Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తొలి పౌర్ణమి - 13

“ ఏంటి చాందినీ….”
నీకేమన్నా పిచ్చి పట్టిందా, రేస్ పోతే పోయింది. నీ చెయ్యి చూడు ఒకసారి, ఏమన్నా అయ్యుంటే..
నా చెయ్యి వంక చూసా రక్తం కారుతోంది, జయ ని పట్టుకున్నప్పుడు బండి అంచు గీసుకున్నట్టుంది, నాకిప్పుడు ఆ బాధ లేదు తను నా గురించి మొదటి సారి ఇలా ఆలోచిస్తోంది అన్న ఆనందం..
జయ ని పట్టుకున్నప్పుడే బండి ఆపేయొచ్చుగా….
లైఫ్ లో ఫస్ట్ టైమ్ పార్టిసిపేట్ చేస్తున్నా చాందిని అందుకే అలా చేశా.., ఇంకెప్పుడు చెయ్యను లే..
అయినా నువ్వు ఏం చేస్తే నాకేంటి, నేను చెయ్యాల్సింది చేస్తా అంటూ, శృతి తెచ్చిన పసుపును గాయం చుట్టూ బాగా దట్టించింది..
తనతో వచ్చిన ప్రాబ్లం ఇదే, నేను ఎంతగా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్న ఇలా మాట దాటేస్తుంది..
పసుపు గాయానికి తగలగానే మంట పుట్టాలిగా, నిజంగా చెప్తున్నా నాకు హాయిగా అనిపిస్తోంది, కొందరి స్పర్శ అంతే..
ఆ తర్వాత మొదటి బహుమతి అందుకున్నాం..
అలా మొదలైన జాతర ఎన్నో విశేషాలతో ముందుకు సాగింది..
ఆ తర్వాత రోజు హారతి, అమ్మాయిలంతా మంచిగా చీర కట్టుకుని పూలతో అలంకరించిన హారతిని దేవత వద్దకు మోసుకొని వెళ్తారు..
జాతర దగ్గరకు వెళ్ళడానికి నేను జయ ముందే రెడీ అయ్యాం, గుడి కోసం పందిరి అల్లుతుంటే నేను సాయం చేస్తున్నా..
అంతలో ఇంటి లోపల నుంచి చిన్నగా గజ్జల చప్పుళ్ళు.., అది ఎవరా అని చూసా.., చూస్తే ఎవరు కనపడట్లేదు.
మళ్ళీ అల్లడం మొదలుపెట్టా..
ఈసారి గజ్జల నాదాలతో పాటు కిల కిలా నవ్వులు, మళ్ళీ అటువైపు చూసా..
చిన్న పిల్లలతో పాటు మెల్లగా బయటికి పరిగెడుతూ వస్తోంది, చాందిని..
“నీలి రంగు చీరలో తన చీర అంచును తానే పట్టుకుని పరిగెడుతుంటే,
నా కళ్ల ముందే ప్రవహిస్తున్న స్వచ్ఛమైన సెలయేరులా అనిపించింది.
తను నిజంగా నదే అయ్యుంటే,
తన గట్టుమీద ఒక చెట్టులా జీవితాంతం ఆమెను వీక్షిస్తూ ఉండేవాడిని.”
“హలో విక్రమ్” అంటూ ఎవరో పిలిచారు.
చూస్తే శృతి..
ఏంటి నిమగ్నమైపోయావు..
ఏ… ఎప్పుడొచ్చావ్ శృతి, నేను గమనించనే లేదు..
నీ దృష్టంతా ఎక్కడో ఉంటే మేం ఎక్కడ కనిపిస్తాం..
అలా ఏం లేదు జస్ట్ అలా క్యాసువల్ గా చూస్తున్నా..,ఇంతలో జయ చాందిని మా దగ్గరకు వచ్చారు.
“శృతి” పిలిచాడు జయ.
చెప్పు జయ బ్రో..
ఈరోజు నువ్వు హారతి మోసుకొని 101 ప్రదక్షిణలు చేస్తే, నీకు నచ్చిన వాడితో త్వరగా పెళ్ళవుతుంది..
అవునా, అయితే నేను వెంటనే వెళ్తున్నా, వచ్చే సంవత్సరం లోపు మా బావతో పెళ్ళైపోవాలి అంటూ లోనికి పరిగెత్తింది..
మేం ముగ్గురం నవ్వుకున్నాం.
“నువ్వు వెళ్ళట్లేదా”, ఆని చాందినీ ని అడిగా..
పెళ్లి కోసం ప్రదక్షిణలు చేసే ఓపిక లేదు, జస్ట్ తనతో గుడికి వెళ్తా అంతే..,”ఇది తన నుంచి ఊహించిన సమాధానమే”.
అలా అమ్మాయిలంతా దేవతకి హారతిచ్చారు..
అలా జాతరలో ఎన్నో విశేషాలు చూసాం, రకరకాల పిండి వంటలు చేశారు శుభ్రంగా తిన్నాం..
జాతర చివరి భాగానికి చేరుకుంది అదే కురుక్షేత్ర నాటకం, చాలా రసవత్తరంగా సాగుతోంది, జయ వాళ్ళ నాన్న దుర్యోధనుని పాత్రలో మిగతా అందరిని డామినేట్ చేస్తున్నారు.. ఇంకో పక్క జయగాడు ముఖం నిండా గడ్డం తో ద్రోణాచార్యుడు పాత్రలో ఉన్నాడు, వాడికి ఒక్క డైలాగ్ కూడా లేదేమో తూగుతున్నాడు..
కొంచెం చలిగా ఉంటే ఇప్పుడే వస్తానని వాళ్ళతో చెప్పి పక్కకు వెళ్ళా.. సిగరెట్ వెలిగించా..
నాటకం చూస్తున్న శృతి, చాందిని నా వైపు తిరిగి రమ్మని సైగ చేశారు..
సిగిరెట్ వెనకాల దాచి 5 నిమిషాల్లో వస్తా అని తిరిగి సైగ చేశా, అమ్మాయిల ముందు సిగరెట్ కాల్చడం బాగుండదని కొంచెం పక్కకు వెళ్ళా..
సిగరెట్ కాలుస్తూ ఉండగా, ఎవరో నా చెయ్యి పట్టుకున్నారు, చూస్తే ఒక చిన్న పాప..
అంకుల్..
ఏంటమ్మా…
నన్ను కాస్త మా ఇంటి దగ్గర వదులుతారా, నాకు ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది..
నేను చిన్నగా నవ్వి,”సరే, నీ పేరేంటి..”
హేమ..
ఈ పాప కూడా నా చిన్ననాటి హేమ లాగే చాలా క్యూట్ గా ఉంది.
తనను పైకి ఎత్తుకుని రెండడుగులు వేశా..
“అయ్యో అంకుల్ నేను నడుస్తా “…
“అలాగే”, తనను కిందకి దించి చెయ్యి పట్టుకుని ముందుకు నడిచా..
అలా తనతో మాట్లాడుతూ నడుస్తుంటే సరదాగా అనిపిస్తోంది, మేం వెళ్తున్న దారి నిర్మానుష్యంగా ఉంది..ఆ పాప వెళ్తూ చాలా కబుర్లే చెప్పింది.
హేమాని ఇంటి దగ్గర దింపి, వాళ్ళ బామ్మగారు ఉంటే ఆవిడని పలకరించా, తిరిగి రావాలంటే కొంచెం భయంగా ఉంది.
“నే వెళ్తా బామ్మా” అంటూ బయలుదేరా.
జాగ్రత్త బాబు.
ఎందుకు బామ్మ దారి బానే ఉంది గా.
దారి బానే ఉంది బాబు, కానీ దాని గురించి చాలా పుకార్లు ఉన్నాయి, ఒక్క విషయం గుర్తు పెట్టుకో నిన్ను ఎవరు పిలిచినా ఆగొద్దు, తొందరగా వెళ్ళు అంటూ పంపించింది..
తిరిగి వెళ్తున్నప్పుడు ఆ బామ్మ మాటలే గుర్తుకొస్తున్నాయి, కొంచెం వేగం పెంచా..
అలా వేగంగా వెళ్తున్న నాకు, నా పక్కన చెట్టు చాటు నుండి ఇలా వినిపించింది, “రేయ్… విక్రమ్” ఆ పిలుపు ఎలా ఉందంటే గొంతుతో పిలిచినట్లు కాకుండా శ్వాసతో నా పేరు పిలిచినట్టు చాలా భయంకరంగా ఉంది..
బామ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి, భయం వేసింది ఇంకా వేగంగా నడిచాను..ఎంత వేగంగా వెళ్ళిన ఆ గొంతు నన్ను వెంటాడుతోంది, ఇలా అయితే అవ్వదని అక్కడినుంచి పరిగెత్తాను, చుట్టూ ప్రతి దిక్కునుండి అదే పిలుపు, అలా పరిగెడుతున్న నా ముందు దూరంగా ఒక పిల్లవాడు కూర్చొని ఏడుస్తున్నాడు..
ఇది మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్తోంది, ఆ కుర్రాడి ముఖం కనిపించట్లేదు..
కొంచెం భయంగా అతని దగ్గరకు వెళ్లా, తన భుజం మీద చెయ్యి వేసి…
“ఏ బాబు ఎవరు నువ్వు, అర్ధరాత్రి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావేంటి.”
అతని దగ్గర నుంచి ఏ సమాధానం లేదు..
