అప్రాశ్యులు
భీమేశ్వర చల్లా (సి.బి.రావు)
14
ఆ రాత్రి రజని రామం గురించే ఆలోచించింది. మరునాడు రామం తనతో మాట్లాడదలచిన దేమిటోకూడ ఆమె గ్రహించింది. సమాధానం ఏం చెప్పాలో ఆమె తర్కించుకుంది. రామం మొదటనుంచీ ఆమెకొక సమస్యగానే వున్నాడు. తిరస్కరించలేని ఆ నిగూఢ ప్రేమ భరించరాని బలహీనత సంపూర్ణమైన ఆసమర్పణ ఆ సమస్యకి పరిష్కారం లభించకుండ చేశాయి. రాధా రాణీ ఆగమనం దానికి పరిష్కారంగా ఆమె మనస్సుకి తోచింది. బాల్యం నుంచి రాధకి రామం మనస్తత్వం తెలుసును. అతనిని అర్ధం చేసుకుంది. రాధ ఆధారంతో రామం నిరాటంకంగా ముందుకు సాగిపోగలడనే ధైర్యం రజనిలో కలిగింది. రామం హృదయంలో రాధ యెడల బలవత్తరమైన ప్రేమ లేకపోయినా అతని సున్నిత హృదయంలో సహజీవనం ఆ బీజాలను నాటగలదని రజనీ గ్రహించింది. ఇతరుల బరువు బాధ్యత మోయడమనేది రజనీకి కొత్త కాదు బాల్యం నుంచీ ఆమెకు అలవాటే. కాని ఆమె సమర్పించలేనిది అతగాడు ఆశించిలభించక సతమతమవుతూంటే ఆమెకు ఎంతో బాధకలిగేది. రామం జీవితంలోంచి శాశ్వతంగా తొలగిపోవాలని ఆమెకు లేదు. కాని అవసరంవస్తే అది రామం భరించగలిగే సయయం ఆసన్నమయితే అలా చెయ్యాలనే నిశ్చయించుకుంది. భవిష్యత్తులో అలా జరగక తప్పదనికూడ ఆమె గ్రహించింది. అంతవరకూ ఎవరూ సాధించలేని కార్యం రామంసాధించాడు. తనబలహీనతతోనే రజనిని బంధించి అంతవరకు వుంచగలిగాడు. ఆ బంధనలనుకూడ త్రేంచుకొనవలసిన సమయం ఆసన్నమయింది.
ఆ మరునాడు ఆఫీసులో రజనీ కాస్త పరధ్యానంగా వుంది. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూండగా హఠాత్తుగా వర్షం పడటం ప్రారంభించింది. క్షణకాలంలోనే శరీరమంతా తడిసి పోయింది. ఎక్కడైనా తలదాచుకొందామనుకునేసరికి వెనుక గట్టిగా శబ్దం చేస్తూ కారు ఆగిన చప్పుడు ఆయేసరికి తుళ్ళిపడి వెనుదిరిగింది, టాక్సీలో రామం కూర్చుని వున్నాడు. తలుపు తెరచి “లోపలికి రా రజనీ'' అన్నాడు.
రజని నవ్వుతూ “బయటే బాగుంది. మీరు బయటకు రండి” అంది.
రామం నిజంగానే తలుపు తీసుకుని బయటకు రాబోతూంటే రజని “ఆగండి ఆగండి తరువాత మీకేమయినా అయితే నన్ను నానా మాటలు అంటారు. రాధకు నేనేమని నచ్చ చెపుతాను” అని లోనికి వెళ్ళి కారులో రామం ప్రక్కన కూర్చుంది. శరీరమంతా తడిసి ముద్దయి వుంది.
“ఇంత వర్షం పడుతూంటే నడిరోడ్డు మీద వెన్నెలలో నడుస్తున్నట్లు నడుస్తున్నావేమిటి?” అన్నాడు రామం.
“అంతా మీదే దోషం” అంది తడిగుడ్డతో ముఖము తుడుచుకుంటూ.
“నా దోషమా? నేనేం చేసేను?” అన్నాడు రామం.
“మీ గురించి ఆలోచిస్తూనే పరథ్యాన్నంగా నడుస్తున్నాను పైగా కారు ఆపి హడలగొట్టారు” అంది.
ఎంతో సరళ కంఠస్వరంతో అన్న మాటలవి. కాని రామం “హడలిపోయే స్వభావం కాదు. నీది రజనీ అందరినీ హడలగొడ్తావు. అమాయకుల్ని, అభం శుభం తెలియని వాళ్ళని అగ్నిలోకి త్రోస్తావు” అన్నాడు.
రామం మాటలు రజనికి అలవాటేకాని, ఆతను వేసిన ఆభాండం రజని వ్యధిత హృదయానికి సూటిగా తగిలింది. ముఖంప్రక్కకు తిప్పుకొని మెదలకుండా వూరుకుంది. కొంచెం సేపు సమాధానం కోసం ఎదురు చూసి రామం రజని వైపు చూసాడు. రజని సన్నగా వణుకుతున్నట్లు కనబడింది కట్టుకున్న తెల్లటి చీర, పచ్చటి జాకెట్టు శరీరంలో లీనమయిపోయింది. తీర్చిదిద్దిన అంగ సౌష్టవం స్పష్టంగా కనబడుతోంది. ముఖాన బొట్టు పెరిగింది, తల మీద నుంచి నీటి బిందువులు క్రిందకు జారుతున్నాయి. కారులో ఒక మూలకు జరిగి కళ్ళుమూసుకుని తలుపు మీద ఒరిగి వుంది. రామం మాటలు ఆమెకు ఎప్పుడూ కలిగించనంత దుఃఖం కలిగించాయి. చలితో వణుకుతున్న ఆమె సుందర శరీరం హృదయంలోని దుఃఖాన్ని యినుమడింపచేసింది. సున్నితమైన అతని హృదయంలోంచి ఆమాటలు ఎందుకు వెలువడ్డాయో ఆమెకూడ గ్రహించలేకపోయింది.
రామం సర్వస్వము మరచిపోయి రజని కేసి ఆపాదమస్తకం చూస్తున్నాడు. టాక్సీహఠాత్తుగా ఆగడంతో రామం వులిక్కిపడి బయటకు చూసి “అరె టాక్సీ లాడ్జికి వచ్చేసిందే. మీ యింటివద్దకు తీసుకువెళ్ళమని చెప్పడం మరచిపోయాను లోనికి వస్తావా రజనీ”అన్నాడు. రజని కళ్లు తెరచి తీక్షణంగా “వణకుతున్న నా శరీరాన్ని కన్నార్పకుండా రాత్రంతా చూస్తూ కూర్చుందామనుకుంటున్నారా?” అంది.
రామం సిగ్గుతో ముఖం క్రిందకు దించి వేసుకుని “పొరపాటయింది రజనీ క్షమించు.” అని డైవరుతో రజనీ యింటి అడ్రసు చెప్పి అక్కడకు తీసుకెళ్ళమని చెప్పాడు. రామానికి రజనివైపుచూచే ధైర్యం లేక ముఖం పూర్తిగా ప్రక్కకు త్రిప్పుకుని కూర్చున్నాడు. రజనికూడా మౌనం వహించింది. ఒకసారి రామం వైపు చూచింది. సిగ్గుతో దహించుకుపోతున్న అతనియెడ హఠాత్తుగా ఆమె హృదయంలో అనురాగపు వర్షం కురిసింది. ఆమె అన్న మాటలు అతనిని ఎంత బాధిస్తున్నాయో ఆమె గ్రహించింది. అప్పుడు ఆమెకు అంత కోపం ఎందుకు వచ్చిందో ఆమెకే అర్థం కాలేదు. సాధారణంగా అలాంటి చూపులు ఆమెకలవాటే టాక్సీవచ్చి రజని యింటి ముందు ఆగింది. వర్షంజోరు కాస్త తగ్గింది. కాని ఇంకా కురుస్తూనే వుంది. కాని రామం యింకా ముఖం ప్రక్కకు త్రిప్పుకుని కూర్చునే వున్నాడు. అతని వుద్దేశం రజని గ్రహించింది. రజని కారుదిగి వెళ్ళిపోతే రామం కారులోనే తిరిగి వెళ్లిపోతాడు. రజని కారు దిగి నిలబడి “లోనికివస్తారా రామం బాబు!? అంది.
ఈసారి ముఖం తిప్పకుండానే “కోరిక లేదు” అన్నాడు కోపంగా రామం.
“ఈసారి ఆ అవసరంకూడా లేదు” అని లోనికి వెళ్ళిపోయింది రజనీ.
రామం అదిగమనించాడు కాని ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. మనస్సు రజనిని విడచి వెళ్ళిపోవడం బొత్తిగా అంగీకరించలేదు. అభిమానాన్ని, అనురాగం త్రోసిపుచ్చింది. డైవరు ఎంతగానో రామం కేసి చూస్తూ హిందీలో “ఎక్కడకు వెళ్ళమంటారా చెప్పండి సార్” అన్నాడు.
రామం ఆ ప్రయత్నంగానే జేబులోంచి అయిదు రూపాయిలనోటు తీసి అతనికి యిచ్చి బయటకు వచ్చేసాడు. డ్రైవరు టాక్సీతీసుకుని వెంటనే వెళ్ళిపోయాడు.
వెంటనేలోనికి వెళ్ళే ధైర్యంలేక బయట నిలబడిపోయాడు. బయట వీధి గుమ్మం తీసి వుంది. కొద్ది నిముషాల తరువాత నెమ్మదిగా భయపడతూ భయపడుతూ లోనికి అడుగు పెట్టాడు. గదిలో రజని కనబడలేదు. ఆమె లోపలవుందని గ్రహించాడు. దగ్గరేవున్న కుర్చీలో మనస్సు చిక్క బెట్టుకోని కూర్చున్నాడు, పదిహేను నిముషాలు గడచినా బయటకు రాలేదు. రామానికి రజనిని పిలచే ధైర్యం లేకపోయింది. వెళ్లి పోదామా అనికూడా అనుకున్నాడు. నేను లోనికి రాలేదని రజని అనుకుంటుంది. బయటకు వెళ్లి పోతే అనుమానం కూడా పడదు అని అనుకున్నాడు.
ఆలోచన వచ్చిన తరువాత ఇంకొక నిముషం ఆలస్యం చేశాడు. ఇంక వెళ్లిపోదామని నిశ్చయించుకునే సమయానికి రజని తలుపు తెరచుకొని బయటకు వచ్చింది. దుస్తులు మార్చుకుంది. నల్లటి చీర, తెల్లటి జాకెట్టు ధరించి జుట్టంతా విరబోసుకుని వుంది. రెండు చేతులతో రెండు కప్పులు కాఫీ పట్టుకుని, నవ్వుతూ దగ్గరకు వచ్చి కప్పు అందించింది.
మిరుమిట్లు గొలిపే ఆసౌందర్యాన్ని చూచిరామం దిగ్భాంతుడై “నిజంగా నువ్వు కామినీ దేవిలా వున్నావు?” అని కప్పుఅందుకుని “ నేను ఇక్కడవున్నానని నీకెలా తెలుసును రజనీ” అన్నాడు.
“మీ స్వభావం నాకామాత్రం తెలియదా? ఆ ధైర్యంతోనే నేను లోనికి వచ్చాను. మీ కోసమనే కాఫీకూడా కాచి తెచ్చాను” అంది.
రామం కాఫీ తాగుతూ, “నిన్న మా నాన్న నీతో ఏమి చెప్పారు రజనీ!” అన్నాడు.
“ఏమని చెప్పారో మీకు తెలియదా? మీకు రాధకు వివాహం చెయ్యాలని చిన్నతనం నుంచి అనుకున్నారనీ? అందుకోసమే వారిరువురు ఇక్కడకు వచ్చారని, మీరు సెలవు దొరక లేదని అన్నారు. కనుక ఇక్కడే చెయ్య నిశ్చయించుకున్నారని చెప్పారు. అందులో అబద్ధమేమయినా వుందా? అన్నది.
“అయితే దానికి ఏమని సమాధానమిచ్చావు రజనీ?” అన్నాడు.
“శుభస్య శ్రీఘ్రం. ఇక్కడే చేస్తే నాకు కూడా చూచే సదవకాశం లభిస్తుంది” అన్నాను.
“మా నాన్న మాటలు విని నిజంగా ఏమనుకున్నావు రజనీ! నేను నిన్ను మోసగించానని భావించావా?” అన్నాడు.
