Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అన్నా చెల్లెళ్ల అనురాగం రక్షబంధన్

రాఖీ/ ర‌క్షాబంధ‌న్‌

అగ‌స్టు నెల వ‌చ్చిందంటే చాలు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భార‌తీయులంతా రాఖీ ఏ రోజు వ‌చ్చిందా అని కేలండ‌ర్ తిర‌గేస్తారు. ర‌క్త‌సంబంధం ఉన్నా లేకున్నా అన్నాచెల్లెళ్లుగా, అక్కాత‌మ్ముళ్లుగా బంధాల‌ని పంచి పెంచే పండుగే రాఖీ! కుల‌మ‌తాల‌కు అతీతంగా చేసుకునే వేడుక ఇది. నువ్వే నాకు రక్ష.. ఎల్లలు ఎరగని నీ వాత్సల్యం, అనురాగం, అప్యాయతలో నేను కలకాలం చల్లగా ఉండాలి.. అని ఆకాంక్షిస్తూ ప్రతి సోదరీ తన సోదరుని రక్త సంబంధాన్ని రక్షా బంధనంతో ముడివేస్తూ కోరుకుంటుంది. సోదరుడి మణికట్టుపై సోదరి కట్టే రక్షా బంధన దారాలు అనురాగాల మొగ్గలు తొడిగి అప్యాయతా కుసుమాలు వికసించి వాత్సల్య పరిమళాలు వెదజల్లుతాయి. 

పురాణాల్లో రాఖీ...

రాఖీ పండుగ ఈనాటిది కాదు. దీని మూలం మ‌హాభార‌తంలోనే ఉంది! శ్రీకృష్ణునికి శ్రుత‌దేవి అనే మేన‌త్త ఉండేది. ఆమెకు "శిశుపాలుడు" అనే వికృత‌మైన పిల్ల‌వాడు పుట్టాడు. ఎవ‌రి చేయి త‌గిలితే అత‌ను సాధార‌ణంగా మారిపోతాడో, అత‌ని చేతిలోనే శిశుపాలుడు మ‌ర‌ణిస్తాడ‌ని పెద్ద‌లు చెబుతారు. ఒకరోజు శ్రుత‌దేవి ఇంటికి శ్రీకృష్ణుడు వ‌చ్చాడు. అత‌ని చేతిలో శిశుపాలుని ఉంచ‌గానే, చ‌క్క‌టి పిల్ల‌వాడుగా మారిపోయాడు. పిల్ల‌వాడు మామూలు రూపానికి వ‌చ్చాడ‌ని మొద‌ట సంతోషించినా, అత‌ని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉంద‌ని తేలిపోవ‌డంతో శ్రుత‌దేవి భ‌య‌ప‌డిపోయింది. త‌న కుమారుడిని చంపే ప‌రిస్థితి వ‌చ్చినా, పెద్ద‌మ‌న‌సుతో క్ష‌మించ‌మ‌ని శ్రీకృష్ణుని వేడుకుంది. దానికి శ్రీకృష్ణుడు క‌రిగిపోయి `స‌రే! ఆత్త ఇత‌ను చేసే త‌ప్పులను క్ష‌మిస్తాను. కానీ వంద త‌ప్పులు దాటితే మాత్రం దండించ‌క త‌ప్ప‌దు` అని వ‌ర‌మిచ్చాడు. శిశుపాలుడు పెరిగిపెద్దవాడ‌యి "చేది" అనే రాజ్యానికి వార‌సుడ‌య్యాడు. ఒక రాజ్యానికి రాజు, పైగా శ్రీకృష్ణునికి బంధువు...అయినా ఎంతో దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తించేవాడు శిశుపాలుడు. రాజ్యంలో వారిని పీడించ‌డ‌మే కాకుండా, చీటికీమాటికీ కృష్ణునితో గొడ‌వ‌ప‌డుతూ ఉండేవాడు. అలా ఒక‌సారి, నిండుస‌భ‌లో శ్రీకృష్ష్ణుని దూషించ‌డం మొద‌లుపెట్టాడు. ఆ రోజు చేసిన పొర‌పాటుతో శిశుపాలుని వంద త‌ప్పులూ పూర్త‌వ‌డంతో, శ్రీకృష్ణునిలో సహనం నశించింది. అంతే త‌న సుద‌ర్శ‌న చ‌క్రాన్ని ఒక్కసారిగా శిశుపాలుని మీద‌కు ప్ర‌యోగించాడు.  అలా `బుద్ధిగా ఉంటే బ‌తికిపోతావు` అని చెప్పినా విన‌కుండా శిశుపాలుడు త‌న ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు.

కృష్ణుడు ఎంతో ఆవేశంతో సుద‌ర్శ‌న చ‌క్రాన్ని ప్ర‌యోగించాడు క‌దా! ఆ స‌మ‌యంలో అత‌ని వేలు కూడా కాస్త తెగింది. ఆ వేలికి క‌ట్టుక‌ట్టేందుకు న‌లుగురూ నాలుగు దిక్కుల‌కీ ప‌రుగుదీశారు. కానీ అక్క‌డే ఉన్న ద్రౌప‌ది మాత్రం, ఏమాత్రం ఆలోచించ‌కుండా త‌న చీర‌కొంగును చించి శ్రీకృష్ణుని వేలుకి ర‌క్ష‌గా చుట్టింది. న‌న్ను అన్న‌గా భావించి ఆదుకున్నావు కాబ‌ట్టి, నీకు ఎలాంటి ప్ర‌మాదం వ‌చ్చినా నన్ను త‌లుచుకో! వెంట‌నే నిన్ను ఆదుకుంటాను` అని అభ‌య‌మిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘ‌ట‌నే ర‌క్షాబంధ‌నానికి నాందిగా నిలిచింది. త‌రువాతి కాలంలో ద్రౌప‌ది చీరను లాగి కౌర‌వులు నిండుస‌భ‌లో అవ‌మానించాల‌ని అనుకుంటే, దానిని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు. 

అప్ప‌టి నుంచి శ్రావ‌ణ‌మాసంలో వ‌చ్చే పౌర్ణ‌మి రోజున అక్క‌చెల్లెళ్లంతా త‌మ అన్న‌ద‌మ్ముల‌కు రాఖీని క‌డతారు. అందుకు బ‌దులుగా జీవితాంతం వాళ్ల‌ని కంటికిరెప్ప‌లా కాచుకుంటాన‌ని వాగ్దానం చేస్తారు సోద‌రులు. ఇదొక్కటే కాదు రాఖీ ప్రస్తావన అనేక సందర్భాల్లో వచ్చింది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కడుతుంది. చారిత్రకంగా గ్రీకు రాజు అలెగ్జాండర్ తన పెద్ద సైన్యంతో భారతదేశంపైకి దండెత్తి వస్తాడు. ఈ క్రమంలో జీలం నదికి అవల ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడుతో యుద్ధానికి తలపడ్డాడు. అయితే పురుషోత్తముని శక్తిసామర్ధ్యాల గురించి విన్న అతని భార్య రుక్సానా తన భర్త క్షేమం కోసం పురుషోత్తముడిని శరణుకోరి అతనికి రాఖీ కడుతుంది. రుక్సానాను సోదరిగా భావించిన పురుషోత్తముడు, యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినా అతనిని చంపకుండా వదిలివేస్తాడు. పూర్వకాలంలో రాజవంశీకులకు ఇబ్బందులు, ప్రమాదాలు కలుగుతాయానే కారణంగా, వాటి నుంచి రక్షణ పొందడానికి కట్టుకునే ఆనవాయితీ నుంచి ఈ రక్షాబంధనం వచ్చినట్లు తెలుస్తోంది. పురాణ కాలంలో రాజులు యుద్ధాలకువెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షను కట్టుకొని ఆ తర్వాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు. రాఖీ పౌర్ణమీ రోజు కట్టే రక్షలో ఆసామాన్యమైన శక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం.  

రాఖీని ఎప్పుడు కట్టాలి

సంప్రదాయం ప్రకారం పొద్దున్నే లేచి, తలంటు స్నానం చేసి, రక్షను పూజించాలి. ఆ తరువాత అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి. శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్న సమయంలో రాఖీ కట్టాలని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఆ తర్వాత నోరు తిపి చేయడం సంప్రదాయం. మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు, మధ్యాహ్న వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని, ఆ సమయంలోనే రాఖీని కట్టించుకోవాలన్నది శాస్త్రం చెబుతుంది. ఇదిలావుండగా పెళ్లి అయిన ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలను కట్టడం మన సంప్రదాయంలో ఆచారంగా చెప్పుకోవచ్చు.

శ్రావ‌ణ పౌర్ణ‌మి రోజున కేవ‌లం రాఖీ పండుగే కాదు. దేశ‌వ్యాప్తంగా ఎన్నో పండుగ‌లు జ‌రుగుతాయి. చాలామంది ఈ రోజున కొత్త జంథ్యాల‌ను వేసుకుంటారు, కాబ‌ట్టి దీన్ని జంథ్యాల పౌర్ణ‌మి అంటారు. ప‌శ్చిమ‌బెంగాల్, ఒడిషా రాష్ట్రాల‌లో రాధాకృష్ణుల విగ్ర‌హాల‌ను ఊయ‌ల‌లో ఉంచి ఊపుతారు, ఈ పండుగ‌ను వారు ఝూల‌న్ పౌర్ణ‌మి అంటారు. ఉత్త‌ర‌భార‌త‌దేశంలోని కొన్ని రాష్ట్రాల‌లో, `క‌జ‌రి పౌర్ణ‌మి` పేరుతో ఈ రోజు గోధుమ నాట్ల‌ను వేస్తారు. ఇక మ‌హారాష్ట్ర, కేర‌ళ‌ల్లో `న‌రాళీ పౌర్ణ‌మి` పేరుతో, స‌ముద్ర‌దేవునికి పూజ‌లు చేస్తారు. కానీ ఏ రాష్ట్రంలో ఎలాంటి ఆచారాలు ఉన్నా దేశ‌మంతా జ‌రుపుకొనే పండుగ మాత్రం `ర‌క్షాబంధ‌న‌మే`!