Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రణయ గీతిక - 41

గార్డెన్ హౌస్‌లో ఇక ఉండకూడదని నిర్ణయించుకున్న గీతిక, తన బ్యాగ్ తీసుకుని బయలుదేరబోతుండగా నారాయణ ఆమెను ఆపేందుకు ప్రయత్నించాడు. తన తప్పును అంగీకరిస్తూ క్షమించమని వేడుకున్నాడు. కానీ ఆయన ఎంతగా నచ్చజెప్పినా గీతిక మనసు కరగలేదు. అడుగు ముందుకు వేయబోతున్న ఆమెకు, “ఆగు!” అంటూ నారాయణ గొంతు గంభీరంగా వినిపించింది. ఆ మాటలు విన్న గీతిక అడుగులు అక్కడే ఆగిపోయాయి.
“నువ్వు ఈ సమాజానికి భయపడి అందరికీ దూరంగా వెళ్లిపోవాలనుకుంటున్నావు కదూ! కానీ ఒక్క విషయం గుర్తుంచుకో తల్లీ... ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యేది ఇదే సమాజం. ఇలాంటి మనుషులే. సమాజంలో ఉండే చీడపురుగుల కోసం మనం ఇల్లు వదిలి, మనవాళ్లను వదిలి, బంధాలను తెంచుకుంటూ వెళ్తుంటే చివరికి మనకంటూ ఎవరూ మిగలరు. ఎక్కడా నిలదొక్కుకోలేం. ఏదీ సాధించలేం. అలా జీవితమంతా పారిపోతూనే ఉండాల్సి వస్తుంది. చివరికి మనం పుట్టిన ప్రయోజనమే నెరవేరకుండా పోతుంది. ఆలోచించు!” అన్నాడు నారాయణ కోపాన్ని అణచుకుంటూ.
“మీరు ఎన్ని చెప్పినా వినే స్థితిలో నేను లేను నాన్నా! నాకు స్వేచ్ఛ కావాలి. ఎవరి మాటలకో, ఎవరి ఆంక్షలకో తలవంచకుండా... నేను నాలా జీవించాలి. నా జీవితాన్ని నా ఇష్టప్రకారం గడపాలి!” అంది గీతిక ఆవేదనతో.
“స్వేచ్ఛగా జీవించడమంటే నీకు నచ్చినట్టు జీవించడమే కాదు తల్లీ... ఎవరి అండా లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిన్ను నువ్వు నిలబెట్టుకోగలగడం. ఒంటరిగా నిలబడి నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోగలవా? ఆలోచించు!” అన్నాడు నారాయణ.
“అవును! అలాగే బతకడానికి ప్రయత్నిస్తాను!” అంది గీతిక గుండెల్లో ఉప్పొంగుతున్న బాధను బలవంతంగా అదుపు చేసుకుంటూ.
గీతిక మొండిఘటం. తను అనుకున్నది సాధించేవరకు వెనక్కి తగ్గే మనస్తత్వం కాదు తనది. పైగా, అందరూ తనను ఏదో ఒక మాటతో బాధపెడుతుండటంతో ఇప్పటికే విసిగిపోయింది. ముఖ్యంగా తన మాటలతో కూతురిని ఎంతగా బాధపెట్టాడో నారాయణకు ఇప్పుడు అర్థమైంది.
‘నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను! తన మనసులోని బాధను అర్థం చేసుకోకుండా నేనే తనను మరింత బాధపెట్టాను. ఇప్పుడు కూడా తన ఆవేదనను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే, నిజంగానే నన్ను, ఈ ఇంటిని వదిలి దూరంగా వెళ్లిపోతుందేమో!’ అన్న ఆలోచన ఆయన మనసును కలచివేసింది.
గీతిక మనస్తత్వం తెలిసిన తండ్రిగా, ఆమెను బలవంతంగా ఆపడం కంటే ప్రేమతో దగ్గర చేసుకోవడమే మంచిదని భావించాడు. తనలోని ఆందోళనను అణచుకుంటూ, మనసును శాంతపరుచుకుని ఆమెను ఆప్యాయంగా పలకరించాడు.
