వెంటాడే నీడలు
( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)
కొట్ర శివ రామ కృష్ణ
"మల్లికా........" ఉలిక్కిపడి బెడ్ మీద లేచి కూచుంది మాలతి. మొట్టమొదటిసారిగా తన జీవితం లో సారిక కి బదులుగా మల్లిక ని తలుచుకుంది. "......... నన్ను క్షమించు తల్లీ. నీ జీవితం లో అంత అన్యాయం జరగడానికి కారణం అయ్యాను."
మల్లికే సారిక గా పుట్టిందా? లేకపోతె మల్లిక కేవలం సారిక స్ప్లిట్ పెర్సనాలిటీ మాత్రమేనా? ఎందుకనో తనకా సింహరాజు చెప్పింది నమ్మాలనిపిస్తూవుంది. మల్లికే సారిక అని ఆలోచిస్తూంటే, మల్లిక మీద వున్న ద్వేషం పటాపంచలు అయిపోయింది.
గాభరాగా పక్కన చూస్తే భుజంగరావు కనిపించలేదు. 'ఈ సమయం లో ఎక్కడకి వెళ్ళివుంటారబ్బా' అనుకుంటూ బెడ్ దిగి కిందకి వచ్చింది. రూమ్ బయటకి రాగానే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు భుజంగరావు. మాట్లాడకుండా ఆయన్నే అనుసరిస్తూ వెళ్ళింది.
నెమ్మదిగా గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్లి, మల్లిక వుండే రూమ్ దగ్గరికి వెళ్లి, తలుపులు బార్లా తీసాడు భుజంగరావు. లోపలంతా చిమ్మచీకటిగా ఉండడం తో సెల్ ఫోన్ లో లైట్ ఆన్ చేసి లోపల ప్రవేశించాడు.
"నా జీవితం లో మల్లిక వుండే రూమ్ లో ప్రవేశించడం ఇదే మొదటిసారి." మాలతి తన వెనగ్గానే వున్నవిషయం గమనించినట్టుగానే వున్నాడు. "తన గురించే ఏమీ ఆలోచించలేదు. తను వుండే రూమ్ గురించి ఆలోచించకపోవడం లో ఆశ్చర్యం ఏం వుంది?"
"నువ్వు నీ తల్లి గురించి, కూతురి గురించి ఆలోచించ కూడదని నేను కండిషన్ పెట్టకుండా ఉండాల్సింది." మాలతి అంది. "లేకపోతె నువ్వు వాళ్ళని అంతగా వదిలేసి వుండేవాడివి కాదు."
"నీ కండిషన్ మాత్రమే అందుకు కారణం కాదు." భుజంగరావు అన్నాడు. "నా అవసరం కోసం పెళ్లిచేసుకున్నాను. అందువల్ల నా మొదటిభార్యని నేను ప్రేమించలేకపోయాను. ఏదో కలిసినందువల్ల పుట్టిన నా కూతురిని కూతురుగానే చూడలేకపోయాను. కానీ..........." మాట్లాడలేనట్టుగా ఆగాడు. ".......... వాళ్లిద్దరూ నేనంటే ప్రాణం పెట్టుకున్నారని, నన్నెంతో కావాలనుకుంటున్నారని గ్రహించలేదని చెప్పను, గ్రహించినా పట్టించుకోలేదు. వాళ్ళు పల్లెటూరివాళ్ళు, మొరటుమనుషులు. నాకెంతసేపూ నాతొ సమానమైన వాళ్ళమీదే దృష్టిపడింది. అంత పెద్ద బిజినెస్ మాన్ ఏకైక కూతురివి నువ్వు నా జీవితం లోకి ప్రవేశిస్తున్నావంటే ఆనందం పట్టలేకపోయాను. నా మనసులోనే లేని నా కూతురి గురించి నీకు చెప్పకపోవడం లో ఆశ్చర్యం ఏముంది?" మాట్లాడుతూ ఉంటే గొంతు గద్గదంగా అయిపోయింది భుజంగరావు కి.
"తను వచ్చి ఆస్తిలో వాటా అడుగుతుందేమోనని భయపడిపోయాను. అడిగితె ఎంత వాటా అడుగుతుంది, ఎంత ఇచ్చేయాలి? నీ కూతురుగా తనకామాత్రం అధికారం ఉండదా? నేను కొంచెం విజ్ఞత ఉపయోగించివుంటే తనకలాంటి ముగింపు వచ్చివుండేది కాదు." మాలతి గొంతు కూడా గద్గదం గా మారింది. "నేను మా నాన్నతో నా భయం చెప్పాను ఎప్పుడైనా తనొచ్చి ఆస్తిలో వాటా అడగొచ్చని, అది నాకు ఇష్టం లేదని. మా నాన్న ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తానని చెప్పాడు, తను ఆ ప్రాబ్లెమ్ సాల్వ్ చేశానని చెప్పినప్పుడు సరదాపడ్డానే కానీ, అలా చేయించి ఉంటాడని మాత్రం నేను అనుకోలేదు."
"మరింకేం చేయించివుంటాడని నువ్వనుకున్నావ్?"
"నేనేమీ అనుకోలేదు. అసలు ఆ విషయం గురించే ఆలోచించలేదు." చేతుల్లో మొహం దాచుకుని భోరుమంది మాలతి. "తనలా చనిపోవాలని నేను కలలో కూడా కోరుకోను."
"కన్నతండ్రే అంత కర్కశంగా వున్నప్పుడు నువ్వూ, మీ నాన్న అలా ఆలోచించడం లో ఆశ్చర్యం లేదు." గట్టిగా నిట్టూర్చాడు భుజంగరావు. "మనం చేసిన పాపం ఇప్పుడు ఏ పాపం తెలియని మన సారిక ని కూడా పట్టిపీడిస్తోంది."
"ఇంతకీ ఇప్పుడు ఈ సమస్య ఎలా సాల్వ్ కాబోతూవుంది?" నొసలు ముడేసింది మాలతి. "నాకయితే ఆ సింహరాజు చెప్పినదే నిజమనిపిస్తూంది. ఆ మల్లికే సారిక గా పుట్టివుంటుంది."
"రేపు మళ్ళీ వాళ్లతో డిస్కస్ చేసేవరకూ ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అన్నదానిగురించి నేనేమీ చెప్పలేను." మరోసారి నిట్టూర్చాడు. "ఇది స్ప్లిట్ పెర్సనాలిటీ ప్రాబ్లమా లేక మల్లిక మళ్ళీ పుట్టిందా అన్నవిషయం గురించి కూడా నేనేం ఆలోచించడం లేదు."
ఇంకేం మాట్లాడాలో తెలియనట్టుగా మౌనంగా ఉండిపోయింది మాలతి.
"నువ్వెప్పుడన్న ఈ రూమ్ లోకి వచ్చి చూసావా?" ముందుకు కదులుతూ అడిగాడు భుజంగరావు.
"తాను అప్పుడప్పుడు శ్రవణ్ ని ఈ రూమ్ లోకి తీసుకొచ్చి ఆడిస్తూ ఉండేది. ఆ సమయం లో శ్రవణ్ కోసం ఈ రూమ్ లోకి వచ్చాను రెండు మూడుసార్లు." మాలతి అంది. "తను వెళ్ళిపోయాక అయితే ఎప్పుడూ నేను ఈ రూమ్ లోకి రాలేదు."
భుజంగరావు అక్కడవున్న కప్ బోర్డు ఓపెన్ చేస్తూవుంటే అంది మాలతి. "కానీ సారిక మాత్రం తనకి తెలియకుండానే ఈ రూమ్ లోకి చాలాసార్లు వచ్చినట్టువుంది. శ్రవణ్ దగ్గర చెప్పినదానిప్రకారం నాకదే బోధపడుతూవుంది."
"మై గాడ్! ఈ కబ్ బోర్డు లో ఏవో బట్టలు వున్నాయి. కంచం, గ్లాస్. ఇవన్నీ మల్లికవేనా?" ఆ కప్ బోర్డు లోకి విభ్రమం గా చూస్తూ అన్నాడు భుజంగరావు.
"ఇవన్నీ తనవే." చెప్తూవుంటే మాలతి గొంతు వణికింది. "తననెప్పుడూ నేను మనతో ఉండనివ్వడం కానీ తిననివ్వడం కానీ చెయ్యలేదు కదా."
వణుకుతున్న చేతులతోనే ఆ కప్ బోర్డు లో వున్న బట్టలు , గ్లాస్ అవీ బయటకి తీసాడు భుజంగరావు.
"ఇక్కడ ఒక నోట్ బుక్ కూడా వుంది" ఆఖరుగా కనిపించిన నోట్ బుక్ ని బయటకి తీస్తూ అంది మాలతి. "ఇందులో చూడు ఆ బొమ్మ." నోట్ బుక్ అట్ట ఓపెన్ చెయ్యగానే మొదటిపేజీ మీదే కనిపించిన బొమ్మని చూపిస్తూ అంది మాలతి.
"కబుసా, ఒంటె తలతో నగ్నంగా మగ మనిషి శరీరం తో వుండే దేముడు తనే కదా. చూడు ఇంకేమన్నా తనిక్కడ రాసిందా? నాలుగో తరగతికన్నా ఎక్కువ చదువుకోలేదు తను."
"మామ్మ నన్నిక్కడ ఉండమని తినేస్తూంది. నాన్నకి నేనంటే ఇష్టం లేదు. నా సవతి తల్లికి నేనంటే ఇంకా ఇష్టం లేదు. నేనేం చెయ్యాలి?"
"నాకు కబుసా శక్తులు కావాలి. ఆ శక్తులతో వీళ్లందరిమీద పగ తీర్చుకుంటాను. నేను మా వూరికి వెళ్ళగానే రాజు ని కబుసా అనుగ్రహం ఎలా సంపాదించాలో అడుగుతాను."
"నాకు రాజు అంటే చాలా ఇష్టం. కానీ ఆ విషయం వాడికి ఇప్పుడే చెప్పడం ఇష్టం లేదు."
"నాకు ఇక్కడ నచ్చినది శ్రవణ్ బాబు ఒక్కడే. వాడిని చూసే నేను అన్నీ మర్చిపోతున్నా. వాడు మాత్రం ఆనందంగా ఉండాలి."
"నా నాన్నని సవతి తల్లిని చంపి శ్రవణ్ బాబు ని అనాధ ని చెయ్యలేను. కానీ ఆ ముసలాడిని మాత్రం వదలను. వాడు నన్ను చాలా అవమానించి బాధపెడుతున్నాడు."
"నాన్నా నేను నీ కూతుర్నే కదా. నన్నెదుకు ప్రేమగా చూడలేవు? నా గురించసలు పట్టించుకోనే పట్టించుకోవు, ఎందుకు?
అక్కడక్కడా కబుసా బొమ్మలతో అటువంటి రాతలు ఆ పుస్తకం లో చాలానే వున్నాయి.
"సందేహం లేదు. సారిక ఈ రూమ్ లోకి వచ్చి ఈ పుస్తకం చదివి ఉంటుంది. ఈ రాతలన్నీ చదివి, చదివి మల్లిక గా మారుంటుంది. ఇందులో బొమ్మ చూసే కబుసా బొమ్మ అప్పుడప్పుడు వెయ్యడం అలవాటు చేసుకుని ఉంటుంది."
"అలా అయితే ఈ పుస్తకం ఎవరిదని, ఇందులో ఎవరు ఇదంతా రాస్తున్నారని మనల్ని అడగాలి కదా. అలా అడక్కుండా మల్లిక గా రూపాంతరం చెందిపోతుందా?"
"చాలాసార్లు ఈ రూమ్ లోకి వచ్చినప్పుడు ఈ పుస్తకం తను చూసేవుంటుంది కదా. ఇందులోవి తను చదివే ఉంటుంది కదా. అయినా వీటిగురించి ఏమీ అడగలేదంటే దానర్ధం ఏమిటి?" నొసలు చిట్లించాడు. "తనలో మల్లిక స్ప్లిట్ పెర్సనాలిటీ డెవలప్ అయింది. వీటి గురించి గుర్తువచ్చినప్పుడల్లా తను ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ గా మారిపోయేది. అందువల్లే వాటిగురించి అడగలేదు."
"ఒకే. ఇప్పుడు ఈ తర్జన భర్జనలన్నీ ఎందుకు? ప్రస్తుతం మనమ్మాయి సమస్య సాల్వ్ కావాలి, అదే కదా మనక్కావల్సింది." గట్టిగా నిట్టూర్చి అంది మాలతి. "చూద్దాం రేపు ఆ సైకియాట్రిస్ట్ లు, ఇంకా ఆ సింహరాజు ఏమంటారో."
&&&
"మీకు ముందు ఒక కూతురు ఉందనే విషయం, ఆమె ఇటువంటి బొమ్మ గీసేదని, ఇటువంటి విషయాలు రాసేదని ముందుగా తెలిసివుంటే మనకి చాలా పెద్ద క్లూ లు అయివుండేవి." విషయం మాలతి, భుజంగరావు లనుండి విని, నోట్ బుక్ అంతా చూసాక సమీర అంది.
ఆ సమయం లో నిరంజన్ ఛాంబర్ లో నిరంజన్, సమీర, మాలతి, భుజంగరావు లు మాత్రం వున్నారు.
"ఈ నోట్ బుక్ అంతా చదివాక మల్లిక స్ప్లిట్ పెర్సనాలిటీ సారిక లో డెవలప్ అయివుంటుందా? తనది ఒక స్ప్లిట్ పెర్సనాలిటీ ప్రాబ్లెమ్ గా భావించి ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది?" భుజంగరావు అడిగాడు.
"స్ప్లిట్ పెర్సనాలిటీ ప్రాబ్లెమ్ ని క్యూర్ చెయ్యడం అంత తేలిక కాదు. అందులోనూ మల్లిక సారిక లో కేవలం స్ప్లిట్ పెర్సనాలిటీ అనుకుంటే, అది చాలా పవర్ఫుల్ గా, స్ట్రాంగ్ గా వుంది. ఈ స్ప్లిట్ పెర్సనాలిటీ లని ట్రీట్ చెయ్యడం లో వున్న పెద్ద ప్రాబ్లెమ్...................." తను చెప్పబోయేది నొక్కిచెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగి అంది "................ ఒకోసారి ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ మెయిన్ పెర్సనాలిటీ గా మారిపోతుంది. అంటే సారిక పూర్తిగా మల్లిక గా మారిపోయే పరిస్థితి వుంది."
"మీరు కంగారు పడకండి. మా గురువుగారయిన యస్మణి తో డిస్కస్ చేసాక అయన ఏమంటారో చూద్దాం. ఇలాంటి స్ప్లిట్ పెర్సనాలిటీ ప్రొబ్లెమ్స్ ని క్యూర్ చెయ్యడం లో కూడా అయన చాలా దిట్ట." నిరంజన్ అన్నాడు.
అంతలోనే ఆ రూమ్ లోకి యస్మణి, సింహరాజు కూడా వచ్చారు. అంతకు ముందు వేసిన కుర్చీలు అలాగే ఉండడం వల్ల, మాలతి భుజంగరావు ల పక్కన ఒకరి పక్కన ఒకరు సెటిల్ అయ్యారు యస్మణి, సింహరాజు.
"ఇది స్ప్లిట్ పెర్సనాలిటీ ప్రాబ్లెమ్ అనుకుని ట్రీట్ చేస్తే చాలా కాంప్లికేట్ అయ్యే అవకాశం వుంది. ఎందుకంటే ఇది స్ప్లిట్ పెర్సనాలిటీ కాదు." యస్మణి అన్నాడు.
"మరయితే ఏం చేద్దాం?" ఆందోళనగా అడిగింది మాలతి.
"మీరు కంగారు పడకండి. మీ అమ్మాయిని నాతొ వుబ్బెర కి పంపండి. తన సమస్యని పూర్తిగా సాల్వ్ చేసే పూచీ నాది." సింహరాజు అన్నాడు.
"నీతో వుబ్బెరకి పంపాలా?" కంగారుగా అడిగాడు భుజంగరావు.
"అక్కడ మాత్రమే తన సమస్య పరిష్కారం అవుతుంది, ఇంకెక్కడా కాదు." సింహరాజు అన్నాడు. "తనతో పాటుగా కుటుంబ సభ్యులు ఎవరన్నా రావచ్చు. మీరిద్దరూ తప్ప."
"మేమిద్దరం ఎందుకు రాకూడదు?" మళ్ళీ భుజంగారావే అడిగాడు.
"మీకు తెలిసిన విషయమే కదా. తను మల్లిక గా మారితే మిమ్మల్నిద్దర్నీ ఇబ్బందిపెడుతుంది. తను మీ మీద చాలా కోపంగా వుంది."
"తను మల్లిక గా మారి మమ్మల్ని చంపేసినా పర్లేదు. అది మా తప్పులకి శిక్ష అనుకుంటాం. కానీ మేము కూడా వస్తాం." మాలతి అంది.
"మల్లిక నీ మాట వింటుంది రాజూ. నువ్వు చెప్తే వీళ్ళిద్దరిమీద అటాక్ చెయ్యదు. మనం వీళ్ళనీ తీసుకువెళ్లడమే మంచిది." యస్మణి అన్నాడు.
"మనం ఇప్పుడు సారిక దగ్గరికి వెళదాం" కుర్చీలోనుండి లేస్తూ అన్నాడు సింహరాజు. "ఇప్పుడు తను మల్లికగా మారితే అంత త్వరగా సారికగా మరకపోవచ్చు. కానీ మీరు కంగారు పడకండి. తనని పూర్తిగా సారిక గా మార్చే పూచీ నాది."
ఆ తరువాత అందరూ నిరంజన్ ఛాంబర్ లోనుండి సారిక రూమ్ వైపు బయలుదేరారు.
&&&
"నువ్వు నా దగ్గరికి ఎప్పుడూ రావేమో, నన్ను పూర్తిగా మర్చిపోయావేమో అనుకున్నాను." ప్రదీప్ తో అంటోంది సారిక. అక్కడికి కొద్దిసేపటిక్రితమే వచ్చాడు ప్రదీప్.
"నువ్వలా ఎలా అనుకున్నావ్ సారికా? నేనింతకుముందే చెప్పాను కదా ఆ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చెయ్యడానికి వెళ్తున్నానని." ప్రదీప్ కోపం గా అన్నాడు. "నిన్ను నేను మర్చిపోవడం, కాదనుకోవడం కలలో కూడా జరగని పని."
"తనేదో మామూలుగా అంది లేరా. ఎందుకంత ఎమోషనల్ అవతావ్?" చిరునవ్వుతో అంది ప్రమీల.
"ఈ విషయాలన్నీ ఆశ్చర్యంగానే వున్నా, నీ బిహేవియర్ తో సింక్ అవుతూ వున్నాయి సారికా. నువ్వు ఆ బొమ్మ ఆలా గియ్యడానికి, నీ పేరెంట్స్ మీద, గ్రాండ్ పా మీద, ఇంకా ఆ ఓబులేసు మీద కోపానికి సమాధానల్లా వున్నాయి." ప్రదీప్ అన్నాడు. అప్పటికి ప్రదీప్ కి కూడా విషయం అంతా చెప్పారు ప్రమీల , సారిక
"మనం పునర్జన్మలని నమ్మగలిగితే నువ్వు చెప్పింది కరక్టే." ప్రమీల నవ్వి అంది "కానీ ఈ రోజుల్లో పూర్వజన్మలు, పునర్జన్మలు వున్నాయంటావా?"
దానికి ప్రదీప్ ఎదో సమాధానం చెప్పబోతూవుండగా అక్కడికి వచ్చారు భుజంగరావు తదితరులంతా. వాళ్ళని చూస్తూనే సారిక, ప్రమీల ఇంకా ప్రదీప్ లేచి నిలబడ్డారు.
"సారికా. నీ సమస్య పరిష్కారం కావాలంటే మనం వుబ్బెర గ్రామానికి వెళ్లాలని అంటున్నారు." సారిక ముందుకొచ్చి తన మొహంలోకి చూస్తూ అన్నాడు భుజంగరావు.
"వుబ్బెర, ఆ పేరుతొ ఒక గ్రామం కూడా ఉందా?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సారిక "అయినా ఆ గ్రామానికి నా సమస్య కి కనెక్షన్ ఏమిటి?"
"నువ్వు అప్పుడప్పుడు మల్లిక గా మారుతున్నావు కదా. ఆ మల్లిక పుట్టింది, పెరిగింది ఆ గ్రామం లోనే."
"కమాన్ డాడ్." నవ్వింది సారిక. "నాకసలు మల్లిక ని అన్న ఆలోచనే రావడం లేదు. ఇంక ఆ గ్రామం లోకి వెళ్లడం వల్ల నా ప్రాబ్లెమ్ ఎందుకు ఎలా సాల్వ్ అవుతుంది?"
"స్ప్లిట్ పెర్సనాలిటీ అన్నది అలాగే ఉంటుంది." సమీర అంది. "ఒరిజినల్ క్యారక్టర్ కి ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ గురించి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. కానీ నీ స్ప్లిట్ పెర్సనాలిటీ ప్రాబ్లెమ్ సాల్వ్ కావాలంటే నువ్వా వూరు వెళ్లడం ఒక ముఖ్యమైన విషయం."
"ఇంతకీ నాది పునర్జన్మ లేకపోతె స్ప్లిట్ పెర్సనాలిటీ యా? నాది పునర్జన్మ అన్న థియోరిమ్ కూడా వుంది కదా." చిరునవ్వుతో అంది సారిక.
"అది ఏదయినా సరే, సాల్వ్ అవ్వాలంటే మాత్రం మనం ఆ గ్రామం వెళ్ళాలి. నీతో పాటుగా నేనూ మీ డాడ్ కూడా వస్తున్నాం." మాలతి అంది.
"సరిపోదు. నాతోపాటుగా మీరిద్దరూ, నా బ్రదర్స్ ఇద్దరూ, ఈ ప్రమీల ఇంకా అందరికన్నా ముఖ్యంగా ఈ ప్రదీప్ కూడా రావాలి." సారిక అంది.
"అలాగే. నీ ప్రాబ్లెమ్ సాల్వ్ కావాలె కానీ మేము ఏం చెయ్యడానికన్నా సిద్ధమే." మాలతి అంది.
"అవును డాక్టర్ సమీర కూడా వస్తున్నారా?" నొసలు చిట్లించింది సారిక.
"మా గురువుగారయిన యస్మణి వస్తున్నారు. అయినా చాలా పెద్ద సైకియాట్రిస్ట్. ఆయనదగ్గరే నేను సైకియాట్రీ లో చాలా మెలకువలు నేర్చుకున్నాను." చిరునవ్వుతో అంది సమీర. "ఇంకా ఈ సింహరాజు కూడా మీతో పాటుగా వుంటారు."
"నేనూ ఒకరకం సైకియాట్రిస్ట్ ని. మీ ప్రాబ్లెమ్ ని సాల్వ్ చెయ్యడం లో ఉపయోగ పడతాను." చిరునవ్వుతో అన్నాడు సింహరాజు.
&&&
తరువాత వుబ్బెర లో అందరు ఉండడానికి సాముదమ్మ ఇంట్లోనే ఏర్పాట్లు చేసాడు సింహరాజు. ఒక్క మోహనరావు, వంశీ లు తప్ప తక్కిన అందరూ ఆ గ్రామానికి వెళ్లారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక్కసారి కూడా సారిక లో అబ్నార్మల్ బిహేవియర్ కనిపించలేదు.
"సామమ్మ చనిపోయిన తరువాత నీకు ఫోన్ చేసి చెప్పాను. నువ్వు రాలేదు. ఇంక నీ కూతురు చనిపోయినప్పుడు నీకు చెప్పాలనిపించలేదు. అయినా నీ కూతుర్ని చంపడానికి నువ్వే పురమాయించి ఉంటావనుకున్నాను." సింహరాజు భుజంగరావు తో అన్నాడు. వాళ్లిద్దరూ ఆ ఇంటి పెరట్లో వున్నారు.
"నేను మరీ అంత కర్కోటకుడిని కాదు. తన అడ్డు తొలగించడానికి ఆ రాక్షసుడిని పంపింది నా మామయ్య." భుజంగరావు అన్నాడు.
"అందుకు ముఖ్య కారణం నేను. నా కోరిక తీర్చాలనే నా నాన్న అలా చేసాడు." మాలతి అంది.
"వాడు మల్లిక ని రేప్ చేసి, బతికుండగా పాతిపెట్టింది ఇక్కడే." అక్కడ ఒక చోటుని చూపిస్తూ అన్నాడు సింహరాజు. "రెండు రోజులపాటు పొరుగూరులో పనులు చెయ్యడానికి వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేసరికి మల్లిక ఇంట్లో కనిపించలేదు. ఊరంతా వెదికాను. అందర్నీ అడిగాను. ఏం ప్రయోజనం లేకపోయింది. పెరట్లోకి వచ్చి చూస్తే ఇక్కడ కొంచెం తవ్వి పూడ్చినట్టుగా కనిపించింది. మళ్ళీ తవ్వి చూస్తే తన శవం నగ్నంగా బయటపడింది. పరిశీలించిన మీదట తను రేప్ చెయ్యబడి, బతికుండగానే పూడ్చబడ్డట్టుగా చంపారు. వాడు చాలా తెలివిగా ఎవరికీ కనిపించకుండా ఈ ఇంటికి వచ్చాడు. తెలిసిన మనిషి కావడం వల్ల లోపలి రానిచ్చి ఉంటుంది మల్లిక. అంత దుర్మార్గానికి వొడిగట్టిపోయాడు. ఏ ఆనవాలు దొరకనివ్వకపోవడం వల్ల వాడిమీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా అవ్వలేదు."
(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)