Aprasyulu - 2 books and stories free download online pdf in Telugu

అప్రాశ్యులు - 2

అప్రాశ్యులు

భీమేశ్వర చల్లా (సి.బి.రావు)

2

పది రోజుల తరువాత ఆరోజు సాయంకాలం కమలాకరము, కమల యిండియా గేటువద్దకు షీకారుకి వెళ్లారు. చలికాలం అవటం వలన, దాదాపు ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా వుంది. బాగా చీకటి పడింది. ఒకరి ప్రక్కన వొకరు చేతుల మీద ఆనుకుని పచ్చటి పరుపు మీద పరుండి ఆప్యాయంగా కబురు చెప్పుకుంటున్నారు. కొద్దిరోజుల నుంచి కమల ప్రవర్తనలో ఒక విధమైన మార్పు కమలాకరం గుర్తించాడు. పూర్వవు అశాంతి ఆమెలో మాయమయినట్లు కనబడింది. అర్ధం లేని ప్రశ్నలు వేసి పిచ్చిగా ప్రవర్తించటం లేదు. అతనిని సంతోషపెట్టడానికి ఆమె ప్రయత్నించేదీ. అతని ఆప్యాయతా, ఆదరం, అనురాగం కాంక్షించేది. వాటికి పూర్వము యివ్వని విలువ ఆమె యిచ్చేది భార్యలో కలిగిన యీ మార్పుకు ఎంతో సంతోషించాడు. అయినా దానికి కారణమడుగకుండా వుండటమే వుత్తమమని భావించాడు. వచ్చే ఆదివారం ఎక్కడికైనా సరదాగా వెళదామా చెప్పండి ? ఆరోజే కార్తిక పౌర్ణమి పుచ్చపువ్వు లాంటి ఆ పండు వెన్నెలలో తాజమహల్ కన్నుల పండువగా వుంటుంది. కల్లోల పూరితమైన మనస్సులకు అదే ఎంతో శాంతిని యిస్తుంది. అగ్ని రగిలే ఆత్మలకు అదే చల్లని జీవనం. భార్యాభర్తల అమర ప్రేమకి ఆదే పవిత్ర నిదర్శనం దానిని చూచిన కొలది చూడాలనిపిస్తోంది. ఆదృశ్యం మనస్సుకి నూతన శక్తిని నిలకడ యిస్తుందనే నమ్మకం నాకువుంది” అంది కమల వుద్రేకంగా.

కమలాకరానికి, భార్య మాటలు ఎంతో ఆశ్చర్యం కలిగించాయి. ఆమె యింతకు ముందెప్పుడు ఆవిధంగా మాట్లాడినట్లు గుర్తులేదు. ఆమెలో ఆ శాంతి మాయమయినదనుకోవటం ఒక అపోహ మాత్రమే అని గ్రహించాడు కాని, అది నూతన పరవళ్ళు తొక్కుతోందని గ్రహించాడు. పూర్వపుఅశాంతికి యీ మాటలోంచి తొంగేచూసే అశాంతికి, ఏదో విభేదం గోచరించింది. ఈ మాటలలో ఆప్యాయత అనురాగమువున్నాయి. ఇదే ఆతనికి ఎంతో సంతోషాన్ని కలుగజేసింది.

కమలాకరం భార్యను ఆదరంతో దగ్గరకు తీసుకుని “కమలా! అలాగే తప్పకుండా వెళదాము. నాకూ చూడాలనే వుంది. కాని నువ్వు నాకు యిది చెప్పాలి. నూతన శక్తి నిలకడ నీకీనాడు ఎందుకు అవసరమయ్యాయి?” అన్నాడు.

కమల ఒక క్షణం మౌనం వహించింది. మెల్లగా కారణం నాకు సరిగా తెలియదు కాని ఒక విషయం నేను మీకు చెప్పకుండా వుండలేను, మీరంటే నాకు ఎన్నడూ లేని గౌరవాభిమానములతో నా మనస్సుయీనాడు పెల్లుబుకుతోంది. మాటలకు మించిన మమత మనస్సులో మెదుల్తూంది” అంది.

స్పష్టంగా, సుమధురంగా వినిపించిన ఆ సున్నిత ప్రేమ వాక్యాలకి కమలాకరం కరిగిపోయాడు. గంభీరుడు, మితభాషి అయిన అతగాడు గద్గద కంఠస్వరంతో,“కమలా యిన్నాళ్ళు నీమాటల్లోని మాధుర్యాన్ని,మైమరపించే మమతను నానుంచి ఎందుకు దాచివుంచావు? కాలాతీతమైన ఈ కృతజ్ఞత నా హృదయాన్ని చీల్చి భరించరాని ఈ ప్రేమానురాగాన్ని నేను ఏ విధంగా వెల్లడించను” అని వుద్రేకంతో కమలను గాఢంగ హృదయానికి హత్తుకొన్నాడు.“నిన్ను నాలో పూర్తిగాలీనం చేసుకోవాలని భరింపరాని కాంక్ష కలుగుతోంది కమలా.” అని కమల ముఖంమీద ముద్దుల వర్షము కురిపించేడు. కమల ఆతని వుద్రేకానికి అసమ్మతి కాని సమ్మతి కాని తెలుపలేదు. మౌనంగా కళ్ళు మూసుకుని మెదలకుడా వూరుకుంది కమలాకరం పూర్తిగా తన్మయుడై తనను తాను మరచిపోయాడు. కొంత సేపు గడిచేటప్పటికి కమల మెల్లగా కళ్లు తెరిచింది. వెంటనే త్రుళ్ళిపడి కమలాకరం కౌగిలి విడిపించుకొని సిగ్గుతో వళ్లు సవరించుకుంది. మసక చీకటిలో కూడా తన యెదుట నిలబడి వున్న పురుషాకారాన్ని స్పష్టంగా గుర్తించగలిగింది కాని ఏం చెయ్యాలో ఏమనాలో ఆమెకు ఏమి తెలియలేదు కమలాకరం అది గ్రహించేడు కాని ప్రసాద్ని గుర్తించలేకపోయాడు.మత్తునిద్రలోంచి బలవంతంగా లేపినట్లు క్రోధంతో అతనిని వుద్దేశించి “రాస్కెల్” అన్నాడు.

ప్రసాద్ పకపక నవ్వుతూ "ప్రణయకలాపానికి భలే స్థలం కని పెట్టావు కమలాకరం కాని మీ దురదృష్టం. నా కారు లైట్లు మీ గుట్టు బయటపెట్టాయి. అయినా ఫరవాలేదు “కారీ ఆన్” అన్నాడు.

కమలాకరం కి ప్రసాద్ మాటలు ప్రవర్తనా కొద్దిగా ఆశ్చర్యం కలుగాజేసాయి. ప్రసాద్ కాస్తనిషాలో వున్నాడని గ్రహించాడు. కాని కమల ఆ వాసనబట్టి కాని, ప్రవర్తనబట్టి కాని ఆ విషయం ఊహించలేదు. చివాలున లేచిప్రసాద్ ని చెంప పెట్టు పెట్టింది. “నీకుయుక్తాయుక్త విచక్షణ, జ్ఞానం,నీతి నియమాలు లేవని నాకు యింతకు ముందే తెలుసు కాని నువ్వు మూర్ఖుడవని, మొరటు వాడివని, నేను యిప్పుడే గ్రహించాను. ఫో యిక్కడి నుంచి” అంది.

ఈ మాటలు అని కమల వెక్కి వెక్కి ఏడుస్తూ నేలమీద కూలిపోయింది. చెంప పెట్టు తిన్న ఒక నిమిషం వరకు ప్రసాద్ అచేతనారహితుడై నిలబడిపోయాడు. చెంప పెట్టుతో మత్తు వదలిపోయింది జరిగినదంతా జ్ఞప్తికి వచ్చింది. కాని ఏం చెయ్యాలో తెలియలేదు కమలాకరంతో మాట్లాడటం ఇష్టం లేకపోయింది. చివరికి “కమలా!” అని పిలిచాడు. ఒక క్షణకాలం వరకు ఆమె జవాబు కోసం నిరీక్షించి ఆ తరువాత అతను రివ్వున వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు. కొద్ది క్షణాలలోనేనిశ్శబ్దాన్ని నిర్ధాక్షణ్యంగా చీల్చుకుంటూ శరవేగంతో ఒక కారు బయలుదేరి వెళ్ళిపోయింది.

కమలాకరంకి భార్య ప్రవర్తన చాలావరకు సహజంగానే కనిపించింది. ప్రసాద్ నిషాలో వున్నాడన్న విషయం ఆమె గ్రహించలేదని తెలుసుకున్నాడు. కాని ఆమె చెంప పెట్టు పెట్టిన తర్వాత “ఎందుకు కమలా “అన్నాడు? అతనికి అర్ధం కాలేదు దగ్గరకు వెళ్ళి “కమలా ఎందుకలా అనవసరంగా దుఃఖపడతావు జరిగినది జరిగిపోయిందిలే” అన్నాడు.

కమల కన్నీటితో తడిసిపోయిన తన ముఖాన్ని చివాలున ఎత్తి “పర పురుషుడు నన్ను ఇలా అవమానిస్తే మీకు ఏ మాత్రము దుఃఖం కాని, క్రోధం కాని లేదా !" అంది.

“ఈవిధంగా జరిగినందుకు నాకు దుఃఖంగానే వుంది. కాని క్రోధం లేదు. ప్రసాద్ త్రాగి వున్నాడన్న విషయం గుర్తించలేదు” అన్నాడు.

ప్రసాద్ త్రాగి వున్నాడని తెలిసేసరికి కమల శరీరం జలజరించింది. అయినా ఆమె మాట్లాడలేదు.

“పద కమలా ! ఆలస్యమవుతుంది.” అన్నాడు కమలాకరం.

మరునాడు వుదయం 9 గంటలకు కమలాకరం ఆఫీసుకి పోయే ప్రయత్నంలో వున్నాడు. కమల భర్తకు చొక్కా బొత్తాములు కుట్టియిచ్చే ప్రయత్నంలో వుంది. గత రాత్రి నుంచి కమల ఎంతో ముభావంగా వుంది. రాత్రంతా ఆమెకు సరిగా నిద్రపట్టలేదు. కల్లోల భరితమైన మనస్సును ఆమె పదేపదే ప్రశ్నించుకుంది. ఈ పరాభవానికి నేనెలా ప్రతీకారం చూపాలి. నా భర్త ముందర జరిగిన ఈ అవమానానికి నేనెలా కక్ష తీర్చుకోవాలి. నిజంగా ప్రసాద్ త్రాగి వున్నాడా లేక అది యంతా ఒక నటనా?” అనుకొంది . చిందర వందర అయిన జుట్టుతో, ఎర్రని కళ్ళతో, ముఖమంతా వాడివుంది

ముందర గదిలోకూర్చుని బొత్తాలు కుట్టుతున్న కమల ఎదుట ప్రసాద్ హఠాత్తుగా ప్రతక్ష్యమయ్యాడు. “గుడ్ మార్నింగు- కమలా” అన్నాడు. కమల పూర్తిగా చేతనరహిత ఆయిపోయింది. గత రాత్రి జరిగిన సంఘటన తరువాత ఆ మరునాడే ప్రసాద్ తనకి ముఖం చూపిస్తాడని కమలనుకోలేదు. కొన్నాళ్ల పాటయినా అతడు వారికి దూరంగా వుంటాడని భావించింది. ఆనందించింది. హఠాత్తుగా, ఆ విధంగా కనిపించేటప్పటికి ఆమె క్షణకాలం దిగ్ర్భాంతురాలైంది. కాని మరుక్షణమే ఆమె చివాలున లేచి లోనికి పోయింది. ప్రసాద్ కంఠస్వరం విని లోపలి నుంచీ కమలాకరం బయటకు వచ్చాడు. ప్రసాద్ ని చూసి నిర్మలంగా నవ్వుతూ! "ప్రసాద్. ఇంత త్వరలో నవ్వు దర్శనమిస్తావనుకోలేదు” అన్నాడు.

ప్రసాద్ కుర్చీలో కూర్చుంటూ. "నీ శ్రీమతికి నాపై కోపం ఉన్నట్టుందే.” అన్నాడు

కమలాకరంనవ్వుతూ“చెంపపెట్టు అప్పుడే మరచిపోయావా?” అన్నాడు.

“మరచిపోలేదు అందుకనే వచ్చాను. పగ తీర్చుకోవాలి. అన్నట్టు మరచిపోయాను. వచ్చే ఆదివారం ఆగ్రా ప్రోగ్రాం వేయాలి. నేను రజని మీరు కూడా రండి”.

కమలాకరం “కారులో నేనా? సరిగా మేముకూడా అదే అనుకున్నాము. అంతా కలసే వెళ్దాం”అన్నాడు. లోపలినుంచి వారి సంభాషణంతా వింటోనే వుందిచాటుగ పొంచి వుండి. ప్రసాద్ వీరి మాటలు గత రాత్రి విని వుంటాడనుకుంది. తనకు కమలాకరానికి మధ్య నడచిన సంభాషణ జ్ఞప్తికి వచ్చి సిగ్గుతో దహించుకు పోయింది. ప్రసాద్ తో కలసి ఆగ్రాకు వెళ్లకూడదని నిశ్చయించుకుంది.

కమలాకరం నవ్వుతూ "సరే! ప్రసాద్ నాకు ఆఫీసుకి ఆలస్యమవుతుంది. నేను వెళ్లాలి. నన్ను సెక్రటేరియట్ వద్ద డ్రాప్ చెయ్యగలవా?” అని “కమలా నా చొక్కా తీసుకురా ! నేను వెళ్ళాలి” అని పిలిచాడు.

లోపలినుంచి కమల వచ్చి కమలాకరానికి చొక్కా యిచ్చి లోపలికి వెళ్ళిపోతూవుంటే ప్రసాద్ “కమలా నామీద కక్ష తీరనట్లుందింకా?” అన్నాడు. “శిక్షకు సిద్దంగా వున్నాను.” ఆ కంఠస్వరం వినపడేసరికి కమల మనస్సుఒకసారి ఝల్లుమంది. సమాధానం చెప్పకుండానేలోనికి వెళ్ళిపోయింది.

మిత్రులిద్దరు కారులో బయలుదేరారు. ప్రసాద్ అలవాటు ప్రకారం మనోవేగంతో కారు నడుపుతున్నాడు. కమలాకరం ఆ వేగానికి రామం వలె భయపడలేదు. కాని ఆశ్చర్యంతో “ఏమిటి ప్రసాద్ ప్రాణాల మీద నీకు తీపి లేకపోయినా నాకు వుంది. కాస్త నెమ్మదిగా పోనీయి” అన్నాడు.

కాని ప్రసాద్ వేగం తగ్గించలేదు. “కారు వేగంగా పోతుంటే నా మనస్సుఆకాశములో తేలిపోతున్నట్లుంటుంది. మనస్సు ఆహ్లాదంతో నిండిపోతుంది. గాలిని చీల్చుకుంటూ కారు పోతుంటే నా మనస్సుకి నేను ప్రపంచాన్ని చీల్చుకు పోతున్నట్టనిపిస్తుంది. ప్రపంచంలో అన్నింటిని చీల్చివెయ్యాలి కలయిక , శాంతి, కరుణ వీటికి చోటు లేదు'' అన్నాడు.

కమలాకరాని కెందుకో ఆ మాటలు మాట్లాడినది ప్రసాద్ కాదని, ఎవరో ఒక అపరిచిత వ్యక్తి అని అనిపించింది.

ఆశ్చర్యంతో “కారు ఆపు ప్రసాద్! సెక్రటేరియట్ వచ్చేసింది” అన్నాడు.

కమలాకరం కారు దిగి వెళ్ళిపోతూంటేప్రసాద్, “అయితే మనం శనివారం రాత్రి బయలు దేరి వెళ్ళుదామా లేకఆదివారం ఉదయం వెళ్దామా ఆగ్రాకి?” అన్నాడు,

కమలాకరం వెనుతీరిగి శనివారం రాత్రేవెళ్దాము శనివారం పౌర్ణమిట” అన్నాడు

కారులో ఒంటరిగా వెళ్ళిపోతూ ప్రసాద్ అనుకున్నాడు, పౌర్ణమి_తాజమహల్ _కమలా.

మరునాటి సాయంత్రం రామం ఆఫీసు నుంచి తిరిగివచ్చి చూచేసరికి బయట రజని, నిలబడి అతని రాక కోసం ఎదురు చూస్తోంది. రజనిని చూచేసరికి రామం హృదయం సంతోషంతో ఒకసారి స్పందించింది. ఆనాడు రజని వెళ్ళిపోయిన తరువాత అతనికి రజనిని అడ్రస్ అడగలేదని గుర్తుకు వచ్చింది. అప్పటి నుంచీ ఆమె ఎక్కడైనా కనబడు తుందేమోనని వేయికళ్ళతో వెదుకుతున్నాడు. ఈనాడు హఠాత్తుగా ఆలా తన రాక కోసం నీరీక్షణ చేస్తున్న ఆమె సుందర రూపం అతని హృదయానికి ఆహ్లాదం గలిగించింది.

“మీకోసం చూచి చూచి నా కళ్ళు కాయలు కాచిపోయాయి కాళ్లు తేలిపోతున్నాయి. ఇంత ఆలస్యం చేసేరేమిటి?” అని క్షణకాలం ఆగి” లేక నాబోటి వారికి ఎదురు చూడడం అలవాటే అంటారా?” అంది నవ్వుతూ,

“మీరిలా హఠాత్తుగా ఆకాశంనుంచి వూడిపడతారని నేనేమైన కలగన్నానా?” అన్నాడు తాళం తీస్తూ రామం.

“అవును. నేను మీకు చెప్పాను కదా, స్వప్నంలో మనము కలుసుకుంటామని” అంది లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంటూ రజని.

“నాకు నిజంగానే మీరు కలలో కనపడ్డారు. కారులో మీరు పోతూ, కాలినడకను పోతున్న నన్ను చూచి పకపక నవ్వారు కోపంతో ఒక రాయితీసి మీ మీద విసిరాను కాని అది ప్రక్కనున్న ప్రసాద్ కి తగిలింది. ఇది నా కల” అన్నాడు రామం,

“మీరు రాయి విసిరింది నేను కారులో పోతూనవ్వినందుకు కాదు. ప్రసాద్ నా ప్రక్కన వున్నాడని యిర్ష్యతో ఆలా చేసారు. బెడ్డ వెసింది నాపై కాదు - ఎవరి మీద వెయ్యాలనుకున్నారో వారికే తగిలింది, మీదంతా బూటకం మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు” అంది రజని మందహాసం చేస్తూ.

స్వప్నానికి సునాయసంగా తీసిన ఆ అర్ధానికి రామం విస్మయపోయాడు “నాకు ప్రసాద్ వుంటేయిర్ష్యఎందుకు చెప్పండి మీదంతా పరిహాసమే” అన్నాడు.

రజని రామం కళ్ళలోకి చూస్తూ ; “ఒకరు కాంక్షించేవస్తువు ఇంకొరి సొత్తు అయినప్పుడు వారిమీద యిర్ష వుండదా ఇప్పండి? రక్తమాంసాలెంత సహజమో, మీబోటివారికీ ఈర్ష్య కూడా అంత సహజములే.స్త్రీ ఎప్పుడూ ఎవరిదో ఒకరి సొత్తుగా వుండాలని మీరనుకుంటారు. పరాయివాడు ప్రేమతో చూచినా, పరధ్యానంగా పళ్లికిలించినా మీ రక్తం కుతకుత వుడికి పోతుంది. రజని నాకు కావాలి. పరాయివారెవరు ? ఆమెను తాకకూడదు, అని మీరనుకుంటున్నారా? లేదా” అంది.

రజని వేసిన అభాండానికి రామం కంగారు పడ్డాడు. రజని వేసిన ఎత్తు అతను గ్రహించలేక పోయాడు. అజ్ఞాతంగా, అస్పష్టంగా ఆంతర్యంలో వున్న కోర్కెలకు ఆకారం యిచ్చి, అతని ముందర విగ్రహాన్ని నిలబెట్టింది. రామాన్ని ప్రేరేపించడానికి అన్నమాటలవి కాని, రామం అది గుర్తించలేక సిగ్గుతో క్రుంగిపోయి మీరు అలాంటి అపార్ధం కలిగే మాటలెందుకంటారు చెప్పండి "నాలో అలాంటి కోరికలేవీ లేవు. అలాంటిది నేను కలలో కూడా తలబెట్టను. ప్రసాద్ నా ఆప్తమిత్రుడు. అతనికి నేనే ద్రోహం తలపెడ్తానా?” అన్నాడు.

రజనీ వేసిన వుచ్చులో అతను పడిపోయాడు. "ప్రసాద్ మీఆప్త మిత్రుడు. కాకపోతేను ! మీరు ఆయనకి ద్రోహంచెయ్యవలసిన అవసరం లేకపోతేను ! మీరు ఏం చేస్తారూ” అంది.

రామం తబ్బిబ్బయ్యాడు. “అప్పుడు ఏం చేస్తానా ?” అని ఏదో అనబోతుంటే రజని కఠినంగా “రజని కోసం ఒంటికాలు మీద తపస్సు చేస్తారు. రాత్రింబగళ్ళు నిద్రమాని వెఱ్ఱి వెఱ్ఱిప్రేమలేఖలు వాస్తారు ప్రేయసీ, హృదయ రాణి అని గేయాలు వ్రాస్తారు. ఇదే ఆత్మవంచన. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఒక సమయంలో ఒక సంపూర్ణమైన పదార్థంగా పరిగణించరు, అర్ధం లేని అనేక వాటితో ముడి పెడతారు మీలో అన్ని (ఎమోషన్స్) ఆణచిన ఆవేశాలువుక్కిరి బిక్కిరి అయిన వుద్రేకలు - వీటికి పూర్తి స్వాతంత్యం ఎందుకు యివ్వరు?” అంది.

రజని మాటలకన్నా ఆమె కంఠస్వరంలో కర్కశత్వం ఆతన్ని ఆశ్చర్యపర్చింది. నెమ్మదిగా అయితే, జీవితంలో అన్ని వస్తువులు అందరి అందుబాటులోనూ వుంటాయా. రజని! అన్నాడు.

“వుండక పోవచ్చు. కాని వున్న వాటిని కూడ వారిది వీరిది అని వేసుకోవడం అవివేకమంటున్నాను” అంది నవ్వుతూ.

రామానికి, రజని ఆ మాటలు పరిహాసానికి అన్నదో, మాట వరసకే అందో నిజంగా అంతు తెలియలేదు. తప్పించుకొనే వుద్దేశంతో “కాఫీ చేస్తాను. కాస్త తాగితే మీమనస్సు కొంత కుదుటపడుతుంది అన్నాడు.

ఈసారి రజని తాను కాఫీ చేస్తానని ముందుకు రాలేదు. మెదలకుండా అక్కడే కూర్చుని రామం చేష్టల్ని కన్నార్పకుండా చూస్తూంది. కాస్త నిదానించి చూసే పెదవుల మీద మందహాసం కనబడుతుంది.

కాఫీతాగుతూ రజని "సినీమాకు వెళదాం పదండి” కాదంటే లాభం లేదని అతనికి తెలుసు. యిద్దరు కలసి సినిమాకు వెళ్ళేరు. సినిమా చూస్తున్నంతసేపు, రజని శరీరం తన శరీరానికి తాకినప్పుడల్లా అతని శరీరం ఝల్లుమంటోంది. అప్పుడప్పుడు రజని ప్రయత్నపూర్వకంగా అలా చేస్తూందా అనుకున్నాడు. సీనిమా ఒక అతి సాధారణమైన విషాధ గాధ. లలితా, శ్యాములు బాల్య స్నేహితులు. ఇద్దరు సమవయస్కులు. లలితకి యవ్వనంలో అడుగు పెట్టిన వెంటనే వివాహం చేస్తారు. అప్పటికి అతను చిన్నవాడు. లేత వయస్సప్పుడు అవటం వలన అతనికి ఆ గాయం అప్పుడు ఎట్టి బాధ పెట్టలేదు. కానీ కాలంగడిచే కొలది తాను కోల్పోయిన వస్తువు యొక్క విలువ తెలిసి వచ్చింది. ఆమె మీద ప్రేమ దినదినాభివృద్ధి చెందజొచ్చింది. ఆమె శ్యామం యొక్క మనస్సును మొదట గుర్తించలేదు. తరువాత అది తెలిసిన తరువాత అతనిని పరిహాసం చేసేది. కనీసం సానుభూతి కాని, ఆదరం కానీ, ఆమె చూపించలేదు. ఒకనాడు ఆ శ్యామే, లలితకు తన హృదయపు ఆవేదన నివేదించగా ఆమె అతనికి సలహా యిచ్చింది. "ఏ ఒక వ్యక్తికి యింకొక వ్యక్తి పై నవ్వు చెప్పినంత అనురాగము, ప్రేమ వుండడము అసంభవము. ఇదంతా నీ పిచ్చి. నీకింకా చిన్నతనం వదలలేదు. ప్రపంచ జ్ఞానం బొత్తిగా నీకు లే” దంది.

గాయపడిన హృదయంతో “నిజంగా అసంభవమా లలితా” అన్నాడు.

లలిత “అసంభవమైనా, కాకపోయినా, అవాంఛనీయం” అంది.

లలిత మాటలు శ్యామ్ హృదయంలో గునపాలు గుచ్చినట్లు అయింది, కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్న దుఃఖాన్ని శక్తినంతా కూడదీసి సంభాళించుకొని అన్నాడు “నువ్వు నన్నుప్రేమించడం లేదని నేను అట్టే బాధపటం లేదు. లలితా! అది అసంభవమని నాకు తెలుసు, కాని నువ్వు నా ప్రేమనే హేళన చేస్తావు. కనీసం సానుభూతియైనా చూపించవు నా హృదయంలో సదా చెలరేగే యి బడదాగ్నిని నేను భరించలేను, కనీసం “నువ్వు నీ ప్రేమ నాకు తెలుసు. దానికి నా సానుభూతి వుంది కాని నేను అసహాయురాలిని. నేనేమి చెయ్యలేదు. కాని సదా నిన్ను నా మనస్సులో తలచుకుంటూ వుంటాను.” అని హృదయ పూర్వకంగా చెప్పినట్లయితే నా మనస్సుకి కాస్త శాంతి లభిస్తుంది” అన్నాడు.

లలిత నవ్వుతూ “సినిమాలో సంభాషణలా వున్నాయి నీమాటలు” అంది.

చెళ్లుమని చెంప పెట్టు పెట్టునట్టు అయింది భరింపరాని ఆ అవమానంతో హృదయం అంతా దహించుకుపోయింది. దుఃఖంతో అభిమానంతో వణికి పోతూ “లలితా! ఒక వ్యక్తి ప్రేమను చులకన చేసే నువ్వు స్త్రీవి కావు పాషాణనివీ, అని బయటికి వచ్చేసి ఆత్మహత్య చేసుకుంటాడు. లలిత పేర ఒక వుత్తరం విడచి వెళ్ళిపోతాడు. అందులో

లలితా?“నా జీవితమంతా నీ కోసమే గడిపేను. యీనాడు నా మరణానికి నీవే కారణభూతురాలవని నేను చెప్పి నిన్ను నేను కించపరచను. పుట్టుక నుంచి ప్రతి మానవునికి ఏదో ఒక మార్గం నిర్దేశించబడి వుంటుంది. దాని వెంబడే పయనించాం, నీనీడలో నేనా బాట నిర్దేశించబడింది. నీ యెడ నాకు ఏర్పడిన అనురాగాన్ని ఆత్మీయతని తెంచుకోవాలని నేను శక్తి వంచనలు లేకుండా ప్రయత్నించేను.

కాని నాకు అది సాధ్యపడలేదు. నీ చూపుకోసం, నీ కంఠం కోసం నాహృదయమెప్పుడూ తహతహలాడేది, నా శరీరంలోని, ప్రతి అణువు సర్వదా “లలితా ? లలితా ? అని ఘోషించేది. పరులు వుచ్చరించినా లలితా అనే శబ్దం నా హృదయాన్ని స్పందింపచేసేది కాని నువ్వు నాయెడ ఎప్పుడూ ప్రదర్శించే నిర్లక్ష్యం, నిర్దాక్షిణ్యం, పరిహాసం, నా హృదయానికి రంపపు కోతలాగ వుండేది. నేను దీనిని ఎంతో కాలం సహించేను, కాని యిక నేను సహించలేను. ఎన్ని కష్టాలనైన నేను భరించగలను. కాని నువ్వే నా ప్రేమను హేళన చేయ్యటం నేను భరించలేను. అందరి ఎడ నువ్వు ఎంతో అనురాగం, ఆదరం, సానుభూతి ప్రసాదిస్తావు. నేను చేసిన నేరం ఏమిటి? లలితా! కాస్త కనికరం చూపించి నట్లయితే నువ్వొక జీవి ప్రాణం కాపాడేదానివి. నాకు పునర్జన్మలో నమ్మకం లేదు. కాని ఆ దేవుడుంటే నీలాంటి స్త్రీ యెడ నా హృదయంలో ప్రేమ లేకుండా ప్రసాదించమని నేను భగవంతుని వేడుకుంటాను.”

ఉత్తరం చదివి లలిత రెండు కన్నీటిబిందువులు రాల్చిందంతే. వాటితోనే ఆమె అన్నీ కడిగి వేసుకుంది లలిత భర్తకు శ్యాము సంగతిచూచాయగా తెలుసు. అతను చాలా దుఃఖపడ్డాడు. కాని లలిత నవ్వుతూ “ఆతని ఆత్మహత్యకు నేను బాధ్యురాలను ఎంతమాత్రము కాను, అతనికి నాపై ప్రేమ వుంటే నేనేం చెయ్యను. నాకు మీరే సర్వస్వం నా హృదయమూ, నా మనసూ, నా శరీరం అన్నీ మీరే. నాకు యితరుల ప్రసక్తి లేదు” అంది.

సరిగ్గా అదేఘట్టంలో రామం రజనితో "నేనింకా కూర్చోలేను. బయటకు పోదాం” అని బయటకు వచ్చేశాడు రజని ఆశ్చర్యంతో అతనిని అనుకరించింది.

బయటకు వచ్చి “ఏమయింది? ఆటమధ్యలో ఎందుకు వచ్చేసేవు” అంది.

"నేనిక అది చూడలేను. కధ మరీ అసంభవంగా వుంది, అలాంటి స్త్రీలు ఎక్కడేనా వుంటారా? పాషాణహృదయులు” అన్నాడు రామం.

రజని నవ్వుతూ. “ఓ అదా సంగతి. కధానాయకుని మరణం మిమ్మల్ని కలవరపెట్టిందా? లలితలాంటి వారు ఎందుకుండరు? అయినా ఆమె చేసిన తప్పేమిటి? పరుల ఆత్మహత్యలకు ఆమె బాధ్యురాలు కాదు” అంది.

“అది కాదు రజనీ ఆమె అతనిని ప్రేమించక పోవచ్చును, వివాహం అయివుండవచ్చు. తోటి మనిషని కష్టాలకి సానుభూతి చూపించటం ఆమె కనీస ధర్మం కాదా!

ఆమెకోసం ఒక వ్యక్తి ఆవిధంగా పరితపిస్తూ ప్రాణ త్యాగానికి తలపెట్టినప్పుడు కూడా ఆమెమనస్సు కరగలేదు. ప్రపంచంలో అనేక బాధలున్నాయి అనేక కష్టాలున్నాయి. కాని అన్నింటిలోకి భరించరాని బాధయిదే. తను ప్రేమించేవ్యక్తి తన ప్రేమను బూటకమని హేళన చేస్తే భరించటం కష్టం. తను ఎవరిరూపాన్ని అయితే హృదయపీఠంమీద ప్రతిష్టించి పూజిస్తూ వచ్చేడో, ఆ వ్యక్తి “నీకు నామీద వున్నది ప్రేమ కాదు. పుస్తకాలలోని పిచ్చి అంటే ఎంత బాధగావుంటుంది చెప్పు? అప్పుడప్పుడు రెండు మూడు అనురాగపూరిత వాక్యాలనినంతమాత్రాన ఆమె పాతివత్యానికి ఏమి భంగంవస్తుంది? అలాంటి మాటలే అతనికి మనశ్శాంతి నిచ్చివుండును. ఆహ్లాదకరమైన ఆమె స్మరణతో ఆనందాన్నిచ్చే అనుభూతితో అతను జీవించియుండును” అన్నాడు రామం వుద్రేకంగా.

ఇందులో రెండు విషయాలు వున్నాయి. మొదటిది ఏమంటే నిజంగా ఆమె మనస్సులో అతని యెడ ప్రేమ వుండినట్టయితే ఆమె చేసింది తప్పు. అందులో పాతివత్యం, పరాశక్తి వీటికి చోటు లేదు! రెండవది ఏమిటంటే ఒక వేళ ఆమె అతనిని ప్రేమించివుండక పోతే ఆతని ఆత్మహత్యకు బాధ్యురాలు కాదు. ఒకతను నన్ను ప్రేమించి నిరాశ చెంది వెళ్ళి ఎయిర్ ఫోర్స్ లో చేరాడు. అతను కొన్నాళ్ళకు విమానం కూలి చనిపోయేడని పేపర్ లో చదివేను. అందుకు నేను బాధ్యురాలనా?” అంది రజని.

రామం కుతూహలంతో “ఎవరతను? ఎప్పుడు జరిగింది?” అన్నాడు.

“నాతో యూనివర్సిటీలో చదువుకున్నాడు.ప్రసాదుకి తెలుసు అతను. నషీర్ అనే బెంగాళీ వాడు. మంచి వాడే. మనిషిలో మర్మం ఏకోశానా లేదు. బాగా తెలివైనవాడు కూడాను; నన్ను చాయలా వెంబడించేవాడు. నామీద ఒకటో రెండో పద్యాలు కూడావ్రాశాడు. నాకు చాలా జాలివేసేది. పెళ్ళి చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. నేను ససేమిరా ఒప్పుకోలేదు. స్నేహితుడుగా స్వీకరిస్తాను గానిప్రియుడుగా పనికిరావని చెప్పాను, కారణమేమిటంటే అతడు శారీరకంగా నన్నాకర్షించలేకపోయాడు, భగ్న హృదయంతో అతను యూనివర్సిటీ వదిలి ఎయిర్ ఫోర్సులో చేరినాడు. రెండు నెలల ముందు పేపర్లో చదివాను, విమానంకూలి మరణించాడని. నా పేర చాలా ప్రేమలేఖలు వ్రాశాడు. అవన్ని పెద్ద కవరులో పెట్టి పైన నా పేరు వ్రాసివుంచాడట. నా పేర తనజీవితాన్ని ఇన్సూరెన్స్ చేసుకున్నాడట. నాకు ఒక పది వేలరూపాయిలు వచ్చాయి. అవన్నీ అతని మరణం తర్వాత నాకు పంపించారు. అవన్నీ చదివి,తర్వాత నేననుకున్నాను. నిజంగా నన్ను అతడు ప్రేమించాడని. ప్రేమలేఖలు అచ్చు వేద్దామనుకున్నాను. యీ కాలంలో అవి బాగా చేల్లుబడి అవుతాయి. ప్రియురాలి ప్రేమకోసం తపిస్తూ ఉత్తరం వ్రాద్దామంటే వేలునడవక కలవర పడుతున్న ప్రేమికులు చాలామంది వున్నారు, అలాంటి వారికిది ఐస్ క్రీం లాంటిది. పరోపకారం చేసిన దాని నవుతాను ఏమంటారు?” అంది రజని.

రజని చెప్పిన ఆ విషాద గాధ రామం హృదయాన్ని కరగించివేసింది. రజని వ్యంగ్యంగా, పరిహాసంగా మాట్లాడడం అతనిని మరీ బాధ పెట్టింది. “అ డబ్బు ఏం చేశావు?” అని అడిగాడు.

“దాచివుంచాను. మీకు కావాలా?” అని అడిగి రామం ముఖకవళికలు చూసి “లేదండీ. అదంతా అతని తల్లిదండ్రులకు పంపించి వేశాను” అంది.

“అయితే, అతనంటే నీకు సానుభూతి లేదా? అతని స్కృతి నిన్ను బాధ పెట్టదా ? అతని పేరును అలా తిరస్కరించటం తప్పు కాదా? కేవలం శరీరాకర్షణయే ప్రధానమైన సంగతా? ఇక దేనికీ విలువ లేదా?” అన్నాడు రామం.

“మీరు అలా వుద్రేకపడి మాటలు కురిపించినంత మాత్రాన ఏమి లాభం లేదు. నాకు సానుభూతి వుందా అని అడిగారు. దాని అవసర మేమిటి? ఏదో వ్యర్ధంగా నాకు సానుభూతి వుంది అంటే మీరు సంతృప్తిపడతారు. ఆహా! రజనిది దయార్ద్రహృదయం అంటారు. లేకపోతే కఠినురాలు అంటారు. కాని దాని లాభమేమిటి? ఇక అతని స్మృతి నన్ను బాధపెట్టడం లేదా అని అడిగారు! అది నిజమే అప్పుడప్పుడు బాధకలిగిస్తుంది. అందుకనే నేను దానిని స్మృతిపధంలోకి తీసుకురాను. ఈ సినిమా చూస్తేజ్ఞాపకం వచ్చింది. ఇక మీ మూడవ పశ్న కేవలం శరీరాకర్షణయేనా ప్రధానం? అదే సర్వస్వము అని చెప్పను. కాని అది కూడా ముఖ్యమైనదే. అదే శూన్యమయితే మనస్సులు ఎంత ప్రేమించుకున్నా మనుష్యులు విడిగా వుండవలసిందే? ప్రేయసీ ప్రియులుగా వుండటం అసంభవం...” అంది రజని.

“జీవితంలో మనం ప్రతివిషయాన్నీ లాభనష్టాల దృష్టితో చూచి నిర్ణయించాలంటే, నేను శతవిధాలా అంగీకరించను. స్పర్శలకందని విలువలు జీవితంలో ఎన్నో ఉంటాయి. వీటిని మనం ఆశయాలంటాము అవి మరుగున వుండవచ్చు. కాని వాటిని మరచిపోకూడదు. ఆశయాలను అనుభవంలో పెట్టడం కష్టమని నేను ఒప్పుకుంటాను. చాలావరకు అవి ఎండమావులలాగే వుంటాయి. అయినాసరే అవి ప్రతి మానవుని మనస్సులోను మెదుల్తూ వుండాలి. అప్పుడప్పుడు దారి తప్పినప్పుడు కళ్ళెంలాగి అవి మనస్సును కాస్త వెనకకు లాగుతుంటాయి, లేకపోతే నావికుడు లేని నావలా ప్రవాహములో కొట్టుకు పోతాము” అన్నాడు రామం.

తరువాత తీరికగా మాట్లాడుకుందాము. నాకు కాళ్లు పీకుతున్నాయి. కాస్త ఏదైనా వాహనంలో పడవేసి ఇంటికి తీసుకువెళ్ళండి. అబలను, అసహాయురాలిని, నన్నిలా నడిపిచడంమీకు న్యాయం కాదు” అంది రజని నీరసంగా.

రామం ఆవేదనతో “క్షమించండి. మాటలలో పడి మరచిపోయాను” అని టాక్సీ వొకటి పిలిచి అందులో కూర్చున్నారు.

“టాక్సీని ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి? మీయింటికా? మా యింటికా? ముందర నన్ను డ్రాప్ చేసి మీరు వెళితే సబబుగా వుంటుందేమో?” అన్నాడు రామం.

“ఇంత రాత్రి నన్ను తీసుకుని మా యింటికి వెళ్ళితే ప్రసాద్ ఏమయినా అపోహపడతాడని మీరు భయపడుతున్నారా? ఒక వేళ ఆయన నిజంగా నామీద నీలాపనిందలు మోపినన్నింట్లోంచి వెళ్ళగొట్టితే మీరే నాకు ఆశ్రయ మివ్వాలి. అందుకని మీరు దగ్గరవుండటమే మంచిది. అప్పుడు ఋజువవుతుంటుంది. లేకపోతే ప్రజల ఎదుట రజని ఎవరు! నేను యిమెను ఎప్పుడూ చూడనైనాలేదు. పేరేయినా యింతకుముందు వినలేదు అంటారు. చివరకు నేను నిజంగా ఒక భిక్షుకురాలిని అయిపోతాను. బాబోయ్! మా యింటికి పోనీయ మనండి. డ్రైవర్ ! మోతీ బాగ్ చలో ” అంది రజని.

రజని మాటలు ఎందుకో రామం హృదయంలో అశాంతిని లేపాయి కళ్లల్లోకి కన్నీరు ఉబికివచ్చేయి. బలవంతాన వాటి ఆపుకొని “నేనలాంటి వాడినా, రజని? నా మీద నీకు నమ్మకము లేదా?” అన్నాడు రామం.

“మీరు అలాంటి వారు అవునో కాదో నాకేం తెలుసు? మూడునాళ్ల పరిచయం మీది. ప్రారంభంలోనే నన్ను వేశ్య అన్నారు. చివరకు నమ్మితే నష్టపోతానేమో, మగవాళ్లంతా మోసగాళ్లని మా అమ్మ అంటూ వుండేది ” అన్నది రజని.

కాసేపు మౌన ముద్రవహించి “నెమ్మదిగా మీ అమ్మగార్కి మగ వారిమీద అంత అపనమ్మకం ఎందుకని రజనీ” అన్నాడు రామం.

“ఎవరో బాగా డబ్బున్న ఆయన మా అమ్మను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసి మోసగించి పారిపోయాడట దాని ఫలితమే నేను” అంది రజని.

రజని పుట్టుపూర్వోత్తరాలు గురించి రామం, అప్పుడప్పుడు ఆలోచించేవాడు. కాని అడిగే ధైర్యం లేకవూరుకునే వాడు. యీనాడు అకస్మాత్తుగా తెలియవచ్చింది. క్షణకాలం అతని శరీరం గగుర్పొడిచింది. అయితే మీ అమ్మగారు యిప్పుడు జీవించి లేరా రజని” అన్నాడు రామం,

అది నాకు తెలియదు పదేళ్ల ప్రాయంలో నన్ను విడచి ఎక్కడికో వెళ్లి పోయింది. ఆ తరవాత మా మామయ్య నన్ను పెంచి పెద్ద దాన్ని చేసాడు” అంది రజని.

ఎందుకు వెళ్లిపోయిందో, ఎక్కడకు వెళ్లిపోయిందో, యిప్పుడు యేమి చేస్తూందో, అడగడం అతనికి యిష్టము లేకపోయింది. ఆ విషయాలన్ని తెలుసుకోవడమంటే ఎందుకో అతనికి భయం వేసింది రజని గత జీవితంతో తనకు ప్రసక్తి లేదు.

టాక్సీ వచ్చిరజని యింటిముందు పోర్టికోలో ఆగింది.

నవీన పద్ధతులలో నిర్మింపబడిన రెండు అంతస్తుల భవనమది. రజని అంత ధనవంతురాలని రామం ఊహించలేదు.

“రండి లోపలికి రండి. భయపడుతున్నారెందుకు? లోపల ఎవరూలేరు" అంది రజని.

అంత రాత్రి వేళ రజనితో వంటరిగా ప్రసాద్ కు కనబడటం అతనికి యిష్టంలేక పోయింది. కాని చేసేది ఏముంది. విషయం చెప్పితే పరిహాసం చేస్తుంది, మీరుయింత పిరికివారా? అంటుంది.

ఇంటి లోపలకూడ ఆధునిక పద్దతిలోకూడ అన్నీ అమిర్చివున్నాయి. పెద్ద డ్రాయింగురూము - అంత సుందరంగా అలంకరించబడియుంది. రజని కూర్చోమని చెప్పి లోపల నుంచి వంట వానిని పిలిచింది. ఈ బాబుగారు కూడ యిక్కడ భోంచేస్తారు త్వరగా అన్నం సిద్ధం చేయ్” అని చెప్పింది.

కంగారుతో “వద్దండి. ఆలస్యమయిందండి. యింటికి “పోవాలి.” అన్నాడు రామం,

శ్రీవారు యింటికి వెళ్లి స్వయంపాకం చేసుకుని విందు ఆరగించేటప్పటికి సీమంతం గడచిపోతుంది” అని వంటవానితో నువ్వెళ్లి నేను చెప్పినట్లు చెయ్యి”అంది రజని.

రామం యింక మాట్లాడలేదు. ప్రసాద్ యింటికి వచ్చి అతనికి తెలియకుండా రజనితో విందు ఆరగించటం అతనికి ఎంతమాత్రం యిష్టం లేకపోయింది. రజని ఆ యింటిని స్వంత ఇల్లుగా చూడటం కూడ అతనికి ఆశ్చర్యం కలిగించింది.

రజని నవ్వుతూ “మనస్సులో మెదల్తూన్న ఆ ప్రశ్నని ఎంత సేపు లోపల ఆణచివేసుకుని సతమతమవుతారు? బయటక ఎందుకు అడగరు?” అంది.

రామం ఉలిక్కిపడి “ఏ ప్రశ్న” అన్నాడు.

“అది మీకు తెలుసు. రెండు ఆక్షరాల ప్రశ్న : “ప్రసాద్ ఏడి? అంది. ”

రామం బలవంతాన నవ్వు తెచ్చుకొని ప్రశ్న మీరే చెప్పేరు. యిక సమాధానం కూడ మిరే చెప్పండి” అన్నాడు.

“ఇంట్లో లేరు. నాలుగురోజులనుంచి నాకు కనబడటం లేదు”.

రామం ఆశ్చర్యంతో “నాలుగు రోజులనుంచి కనబడటం లేదా! ఆశ్చర్యంగా వుందే నిన్ననే కమలాకరరావు కనబడ్డాడని చెప్పేడే?” అన్నాడు. రజని నవ్వుతూ! “ఇందులో ఆశ్చర్యపడవలసినదేమున్నది. నాకిది మామూలే ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. ఆయన్ని నేను రాత్రింబవళ్లు ప్రేమబంధాలతో బంధించి యింట్లో వుంచాలనే కోరిక నాకు లేదు” అంది.

“రాత్రింబవళ్లు వుండక పోవచ్చు కాని ఢిల్లీలో వుంటూ కూడ నాలుగురోజుల బట్టి యింటికి రాకపోవడం అన్యాయం కదా!” అన్నాడు రామం,

“అన్యాయమేముంది చెప్పండి? నాకంటె ఇంకెవ్వరు గతిలేరు. నే నేకాకిని, అనాధని, ఆయనకు చాలా మంది స్నేహితులున్నారు. ఆప్తులున్నారు. ఆదరించేవారున్నారు. వారివద్దకు వారు వెళ్ళుతూ వుంటారు. ఇది నాకు చాలా సహజంగానే కనబడుతుంది” అంది రజని.

ప్రసాద్ కు ఆప్తులు, ఆదరించేవారు, ఇక్కడ వున్నారని నాకు తెలియదండీ. “ఒక బాబాయ్ వుండేవారు. వారు కూడ చనిపోయారని విన్నాను” అన్నాడు రామం.

రజని నవ్వుతూ “ఆప్తులు, ఆదరించేవారు, బంధువులే అయివుండాలా చెప్పండి. అజ్ఞాతులవకూడదా? వారు దయామయులు. నాబోటి వారికి ఎంతోమందికి ఆశయం యిచ్చేరు. ఇంకా చాలామందికి ఆర్ధిక సహాయం చేస్తూ - వుంటారు” అంది.

ప్రసాద్ దయామయుడని చాలామందికి ఆర్థిక సహాయంచేస్తూంటాడని రామానికి తెలియదు. స్వార్ధ పరుడని స్వీయమే అతనికి సర్వస్వమని అనుకుంటూ వచ్చేడు.

“ఎవరికి ఆర్థిక సహాయం చేస్తున్నాడు చెప్పండి? నేను యింతకుముందు వినలేదే?” అన్నాడు ఆశ్చర్యంతో.

“అంతమాత్రాన అది అసత్యం కాదుకదా వారు ఢిల్లీ లోని హరిజన విద్యార్థులను కొంతమందిని కూడ దీసి వారికొక వసతి చూపించి వారి చదువు నిమిత్తం ఎంతో ధనవ్యయం చేస్తున్నారు. ఇంకా అనేక సంస్థలకి డబ్బు ఇస్తుంటారు. ఉదార స్వభావం, నిర్మలమైన మనస్సు, ఆయనది.వారికి మీరనుకునే నీతినియమాలు లేకపోవచ్చు. అయినా వారు మీ అందరికన్న శతవిధాల ఉత్తములు”అంది.

రజనికి ప్రసాద్ యెడయెంత గౌరవాభిమానాలు వున్నాయో ఆనాడు అతనికి తెలిసివచ్చింది. అంతర్గతంలో కాస్త యీర్ష్యకూడా జనించింది. ఆమాటలో తనను చులకనగా అన్న మాటలు కాస్త బాధపెట్టేయి.

బాధాపూరిత కంఠస్వరంతో “మీరన్నది సత్యమే - కావచ్చు. కాని మానవస్వభావాలు, తత్వాలు ఒకేవిధంగా నిర్మించబడలేదు. అలాగే మానవహృదయాలు కూడ వేరుగా వుంటాయి. అయినా దయ, కరుణ, ప్రేమవున్న మాత్రాన లాభం లేదు. వాటిని క్రియారూపంలో పెట్టడానికి తగిన సంపద శక్తికావాలి. నీతినియమాలందు నీకు నమ్మకం లేకపోవచ్చు. అందుకు నేనేమి అనను, కాని ఎవరికైన సహనం లేకపోతే వారిని నేను సహించలేను.ఒకరిని ఉత్తముడు, యింకోకరిని నీచుడు అనే అధికారం యేమానవునికి లేదు. ఎవరి కర్మ ప్రకారం వారు నడుచుకుంటారు” అన్నాడు

ఆఖరిమాటలు కాస్త వుద్రేకంగా వినబడ్డాయి. రామం అంత వుద్రేకంతో మాట్లాడడం ఆమె అంతకుముందు ఎప్పుడు వినలేదు. ఆమె అడిగిన మాటలు అతనిని గాయపరిచాయని గహించింది.

“సహనం వుండాలనే నేను ఒప్పుకుంటాను. కాని సహనరూపంలో అన్యాయాన్ని అంగీకరించమంటే నేను ఒప్పుకోను” అంది.

సరిగ్గా అదేసమయానికి వంటవాడు భోజనం తయారుగా వుందని చెప్పేడు రజని “లేవండి భోజనం చేద్దాం. ఆకలిగావుంటే ఆవేశాలు విజృంభిస్తాయి” అంది.

“ఆశ్చర్యంగా వుందే, మీరు అలాగ అనటం. ఆవేశాలు ఎందుకు విజృంభించకూడదు? అంటారు కాదా మీరు” - అన్నాడు రామం నవ్వుతూ.

“అవును అది నిజమే. కాని యీ ఆవేశాలు అసహజమైన దేదైనా అధఃపథనానికి దారితీస్తుంది” అంది రజని.

భోజనాలతర్వాత “ఇక నేను వెళతానండీ చాలా థాంక్స్ ” అన్నాడు.

“పదండి మిమ్మల్ని టాక్సీలో ఎక్కించి తిరిగి వస్తాను” అని బయలు దేరింది రజని. ఎంత వారించినా వినకుండా.

టాక్సీకోసం చాలాదూరం నడవవలసివచ్చింది. అర్ధ రాత్రిరోడ్ల మీద ఎక్కడా మానవ సంచారం లేదు. వెన్నెల రాత్రి వీధిదీపాలు కూడా వెలగటం లేదు. నిర్మలమైన నిశ్శబ్దం, నిరాడంబరంగా నివురు కప్పింది. రజని పుచ్చవువ్వులాంటి వెన్నెలలో తన ప్రక్కన నడుస్తూవుంటే, రామం హృదయం ఎప్పుడూ అనుభవించని ఆనందం, సుఖం, శాంతి అనుభవించింది. ఆమె స్వభావానికి వ్యతిరేకంగా రజనికూడ నిశ్శబ్దంగా వుంది. మాడ్లాడితే ఆ సుఖం అంతరించి పోతుందేమో అని భయంతో రామంకూడ మౌనం వహించాడు. అలా ఎంత దూరం నడిచినా ఎక్కడా టాక్సీ కనబడలేదు ప్రశాంత వాతావరణం పున్నమి వెన్నెలలో రజని సౌందర్యం చిందులు త్రోత్కుతూ ప్రకృతినే సవాలు చేస్తున్నట్లుంది. తెల్లటి సిల్కు చీర వెన్నెలలో లీనమైనట్లు కనబడింది, నల్లటి పొడుగాటి జుట్టు బుజాలమీంచి జారుతూ నాట్యమాడుతూంది. మత్తెక్కి మైమరపించే ఆ స్త్రీ ప్రచండ సౌందర్యం రామాన్ని పూర్తిగా తన్మయుడిని చేసింది.

హఠాత్తుగా రజని చెయ్యి గట్టిగాపట్టుకొని వుద్రేకంతో వణకిపోతూ, ఆమెను ఆపి “రజని, అనంతమైన నీ అందం నన్ను మైమరపిస్తూంది. నన్ను ఎక్కడికో లాక్కుపోతూంది. నన్ను నేను సంబాళించుకోలేనేమో అని నాకు భయంగా వుంది” అన్నాడు .

రజని ఏమాత్రము భయపడలేదు. చెయ్యి విడిపించుకోడానికికూడ ప్రయత్నం చేయలేదు. తన చెయ్యి పట్టుకున్న అతని కుడిచేతిపై తన రెండవ చెయ్యి వేసి అతని కళ్ళల్లోకి నిర్మలంగా చూస్తు, సహజ శాంతస్వరంలో “మీరు మిమ్మల్ని సంబాళించుకోలేక పోవచ్చు. అందుకు నేనేమి దోషించను . నా స్త్రీ సౌందర్యం క్షణికంగా మిమ్మల్ని వున్మాదుని చేసిందనడం కొంతవరకు అది సహజమే. కానీ పరిణామాలు ఆలోచించకుండా మీరు ఏపని చెయ్యరని నాకు విశ్వాసంగా వుంది. కేవలం మీరు పురుషులే కాదు సత్పురుషులు. సహృదయులుకూడాను. ఆ విచక్షణాజ్ఞానాన్నే మీరిప్పుడు చేరదీసుకోవాలి” అంది.

అదే సమయానికి దూరంలో కారు లైట్లు కనబడ్డాయి. టాక్సీ అనుకొని రామం చెయ్యి చాపాడు, దగ్గరకు వచ్చికారు ఆగింది. కాని అది టాక్సీ కాదు. అదే ప్రసాద్ కారు చటుక్కున తన కుడి చెయ్యిని రజని చేతుల్లోంచి లాక్కున్నాడు రామం.

ప్రసాద్ నవ్వుతూ “ఏమిటి రజని! నీశి రాత్రి నడిరోడ్డుమీద నాటకం వేస్తున్నారా? లేక మనోవీధిలోని తారా కుమారునికి మన్మధడే నివేదించుకుంటున్నాడా?” అన్నాడు. రామం రజని కేసి భయం భయంగా చూచేడు ఆమె నిజం చెప్పివేస్తుందేమోనని భయంతో ఆమె కేసి చూచేడు

రజని “నవ్వుతూ ఒంటరిగా రోడ్డుమీద నడవటం భయమంటూ నన్ను వెంటలాకొచ్చారు అయన. మా దురదృష్టం. ఎంతదూరం నడచినా టాక్సీ పత్తాయే లేదు. నువ్వువచ్చావు వీరిని మీయింటి వద్ద విడిచి మనం యింటికి పోదాం. నాకు విపరీతంగా నిద్ర ముంచుకువస్తూంది. అనవసరం అబలని రెండు మైళ్లు నడిపించారాయన. ఆ వుసురు వూరికేనే పోదు. పైగా నడిరోడ్డు మీద...” అని అనబోతుంటే రామం కంగారుగా అడ్డు వచ్చి “ఏమిటి ప్రసాద్ -నాలుగు రోజులనుంచీ నారదుడిలాగ ఎక్కెడెక్కడ తిరుగుతున్నావు. రజని నీకోసం కళ్లు కాయలు చేసుకొని ఎదురు చూస్తుంది” అన్నాడు.

“ఈ మాటలను నువ్వు కమల విషయంలో అనినట్లయితే నిజమేమోననిభ్రమపడతాను. కాని రజని విషయంలో అవి నిజమని నన్నునేను మభ్యపెట్టుకుందా మనుకున్నా వీలుపడదు. ఆవిడ ఎవరికోసమైనా ఎదురుచూస్తూందని ఎవరయినా అంటే వారు అసత్యవాదులని, అది అభూత కల్పన అని వెంటనే చెప్పవచ్చు. అలాంటివి ఆమె స్వభావానికి విరుద్ధం” అన్నాడు ప్రసాద్.

“ఇక పదండి-ఇంకా ఆలస్యం చేసారంటే తెల్లవారి పోయేటట్లుంది” అంది రజని.

ముగ్గురు బయలు దేరారు. రామం తన లాడ్జివద్ద దిగి వెళ్ళిపోబోతూంటే రజని నవ్వుతూ. “మళ్ళా ఎప్పుడు కలుసుకుందాము?” అంది.

*****

షేర్ చేయబడినవి

NEW REALESED