“లేదు. ఇది నాకు చెప్పే ధైర్యం మీలో లేకపోయినదే అనుకున్నాను. కొంచెం బాధకలిగించినా చివరకు యిది మంచికే అని గుర్తించగలిగాను. ఇన్నాళ్ళు మీరు వంటరివారనే బాధపడుతూ వచ్చాను. ఈనాడు ఆకొరత మీకు తీరిందని తెలుసుకుని సంతోషించాను. రాధ చక్కటిది.మీకన్నివిధాల తగినది- రామం లేచినిలబడి కిటికీ వద్దకు వెళ్ళాడు . రజనికి ముఖం కనబడకుండా ముందుకు తిరిగి “కాని రాధను నేను ప్రేమించలేదు రజనీ? ఆమెను నేను వివాహం చేసుకోలేను. నా మనస్సులో నా హృదయంలో నీకు తప్ప యింకెవ్వరికి స్థానం లేదు. నువ్వు అంగీకరిస్తే నేను నిన్న వివాహం చేసుకుంటాను” అన్నాడు
రామం ఇంతకు ముందెన్నడు వివాహం విషయం గురించి ప్రస్తావించలేదు. ఎందుకో ధైర్యం చాలేది కాదు. కాని ఆనాడు అతనికి ఎక్కడ లేని ధైర్యంవచ్చింది పరిస్థితి విషమించిందని, సమయం మించిపోతుందని అతను గ్రహించాడు.
“మీ మాటలు నాకర్ధమయ్యాయి రామం బాబూ! కాని నేను మొదటినుంచీ చెపుతూనే వున్నాను. నాకు వివాహపు బంధనలో నమ్మకం లేదు. అది కాక మనయిద్దరి మనసత్వాలు ఆలాంటి బంధనకు సరిపడవు. మీకు నామీదున్నప్రేమానురాగాలను కాపాడుకోవాలంటే మనమిద్దరం ఇలాగే వుండాలి. ఒకరికొకరు కొంచెం దూరంగా వుంటేనే భవిష్యత్తులో సన్నిహితమయిన యీ బాంధవ్యం నిలుస్తుంది నేను మిమ్మల్ని ఎప్పుడూ తలుస్తునేవుంటాను అవసరానికి ఎప్పుడు మీ అండనే వుంటాను. మీ పిలుపుని నేనెన్నడు పెడ చెవిని పెట్టను, మీరు నా కెప్పుడూ ప్రియులే?” అంది.
అత్యంత అనురాగ పూరితమైన ఆ వాక్యాలు అతన్ని సమూలంగా కదలించి వేసాయి.
“రాధ నాకు చిన్నతనం నుంచి తెలుసును. ఆమె మీద నాకు ప్రేమ లేదు రజనీ! నేనామెను ఎలా వివాహం చేసుకుంటాను?” అన్నాడు.
“వివాహనికి ముఖ్యంగా కావలసినవి రెండున్నాయి . మెదటది మనసత్వాలు సరిపడాలి. రెండవది ఒకరిమీద ఒకరికి గౌరవం వుండాలి. ఈ రెండు కలుస్తే వివాహం జయప్రదం అవుతుంది. రాధవిషయంలో అన్నీ సమకూరినాయి” అన్నది.
రామం రివ్వున వెనుదిరిగి రజని కేసి తీక్షణంగా చూస్తూ “కాని ఆమెలో నన్నాకర్షించేశక్తి లేదు రజనీ? అది నీలోనే వుంది. దానిని నేను జయించలేను. ఇది నువ్వెందుకు అర్థం జేసుకోవు?” అన్నాడు.
“అర్థం చేసుకున్నాను రామం బాబు! ఈ ఆకర్షణకి అర్ధం లేదు. ఆధారం లేదు. ఒక విధంగా ఇది గ్రుడ్డిది. ఇది వివాహ బంధనలో చిక్కుకుంటే భస్మమైపోతుంది. ఇది మీకు తెలుసును కాని తాత్కాలికమయిన సుఖాన్ని తెంచుకోలేక మథనపడుతున్నారు” అన్నది.
“నువ్వు కాక ఇంకొకరు నా జీవితములో అడుగు పెట్టారనే ఆలోచనే నేను సహించలేక పోతున్నాను రజనీ! నీపై నాకు సంక్రమించిన స్వల్ప అధికారాన్ని దాని ఫలితంగా కోలుపోతానేమోనని నాకు భయంగా వుంది నా జీవితంలో ఇంతకంటే విలువయినది ఇంకేమీ లేదు రజనీ! ఇంకేమి ఉండబోదు” అన్నాడు.
ఆమాటలు అంటూ రామం కంఠస్వరం వ్రక్కలయి పోయింది. అత్యంత వేదనాపూరితమైన ఆ స్వరం నిశ్చలితురాలయిన రజనిని కూడా చలింపజేసింది. కొద్దిక్షణాలవరకు మౌనంగా వుండిపోయింది.
రజని మనస్సు మారుతుందేమోననే ఆశతో రామం “కాదు రజనీ! రామం ఎప్పుడూ నీవాడే” అన్నాడు.
“కాని రజని యెప్పుడు ఎవరిసొత్తు కాలేదు రామంబాబు. ఇదే విషయంమీకెన్ని సార్లు చెప్పాను! ఆ సత్యాన్ని మొండిగా గుర్తించక ఇలా వ్యధన పడుతున్నారు. మళ్ళీ మీకొకసారి చెపుతున్నాను, మన యిద్దరి మధ్య కలసిన బంధాన్నీ, అనురాగాన్నీ జీవితాంతంవరకు మిగిలివుండాలంటే వివాహయత్నం మానివేయ్యండి.రాధని వివాహము చేసుకోండి, చిన్నతనంనుంచి మిమ్మల్నే ఆమె నమ్ముకుంది. మీరు సమ్మతించారు. ఇంత ఆలస్యంగా ఆమెను తిరస్కరించాలనుకోవటం మీ ధర్మం కాదు” అన్నది.
రామం ఆమె నిశ్చయానికి తిరుగులేదని గుర్తించాడు.
“నువ్వు నాకు దక్కకపోయినా నాకు చింత లేదు, కాని నన్ను ఇతరులకు అర్పించి పరాయివాడిననే నెపంతో ఒంటరిగా ముందుకు సాగిపోవాలనుకోవటము ధర్మం కాదు. మన ఇద్దరిమధ్య ఇప్పుడున్న సంబంథాన్ని మించి ఇంకేమీ ఆశించను. ఇలాగే వుండనియ్” అన్నాడు.
“ఒంటరిగా మీరు జీవితం గడపలేరని నాకు తెలుసు. అనుక్షణము మీకు అండగా నిలబడి తన సహచర్యలతో సమస్యలను పరిష్కారించడానికి సంసిద్ధురాలయిన వ్యక్తిమీకు అవసరం. ఇది వివాహరూపంలో తప్ప ఇంకే విథంగాను అది మీకు లభించదు. ఇది మీ తెలుసు నేను మీ జీవితం నుంచి శాశ్వతంగా నిష్కమిస్తాననే భయంకూడా మీకవసరం లేదు. అలాంటి ఉద్దేశం నాకు లేదు” అంది.
