Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తొలి పౌర్ణమి - 6

విషయం తెలిసిన సూర్య అక్కడికి వచ్చాడు, సూర్య మీదకి ఆవేశంగా వెళ్ళాడు రమణ. “నీ కొడుకుని రెచ్చగొట్టి పంపించి నా కొడుకుని చంపావు కదరా!!” అంటూ చొక్కా పట్టుకున్నాడు.
 అది కాదు రమణ అదేదో పొరపాటున జరిగిపోయింది ఎవరైనా కావాలని ఇలాంటి పనులు చేస్తారా చెప్పు..
ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నీ కొడుకుని సమర్థించుకుంటున్నావ్…, నీకు కొంచెం కూడా బాధగా లేదా, అంటూ కాలర్ పట్టుకున్నాడు రమణ..
మాటకు మాట పెరిగి గొడవ పెద్దదవుతోంది చుట్టుపక్కల వాళ్లంతా ఇది సమయం కాదు అంటూ సర్ది చెప్పి సూర్యను ఇంటికి పంపారు.
 విక్రమ్ నాన్నతో కలిసి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు, అలా వెళ్తున్నప్పుడు హేమ మళ్ళీ ఇంకొక చూపు చూసింది, ఆరోజు కృతజ్ఞతగా చూస్తే, ఈరోజు అసహ్యంగా చూసింది, విక్రమ్ తల వంచుకుని వెళ్ళిపోయాడు.
 రమణ కుటుంబం మొత్తం ఒక అంబులెన్స్ ను సిద్ధం చేసి సొంతవూరుకు బయలుదేరారు …
 విక్రమ్ ను ఇంట్లోకి తీసుకెళ్లాడు సూర్య..
 విక్రమ్ మౌనంగా ఒక పక్క కూర్చున్నాడు..
సూర్యా అరుస్తూ- ఎన్ని సార్లు చెప్పాను రా కోపాన్ని అదుపు చేసుకోవాలని నీ కోపం వల్ల ఒక ప్రాణం పోయింది. ఏది నీ కోపాన్ని ప్రదర్శించి ఆకాష్ ని బ్రతికించు చూద్దాం, నీ లైఫ్ లో ఎంత మంచి చేసిన కూడా ఈ మచ్చని తుడిపేసుకోగలవారా. 
అది కాదు నాన్న, అంటూ ఏదో చెప్పబోయాడు..
ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడొద్దు విక్రమ్, ఒకవేళ మాట్లాడితే నేను ఇంట్లోకి రాను, అంటూ బయటికి వెళ్లిపోయాడు సూర్య..
వాళ్ళ నాన్న అలా మాట్లాడటం మొదటి సారి, అప్పటిదాకా తన జీవితంలో కోపం, ఆనందం తప్ప ఏం తెలియదు విక్రమ్ కు ఇద్దరు కొత్త మిత్రులు పరిచయం అయ్యారు అవే భయం, ఒంటరితనం..

పైన జరిగిన కథంతా వాళ్ళ నాన్నకు చెప్పాడు సూర్య.
ఇంత జరిగితే నాతో ఒక్క మాటైనా చెప్పలేదు కదరా అంటూ సీరియస్ అయ్యాడు రామన్న తాత..
మిమ్మల్ని కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు నాన్న..
“విషయాలు దాచడం వల్ల చాలా సమస్యలు వస్తాయి” ఇంతకీ ఆ తర్వాత ఏమైంది అంటూ కొంచెం టెన్షన్ గా అడిగాడు తాత..
సూర్య మాట్లాడుతూ -
ఆ తరువాత నేను వాడితో మాట్లాడకపోగా. పరోక్షంగా విక్రమ్ చేసిన తప్పును మాటిమాటికీ ఎత్తి చూపించేవాడిని. అక్కడ ఉంటే మాకు అదే గుర్తుకొస్తుందని మేము బెంగళూరుకు వెళ్ళిపోయాం.
నేనైతే అసలు విక్రమ్ ఎలా ఉన్నాడు, అతని జీవితంలో ఏం జరుగుతోంది అన్న విషయం పట్టించుకోవడమే మానేశా, కొన్ని రోజుల తర్వాత నేను గమనించిందేంటంటే విక్రమ్ చాలా మారిపోయాడు అస్సలు కోప్పడట్లేదు, ఎప్పుడు మౌనంగా ఉంటున్నాడు, కానీ అప్పుడప్పుడు కొంచెం వింతగా ప్రవర్తించేవాడు.
