Read Ventaade Needalu - 8 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • THE GHOST - 3

     ఆదిత్య ఓకే ఇక నేను చెప్పడం మొదలు పెట్టాలి అని అనుకుంటూ నేను...

  • ఎవరు....? - 12

    Part -12సమయం : ఉదయం 10:20 గంటలు.విజయవాడ కమీషనరేట్ కార్యాలయంల...

  • వెంటాడే నీడలు - 8

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • వెంటాడే నీడలు - 7

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • వెంటాడే నీడలు - 6

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెంటాడే నీడలు - 8

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"సరే రాజూ. ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటి? నాకు ఎందుకు సడన్గా ఇలా అయింది? ఆ వివరాలు కొంచెం తెలిస్తే చెప్పు."

"మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలానే వున్నాయి. మీరు నాకూడా నేనుండే చోటికి వచ్చినా సరే, లేదూ మీరే నన్ను మీరు ఉండేచోటికి తీసుకువెళ్లినా సరే. "

"నేనుండే చోట్లోనే కొంతకాలం పాటు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలన్నది నా ఆలోచన. కాసేపట్లో ఇక్కడికి వచ్చే ఫ్లైట్లో నేను నా ఇల్లు వుండే టౌన్ కి వెళ్ళిపోతున్నాను."

"నేనూ ఇదే ఫ్లైట్లో మీరు వెళ్లే టౌన్ కి టికెట్ తీసుకునే వున్నాను." తన జేబులోనుండి టికెట్ తీసి చూపించాడు రాజు. "నాకైతే మీ కూడా రావడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు."

"నువ్వు చాలా ప్రెపేర్డ్ గా ముందుచూపుతో వున్నావు." నవ్వాడు యస్మణి. "నేను వంటరిగానే వుంటూవుంటాను. నాతోపాటుగా నువ్వెంతకాలం వున్నా నాకొచ్చిన ఇబ్బంది మాత్రం ఏమీ లేదు."    

"కొన్ని విషయాల్లో ప్రెపేర్డ్ గానే ఉండాలి. ఇప్పుడు సమస్య అలాంటిది." నిట్టూర్చాడు అతను. "నేను మీరు నాతో వుంటాను అని చెప్పిన ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ మీ శిష్యులు మీరు ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు తిరిగివస్తారు అన్న వివరాలు ఇచ్చారు. అదృష్టవశాత్తు మీరు మీ షెడ్యూల్ తప్పలేదు." 

&&&

"కొన్ని తప్పులు మనం చేసిన తరువాత అటువంటి తప్పులు చేసివుండకూడదు అనుకుంటాం. వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా మనకి ఉండదు. మల్లిక విషయం లో నేను చేసిన పొరపాటు అలాంటిదే. తనని కబుసా ని ప్రసన్నం చేసుకోవడానికి సహకరించి వుండకూడదు. ఒకవేళ అది చేసివున్న, కబుసా కి వచ్చే ఆగ్రహం మర్చిపోయి తనతో సంభోగించి వుండకూడదు. అప్పుడా పొరపాట్లు చేసివుండకపోతే ఇప్పుడీ పరిస్థితి వచ్చివుండేది కాదు." నిట్టూరుస్తూ అన్నాడు రాజు.

ఫ్లైట్ లో వేరు, వేరు సీట్లు అయివుండడం వల్ల ఇద్దరికీ ఏం మాట్లాడుకోవడం అవ్వలేదు. తరువాత ఎయిర్ పోర్ట్ నుండి యస్మణి ఇంటికి వున్న అరగంట జర్నీ లోనూ ఏమీ మాట్లాడుకోలేదు. యస్మణి ఇంటికి చేరుకున్నాక, తను ఇచ్చిన కూల్ డ్రింక్స్ తాగి, హాల్లోవున్న కుర్చీల్లో సెటిల్ అయ్యాక పదినిమిషాల క్రితం మాటలు ప్రారంభం అయ్యాయి ఇద్దరిమధ్య.