రామానికి రజని చెప్పి నమాటలన్నీ నిజమేనని తెలుసు, తన కర్తవ్యమేమిటో ఇంకా అతనికి అవగాహన కాలేదు. ఆత్మీయతని తెంచుకోలేక సతమతమయ్యాడు.
వెనుదిరిగి “భవిష్యత్తులో నీవు ఏ ఒక వ్యక్తికి చెందనని మాటియ్యిరజనీ! అది నేను సహించలేను” అన్నాడు.
“ఇవి ఈర్ష్యాపూరిత వాక్యాలు రామంబాబు. వాగ్దానాలు, బాసలు చేసే అలవాటు నాకు లేదని మీకు తెలుసు? భవిష్యత్తును బంధించేశక్తి నాకు లేదు, మీకా అధికారము లేదు” అంది.
అతనికళ్ళల్లోకి కన్నీరు వుబికి వచ్చింది. వెనుదిరిగి వుండడం వల్ల ఆమె గుర్తించలేదు.
“కేవలం యీనిర్ణయం నీదే రజనీ! దాన్ని అనుకరిస్తాను కాని భవిష్యత్తులో దీనివలన ఏమైనా అనర్థకంవాటిల్లితే దానికి బాధ్యురాలివి నువ్వు మాత్రమే అది గుర్తుంచుకో” అన్నాడు.
“ఈవిధంగా మీరు చేష్టలపరిణామాలనుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. ఒక విధంగా భవిష్యత్తులో నన్ను బంధించి వుంచాలని ఆశిస్తున్నారు. సరే కానీయండి. ఆ భారం కూడా నేనే వహిస్తాను. ఈనాటివరకు నేను తాత్కాలిక అంగీకారాలతోనే గడుపుకుంటూ వచ్చాను, కాని ఈనాడు శాశ్వతమైన ఒక బంధనలో ప్రవేశించాను” అంది.
అతను వుద్రేకంతో “దేదీప్యమానమైన నీ సౌందర్యం నన్ను మొదటినుంచీ పిచ్చివానిగా చేస్తూంది. ఇలాటి అపురూప స్త్రీ పరిచయం కలుగుతుందని నేను నిన్ను కలుసుకోక మునుపు వూహించ లేకపోయాను. జీవితాంతంవరకు సర్వదా నీ సాంగత్యం లభించాలని ఆశించడమనేది దురాశ అని నేను గ్రహించ లేకపోయాను. కాని జీవితంలో నాకు ఇక వేరే ఆశ, కోరిక లేదు. రజని నామశబ్దం, రజని రూప సౌందర్యము- వీటిని మించిన సృష్టి లేదు” అన్నాడు.
తన శక్తినంతా కూడదీసి ప్రయత్నించినా రామం దుఃఖం ఆగలేదు. కన్నీరు కారుస్తూ ముఖాన్నిచేతుల్లో దాచుకొని అక్కడ దగ్గర వున్నకుర్చీలో కూర్చున్నాడు. రజనీ దగ్గరకు వచ్చి చేతుల విప్పి కన్నీరు చీరచెంగుతో తుడిచి “జీవితంలోని పరమార్థాన్ని మీరు గ్రహించ లేకపోతున్నారు రామంబాబు! సామాన్యమైన ఒక స్త్రీ ప్రేమలో పడి మీరు భీరులై కన్నీరు కారుస్తారా? తళుక్కుమంటున్న యీ అందం ఎంతో కాలం వుండదు. ఆ తరువాత మీరే ఆశ్చర్యపడతారు. ఈమెనేనా నేనాప్పుడు అంత గాఢంగా ప్రేమించి వాంఛించాను? అనుకుంటారు. కాని అప్పుడు నేను మిమ్మల్ని పట్టుకు ప్రాకులాడవలసిన అవసరం రావచ్చు నేమో! ఇదే స్త్రీ పురుషులలో వ్యత్యాసము” అంది.
అతను ఆప్యాయంగా ఆమె చీర చెంగుతో తుడుచుకుని, రెండు చేతులు హృదయంవద్ద పెట్టుకుని “ఈ స్పర్శలోనే ఇంత సుఖము, శాంతం ఎలావున్నాయి రజనీ? అనిర్వచనీయమైన ఆనందం నన్ను ఉర్రూతలూగిస్తూంది. కొద్దిక్షణలైనా ఈ సుఖం నన్ను అనుభవించనియ్” అని గట్టిగా నొక్కుతున్నాడు.
ఆమె రెండుమూడు నిమిషాలవరకు అలాగేనిలబడింది. ఆ తరువాత నెమ్మదిగా చేతులు లాగుకుంది. అయినా అతను మారుమాట్లాడలేదు. ఆమె కూడా అక్కడే ఇంకొంత కాలం నిలబడింది. అప్పటికే దట్టంగా చీకటి చుట్టు ప్రక్కల వ్యాపించింది. గదిలో లైటు ఇంకా వేయలేదు. అంత దగ్గరలో వున్న ఒకరి ముఖకవళికలు ఇంకొకరికి స్పష్టంగా కనబడటము లేదు. ఆమె లైటు వెయ్యటానికి వెళ్ళబోతూంటే “వద్దు రజనీ, కాస్సేపు ఇలాగే వుండనీ” అన్నాడు .
“సరే అలాగే కానీయండి కాని ఎంతసేపు మీరీ అంధకారాన్ని సహిస్తారు! వెలుగులోకి రాక తప్పదు” అన్నది
“వెలుగు చీకటి, సుఖదుఃఖాలు, వీటిలో ఏవీ కలకాలం వుండవని వేదాంతం చెప్తూంటారు.అలాంటప్పుడు మనమెందుకు తొందరపడాలి. అయినా కలకాలం మనముండము” అన్నాడు.
రజని సమాధానం చెప్పే అవసరం లేదని గ్రహించింది. అందువలన రామం దుఃఖపడడమే కాని తగ్గడని గ్రహించింది.
కాని రామం ఊరుకోలేదు. నేనిలాంటి స్థితికి దిగజారిపోతానని ఎప్పుడూ అనుకోలేదు రజనీ. ఒకప్పుడు ఆత్మాభిమానం ఆత్మగౌరవం, ప్రాణపదంగా కాపాడుకునే వ్యక్తిని అన్నాడు.
రామం మాటలు రజనికి కాస్త నొప్పి కలిగించాయి.
“ఇప్పుడు వాటికి సంబంధిచిన ప్రమాదమేమి లేదు రామం బాబు” అన్నది.
కాని రామం రజని మాటలను పట్టించుకోలేదు. నాలోనిలోపాలు నా అసమర్థత నాకు తెలుసు రజనీ. నీ ఔన్నత్యంముందు నా అందః పతనం స్పష్టంగా కనబడుతుంది. మేరు పర్వతానికి, మట్టిగోడకి గల విభేధం లాంటివి, సువర్ల పతకానికి గాలిపటానికిగల తేడాలాంటిది. ప్రపంచకంలో ఏవ్యక్తి నిన్ను సంపూర్ణంగా ఇముడ్చుకోలేరు. ఆ తీక్షణతకి ఎవరు తట్టుకోలేరు. స్వార్ధపరత్వంతో ఎవరయినా కాంక్షించినా వారు భస్మమయిపోతారు. ఒకసారి నీపరిచయం అయిన తర్వాత ఆ స్థానాన్ని ఇంకే ఇతర స్త్రీ ఆక్రమించుకోలేదు. ఆపొలిమేరకయినా ఎవరూ రాలేరు” అన్నాడు.
రామం నోటి వెంట ఆమాటలు శరవేగంతో వెలువడ్డాయి. ముఖమంతా ఎర్రబడింది శరీరం గజగజవణకింది. చీకటిలో రజని అది గుర్తించలేదు. రజని రామానికి కాస్త దూరంగా నిలబడివుంది, ఇప్పుడు దగ్గరకు వచ్చి “మీరన్న ఈ మాటలు దుఃఖంతో, ఆవేశంతోటి అన్న మాటలని నాకు తెలుసు. నేను అతిసామాన్యమయిన స్త్రీని, కాని ఒకటిమట్టుకునిజము రామం బాబు. శాంతి భద్రతలు, సుఖ సౌఖ్యాలు ఆశించే ఏవ్యక్తి అయినా నా బాటనుంచి తప్పుకోవడమే శ్రేయస్కరం” అంది.
“నా శ్రేయస్కరం వాంఛించి నువ్వు పని చేస్తున్నావని నువ్వంటే నేను సహించలేను రజనీ. కావాలంటే కళ్ళకు గంతలుకట్టి నన్ను నీవెంటతీసుకుపో. కాని అలసినప్పుడు ఆస్కారంగా నీ చెయ్యి నాకు లభించాలి. కాని ఇదికూడా నువ్వు త్రోసిపుచ్చావు/ కేవలం ఓటమివల్లనే నేను నిశ్చయాన్ని అంగీకరించాను రజనీ నీ చమత్కారం తోటి, చతురతతోటి నామనస్సు మార్చి అంగీకరింప చేశానని గర్వపడకు” అన్నాడు.
రజనికి, ఆసమయంలో మౌనం వహించడమే వుత్తమమని గ్రహించింది. ఇక సంభాషణ పొడిగించడంకూడా మంచిది కాదని రజని తెలుసుకుంది.
“ఇక పదండి రామం బాబూ, మిమ్మల్ని టాక్సీస్టాండు వద్ద విడచి వస్తాను. చాలా ఆలస్యమయింది” అంది రజని.
రామానికి ఒకనాటి వెన్నెల రాత్రి నడిరోడ్డుమీద జరిగినసంఘటన గుర్తుకొచ్చింది. కాని ఈనాడు ఇది చీకటి రాత్రి.
“ఆనాడు రామం వెన్నెలలో నువ్వునాకు తోడు వచ్చావు. ఈనాడు చీకటిలోకి నేను వంటరిగానే వెళ్లాను, రజనీ” అని క్షణకాలం ఆగి “రాధ నాకోసం ఎదురు చూస్తూంటుంది” అని బయటకి వచ్చాడు రామం.
బయటకూడా చాలా చీకటిగా వుంది. దగ్గర లైటు స్తంభం కూడా లేదు. రామం మాటల అర్ధం రజని గ్రహించింది. తన కృషి ఫలించినదని ఒక వైపున ఆనందం ఆ క్షణంలోనే రామం చేతుల్లోంచి జారిపోయాడనే. దుఃఖం ఆమెని ముంచివేశాయి. క్షణకాలం రామం మీద భరించరాని అనురాగంతో ఆమెహృదయం పొంగిపొర్లింది. చివాలున రామం చెయ్యి పట్టుకుంది.
“కనుచూపు మేరలో కాంతి కనబడుతూంది రామం బాబు. ఆపొలిమేర వరకు నన్ను రానీయండి. చీకటిని దాటి మీ వెంట రానని మాటయిస్తాను” అంది.
రామం చివాలున తన చెయ్యిని లాగుకొని “సమయం వచ్చినప్పుడు ఆ సహాయం కూడా అడుగుతాను రజనీ. ఇప్పుడు వంటరిగానే వెళ్ళనీయి” అన్నాడు.
గద్గద స్వరంతో రజని “రాక్షసి యిక నుంచి కేవలం తరచుగా మీకు స్వప్నంలో సాక్షాత్కరిస్తూంటుంది. రామం బాబు” అంది.
చీకటిని చీల్చుకుపోతున్న రామం హృదయంలోకి ఆమాటలు రివ్వున దూసుకు పోయాయి.
**********
ప్రసాద్ యింటికి మూడు రోజులు తరువాత తిరిగి వచ్చాడు. చంద్రిక ప్రసాద్ ని చూసి సంతోషంతో వుప్పొంగి పోయింది. మూడురోజుల నుంచి ప్రాణాలరచేతిలో వుంచుకొని చంద్రిక ఎదురు చూస్తోంది. ప్రసాద్ ఉద్రేకవంతుడని ఆమెకు తెలుసు. అతను ఏ అఘాయిత్యం తల బెడతాడోనని భయపడుతూ వుంది. ప్రసాద్ ముఖంలో వుద్రేకం ఎక్కువ కనబడలేదు. కాని నిర్దుష్టమైన నిశ్చయం ఆమెకు కనబడింది.
“మామయ్యా! వచ్చారా. ఇన్నాళ్ళు నన్ను వదలి ఎక్కడున్నారు. భయంతో ఆతురతతో యిన్నాళ్లు పుక్కిరి బిక్కిరి అవుతున్నాను” అంది చంద్రిక.
చంద్రిక మాటలలోని అప్యాయత అతనికి అసభ్యంగా కనబడింది. కాని కారణం కనుక్కోలేక పోయాడు ఆ మాటలు సహజమైనవే.
కృత్రిమముగా నవ్వుతూ “అది నాకు తెలుసుకు చంద్రికా! కాని పనిమీద వుండిపోవలసినచ్చింది” అని లోపలికి వెళ్ళిపోయాడు.
తన గదిలోకి వెళ్ళి తర్వాత రెండుగంటలకు బయటకు వచ్చి చంద్రికతో “నేను యిల్లు వదలి బయటకు వెడుతున్నాను. కొంతకాలంవరికు తిరిగి రాను. కావలసిన డబ్బు అన్నీ ఇందులో వున్నాయి. దగ్గర వున్న డబ్బు అయిపోయేవరకు ఈ కవరు చించకు” అని ఒక పెద్దకవరు చంద్రిక చేతికి అందించాడు.
చంద్రిక భయంతో “ఎక్కడకు వెళుతున్నావు మామయ్యా? కాశ్మీరు వెళుతున్నావా? నన్ను కూడా తీసుకు వెళ్ళవా?” అన్నది.
“లేదు చంద్రికా! అది వీలుపడదు. ఒంటరిగానే వెళ్ళాలి త్వరలోనే తిరిగి వస్తాను. రాకపోయినా నాకేమి ఇబ్బంది వుండదు” అన్నాడు.
ప్రసాద్ మాటలు చంద్రికను భయవిహ్వలని జేసాయి. అతని చెయ్యి గట్టిగా పట్టుకొని “నేను నిన్ను విడచి వుండలేనుమామయ్యా! ఒంటరిగా నేను ఇక్కడ వుండలేను. ఎక్కడికయినా ఫరవాలేదు. వెంట తీసుకు వెళ్ళు మామయ్యా! లేకపోతే నేను బ్రతకలేను” అని వెక్కి వెక్కి ఏడ్వటం మొదలు పెట్టింది.
చంద్రిక కన్నీరు అతనిలోని క్రోధాన్నిప్రేరేపింపజేసాయి. “చంటిపిల్లలా ఎందుకలా ఏడుస్తావు చంద్రికా? కన్నీరుని నేను సహింపను” అన్నాడు.
చంద్రిక కన్నీరుని ఆపు చేసుకొని “నన్నిలా ఎందుకు బాధ పెడుతున్నావు మామయ్యా! చిన్నతనం నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెద్దదానివి చేసావు, మీరు తప్ప నాకిక వేరే గతి లేదు. నిన్ను విడచి నేను వుండలేను” అన్నది.
“అది నీ బలహీనత చంద్రికా! దానికి నేను బాధ్యుడను కాను” అన్నాడు.
చంద్రికకి దుఃఖం మళ్ళీ ముంచుకువచ్చింది. ముఖం చేతులతో కప్పుకొని దుర్నివార్యంగా వెక్కి వెక్కి ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది. ప్రసాద్ రెండు మూడు నిమిషాలవరకు ఆమె కేసి తేరిపార చూసాడు.
“చంద్రికా! అనురాగమే జీవితంలో అన్నింటికీ దుఃఖ హేతువు. అది నువ్వు జయించకపోతే అది నిన్ను అడుగడుగున వెంటాడుతూనే వుంటుంది. ఇంకో విషయం కూడ చెప్పాలనిపిస్తుంది. నా జీవితంలో నువ్వు ఎప్పుడూ కొంత కారణంగానే వచ్చావు. నేను నీ జీవితాన్ని ఇప్పటివరకు వహించటానికి నువ్వు కూడ కొంతవరకు కారణభూతురాలివే. నీ ఆలోచన నాకిప్పుడు మనశ్శాంతి కలిగిస్తూనే వుంది. ఈ సమయంలో నీ జీవితం సాఫీగా, సుఖంగా జరిగిపోవాలని నేను వాంఛించేటంత తీవ్రంగా, స్వచ్చంగా, హృదయపూర్వకంగానే ఇంకేమి వాంఛించటం లేదు” అన్నాడు.
చంద్రిక యింకా వెక్కి వెక్కి ఏడుస్తూనేవుంది. అతను క్షణకాలం ఆగి “రజని వుండగా ప్రపంచంలో నువ్వు ఏకాకివనే భయం నీ కవసరం లేదు చంద్రికా! ఇక నేను వెళుతున్నాను” అని బయటకు వచ్చేసాడు. ఒక పెద్ద సూట్ కేస్ మాత్రం కారులో వుంచుకున్నాడు. కారు తీసుకుని బయలుదేరాడు. కమలరూపం అనుక్షణం అతని మనఃఫలకము మీద కనబడసాగింది. ఆమె అనురాగాన్ని సంపాదించాలనే వాంఛ గట్టు తెగి ప్రవహించనారంభించింది. ఆమెని మొదటిసారి చూచినప్పటినుంచీ జరిగిన సంఘటనలన్నీ మనోవీధిలో మెదలసాగాయి. ఆమె పెట్టిన చెంప పెట్టు, తాజ్ మహల్ మీనారెట్ లో జరిగిన సంఘటన, గాయపడిన ప్రసాద్ ని చూడటానికి వచ్చినప్పుడు హాస్పటల్ లో జరిగిన సంఘటన, ఊరవతల కారులో ఏ కాంతంగా జరిగిన సంభాషణ మొదలయినవన్నీ ఒక దాని తరువాత ఒకటి జ్ఞాపక మొచ్చాయి. మొదటినుంచీ కమల అతనంటే ఒకవిధమైన భయం, తిరస్కారం ప్రదర్శిస్తునే వచ్చింది. దానితోపాటు ఒక విధమైన ఏవగింపుకూడ అప్పుడప్పుడు దృగ్గోచరమయేది. ఒక్కసారి కూడ ఆమె నోటి వెంట అనురాగపువాక్యాలు రాలేదు. వాటి కోసమే ప్రసాద్ పరితపిస్తూ వచ్చాడు. కమల వివాహిత అనే ధ్యాసే అతనికి లేకపోయింది. కమలకి రజనికిగల ప్రచండమైన విభేదం అతనికెంతమాత్రము గుర్తుకు రాలేదు. కమల అనురాగాన్ని పొందాలనే తీవ్రవాంఛ అతని హృదయాన్ని దహించి వేసింది. అది తప్పయిక ప్రపంచంలో ఇంకేమి అతడు గుర్తించ లేకపోయాడు. నిజానికి అది ఎంతో సహజమయినదే. మానవునిప్రేమకు అంతులేదు. సరిహద్దు లేదు. ధర్మాధర్మాలతోటి, యుక్తా యుక్తాలతోటి నిమిత్తం లేదు. సూటిగాకనబడేది ప్రేమించిన వారి ప్రియరూపం. ప్రేమించడము సహజమయితే ప్రేమించబడి నవారువివాహితలయి నంత మాత్రాన అది అసహజ మవలేదు. మనస్సులోని ఆలోచనని, హృదయంలోని ఆవేశాలని అధర్మమనే పేరుతో అణగదొక్కే అధికారం దైవానికి కూడ లేదు. వాటిల్లు దోషం లేదు. కల్మషం లేదు. పాపభీతికి తావు లేదు. దైవ నిర్మితమయిన వాటికి మానవుడు సిగ్గుపడవలసిన అవసరం లేదని ఎవరో అన్నట్లు గుర్తు, ఈ భావాలు కేవలం దైవ నిర్మితాలే కాదు, దైవ ప్రేరితాలుకూడ. చేష్టలను శాసించే అధికారం మానవులకే వుంది. “నాది, నేను” అనే అహంభావంతో బలాఢ్యులు, మూర్ఖులు యితరులకి అన్యాయం చెయ్యకుండా వుండటానికి జరిగిన ఏర్పాటే సమాజం. కాని అది అధికారాన్ని దుర్వినియోగం చేసి నియంతగా ప్రతిష్ఠించింది. ఈ విధంగా సాగాయి ప్రసాద్ ఆలోచనలు. ఆ నియంతృత్వానికి తిరుగుబాటే తన రూపంలో సాక్షాత్కరించిందిఅని భావించాడు.
అప్పటికి సంధ్యాసమయం దాటిపోయి చీకటికి దారి యిస్తోంది. ప్రసాద్ కమల యింటి వైపు కారు నడపసాగాడు. అప్పుడు అతనికి గుర్తువచ్చింది.
సాయంకాలాల్లో సాధారణంగా కమల ఇంటిదగ్గర వున్న చిన్న పార్కుకి వెళ్ళి కూర్చుంటుంది, ఒకసారి ఆమె అలా చెప్పినట్లు గుర్తుకువచ్చింది. అక్కడికే కారు పోనిచ్చాడు. పార్కు చాలా చిన్నది. పూర్తిగా మనుష్య సంచారం లేదు. కారు దిగి లోన వెదకసాగాడు. లోపల ఒకరిద్దరువ్యక్తులు కనబడ్డారు. నిరాశతో బయటకు వచ్చేద్దామనుకునే సమయంతో దూరంలో గడ్డిపై వాలివున్న స్త్రీ స్వరూపం కనబడింది. కమలని వెంటనే గుర్తించసాగాడు. అతనిహృదయం సంతోషంతో వుప్పొంగిపోయింది. ఆమె ఏకాంతంగా వుంది. ఆమె మోచేతిని ఆనుకొని కళ్ళు మూసుకుని పడుకొని ఏదో పరధ్యాన్నంగా ఆలోచిస్తున్నది.
వెనుకగా వెళ్ళి“కమలా!” అని నెమ్మదిగా పిలిచాడు. ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరచింది. మొదట అది కమలాకరంపిలుపు అనుకుంది. అతని రాక కోసమే ఆమె నిరీక్షిస్తోంది. ఆఫీసునుంచి తిరిగి రాలేదు. ప్రతిరోజూ సాయంకాలం వారక్కడే కలుసుకునే ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఒక గంట సేపు గడిపిఇంటికి చేరుకునేవారు. ఆమె ఆ ఘడియ కోసమే ఎదురు చూస్తోంది.
“ఇంత ఆలశ్యంచేసావ్” అని నవ్వుతూ వెనుతిరిగి చూసింది. ప్రసాద్ ని చూచి కమల నిర్ఘాంతపోయింది. చివాలున లేచి చెదరిన చీరని సరి చేసుకుంటూ “మీరా?” అంది.
“అవును కమలా! నేనే, ఆశ్చర్యం వేస్తోందా?” అన్నాడు.
“కమల కంగారుపడుతూ “వారనుకున్నాను” వారి కోసమే ఎదురుచూస్తున్నాను” అన్నది,
కాని ప్రసాద్ కమలమాటల్ని వినిపించుకోలేదు. “నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడటం నా కలవాటేనని నీకు తెలుసు కమలా, “నేను నిన్ను తీసుకు పోవటానికి వచ్చాను” అన్నాడు.
కమల పూర్తిగా భయవిహ్వలై పోయింది. అతన్ని చూచిన వెంటనే ఏదో అవాంతరం వచ్చిందని ఆమె మొదటే భయపడింది. ప్రసాద్ మాటలతీరు ఆమెను యింకా భయపెట్టాయి.
“ఎక్కడికి? ఏమిటలా మాట్లాడుతున్నారు. వారొచ్చే వేళయింది” అన్నది.
“నేనిక యిది భరించలేను కమలా రాత్రింబవళ్ళు కనుమూసినా, కనుతెరచినా, నీ రూపమే నాకుకనబడుతోంది. నీసాంగత్యం కోసం, అనురాగంకోసం నాహృదయం బద్దలవుతోంది. ఇక నువ్వు లేకుండా నేను క్షణమైన జీవించలేను. ఇన్నాళ్ళు నా శక్తినంతా కూడదీసుకుని ప్రచండమైన వేదనని భరించాను. ఇక నేను పోరాడలేను కమలా! ఇక నేను భరించలేను” అన్నాడు.
గంభీరమైన కంఠస్వరం ఆమె చెవుల్లో మారు మ్రోగినది.అప్రయత్నంగా ఆమెలో ఒక విధమైన గర్వభావం పొడ చూపింది.
“దానికి నేను బాధ్యురాలను కాను ప్రసాద్. నాలో ఆలాంటి భావాలకి చోటు లేదు. అనవసరంగా రసాభాసా చెయ్యకుండా మీ దారిన మీరు వెళ్ళండి” అంది.
“నేను వంటరిగా వెళ్ళటానికి రాలేదు కమలా! నిన్ను నా వెంట తీసుకునే ఇక్కడ నుంచి వెడతాను, నేను ఆడిన మాట తప్పనని, పట్టిన పట్టు విడువనని నీకు తెలుసుగదా?” అన్నాడు.
కమలకి ముచ్చెమటలు పోసాయి. ప్రసాద్ నిజంగానే ఆ వుద్దేశంతో నచ్చాడని అతని నిశ్చయంతప్పించడం అసంభవమని ఆమె గ్రహించింది.
