మతులు కూడా వీలైనంత త్వరగా చేయించాలి. ప్రస్తుతం మేముంటున్న ఇంటి లీజు గడువు కూడా ముగియబోతోంది. మరమ్మతులు పూర్తయ్యాక మా సొంతింటికి వెళ్లిపోతే బాగుంటుంది కదా! అందుకే ఇక ఆ పనిని ఆలస్యం చేయకూడదని అనుకుంటున్నాను” అన్నాడు ప్రభ.