Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అప్రాశ్యులు - 8

అప్రాశ్యులు

భీమేశ్వర చల్లా (సి.బి.రావు)

8

చంద్రికకు కమలకు బాగా స్నేహమయింది. కమలకు చంద్రికను మొదట చూచినప్పుడే హృదయంలో ఆప్యాయత ఏర్పడింది. అదీ కాక ప్రసాద్ చెడు ప్రభావం వల్ల పెడదారులు తొక్కుతుందేమోనని భయపడింది కూడా తన పరిచయం ద్వారా ఆ ప్రమాదం నుంచి తప్పించుదామనుకుంది. చంద్రకతో అంత స్నేహం చేయడానికి కారణం ఇంకొకటి కూడా వుంది. అది కమల వొప్పుకోదు. అది హృదయాంతరాళంలో మెదిలే రహస్యపు ఆలోచన. అలాంటివి బాహ్యరూపంలో అగుపడవు. కానీ చేష్టల్ని ఆవి తీర్చిదిద్దుతునే వుంటాయి. చంద్రిక ప్రసాద్ తో కలిసి నివశిస్తోంది. ఆమె కంటే ఆప్తులు అతనికి ఎవరు లేరు. అతని రాకపోకలు, చేష్టలు అన్నీ ఈమెకు తెలుసును. మొదట నుంచీ ప్రసాద్ కమలకొక సమస్యగానే వున్నాడు. అతని స్వభావం ఆమె అర్థం చేసుకోలేక పోయింది. సాధారణ మానవకోటినుంచి ఆమడదూరంలో వున్న విచిత్ర వ్యక్తిగా ఆమెకు అగుపించాడు, అతనంటే ఒక విధమైన భయం ఏర్పడింది. అయస్కాంతంలాంటి ఆతని ఆకర్షణని ఆమె జయించ లేక పోయింది. ఇష్టానికి వ్యతిరేకంగా నే ఆమె అతనికి హృదయంలో చోటిచ్చింది. శతవిధాల శక్తినంతా కూడదీసి ప్రయత్నించినా కమల ఆ విశృంఖలాలనిత్రెంచలేకపోయింది. అప్పటిలో అంతర్యుద్ధం అంతమయినా విజయం ఆమెకు లభించలేదు, అయినా తన కర్తవ్యాన్ని గుర్తించింది. సాధ్యమయినంతవరకు ప్రసాద్ ని మరచి పోవాలని, అతనిని చూడకూడదని నిశ్చయించుకుంది. కాని మనస్సులో ప్రసాద్ సంగతులు తెలుసుకోవాలని, అతని అభిప్రాయాలు అర్ధం చేసుకోవాలని కోరిక మాసిపోలేదు. ప్రసాద్ కి సంబంధించిన ఏ వస్తువయినా ఆమెకొక విధమయిన ఆకర్షణ ఏర్పడింది. ప్రసాద్ అనేమాట వినినప్పుడల్లా ఆమె హృదయం ఒక్కసారిగా గగుర్పొడిచేది. చంద్రికకు అన్ని సంగతులు చెప్పేది ప్రసాద్ బయటకు కనబడినంత కఠిన హృదయుడు కాడని, ఉదార స్వభావుడని, ఆలోచన మనస్సులో మెల్లి గా జొరపడింది. చంద్రిక ద్వారా చంద్రిక లాంటి అనాధుల యెడ ప్రసాద్ కనబరచిన ఔదార్యం ఆమెలో ఒక విధమైన గౌరవం ఏర్పడడానికి కారణమయింది. అతని సాహసం. నిర్ణయత్వం, ఆమెలో ఒక విధమయిన ఎడ్మిరేషన్ ను ఏర్పరచాయి.కమలాకరం భార్య ఆలోచన కొంతవరకే గ్రహించగలిగాడు.స్త్రీల ఆలోచనల్ని పడగొట్టటం ఎంత కష్టమో అందరికి తెలుసు. వారి వారి హృదయాలలో రహస్యపు ఆలోచనల్నీ, యదార్థాల్ని గ్రహించడం చాలా దుర్లభమైనది . ఏ వ్యక్తియెడ మక్కువా మమత వున్నాయో, ఏ వ్యక్తి యెడ ఏవగింపు వుందో బాహ్యా చేష్టలనుంచి గ్రహించడం ఎండమావులను వెంటాడటం లాంటిది. కమలాకరానికి కమల ప్రవర్తనలో పెద్ద మార్పేమీ కనబడలేదు. మొదటి నుంచి ప్రసాద్ అంటే ఆమెకు కోపమనీ గ్రహించాడు, అతని విషయమేదైనా ప్రస్తావిస్తే ఆమె మాటలు తప్పించేది.

చంద్రిక తరచుగా కమల ఇంటికి వెళ్తూండేది. కాని కమల వొకసారికూడ చంద్రికను చూడడానికి పోలేదు. చంద్రికబలవంతంమీద వొకనాడు వెళ్ళటానికి ఒప్పుకుంది. కాని జాగ్రత్తతో ముందర ఒక మాట తీసుకొంది. ప్రసాద్ ఢిల్లీలో లేడని. ఇంకొక వారం రోజుల వరకు రాడని చంద్రిక చెప్పింది. అదే తగిన సమయమనుకుంది. ఆమె అంగీకారానికి ఇంకొక కారణం కూడా వుంది. ప్రసాద్ నివాసస్థలం చూడాలని ఒక విధమైన కుతూహలం ఏర్పడింది.

ఆ రోజు సాయంకాలం చంద్రిక వద్దకు బయలు చేరింది. కమలాకరం ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తానన్నారు. ఒంటరిగా బస్సు మీద బయలుదేరింది. అడ్రస్ తెలిసినా ఎంతో కష్టంమీద కాని యిల్లు గుర్తు పట్టలేకపోయింది. గుర్తుపట్టిన తర్వాత, అది కాదా అనే సందేహంలోపడింది. అంత పెద్ద భవనం ప్రసాద్ దా, ఎంత సుందరంగా వుంది? ఇంటి ఎదుట ఉద్యానవనం, కాని సందేహం లేదు. అదే వీధి అదే నెంబరు, భయపడుతూ, భయపడుతూ గేటు తీసి లోనికి వెళ్ళింది. వీధిగుమ్మం తెరచేవుంది. లోపల అలికిడి ఏమి లేదు. నెమ్మదిగా గుమ్మం వైపు నడుస్తూంటేవెనుక నుంచి “కమలా” అనే పిలుపు వినబడింది. అ గంభీర కంఠస్వరాన్నివెనుదిరుగకుండానే గుర్తు పట్టింది. క్షణకాలం శరీరoగగుర్పొడిచింది.నెమ్మదిగా వెనుదిరిగింది. ప్రసాద్ నవ్వుతూ నిలబడి వున్నాడు, చేతిలో మొక్కలకు నీళ్ళు పోసే క్యాన్ వుంది.

కమల: “మీరా?” అని మాత్రం అనగలిగింది.

“కాదు కమలా. తోటమాలిని. అయ్యగారు ఇంట్లో లేరు'' అన్నాడు నవ్వుతూ.

కమల ఛలోక్తికి నవ్వలేను. ప్రసాద్ ఇంటిలో వంటరిగా వున్నాడేమోననే భయంతో చంద్రిక లోపల లేదా?” అంది భయపడుతూ.

“కమలా, చంద్రిక వుంది. కాని నువ్వు వస్తున్నావని చెప్పలేదు. లేకపోతే బయటకు పంపించి వేసేవాడిని'' అన్నాడు ఇంకా నవ్వుతూ.

“అయితే లోపలకు వెళ్తా” నంది.

“ఇక పది పది హేను నిమిషాల వరకు నీకు చిక్కదు. కారణం చెప్పనంటే మొరటొడినంటావు. అయినా చెప్తాను. తలంటు పోసుకుంటోంది” అన్నాడు.

కమలకు చంద్రిక పై కోపం వచ్చింది తనను ఇంటికి పిలిచి చెయ్యవలసిన పనాయిది.

ప్రసాద్ “ఈ లోపున సహాయం చెయ్యాలి. పూల మొక్కలంటేనాకెంతో యిష్టం. ఎర్ర గులాబంటే నాకిష్టం లేదు. తెల్ల గులాబంటే నాకెంతో ప్రీతికాని స్త్రీలకుఎర్ర గులాబంటేనే ఇష్టం కదూ? అన్నాడు.

కమల“లేదు-గులాబీలంటేనే ఎక్కువ ఇష్టం లేదు. సంపెంగి, సన్నజాజి అంటే ఎంతో యిష్టం” అంది.

ప్రసాద్ “వాటిల్లో నిన్నాకర్షించేది సౌందర్యం కాదు కమలా, సువాసనమాత్రమే” నన్నాడు.

కమల“లేదు అది అసత్యం, సువాసనమైకంలో పడి మీరు, పురుషులు వాటి అందాన్ని గుర్తించరు. కొన్నిటిలోని అందాన్ని గుర్తించి సువాసనను చిన్న చూపు చూస్తారు. ఉంది.

“ప్రకృతిరీతే యింతే కమలా! ఈ రెండు సమపాళ్ళలో వున్న పుష్పాలు, పురుషులు అరుదుగా కనబడతారు. తలలో పెట్టుకోవడానికి తుంచే పుష్పాలకి సువాసన అవసరం. అయినా మీరు సువాసన లేని అందమైన పుష్పాలివి నిర్ధాక్షిణ్యంగా వదలి వేస్తారు. అవి ఎంత సోషిస్తాయో” అన్నాడు.

కమల“పుష్పవిలాపం వర్ణిస్తున్నారా” అంది.

ప్రసాద్“వల్లించడం లేదు కమలా నివేదించుకుంటున్నాను” అన్నాడు.

ఏ విషయం తప్పిద్దామని ఆమె విశ్వప్రయత్నం చేస్తూందో అది ప్రసాద్ నోటి వెంట వెలువడింది. కమల గుండె ఒక్కసారి వేగంగా స్పందించింది.

మాటలు తప్పిద్దామనే ఉద్దేశంతో: “చంద్రిక యింకా రావడం లేదేమి? లోపల వుందేమో” అంది.

“ఒక సమస్య నుంచి పారిపోయినంత మాత్రాన అది పరిష్కారం కాదు కమలా” అన్నాడు.

ఆ మాటలు కమలలోని పౌరుషాన్ని లేవదీశాయి “పారిపోవడం లేదు ప్రసాద్ - పోరాడుతున్నాను” అంది.

ప్రసాద్ పకపక నవ్వుతూ “ఈ విధంగానా? ముందర పరుగిడితే పారిపోవడమంటారు. వెనుక పరుగిడితే పోరాడడమంటారు. ఇంతేగా” అన్నాడు.

కమల కోపంతో“దుష్టులకు దూరంగా వుండడంలో పిరికితనం కాదు. అదే వివేకమంతమయిన యుద్ధం” అంది,

ప్రసాద్“దుష్టుడు అనేది నీనోట మాత్రమే కమలా. అది నీ హృదయపు అభిప్రాయమని నేను నమ్మను” అన్నాడు.

“అలా అనుకొనినిన్ను నీవే వంచించుకొంటున్నావు ప్రసాద్” అంది.

ఈసారి కమల మాటలు ప్రసాద్ కి నిజంగా కోపం తెప్పించాయి. అయినా తనను తాను తమాయించుకొని, “దుష్టుడనే కావచ్చు కమలా? కాని దుష్టులు ఆత్మీయులు కాకూడదా” అన్నాడు.

“సహృదయులు కాలేరు ప్రసాద్”.

“అయితే రజని సహృదయ కాదా?” అన్నాడు.

“రజని విషయంలో నేనే చెప్పలేను, అది స్వతసిద్దమైనదో కాదో నాకు తెలియదు. అయితే చంద్రిక కృతజ్ఞతా భావం మాత్రమే ప్రసాదు, అది స్వతసిద్దమయిన అనురాగమనీ ఆప్యాయతయని భ్రమవడుతుంది” అంది.

కమల కఠిన వాక్యాలు ప్రసాదుని కాస్త నొప్పించాయి. కమల వద్ద నుంచి కాస్త దూరంగా వెళ్ళి మొక్కలకు నీళ్ళు పోస్తూ” మొక్కలకు నీళ్ళు పోసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తపడాలి కమలా? ఎక్కువ నీళ్ళు పోసినా ప్రమాదమే సంభవిస్తుంది” అన్నాడు.

ప్రసాదు మాటలని గూడార్థం కమల చూచాయగా మాత్రంగ్రహించింది.

“అది నిజమే ప్రసాద్! కాని ఇంకొక సామెత కూడా వుంది. పల్చటి మొక్కలే పెనుగాలికి తలవొగ్గి జీవిస్తాయి. ముదిరిన మొక్కలకు మరణమే గత్యంతరం” అంది.

ప్రసాద్ కి కమల కంఠస్వరం మాత్రమే వినబడింది. ఆమె ముఖం చూచినట్లయితే భయపడి వుండేవాడు... చంద్రిక అప్పుడే బయటకు వచ్చి కమలను చూచి చకితురాలైంది. “కమలా!?” అని పిలిచింది. కమల చంద్రికను గుర్తించి ప్రయత్నపూర్వకంగా నవ్వి “చంద్రిక ఎంత చక్కగా వున్నావు?”అంది. ప్రసాద్ కూడా లేచి నిలబడి చూచాడు. నిజంగా ఆమె ఎంతో చక్కగావుంది, పసుపు పచ్చ ఖద్దరు చీర కట్టుకుని, ముఖానికివ్రాసుకున్న పసుపు ఇంకా పూర్తిగా వదలలేదు. నిండుగా ఎర్రటి బొట్టు పెట్టుకుని విశాలమైన నేత్రాలని ఇంకా విశాలంగా కనబడేటట్లు చక్కగా కాటుక దిద్దుకొంది. దాంతో అవి మరీ పెద్దవిగా కనబడుతున్నాయి.పొడుగయిన నల్లటి జుట్టు ముందర వేసుకొని దువ్వెనతోచిక్కుతీసుకుంటూంది. కమలమాటలువిని చంద్రిక ముఖం సిగ్గుతో ఎర్రబడింది. తల పంచుకొని“ఇదంతా ప్రకృతి సౌందర్యము కమలా! నీముందు నేనెంత?” అంది.

“ఇది ఆదినుంచి పరిష్కారంకాని సమస్య. ఇరువురు స్త్రీలు వారిలో ఎవరు సౌందర్యవంతులనే వివాదంలో దిగేరంటేసృష్టి అంతరించిపోతుంది కాని పరిష్కారం కాదు” అన్నాడు ప్రసాద్.

“ఇవి స్త్రీలను అందమైన అటవస్తువులుగా పరిగణించేవారు అనే మాటలు ప్రసాద్. సంస్కారులు అనేమాటలు కావు” అంది కమల.

కమల మాటలు చంద్రికకు కోపం తెప్పించాయి దగ్గరకువచ్చి “ఇవి కోపంతో అన్న మాటలు కమలా! మామయ్య ఆలాంటి వారు కారని, పరిహాసానికి మాత్రమే అలా అన్నారని నీకు తెలియదు” అంది.

“అప్పుడప్పుడు పరిహాసపుమాటలలోనే వ్యక్తుల నిజస్వరూపం బయటపడుతుంది. చంద్రిక నువ్వింకా అనుభవ జ్ఞానం లేని యువతివి. కృతజ్ఞతామైకంలోపడి నువ్వు పెరిగి పెద్దదానవయ్యావు” అంది.

చంద్రిక ఎంతో బాధపడి “అనాధారంగా ఇతరుల మీద నిందలు మోపటం అన్యాయమని, అమానుషమని నీకు తెలుసును కమలా. ఐనా యీ రోజేదో కోపంతో వున్నావు. లోపలికి వచ్చి చల్లటి పానీయమేదేనా సేవించు. తర్వాత మాట్లాడుకుందాము” అన్నది.

కమలకు కూడా తన మాటలు కొంచెం అసమంజముగానే కనబడ్డాయి. తనను తాను సంబాళించుకోని చంద్రిక వెంట లోనికి వెళ్ళింది నవీనపద్దతిలో నిర్మించబడిన ఆ భవనం ఆమెను ఎంతో ఆశ్చర్యపరచింది.

“ఎలావుంది మాయిల్లు? ఎంత సుందర భవనం?” అంది చంద్రిక.

కమల నలుప్రక్కలా చూచి “ఈ ప్రపంచంలో ఎంతో మంది నిలువనీడ లేక బాధపడుతూంటే ఒకానొక వ్యక్తి ఇంత పెద్ద భవనంలో నివసించటం అన్యాయం. పైగా వారు దీనరక్షకులని, ఔదార్యవంతులని చెల్లుబడి అవుతారు” అంది.

“అలా నేను ఎప్పుడూ చెప్పలేదు కమలా? పైగా నా సుఖం తరువాతే పరులసుఖమనీ మొట్ట మొదటినుంచీ చెపుతూనే వున్నాను. నేనేమైనా ఇతరులకు చేసినా, అదంతాస్వాతిశయంతోనే కమలా?” అన్నాడు ప్రసాద్.