వణుకుతున్న కంఠస్వరంతో, “నన్ను ఎందుకిలా బాధపెడుతున్నారు మీరు? నేను వివాహితను, నా భర్తే నాకు సర్వస్వం, పర స్త్రీతోమీరనవలసిన మాటలాయివి. ఇది అధర్మం కాదా? మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటాను. నన్ను వదలి వెళ్ళిపోండి” అంది.
“వివాహితపై నంత మాత్రాన నేను నిన్ను ప్రేమించడం అధర్మమంటే నెనంగీకరించను కమలా, ఎన్నడూ అంగీకరించను. వివాహంఒక సామాన్యమైన అంగీకారం. ప్రేమఓక మహత్తరమైన అనుభూతి” అన్నాడు.
“కావచ్చు కాని ఒకరి ఇష్టానికి విరుద్దంగా ఇంకోకరు వారిని లోబరచుకోవడానికి ప్రయత్నించటం అధర్మం కాదా?” అంది.
“ఆ వుద్దేశంతోనే ఇన్నాళ్ళు ఇదంతా సహించాను. కాని ఇక నేను భరించలేను, మానవులంతా స్వార్ధ పరులే కమలా-” అని హఠాత్తుగా ముందుకు అడుగు వేసాడు.
కమల వెనుకకు అడుగు వేసి క్రోధంతో మండిపడుతూ “ముందుకు అడుగు వేసారంటేఏం చేస్తానో చెప్పలేను ప్రసాద్. అబలనని మీరు ఆశ పడుతున్నారేమో జాగ్రత్త” అంది.
కమల కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ప్రసాద్ వాటిల్లోకి చూడకుండా, ఏం చెయ్యగలవు కమలా? ఎంతైనా నువ్వు ఆబలవే. అయినా సాహసమంటే ఇదిగో అని రివ్వున జేబులోంచి రివాల్వరు తీసి కమలకు అందించాడు.
కమల అది అప్రయత్నంగానే అందుకుంది.
“నీలో ఆ ధైర్యమే వుంటే చాలు కమలా, ఆత్మహత్య చేసుకున్నానని వ్రాసియిస్తాను. నీకా భయం అక్కర లేదు.” అన్నాడు ప్రసాద్.
కమల శరీరమంతా గజగజ వణక సాగింది. ప్రసాద్ నెమ్మదిగా దగ్గరకు వచ్చాడు. కమల ఎంత ప్రయత్నించినా రివాల్వరు పైకి ఎత్తలేకపోయింది. ప్రసాద్ కమలను హఠాత్తుగా కౌగిలిలోకి లాగుకొని గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. భరింపరాని ఆవేశంతో కమల శరీరం తుఫానులో చిక్కుకున్న గాలిపటంలా రెప రెపలాడింది. ఆమెకి స్మృతి తప్పే పరిస్థితికి వచ్చింది.
“నాకు ఇది నిజం చెప్పు కమలా మనస్సులో మర్మం లేకుండా ఈ ఒక్క ప్రశ్నకి సవ్యమయిన సమాధానం ఇయ్యి నా మీద నీ హృదయంలో ప్రేమానురాగాలు లేవా!” అన్నాడు ప్రసాద్.
కమల అస్పష్టంగా సమాధానం యిచ్చింది. “హృదయంలో వాటిని మించినదింకేమి లేదు. కాని నేను వారిని మోసగించలేను. వారు నన్ను నమ్ముకున్నారు. ప్రాణపదంగా ప్రేమిస్తున్నారు. అలాంటి వారిని నేను మోసగించలేను. వారికి తీరని అలాంటి బాధ కలిగించి నేను జీవితంలో సుఖపడలేను. ఇతరుల దుఃఖాలతో నేను ఆనందంగా వుండలేను” అంది.
“ఆయితే నా దుఃఖం నా బాధ నీకేమి అంటవా కమలా! వాటితో నీకు నిమిత్తం లేదా” అన్నాడు.
కమల ఇంకా ప్రసాద్ కౌగిలిలోనే వుంది. నెమ్మదిగా “ఆలోచన నన్నెప్పుడు బాధ పెడుతూనేవుంది. కాని నా సర్వస్వాన్ని ప్రేమకోసం త్యజించే సాహసం నాలో లేదు. నన్ను సాధించక వదలి వేయండి, నన్ను విడిచి పెట్టండి మీరడిగిన ప్రశ్నకు నిజమైన సమాధానం చెప్పాను, ఇక నన్ను విడచి పెట్టండి” అంది.
విడిచి పెట్టండి అని కమల ఆంది. కాని అలాంటి ప్రయుత్నమేమి చేయలేదు, కాని ప్రసాద్ చివాలున ఆమెను విడిచి పెట్టి ఉద్రిక్తకంఠంతో “కమలా నీ ఇష్టానికి విరుద్దంగా నీకు హానికలిగించేటంత నీచుడినికాను. నీ హృదయంలో నేనంటే ప్రేమ లేదనే ఇన్నాళ్లు బాధపడేవాడిని కాని ఈనాడు తెలిసింది అది అసత్యమని. నువ్వు సంఘానికి వెరసి ఇలా ప్రవర్తిస్తూంటావని ఇప్పుడు నా హృదయం తేలికపడింది. ఇక నేను నిన్ను విడచి వెళ్ళిపోతాను. శాశ్వతంగా నీనుంచి ప్రపంచకం నుంచీ దూరమయిపోతాను. సంతోషంతో నిండిన హృదయంతో మరణిస్తాను” అన్నాడు.
కమల దుఃఖంతో కన్నీరు కారుస్తూ “నన్ను క్షమించండి ప్రసాద్! నన్ను క్షమించేసారని నాకొక వాగ్దానం చేయండి. ఏలాంటిఅఘాయిత్యము చెయ్యనని నాకు మాటియ్యండి”
ప్రసాద్ కఠినంగా “అలాంటి వాగ్దానం అడిగే అధికారం నీకు లేదు కమలా, నీలో నేనంటే ప్రేమానురాగా లున్నాయని తెలిసి నేను నిన్ను పర స్త్రీగా చూస్తూ నేను జీవించలేను” అని మృదువుగా “కమలా నేను నిన్ను ప్రేమించినంతగా, వాంఛించనంతగా ఇంకెవరు ఎప్పుడు ప్రేమించివుండరు. బహుశా దానికి ఇది తగిన పర్యవసానం.” అని రివ్వున బయటకు వచ్చేశాడు.
అయిపోయింది