“నా మాట వినమ్మా... ఇకపై నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలిపెట్టను. నిన్ను బాధపెట్టినందుకు నన్ను క్షమించు తల్లీ!” అంటూ నారాయణ కూతురి వైపు దీనంగా చూశాడు.
తండ్రి తనను సముదాయించడానికి చేస్తున్న ప్రయత్నం గీతికకు అర్థమవుతున్నా, ఆమె మనసులోని ఆవేదన మాత్రం తగ్గలేదు.
“మీరు నన్ను సముదాయించడానికి ప్రయత్నించడం బాగానే ఉంది నాన్నా! కానీ చివరికి నేనేం చేయాలి? నేను అనుకున్నట్టుగా, నాకు నచ్చినట్టుగా బతకడానికి నన్ను స్వేచ్ఛగా వదిలేయరా?” అంటూ ఆవేశంగా తన చేతిలోని బ్యాగ్‌ను నేలకేసి కొట్టింది.
కూతురి కోపాన్ని చూసిన నారాయణ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. ఆమె ఆవేదన వెనుక ఉన్న బాధను అర్థం చేసుకున్నట్టుగా తన స్వరాన్ని తగ్గించాడు.
“బుజ్జీ... నీ ఆవేశంలో అర్థం లేదని నేను అనను. నువ్వు పడుతున్న బాధను కూడా తక్కువ చేయను. కానీ నిన్ను ఇలా ఒంటరిగా వెళ్లనివ్వలేను. ఎందుకంటే నా కూతురు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. ఇకపై నీకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూసుకుంటాను. నా మాట వినమ్మా... నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు. ఈ నాన్న చేతులు జోడించి వేడుకుంటున్నాడని అనుకోకు... నీ కాళ్లు పట్టుకున్నానని భావించైనా సరే, ఇక్కడే ఉండు తల్లీ! నువ్వు నా దగ్గరున్నంతకాలం నీకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకుంటాను. మాట ఇస్తున్నాను!” అంటూ నారాయణ కళ్లలో నీళ్లు తిరిగాయి. చివరి మాటలు చెబుతుండగానే ఆయన గొంతు పూడుకుపోయింది.
తండ్రి కళ్లలో కన్నీళ్లు చూసిన గీతిక గుండె కరిగిపోయింది. ఆయన్ని ఇంకెంతమాత్రం బాధపెట్టలేక, ఒక్కసారిగా దగ్గరకు వెళ్లి గట్టిగా హత్తుకుంది. ఇన్నాళ్లుగా గుండెల్లో దాచుకున్న బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది.
కూతురిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, ఆమె తల నిమురుతూ సముదాయించాడు నారాయణ.
“బుజ్జీ... మా బుజ్జి... ముందు తాళం తీయమ్మా! లోపలికి వెళ్దాం. ఈ ఇల్లు నీది. నిన్ను ఈ ఇంటి నుంచి వెళ్లిపోమనే హక్కు నాకు కూడా లేదు. నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నీకోసం ఈ ఇల్లు కొన్నాను. నీ భవిష్యత్తుకు భరోసాగా ఆస్తిపాస్తులు కూడబెట్టాను. నీకు తోడుగా ఉంటారనే కదా తాతయ్య, నానమ్మలను కూడా ఇక్కడే ఉండమని కోరాను. ఇదంతా నీ కోసమే కదమ్మా! పద... లోపలికి వెళ్దాం!” అంటూ తాళం తీసి తలుపు తెరిచి, కూతురిని లోపలికి ఆహ్వానించాడు నారాయణ.
గడప దగ్గర కాసేపు నిలబడిన గీతిక, తండ్రి వైపు చూసి మౌనంగా లోపలికి అడుగుపెట్టింది.
ఆమెను చూసిన నారాయణ మనసు కాస్త కుదుటపడింది. అయినా కూతురు మళ్లీ తనను విడిచి వెళ్లిపోతుందేమోనన్న భయం ఆయన మనసులో ఇంకా మిగిలే ఉంది.
“బుజ్జీ... నాన్నగా నీకు నేను చెబుతున్న చివరి మాట ఇది. ఇంకెప్పుడూ ఈ ఇంటిని, నాన్నను వదిలి వెళ్లనని నాకు మాట ఇవ్వు!” అంటూ తన చేతిని కూతురి ముందు చాచాడు.
తండ్రి కళ్లలో కనిపిస్తున్న ఆర్తిని చూసిన గీతిక, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన చేతిని ఆయన చేతిలో ఉంచింది.
“అలాగే నాన్నా!” అంది చిరునవ్వుతో.
“ఇప్పుడే కదమ్మా నా బుజ్జి బంగారంలా కనిపిస్తున్నావు!” అంటూ కూతురి నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి, ఆనందంతో గుండెలకు హత్తుకున్నాడు నారాయణ.
ఎన్నో రోజుల తర్వాత తండ్రి ముఖంలో ఇంతటి ఆనందాన్ని చూసిన గీతిక మనసు కూడా సంతోషంతో నిండిపోయింది. తన కోసం ఇంతగా తపించే తండ్రిని బాధపెట్టకూడదనిపించింది.
“నాన్నా... బంగారం...” అంటూ ఏదో అడగబోయింది గీతిక.
ఆమె మాట పూర్తికాకముందే నారాయణ మాట్లాడటం ప్రారంభించాడు.
“నీ తమ్ముడు నిన్ను అడగని రోజంటూ లేదు బుజ్జీ! కానీ ఏం చేయాలి? నిన్ను ఇక్కడికి తీసుకొద్దామంటే మీ అమ్మ ససేమిరా అంటోంది. నువ్వు లేకపోవడంతో వాడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? పాపం... మొన్న కూడా ‘డాడీ... అక్కను మన ఇంటికి తీసుకొస్తాం కదా! అక్కను అలా ఒక్కదాన్నే వదిలేసి మీరు ఎలా ఉంటున్నారు డాడీ? తను ఎంత బాధపడుతుందో కదా!’ అంటూ ఏడ్చేశాడు. వాడి మాటలు వింటుంటే నా గుండె తరుక్కుపోయింది తల్లీ!” అన్నాడు నారాయణ బాధగా.
తమ్ముడికి తనపై ఉన్న ప్రేమను తలచుకున్న గీతిక మనసు ఆనందంతో నిండిపోయింది.
‘నిజంగా బంగారం... నేనంటే ఎంత అభిమానం! నేను దూరంగా ఉన్నా నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో!’ అనుకుంది మనసులోనే. ఆ ఆలోచనతో ఆమె పెదవులపై ఓ చిన్న చిరునవ్వు విరిసింది. అప్పటివరకు మనసును ముంచెత్తిన బాధ మధ్యలో, తమ్ముడి ప్రేమ ఓ చల్లని ఓదార్పులా ఆమె హృదయాన్ని తాకింది.
గీతిక , నారాయణ ఇద్దరూ గార్డెన్ హౌస్‌ నుంచి బయటకు వస్తూ తలుపులకు తాళం వేస్తుండగా, అటుగా రూమ్‌ వైపు వస్తున్న పప్పు కంటపడింది. ఆమెను ఆ సమయంలో అక్కడ చూసిన పప్పు, ఏదో జరగబోతోందన్న అనుమానంతో వెంటనే ప్రభ దగ్గరకు పరుగెత్తాడు.
“ప్రభా! ప్రభా!” అంటూ గట్టిగా పిలుస్తూ గది దగ్గరకు వెళ్లాడు.
పప్పు పిలుపులు విన్న ప్రభ బయటకు వచ్చాడు. పప్పు ముఖంలోని ఆందోళనను చూసి, గార్డెన్ హౌస్‌ విషయంలో ఏదో జరిగి ఉంటుందని ఊహిస్తూ అతని వైపు చూశాడు. పప్పు ఏదో చెప్పబోతుండగానే ప్రభ చూపులు అటువైపు మళ్లాయి.
గీతిక, నారాయణ ఇద్దరూ మెట్లు దిగుతూ కారు వైపు వెళ్తున్నారు.ఆ దృశ్యం చూడగానే ప్రభ మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది.
