Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రణయ గీతిక - 42

నారాయణ గీతికను కారులో తీసుకెళ్తుండగా, మరోవైపు ప్రభ మనసు మాత్రం ఆమె చుట్టూనే తిరుగుతోంది.
" తనను ఇష్టపడుతున్నది నేను ! తను ఇంకా తన బాధల నుంచి బయటపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి గురించి ఆలోచించే స్థితిలో కూడా లేదనిపిస్తోంది. తన మనసులో ఏముందో తెలుసుకోకుండా నా ఇష్టాన్ని తనపై రుద్దడం ఎందుకు? ఇప్పటికే ఎన్నో బాధలు అనుభవించింది. నా వల్ల మరోసారి ఇబ్బంది పడకూడదు’ అని అనుకుంటూ నిట్టూర్చాడు.
అంతలోనే అతని ఫోన్ మోగింది. ఆలోచనల నుంచి బయటకు వచ్చిన ప్రభ ఫోన్ తీసి కాల్ మాట్లాడాడు. అవతలి వ్యక్తి చెప్పిన విషయం వినగానే అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
సారంగ్‌కు యాక్సిడెంట్ జరిగింది! అతన్ని హాస్పిటల్‌కు తీసుకొచ్చారన్న వార్త వినగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పప్పును తీసుకుని హాస్పిటల్‌కు బయలుదేరాడు ప్రభ.
హాస్పిటల్‌కు చేరుకున్న ఇద్దరూ సారంగ్ ఉన్న గది దగ్గరకు వెళ్లారు. గాజు తలుపు అవతల కనిపించిన దృశ్యం ప్రభ గుండెను పిండేసింది. ఒళ్లంతా గాయాలు... శరీరమంతా కట్టిన బ్యాండేజీలు... శ్వాస తీసుకోవడానికి నెబ్యులైజర్ సాయంతో చికిత్స పొందుతున్న సారంగ్‌ను చూడగానే ప్రభ మనసు బరువెక్కిపోయింది.
‘పాపం! పై చదువులు చదివే స్తోమత లేక డిగ్రీతోనే సరిపెట్టుకున్నాడు. జీవితంలో కష్టాలు ఎదురైనా ఎలాగోలా ముందుకు సాగుతున్నాడు. పెళ్లి కూడా తొందరగానే చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు వీడికి ఈ పరిస్థితి ఎలా వచ్చింది? ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది?’ అని ఆలోచిస్తూ సారంగ్ తల్లిదండ్రులు ఎవరైనా వచ్చారేమోనని చుట్టూ చూశాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. వాళ్లకు సమాచారం అందిందో లేదో కూడా తెలియని పరిస్థితి.
అంతలో అక్కడున్నవారి ద్వారా మరో విషయం తెలిసింది.
యాక్సిడెంట్ జరిగిన స్థలంలోనే సారంగ్ భార్య ప్రాణాలు విడిచిందని, అటుగా వెళ్తున్నవారు సారంగ్‌ను గమనించి 108కు ఫోన్ చేయడంతో అతన్ని హాస్పిటల్‌కు తీసుకొచ్చారని తెలిసింది.ఆ విషయం వినగానే ప్రభ మనసు మరింత కలత చెందింది.
ఒకే ప్రమాదం... రెండు జీవితాలను తలకిందులు చేసింది. ఒకరి ప్రాణం అప్పటికే గాలిలో కలిసిపోగా, మరొకరి ప్రాణం ఆసుపత్రి మంచంపై మృత్యువుతో పోరాడుతోంది.
"పప్పూ! ఇక్కడే ఉంటే సరిపోదు. సారంగ్ వాళ్లవారు ఎవరైనా వస్తారేమో చూద్దాం పద!" అన్నాడు ప్రభ.
ఇద్దరూ అటువైపు వెళ్తుండగా ఎదురుగా ఒక నర్స్ వచ్చింది. ఆమె సారంగ్ ఉన్న గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే ఓ వృద్ధుడు అక్కడికి చేరుకున్నాడు.
ఆయనే సారంగ్ తండ్రి.
నర్స్ గది నుంచి బయటకు రాగానే, ఆ వృద్ధుడు ఆత్రంగా ఆమె దగ్గరకు వెళ్లాడు.
"అమ్మా! ఈ గదిలో ఉన్న పేషెంట్ నా కొడుకు. నా కొడుకు ఎలా ఉన్నాడమ్మా? బాగానే ఉన్నాడా?" అని వణుకుతున్న గొంతుతో అడిగాడు.
ఆ మాటలు విన్న ప్రభ వెంటనే అక్కడికి చేరుకున్నాడు.
కానీ నర్స్ చెప్పిన మాట విన్న క్షణం అక్కడున్న వారందరి గుండెలూ ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది.
"మీరు ఆ పేషెంట్‌కు ఏమవుతారో నాకు తెలియదు. కానీ అతను చనిపోయాడు!" అంది నిర్లక్ష్యంగా.
"ఏమిటమ్మా నువ్వు చెప్పేది?" అంటూ సారంగ్ తండ్రి తల పట్టుకుని విలపించాడు."నా కొడుక్కి ఏమైందమ్మా? నన్ను వదిలేసి వెళ్లిపోయాడా? నన్ను అనాథను చేసి వెళ్లిపోయాడా?" అంటూ గుండెలవిసేలా ఏడ్చాడు.
ఆ వృద్ధుడి రోదన ప్రభ మనసును కలచివేసింది.
అయితే ఆ నర్స్ మాత్రం కనీసం జాలి చూపించకుండా మాట్లాడింది.
"ఎక్కువసేపు శవాన్ని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు. తీసుకెళ్తారా? లేక ఇక్కడే కరెంట్ మిషన్‌కు పంపించమంటారా?" అని కఠినంగా అంది. అన్న మాటలు విన్న ప్రభకు ఒళ్లు మండిపోయింది.
"ఏమిటండీ ఆ మాటలు? పాపం, కొడుకును కోల్పోయిన బాధలో ఆ తండ్రి ఉంటే, కనీసం ఓదార్చాల్సింది పోయి అలా మాట్లాడతారా? ముందు అతని కొడుకు పార్ధివదేహాన్ని అప్పగించండి!" అన్నాడు ఆగ్రహంగా.
"హలో! నా ఇష్టానుసారం నేను నిర్ణయం తీసుకోలేను. ఇంకొద్దిసేపట్లో డాక్టర్ వస్తారు. అప్పటివరకు వేచి ఉండండి!" అని చెప్పి నర్స్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అయితే ఆమె ప్రవర్తనలో ఏదో తేడా కనిపించడంతో ప్రభకు అనుమానం కలిగింది.
ఆమె ఫోన్ రావడంతో హాస్పిటల్ కాంపౌండ్ మూలనున్న చిన్న గేటు దగ్గరకు వెళ్లింది. ప్రభకు కనిపించకుండా నిలబడి ఆమె మాట్లాడుతున్న మాటలు అతని చెవిన పడ్డాయి.
"హలో సార్! మీరు చెప్పినట్టే చేశాను. కానీ ఆ శవాన్ని త్వరగా కరెంట్ మిషన్‌కు పంపించాలనుకుంటే, అప్పుడే వాళ్ల నాన్న వచ్చాడు. ఇంకో ఇద్దరు కూడా వచ్చారు. వాళ్లకు అనుమానం రాకుండా డాక్టర్ వచ్చాకే శవాన్ని తీసుకెళ్లడానికి అనుమతి ఇస్తానని చెప్పాను. ఈరోజు డాక్టర్లు రావడం ఆలస్యమవుతుందట. ఇప్పుడు ఏం చేయాలి సార్?" అని అడుగుతోంది.
అవతలి వ్యక్తి ఏం చెప్పాడో తెలియదు కానీ, ఆమె కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది.
తన డ్యూటీ ముగియడంతో స్కూటీ తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లిపోయింది.
ఆమె మాటలు విన్న ప్రభ మనసులో అనుమానం మరింత బలపడింది.
‘సారంగ్ చనిపోవడం సహజ మరణం కాదు! ఏదో కుట్ర జరుగుతోంది. అసలు విషయం తెలుసుకునే వరకు ఈమెను వదిలిపెట్టకూడదు’ అని నిర్ణయించుకున్నాడు.
పప్పును తీసుకుని ఆమెను వెంబడించాడు.రెండు దారులు కలిసే కూడలి దగ్గరకు వచ్చేసరికి, ఒకవైపు పప్పు, మరోవైపు ప్రభ నిలబడి ఆమెకు దారి అడ్డుకున్నారు.వాళ్లను చూడగానే నర్స్ ముఖం పాలిపోయింది.
"ఎందుకిలా చేశావు? అసలు నిన్ను ఈ పని చేయమని ఎవరు చెప్పారు?" అంటూ ప్రభ నిలదీశాడు.