"జరిగింది తప్పించుకోగలిగిన విషయం లా నాకు అనిపించడం లేదు." కుర్చీలో వెనక్కి జారగిలబడి ఎక్కువ కంఫర్ట్ కి సెటిల్ అవుతూ అన్నాడు యస్మణి. "కబుసా కరుణ కోసం పాకులాడేవారు చాలా మంది వున్నారు. మల్లిక ఎంచుకున్నట్టుగా కబుసా చేత ఎంచుకోబడేవాళ్లు చాలా తక్కువమంది. ఎప్పుడైతే మల్లిక ని కబుసా ఎంచుకున్నాడని నీకు తెలిసిందో, తనని ఆరాధించడానికి మల్లిక ని నువ్వు ప్రోత్సహించావు. ఆ సమయంలో మల్లిక కి వేరే ఏమీ లేదు. తనకి కొత్త శక్తుల మీద ఆసక్తి కలిగింది. సో, కబుసా ని ఆరాధించడం లో ఆసక్తి చూపించింది."

"తను కొంతమంది మీద పగతో రగిలిపోతూవుంది. ఆ శక్తులతో వాళ్ళమీద పగ తీర్చుకోవచ్చని తన అభిప్రాయం." రాజు అన్నాడు.

"అవును. నాకు తెలుసు." యస్మణి తలూపాడు. "ఆ సమయం లో తాను మంచి యవ్వనం లో వుంది. నీ మీద ప్రేమతోనూ వుంది. నీతోటి అది కావాలనుకుంది. ఇంక ఆ సమయం లో తను వేరే ఏ విషయం గురించి ఆలోచించలేకపోవడం లోనూ ఆశ్చర్యం లేదు. తను అంతగా అది కావాలని నీ దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు కాదనలేకపోవడం లోనూ ఆశ్చర్యం లేదు."

"నా తప్పుని నేను అంత తేలికగా సమర్ధించుకోలేను. కబుసా గురించి తనకి     పూర్తిగా   తెలియకపోవచ్చు, నాకు తెలుసు కదా. తను అలాంటి తప్పు చేయబట్టే, కబుసా తనని అలా శిక్షించేడు." నిట్టూరుస్తూ అన్నాడు రాజు.

"నువ్వు పొరపాటు పడుతున్నావు. వాళ్ళు తన అడ్డు తప్పించుకోవడానికి అలా చేస్తే, కబుసా శిక్షించేడు అని ఎందుకు అనుకుంటావు?"

"మరైతే కబుసా ఆ సమయంలో మల్లిక ని ఎందుకు కాపాడలేదు? ఆ సమయం లో ఎందుకు అలా వదిలేసాడు?" రాజు కళ్ళు చిట్లించాడు.

"కబుసా కొన్ని సందర్భాల్లో శక్తిహీనుడవుతాడు. అప్పుడు తనేం చెయ్యలేదు. తనని మొదటినుండి ఆరాధిస్తున్నవాడివి నీకుమాత్రం ఈ విషయం తెలియదా? బహుశా మల్లిక చంపబడ్డ ఆ సందర్భం అటువంటి సందర్భాల్లో ఒకటి అయివుంటుంది."

"మీరు చెప్పిందీ నిజమే కావచ్చు." ఇంకోసారి గట్టిగా నిట్టూర్చాడు రాజు.

"అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది గతం గురించి కాదు, భవిష్యత్తు గురించి. చనిపోయిన మల్లిక గురించి మనం ఏమీ చెయ్యలేం. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తిన మల్లిక గురించి మనం ఆలోచించాలి."

"చనిపోయిన మల్లిక కి, ఇంక ఇప్పుడు ఇంకో జన్మ ఎత్తిన మల్లికకి మధ్య చాలా వత్యాసం వుంది. ఆ మల్లిక అమాయకురాలు, చదువు సంధ్య లేనిది. ఏం చెప్పినా నమ్ముతుంది. కానీ ఈ మల్లిక చాలా తెలివైనది. బాగా చదువుకున్నది. ఇలాంటి విషయాలగురించి తనని నమ్మించడం చాలా కష్టం. "

"నీకు మల్లికే ఈ అమ్మాయిగా జన్మించినట్టు ఎలా తెలిసింది?"

“నాకు కబుసాయే మల్లిక మళ్ళీ  ఈ జన్మలో ఈ అమ్మాయిగా జన్మించినట్టు నా కలలో చెప్పాడు. తనకి మల్లిక మీద పూర్తి ఆసక్తి ఉందని కూడా చెప్పాడు.” 

"ఇంతకీ తనని నువ్వు కలిసావా? తనతో ఎమన్నా మాట్లాడావా?"

"ఇంకా లేదు. తనని ఎలా కలువను, ఏమిటి మాట్లాడాను? ఇలా గత జన్మ అదీ ఉందని చెప్తే తను నమ్ముతుందని కూడా నాకు అనిపించడం లేదు." ఆవేదనగా అన్నాడు రాజు.

"తొందరపడొద్దు. అదీ స్ట్రాటజిక్ గానే చెయ్యాలి. అంతకన్నా మనముందున్న పెద్ద సమస్య, ఈ జన్మలో కూడా తనని వెంటాడే కబుసా విషయం లో ఎలా డీల్ చెయ్యాలి? ఈ విషయం లో మనకి రెండు దారులు వున్నాయి." కాస్త ఆగి మళ్ళీ అన్నాడు యస్మణి. "ఈ జన్మలో కూడా తాను కబుసా ని ఆరాధించి తనని ప్రసన్నం చేసుకునేలా చెయ్యడం. లేదూ కబుసా తనని పూర్తిగా విడిచిపెట్టి, మర్చిపోయేలాగా చెయ్యడం."

"రెండవది అసలు సాధ్యమా? అలా ఆలోచించడానికి కూడా నాకు భయంగా వుంది. కబుసా తనని ఇష్టపడుతున్నాడు. గత జన్మలో తను కబుసాని ఆరాధించింది. అందుకని  ఈ జన్మలో కూడా కబుసా తనని విడిచిపెట్టడు. మీరు కబుసా గురించి ఎక్కువ పరిశోధన చేశారు, కూడా. మీకు తెలియదా కబుసా కి అయిష్టమైన పనిచేస్తే తాను ఏమి చేస్తాడో?"

"నేనిప్పటికీ ఎందుకు చేసానా అని బాధపడే విషయాల్లో ఇదొకటి, అది కబుసా గురించి పరిశోధన చెయ్యడం." ఇంక కుర్చీలో కూచోలేనట్టుగా లేచినిలబడ్డాడు యస్మణి. "మరి మొదటి విషయం మాత్రం తేలికగా సాధ్యం అవుతుందా? ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళనసలు పారానార్మల్ విషయాల గురించి చెప్పి నమ్మించగలమా? కబుసా ప్రసన్నం అయిన తను ఉండాల్సిన విధానం గురించి చెప్తే ఈ అమ్మాయి ఒప్పుకుంటుందా? ఆ అమ్మాయి కుటుంబం అసలు పడనిస్తుందా?"

దానికి సమాధానం తనదగ్గర లేనట్టుగా మౌనంగా వుండిపోయాడు రాజు.

కొంత నిశబ్దం తరువాత అన్నాడు. " ఎంత ఆశ్చర్యకరమైన విషయం!  కిందటి జన్మలో తను ఎవరికైతే కూతురుగా పుట్టిందో, తనకే కూతురుగా పుట్టింది. కేవలం తల్లులు మాత్రమే వేరు. నిజం చెప్పాలంటే.........." కాస్త ఆగడు రాజు. ".......... తనెంతగానో పగతీర్చుకోవాలనుకునేవాళ్లమధ్య తను వుంది ఇప్పుడు."

"ఇది కబుసా సంకల్పం లేకుండా జరిగిన విషయం కాదు. తనని ఆ కుటుంబంలో మళ్ళీ పుట్టించింది తనే. నా అభిప్రాయం లో............" సాలోచనగా కాస్త ఆగాడు యస్మణి. "............. కబుసా ఆ అమ్మాయికి తన ఉనికిని, తనకీ ఆ అమ్మాయికి వున్న సంభందాన్నికొన్నిరకాలుగా తెలియచేస్తూనే వుండివుంటాడు. మనం కబుసా గురించి ఆ అమ్మాయిని కన్విన్స్ చెయ్యడం లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు."          

"అది ఆ అమ్మాయి ని కలుసుకుని మాట్లాడితే కానీ తెలిసే విషయం కాదు. మీరేదో కొంచెం స్ట్రాటజిక్ గా చెయ్యమంటున్నారుకదా."

"ఎస్, అవును. అది మనం ఎలా చేద్దాం అన్నది ఆలోచిద్దాం. ఇక్కడ ఇంకొక విషయం కనెక్టెడ్ గా కనిపిస్తూంది." కాస్త ఆగి చెప్పాడు యస్మణి. "నాకు కొద్దిరోజులుగా నేను, నాకు ముఖ్యులైన స్టూడెంట్స్ ఇద్దరు ఒక పారానార్మల్ పవర్ గుప్పెట్లో చిక్కుకోబోతున్నట్టుగా చాలా బలంగా అనిపిస్తూ వుంది. ఏవో కలలు కూడా రిలేటెడ్ గా వస్తూవున్నాయి. ఎంత ఆలోచించినా ఆ పారానార్మల్ పవర్ ఏమిటి, మేము చిక్కుకోబోయే ఆ పరిస్థితి ఏమిటి అన్నది మాత్రం బోధపడడం లేదు. ఇప్పుడాలోచిస్తూంటే ఆ పారానార్మల్ పవర్ కబుసా ఏ అనిపిస్తూవుంది. త్వరలోనే ఆ అమ్మాయి నా స్టూడెంట్స్ వున్న బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి వచ్చే పరిస్థితి రావచ్చు. నువ్వు ఆ అమ్మాయిని కలిసి మాట్లాడకపోయినా, ఆ అమ్మాయి విషయం లో ఏం జరుగుతూంది అన్నది గమనిస్తూవుండు. పరిస్థితినిబట్టి మనం ఏం చేద్దాం అన్నది ఆలోచిద్దాం."

"సరే సర్. అలాగే చేద్దాం అయితే." రాజు అన్నాడు.

"ఇందులో ఇంకా మనకి పెద్ద సమస్యే వుంది. ఈ బాగా చదువుకున్న వీళ్ళెవరూ ఈ పారానార్మల్ విషయాల్ని అంగీకరించడానికి సిద్ధం గా లేరు. నా స్టూడెంట్స్ ఇద్దరినీ కలిసి మాట్లాడాను. కేవలం ఏదో ఒక పారానార్మల్ సమస్యలో మేము ఇరుక్కోబోతున్నామని చెప్పాను, అప్పటికి నాకు విషయం తెలియకపోవడం వల్ల. అసలు వాళ్ళెవరూ పారానార్మల్ ని అంగీకరించడానికే ఒప్పుకోవడం లేదు."

"మీరు ఆ విషయం గురించి ఆలోచించకండి. ఒకసారి కబుసా ప్రభావం చూపించడం మొదలుపెట్టిన తరువాత వాళ్ళంతట వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు." నవ్వుతూ అన్నాడు రాజు.

"నువ్వు చెప్పింది నిజమే." యస్మణి కూడా నవ్వాడు కానీ అంతలోనే అయన మొహం సీరియస్ గా మారిపోయింది. "తానెవరికీ ఏం అన్యాయం చేసిందని మల్లికని అలా చంపించారు? ఆ దుర్మార్గుడు తన కోరిక బలవంతంగా తీర్చుకోవడమే కాకుండా బతికుండగానే తనని భూమిలో పాతిపెడతాడా? తను ఇష్టపడేవాళ్ళని అలా చేస్తే కబుసా వూరుకోడు. ఆ దుర్మార్గుడితో సహా తక్కిన వాళ్లందరినీ తగిన విధంగా శిక్షిస్తాడు."

"మరి తనని అలా చేస్తున్నప్పుడు ఎందుకు ఊరుకున్నాడు? తను కోరిక తీర్చుకోకుండా, మల్లిక నాతో కోరిక తీర్చుకున్నందుకే అలా వదిలేసాడా? తను వేయాల్సిన శిక్ష వేరొకళ్ళు వేస్తున్నారులే అనుకున్నాడా?" ఆవేదనగా అడిగాడు రాజు.

"తను ఇష్టపడుతూన్న కన్నెపిల్ల ముందు తను కోరిక తీర్చుకోకుండా వేరే ఎవరితో కోరిక తీర్చుకున్నా అది కబుసా కి బాగా ఆగ్రహం తెప్పించే విషయమే. అందుకు తనే స్వయంగా శిక్షిస్తాడు తప్ప, వేరే వాళ్ళద్వారా అలా చేయించడు." కాస్త ఆగి అన్నాడు యస్మణి. "కబుసా ఆసక్తుడైపోయే సందర్భాలు కొన్నివుంటాయి. ఆ సమయం లో కబుసా వేరే కన్నెపిల్లని ఎవరినన్నా అనుభవిస్తూ ఉండివుంటే వేరేది ఏదీ తనకి తెలియదు. అలాగే నిండు పున్నమి రాత్రి కూడా తను ఆసక్తుడుగా ఉంటాడు. తను శక్తిలేకుండా, ఇతర విషయాలు  తెలియకుండా వుండే సందర్భాలు కొన్నివున్నాయి."