ఏ బాబు నిన్నే.., ఎందుకేడుస్తున్నావ్.
“నీకు తెలీదా”.. అంటూ మళ్ళీ అదే శ్వాసతో కూడిన పిలుపు, ఈసారి ఇంకా భయంకరంగా ఉంది ..
నాకు అర్థమైంది ఇది కచ్చితంగా ఆకాష్, అతని పక్కనుంచి వేగంగా పరిగెత్తా, కొంచెం దూరం పరిగెత్తాక అదే దృశ్యం, ఎంత దూరం వెళ్ళినా అతను దారిలో నా ముందు అలానే కనిపిస్తున్నాడు, నన్ను చూసి నవ్వుతున్నాడు ఏం చెయ్యట్లేదు, అతని నవ్వు నాకు ప్రతి దిక్కునుండి ప్రతిధ్వనిస్తోంది.
దగ్గరికి వచ్చేశా, ఈసారి అతనిని తప్పించి వెళ్తే చాలు నాటకం జరుగుతున్న చోటుకి వెళ్ళిపోవచ్చు, నా వైపు అలానే తీక్షణంగా చూస్తున్నాడు, నేను అతని కళ్లలోకి చూడకుండా అలాగే ముందుకు పరిగెత్తా.. 
నా ఎడం చెయ్యి పట్టుకుని ఆపేసినట్టు అయ్యింది, అక్కడ నాటకం శబ్దం ఆగిపోయింది, కరెంట్ పోయినట్టుంది నాకు అతడి శ్వాస కూడా క్రిస్టల్ క్లియర్ గా వినిపిస్తోంది..
“ఎందుకురా నాకు నా లైఫ్ లేకుండా చేసావ్” అంటూ గట్టిగా అరిచాడు..
నేను మౌనంగా ఉన్నా..
 “ నువ్వేది చెప్పకుంటే ఈరోజు కదలనివ్వను” అంటూ చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆకాష్..
నా సమాధానం నీకు ఇదివరకే చాలా సార్లు చెప్పా నన్ను వదులు ఆకాష్ అంటూ చెయ్యి విదిలించా..
“అంటే ఇప్పుడు నన్ను చంపేసావ్ అని ఒప్పుకుంటున్నావా”
నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు వేస్తే నేనేం చెప్పలేను ఆకాష్, నన్ను వదులు..
“విడిపించుకో చూద్దాం” అని గట్టిగా నవ్వుతున్నాడు..
విడిపించుకోవటానికి నా చేతిని గట్టిగా విదిలిస్తున్నా..
ఇంతలో ఎవరో నా కుడి చెయ్యి పట్టుకున్నారు.., ఇంకాస్త భయమేసింది నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసా.
 అది చాందిని, గట్టిగా ఊపిరి పీల్చుకున్నా..
ఏమైంది విక్రమ్, చీకట్లో నిలబడి చెయ్యి దులుపుకుంటున్నావ్..
అదా ఏం లేదు ఇందాక ఒక పాపని ఇంటి దగ్గర వదిలొస్తుంటే ఒక ఎలుగుబంటి తరిమింది, అప్పుడు చేతికి ఏదో తగిలింది. కొంచెం నొప్పిగా ఉంటే దులుపుతున్నా..
ఏదీ నన్ను చూడని అంటూ నా కట్టు సరి చేసింది..
తను నా పట్ల చూపిస్తున్న ఈ కేరింగ్ నాకు చాలా బాగా నచ్చుతోంది.
విక్రమ్..
చెప్పు చాందిని..
మనం పరిగెత్తాలనుకుంటా..
ఎందుకు.
ఒకసారి నీ వెనక్కి చూడు “ఎలుగు బంటి” వస్తోంది, అని భయంగా అంది.
నేను కంగారుగా వెనక్కి తిరిగా , అవును అది ఎలుగుబంటే మనిషి లాగా నడుచుకుంటూ వస్తోంది..
“ఓడియమ్మ బంటి…” అంటూ గట్టిగా అరిచి అక్కడినుంచి పరుగెత్తబోయాం..
 “విక్రమ్, చాందిని ఆగండి..“ 
ఇదేదో తెలిసిన గొంతులా ఉందే, అంటూ వెనక్కి తిరిగా.
 చీకట్లో నుంచి బయటకు వచ్చాడు జయ..
ఒరేయ్ నీ గెటప్ తగలెయ్యా, కనీసం ఇప్పుడన్నా నార్మల్ గా రావచ్చు కదరా..
రేయ్ ఇంకా నాటకం ఉంది రా..
ఏంటి ఒక్క డైలాగు కూడా లేకుండా నే..
రేయ్ కళాకారుడిని వెక్కిరించొద్దు, రెండవ పార్ట్ లో డైలాగ్స్ ఉన్నాయి పదా..,అన్నాడు జయ
కరెంట్ వచ్చినట్టుంది మళ్ళీ నాటకం మొదలైంది, నాటకం చాలా బాగా నడిచింది..
అలా ఎన్నో అనుభవాలతో జాతర చాలా గొప్పగా సాగింది, ఆ తర్వాత రోజు తిరిగి బెంగళూరు కి వచ్చేశాం   

 *****
ఆరోజు రానే వచ్చింది శృతి మరియు చాందిని క్యాబిన్ లో కూర్చున్నారు, జయ తన ఫోన్ లోపలే పెట్టి అందులోంచి నాకు కాల్ కనెక్ట్ చేశాడు, మేము క్యాంటీన్లో కూర్చొని వింటున్నాం. 
హే చాందిని..
ఏంటి శృతి..
ఎంటే నువ్వు అసలు అబ్బాయిలతో సరిగ్గా మాట్లాడవు ఎప్పుడూ వాళ్లకు దూరంగా ఉంటావు. పెళ్లైనా చేసుకుంటావా లేదా తల్లి అని అడిగింది. 
ఏమోనే అవన్నీ నాకు తెలియదు…
అదేంటే అలా అంటావ్ అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళు నీకు పెళ్లి చేయాలని ఆశపడుతుంటారు కదా..
అప్పటికి చూసుకుందాం లే, అయినా నీకు వర్క్ లేదా నా తల తింటున్నావ్.
బోరింగ్ గా ఉంది చందు నిన్ను ఒక ప్రశ్న అడగనా…
ఏంటది..
నీకొక సిచ్యుయేషన్ చెప్తా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చెప్పు..
సరే కానివ్వు, నీతో తప్పుతుందా..
ఒక స్ట్రేంజర్ నీకు బాగా పరిచయం అయ్యాడు అతను సడన్గా వచ్చి పెళ్ళి చేసుకుంటావా అని అడిగితే ఏం చెప్తావ్. 
లాగి చెంప మీద కొట్టేస్తా.., పరిచయమవగానే పెళ్ళేంటి..
అది వినగానే నేను జయ చంప మీద చేయి వేసుకున్నాం.. 
ఒకవేళ ఆ వ్యక్తి నీకు బాగా కావాల్సినవాడైతే, నీకు తోడుగా నిలబడితే, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటే…
“ఏమి చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు” అంది చాందిని.
 ఒకవేళ మన విక్రమ్ అలా అడిగితే ఏమంటావ్..
చాందిని ఏం మాట్లాడట్లేదు బహు శా ఆలోచనల్లో పడినట్టుంది.
శృతి మాట్లాడుతూ, హే జనరల్ గా నీ ఒపీనియన్ ఏంటి అని అడిగా అంతే… 
అడిగితే అడిగావు కానీ ఇలాంటివి మళ్ళీ అడక్కు, నాకు అస్సలు నచ్చదు అంటూ మళ్ళీ మాట దాటేసింది చాందిని. 
నేను ఒక పక్క కెళ్ళి ఒంటరిగా కూర్చునేసా. 
జయ వచ్చి నా పక్కన నిలబడ్డాడు, “ఏం కాదులే మావ అమ్మాయిలు మొదట్లో ఇలానే ఉంటారు తర్వాత వాళ్లే ఇష్టపడతారు.”
రే ఈ అమ్మాయి అబ్బాయిల్ని మరీ ఇంతలా ద్వేషించాలా..
“మనం ఏం చేయగలం” అన్నాడు జయ..
ఏం తెలియనట్టు గా ఇద్దరం వెళ్లి క్యాబిన్ లో ఎవరి పని వాళ్ళు చూసుకున్నాం. 
తరువాతి రోజు ఆఫీస్ కి కొంచం ముందే వెళ్ళా ఇంకా ఎవరు రాలేదు క్యాబిన్ లో కి.
నేను నా పనిలో నిమగ్నమయ్యా..
డోర్ తీసిన చప్పుడు వినిపించింది నిదానంగా అటువైపు తిరిగా..
“ బ్లాక్ డ్రెస్ లో చాందిని ఒక వెన్నెల రాత్రిలా ఉంది”, అదేంటో అబ్బా, ఈ అమ్మాయి ప్రతీ సారి నన్నిలా ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది..
ఎందుకో తెలియదు ప్రతిసారి తనని చూడాలనిపిస్తోంది. ఎలాగోలా తన దృష్టిని నా వైపు తెచ్చుకోలనిపిస్తోంది, ఆరోజు మధ్యాహ్నం వరకు మాటిమాటికీ తననే చూస్తున్నా, తనూ మధ్య మధ్యలో నన్ను చూస్తోంది, అలా చూసినప్పుడు తల తిప్పేస్తున్నా.
కాసేపటి తర్వాత, ఎందుకో జయ బయటికెళ్లాడు.