Read A Love Story by Yamini in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఒక ప్రేమకథ

నవనీత...! పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి, అందుకు తగిన అభినయం. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు, ఒక అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతనని. ఇది ఆకర్షణా ? లేకా నేను నిజంగానే ప్రేమిస్తున్నానా ? అని తెలుసుకోవడానికి నాకు చాలానే సమయం పట్టింది.
కాలేజీ లో దసరా సెలవులు ఇచ్చారు. ఎప్పటిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లి సరదాగా గడపాలని అనుకున్నాను. కానీ, ప్రతి రోజు ఒక యుగంలా అన్పించింది నవనీతని చూడక. ఎప్పుడు సెలవులు అయిపోతాయా ? ఎపుడెపుడు నవనీతని చూస్తానా ? అని అన్పించింది. కాలేజీ స్టార్ట్ అయిన మొదటి రోజే అందరికంటే ముందుగా కాలేజీ కి వెళ్లి నవనీత కోసం చూసాను. కానీ, తాను ఆ రోజు కాలేజీకి రాలేదు. ఎవరినైనా అడుగుదామంటే, ఏమనుకుంటారో అని భయమేసింది. అలా రెండు రోజులు గడిచాయి. ఇక నవనీత కాలేజీ కి రాకపోవడంతో.., ఈ రోజు ఎలాగైనా కారణం తెలుసుకోవాలి అని, తన స్నేహితురాలి దగ్గరికి వెళ్లాను. అంతలోనే నవనీత వచ్చింది. తనను చూడగానే నా మొహం 1000 వోల్టేజ్ ల బల్బు వెలిగిస్తే వచ్చే అంతలా వెలిగిపోయింది. నవనీత చాలా మంచి అమ్మాయి ఎవరితో ఎక్కువ మాట్లాడదు. బాగా చదువుతుంది. ఇక నేనయితే ఒక యావరేజ్ విద్యార్థిని. నాకు తెలిసి నా మొహం కూడా తాను ఎపప్పుడూ చూసి ఉండదు. ఇక నేను తనతో ఎపుడు మాట్లాడాలి ? ఎపుడు స్నేహం చేయాలి ? ఎపుడు నా ప్రేమ విషయం చెప్పాలి ? అనుకుంటూ ఉండగానే.. సంవత్సరం గడిచింది.

డిగ్రీ సెకండ్ ఇయర్ లో అయినా తనతో మాట్లాడాలి అనుకున్న. నా ప్రేమను కనికరించి ఆ దేవుడే ఒక అవకాశం ఇచ్చినట్టున్నాడు తనతో మాట్లాదడానికి. ఫ్రెషర్స్ కోసం ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీలో మేము ఇద్దరం కలిసి ఒక నాటకం వేయాల్సి వచ్చింది. అదే అవకాశంగా భావించిన నేను, తనతో పరిచయం చేసుకుని దానిని స్నేహంగా మార్చుకున్నాను.
అలా … తన మీద ఉన్న నా ప్రేమను గుండెల్లో దాచుకుని, ఎప్పుడు తనతో చెప్పాలనే నా ఎదురు చూపుల్లోనే… నా డిగ్రీ రెండవ సంవత్సరం కూడా గడిచిపోయింది. ఎప్పటిలాగే తాను క్లాస్ టాపర్ గా వచ్చింది. నేను ఎదో అలా పాస్ అయిపోయాను. ఇక ఆఖరి సంవత్సరం…, అందరు కెరీర్ ని చాలా సీరియస్ గా తీసుకొని, తర్వాత ఏంచేయాలో ? అని ఆలోచిస్తున్నారు. నాకేమో కళ్లు మూసినా, తెరిచినా నవనీత తప్ప ఏమి కనబడట్లేదు. డిగ్రీ చివరి సంవత్సరం కూడా అయిపోవడానికి వస్తుంది. అందరు ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఒక్క క్లాస్ కూడా సరిగా వినని కారణంగా నా బుర్రకి ఏమి ఎక్కడం లేదు. ఇప్పుడు నవనీతకి నా మనసులో మాట చెప్పకపోతే, ఇక ఎప్పటికి చెప్పలేనేమో అన్పించింది. మరునాడు కాలేజీలో నా ప్రేమ గురించి ఎలాగైనా నవనీతకి చెప్పాలి అనుకున్నాను. నా ప్రేమ విషయం ఒక లెటర్ లో రాసి తనకు అందినచాను. మరునాడు నవనీత సరాసరి నా దగ్గరకు వచ్చింది. నీది ప్రేమో ? లేక ఆకర్షణో ? నాకు తెలియదు. కానీ, ఒకవేళ నువ్వు మా వాళ్లని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకొనాలన్నా, కనీసం నువ్వు డిగ్రీ మంచి మార్కులతో పాస్ అవాలి. కాబట్టి, ఈ ప్రేమ పెళ్లి గురించి తర్వాత చూద్దాం నువ్వు ముందు నీ డిగ్రీ పూర్తి చేయు అని చెప్పింది.

నవనీత మాటలు నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను. బాగా చదివి నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. తన దగ్గరకు వెళ్లి ఇపుడు అయినా ఒప్పుకుంటావా? నా ప్రేమని అని అడిగాను. అప్పుడు తను , నేను నా పేరెంట్స్ కి ఈ
ప్రేమ విషయం చెప్పానే అనుకో, డిగ్రీనే కదా కంప్లీట్ అయింది. జాబ్ ఏంచేస్తాడు? నిన్ను ఎలా పోషిస్తాడు? అని అడుగుతారు అంది. తన మాటలు వింటే అది విన్న నాకు నిజమే అన్పించింది. వెంటనే బాచిలర్ అఫ్ ఎడ్యుకేషన్ లో జాయిన్ అయ్యాను. నా అదృష్టం కొద్ది నా చదువు కంప్లీట్ అయేసరికి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. చాలా కష్టపడి చదివి టీచర్ పోస్ట్ సంపాదించాను. నన్ను నేనే నమ్మలేని పరిస్థితి. డిగ్రీ కూడా పాస్ మార్కులతో బయటపడే నేను, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను మరియు ఇపుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించానంటే , దానికి కారణం నవనీత.

నాతో పాటు నా
తల్లితండ్రులు కూడా చాలా సంతోషించారు. ఇక నా ఇద్దరి చెల్లెల్ల బాధ్యత నేను తీసుకోవచ్చు. నా తండ్రికి సంపాదనలో తోడుగా ఉండొచ్చు అని ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఇక నేను నవనీత దగ్గరికి వెళ్లి చెప్పడమే ఆలశ్యం. నవనీత…! నువ్వు చెప్పినట్టుగానే మంచి ఉద్యోగం సంపాదించాను. మా ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో నువ్వు నా ప్రేమని అంగీకరిస్తే నేను మీ వాళ్ళతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తాను అని చెప్పాను. తన సమాధానం కోసం గుండెని బరువు చేసుకొని ఎదురుచూస్తున్నాను. కాసేపు మౌనం తర్వాత….! చూడు ఆనంద్ (తాను నన్ను మొదటి సారి పేరు పెట్టి పిలిచింది) , నేను చెప్పేది జాగ్రత్తగా విను. నన్ను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు. మా ఇంట్లో, ఈ ప్రేమ పెళ్లి అంటే ఒప్పుకోరు.
నేను నా
తల్లితండ్రులని బాధపెట్టలేను. నీకు నేను అలా చెప్తూ వచ్చినందుకు కూడా కారణం ఉంది. ఆ కారణం మా అన్నయ్య.., తనంటే ఇంట్లో అందరికి ప్రాణం. ఎదిగిన కొడుకు ఇంటి మరియు నా పెళ్లి భాద్యతలు తీసుకుంటాడు అని నా తల్లితండ్రులు ఎదురుచూస్తున్న సమయంలో, ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని, మా అన్నయ్య ప్రేమని నిరాకరించింది. ఆ భాదతో మరియు ఆవేశంతో ఏమి ఆలోచించకుండా మా అన్నయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని ఏడుస్తూ చెప్పింది. ఒకవేళ, నేను ఆ రోజే నీకు ఈ ప్రేమ లాంటివి వద్దు ,వదిలేయ్ అని చెప్పి ఉంటె నువ్వు ఏమయిపోతావో? అని ఆలోచించాను. ఒక మంచి స్నేహితురాలిగా , నీకు సలహాలిస్తూ వచ్చాను. నా మాటలతో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, నీలో ఆశలు పెంచుతున్నాను అని నాకు తెలుసు. నిజం తెలిసాక నువ్వు బాధపడతావని కూడా తెలుసు. కానీ బాధ కంటే ప్రాణం విలువైనది కదా…! ఇప్పుడు నీకు మంచి జాబ్ వచ్చింది. నీ కుటుంబ సభ్యులంతా ఏంతో ఆనందంగా ఉన్నారు. నువ్వు వాళ్లకు అండగా ఉండాలి. నీ మంచి మనసుకు తగిన అమ్మాయి తప్పకుండ దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇదంతా విన్న నేను, కంటి నుండి వస్తున్న నీటిని తుడుచుకుని మౌనంగా ఉండిపోయాను. ఆ రోజంతా ఆలోచించాను. అప్పటివరకు నవనీత కేవలం నాకు ఒక ప్రేమికురాలు. కానీ, ఇప్పటినుండి నాకు తనో దేవత. నిజంగా తానూ నన్ను ఎపుడో వదిలేసి ఉంటే , నేను ఇపుడు ఇలాంటి మంచి పరిస్థితిలో ఉండకపోయేవాడిని. నిజానికి అప్పుడున్న ప్రేమ పిచ్చిలో ప్రాణాలతో కూడా ఉండేవాడిని కాదేమో? .తన ఆలోచన, మాటల ద్వారా నేను ఇపుడు ఇలా ఉన్నాను. నాకు భాద్యత కూడా తెలిసింది. నన్ను ఒక మంచి మనిషిలా మార్చింది నవనీతనే అని, నా మనసుకి నేను సమాధాన పరుచుకున్నాను. కొన్ని రోజుల తర్వాత.., నా ఇద్దరి చెల్లెళ్ళ పెళ్లి చేసి, మా నాన్న మోహంలో చిరునవ్వు చూసాను. మా అమ్మ తనకు నచ్చిన అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేసింది. తానే నా జీవితంలోకి వచ్చిన నా అర్దాంగి స్నేహ. స్నేహ కి నా గతం గురించి అంతా తెలుసు. నన్ను తాను అర్ధం చేసుకుంది ఇపుడు మేము ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాము. నా జీవితం ఇపుడు ఇలా సంతోషంగా ఉంది అంటే, అందుకు కారణం ఇద్దరు దేవతలు ఒకరు నవనీత మరొకరు స్నేహ.

"నీతి |
Moral :
ఆడవాళ్లు మీకు జోహార్లు…! ఒక మగవాడి విజయం వెనుక తప్పకుండా ఒక ఆడది ఉంటుంది. ఈ కాలంలో చాలామంది యువత తమ ప్రేమను నిరాకరించారనే కారణంతో తమను తాము కోల్పోయి కన్నవాళ్లకు శిక్ష విధిస్తున్నారు. అది ఎంత వరకు సరైనదో ఒక్కసారి ఆలోచించండి. తల్లితండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి".