Read Ventaade Needalu - 18 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • ప్రణయ గీతిక - 6

    ట్రైనింగ్ ముగించి వచ్చిన ప్రభ అమ్మకు తాను కూడా సాయం చేయాలని...

  • ఆత్మశాంతి

    జిల్లా గ్రంథాలయం వెనుకనున్న పాత బంగ్లాలో ప్రముఖ న్యాయవాది వి...

  • వెంటాడే నీడలు - 18

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • రక్తపు రుణం

    అది ఊరి చివరన ఒంటరిగా ఉన్న ఒక పాతకాలపు పెంకుటిల్లు. గోడల నిం...

  • నైవేద్యం

    కార్తీకమాసం ఆరంభమైన తొలి సోమవారం. పల్లె చివరనున్న చిన్న శివా...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెంటాడే నీడలు - 18

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"తను పద్దెనిమిది సంవత్సరాలకి దగ్గర పడుతూండగా. తన కళ్ళల్లో మెరుపులు చూపించడం, తనవైపు లాక్కోవడం లాంటిద్వారా తాను ఆమెని ఇష్టపడుతున్నాడని తెలియచేస్తాడు. అయితే అప్పటివరకూ ఆమె పురుష సంగమం లేకుండా ఉండాలి."

"అందుకు కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ కబుసా తప్పకుండా నన్ను ఎన్నుకుంటాడన్న నమ్మకం నాకుంది." అదే ధృడత్వంతో అంది మల్లిక.

"నీకు ఒక మంచి మనిషిని ఇచ్చి పెళ్ళిచెయ్యాలని నీ మామ్మ ఆలోచిస్తూంది. నీ నాన్న కూడా అదే ఆలోచనతో వుండివుంటాడు. ఎవడూ తన భార్య కబుసా కోరినట్టుగా ఉండడానికి ఒప్పుకోడు. నువ్వు కబుసా గురించి ఆలోచించడం మానెయ్. " సింహరాజు అన్నాడు.

"సరేలే, ఇప్పుడేం నేను కబుసా ని పూజించడం మొదలుపెట్టలేదు కదా." మల్లిక అంది. "కానీ కబుసా నన్ను ఎన్నకోవడం జరిగితే, నేను ఖచ్చితంగా పూజిస్తాను ఆ దేముడిని. ఆ శక్తులు నాకు చాలా ఆసక్తి కలిగిస్తూ వున్నాయి."

"ఒకవేళ కబుసా నిన్ను ఇష్టపడితే, కబుసా మార్గాన్ని నువ్వు అనుసరించదలుచుకుంటే, నువ్వెలా వుండాలో నీకు తెలుసును కదా." యస్మణి అడిగాడు.

"ఆ తెలుసును. అది నాకు అంగీకారమే." యస్మణి మొహం లోకి చూస్తూ చిరునవ్వుతో అంది మల్లిక.

ఆ తరువాత కూడా మల్లిక తన ఇంటికి వస్తూ ఉండడం, యస్మణి తో మాట్లాడడం అవీ జరిగాయి. యస్మణి సాముదమ్మ ఇంటికి కూడా వచ్చి, ఆవిడతో కూడా కొన్నివిషయాలు మాట్లాడి తెలుసుకున్నాడు.

"నాకు కొంత కాలం ఇలాగె ఇక్కడే వుండి  ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని వుంది. నీకు అందుకు అభ్యంతరం ఏమీ లేదు కదా."

"అభ్యంతరం దేనికి? మీరు నాకు ఇస్తూన్న డబ్బుల వల్ల నాకూ చాలా ఉపయోగంగానే వుంది. మీరు ఇక్కడ ఎంతకాలం వుంటానన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు." నవ్వి అన్నాడు సింహరాజు. 

అలా రోజులు గడుస్తూవున్న క్రమం లో యస్మణి కి సింహరాజు కి మల్లిక మీద వున్న ఆకర్షణ కూడా బోధపడింది.

"నువ్వు ఈ ఆరాధనలు అవీ మాని, ఆ అమ్మాయిని పెళ్ళిచేసుకుని హాయిగా వుండొచ్చుకదా. మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఆసక్తి ఉందని నాకు బోధపడింది. ఈ కబుసా వల్ల ఎదో వస్తుందని ఆలోచించేకన్నా, అలా మీరిద్దరూ జీవించడం బావుంటుందని నా అభిప్రాయం." ఒకరోజు యస్మణి అన్నాడు.

"కబుసా సమక్షంలో ఆలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి?" కోపంగా అన్నాడు సింహరాజు. "తన మామ్మ కి తనకి ఒక మంచి వుద్యోగం చేసే వాడిని తీసుకొచ్చి పెళ్ళిచయాలని ఆలోచన. తనకి కూడా నా మీద అంతగా ఆసక్తి లేదు.

అప్పటికే మల్లిక తల్లి చనిపోయిన విషయం, మల్లిక తండ్రి ఎక్కడో వుద్యోగం చేస్తూ తనని పట్టించుకోకుండా వున్న విషయం చెప్పాడు యస్మణి కి సింహరాజు.

"ఎందుకనో ఈ అమ్మాయిని కబుసా ఎంచుకుంటాడనిపిస్తోంది. ఈ అమ్మాయా ఇలా ఆసక్తి చూపిస్తూ వుంది అతనిమీద. కబుసా చేత ఎంచుకోబడితే తప్పకుండా తనని పూజిస్తుంది. అలా జరిగే లోగానే తను ఎవరినన్నా పెళ్ళిచేసుకుంటే మంచిది కదా. కబుసా ఉచ్చులో ఈ అమ్మాయిపడ్డం నాకిష్టం లేదు. తానొక మంచి జీవితం గడపాలి."

"ఎన్నిసార్లు చెప్పినా అలా మాట్లాడ్డం మానరు కదా" చికాకు పడుతూ అన్నాడు సింహరాజు. "అయినా ఇంకా తనకి పద్దెనిమిది సంవత్సరాలు రానే లేదు. ఎలా పెళ్ళిచేసేస్తారు?"

"ఈ పల్లెటూళ్ళో అవన్నీ పట్టించుకుంటారని నేను అనుకోవడం లేదు. నిజం చెప్పు ఇక్కడ అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు నిండాకే పెళ్లిళ్లు అవుతున్నాయా?" యస్మణి అడిగాడు.

 "సరే లెండి. ఆ అమ్మాయి పెళ్ళిచేయాల్సినది, ఆమె మామ్మ ఇంకా నాన్న. మీరు నేనూ కాదు. మనం ఆ విషయం గురించి అలోచించి ప్రయోజనం ఉండదు." ముక్తాయింపుగా అన్నాడు సింహరాజు.  

ఆ రోజు విపరీతమైన జ్వరం వచ్చి, విరోచనాలతో చాలా బాధపడ్డాడు యస్మణి. అంతే కాకుండా ఆరోజు రాత్రంతా ఆ ఒంటె తల మనిషి తనని వెంటాడి హింసిస్తున్నట్టుగా కలలు వచ్చాయి.

"ఇంక ఆ కబుసా కి వ్యతిరేకంగా వుందనిపించేది ఏదీ నేను మాట్లాడను. రాత్రంతా నేను భయంకర నరకం చూసాను." యస్మణి అన్నాడు.  

తన తప్పు తెలుసుకోవడం వల్లనేమో యస్మణి కి త్వరగానే నయమయింది ఏ మందూ తీసుకోకుండానే.

ఆ రోజు తను మల్లిక ఇంటికి వెళ్లేసరికి, మల్లిక తండ్రి భుజంగరావు వున్నాడు. భుజంగరావు కి తను వాళ్ళింటికి రావడం ఇష్టం ఉండదు. కానీ తన తల్లే తనని ఎక్కువగా ఇష్టపడుతూ ఉండడం వల్ల ఏమీ అనలేడు.

"సరే. ఇదేమీ మంచి విషయం కాదని నేనను. నీకు ఒక మంచి సంభందం చూసి పెళ్ళిచేద్దామా అని నేనే అనుకుంటున్నాను. నీ యజమాని గారికి నచ్చి తన కూతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేద్దామనుకుంటూ ఉంటే, అది ఆ అమ్మాయికి కూడా ఇష్టమైతే నేనెందుకు కాదంటాను? ఇదొక మంచివిషయమే." సాముదమ్మ అంది.  

"అయితే నేను నా యజమానిగారికి నాకు తన కూతుర్ని పెళ్లిచేసుకోవడం లో ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పనా?" ఆనందం చాలా స్పష్టంగా వుంది భుజంగరావు మొహం లో.

"కానీ ఇక్కడ నాదొక షరతు." సాముదమ్మ గొంతు స్పష్టంగా, దృఢం గా వుంది. "మల్లిక ని మీతో పాటుగా ఉంచుకోవాలి. నీ రెండోపెళ్ళాం తనని సొంత కూతురికన్నా తనని ఎక్కువగా చూసుకోవాలి."

"మామ్మా నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు. నేను ఇక్కడే వుంటాను." మల్లిక అంది.   

"నువ్వు నోర్ముయ్. నా మాటలకి అడ్డురాకు." మల్లిక మొహంలోకి చూస్తూ అలా కోపంగా అన్నాక మళ్ళీ భుజంగరావు మొహంలోకి చూసింది సాముదమ్మ. "తనకి పదమూడేళ్లు వచ్చినా ఏ చదువు సంధ్యా లేకుండా ఇలా వుంది. నువ్వు తనని పట్టించుకోవడమే మానేసావు. ఎదో నువ్వు సంపాదించుకుంటున్న డబ్బుతో తనకేదో మంచివాడిని చూసి పెళ్ళిచేస్తావనుకుంటే ఇప్పుడింకో పెళ్లి కూడా చేసుకుంటున్నావు."

"మల్లిక పెళ్లికి సంభందించిన డబ్బు నేను ఏర్పాటు చేస్తాలే." భుజంగరావు అన్నాడు.

"అదంతా నాకు తెలీదు. తను నీతో ఉండాలి. ఆ అధికారం తనకి వుంది నీ కూతురుగా. ఇది కుదరకపోతే నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను." అదే దృఢత్వం వుంది సాముదమ్మ గొంతులో.

"సరే అయితే నేను మాట్లాడతాను." అన్నాడే కానీ భుజంగరావు మొహం నిండా అయిష్టమే వుంది.

"ఇంతకీ నీకు పెళ్లయిందని, నీకో కూతురు కూడా ఉందని వాళ్ళకి చెప్పావా లేదా?"

"ఆ, అది కూడా చెప్పకుండా ఎలా వుంటాను?" అలా అన్నాక కోపంగా అక్కడనుండి వెళ్ళిపోయాడు భుజంగరావు            

"మామ్మా, నేను తన కూడా ఉండడం నాన్న కి ఇష్టం లేదని తెలిసిపోతూనే వుంది. నేనెందుకు బలవంతం గా వెళ్లి వాళ్ళతోటి ఉండాలి? నీతోటె వుంటాను." మల్లిక అంది.

"అవును సామమ్మా, ఎక్కడన్నా సవతితల్లి తన భర్త మొదటి భార్య కూతుర్ని ప్రేమగా చూసుకుందా? అందులోనూ నీ కొడుక్కి తన కూతురు తమ కూడా ఉండడం ఇష్టం లేదు. అలాంటప్పుడు తననెందుకు అక్కడికి పంపించాలి?" సింహరాజు అన్నాడు.

"తన కూతురు కూడా ఉండకపోతే పూర్తిగా తనని మర్చిపోయి ఊరేగుతాడు. అంతేకాకుండా ఈ పల్లెటూళ్ళో మనకూడా వుండి తను పొందుతున్నదేమిటి నీతో తిరగటం తప్ప. వెళ్లి వాళ్లతో పాటుగా వుండనీ కొన్నిరోజులు. ఏదీ సరిగ్గా లేకపోతె అప్పుడే ఆలోచిద్దాం." సాముదమ్మ  అంది.   

అలాగ భుజంగరావు పెళ్లి అయిపోయింది. పెళ్లి చాలా దూరప్రాంతం లో అవుతోందని అందుకని తన తల్లి కానీ, కూతురు కానీ, అక్కడివాళ్ళు ఎవరూ కాని,  ఆ పెళ్ళికి రానవసరం లేదని చెప్పేసాడు భుజంగరావు. తను తన కూతుర్ని కూడా తీసుకెళ్లి వుంచుకోవడానికి ఒప్పుకున్నందువల్ల తక్కిన విషయాలేవీ పట్టించుకోలేదు సాముదమ్మ.  

&&&

"ఈ క్షణం వరకూ అవే ఆలోచనలతో వున్నా." లోపలి వచ్చిన యస్మణి తో అన్నాడు సింహరాజు. "నిజంగా ఈ పరిస్థితి అసలు ఊహించినది కాదు కదా."

"మనం ఊహించినది కాకపోవచ్చు, కానీ సబబే." సింహరాజు కి అపోజిట్ లో వున్నా కుర్చీలో కూలబడుతూ అన్నాడు యస్మణి. "మల్లిక అనే అమాయకురాలికి జరిగిన అన్యాయానికి ప్రతిచర్య ఉండకుండా ఉంటుందా?"   

"కానీ ఆ ప్రతిచర్యలో మళ్ళీ బాధపడుతూవున్నది కూడా మల్లికే  కదా. ఇది ఏ రకంగా న్యాయం?"

కుర్చీలో వెనక్కి జారగిలబడి నవ్వాడు యస్మణి. "కబుసా ప్రభావం వున్న మనకెవరికీ న్యాయాన్యాయాల గురించి ఆలోచించే అవకాశం లేదు. అసలు కబుసా కి అయిష్టమైన పనిచేసినందుకే మల్లిక కి అలా అయిందా అన్న ఆలోచన కూడా నాకుంది."

"తనకి అయిష్టమైన పనిచేసినందుకు కబుసా శిక్షిస్తాడేమో కానీ మరీ ఆ ప్రకారంగా అని నేననుకోను. అది కబుసా నిర్ణయం వల్ల జరిగినది కాదు. మీరు చెప్పినట్టుగా ఎదో కారణంగా ఆసక్తుడైపోయి కబుసా తనని ఆ సమయం లో కాపాడలేకపోయాడు, అంతే." సింహరాజు అన్నాడు.

"ఎంత దారుణమైన విషయం! ఎంత ఇష్టం లేకపోయినా తనని ఆ ప్రకారంగా దారితప్పించే ప్రయత్నం చేస్తారని నేను అనుకోలేకపోయాను." నిట్టూరుస్తూ అన్నాడు యస్మణి.

"తనని మనం అప్పుడు కాపాడలేకపోయాం అన్న విషయం కన్నా కూడా, ఇప్పుడు ఈ జన్మలో ఎలా కాపాడాలా అన్న విషయం గురించే నేను ఎక్కువ ఆలోచిస్తూవున్నాను."

"తనని కాపాడే విషయం లో మనం ఎక్కువగా ఆలోచించాల్సింది కబుసా గురించే."

నవ్వాడు సింహరాజు. "ఇటువంటి విషయాలమీద ఎలాంటి నమ్మకం లేకుండా ఎదో పరిశోధన చేసుకోవడానికి ఆ గ్రామానికి వచ్చారు. ఇప్పుడు వీటిమీద పూర్తి నమ్మకానికి వచ్చారు."

"ప్రతీదీ ఒక కారణం వల్లే జరుగుతుందనిపిస్తోంది. బహుశా ఆ కబుసా కి నాకు కిందటి జన్మలో కూడా ఎదో సంభందం వుండివుంటుంది. అందువల్ల ఈ జన్మలో కూడా నాతో ఎదో జరిపించుకోవడానికి ఆ గ్రామం రప్పించాడు." నిట్టూర్చాడు యస్మణి. "మనకి ముఖ్యమైన సమస్య ఇటువంటి మానవాతీత శక్తులని ఎంతమాత్రం నమ్మని వ్యక్తులతో మనం వ్యవహరించాల్సివుంటుంది."

మరోసారి నవ్వాడు సింహరాజు. "మీరు అనవసరం గా విచారపడుతున్నారు. ఒకసారి కబుసా తన పూర్తి ప్రభావం చూపించడం మొదలుపెట్టిన తరువాత వాళ్ళకి నమ్మడానికి ఎంతోకాలం పట్టదు. నేనింతకముందే మీకీ విషయం చెప్పాను."

యస్మణి కూడా నవ్వాడు. "నువ్వు చెప్పింది కూడా నిజమేలే. నేను అనవసరంగానే భయపడుతున్నాను." కాస్త ఆగాక అన్నాడు “కానీ ఆ రోజుల్ని నేను మర్చిపోలేను. నేను కేవలం పరిశోధన కోసమే వచ్చినా ఆ గ్రామం తో నాకెంతో అనుబంధం పెనవేసుకుంది, మల్లిక తో కూడా. నాకు నువ్వూ మల్లికా భార్యా భర్తలుగా జీవించాలని కోరికగా ఉండేది. అందుకే నువ్వు కబుసా సమక్షం లో అటువంటి మాటలు మాట్లాడొద్దన్నా సరే నేనలా అనకుండా వుండలేకపోయేవాణ్ణి."

"సరిగ్గా మల్లిక తన తండ్రి ఇంటిదగ్గరనుండి తిరిగి వచ్చేడానికి కొద్దిరోజులముందే మీరు అక్కడనుండి వెళ్లిపోయారు. అంతా నేను ఊహించినట్టుగానే జరిగింది. ఎక్కడన్నా సవతి తల్లి తన భర్త ఇంకో భార్య పిల్లల్ని ప్రేమగా చూస్తుందా? అక్కడ ఎటువంటి బాధలు పడిందో తెలియదు కానీ, తను ఇంక అక్కడ వుండే ప్రశ్న లేదని మాత్రం తెగేసి చెప్పేసింది. ఆ వచ్చినరోజు సాయంత్రమే నా దగ్గరికి వచ్చింది. ఆ రోజే కబుసా కళ్ళల్లో మెరుపుని చూసింది. తను గట్టిగా తనవైపు లాగబడింది. కబుసా తను ఎన్నుకున్న కన్నెపిల్లకి చూపించే చిహ్నాలు అవేగా."

యస్మణి మళ్ళీ ఆ గ్రామం వెళ్ళినప్పుడు ఈ విషయాలు చెప్పాడు సింహరాజు. అయినా అడ్డుచెప్పకుండా మౌనంగా వింటున్నాడు యస్మణి.

"నేను కబుసా గురించి తనకి పూర్తిగా చెప్పాను. తన దృష్టిని మళ్లించడానికే ప్రయత్నించాను. కానీ తాను మానసికంగా చాలా వ్యాకులపడుతూ వుంది. బహుశా అక్కడ వాళ్ళు తనని చాలా బాధలు పెట్టివుంటారు. వాళ్ళ మీద పగతీర్చుకోవడానికి కబుసా శక్తులు అవసరం అనుకొని వుంటుంది. అందుకని కబుసా ని పూజిస్తానని పట్టుపట్టింది. నేనూ కాదనలేకపోయాను."

"ఆ అమ్మాయి అలా ఆలోచించడం లో ఆశ్చర్యం ఏముంది?" ఇచ్చిన చిన్న గ్యాప్ లో యస్మణి అన్నాడు.

"అసలు తను వుండవలసినట్టుగా ఉంటే ఎలా ఉండేదో? వీళ్లూ వాళ్ళూ అని లేకుండా తను ఎన్నుకున్న కన్నెపిల్లల్లో కూడా కబుసా శృంగార వాంఛని అలాగే రేకిస్తాడు. అందువల్లే ఆ రోజు తనకి అంత వాంఛ కలిగింది. నేను అలోచించి తనని ఆపి ఉండాల్సింది."

"సరేలే, ఇప్పుడా జరిగినదాని గురించి అలోచించి ప్రయోజనం ఏముంది?" యస్మణి అన్నాడు. "అయినా ఒక అమ్మాయి అది కావాలని అంతగా మీదపడితే ఎవెరికన్నా తట్టుకోవడం కష్టమే. అందులో నువ్వూ కబుసా ప్రభావం లోనే వున్నావు. అందువల్ల నీలోను వాంఛ ని అలాగే రేకెత్తిస్తూ ఉంటాడు కదా."           

"సామమ్మ మా ఇద్దరికీ పెళ్ళిచేద్దామన్న నిర్ణయానికి వచ్చి ఆ విషయం నాకు చెప్పింది. దానికి నాకు ఆనందించాలో, విచారించాలో బోధపడలేదు. తన మనవరాలికి ఎప్పుడు ఒక మంచి సంభందం తీసుకురావాలనుకుంటూ వుండేది. కానీ నేను మల్లిక కబుసా చేత ఎన్నుకోబడ్డం గురించి, ఇంకా తను కబుసా ని పూజించడం ప్రారంభించడం గురించి, మేము చేసిన తప్పు గురించి చెప్పినప్పుడు ఎంత హడలిపోయిందో. "

"ఆవిడకి ఈ కబుసా గురించి తక్కిన అటువంటి దేవుళ్ళగురించి చాలా జ్ఞానం వుంది. ఒకప్పుడు ఆవిడ కుటుంబం కూడా అటువంటి దేవుళ్ళని, దేవతలని ఆరాధిస్తూ ఉండేది అని చెప్పింది నాకు. వాటి గురించి ఆలోచించడం, వాటిమీద పరిశోధన చెయ్యడం ప్రమాదకరం అని నాకు చెప్పింది ఆ రోజు. నన్ను వీలైనంత తొందరగా అక్కడనుండి వెళ్లిపొమ్మని కూడా చెప్పింది." తను సాముదమ్మ తో ట్లాడిన రోజుని గుర్తుచేసుకుంటూ అన్నాడు యస్మణి.

"ఆ రోజే పెద్ద జ్వరం వచ్చింది తనకి. మందులకు తగ్గలేదు. కబుసా నుండి తన మనవరాలిని కాపాడే బాధ్యత నాదే అని చెప్పింది. కానీ ఆపద ఆ ప్రకారంగా తన మనవరాలికి ముంచుకురాబోతూందని ఆలోచించలేకపోయింది."

ఇంక ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా వుండిపోయాడు యస్మణి.

"తను చేసిన పనివల్లే, తను అలా తొందరపడ్డం వల్లే తన మామ్మ చనిపోయిందనుకుంది మల్లిక. తను చేసిన తప్పుకి తన మామ్మ ని చంపి కబుసా అలా శిక్షించాడనుకుంది. నేనది కారణం కాదని ఎంత చెప్పినా వినలేదు."

ఈ సారి కూడా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగానే వుండిపోయాడు యస్మణి.

"ఆ రోజు నాకింకా గుర్తుంది. నాకు పనుల మీద పట్నం వెళ్లాల్సిన అవసరం వచ్చింది. మీరు లేకపోయాక నాకు డబ్బుకి కూడా ఇబ్బందివచ్చింది. వూళ్ళో పనులు లేక పట్నం వెళ్లి చెయ్యాల్సిన పరిస్థితి. నేనక్కడే రెండురోజుల పాటు వుండాల్సివస్తుందని ముందే చెప్పేసారు. కానీ మల్లిక కి మాత్రం నేను వెళ్లడం అసలు ఇష్టం లేదు. తన మామ్మ పోయిన దిగులుతో ఇంకా చాలా బాధగానే వుంది." ఎంత వద్దనుకున్నా ఆ గతం మళ్ళీ దాడిచేసింది సింహరాజు మీద.  

&&&

"నా మామ్మ పొలం వుండనే ఉందిగా. అది చూసుకుంటే సరిపోదా? నువ్విప్పుడిలా ఏవో పనులంటూ ఇలా పట్నం వెళ్లడం దేనికి?" విషయం సింహరాజు చెప్పగానే మల్లిక అంది.

"నీ మామ్మ పొలంలో వరి వేసాం. అది చేతికి రావడానికి కొంతకాలం పడుతుంది. ఈ లోగా మనం బతకాలి కదా. ఆ యస్మణి వెళ్ళిపోయాక చేతిలో డబ్బులు అసలు లేవు." సింహరాజు అన్నాడు. "వూళ్ళో పనులున్నా కొంత బావుండేది. ఇక్కడ పనులు ఏవీ లేవు."

"నాకెందుకో చాలా భయంగా వుంది. ఏదో జరగరానిది జరగబోతూందనిపిస్తోంది." జరగబోతూన్నది ముందే పసిగట్టినట్టుగా ఎదో భయం వుంది మల్లిక మొహం లో.

"నువ్వు అనవసరంగా భయపడకు. ఈ రెండురోజులు పనిచేయ్యగానే నా చేతిలోకి కొంచెం డబ్బులు వస్తాయి. నీ గురించి ఏదోఒకటి తెస్తాను." మల్లిక  లో భయం అలా చూస్తూ సింహరాజు కి కూడా అసలు వెళ్లాలని లేదు. డబ్బులు అవసరం అంతగా లేకపోతె అసలు వెళ్ళివుండేవాడు కాదు.

"నువ్వు జాగ్రత్తగా రా. నాకంతే చాలు." సింహరాజు ని కౌగలించుకుని తన కుడిబుగ్గమీద  ముద్దుపెట్టుకుంటూ అంది. "నువ్వు తిరిగి రాగానే మనం పెళ్లిచేసుకుందాం. మామ్మ కోరిక అదే కదా. మనకింక ఏ కబుసాలు, శక్తులు వద్దు."

"అలాగే." తనూ రెండుచేతులతో మల్లిక ని కౌగలించుకుని నెత్తిమీద ముద్దుపెట్టుకుంటూ అన్నాడు సింహరాజు.

"నేను మొదటినుండి నీకు చెప్పనిది నాకు నీ మీద వున్నప్రేమ. మామ్మ నాకు మంచి సంభందం తెచ్చి చేస్తానని చెప్పినప్పుడల్లా అరిచి నాకు నీ మీద వున్నప్రేమ గురించి చెప్పాలనిపించేది, కానీ మామ్మ ఒప్పుకోదని చెప్పలేదు. కానీ నాకు మా నాన్న డబ్బిచ్చి నాకు మంచి సంభందం వచ్చేలా చేస్తాడన్న నమ్మకం ఎప్పుడూ లేదు. అంతపని నా మామ్మ చెయ్యలేదు. పెళ్లి నీకూ నాకే జరుగుతందని నాకు ఎప్పుడో తెలుసు."

"మరి నీకు నా మీద వున్న ప్రేమ గురించి ఎప్పుడు చెప్పలేదేం?" నవ్వుతూ ఇంకా దగ్గరికి తీసుకున్నాడు మల్లిక ని సింహరాజు.

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)