ఆమె భయంతో తన వోణీని చింపుకుని, ఏడుస్తున్నట్లు నటిస్తూ,
"నన్నేం చేయొద్దు! ప్లీజ్! నాకు ఏమీ తెలియదు!" అని బతిమాలుకుంది.ఆమె నటన చూసి ప్రభకు నవ్వాలో, కోపపడాలో అర్థం కాలేదు.
"అబ్బో! డ్రామా చాలా పెద్దగానే ఉంది. కానీ ఇక్కడ నీ నటనను చూడటానికి ఎవరూ లేరు. ముందు అసలు విషయం చెప్పు. నీ తప్పు లేదని తెలిస్తే నిన్ను వదిలేస్తాం!" అన్నాడు గంభీరంగా.
"అలాగే చెబుతాను సార్!" అంటూ పక్కనే ఉన్న రాయికి కాలు తగిలినట్లు నటించింది. కిందకు వంగి మట్టిని చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా పప్పు కళ్లలోకి విసిరింది. "అమ్మా!" అంటూ పప్పు కళ్లు మూసుకున్నాడు. "ప్రభా! దాన్ని వదలొద్దు!" అని అరిచాడు.
పప్పు వైపు తిరిగిన ప్రభకు అదే సమయంలో వేగంగా వస్తున్న ఓ కారు కనిపించింది.నర్స్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ కారులోకి ఎక్కింది.కారు వేగంగా దూసుకెళ్లిపోయింది.
"ఛీ! తప్పించుకుందా?" అంటూ ప్రభ పప్పును బైక్‌పై వెనుక కూర్చోబెట్టుకుని, వాళ్లకు కనిపించకుండా మరో దారి గుండా కారును వెంబడించాడు.
కొంతదూరం వెళ్లాక రోడ్డుకు ఒకవైపు చిన్న చిన్న లోయలు కనిపించాయి.అదే సమయంలో ఆ కారు నుంచి ఏదో బయటకు విసిరినట్లు ప్రభకు అనిపించింది.వెంటనే బైక్ ఆపి అటువైపు వెళ్లాడు.అక్కడ ఓ చెట్టుకు నర్స్ వోణీ చిక్కుకుని ఉంది.ప్రభ లోయలోకి తొంగి చూశాడు.కింద నర్స్ శరీరం కనిపించింది.ఆమెను లోయలోకి తోసేసి చంపేసినట్లు స్పష్టంగా అర్థమైంది.అది చూసిన ప్రభ ఆగ్రహంతో పిడికిలి బిగించాడు.
"పాపం పండింది కదరా! అందుకే అంటారు... అధర్మం ఎంతోకాలం దాగదని! తనకు అప్పగించిన పనిని ఆలోచన లేకుండా చేసేసింది. చివరికి తానే బలైపోయింది. ఎవరో చెప్పారని తప్పొప్పులు ఆలోచించకుండా ప్రాణాలు తీసేంత డబ్బు కక్కుర్తి ఏమిటి? అసలు ఈ వయసులో ఇలాంటి దుర్మార్గపు పనులు చేయడానికి మనసెలా ఒప్పిందో!" అన్నాడు ఆవేదనగా.
"అవును ప్రభా! పాపం చేస్తే దాని ఫలితం ఏదో ఒకరోజు అనుభవించక తప్పదని ఆమెకు తెలియలేదేమో! పద, ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు!" అన్నాడు పప్పు.
"అవును. కానీ ఈ కారు ఎవరిది? వీళ్ల వెనుక ఎవరున్నారు? అసలు సారంగ్‌ను చంపించాలనుకున్నదెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియకుండా ఎలా వెళ్తాం? ముందు వాళ్లను పట్టుకోవాలి!" అన్నాడు ప్రభ.
"ఆ కారు చాలా దూరం వెళ్లిపోయి ఉంటుంది!" అన్నాడు పప్పు.
"వెళ్లనివ్వు. కానీ దాని నంబర్ నా కళ్లలోనే ఉంది. పద!" అంటూ బైక్ స్టార్ట్ చేశాడు ప్రభ.
ఆ కారు వేగంగా వెళ్లి ఎయిర్‌పోర్టులో ఆగింది.
కారు నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి, అక్కడికి వచ్చిన ఓ యువకుడితో మాట్లాడుతున్నారు. అతను వాళ్లు చెప్పిన మాటలకు అంగీకరించినట్లు తల ఊపాడు.తర్వాత వాళ్లకు వీడ్కోలు చెప్పి విమానం ఎక్కడానికి ముందుకు నడిచాడు.అతని ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రభ కాసేపు ఆలోచించాడు.‘ముఖం కనిపించలేదు కదా అని గుర్తుపట్టలేననుకున్నావా? నీ నడకే నిన్ను పట్టించేస్తుంది!’ అనుకున్నాడు.
అతను విమానంలోకి ఎక్కాడు.తీరా విమానం తలుపు దగ్గరకు వెళ్లి వెనక్కి తిరిగేసరికి, ప్రభకు అతని ముఖం స్పష్టంగా కనిపించింది.
అంతే! 
ప్రభ కళ్లలో కోపం నిప్పులు కురిపించింది.
"వీడా! వీడు ఇంకా బతికే ఉన్నాడా? చావగొట్టినా నీ ఆయుష్షు చాలా గట్టిదిరా!" అంటూ ముందుకు వెళ్లబోయాడు. 
కానీ అప్పటికే విమానం తలుపు మూసేశారు."ఛీ! తృటిలో తప్పించుకున్నాడు. వేస్ట్ ఫెలో!" అంటూ పళ్లు కొరికాడు.
"ధనుష్! ఈరోజు నువ్వు తప్పించుకున్నావు. కానీ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు!" అని మనసులోనే ప్రతిజ్ఞ చేసుకున్నాడు.
పప్పు ఏదో చెప్పబోతుండగా,
"పప్పూ! నువ్వు వెళ్లు. ఈ విషయం నేను చూసుకుంటాను!" అని చెప్పి, అతన్ని అక్కడే వదిలేసి ఒక్కడే ఆ కారును వెంబడించాడు.కాసేపటికి ఆ కారు ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆగింది.అందులో ఉన్నవాళ్లు కిందకు దిగారు.వాళ్ల దగ్గరకు వెళ్లిన ప్రభను చూడగానే ఒకడు భయంతో వణికిపోయాడు.
"బాటిల్ యుద్ధం చేసినవాడ్రా వీడు! వీడి దెబ్బలు తట్టుకోలేం. ఇప్పటికే వీడి చేతిలో దెబ్బలు తిన్నాం. మళ్లీ ఇప్పుడు మన వంతు వచ్చినట్టుంది!" అంటూ చెంపలు పట్టుకున్నాడు.
"వాడెవడో చస్తే మనకేంటి? వీడు మళ్లీ మన వెంట ఎందుకు పడుతున్నాడు?" అని మరొకడు అసహనంగా అన్నాడు.
"మనల్ని కొట్టగలడేమో కానీ, భుజంగం లాంటి కొండను ఢీకొట్టగలడా? వీడికి అసలు బుద్ధి ఉందా?" అని ఇంకొకడు గొణిగాడు.వాళ్లు మాట్లాడుకుంటుండగానే ప్రభ వాళ్ల దగ్గరకు వచ్చేశాడు.
"రేయ్! ఆ నర్స్ సారంగ్‌ను ఎందుకు చంపింది? వాడికి పెట్టిన ఆక్సిజన్ ఎందుకు తీసేసింది? అసలు వాడు మీకేం అన్యాయం చేశాడు?" అంటూ నిలదీశాడు. వాళ్లు నోరు మెదపకపోవడంతో ప్రభ కోపం మరింత పెరిగింది.
"ఆరోజు మీకు జరిగిన మర్యాద గుర్తుందిగా! మళ్లీ నా చేతిలో దెబ్బలు తినాలనుకుంటే చెప్పండి. ఈసారి మీ భార్యలకు భర్తలు లేకుండా పోతారు!" అని హెచ్చరించాడు.
"వద్దు బాబూ! వద్దు! మాదేం పోతుంది? జరిగిన విషయం చెబుతాను!" అన్నాడు ఒకడు.
"అదేంట్రా! కొట్టుకుంటే వాళ్లు కొట్టుకుంటారు. మనకెందుకు?" అంటూ మరొకడు అడ్డుపడ్డాడు.
ప్రభ అతని దగ్గరకు వెళ్లి రెండు చెంపలు వాయించాడు.
"ఇప్పుడు చెప్పు! నీకూ కొట్టించుకోవాలని ఉందా?" అన్నాడు.అతను నోరు మూసుకున్నాడు.అప్పుడు వారిలో ఒకడు ధైర్యం చేసి ముందుకొచ్చాడు.
"సార్! జరిగిన విషయం చెబుతాను. కానీ చెప్పిన తర్వాత మమ్మల్ని వదిలేస్తారా?" అని అడిగాడు.
"మీ తప్పు లేకపోతే వదిలేస్తాను. కానీ తప్పు చేసి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదు!" అన్నాడు ప్రభ.
అతను నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు.