సోమవారం పొద్దున్నే లేచి ఆఫీస్ కి రెడీ అవుతున్నాను, కొన్ని రోజులు చూసి ఈ జాబ్ మానేసి తనని వెతికిన తర్వాత ఇంకో జాబ్ వెతుకుదామని అనిపిస్తోంది.
“ఏంట్రా విక్రమ్ వారం రోజుల నుంచి చూస్తున్నా చాలా దిగాలుగా ఉన్నావ్” అంటూ అడిగింది అమ్మ.
అలాంటిదేమీ లేదమ్మా.
నీ కళ్ళలోనే కనిపిస్తోంది, ఏమైందిరా.
విషయం చెప్పలేక ఇలా చెప్పా, అదే అమ్మ ఆ కొత్త ఆఫీస్ లో మనుషులు ఎలా ఉంటారా అని ఆలోచిస్తున్నా.
ఎలా ఉన్నా వాళ్లు మనుషులే కదరా ఏలియన్స్ కాదు కదా మనం మంచిగా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది.
“మనం ఏదైనా అబద్ధం ఆడినప్పుడు దాని గురించి నీతులు వినడం చాలా దారుణంగా ఉంటుంది..”
షూ వేసుకొని బయలుదేరాను.
రేయ్ విక్కీ ఒక 20 నిమిషాలు ఆగరా దోసెలు చేస్తా తిని వెళ్దువు గాని.
వద్దమ్మా, ఇప్పుడే లేట్ అయింది, జయా గాడు తొందరగా వస్తా అన్నాడు, ఈరోజు అక్కడే భోంచేస్తాం ఇద్దరం.
సరే నీ ఇష్టం, జాగ్రత్తగా వెళ్ళి రా..
అలాగే మా, బాయ్..
ఈ క్లైంట్ ఆఫీస్ కూడా బెళందూరు లోనే ఉంది.
బైక్ పార్క్ చేసి, అక్కడ మేనేజర్ ను కలిసా., తను థర్డ్ బిల్డింగ్ కు వెళ్ళమంది..
‘ఎక్స్‌క్యూజ్ మీ ఇక్కడ C- క్యాబిన్ ఎక్కడుంది’ అంటూ ఎంక్వయిరీ అమ్మాయిని అడిగాను.
స్ట్రెయిట్ గా వెళ్లి లెఫ్ట్ తిరగండి.
“థ్యాంక్స్” అంటూ లెఫ్ట్ కార్నర్ వైపుగా నడిచా,” చాందిని గురించి ఆలోచిస్తున్నా..”
సరిగ్గా ఎడమవైపు తిరిగాను, ఇంతలో పరుగు పరుగున వస్తున్న ఒక అమ్మాయి నన్ను గుద్దేసింది, దెబ్బకు చుట్టూ తిరుగుతూ కింద పడిపోయా…
“ఐ యాం సారీ, ఐ యాం సారీ”
పక్కన పడ్డ నా ఫైల్ తీసుకొని లేస్తుండగా ఆ అమ్మాయి నాకు చెయ్యి అందించింది…తన మొహం ఇంకా నేను చూడలేదు.
తన చెయ్యి పట్టుకున్నానో లేదో, అదే అనుభూతి, అదే స్పర్శ, అది తనేనా అని నా మనసులో ఒక చిన్న అనుమానం , ఆ సుతిమెత్తని చేతులు పట్టుకొని ఆమె వంక చూశా.., అది తనే.
ఐ యాం సారీ అంటూ తన చెవిని తానే క్యూట్ గా పట్టుకుంది, “అరకొరా కళ్ళు మూసుకొని ఎంత ముద్దుగా ఉందో..”
తన చెయ్యి అందుకుని పైకి లేచా.
మీరు విక్రమ్ కదా అంటూ సాధారణంగా పలకరించింది నన్ను.
“తనకు నన్ను చూడటం అంత గొప్ప విషయం కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం అమావాస్య రోజు తప్పిపోయిన చందమామని మళ్లీ చూసినట్టుగా ఉంది.”
“మీరు మహాలక్ష్మి కదూ” అన్నా కంగారులో.
అయ్యో మీరు మళ్ళీ తప్పుగా చెప్పారు, నా పేరు చాందిని.
సారీ ఏదో కంగారులో అలా పిలిచేసా.
ఆ పర్వాలేదు, అయినా మీరేంటి ఇక్కడ.
ఈ కంపెనీ మా క్లైంట్, ఇందులో ఏదో ప్రాజెక్టుకు క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి మమ్మల్ని ఇక్కడికి పంపించారు.
అవునా..
మరి నువ్వేంటి ఇక్కడ..
నేను ఈ కంపెనీలోనే ప్రెషర్ గా జాయిన్ అయ్యా, కానీ .మాకు ముందే ప్రాజెక్ట్ ఇచ్చేశారు..
లైఫ్ లో ఫస్ట్ టైం దేవుడికి మనసారా థ్యాంక్స్ చెప్పుకోవాలి అనిపించింది, కచ్చితంగా గుడికెళ్ళాలని మొక్కుకున్నా..
అలా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళాం.
“మీరు ఏ క్యాబిన్ కు వెళ్ళాలి” అని అడిగింది తను.
C- క్యాబిన్..
మేము ఆ క్యాబిన్ లోనే ఉన్నాం..
“దేవుడు ఉన్నాడు రా.., అని మనసులో అనుకున్నా”.
మీరు ఒకసారి లావణ్యను కలవాలి..
లావణ్య ఎవరు.
తను మా సీనియర్, ఈ ప్రాజెక్టు నుంచి రిలీవ్ అవుతోంది.. ,కానీ మిమ్మల్ని పలకరించడానికి వచ్చింది ఒకసారి తనతో మాట్లాడవా.
తప్పకుండా అంటూ క్యాబిన్ డోర్ తీసి లోనికి వెళ్ళాం.
హాయ్ విక్రమ్..
హాయ్ మీరేనా లావణ్య అంటే
అవును, నీతో కొంచెం మాట్లాడాలి విక్రమ్ అంటూ వాళ్ళిద్దరినీ బయటికి పంపింది. తను నాతో ఏం చెప్తుందో మీకు ముందు ముందు అర్థమవుతుంది లేదా మీకు ఈపాటికి తెలిసే ఉంటుంది.
జయ కాల్ చేశాడు..
రే విక్రమ్.. నేను బిల్డింగ్ ముందు ఉన్నా..
నేను బిల్డింగ్ లోపల ఉన్న, నువ్వు అప్పుడే బయలుదేరా అని చెప్పావ్, కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు
ట్రాఫిక్ రా.., సరే వస్తున్నా.
ఐదు నిమిషాల లో క్యాబిన్ దగ్గర ఉన్నాడు జయ.
క్యాబిన్ డోర్ తీసిన వెంటనే తనని చూశాడు, వెంటనే నా వంక చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి ఇలా అన్నాడు, “అర్జునా ఈ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ఇక ఈ సుభద్ర నీదే అన్నాడు.”
వాళ్ళకేం అర్థం కాలేదు, సుభద్ర ఎవరు అని అడిగింది శృతి.
ఏం లేదు, జయ ఒక నాటకం లో వేషం వేస్తున్నాడు, దానికోసం అప్పుడప్పుడు ఇలా రిహార్సల్స్ చేస్తుంటాడు పిచ్చి పట్టినట్టు,అని కవర్ చేశా.
చాందిని శృతి లావణ్య ముగ్గురు చిన్నగా నవ్వుకున్నారు..
దుర్మార్గుడా తన కోసం నన్ను పిచ్చోడిని చేస్తావా అనుకున్నాడో ఏమో పాపం, నా వైపు కోపంగా చూసాడు.
అలా మేమిద్దరం ‘లాప్ టాప్’ కలెక్ట్ చేసుకొని ఆ రోజంతా కాలక్షేపం చేశాం, ఆరోజు ఆర్కిటెక్ట్ రాలేదు లేకుంటే ఆరోజే కేటి స్టార్ట్ చేసేవాడు.
ఆరోజంతా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం, అలాగే క్యాంపస్ మొత్తాన్ని చూసాం..
*************
రాత్రి నిద్ర పట్టలేదు, ఏంటో ఈ వింత అనుభూతి, తను లేని సమయం తొందరగా గడవాలని, తను ఉండే సమయానికి వెళ్లాలని, తను ఉంటున్న సమయం నిదానంగా గడపాలని.. ఇలా ఏవేవో.
మరుసటి రోజు, ఆఫీస్ కి వెళ్ళగానే ఆర్కిటెక్ట్ కనిపించాడు, అతనికి హాయ్ చెప్పి కాసేపు మాట్లాడా, అతను మాట్లాడే తీరు చూస్తుంటే క్లైంట్ లొకేషన్ కి వచ్చిన వాళ్ళు భయపడాలి, అలాగే ఆ ఫ్రెషర్స్ ఇద్దరిని ప్రాజెక్టు నుంచి వెళ్లగొట్టాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, అసలు లావణ్య నాతో ఎందుకు అలా చెప్పిందో నాకు ఇప్పుడు అర్థమైంది.
మమ్మల్ని క్యాబిన్‌లోకి తీసుకెళ్లాడు, మాకు ఆల్రెడీ పరిచయం ఉందన్న సంగతి అతనికి తెలియలేదు….
“హాయ్ చాందిని అండ్ శృతి దీజ్ టూ ఆర్ యువర్ న్యూ కొలీగ్స్ విక్రమ్ అండ్ జయ” అన్నాడు సోహమ్ (ఆర్కిటెక్ట్).
హాయ్ అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చింది శృతి.
సారీ గాయ్స్ చాందిని కి చెయ్యి బాగోలేదు అందుకే తను మొన్న కూడా నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, అంటూ చాందిని వైపు చూసి నవ్వాడు సోహమ్.
ఇప్పుడు బానే ఉన్న అంటూ విక్రమ్, జయాలకు షేక్ హ్యాండ్ ఇచ్చింది చాందిని.
అప్పుడే వచ్చిన లావణ్య ఇది విని నవ్వాపుకుంటుంది…
కడుపు రగిలిపోయింది సోహమ్ కి, తన కోపాన్ని అణచి “దట్స్ నైస్ టు నో చాందిని” అంటూ స్మైల్ ఇచ్చాడు.
ప్రాజెక్ట్ లో ఎలా ఉండాలి, ఏం వర్క్ చెయ్యాలి, రిక్వెస్టర్స్ తో ఎలా మాట్లాడాలి ఇలాంటి విషయాలు కొంత సేపు చెప్పి వెళ్ళిపోయాడు.
అలా మొదలైంది మా ప్రయాణం, ఒక 15 రోజుల పాటు అతను మాకు కేటీ ఇవ్వడం, సమయం దొరికినప్పుడు మేము వాళ్లకు కొత్త విషయాలు చెప్పడం ఇలా గడిచిపోతోంది, అలా కొన్ని రోజుల తర్వాత వర్క్ స్టార్ట్ అయ్యింది..
ఎవరికి వాళ్ళు పనిలో నిమగ్నమైపోతున్నారు...
వర్క్ స్టార్ట్ అయిన ఐదవరోజు ఉదయం, సోహమ్ శృతి మీద అరుస్తున్నాడు.
“అసలు కామన్ సెన్స్ లేదా మీకు, ఏమీ అడగకుండా ప్రొడక్షన్ టేబుల్ ఎలా డిలీట్ చేస్తారు, యూజర్ నా మీద ఎక్కి కూర్చొంటున్నాడు, నన్నేం చెయ్యమంటారో చెప్పండి” అని గట్టిగా అరిచాడు సోహమ్, “ఏంటి చాందిని నువ్వు పక్కనే ఉన్నావ్ గా ఇది గమనించలేదా..”
ఇద్దరు ఏడుస్తున్నారు, నాకు అది నచ్చలేదు, అసలు ఏమైందో వాళ్ళిద్దరినీ కనుక్కున్నాను.
‘ డోంట్ వర్రీ సోహమ్ ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్, ఎందుకంటే వాళ్ళిద్దరికీ వర్క్ ఎలా చేయాలో చెప్పింది మేమే, “డిలీట్ చేసిన టేబుల్ ని మళ్లీ రోల్ బ్యాక్ చేసి రీస్టార్ట్ చేస్తే” సరిపోతుంది.’
“అది నాకు తెలియదు అనుకుంటున్నావా ” అన్నాడు సోహమ్.
మరి ఇంకేంటి ప్రాబ్లం..
వాళ్లు చేసింది పర్మనెంట్ డిలీట్.
చాందిని మరియు శృతిలకు ఇంకా భయమేసింది.
ఓకే, రీసెంట్ గా ప్రొడక్షన్ ను క్లోన్ చేశాం, ఇప్పుడు ఆ టేబుల్ మరియు డేటా రెండు ప్రీ ప్రొడక్షన్ లో ఉంటాయి, టేబుల్ ని ఒకసారి టెస్ట్ చేసి ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తాం, యూజర్స్ ని అడిగి కొత్తగా ఎంటర్ చేసిన డేటాని మాన్యువల్ గా ఎంటర్ చేస్తాం లేదా ఇంటిగ్రేషన్ రిసోర్సెస్ ఉంటే పని ఇంకా ఈసీ అవుతుంది, తర్వాత ఏమన్నా ఇష్యూ వస్తే రిసాల్వ్ చేస్తాం.
“ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా చూడండి” అని, నన్ను బయటికి పిలిచాడు.
“ఏంటి విక్రమ్ నువ్వు, నేను మొదటి రోజే చెప్పాను కదా ఈ ఫ్రెషర్స్ తో ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయలేము అని వచ్చిన వాళ్ళు సరిగ్గా పనిచేయదు వాళ్లని పంపించేద్దాం అని నేను అనుకుంటుంటే.”
సోహమ్.. వాళ్ళింకా ఫ్రెషర్స్ ఒక ఛాన్స్ ఇస్తే తప్పేముంది,” ట్రస్ట్ మీ ఇంకోసారి ఏదైనా ఇష్యూ వస్తే నేను నీకే సపోర్ట్ చేస్తా” అని అతనికి హామీ ఇచ్చా.
తర్వాత లోనికి వెళ్ళా, వాళ్ళు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు.
హే ఎందుకు ఇంకా ఏడుస్తున్నారు అది అయిపోయింది జస్ట్ లీవ్ ఇట్, అయినా ఇలా కేటీ ఇచ్చిన ఆ జయ గాడిని అనాలి, గుర్తుపెట్టుకోండి మనం ప్రొడక్షన్లో దేన్ని డైరెక్ట్ గా మార్చడం కానీ డిలీట్ చెయ్యడం కానీ చేయకూడదు.
థ్యాంక్యూ విక్రమ్ అన్నయ్య అంది శృతి, చాందిని ఒక చిన్న నవ్వు నవ్వింది.
ఇంకా నయం ఎక్కడ తను అన్నయ్య అని పిలుస్తుందో అన్న భయంతో చచ్చిపోయా…
హే ఈ “ థ్యాంక్స్ “ లాంటివి టీం లో ఉండకూడదు, జాగ్రత్తగా పని చెయ్యండి అది చాలు..
ఆ ఇష్యూ రిసాల్వ్ చెయ్యడానికి రెండు రోజులు పట్టింది, ఆ తరువాత నుండి వాళ్ళు చేసే ప్రతి పనిని నేను జయ పరిశీలించేవాళ్లం.
అలా సమయం గడుస్తోంది, వాళ్ళ పనితీరు బాగా అభివృద్ధి చెందుతుంది కానీ నా ప్రేమ కథ అస్సలు ముందుకు కదలడం లేదు..
నేను చాందినీ కి ఎంత దగ్గర అవ్వాలన్నా తను మాత్రం నన్ను పట్టించుకోనట్టు చూస్తోంది.
ఒకరోజు నేను జయ ఆఫీస్‌కి తొందరగా వెళ్ళాం, ఆరోజు ఐదు డెప్లాయ్మెంట్స్ ఉన్నాయి, వాటన్నిటిని రెడీ చేస్తున్నాం, కొంచెం కంగారుగా ఉంది..
టెన్షన్ గా లాప్టాప్ వైపే చూస్తున్నా, సడన్గా ఏదో స్పార్క్ నా కళ్ళకు తగిలింది, అటువైపు చూసా..
అప్పుడు వచ్చింది మళ్ళీ వైట్ డ్రెస్ తో…
" ఆమె తలపై వాలిన ఆ లేత నారింజ రంగు జుట్టుని చూడగానే,
నాకు ఇప్పుడే సూర్యోదయం అయినట్టు అనిపించింది.
నిదానంగా ఆమె అడుగులు పడే ప్రతి క్షణం,
గజ్జెల చప్పుళ్లు మధురసంగీతంలా వినిపించాయి.
తెలుపు దుస్తుల్లో ఆమె ఓ విరబూసిన చామంతి పువ్వులా కనిపించింది,
నిగూఢమైన అందం, నిర్మలమైన ముఖం.
ఆమె ముఖాన్ని అలంకరించిన ఓ మృదువైన చిరునవ్వు,
ఒక తియ్యని గాలిదోరలా నన్ను తాకింది.
చివరగా ఆమె చూపు నన్ను తాకిన క్షణంలో,
కాలం ఆగిపోయినట్టూ, లోకమే ఓ క్షణం నిశ్శబ్దంలో మునిగిపోయినట్టూ అనిపించింది."
ఈరోజు తనని తప్ప ఇంక దేన్ని చూడాలనిపించట్లేదు, ఈరోజేంటి ప్రతిరోజూ అంతే..
రేయ్ మావా చూసింది చాల్లేరా, ఇంతసేపు చూసేది తను చూసింది అనుకో కచ్చితంగా నిన్ను పర్వర్ట్ అనుకుంటుంది, అసలే ఈరోజు చేయాల్సిన పని చాలా ఉంది…అన్నాడు జయ
ఆ మాటలకు ఊహల్లోంచి బయటికి వచ్చా, “చెత్త నాయాలు! డిస్టర్బ్ చేసాడు”, అని మనసులో అనుకొని మళ్లీ పని మొదలు పెట్టాను..
అలా ఆ రోజంతా దొంగచాటుగా తనని చూస్తూనే ఉన్నా, కానీ ఏం లాభం పని దాటి ఏదన్నా మాట్లాడిద్దామంటే తను మాట దాటేస్తుంది.
ఏం చేయాలో అర్థం కాక జయా కి చెప్పాను.
మావ, “రేపు చాందిని లీవ్ తీసుకుంటోంది, రేపు అన్నిటిని నేను సెట్ చేస్తా” అన్నాడు జయ.
అయినా తను ఆఫీసులో ఉన్నప్పుడు కాకుండా లీవ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడో నాకైతే అర్ధంకాలేదు..
మరుసటి రోజు.. జయ, శృతి తో కలిసి లంచ్ చేస్తున్నా..
“శృతి” పిలిచాడు జయ..
చెప్పు జయా బ్రో..
మా విక్రమ్ మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు.
తన మీద నాకేం ఒపీనియన్ ఉంటుంది, అయినా నాకు మా బావ ఉన్నాడు.