మనం భవిష్యత్తుని తరిమితే మనల్ని తరిమేదే గతం, ఇక్కడ గతం అంటే సమయం కాదు సందర్భం, మన మనస్సులో ఏదో ఒక మూలన నిలిచిపోయిన ఆలోచన మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
****
సాయంత్రం నాలుగు కావస్తోంది. క్రికెట్ బ్యాట్ తీసుకుని గ్రౌండ్‌కి పరిగెత్తాను, నేను వెళ్లేసరికి అందరూ సిద్ధంగా ఉన్నారు.
“ఏంట్రా లేట్ అయ్యింది” అడిగాడు వాసు.
గ్రిప్పర్ లేకుండా ఆడుతుంటే చేతులు కోసుకుంటున్నాయి రా.., అందుకే కొనడానికి వెళ్ళా..
సరే నువ్వు,విజయ్ చెరోవైపు కెప్టెన్లుగా ఉంటారు, నేను నీ బదులుగా ఆల్రెడీ మన టీం ని సెలెక్ట్ చేసుకున్నా..
“అలగా మరి టాస్ అయ్యిందా..”
హా.., మనదే ఫస్ట్ బ్యాటింగ్..ఓపెనింగ్ నువ్వే దిగాలి..
“సరే వాసు” అంటూ కొత్త గ్రిప్పర్ ను బ్యాట్ కు తొడిగి, బరిలోకి దిగా..
నా జట్టులో నేను, వాసు; అవతలి జట్టులో ఆకాశ్, విజయ్ ఉన్నారు, మిగతా వాళ్లంతా నాకు పెద్దగా తెలీదు.
ఆట మొదలైంది..
మొదటి రెండు మ్యాచ్ లు చాలా హోరాహోరీగా జరిగాయి, ఆ పోటీని తట్టుకొని ఎలాగోలా గెలిచాం, వరుసగా రెండు సార్లు గెలిచిన ఉత్సాహంలో టీమ్ అంతా గట్టిగా కేకలు వేసాం..
ఆపోజిట్ టీం కెప్టెన్ విజయ్ ఓటమిని తట్టుకోలేకపోతున్నాడు, మూడో మ్యాచ్ ఎలాగైనా గెలుస్తానని ఛాలెంజ్ చేశాడు..
ఈసారి కూడా టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ తీసుకున్నా, నేను వాసు ఓపెనింగ్ దిగాం, విజయ్ టీం ఈసారి బౌలింగ్ చాలా కట్టుదిట్టంగా వేస్తోంది, మేం కూడా మొదటి రెండు మ్యాచ్‌లలో లాగా ముందు నుంచే హిట్టింగ్ చెయ్యకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ జాగ్రత్తగా ఆడుతున్నాం.
స్కోర్ - 50 వచ్చేసింది ఇంకా ఒక్క వికెట్ కూడా పడలేదు, ఇలానే ఆడితే మా స్కోర్ 100 దాటేస్తుంది..
మేము హిట్టింగ్ చెయ్యడం స్టార్ట్ చేశాం, ఎలాగైనా వికెట్ పడగొట్టాలని విజయ్ బౌలింగ్ కి వచ్చాడు…
విజయ్ వేగంగా పరిగెడుతూ వేసిన మొదటి బంతిని వాసు సిక్సర్ గా మలిచాడు…
ఆవేశంతో ఉన్న విజయ్ ఈసారి బంతిని మరింత వేగంగా వేశాడు, దాన్ని అందుకోలేక వాసు బౌల్డ్ అయ్యాడు , ఏం మాట్లాడకుండా తలవంచుకొని బయటికి వెళ్తున్నాడు..
“ రేయ్ వాసు” అంటూ పిలిచి క్రికెటర్స్ లాగా తన భుజం దులుపుకున్నాడు విజయ్, వాసు తన కోపాన్ని అణచి మౌనంగా కూర్చున్నాడు...
తర్వాత నేను స్ట్రైక్ లోకి వెళ్ళా, అతనికి నా మీద ఉన్న కసి ని అలాగే వాసు ని బౌల్డ్ చేసిన ఉత్సాహం కలగలిపి ఇంకా వేగంగా వేశాడు..
నేను కామ్ గా ఉండి అతను వేసిన బంతిని టైమ్ చేశా, అంతే అది సిక్స్ వెళ్ళిపోయింది, క్రికెట్ లో ఎమోషన్స్ పనికి రావు అన్న సంగతి మర్చిపోయి బంతిని ఇంకా వేగంగా విసిరాడు, నేను చాకచక్యంగా మరో 2 సిక్సర్లు కొట్టా, అది హ్యాట్రిక్ అయ్యింది..
విజయ్ తలవంచుకుని నిలబడ్డాడు..
వాసు ఈసారి రెచ్చిపోయాడు, “రేయ్ విజయ్ “ అంటూ ఈసారి తన భుజం దులుపుకున్నాడు, క్రికెటర్లు చేసినట్లు వేరే రకాలుగా అతనిని వెక్కిరించాడు.
ఎలా గొడవ పడాలి అని ఎదురుచూస్తున్న విజయ్ కు ఇది అవకాశంగా మారింది.., అతనికి కోపం పెరిగింది, వాసు మీదకి వేగంగా వెళ్లాడు, వాసు కూడా వెనక్కి తగ్గలేదు, ఇద్దరు ఒకరి కాలర్ ఒకరు పట్టుకున్నారు..
విజయ్ వాసు ముఖం మీద బలంగా గుద్దాడు, వాసు ఆగకుండా విజయ్ చంప ఛళ్లుమనిపించాడు, అంతే ఒకరి మొహం మీద ఒకరు ఎలా బడితే అలా గుద్దుకుంటున్నారు, రక్తాలు వస్తున్నా ఆగట్లేదు, వాళ్ళని ఎవరు ఆపడానికి ప్రయత్నించట్లేదు..
వాళ్ళని ఆపడానికి ఆకాష్ ముందుకు వెళ్ళాడు, విజయ్ ను వెనక్కి లాగుతూ ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు, కోపం లో ఉన్న విజయ్ ఆకాష్ ని గట్టిగా తోసేసాడు..
అంతే.. అదుపుతప్పి ఆకాష్ క్రింద పడిపోయాడు,తల గట్టిగా నేలను తాకింది.
ఆకాష్ ను పట్టించుకోకుండా, వాళ్ళిద్దరూ మళ్ళీ అలాగే గొడవ పడుతున్నారు, మిగతావాళ్ళు ఆ గొడవను చూస్తున్నారు.
నేను మాత్రం ఆకాష్ ని చూస్తున్నా, కింద పడిన వాడు ఎంతసేపైనా కదలట్లేదు, బ్యాట్ ను పక్కకు విసిరేసి కంగారుగా ఆకాష్ వద్దకు పరిగెత్తా..
నేను రావడం చూసి, కొట్లాట ఆపి అంతా మా చుట్టూ చేరారు, తనని స్పృహలోకి తేవడానికి ముఖం పై కొన్ని నీళ్లు చల్లాను.., కానీ ఎటువంటి స్పర్శ లేదు, అలానే ప్రయత్నస్తున్నా..
కొద్ది సేపటి తర్వాత నిదానంగా కళ్ళు తెరిచాడు, అందరం ఊపిరి పీల్చుకున్నాం.., నీళ్లు తాగించి నేను వాడి పక్కనే కూర్చున్నా..
వాడు లేచిన వెంటనే అడిగిన మొదటి ప్రశ్న “ఎందుకు రా, నన్ను చంపేశావ్?” .
నన్ను కాదులే అనుకుని నేనేం మాట్లాడలేదు ..
“అడుగుతోంది నిన్నే “విక్రమ్” , ఎందుకు నన్ను చంపేసావ్..”
ఆకాష్… ఏంటి నువ్వు మాట్లాడేది, నిన్ను తోసింది నేను కాదు విజయ్ గాడు…, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి నేనెందుకు నిన్ను చంపాలనుకుంటా..
కదా, మరి ఎందుకు నన్ను చంపావు రా.. అని గట్టిగా అరిచాడు..
ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, నువ్వు బ్రతికే ఉన్నావుగా నాతో మాట్లాడుతున్నావు గా…
అది నీ భ్రమ..అంటూ నా వైపు విచిత్రంగా చూసి సైకో లా ఒక నవ్వు నవ్వాడు..
ఆ మాటకు నేను వెనక్కి జరిగి కూర్చున్నా..
రేయ్ వాసు,విజయ్ చూడండ్రా ఆకాష్ పిచ్చి పట్టినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు, అంటూ పక్కకు చూసా.. నేను, ఆకాష్ తప్ప గ్రౌండ్ లో ఎవ్వరూ లేరు…
ఆ హ్… హా.. హా… అంటూ వెక్కిలి నవ్వులు.
ఇది నిజం కాదు విక్రమ్ … నిన్ను చంపడానికి నీ ఆలోచనల్లోకి వచ్చా”….. అన్నాడు ఆకాష్.
వాడిని చూస్తుంటే చాలా భయంగా ఉంది, వెంటనే అక్కడి నుంచి పరిగెత్తా…
“నిన్ను చంపక పోతే నాకు మనశ్శాంతి లేదురా…” అని అరుస్తూ నా వైపు వేగంగా పరిగెత్తాడు.
‘ఇప్పుడు గుర్తొచ్చింది, వాడు ఎవడో కాదు , పది సంవత్సరాల నుంచి నన్ను వెంటాడుతున్న నా జ్ఞాపకం…, నా గతం….., నా ఆలోచన….. .ఇన్నాళ్లు నేను వాడి నుంచే దూరంగా పరిగెడుతున్నాను, వాడు వేసే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు…’
పరిగెత్తి పరిగెత్తి నాకు ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది, వాడు మాత్రం అలసిపోవట్లేదు.., వాడి కళ్ళల్లో నన్ను చంపాలన్న ఆవేశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది..
ఏంటిదీ…. ఆశ్చర్యంగా ఉంది !. ఇందాక నా వెంట పడుతున్న ఆకాష్ ఇప్పుడు నా ఎదురుగా వస్తున్నాడు, మరి నా వెనక వస్తోందెవరు అనుకుంటూ వెనక్కి తిరిగా.. అక్కడ కూడా వాడే , అంతా అయోమయంగా ఉంది, కానీ నాకు సమయం లేదు ఎలాగైనా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ముందుకు తిరిగా..
అంతే, నా ఎదురుగా నిలబడ్డాడు ఆకాష్, ఎరుపెక్కిన కళ్లతో తన మోచేతిని వంచి నా ఎదపై బలంగా గుద్దాడు, ఆ దెబ్బకు గుండె ఆగినంత పనైంది , వేగంతో పరుగెడుతున్న నాకు అకస్మాత్తుగా తగిలిన ఆ మోచెయ్యి తాకిడి వల్ల ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి నేల మీద పడ్డాను, నా కళ్ళు బైర్లుగమ్మాయి, నా ఛాతి మీద కలుగుతున్న భయంకరమైన నొప్పి తట్టుకోలేక “అమ్మా” అంటూ గట్టిగా అరిచా…
విక్రమ్ !..
లేవరా…
“ ఏంట్రా బెడ్ మీద నుంచి అలా పడిపోయావు” అంటూ లోనికి వచ్చింది అమ్మ …
అమ్మ అంతే ప్రతి దానికి కంగారు పడుతూ ఉంటుంది, నిదానంగా కళ్ళు తెరిచాడు విక్రమ్, అమ్మ తన ముందే ఉంది, అప్పుడే కళ్ళు తెరచిన సూర్యుడు వెనక కిటికీలోంచి తన కిరణాలతో తల నిమురుతున్నాడు.
‘ఏం లేదమ్మా ఒక పీడకల..’
అందుకే రా పడుకునే ముందు దేవుడికి దండం పెట్టుకోమంటే వింటావా…
“సరే మా, కాఫీ ఇవ్వు”
అమ్మ బయటికి వెళ్ళగానే ఆ కల వల్ల కలిగిన భయాన్ని ఒత్తిడిని పోగొట్టుకోవడానికి గట్టిగా ఊపిరి పీల్చాడు. బ్రష్ నోట్లో పెట్టుకొని స్నానానికి గీజర్ ఆన్ చేశాడు.
“విక్రమ్, 5.8 అడుగుల ఎత్తు, రింగులు తిరిగిన జుట్టు, కొంచెం ఎర్రగా కనిపించే చర్మం, ఒక రెండు సెంటీమీటర్ల గడ్డం, ప్రశాంతమైన కళ్ళు, అతని కళ్ళు ఎదుటి వాళ్ళకి మాత్రమే ప్రశాంతంగా కనిపిస్తాయి కానీ ఆ కళ్ళలో చాలా లోతైన ఆవేదన దాగి ఉంది, ఎప్పుడు ఏవో ఆలోచనలు, ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదు. సారీ, అతనికి ప్రేమించాలి అనిపించలేదు, ఇలా అన్ని చెప్పుకుంటూ పోతే ఏం బాగుంటుంది కథలో ముందుకు వెళ్ళి తెలుసుకుందాం పదండి”
స్నానం చేసిన తర్వాత ఒక సిగరెట్ తాగాడు , బయటకు రాగానే కాఫీ రెడీ గా ఉంది..
కాఫీ కప్పు చేతిలో పట్టుకుని కిటికీ దగ్గర నిలబడ్డాడు. సూర్యకిరణాలు ఒంటి మీద పడుతూ ఆ చలి నుంచి కొంచెం హాయినిస్తున్నాయి, కానీ అతని మనసు మాత్రం కరోనా లాక్ డౌన్ తాలూకు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. రెండేళ్లు ఇంటి గోడల మధ్యే గడిచిన జీవితం – వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్‌లు, నిశ్శబ్దంగా గడిచిన రోజులు – ఇప్పుడు అవన్నీ ఒక కలలా అనిపిస్తున్నాయి…
ఈ రోజు కంపెనీ లో చివరి రోజు, ఆఫీస్ లోకి అడుగుపెట్టగానే జయ కనిపించాడు.
విక్రమ్, జయా తో పాటు తన లాప్టాప్ సబ్‌మిట్ చేశాడు.
తెలిసిన వాళ్లందరినీ పలకరించారు, సాఫ్ట్‌వేర్ లో లాస్ట్ వర్కింగ్ డే అంటే పార్టీ ఇవ్వాల్సిందే, తెలిసినవాళ్ళని పిలిచి రెస్టారెంట్లో పార్టీ అరేంజ్ చేశారు .. కొంతమంది ఆలస్యంగా రావడంతో సాయంత్రం అయిపోయింది, వాచ్ వంక చూశాడు విక్రమ్, టైం 6:30 కావస్తోంది, అందరూ తినడం పూర్తయింది..
రేయ్ జయ..
ఏంటి..
టైం అవుతోంది! ఇక వెళ్దామా...
ఒక 15 మినిట్స్ ఆగు బయలుదేరుదాం, ఇదిగో ఈ కూల్ డ్రింక్ తాగు కూల్ అవుతావ్..
*****
రాత్రి 7:00 అయ్యింది..
“ ఒరేయ్ ఎక్కడున్నావ్ రా!” ఫోన్లో పిలిచాడు సూర్య.
"వస్తున్నా నాన్న, కొంచెం ట్రాఫిక్ ఉంది మీరు రెడీ అవ్వండి” అంటూ ఫోన్లో వినబడింది.
“ఏంటండి మీరు.. బస్సుకు టైమ్ అవుతున్నా ఇంకా ఫోన్లో మాట్లాడుతున్నారు”, అంటూ కసిరింది శారద..
నీ సుపుత్రుడిని త్వరగా రమ్మంటున్నా..
వాడు వస్తాడు కానీ వచ్చి మీరు బ్యాగులు సర్దండి.. అంటూ లోనికి వెళ్ళింది..
సమయం 7:40, ట్రాఫిక్ వల్ల రద్దీగా ఉంది రోడ్డు, ఆ ట్రాఫిక్ లో ఆగిన కార్లను దాటుతూ ముందుకెళ్తున్నాడు జయ..
సిగ్నల్ ఇంకా రెడ్ లోనే ఉంది, ఆలస్యం అవుతుందేమోనని సిగ్నల్ ను బ్రేక్ చేసి ముందుకెళ్లాడు..
ఇంతలో అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్ వీళ్ళని పట్టుకోడానికి ఎదురుపడ్డాడు, వెంటనే బండిని ఒక మలుపు తిప్పి, రాంగ్ రూట్లో నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు.
రేయ్ ఎందుకురా అలా చేశావ్ పోలీస్ కి దొరికుంటే ఇక మనం ఇంటికెళ్ల అవసరం ఉండేది కాదు. నువ్వు వెనక్కి రా.. నేను డ్రైవ్ చేస్తా, అంటూ విక్రమ్ బండి తీసుకున్నాడు.
ఇంకేంటి విక్రమ్ ఇంటికి వెళ్తున్నావ్.. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు, అడిగాడు జయ
నెక్స్ట్ వీక్ వస్తారా, ఎలాగూ కొత్త కంపెనీలో జాయినింగ్ అప్పుడే గా.
ఈ వారం మొత్తం నేనొక్కడినే ఏం చెయ్యాలి…
నువ్వు ఇంటికి వెళ్ళు మావ..
నేనా ! , ఒకేసారి మా ఊళ్ళో మాంకాలమ్మ జాతరకు వెళ్తా.., అంతవరకు ఇక్కడే..
జాతరకు మమ్మల్ని పిలవవా మరి..
*****
ఈ తొలి పౌర్ణమి అన్న కథను రాసినది జుంజే.
ఈ కథ మీ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. దయచేసి మీ హృదయ స్పందనని సమీక్షలో తెలపగలరు
ఇట్లు
జంజే