Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

చిన్నారుల కోసం చిట్టి కథలు...

సాధారణంగా చిన్న పిల్లలను నిద్రపుచ్చేందుకు తల్లిదండ్రులు కొన్ని కథలు చెబుతుంటారు. కొన్ని కథలు రాజులకు సంబంధించినవి ఉంటే మరికొన్ని నీతి కథలుంటాయి. ఇలాంటి కథలను పిల్లలు ఎంతో శ్రద్ధగా వింటారు. నీతి కథలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటాయి. జీవితంలో మనిషి ఎలా ఉండాలో కూడా ఈ నీతికథలు నేర్పుతాయి. కొన్ని కథల్లో నీతితో పాటు ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. ఇలాంటి మంచి సందేశం ఉన్న కథలు చాలా శక్తివంతమైనవి అని చెప్పుకోవచ్చు.

సంతోషం ఆనందం కలగాలంటే...
అనగనగా ఓ గ్రామంలో ఓ వృద్ధుడు నివసించేవాడు. ప్రపంచంలో ఉన్న దురదృష్టవంతుల్లో ఈ ముసలాయన కూడా ఒకరు. ఈయన చేసే పనులతో ఆ గ్రామ ప్రజలంతా విసిగి వేశారిపోయారు. ఎప్పుడూ ఏదో దిగులుతో ఉండేవాడు. ఎప్పుడూ ఏదో ఒక విషయమై ఫిర్యాదు చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఇక ఆయన నోరు తెరిస్తే చాలు... విషపూరితమైన మాటలే నోటినుంచి వస్తాయి. అందుకే ఆ గ్రామ ప్రజలు ఆ ముసలాయన్ను దూరం పెట్టారు. ఆయన ప్రవర్తనే ఆయనకు శాపంగా మారింది. అతని పక్కన ఉంటే అవమానంగా భావించేవారు గ్రామస్తులు. తన మాటలతో ఇతరులను బాధించి వారిలో ఉన్న సంతోషాన్ని దూరం చేసేవాడు ఈ ముసలాయన. ఇక ఓ రోజు వచ్చింది. ఆరోజుతో ఆయనకు 80 ఏళ్లు వచ్చాయి. ఓ రోజున గ్రామప్రజలంతా ఆయనకు సంబంధించిన ఒక వార్తను విన్నారు. ఎప్పుడూ ముభావంగా ఉండే ఆ ముసలాయనలో పెను మార్పు కనిపించింది. ఎవరి గురించి ఎలాంటి ఫిర్యాదులు చేయడం లేదు సరికదా.. అతని ముఖంపై చిరునవ్వు కనిపిస్తోంది. అంతేకాదు అతని ముఖంలో కాంతి కనిపిస్తోందంటూ ప్రచారం జరిగింది. ఇక గ్రామస్తులంతా గుమికూడి ఆ ముసలాయన్ను 'ఏమైంది..ఏంటి నీలో ఈ మార్పు ' అని అడిగారు. అందుకు ముసలాయన ఇలా సమాధానం ఇచ్చాడు. 'ఏమీ లేదు.. 80 ఏళ్లు నేను సంతోషం ఆనందం గురించి వెతుకుతూ వస్తున్నాను. కానీ నాకు సంతోషం దక్కలేదు. ఇప్పుడు ఆ సంతోషాన్ని ఆనందాన్ని వెదకడం మానేసి కేవలం నా జీవితాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నాను. అందుకే సంతోషంగా ఉన్నాను' అని సమాధానం ఇచ్చాడు.
నీతి: సంతోషం ఆనందం కోసం వెతకడం మానేసి మనకు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ఆస్వాదిస్తే సంతోషం ఆనందం వాటంతట అవే వస్తాయి.

తెలివైన మనిషి.....

ఓ ఊరిలో ఉండే ప్రజలు ఓ తెలివైన వ్యక్తి దగ్గరికి తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చేవారు. సమస్యలకు పరిష్కారం లభిస్తుందేమో అనే ఆశతో ఆ తెలివైన వ్యక్తి దగ్గరకు వచ్చేవారు. ప్రతి రోజు ఒకే సమస్యను ఆయన ముందుంచేవారు. ఒకరోజు ఆ తెలివైన వ్యక్తి సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన వారికి ఒక జోక్ చెప్పాడు. అంతా గట్టిగా పగలబడి నవ్వారు. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ అదే జోక్‌ను చెప్పాడు. దీంతో అక్కడ కొంతమంది మాత్రమే మళ్లీ నవ్వారు. ముచ్చటగా మూడో సారి అదే జోక్ చెప్పాడు. అయితే ఈ సారి మాత్రం ఎవ్వరూ నవ్వలేదు. అప్పుడు చిన్నగా నవ్వి ఆ తెలివైన వ్యక్తి ఇలా అన్నాడు. 'ఒకే జోక్‌కు మళ్లీ మళ్లీ నవ్వలేరు.అలాంటప్పుడు ఒకే సమస్యను పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు' అని ప్రశ్నించాడు.
నీతి: సమస్యపై చింత చేయడం వల్ల అది పరిష్కారం కాదు.. కేవలం సమయం, శక్తి మాత్రమే వృథా అవుతుంది.

తెలివిలేని గాడిద

అనగనగా ఓ ఊళ్లో గాడిద ఉండేది. తనకు తాను చాలా తెలివైన గాడిదగా భావిస్తుండేది. ఓ రోజు గాడిద యజమాని ఓ ఉప్పు బస్తాను దానిపై పెట్టి వేరే చోటుకు తరలించాలనుకున్నాడు. మార్గ మధ్యలో ఓ చిన్న సెలయేరు దాటి వెళ్లాల్సి ఉంది. ఇలా గాడిద ఆ ఉప్పు బస్తాను మోసుకుంటూ వెళుతుండగా దానికి ఓ ఆలోచన తట్టింది. వెంటనే ఆ ఉప్పు బస్తాను నీటిలోకి పడేసింది. దీంతో సగం ఉప్పు నీటిపాలైంది. మిగిలిన ఉప్పు బస్తాను తిరిగి గాడిదపై పెట్టగా అది చాలా తేలికగా అనిపించింది. గాడిద చాలా సంతోష పడింది. ఇలా ప్రతిరోజు ఈ గాడిద ఉప్పు బస్తాను నీటిలో పడేయడం... తేలికగా మారిన ఉప్పు బస్తాను సంతోషంగా మోసుకెళుతూ ఉండేది. అయితే గాడిద అతి తెలివిని పసిగట్టిన యజమాని ఓరోజు దూది బస్తాను ఆ గాడిదపై పెట్టాడు. ఈ బస్తాను కూడా ఆ సెలఏరులో పడేస్తే మరింత తేలికగా మారుతుందని భావించిన గాడిద... ఆ దూది బస్తాను నీటిలో పడేసింది. అయితే దూది నీటిలో మునగడంతో నీరు మొత్తం దూదిలోకి చేరి అది బరువుగా మారింది. ఇక ఆ బరువును మోయడంలో ఆ గాడిద చాలా ఇబ్బంది పడింది. ఓ గుణపాఠం నేర్చుకుంది. ఆ తర్వాత ఎప్పుడూ ఇలాంటి వేషాలు వేయకుండా పని సరిగ్గా చేయడం ప్రారంభించింది...
నీతి: అదృష్టం ఎప్పుడూ మనవైపే ఉంటుందనుకోవడం మూర్ఖత్వం అవుతుంది...

గాడిద - గుర్రం
రామయ్య అనే వ్యాపారి సరుకులను గాడిద మీద పెట్టుకుని తన గుర్రం ఎక్కి పొరుగూరు వెళుతున్నాడు, కొంత సేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగింది, గుర్రం అది నా బాధ్యతకాదు, బరువులు మోయటానికి నువ్వు, సుఖంగా జీవించడానికి నేను అన్నది, బరువు మోయలేని గాడిద నడుము విరిగి క్రిందపడింది, వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదలి, ఆ బరువు మొత్తాన్ని గుర్రం పై వేసి తనూ ఎక్కి ప్రయాణం సాగించాడు, ఆ కొంచం బరువును ముందే మోస్తే నాకు ఈ గాడిద బరువు తప్పేది కదా అని గుర్రం మనసులో బాధపడింది
నీతి: బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది.