Featured Books
  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

  • కిల్లర్

    అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అప్రాశ్యులు - 1

అప్రాశ్యులు

భీమేశ్వర చల్లా (సి.బి.రావు)

1

1966

Published by: Adarsa Gandha Mandali, Vijayawada

© 1966 C.B.Rau

Ebook edition @2020 Bhimeswara Challa

Cover painting by Nirmala Rau (author’s spouse)

Other books by the author:

  • క్షంతవ్యులు (A novel)
  • Man’s Fate and God’s Choice
  • (An Agenda for Human Transformation)

  • The War Within- between Good and Evil
  • (Reconstructing Money, Morality and Mortality)

    Dedicated to అప్రాశ్యులు world

    Acknowledgements to:

    Jyothi Valaboju (writer, editor and publisher) for shaping this ebook edition; and BS Murthy, my nephew, for giving the idea of and helping the re-publication of the long-forgotten book

    అప్రాశ్యులు

    ఆకాశానికి నిచ్చెన వేయ ప్రయత్నించటం ఎంతటి అవివేకమో అందరికీ సుగ్రాహ్యమే. అయినా అప్పుడప్పుడు మనమంతా ఆలా ప్రయత్నిస్తూనే వుంటాము. అది ఎంతో హాస్యాస్పదమయినా ఆ ఆలోచనలో వుండే మకరందాన్ని మనమంతా కాంక్షిస్తాము. ఎందుకంటేఆ ఆలోచన ఆహ్లాదకరమయినప్పుడు దానిని బలవంతంగా, ప్రయత్నపూర్వకంగా ఎందుకు బహిష్కరించాలి? అసంభవమయిన ఆలోచనలతో తెచ్చుకొన్న చిరునవ్వు, నిజమైన నిష్కల్మషమైన కన్నీరు కన్నా వున్నతమైనవంటే నేను అంగీకరించను. ఎందుకంటే ఆత్మవంచనకన్నా ఆత్మహత్య ఉన్నతమైనది. జీవితంలోని అనివార్యమైన దుఃఖాన్ని, దుర్భరమైన బాధల్ని ఎదుర్కొన్నప్పుడే మానవుడు ఆ ఆశ అనే పొగమంచులో తలదాచుకుంటాడు.పొగమంచు అంతరించి అంతర్ధానమయినపుడు ఆశారహితమై ఆత్మహత్యకు ఒడిగడతాడు, మరికొందరు అదేపంథాలో అంధులై సత్యాన్ని ఎదుర్కొనే సాహసము లేక అసత్యపు ఆత్మవంచనలతో ముందుకు సాగిపోతారు. మరణ సమయములో వీరులు కూడ యీ లోకాన్ని విడువలేక ప్రాకులాడుతారు. బావురుమని చేతులు జాపి ఆప్తులను ఆఖరిసారిగా ఆలింగనం చేసుకో ప్రయత్నిస్తారు. చాలా అరుదుగా మనకి యింకొక తరహావ్యక్తులు తటస్థపడుతారు. వారికి పొగమంచుతో ప్రయోజనము లేదు, ఆత్మవంచనకు ఆస్కారం లేదు, ఆత్మహత్యకు వెనుదీయరు. సాధారణంగా మధ్యతరగతి మానవ జీవితాలన్నీ వర్ణించదగ్గ సంఘటనలు లేకుండానే సాగిపోతూంటాయి. ఎక్కడో ఎవరికో జన్మిస్తారు. కొద్దోగొప్పో చదువుకుంటారు. ఎంతో కొంతమందిపిల్లల్నికంటారు. అవీ ఇవీ కష్టాల్ని నిత్యము ఎదుర్కొంటూనే వుంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో వ్యాధితోనో, ఏదో ప్రమాదంలోనో కాలధర్మం చేస్తారు. ఇలాంటి శుష్క జీవనానికి అలవాటుపడి వుంటాము. అప్పుడప్పుడుకష్టాలు కట్టలుగా వచ్చినప్పుడు, ఆశాకిరణం అస్తమించినపుడు జీవితాన్ని అంతం చేసుకోవాలని గట్టివాంఛ కలుగుతుంది. నిజం చెప్పాలంటే యీ వాంఛ దాదాపు ప్రతి మానవునికీ ఏదో ఒక సమయంలో కలుగుతుంది. కాని క్రియారూపంగా యిది చాలా తక్కువసార్లు వెలువడుతుంది. జీవితంమీద వుండేతీపి దీనిని త్రొక్కివేసి అణగార్చి వుంచుతుంది. కాని అప్పుడప్పుడు తీవ్రమైన వాంఛ జీవితంమీద విరక్తిగా విజృంభించి జీవిని కబళించి వేస్తుంది. జీవితమనే తాత్పర్యం లేని తతంగానికి తిరుగుబాటే ఆత్మహత్య.

    కాకినాడలోని పేరు ప్రఖ్యాతులుగల డాక్టరు సుదర్శన రావుగారి కుమారుడు ప్రసాదరావు. ఆగర్భ శ్రీమంతుడు. ఏకైకపుత్రుడు ఎంతో గారాబంగా పెరిగాడు. చూడటానికి బాగా రూపసి. పచ్చటి బంగారపు శరీర ఛాయ, దారుఢ్యమైన అవయవాలు, సదా నుదుటిపై ప్రాకులాడే నల్లటి ఉంగరాల జుట్టు, శిల్పి మక్కువతో చెక్కిన మానవ విగ్రహంలా వుండేవాడు. కాని బాల్యం నుంచి అతనిలో ఒక రకమైన అశాంతి, క్షణికమైన ఉద్రేకాలు, ఆవేశాలు కనబడేవి, ఎవరినీ లక్ష్య పెట్టేవాడు కాడు. ప్రతి నిర్ణయాన్ని ధిక్కరించేవాడు. కోపము వచ్చినా, ప్రేమకలిగినా అతనంటే అందరికీ తగని భయం. చిన్నతనంనుంచీ మోటారుకార్లంటే సరదా. ఎంతో వేగంగా పోనిచ్చేవాడు. ఎవరితోనూ స్నేహం చేసేవాడుకాడు. ఎవరూ ప్రయత్నం చేసేవారు కారు. పక్కింటి ప్లీడరు విశ్వనాధంగారి అబ్బాయి రామంతోనే కాస్త స్నేహంగా వుండేవాడు. ఇద్దరూ చిన్నతనంనుంచి కలసి చదువుకున్నారు. సమవయస్కులు. రామం ప్రసాదంత రూపసి కాకపోయినా, చూడ చక్కనివాడే. సన్నగా, పొడుగ్గా చామనఛాయగా వుండేవాడు. మితభాషి. పలకరిస్తేనే కాని ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు. ప్రసాదుతో స్నేహంవున్నా అతనికి ఆప్తమిత్రుడు, కమలాకరం అనే వేరొక వ్యక్తి వుండేవాడు. కమలాకరం తండ్రిగారు కూడ ప్లీడరుగారే. వారిద్దరి తల్లిదండ్రులకు బాగా స్నేహం. మొదటి నుంచి వారికి, వీరికి రాక పోకలుండేవి. కమలాకరం, రామం-వీరిద్దరి మనస్తత్వాలు సరిపడేవి. కమలాకరం శాంతస్వభావి, సహృదయుడు. అతని శాంత గంభీర వదనం అందరినీ ఆకర్షించేది. కమలాకరానికి, ప్రసాద్ కి ఆట్టే స్నేహం లేకపోయినా రామం ద్వారా యిరువురికి పరిచయం ఏర్పడింది. ముగ్గురు బి. ఏ వరకు కలిసి చదివేరు. పరీక్షలో ప్రసాద్ తప్పాడు. దానితో అతనితండ్రి ప్రసాద్ ని ఢిల్లీ చదువుకి తన తమ్ముని వద్దకు పంపించి వేశాడు. దానితో రామానికి అతనికి మధ్యనున్న స్నేహం మరుగున పడింది. బి. ఏ తరువాత రామం కమలాకరం మూడు సంవత్సరాలు వుద్యోగాన్వేషణలో వృధాగా గడిపివేశారు. చివరకు అదృష్టవశాత్తు యిరువురూ ఢిల్లీ సెక్రటేరియట్ లో అసిస్టెంట్ పరీక్షలో కృతార్ధులయ్యారు. ఢిల్లీ బయలుదేరే ముందు కమలాకరానికి వివాహమయింది. కమల ఇంటరు వరకు చదువుకుంది. చూచినవారంతా“చక్కని చుక్క”, “పుత్తడిబొమ్మ” ఆనేవారు. పీలగా, పల్చగా బలహీనంగా కనబడేది. తెల్లటి శరీర ఛాయ, నిర్మలమైన నేత్రాలు, తీర్చిదిద్దిన ముఖకవళికలు, నవ్వితే సొట్టలుపడే పాలబుగ్గలు.

    ఢిల్లీలో కమలాకరం కొత్త కాపురం పెట్టాడు.కరోల్ బాగ్ లో చిన్నయిల్లు అద్దెకు తీసుకున్నాడు. రామాన్ని కూడ వారితోనే కలిసివుండమన్నారు. కాని రామం అంగీకరించలేదు, “నూతనదంపతులు హనీమూన్ కానీయండి” అన్నాడు. కమలనవ్వుతూ “హనీమూన్ హృదయంలోనే యిమిడి వుంది. అయినా మీరు బయటవుంటేనే మంచిది. ఏకాంతంతో విసుగెత్తి వివాహం చేసుకుంటారు” అంది కమల.

    కమల ఎప్పుడూ నవ్వుతూ మందహాసం చేస్తూండేది. కాని కోపం కూడ క్షణంలోనే వచ్చేది. దానికి అందరూ భయపడేవారు. కమలాకరం యెడ ఆమెకు కొద్దికాలంలోనే స్వచ్చమైన అనురాగం, విశ్వాసం, గౌరవ అభిమానాలు ఏర్పడ్డాయి. ఆమెకేవిధమైన లోటు రానిచ్చేవాడు కాదు. ఇతరులలాగ బయటికి వెల్లడించకపోయినా ఆమెయెడ అతనికున్న ప్రేమానురాగాలు ఆమె గుర్తించగలిగింది. ఇరువురిలోను కమలదే కొంతవరకుపై చెయ్యిగా కనబడేది. చూచేవారు చాలామంది ఆదర్శదంపతులనేవారు ఈర్ష్యతో కొందరు “ఆడ పెత్తనం” అనేవారు. నిజానికి కమల నవ్వు అంతర్గతంలోని అశాంతిని, అలసటను కప్పిపుచ్చుతుంది, వీటికి కారణం ఏ మాత్రమూ లేదు,ఏదో అస్పష్టంగా ఆమె హృదయం ఘోషిస్తూంటుంది. ఏకాంతంగా వున్నప్పుడు మనస్సు పరిపరి విధాల ఆలోచిస్తూంటుంది. కమలాకరంవంటి సత్పురుషుడు, సహృదయుడు భర్తగా లభించటం తన అదృష్టమని ఆమె గుర్తించింది. కాని ఆమె హృదయం చేసే ప్రతి పనికి కారణాన్ని కాంక్షిస్తుంది. తన బుద్ధి కుశలతతో పరీక్షించందే ఆమె ఏదీ చేసేది కాదు. క్రమబద్ధంగా కారణరహితంగా చేసే ప్రతి పనీ ప్రశ్నించేది. అశాంతికి కారణమడిగితే కమల మౌనముద్ర వహిస్తుంది. కారణం ఆమెకే తెలియదు కాని దురూహ్యం కాదు. జీవితంలో శాంతికీ, చిరు నవ్వుకీ చోటు లేనప్పుడు, అశాంతికి అలసటకి కారణం వెదకడం అవివేకం కాదా? నిత్యం నిరర్థకంగా జీవితం గడిపే వారినే తిరిగి ప్రశ్నించాలి నీలోని యీ శాంతి ఎక్కడిది? అసత్యమైన యోగా శాంతికన్న సత్యమైన ఈ అశాంతే ఉన్నతమైనది కదా? క్రమంతప్పకుండా నువ్వుచేసే యీ తతంగానికి తాత్పర్య మేమిటి? కాలాతీతమైన ప్రశ్నలకి సనూధానంకోసం వెదుకకుండానే క్రమబద్ధంగా మనం జీవితం సాగిస్తాం. ఆకలి అయినప్పుడు ఆరగిస్తాము నిద్రవచ్చినప్పుడు నిద్రిస్తాము ఈ రెండింటినీ ఆమడదూరంలో వుంచితే రక్తమాంసాలు క్షిణిస్తాయి. సృష్టి అంతరించేలోగా ఇవి లేకుండా ఎవరు ఎప్పటికీ జీవించలేరా? మానవ ప్రయత్నానికి విజయాలు ఎన్ని చేకూరినా, ప్రకృతిని ఎంత జయించినా చివరకు ఆకలి, నిద్ర లేకుండా యీ శరీరయంత్రాన్ని నడపగలిగే విధానం కనిపెట్టలేరా? కమల వీటన్నిటి గురించి యింతగా ఆలోచిస్తూందని నేను చెప్పటం లేదు. కాని అప్పుడప్పుడు ఈ విధంగానే ఆమె మనస్సు పరిపవిధాల పరుగెడుతూ వుంటుంది.

    ఆరోజు ఆదివారం. శలవుదినం గనుక రామం ప్రొద్దుననే కమలాకరం ఇంటికి బయలుదేరాడు. పరధ్యాన్నంగా రోడ్డుమీద నడిచి వెళ్లూన్నాడు. హఠాత్తుగా గట్టిగా శబ్దం చేస్తూ వెనుక, ఒక కారు ఆగినట్లు చప్పుడయింది. వులిక్కిపడి వెనుదిరగక మునుపే “ఇడియట్ వై డోన్టు యూ వాక్ ఆన్ దిపేవ్ మెంట్” అని ఏదో పురుషకంఠం అనడమూ, కిలకిలా ఒక స్త్రీ సవ్వడమూ వినబడ్డాయి రామం వెనుతిరిగి చూసేడు. ఒక పెద్ద కారులో ట్వీడ్ సూటు వేసుకొని ఒక యువకుడు స్టీరింగువద్ద కూర్చుని వున్నాడు, అతనిప్రక్కన మెరుపుతీగలా మిరుమిట్లు గొలిపే ఒక సుందరమైన యువతికూర్చుని వుంది. ఒక నలుపు మఫ్లర్ తలమీదనుంచి చెవులమీదుగా కట్టుకొని వుంది. వెను తిరిగిన మరుక్షణంలోనే ఆ యువకుడు తలుపు తీసుకుని వచ్చాడు “రామం” అంటూ. రామం అప్పుడు గుర్తుపట్టాడు ఆయువకుడిని. అతనే ప్రసాద్. ఇద్దరూ ఒకసారి ఆలింగనం చేసుకున్నారు.

    “ఏమిటి రామం? ఇక్కడ ఏమి చేస్తున్నావు?ఎప్పుడొచ్చావుయిక్కడికి! ఏమిటి సంగతి?” అన్నాడు ప్రసాద్.

    “అవన్నీ నేను తరువాత చెప్తాను. ముందర నీసంగతి చెప్పు. అప్పటినుంచీ నువ్విక్కడే వున్నావా?” అని అడిగేడు రామం .

    ప్రసాద్ సమాధానం చెప్పేలోపునే కారులోని యువతి వారి వద్దకు వచ్చి “ప్రసాద్ ! మీ పరామర్శలు, కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు కార్లోకి పదండి. రోడ్డుకు అడ్డంగా కారు ఆపారు” అంది. అప్పుడు ప్రసాద్ “అలాగేరజనీ! అన్నట్లు మరచిపోయాను. ఇతనే రామం. నా బాల్యస్నేహితుడు నీకొకసారి చెప్పాను. చాలా కాలమయింది యితనిని చూచి” అని రామాన్ని పరిచయం చేసి.

    “ఈవిడ పేరు రజని, నా స్వీట్ హార్ట్” అని “పద రామం కారులోకి పద” అన్నాడు కాని అతనికి ప్రసాద్ మాటలు వినబడలేదు. కన్నార్పకుండా రజని కేసి చూస్తున్నాడు, సూర్యరశ్మిలో బంగారంలా మిరమిట్లు గొలిపే ఆమె అందాన్ని తదేకంగా చూస్తున్నాడు. సుమారు యిరవై రెండు సంవత్సరాల వయసు వుంటుంది. పచ్చటి బంగారపు శరీరఛాయ, విశాలమైన నేత్రాలు, పల్చటి ఎర్రని పెదవులు, అందమైన ముక్కు, గులాబీబుగ్గలు, నల్లటి ఉంగరాల జుత్తు మఫ్లర్ లోంచి తొంగి చూస్తూ నుదుటిపై దోబూచులాడుతోంది. ఎత్తైన నిండైన వక్షస్థలం,పొడుగాటి నున్నటి వంకరలకు అన్యాయం చెయ్యకుండా అంటి పెట్టుకున్న కాశ్మీరు శిల్క్ చీర, ఇవన్నీ పరిక్షించి చూస్తూ రామం తన్మయుడై తనను తాను మరచిపోయాడు.

    ప్రసాద్ రామం భుజం తట్టుతూ “ఏమిటలా చూస్తున్నావు?'' అన్నాడు.

    రజని నవ్వుతూ “నన్నే చూస్తున్నారు కనబడటం లేదా? తళుక్కుమంటున్న అయస్కాంతంలాంటి నా అందం ఈయననికూడా, సందేహం లేదు తన్మయుని చేసింది” అంది. అప్పటికి రామం వూహాజగత్తు నుంచి వూడిపడి కంగారుపడుతూ “ఆ. ఏమిటంటున్నావు ప్రసాద్ నేను నీతో ఇప్పుడు రాలేను. నేను కమలాకరం యింటికి వెళుతున్నాను” అని గబగబా నడవటం మొదలు పెట్టాడు. ప్రసాద్ అతని భుజం పట్టుకొని “ఏమిటీ కంగారు రామం! నీకేమైనా మతిపోయిందా? ముందర కారుయెక్కు తరువాత అంతా చెప్పుదువు కాని” అన్నాడు. కారు దగ్గరకు వచ్చి రజని “నేను డైవు చేస్తాను స్నేహితులిద్దరు కబుర్లు చెప్పుకోండి. మీరు కబుర్లు చెబుతూ డ్రైవ్చేస్తే ఈయన ప్రాణంతో కారులోంచిదిగరు” అని స్టీరింగువద్ద కూర్చుంది. రామం, ప్రసాద్ కారులో ఫ్రంటుసీటులో రజనీ ప్రక్కన కూర్చున్నారు. రజని కారు స్టార్ట్చేసి ఎక్కడకు వెళ్దాం! పిక్చరుకి వెళ్దామా వద్దా?” అంది.

    “ఏమంటావు రామం? మంచి పిక్చరుంది ఓడియన్ లో” అన్నాడు ప్రసాద్.

    “నేను కమలాకరం యింటికి వెళుతున్నాను. నీకు గుర్తువున్నాడు కదా?” అన్నాడు రామం.

    “కమలాకరం ఎవరు? అతనేనా మనతో బి. ఏ కలిసి చదివాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు?” అన్నాడు ప్రసాద్.

    “మేమిద్దరం సెక్రటేరియట్ లో అసిస్టెంటులుగా పని చేస్తున్నాము. పెండ్లి చేసుకొని కరోల్ బాగ్ లో కాపురం పెట్టాడు అక్కడికి వెళ్ళాలి. నా కోసం ఎదురుచూస్తుంటాడు. ఇప్పటికే ఆలస్యంఅయిందన్నాడు.

    రజనీ కారు నడుపుతూవున్నంత సేపు రామం, ప్రసాద్ వారు కాకినాడలో విడిపోయినతర్వాత జరిగిన సంగతులన్నీ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

    “నేను ఇక్కడకు వచ్చి చదువుదామని ప్రయత్నించాను కానీ అది సాగలేదు. ఈలోగా మా నాన్నగారు పోయారు. జీవితంలో దేనికీ అర్థం లేదు. చదువు రూపంలో నిరర్ధకంగా కాలాన్ని వ్యర్థం చెయ్యటం నా కిష్టం లేకపోయింది. ఆనుభవించవలసిన సుఖాలు, పొందవలసిన వస్తువులు జీవితంలో చాలావున్నాయి. సమయం వున్నంతసేపు వీలైనవి, దొరికినవి అనుభవించాలి. కాని ఏదో అవి ఇవి చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేస్తూ, ఆత్మవంచన చేసుకుంటూ,నెమ్మది నెమ్మదిగా ఆత్మహత్యచేసుకోవడంలో ఏముంది చెప్పు! జీవితంలో చెయ్యవలసిన పనులెన్నో వున్నాయి కాని సమయం చాలా తక్కువ. నాకెప్పుడూ నన్ను మృత్యువు వెంటాడుతున్నట్లనిపిస్తుంది. అది నన్ను అందుకోక మునుపే జీవితంలోని రసమంతా నేను పీల్చివేయాలి, అనుభవించని ఆనందం మిగిలివుండకూడదు. నిరర్థకమైన గౌరవము, నీతి, కీర్తి, సమాజపు శబాష్ లు నాకు అక్కరలేదు. చేతకానివారు స్వార్థపరులనే “సత్పురుషుడు” అనే బిరుదు నాకు అక్కరలేదు'' అన్నాడు ప్రసాద్ ఉద్రేకంతో.

    ప్రసాద్ మాటలు వింటూండిన రామం ఆశ్చర్యానికి మేర లేదు, అతను యిలా అవుతాడని తను కలలో కూడా వూహించలేదు. బాల్యం నుంచి ప్రసాద్ లో మరుగువున్న అశాంతి అతనికి తెలుసు. కానీ ఈరూపం దాలుస్తుందని అతను వూహించలేదు. అయితే ఈ మార్పులో రజనిపాత్ర ఏమిటి? ప్రసాద్ కు ఈమెకు సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియక మునుపే రజని కమలాకరం యింటి ముందు కారు ఆపింది.

    అందరూ లోపలికి వెళ్ళారు. కాని లోపల కమలాకరం లేడని తెలిసింది. కమల లోపల వంట చేస్తూంది. రామం పిలుపు విని బయటకు వచ్చింది. ఆదివారం కనుక తలంటుపోసుకుంది. జుట్టంతా ముడి లేకుండా భుజాలమించి వ్రేలాడుతోంది, ముఖాన వ్రాసుకున్న పసుపు యింకా మాయ లేదు.! బొట్టు కూడా పెట్టుకోలేదు. అపరిచితులైన ఈ అందమైన స్త్రీ పురుషులను చూచి క్షణకాలం ఆశ్చర్యపోయింది. రామం వెంటనే వారిద్దరిని కమలకు పరిచయం చేసేడు. వారందరు కూర్చున్న తరువాత రామం-

    “కమలాకరం లేడా! నాకోసం ఎదురుచూడమన్నాను, వెళ్ళిపోయాడా?” అన్నాడు.

    “బజారుకు వెళ్ళారు. మీకోసం చూసిచూసి వెళ్ళారు. కూర్చునివుండండి కాస్త కాఫీ తెచ్చియిస్తాను” అని లోపలికి వెళ్ళింది కమల.

    ప్రసాద్ ఇల్లంతాకలయచూచి “ఇంత చిన్నయింట్లో ఎలా వుంటున్నారు? ఎంత అశుభ్రం వుంది? అన్ని వస్తువులు యెంత చిందరవందరగా వున్నాయి! ఇంటి యిల్లాలికి యింటి మీద శ్రద్ధాసక్తులు లేనట్లున్నవి?” అన్నాడు.

    రజని నవ్వి “ఇంటి యిల్లాలికి యింటిమిద శ్రద్ధ లేకపోయినా ఫరవాలేదు. ఇంతకీ ఇంటియజమాని మీద వుందా?” అంది.

    రామానికి వారిద్దరూ అలా మాట్లాడడం ఇష్టం లేకపోయింది. ముఖ్యంగా రజని అంటే కాస్త అసహ్యంకూడా వేసింది. ఒక స్త్రీ యింకొక స్త్రీని గురించి అనవలసిన మాటలేనా యివి? ఈమెలో సంస్కారం ససేమిరా లేదా?

    “ఉంటున్నది. భార్యాభర్తలేకదా! కమలాకరానికి బొత్తిగా అశ్రద్ధ, దేనినిగురించి పట్టించుకోడు” అన్నాడు రామం

    “ఎందుకు పట్టించుకోవాలి? పెళ్ళాం దొరికిందికదా?” అన్నాడు ప్రసాద్

    సరిగ్గా అదేసమయానికి కమల కాఫీ ట్రేతో బయటకు వచ్చింది నవ్వుతూ. “పెళ్ళాం ఎవరికి దొరికింది చెప్పండి!” అంది కాఫీ ప్రసాద్ కు యిస్తూ.

    ప్రసాద్ సమాథానం చెప్పక మునుపే రజని “మీరు వున్నారు కాబట్టి మీ ఆయన దేనినిగురించి శ్రద్ధవహించడం లేదంటున్నారు. పరిస్థితులు యెలావున్నా మీరు పారిపోరని వారికి తెలుసు”అంది.

    రజని చేసిన అప్రస్తుతపు వ్యాఖ్యానానికి రామం విస్తుపోయాడు. ప్రసాద్ పకపక నవ్వటం మొదలు పెట్టాడు. కమల కుర్చీలో కూర్చొని నవ్వుతూ-

    “వారికా నమ్మకం వుందో లేదో నాకు తెలియదండి. అయినా ఎవరితోనయితే పారిపోతానో వారు, వారికన్నా ఉత్తములవ్వాలి. వారు నన్ను, నా భర్త నీడను వదిలి పెట్టించేటంతగా నన్ను ఆకర్షించాలి, అలాంటివారు దొరుకుతారని అనుకోను. వజ్రానికి మెరుపుతోపాటు గట్టితనం కూడా వుంటుంది. లేకపోతే దానివిలువ శూన్యం” అంది. నవ్వుతూ అన్న మాటలే అవి. కాని వాటిలోని తీవ్రతని అందరూ గుర్తించారు. కమల ఎవర్ని గురించి ఈ మాటలలదో అందరూ గ్రహించారు. ప్రసాద్ కి చెంపపెట్టు పెట్టినట్టయిందీ.

    “మీరు దేనినయితే శూన్యం అంటున్నారో అదే సర్వస్వమని మరికొంతమంది భావించటంకూడా అసహజం కాదనుకుంటాను” అన్నాడు కోపంతో.

    “అసహజమనినేననటం లేదు. అవివేకమని అంటున్నాను” అంది కమల.

    ఈసారి రజని “ప్రతి వస్తువుకి ప్రతి వ్యక్తి ఒకేవిధంగా విలువకట్టాలనటం అసమంజసం కదా? వ్యక్తుల విలువలు వారిలాగే చంచలంకదా?”.

    “అయితే చంచలత్వం గర్హ్యమైనది కాదా” అంది. కమల.

    “ఉహుఁ! కాదు మనోచాంచల్వం అని మనం మనస్సుని యెప్పుడూ నిందించుకుంటాము.అచంచలంగా మనస్సు ఒకే వ్యక్తి మీద, ఒకేవస్తువు మీద లగ్నమయివుంటేజీవితంలోని సారాన్ని వదలి పిప్పిని మింగినట్టవుతుంది. ఎందుకంటే ఏ ఒకే ఒక వ్యక్తిలోను, ఏ ఒకేఒక వస్తువులోను సారం యిమిడి వుండదు. సారాన్ని కాంక్షించే వ్యక్తిలో కూడా సారం పూర్తిగా యిమిడివుండదు” అంది రజని

    “అయితే మీరనేది కీటకంవలె పుష్పంలోని సారాన్ని పీల్చివేసి వదలివెయ్యాలంటారా?” అన్నాడు రామం కోపంతో.

    సరిగ్గా యిదేసమయానికి బయట సైకిల్ గంట మోగిన చప్పుడయింది. మరుక్షణంలోనే తలుపుతోసుకొని సైకిలుతో పాటు లోనికి వచ్చాడు కమలాకరం, అలసి వచ్చినట్లున్నాడు. ఆరోజు ఆదివారం, కనుక షేవుచేసుకోలేదు జుట్టంతా చిందరవందరగా వుంది. లోపలికి వచ్చిన వెంటనే కమల లేచి వెళ్ళి బజారులొంచి తెచ్చిన సామానుల సంచీ అందుకుని “మీ స్నేహితులు వచ్చారు” అంది.

    ప్రసాద్ లేచి నుంచుని కమలాకరం దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ చేసి“గుర్తుపట్టావా నన్ను?” అన్నాడు.

    కమలాకరం స్వచ్చమైన మందహాసం చేస్తూ ''నువ్వు హఠాత్తుగా తారసిల్లితే గుర్తుపట్టలేనేమో అని ఒకప్పుడు భయపడ్డాను కాని యిప్పుడా భయం లేదు.” అని రజనిని చూసి “నిన్నయితే గుర్తుపట్టాను. కాని ఈ అపరిచిత స్త్రీని గుర్తుపట్టలేకపోతున్నాను. వివాహం చేసుకున్నావా?” అన్నాడు.

    ఏ ప్రశ్న అయితే రామం, కమల ఇద్దరు పలుమార్లు అడుగుదామనుకుని, అడగలేపోయారో ఆ ప్రశ్న కమలాకరం మొట్ట మొదటనే వేశాడు. ఆ ప్రశ్న అడగబడిన తర్వాత వారిద్దరు అనుకున్నారు “ఎంత సహజమైన ప్రశ్నయిది” అని.

    ప్రసాద్ కుర్చీలో తిరిగివచ్చి కూర్చొని “వివాహమనే తతంగం మా యిద్దరి మధ్య జరుగలేదు. స్నేహితులం, కలసి నివసిస్తున్నాము” అన్నాడు.

    “స్నేహితులకు సహజీవనం సానుకూలమైనదేకదా?” అన్నాడు కమలాకరం.

    రజని కమలాకరం కేసి చూస్తూ “ప్రసాద్ నా పేరు మీకు చెప్పలేదు నన్ను రజని అంటారు. ఇక మీరన్నమాట- నేనొక స్త్రీని, ఆయనో పురుషుడు. మేమిరువురం కలసినివసించాలని నిర్ణయించుకున్నాము. పురుష సాంగత్యము, ప్రేమనాకు, స్త్రీ సాంగత్వము, ఆదరము ఆయనకు లభించాయి. ఈ అంగీకారం చిరకాలం నిలవాలని మేము కోరుకోవటం లేదు. ఏ ఒక వ్యక్తి యింకొక వ్యక్తి తో చిరకాలం కలిసి నివసించలేడు. కొంత కాలం పోయేటప్పటికి ప్రేమ సన్నగిల్లుతుంది. విసుగు, అసహ్యము” జనిస్తాయి. వాటిని ప్రయత్న పూర్వకంగా కప్పిపుచ్చుకొని కృత్రిమంగా ప్రేమ నటిస్తూ జీవించడం మాకిష్టం లేదు. ఇరువురికీ సమ్మతమయినంత కాలం కలసివుంటాము. ఆ తర్వాత విడిపోతాము. ఏ క్షణంలోనయినా యీయన నన్ను విడిచిపోవచ్చును. ఏ క్షణంలోనయినా నేను ఈయనను విడిచిపోవచ్చును. కట్టుబాట్లు లేవు క్రమబద్ధాలు లేవు. కృత్రిమము లేదు. ఒకరి మీద యింకొకరికి యేవిధమైన హక్కు లేదు. అధికారము లేదు. నేనాయన దానను కాను, ఆయన నా వారు కారు” అంది.

    ఈ అసందర్భ వుపన్యాసాన్ని అందరు శ్రద్దగా విన్నారు. కమలకు ముఖకవళికలు అనేక విధాలుగా మారినవి.

    కాని ఆ మాటలు రామానికి మాత్రం కోపం తెప్పించాయి, పరిహాసపూరితంగా నవ్వి,“ఏదో పాఠం అప్పగించినట్లు చెప్పారు. ఏదో ఎవ్వరూ చెయ్యని పని చేసే నూతనపంథా వెతుకుదామని మీరు అనుకుంటున్నారు. మీరు కొత్తకొత్త మాటలు వుపయోగించి గట్టిగా మాట్లాడినంత మాత్రాన వీటిల్లోని సారాంశం నేను గుర్తించకపోలేదు. కొంతమంది భరింపరాని క్లిష్టపరిస్థితులలో అవసర సమయాల్లో ఇలాంటి పనుల కొడిగడతారు వారినే మనమంతా నిందిస్తాము “క్షుద్రులు, చీడపురుగులు” అని అంటాము. మీరు సరదాకి, నూతనత్వానికీ, జీవితంలోని సారం పీల్చడానికి ఈ పంధా తొక్కుతున్నారు. అంతే తేడా” అన్నాడు.

    రామం మాటలు విని అందరూ క్రుంగిపోయారు. ఎవరి ముఖాల్లోనూ నెత్తురు చుక్క కూడా లేదు. భయంతో అందరు రజని కేసి చూశారు. చివరకు ప్రసాద్ కూడా ఉద్రేకుడయ్యాడు రజనిని వేశ్య, జారిణి అని నిందించటం సహించలేకపోయాడు. కాని అతనికి ఏమనాలో తెలియలేదు. అందరిలోకి రజనిమాత్రం నిశ్చలంగా వుంది.

    “మీరన్నది కొంతవరకు నిజమే! రామం బాబూ! కాని వేశ్యకు, నాకు ఒక ముఖ్యమైన తేడావుంది. వేశ్య ధనంకోసం విచక్షణ లేకుండా శరీరాన్ని అమ్ముకుంటుంది, విటుడిని ఎంత అసహ్యించుకున్నా విముఖత చూపలేదు. బరువు చూసే యంత్రంలో అణా బిళ్ళ వేస్తే బరువు చూపేబిళ్ళ ఎంత నిర్దుష్టంగా, క్రమం తప్పకుండా బయటకు వస్తుందో అదేవిధంగా వేశ్య కూడా శరీరాన్ని అమ్ముకుంటుంది. అవయవాలు యంత్రంలా పని చెయ్యటం నేర్చుకుంటాయి. చివరకు మానసికంగాను, శారీరకంగాను నాశనమవుతుంది. నేనలాంటి దానను కాననుకొంటున్నాను” అని ప్రసాద్ వైపు చూస్తూ “ఏమండీ, మీరు చెప్పండి నేను అలాంటి దానినా? పడక గదిలో మీనుంచిపైకం అర్థించానా?”అందికమల ముఖము సిగ్గుతో ఎర్రబడింది. రామం దుర్బరమైన వేదనతో తల వంచుకున్నాడు. క్రోధంతో తను రజనియెడల విడచిన అభియోగానికి లోలోన దహించుకుపోయాడు. ఆమెను క్షమాపణ కోరుదాముకున్నాడు కాని నోరు మెధలలేదు. మౌనం వహించాడు.

    నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ కమలాకరం “ప్రపంచకంలో ప్రతి మానవునికీ తన ఆత్మ ఆదేశానుసారం జీవితాన్ని నడుపుకోవలసిన విధీ, హక్కు ఉన్నాయి వేరు వేరు బంధాలలో నడచినంత మాత్రాన ఒకరు వుత్తములు కారు. ఇంకొకరు కుత్సితులు కారు. కానీ ఆత్మవంచన అతిహీనమైనది. అధః పతనానికి అదే, అదీ కారణం అన్నాడు.

    “కాని మీరు చేస్తున్నది. ఆత్మవంచన కాదా? ఒకరి మీద మీరు చెలాయిస్తున్న యీ ఆధికారం యీ హక్కు ఎక్కడిది? సర్వహక్కులు రచయితవే అని పుస్తకం మీద వ్రాస్తూన్నట్లు సర్వహక్కులు భర్తవే అని మీరు భావించడానికి మీరు స్వతంత్రత ఎక్కడిది? ఆమె మీకు అర్ధాంగిని, ఇంటికి యిల్లాలు, పిల్లలకు తల్లి - అయితే వీటన్నిటిలోను ఆమె వ్యక్తిత్వం ఏది” అంది రజని.

    రజిని మాటలు విని కమలాకరం కాస్త బాధపడ్డాడు. “మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. నేను కమలపై సంపూర్ణాధికారాన్ని చెలాయిస్తూ ఆమెను నొక్కి అణచివుంచానని స్వార్ధంతో ఆమెను ఒక యంత్రంలావుపయోగించుకుంటున్నానని మీరు ఎలా భావించారు? అపరిచితుని యెడ మీరు యీ అభియోగాన్ని ఎలా వెయ్యగలిగారు? అయినా మీ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది కమల కాని నేను కాను” అన్నాడు.

    ఇంతవరకు కమల మౌనంగా తలవాల్చుకుని కూర్చుని వుంది. ఇప్పుడు నెమ్మదిగా తలయెత్తింది. కనుకొలుకలలో కన్నీటి బిందువులు చేరివున్నాయి. రజని వైపు నెమ్మదిగా చూస్తూ “వివాహపు బంధంలో మీకు నమ్మకం లేదు. అందుకు నేనేమి అనను, కాని యితరుల యెడ, ఇంత క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా ఏలా వుండగలుగుతున్నారు? జీవితంలో కృతజ్ఞత, కరుణ, మార్ధవం మమకారము, అనురాగము, ఆదరణ, వీటికి చోటే లేదా? సర్వకాలంలోను, మీ మనస్సులో మెదిలేది. స్వలాభమేనా?”అంది.

    “మీరన్న వాటన్నింటికీ జీవితంలో చోటు వుంది. “లేదనినేననను. కాని అవే సర్వస్వమూ కాకూడదు. వాటికి మనం బానిసలమయి పోకూడదు. వాటిని మనం అదుపులో వుంచుకోవాలి, అప్పుడే మనం జీవితంలో ఏదయినా సాధించగలుగుతాము” అంది రజని.

    కమల మౌనంగా ఒక క్షణంవుండి “మీరన్నది కూడా నిజమే కావచ్చుకాని, నాకు వీనికి సమాధానం చెప్పండి. ఒక వ్యక్తికి గురుతరమైన బాధ్యత, కర్తవ్యము ఎవరిమీద వుంటాయి? తన మీదా, లేక యితరుల మీదా? ముందడుగు వేసే సమయంలో మనస్సు ఎవరిని గురించి యోచించాలి ? ఇంకొకటి–జీవితంలో మనం ప్రతీదీ నిర్ణీతంగా క్రమబద్ధంగా ఎందుకు నేరవేరుస్తాము?”

    “మీ ప్రశ్నకు సమాధానం నన్ను చెప్పనీయండి. ముందర మొదటిది తీసుకుందాము. ప్రతి వ్యక్తికి గురుతరమైన కర్తవ్యభారం ఆవ్యక్తిలోనే యిమిడి వుంది. జీవితంలో కృతజ్ఞతకు తావేలేదండి. పిల్లలు పెద్దలకు కృతజ్ఞత చూపాలంటారు. నిన్ను పదిమాసాలు కని పెంచి, సేవ చేసిన తల్లికి, నీకు పుట్టుకనిచ్చి పెద్దవానిని చేసిన తండ్రికి కృతజ్ఞత చూపనవసరం లేదా? అంటారు. ఇదే విధంగా ప్రతివారు యితరుల వద్ద నుంచి కృతజ్ఞత ఆశిస్తారు కాని కృతజ్ఞత మనం వారికి ఎందుకు చూపించాలి? మన సమ్మతి ప్రకారం వీటిల్లో ఏవి జరుగుతున్నాయి? కృతజ్ఞత అనే రూపంతో మనవ్యక్తిత్వాన్నే కప్పిబుచ్చ ప్రయత్నిస్తారు. ఎల్లప్పుడూ ఎవరి బాధ్యత వారిదే. తనయిష్టానుసారం నడచుకునే హక్కు ప్రతి వ్యక్తికి వుంది. అలాంటివారిని, విశ్వాసహీనులు కృతఘ్నులు అని అంతా అంటారు. ఆలాంటి ప్రజలకు మనం భయపడితే, రజని చెప్పినట్లు జీవితంలో మనం ఏదీ సాధించలేము- రెండవ ప్రశ్న వేసారు మీరు. జీవితంలో క్రమబద్ధంగా మనం ఎందుకు చెయ్యాలని నిజానికి దాని సమాధానంకూడా మొదటి సమాధానంలో యిమిడి వుంది. నిర్ణీత రీతిగా మనం జీవన యాత్ర సాగించాలనీ నేను అనను కాని క్రమబద్ధంగా జీవితం గడపకూడదనే నిర్ణయంతో మనం దేనిని చెయ్యకూడదు. అయితే మఖ్యమైన సూత్రమేమిటంటే, ఏపని చేస్తే మనకి ఎక్కువ అనందం - క్షణికమైనా ఫరవాలేదు లభిస్తుందో ఆపని చెయ్యాలి. ఆదే ప్రతి పనికి గీటురాయి,” అన్నాడు ప్రసాద్.

    గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు ప్రసాద్. ఇంత వరకు ఎవరు గుర్తించని ఒక విషయం కమల అప్పుడు గుర్తించింది. ప్రసాద్ కంఠస్వరంలో ఆమెకు ఏదో వర్ణించరాని ఆకర్షణ, ఓదార్పు గోచరించాయి. ఏదో ఒక చెప్పలేని సంపూర్ణ సమర్పణ తిరుగులేని నిర్ణయం మనస్సును ముగ్ధంచేసే మమత ఆమెకు అందులో అనిపించాయి. ఏదేదో వింతలోకాలకి ఈడ్చుకొని పోయేయి. ఆమెకు అనిపించాయి కమలకి ఆ కంఠ స్వరం యింకా యింకా కావాలని తీవ్రమైన వాంఛ కలిగింది, కాని దానితోపాటు అది అంటే ఒక రకమైన భయం కూడా వేసింది. తనను ఒక బానిసను చేస్తుందేమోనని భయపడింది. చివరకు మౌనంగా వుండిపోయింది.

    అప్పుడు రజని “చాలా ఆలస్యమయింది ఇక వెళ్దాం పదండి. ఇప్పటికే వీరికి చాలా అలసటలు పెట్టాము. మొదటి పరిచయమయినా మనము ముఖస్తుతి మాటలు మాట్లాడలేదు. అదే ఎంతో ఆనందదాయకమైన విషయం” అంది.

    “మీరిద్దరి పరిచయం కల్గినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. నేను, రామం ఒకరి ముఖాలు వొకరు చూచుకొని విసుగెత్తిపోయాం” అన్నాడు నవ్వుతూ కమలాకర్. ఆచలోక్తికి రామం నవ్వలేదు. నిజానికి అతను చాలాసేపటి నుంచి మాట్లాడలేదనే విషయం ఎవరు సరిగా గుర్తించలేదు. దగ్గర వున్న మేగజీన్ తిరగవేస్తూ అప్పుడప్పుడు మందహాసం చేస్తూ కూర్చున్నాడు. సమయం దొరికినప్పుడల్లా రజని కేసి చూస్తూ కూర్చున్నాడు.

    “ఇక వెళ్తాము అప్పుడప్పుడు కనిపిస్తూనే వుంటాము. మీరు కూడా మాయింటికి వస్తూ పోతూ వుండాలి.” అని. కమల వైపు చూచేడు ప్రసాద్. కానీ ఆమె అతని వైపు చూడుటం లేదు. ఆత్మపరిశోధన మొదలు పెట్టింది.

    ముగ్గురు కారులో బయలుదేరారు. ఈసారి ప్రసాద్ డ్రయివు చేస్తున్నాడు. ఆ వేగానికి రామం భయంతో వణికి పోయడు. అరవై దాటిన తర్వాత స్పీడు మీటరు కేసి చూడడం మాని కళ్లు మూసుకుని కూర్చున్నాడు. మాట్లాడితే ప్రమాదం కలగటానికి ఇంకా అవకాశాలుంటాయని మౌనంగా వూరుకున్నాడు. రజని అతని కేసి చూచి నవ్వింది. ప్రాణంమీద మీకు యింత తీపా! భయపడకండి. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంది.

    “ప్రాణం మీద తీపి వున్నాలేకపోయినా యింకొక వ్యక్తినిర్లక్ష్యానికి నేను చనిపోవటం నాకిష్టం లేదు నాకు నిజంగా భయం వేస్తూంది. ప్రసాద్ కేమైనా పూనిందా యేమిటి అలావున్నాడు” అన్నాడు రామం.

    నిజానికి ప్రసాద్ ని అప్పుడు చూస్తే కొత్తవారికి కొంచం కలవరపాటు కలగడం సహజమే.

    కారులో మెరిసే కళ్ళతో, దవడలు వుబ్బెత్తుగా పొంగి నల్లటి వుంగరాల జుట్టు గాలిలో ఎగురుతూ వున్న ప్రసాద్ రూపం ఏదో ఒక అమానుషత్వాన్ని గుర్తుకు తెస్తూంది. ప్రసాద్ వీరి మాటలే వినిపించుకోలేదు, హటాత్తుగా కారుని “కన్నాట్ ప్లేసులో” ఒక షాప్ వద్ద ఆపి రజనితో “నువ్వు కారు తీసుకొని వెళ్ళు రజనీ! నేను తరువాత వస్తాను.” అని బయటకి చరచరా వెళ్ళిపోయాడు.

    రామంతో ఒక మాటకూడా మాట్లాడలేదు. ప్రసాద్ చిత్ర ప్రవర్తనకి విస్తుపోయి వెర్రిగా చూస్తున్నాడు. రజని పకపక నవ్వుతూ “మత్తువదలించుకొని కాస్త యీకారుని ఎక్కడకు తీసుకు వెళ్ళాలో చెప్పండి. ఈసారి భయపడకండి నా ప్రాణమంటే నాకు, మీకు మీ ప్రాణం కన్న ఎక్కువతీపి. నాకు నూరు సంవత్సరాలు నిండుగాబ్రతకాలని వుంది. రోజూ నూరు దేవుళ్ళకి మొక్కుకుంటూంటాను చెప్పండి మిమ్మల్ని యెక్కడ డ్రాప్ చెయ్యాలి” అంది.

    “లోడీకాలనీకి పోవాలి. ఇక్కడకు చాలా దూరం” అన్నాడు రామం.

    “నేను మిమ్మల్ని అడిగినది ఎక్కడికి వెళ్ళాలని కాదు ఎక్కడ డ్రాప్ చెయ్యమంటారని” అంది రజని.

    “అయితే యిక్కడే డ్రాప్ చెయ్యండి” అన్నాడు కొంచెం కోపంగా రామం.

    రజని నవ్వుతూ “మీకు బలే త్వరగా కోపం వస్తుంది. మీలాంటివారికోసము నేను ఎంతో కాలం పట్టి ఎదురు చూస్తున్నాను. ఇక ఫరవాలేదు. కాస్త ఆసరా దొరికింది” అంది.

    రామానికి రజని ప్రవర్తన మరీ మొరటుగా కనబడింది. కాని తను రజనిని వేశ్య అని అనినందుకు ఇంకా పశ్చాత్తాప పడుతున్నాడు. ఆమె ఆమాటకు తన పై కోపగించుకొనందుకు కొంచెం కృతజ్ఞత కూడ కలిగింది. అయినా క్షమార్పణ చెప్పుకోవటం తన విధిగా భావించి, “ఇందాక మీ యెడ నేను అపచారం చేశాను, నన్ను క్షమించాలి అన్నాడు.

    “ఆశ్చర్యంతో అపచారం చేశారా! ఏం చేశారు? అంది రజని."

    “అదే... యిందాకా... మిమ్మల్ని” అని రామం తడుముకుంటూంటేరజని “ఓ అదా ; అందులో అపచారం ఏముంది చెప్పండి. ఎవరికి తోచిన విధంగా వారనుకుంటారు. నేను వేశ్యనే అయినా అందులో అభిమాన పడవలసినది ఏముంది చెప్పండి, వేశ్యలలో వుత్తములు లేరని ఎవరనగలరు?” అంది.

    రజని మాటలు వింటూంటే రామం హృదయం కలచినట్లయింది. ఆమె మనస్తత్వం అతని కేమి అర్ధం కాలేదు సమాధానం ఏమి చెప్పాలో అని ఆలోచిస్తూకూచునేసరికి కారు తన లాడ్జికి దగ్గరగా వచ్చిందని గుర్తించి “ఆపండి కారు, ఇదే నాలాడ్జి” అన్నా డు.

    రజని హఠాత్తుగా కారు ఆపి “భలేవారు కాస్త ముందర చెప్పితే నష్టమేమిటి చెప్పండి” అంది.

    రామం కారుదిగి “థాంక్స్ ! మళ్ళీ ఎప్పుడు కనబడతారు” అన్నాడు.

    రజని నవ్వుతూ “మాట వరసకయినా మీరు లోపలికి రమ్మనమని అనలేదు కాదా” అంది.

    రామం కాస్త కంగారుపడుతూ “అబ్బే అదికాదండి పొరపాటయింది తప్పకుండా రండి. నా చేతి కాపీ కాస్త తాగి వెళ్ళండి” అన్నాడు.

    రజని కారులోంచి దిగుతూ “మీ చేతి కాఫీ కాచి నాకుయిస్తారా? అయితే నిజంగా తాగాలనే వుంది” అంది.

    రజిని నిజంగా కారు దిగి తన గదిలోకి వస్తుందని రామం అనుకోలేదు. కంగారుగా తాళం తీసి రండి - రండి కూర్చోండి అంటూ కుర్చీ మీద పడివున్న బట్టలను ఒక మూలకు విసిరివేసాడు.

    రజని కూర్చుందే గాని గది అంతా పరీక్షించి చూస్తూంది. ఆమె దృష్టి మరల్చడానికి “క్షమించాలి- అంతా చిందరవందరగా వుంది” అన్నాడు

    “ఫరవాలేదు లెండి. రెండు గదులు తీసుకున్నారా ?” అంది రజని “అవునండీ రెండవది వంటగది'' అన్నాడు రామం.

    “ఏమిటీ ! మీరే వంట చేసుకుంటున్నారా?” రజని ఆశ్చర్యంతో అంది.

    “అవునండి హోటల్ భోజనం శరీరానికి పడటం లేదు” అన్నాడురామం,

    “అయితే నాకు కాఫీ వద్దు అన్నం పెట్టండి ఆకలివేస్తోంది” అంది రజని దగ్గర వున్న కుర్చీలో కూర్చుంటూ.

    రామానికి రజనీ, అలా పరిహాసానికి అందో, నిజంగా ఆందో అర్ధం కాలేదు. కానీ అతను సమాథానం చెప్పక మునుపే రజని “అయ్యొయ్యో ! ఏమిటీ అన్యాయం. ఒక అపరిచితుని యింట్లో బలవంతంగా జొరపడి మొరటుగా హాస్యం ఆడుతూ అన్నం పెట్టమంటున్న స్త్రీకి నీతి, నియమము, గౌరవము, మర్యాదా, సభ్యత సరసము తెలుసునా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ సొదను ఎట్లా వదిలించుకోవటము? అని అనుకుంటున్నారు కదూ?” అని నవ్వుతూ యింటిని శుభ్రం చెయ్యడం ప్రారంభించింది.

    రామానికి పూర్తిగా మతిపోయింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దిగ్భ్రాంతుడయి రజని ముఖం కేసికన్నార్పకుండాచూస్తున్నాడు.

    అప్పుడు రజని - అలా చూస్తారేమిటి? ఇప్పటికే చాలా ఆలస్యమయింది. నాకు ఆకలి వేస్తోంది. కాస్త బియ్యము కూరగాయలు వగైరా తెచ్చి యిస్తే, నేనయినా ఏదో చేస్తాను. ఈ పూటకి శాఖాహారంతోనే సరి” అంది నిట్టూర్పుతో.

    “మీరు మాంసాహారులా ! ఆన్నాడు రామం”

    రజని మందహాసం చేస్తూ – “మాంసాహారినే కాదు. మధుపానీయాలు కూడా తాగుతాను. అసహ్యమేస్తోంది కదూ! కాని ఎందుచేత ! మీరు భోంచేసే వరి - ఎక్కడిది ? వరి మొక్కను చంపితేనే కదా అది మీకు లభ్యమవుతుంది. జంతువుకి ప్రాణమునట్లే దానికీ ప్రాణం లేదా ?” అంది.

    “అసహ్యం లేదండి ! ఆశ్చర్యమేస్తోంది. మీరూ, మీ ప్రవర్తన నాకు బొత్తిగా అర్థం కావటం లేదు.ఇదంతా మీ పరిహాసమా లేక నా మతిభ్రమ చెప్పండి? ఒకస్త్రీ యింకొక అపరిచిత పురుషుని యెడ, యింత చనువుగా వుండగలుగుతుందని నాకు తెలియదు, మీరు ఒక విచిత్రవ్యక్తియా లేక నన్నొక ఆట వస్తువుగా పరిగణిస్తున్నారా?” అన్నాడు.

    “పరిగణిస్తున్నానో ప్రేమిస్తున్నానో తరువాత చెప్తాను. ముందర ఆకలి వేస్తోంది. త్వరగా కాస్త బియ్యము, అవి యియ్యండి నేనే వంటచేస్తాను” అంది.

    “మీరు వంట చేస్తారా ? మీ బోటివారికి వంట చేతనవునా?” అన్నాడు.

    “నేనేమీ రాకుమార్తెను కానండి” అని నవ్వుతూ “లేకవేశ్యలకు వేరేపనులుంటాయనుకుంటున్నారా?” అంది రజని !

    రామం ముఖం సిగ్గుతోనూ, ఏవగింపుతోనూఎర్రబడింది. ఆవిషయాన్ని తిరిగి జ్ఞప్తికి తెస్తుందని తలచలేదు. ఇలాంటి స్త్రీ చేతి భోజనం తను చేయ్యాలా? కాని యింకో మార్గం కనబడలేదు.

    కొంచెం కోపంతో - “మీరు అలాంటి మాటలు యింకా అంటే నేను సహించనండి ? ఎందుకు పదేపదే అలాంటి మాటలంటారు? మీకేమైనా తృప్తి కలుగుతుందా ?” అన్నాడు.

    రజని తన మాటలవలన రామం హృదయం గాయపడిందని గ్రహించింది కాని ఆమె వాంఛించేది కూడా అదే?.

    నవ్వుతూ “మీకు కోపం తెప్పించటమంటే నాకు చాలా సరదా? మనస్సుకి చాలా తృప్తి కలుగుతుంది!” అంది.

    ఆరోజు రజనినే వంట చేసింది. రామం ఎంత వారించినా, ఎంత వేడుకున్నా ఆమె వినలేదు, ఎంతో ఆప్యాయంగా రామానికి ఆరోజు భోజనం పెట్టింది. రజని అర్ధంలేని ఆప్యాయతకు రామం మనస్సులో కృతజ్ఞత చెప్పుకున్నాడు. కాని బయటకు ఏమి అనలేకపోయాడు. ఎంత ఆలోచించినా అతనికి రజని ప్రవర్తన దురూహ్యమయింది. అలాంటి వింత యువతులుంటారని అతను వూహించలేదు. మొట్ట మొదట రజని ప్రవర్తన అతనికి అసహ్యము, ఏవగింపూ కలిగించాయి. హై సొసైటీలో మెదిలే ఒక అందమైన వేశ్య అని భావించాడు, ఆమెతో ఆనాడు గడిపిన ప్రతిక్షణం గడిచే కొలది అతని అభిప్రాయం మారజొచ్చింది.

    భోజనాలయిన తర్వాత తాంబూలం అందించింది రజని ఇష్టం లేకపోయినా రామం నిరాకరించలేదు.

    రజని కారులో బయలుదేరబోతుంటే రామం “చాలా ఆలస్యమయింది. ప్రసాద్ మీ కోసం ఎదురు చూస్తున్నాడేమో? కారు కూడా తీసుకు వచ్చారు. మీరు యిప్పటి వరకు ఎక్కడ వున్నారని అడిగితే ఏమని చెప్తారు?” అన్నాడు.

    “ప్రసాద్ కి నిజం తెలిస్తే వచ్చి మీ ప్రాణాలు తీస్తాడని "భయపడుతున్నారా? కాని మీరు భయపడకండి ఆయనకి నేనే భార్యనయితే యిలా భయపడవలసి వుండును. కాని యిప్పుడు వేరు, నేను ఆయన పాదదాసిని కాను ,ఆయన ప్రేయసిని మాత్రమే అంది” రజని నవ్వుతూ.”

    కారు యింజను స్టార్ట్చేసి బయలుదేరబోయే సమయానికి, రామంకు ఎందుకో హృదయం బరువయి నట్టనిపించింది. అర్ధం లేని ఆవేదన అంతర్గతంలో ఆవరించింది. ఎంతోకాలపు ఆత్మీయత అంతం ఆవుతున్నట్లు అనిపించింది.

    గబగబ దగ్గరకు వచ్చి “చూడండి మళ్లీఎప్పుడు కనబడతారు?” అన్నాడు.

    నవ్వుతూ “స్వప్నంలో” అని రివ్వున వెళ్లి పోయింది.

    *****