‘పప్పు చెప్పింది నిజమేనేమో! ఆ యముడు మళ్లీ తన జీవితంలోకి వచ్చి, పున్నమి వెన్నెలలా వెలిగే ఆమె జీవితాన్ని కప్పేస్తూ అమావాస్య చీకటిని తీసుకొస్తున్నాడేమో! ఈ రాత్రివేళ తనను తీసుకెళ్లడం ఏంటి? ఇన్ని రోజులు బాధపెట్టిన మనిషి ఇప్పుడు మళ్లీ ఏం చేయబోతున్నాడు? తను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మరో గార్డెన్ హౌస్‌లాంటి చీకటి జీవితంలోకి నెట్టేస్తాడా? అసలే ఎన్నో బాధలతో సతమతమవుతున్న ఆ అమ్మాయికి ఇంకేదైనా హాని తలపెడతాడేమో!’ అన్న సందేహాలు ప్రభ మనసును చుట్టుముట్టాయి.
అతని ఆందోళనను గమనించిన పప్పు మాత్రం సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.
“మళ్లీ మళ్లీ ఎందుకురా అలా అనుకుంటావ్‌? అప్పుడేదో ఆవేశంలో అలా చేసి ఉంటాడు. ఇప్పుడు తన కూతుర్ని వెతుక్కుంటూ వచ్చాడంటే, కచ్చితంగా తన తప్పు తెలుసుకుని ఉంటాడు. కూతురి మీద ప్రేమతోనే వచ్చి ఉంటాడు. అన్నీ చెడుగానే జరుగుతాయని ఎందుకు అనుకుంటావ్‌? కాస్త మంచిగా కూడా ఆలోచించరా!” అన్నాడు పప్పు సానుకూలంగా.
పప్పు మాటలు వింటున్నా ప్రభ మనసు మాత్రం కుదుటపడలేదు. అతని చూపులు గీతికను వెంబడిస్తూనే ఉన్నాయి.
“దీనంతటికీ కారణం ఆ భుజంగం కొడుకు... ఆ డర్టీ ఫెలో చేసిన పనికి పాపం ఆ అమ్మాయి ఇన్ని రోజులుగా శిక్ష అనుభవిస్తోంది. కానీ, వాడి కంటే పెద్ద శిక్ష నాకే పడినట్టుంది రా!” అన్నాడు ప్రభ బాధగా.
“నీకు శిక్ష ఏంట్రా?” అని అడిగాడు పప్పు.
“ఎప్పుడో ఒకసారైనా తన ముఖం చూడగలిగేవాడిని. తను నా ఎదురుగా ఉన్నప్పుడు కనీసం తనని కళ్లారా చూసుకుని మనసులోనే సంతోషించేవాడిని. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. తనను చూడాలన్న చిన్న కోరిక కూడా తీరకుండా పోతోంది. ఎందుకురా తను ఇలా చేస్తోంది? తన కోసం ఒక ప్రాణం ఎదురుచూస్తోందన్న చిన్న కనికరం కూడా లేదా? తను దూరంగా వెళ్తుంటే నా మనసు ఎంతలా విలవిలలాడుతుందో తనకు తెలియదా?” అంటూ తనలోని బాధనంతా బయటపెట్టాడు ప్రభ.
అతని మాటల్లో గీతికపై ఉన్న ప్రేమ ఎంత లోతైనదో పప్పుకు అర్థమైంది. కానీ ఆ ప్రేమను ఆమెకు తెలియజేసే అవకాశం కూడా ప్రభకు లేకుండా పోవడం అతడిని మరింత బాధపెట్టింది.
ఇంతలో గీతిక, నారాయణ ఇద్దరూ కారు ఎక్కారు. ప్రభ రౌండ్ నుంచి కిందకి దిగి వచ్చాడు .కారు నెమ్మదిగా కదిలి గార్డెన్ హౌస్‌ పరిసరాలను దాటి వెళ్లిపోయింది.వాళ్లు వెళ్లిపోయినా ప్రభ చూపులు మాత్రం ఆ కారు వెళ్లిన దారినే చూస్తూ ఉండిపోయాయి.