అప్పుడు సరిగ్గా వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు..
ఒకరోజు అర్ధరాత్రి వాడి గదిలో నుంచి గట్టిగా కేకలు వినపడ్డాయి. భయం భయంగా నేను శారద పరిగెత్తుకుంటూ వెళ్ళాం. అక్కడ జరుగుతున్న సంఘటన చూసి నాకు చాలా భయం వేసింది.
 విక్రమ్ గట్టిగా ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వాడి గొంతుని ఎవరో నొక్కి పట్టుకున్నారు, చీకట్లో సరిగ్గా కనబడలేదని లైట్ ఆన్ చేశా, చూస్తే నా మతి పోయింది అక్కడ ఎవరూ లేరు, భయమేసింది, గట్టిగా అరుస్తూ దగ్గరకు వెళ్లా, విక్రమ్ ను లేవదీసి కూర్చోబెట్టాను, నన్ను గట్టిగా హత్తుకొని అలాగే ఉండిపోయాడు. 
అన్ని స్థిమితపడ్డాక, “అసలు ఏమైంది రా ?” అని అడిగాను..
 వాడు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు నాన్న... 
ఎవర్రా అది..
ఆకాష్….
“నా ఒళ్ళు గగుర్పొడిచింది.”
ఏంట్రా నువ్వనేది..
నిజం నాన్న, నాకు రోజు వచ్చే పీడ కలలు, అలాగే కనిపిస్తున్న సన్నివేశాలు చూసి తట్టుకోలేకపోతున్నా, చాలా భయమేస్తోంది, చచ్చిపోవాలనిపిస్తోంది నాన్నా..
సరే భయపడకు ఇక మేం ఉన్నాం గా…
అసలేం అర్థం కాలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చనిపోయిన ఆకాష్ ఇప్పుడు విక్రమ్ ని చంపడం ఏంటి, ఆ రాత్రంతా విక్రమ్ పక్కనే ఉన్నా..
ఆరోజు రాత్రి నాకు అర్థమైంది ఏంటంటే విక్రమ్ ఈ పరిస్థితిలో ఉండడానికి పరోక్షంగా నేను ఒక కారణమే. “ఒక తండ్రిగా అతని నేనే క్షమించలేనప్పుడు తనని తాను ఎలా క్షమించుకోగలడు, అలాగే ఆకాష్ విక్రమ్ వల్ల చనిపోయాడని ఆలోచిస్తున్నాం కానీ విక్రమ్ కూడా ఆకాష్ ని కోల్పోయాడని మర్చిపోయాం.”
మొదట దయ్యమేమో అనుకొని నాకు నమ్మకం లేకపోయినా వాడి కోసం చాలా మంది పూజారులకు, మంత్రగాళ్ళకు చూపించాం, కానీ ఏం లాభం లేకుండా పోయింది.
 నాకు బాగా తెలిసిన ఒక మిత్రుడు డాక్టర్ ఓబెరాయ్ అనే మంచి సైకియాట్రిస్ట్ గురించి చెప్పాడు. కష్టపడి అతని అపాయింట్మెంట్ సంపాదించి ఆయనను కలిసాం. ఆయన అపరిచితుడు సినిమాలో లాగా చాలా పరీక్షలు చేసి ఒక నిజం చెప్పాడు. ఏదో “పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసోడర్” అంట, దాని వల్ల మన విక్రమ్ చాలా బాధలు పడుతున్నాడు. లేనివి ఉన్నట్టు ఊహించుకొని అనవసరంగా భయపడుతున్నాడు.
“ అసలు ఇలాంటి సమస్య ఎందుకొచ్చింది డాక్టర్” అని అడిగా..
‘ “ గిల్టీ అండ్ లోన్లినెస్” ఎవరన్నా ఈ రెండిటి వల్ల సఫర్ అయితే ఇలాంటి పరిస్థితి వస్తుంది, విక్రమ్ మనసులో ఆకాష్ ను చంపాను అన్న ఆలోచన అతన్ని కుదిపేస్తోంది, దానికి తోడుగా ఆకాష్ లేకుండా అతను గడిపిన ఒంటరి సమయం, ఈ రెండు ఒక ఆలోచనలా మారి విక్రమ్ తనను తానే ద్వేషించుకునేలా చేశాయి, ఆ ఆలోచన ఎలాంటిది అంటే విక్రమ్ ఒంటరిగా ఉన్న ప్రతిసారి అతని మానసిక స్థితిని కంట్రోల్ చేసే అంత, ఈ విషయంలో తనను తాను సెల్ఫ్ జస్టిఫై చేసుకోలేకపోతున్నాడు విక్రమ్..’
ఇదంతా వింటుంటే నాకు చాలా కంగారుగా ఉంది డాక్టర్
భయపడకండి, ఇదేం కొత్త వ్యాధి కాదు ఇలాంటి కేసులు నేను ఎన్నో చూశా, ఐ విల్ డూ మై బెస్ట్..
“ అలా కొన్నాళ్లు “Safety and Stabilization treatment” ఇచ్చాడు డాక్టర్ ఓబెరాయ్ – ఇందులో మన విక్రమ్ కు ఎలాంటి భయం లేదని తను సురక్షితంగా ఉన్నాడని నమ్మిస్తారు, వారానికి రెండు సార్లు థెరపీ చేసేవాళ్ళు, ఈ ట్రీట్మెంట్ రెండు నెలల పాటు జరిగింది”. ఆ తర్వాత ఒక రోజు విక్రమ్ ని పరీక్షించడానికి ఒక రూమ్ లో ఒంటరిగా వదిలేసి ఒక టెస్ట్ పెట్టాడు, రాత్రంతా ఎలా ఉన్నాడో అని నేను శారద చాలా కంగారు పడ్డాం.
మరుసటి రోజు ఉదయం డాక్టర్ ఓబెరాయ్ డోర్ తెరవగానే చిన్న పిల్లాడిలా భయపడి టేబుల్ పక్కనున్న మూలలో ఒదిగిపోయి ఉన్నాడు , అతని పరిస్థితిని గమనించి డాక్టర్ ఏమైందని ప్రశ్నించాడు.
డాక్టర్ నిన్న రాత్రి అంతా ఒకటే ప్రశ్న ,” నన్ను ఎందుకు చంపావ్”, రూమ్ లో ఎటువైపు చూసిన వాడే, నేనేం మౌనంగా ఉన్నా కూడ వదలలేదు, నిజంగా నేను అందరూ చెబుతున్నట్టు వాడిని చంపేశానా, ఈ బాధ తట్టుకోవడం నావల్ల కావట్లేదు, రాత్రి చనిపోదామని అనుకున్నా, కానీ ఆ ఛాన్స్ లేదు రూమ్ లో నాకు ఏం దొరకలేదు.. అన్నాడు విక్రమ్..
అది చూసిన డాక్టర్ ఓబెరాయ్ కు చాలా బాధ కలిగింది, తన కళ్లలో నీళ్ళు కదిలాయి “, బయటికి వచ్చి మాతో విషయం చెప్పగానే మాకు చాలా భయమేసింది..
ఇప్పుడు ఎలా డాక్టర్..అని అడిగా..
“ డోంట్ వర్రీ దీనికి సెకండ్ ఫేస్ ట్రీట్‌మెంట్ ఉంది “Processing of Traumatic Memories” దాంట్లో అతని జ్ఞాపకాలను వెలికి తీసి వాటిని పాజిటివ్ గా అతనికి అర్థమయ్యేలా చేస్తాం, నేను కచ్చితంగా నయం చేయడానికి ట్రై చేస్తా, నేను మీకు మాటిస్తున్నా విక్రమ్ బాధ్యత నాది అన్నాడు.
అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది.
 అలా ఫేస్ టు లో భాగంగా విక్రమ్ ఆలోచనలు మార్చడానికి ఆయన చాలా ప్రయత్నించాడు, చిన్నపుడు సంఘటన జరిగిన చోటుకు తీసుకెళ్ళాడు, ఆయన ప్రయత్నానికి ప్రతిఫలంగా విక్రమ్ లో చాలా మార్పులు కనబడ్డాయి…
ట్రీట్‌మెంట్ తర్వాత డాక్టర్ ఓబెరాయ్ ఏం చెప్పారంటే - విక్రమ్ ఇందులోంచి పూర్తిగా బయటపడాలంటే 
అతని ఆలోచన మార్చాలి. ఇది పూర్తిగా నయమవ్వడం విక్రమ్ చేతులలోనే ఉంది, మనం చేయాల్సిందల్లా వాడి మార్పుకు కారణం అయ్యే ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పరచాలి.
ట్రీట్‌మెంట్ తర్వాత చాలా రోజుల వరకు బానే ఉన్నాడు, విక్రమ్ ని ఒంటరిగా ఉండకుండా చూసుకోమని డాక్టర్ ఓబెరాయ్ చెప్పాడు కాబట్టి తనని ఒంటరిగా వదిలే వాళ్ళం కాదు, ఉద్యోగం వచ్చిన తర్వాత మాతో మాట్లాడటం తగ్గించేశాడు , బహుశా పని ఎక్కువ ఉండటం వల్ల ఏమో అనుకున్నాం, కానీ నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే వాడు ఇన్ని రోజులు మా దగ్గర చాలా విషయాలు దాస్తున్నాడు, నేను మళ్ళీ నాన్నగా విఫలమయ్యాను.”
“బాధ పడకు సూర్య, నీ వల్ల అయ్యింది నువ్వు చేసావ్, ఇప్పుడు ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం” అన్నాడు తాత.
ఎలా అయినా సరే వాడు ఆ ఆలోచన నుంచి బయటపడాలి నాన్న, అదొక్కటే మనకున్న మార్గం.
తాత మాట్లాడుతూ - మీ బావ మల్లికార్జునా ఉన్నాడు కదరా వాడికి ఒక కూతురు ఉంది తన కూడా ఇంజనీరింగ్ అయిపోయి ఇపుడు ఏదో జాబ్ లో జాయిన్ అవుతోంది. వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తే అదే సర్దుకుంటుంది అని అనుకుంటున్న, “మిమ్మల్ని ఉన్నపళంగా ఊరికి రమ్మంది అందుకే..”
 కానీ నాన్న ఇప్పుడు వాడున్న పరిస్థితిలో పెళ్లి చేస్తే, వాడు ఇంకా అయోమయంలో పడతాడేమో అని భయంగా ఉంది. 
సరే సూర్య అయితే ఒక పని చేద్దాం, తను కూడా ఇక్కడే ఉంది ఆమె పేరు గౌతమి, వాళ్ళతో సంబంధం కలుపుకుంటున్నామన్న విషయం విక్రమ్ కు చెప్తాను, ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఎలాగోలా అదే కుదురుతుంది, అని ఒక కన్ను కొట్టాడు తాత. 
సరే నాన్న మీరు ఎలా అంటే అలా ..
“అబ్బాయిలు ప్రేమలో పడితే, ఆ అమ్మాయినే తమ ప్రపంచంగా మలచుకొని జీవిస్తారంటారు… విక్రమ్ ఆలోచనల్ని మార్చే ఆ పుణ్యాత్మురాలు గౌతమి అయితే బాగుండు” అని మనసులో అనుకున్నాడు సూర్య.



ఏంటి చాందినీ… అసలు అబ్బాయిలు కనిపిస్తే దూరంగా పారిపోయే దానివి అలాంటిది ఎవడో ఒక తెలియని వాడికి పేరు చెప్పావు…. అలాగే కొంత సేపు మాట్లాడావు ఏంటి విషయం అంది శృతి.
హే అతను నన్ను కిందపడకుండా పట్టుకున్నాడు, తను పలకరించినప్పుడు మాట్లాడక పోవడం మంచిగా ఉండదు కదా..
ఏమో చందు నాకెందుకో నువ్వు కొంచెం రొమాంటిక్ గా పలకరించినట్టు అనిపిస్తోంది..
ఇదిగో ఇలా మాట్లాడావంటే నీతో అస్సలు మాట్లాడను అంది చాందిని. 
సరే మహాలక్ష్మి నువ్వు చెబితే తప్పుతుందా…
ఇప్పుడు నన్ను ఏమని పిలిచావ్..
నేనేమీ ఆనలేదు..
మహాలక్ష్మి అన్నావ్ కదూ, నిన్ను కొట్టేస్తా అంటూ దిండు చేతిలోకి తీసుకొంది చాందిని..
అతనే గా నీ మీద ప్రేమతో ఆ పేరు పెట్టాడు…
అదిగో మళ్ళీ అదే మాట అంటూ, దిండు విసిరింది..