"అప్పుడు నిండు పున్నమి రాత్రి కాదు. కబుసా కి వున్న పరిమితులు నాకు కూడా తెలుసు. కానీ మీరు చెప్పింది కూడా నిజం కావచ్చు." రాజు అన్నాడు. "ఏదేమైనా ఆ తనువు చాలించి మల్లిక వేరే జన్మ ఎత్తింది. ఇంక ఈ జన్మలో పాత జన్మలో చేసిన పొరపాటుకు తనని శిక్షించాలని అనుకోకపోవచ్చు."

"నేనూ అలాగే భావిస్తున్నాను." యస్మణి అన్నాడు. "కానీ ఈ జన్మలో నీ ప్రియురాలి విషయం లో మనం ఏం చెయ్యాలి అన్నవిషయం లో కూడా ఒక నిర్ణయానికి రావాలి. తనని కబుసా భక్తురాలిగా కొనసాగనివ్వాలా? లేక కబుసా కి దూరం చెయ్యాలా?"

"రెండవది ఆలోచించడానికే భయంగా వుంది. తనని మనం కబుసా కి దూరం చెయ్యాలని ఆలోచిస్తే, మనల్ని కబుసా ప్రశాంతం గా వుండనివ్వడు." రాజు భయంగా అన్నాడు.

"కబుసా బాగా ఇష్టపడేది, తనకి కావాల్సింది ఇంకొకటి ఎమన్నా ఇస్తే ఈ అమ్మాయిని త్యాగం చెయ్యడానికి అంగీకరించొచ్చు. ఆ విషయం ఆలోచిద్దాం. ఈ లోపుగా మనం ఆలోచించాల్సినవి చాలానే వున్నాయి." యస్మణి అన్నాడు.

ఆ తరువాత కూడా చాలాసేపు మాట్లాడుకుంటూ వున్నారు ఇద్దరూ.                  

&&&

"నా డాడ్ నన్ను ఎప్పుడూ బిజినెస్ లో పార్టిసిపేట్ చెయ్యమనేవారు. నాకు ఇష్టం ఉండేది కాదు. ఏం చెయ్యాలా అని అలోచించి, మీ డాడ్ ని ఇలా అప్పచెప్పాను. దానితో నన్ను వదిలిపెట్టేసారు." ఆ రోజు రాత్రి అందరూ సప్పర్ చేస్తూండగా మాలతి అంది. 

అది విని అందరూ నవ్వారు.

"నీకూ ఈ బిజినెస్ వ్యవహారాలనుండి తప్పించుకోవాలంటే అదే మార్గం. డాడ్ లాంటి సమర్థుడైనవాడిని చూసి పెళ్ళిచేసుకుని మాకు అప్పచెప్పు. అప్పుడు ఈ బిజినెస్ తలపోట్లు లేకుండా లైఫ్ ఎంజాయ్ చెయ్యొచ్చు." సారిక చిన్న అన్నయ్య వంశీ  అన్నాడు చిరునవ్వుతో.

"మామ్ గ్రాండ్  పా కి ఒక్కతే కూతురు. సో, ఆయన తను బిజినెస్ లో హెల్ప్ చేయాలనుకున్నారు. కానీ ఇక్కడ మీరిద్దరూ వున్నారు కదా డాడ్ కి హెల్ప్ చెయ్యడానికి. నేను మరొకళ్ళని ప్రొవైడ్ చెయ్యడం ఎందుకు?" సారిక అంది.

"ఈ విషయం నేనెలా మిస్సయ్యాను?" అదే చిరునవ్వు కంటిన్యూ చేస్తూ అన్నాడు వంశీ.

"కానీ సారికా........" భుజంగరావు అన్నాడు. ".........నువ్వు బిజినెస్ వ్యవహారాల్లో పార్టిసిపేట్ చెయ్యాలని, మా అందరికన్నా కూడా యాక్టీవ్ గా మన బిజినెస్ లో ఉండాలన్నది నా కోరిక."

"సర్టెన్లీ డాడ్!" తనూ చిరునవ్వుతో అంది సారిక. "నీ ఇద్దరు అబ్బాయిలు ఎంత ఇష్టపడకపోయినా కూడా నేను అది మానను. ఖచ్చితంగా మన బిజినెస్ వ్యవహారాల్లో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తాను."

"అందుకు మేమెవరం అభ్యంతరం పెట్టం. సాధ్యమైనంత త్వరగా నువ్వు పెళ్లిచేసుకోవాలి. మేము కుదిర్చే సంభందం నువ్వు కాదనకూడదు." మాలతి అంది.

"అలాగే తను నాతొ ఎప్పుడూ వుంటుందనే ఉద్దేశంతోనే నేను తన బ్రో ని పెళ్లిచేసుకున్నాను. కాబట్టి తనకి ఇల్లరికం ఉండడానికి అంగీకరించేవాడినే ఇచ్చి పెళ్ళిచెయ్యాలి."

అది విని అందరూ నవ్వారు మళ్ళీ.

"నువ్విలాంటి కండిషన్ పెడితే ఎలా? మనకి నచ్చి యోగ్యుడైనవాడు ఇల్లరికం ఉండడానికి ఒప్పుకోవాలి కదా?" శ్రవణ్ అన్నాడు.

"ఏమో నాకు తెలియదు. కానీ నా కండిషన్ మీట్ అవ్వాల్సిందే. అయినా వెతికితే యోగ్యుడై ఇల్లరికం రావడానికి ఒప్పుకునే వాళ్ళు ఖచ్చితం గా దొరుకుతారు." అక్కడే కూచుని భోజనం చేస్తూన్న తన తమ్ముడు ప్రదీప్ ని చూస్తూ మర్మగర్భం గా అంది ప్రమీల.

  ప్రమీల ఉద్దేశం అర్ధమైంది అందరికీ. తెలివిగా తన తమ్ముడు ని కూడా ప్రవేశపెట్టాలనుకుంటూంది ఆ యింట్లో.

"నేను ఎం.బి.ఏ . కూడా పూర్తిచేసేవరకూ పెళ్లిగురించి ఆలోచించ దలుచుకోలేదు." సారిక అంది.

ఆ తర్వాత అలాగే అందరూ నవ్వుకుంటూ భోజనాలు పూర్తిచేశారు. భోజనాలు పూర్తిచేసి పైకి రాగానే అక్కడ ఎంతోకాలంగా తమదగ్గర పనిచేస్తూ వున్నా ఓబులేసు కనిపించాడు. తమకి వున్నపొలాలు, తోటలు వగైరాలు చూసుకుంటూవుంటాడు ఓబులేసు.

"బాగున్నావా తల్లీ?" అంటూ పలకరించాడు ఓబులేసు సారిక ని.

"ఆ బాగానే వున్నాను. నువ్వెలా వున్నావ్? నీ పెళ్ళాం, పిల్లలూ ఎలా వున్నారు?" హాల్లో వున్న కుర్చీలో కూచుని, తననీ అక్కడవున్న కుర్చీలో కూచోమని సైగచేస్తూ అంది సారిక.

"మేము చాలా బాగా వున్నాం. అయినా మమ్మల్ని ఇంత బాగా చూసుకునే అయ్యగారు ఉండగా మాకు ఏం తక్కువ?" చిరునవ్వుతో అన్నాడు ఓబులేసు ఆ కుర్చీలో కూచుంటూ.

"మీరు మాత్రం మాకు తక్కువ చేస్తున్నారా ఏం? నువ్వింతప్పటినుండీ నా గ్రాండ్ పా దగ్గర వుండి ఆయన చెప్పిన పనేదీ నువ్వు కాదనకుండా చేస్తావుట కదా. నా గ్రాండ్ పా ఎప్పుడూ చెప్తూ వుంటారు."

"కానీ ఇప్పుడాయన నన్ను మీ నాన్న గారికి అప్పగించారు. ఆయన చెప్పినదేదీ కాదనకుండా చెయ్యమని చెప్పారు. నేనలాగే చేస్తూ వున్నాను."

"అంటే నువ్వు నా డాడ్ కానీ, గ్రాండ్ పా కానీ ఏం చెప్పినా చేసేస్తావా?" నుదురు చిట్లించింది సారిక.

"చేస్తానమ్మా. నాకు అలాగే అలవాటు." తలూపి అన్నాడు ఓబులేసు. "నేను పది, పదకొండేళ్ల వయసులో అనాథలా తిరుగుతూ ఉంటే నన్ను ఆదరించారు మీ తాత గారు. నన్ను చదువుకోమన్నారు అసలు, కానీ నాకు చదువు అబ్బలేదు. అందుకని వేరే పనులు అలవాటు చేసి నాకే లోటూ లేకుండా చూసుకున్నారు. ఆ తరువాత మీ నాన్నగారు కూడా నాకే లోటూ లేకుండా చూసుకుంటూవున్నారు. ఈ రోజు నేను నా కుటుంబం తో ఆనందంగా వున్నాను అంటే అది మీ నాన్నగారు, తాతగారి చలువే." 

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)