తన మనసుకు దగ్గరైన అమ్మాయి కళ్లముందే దూరమవుతుంటే, ఆపే హక్కు తనకు లేదన్న నిజం అతడిని లోలోపల కుంగదీసింది.
ఎన్నో ఆశలతో ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించుకోవాలని కలలు కన్నాడు. కానీ, తన మనసులో చోటు సంపాదించుకున్న ఆ అమ్మాయి జీవితంలోనే ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటి నుంచి బయటపడటానికి ఆమె నిరంతరం పోరాడుతోందని అతనికి తెలుసు.
‘తప్పు నాదే! నేను మాత్రమే తనని ఇష్టపడుతున్నాను. నా మనసులో ఆమెకు ఎంతటి స్థానం ఉందో తనకు తెలియదు. అసలు తన మనసులో ఏముందో కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు తను నా కోసం ఆగాలని ఎలా ఆశించగలను?’ అని తనను తానే ప్రశ్నించుకున్నాడు.
అతని ఆలోచనలు గీతిక జీవితంలో ఎదురవుతున్న సమస్యల చుట్టూ తిరిగాయి.
‘ముందు తను ఈ బాధల నుంచి బయటపడాలి. తన పయనం ఎటు? తన లక్ష్యం ఏంటి? ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తన కాళ్ల మీద తాను నిలబడాలని చూస్తోంది. అయినా అడుగడుగునా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ఒకవైపు కుటుంబంలో అమ్మతో సమస్యలు... మరోవైపు సమాజంలో మనుషుల నుంచి అవమానాలు... ఇప్పుడు తండ్రితో కలిసి ఎక్కడికి వెళ్తుందో? మళ్లీ ఏదైనా సమస్యలో చిక్కుకుంటుందేమో!’ అన్న ఆలోచనలతో ప్రభ మనసు మరింత భారమైంది.
‘పోనీ, తనకు తోడుగా తాతయ్య, జేజీలు అయినా ఉన్నారా అంటే అదీ లేదు. వాళ్లు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఫోన్ చేసినా కాంటాక్ట్ కావడం లేదు. వాళ్లను నారాయణ ఎక్కడికి పంపించాడో ఏమో! తనకు అండగా నిలిచే వాళ్లే లేకపోతే, పాపం తను ఒంటరిగా ఇన్ని సమస్యలను ఎలా ఎదుర్కొంటుంది?’ అని తలచుకుంటూ గీతిక పరిస్థితిని ఊహించుకుని బాధపడ్డాడు.
ప్రభ ముఖంలో కనిపిస్తున్న వేదనను చూసి పప్పు అతని భుజంపై చేయి వేసి ఓదార్చాడు.
“బాధపడకు ప్రభా! మనం కోరుకున్నవన్నీ మనకు నచ్చినట్టుగా జరగాలని లేదు. కానీ, మనస్ఫూర్తిగా కోరుకున్న మంచికి ఏదో ఒక రోజు దారి దొరుకుతుంది. ఎవరి జీవితంలో ఏది రాసిపెట్టి ఉంటే అది జరిగి తీరుతుందని అంటారు. మనం మాత్రం తనకు మంచే జరగాలని కోరుకుందాం. తను ఈ సమస్యలన్నింటినీ దాటుకుని సంతోషంగా ఉండాలని ఆశిద్దాం. ఆ మంచిరోజు తప్పకుండా వస్తుందని నమ్ముదాం! నీ మనసులోని మాట కూడా నిజమవాలని ఆశిద్దాం అన్నాడు పప్పు.
పప్పు మాటలు ప్రభకు కొంత ఊరటనిచ్చినా, గీతిక దూరమైందన్న బాధ మాత్రం అతని మనసును వీడలేదు.
ఆమె తనకు దక్కుతుందో లేదో తెలియదు. కనీసం తన జీవితంలో మళ్లీ ఆమెను చూసే అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు. అయినా, ఆమె సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకున్నాడు.ఎందుకంటే, ప్రేమంటే మనకు నచ్చినవారిని మన దగ్గరే ఉంచుకోవడం మాత్రమే కాదు... వారు ఎక్కడున్నా, ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం కూడా!
అంతలోనే ప్రభ ఫోన్‌ మోగింది.