శృతి నవ్వుతూ, సరే తల్లి ఇక అనను లే నన్ను వదిలేయ్..
అలా రా దారికి అయినా నువ్వు మాత్రం ఎప్పుడు వాడెవడితోనో ఫోన్ మాట్లాడుతూనే ఉంటావు.
వాడు వీడు అనొద్దు. వాడు మా బావ….., సారీ ఆయన మా బావ.
చాందిని నవ్వుతూ, తల్లి ఆపు నీ బావ పురాణం, బీటెక్ నుంచి వినలేక చస్తున్నాను, సరే బీటెక్ అయిపోయింది కదా ఎలాగోలా తప్పించుకున్నా అనుకుంటే ఇద్దరం ఒకే కంపెనీలో జాయిన్ అవుతున్నాం, నిన్ను ఎలా భరించాలో ఏంటో.
మా బావ లాంటి బావ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు తెలుసా.
సరే నేను పడుకుంటా నువ్వు త్వరగా పడుకో, వాగుతూనే ఉంటావు.
అవును చాందిని ఇప్పటికే పదవుతోంది, రేపు పొద్దున్నే ఆఫీస్ కి వెళ్లి రిపోర్ట్ చేయాలి ఇక పడుకుందాం.
“గుడ్ నైట్ శృతి” అంటూ బెడ్ షీట్ కప్పుకుంది చాందిని.
      *****
ఒసేయ్ శృతి లెగవే…
ఇంకో 10 నిమిషాలు చందు…
“తొందరగా పడుకుందామని చెప్పి 9 అవుతున్న ఇంకా లేవట్లేదు, లెగూ…”, తల దువ్వుకుంటూ అరిచింది చాందిని.
“ ఏంటి 9 అవుతోందా” అంటూ నిద్రలేచింది శృతి…
మా బావ ఉన్నాడే రాత్రి 11:00 కి కాల్ చేశాడు, సరే ఏదో కాల్ చేశాడు కదా అని మాట్లాడితే రెండింటి వరకు వదలలేదు.
నీ బావ పురాణం పక్కన పెట్టి తొందరగా రెడీ అవ్వు. రిపోర్టింగ్ టైం అక్కడ 9:30 అని ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేశారు, ఫస్ట్ రోజు లేటుగా వెళ్తే ఏం బాగుంటుంది, అది కాకుండా మనం ఇంకా ఫ్రెషర్స్. 
సరే సరే అంటూ సరసర తన బట్టలు తీసుకుని బాత్రూం లోకి వెళ్ళింది శృతి.
ఇలా వెళ్ళి అలా ఐదు నిమిషాల్లో వచ్చేసింది…
చాందిని అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసుకుంటోంది. “ఏంటమ్మా అద్దం చూసి మురిసిపోతున్నావా వయసు మీదకోచ్చిందా ఏంటి” ..అడిగింది శృతి
ఛీ పోవే నీకు అస్సలు సిగ్గులేదు, నేనేదో ఆలోచిస్తూ నిలబడ్డా అంతే... 
విక్రమార్కుడి గురించేనా? 
అదిగో అదిగో, నువ్వు తిరిగి తిరిగి ఆ విక్రమ్ దగ్గరి కే వెళ్తున్నావ్, నిన్ను కొట్టేస్తా చూడు..
నేను చెప్తుంది నువ్వు నిన్న చూసిన విక్రమార్కుడు సినిమా గురించే..
అవునా, సరే నేను వెళుతున్నాను , నువ్వు ఒంటరిగా రా..
సర్లేవే బాబు ఐదు నిమిషాలు ఆగు కలిసే వెళ్దాం.
9 : 10 కి ఆఫీస్ గేట్ ముందు నుంచున్నారు, “OKLA” అని కంపెనీ పేరు చాలా అందంగా డిజైన్ చేయించారు.
సమయం సరిగ్గా 9:30 అవుతోంది, శృతి మరియు చాందిని టెంపరరీ ఐడి కార్డులను తీసుకొని ఆఫీస్ లోకి వెళ్ళారు. 
ఇద్దరికీ ఏదో ఒక తెలియని కంగారు, జీవితంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నామన్న కుతూహలం తో, సెక్యూరిటీ చూపించిన ఆడిటోరియం డోర్ తీశారు..