“అని నేను ఎంత మాత్రం ఒప్పుకోను. ఇలాంటి మాట లను నేను సహించను. కమలా! నా యెదుట మామయ్యని ఏదయినా అన్నారంటేనేనూరుకోను. ఎవరైనా సరే నాకు లెక్క లేదు” అంది. ఆమాటలంటూ చంద్రిక తనను తాను మరచిపోయి నిప్పురవ్వలా ఓ క్షణ కాలం ప్రకాశించింది.

అతను నవ్వుతూ “శబాష్ చంద్రికా! ఈనాడు నా పరువు నిలబెట్టావు. ఆమె అభియోగాలకి సరియైన జవాబు చెప్పావు”.

చంద్రిక తన వుద్రేకానికి సిగ్గుపడింది. “నువ్యు అతిథివన్న సంగతి మరచిపోయాను కమలా! క్షమించు. కూర్చుని వుండు ఇప్పుడే వస్తాను” అని లోనికి వెళ్లి పోయింది.

కమల దగ్గరలో వున్న కుర్చీలో కూర్చుని ప్రక్కనే వున్న మేగజేన్ లో ముఖం దాచుకుంది.

అతను ప్రక్కనేవున్న కుర్చీలో కూర్చుని “ఇంతమాత్రానికే ఇంతదూరం వచ్చావు కమలా?” అన్నాడు.

“వచ్చినంత మాత్రాన అస్తమానమూ వాగుతూండమంటారా చెప్పండి?'' అందామె.

“అనినేననను. కానీ, విముఖత, అహంకారము, అసమంజసంగా వుంటాయి కమలా!” అన్నాడు.

లోపలినుంచి చంద్రిక ట్రే లో చల్లని పానీయాలు తీసుకు వచ్చి ఆమెకు యిస్తూ “ఇది త్రాగి కాస్త ఉపశమించు కమలా! ఇంట్లో భార్యాభర్తలకు ఏదో రగడ జరిగివుంటుంది. ఆ కోపాన్నంతా యీ రోజు మా మీద చూపిస్తున్నావు”.

“ఆలాంటివేవి కాదు చంద్రిక! వారికి నాకు అభిప్రాయభేదాలు లేవు, కలహాలు లేవు. వారు నా మాట జవదాటరు. నేను వారి మాట జవదాటను. అన్యోన్య దంపతులం” అంది కమల సగర్వంగా అతని కేసి చూస్తూ.

ఎంతో అసందర్భమైన మాటలు కాని అర్ధరహితమైనవి కావు. ఆమాటలు చంద్రికకు ఉద్దేశించబడినవి కావు. ప్రసాద్ కు ఉద్దేశించబడినవి. అది అతను గ్రహించి “అన్యోన్యత హృదయాలకు సంబంధించిన విషయం కమలా!అన్యులకు వాటితో పని లేదు. నీనోటి వెంట ఆ మాటలు వచ్చాయి కనుక నీలో నీకు ఈ విషయంలో ఆత్మవిశ్వాసము లేదని తెలిసిపోతుంది.” అన్నాడు.

వీరిద్దరిమధ్య కలహం రేగుతుందేమోనని భయపడి “మామయ్యా! ఇక ఊరుకో కమల మన అతిధి” అనీ చంద్రిక “కమలా ఈమధ్య రజని కనబడిందా?” అంది.

“కనబడింది. నాలుగురోజుల క్రితం 'క్వీన్సే వే' లో రామం, రజని కనబడ్డారు. కుష్టువుల సేవలో ఆమె కూడా దిగింది. వారానికి రెండు మూడు సార్లు అక్కడకు వెళ్లి వస్తూంటుంది. ఒంట్లో సరిగా కూడా లేదట ఎంతో నీరసపడింది ”.

చంద్రిక కంగారు పడుతూ కుష్టువుల సేవ ఏమిటీ' అంది. ఆమె చంద్రికకు జరిగిన గాథ విశదపరచింది.

చంద్రిక దీర్ఘంగా నిట్టూర్చి “హరి బ్రహ్మదులు అడ్డు వచ్చినా ఆమెను ఆపలేరు చూస్తూ ఊరుకోవలసిందే మనమంతా” అంది.

“అది నిజమే చంద్రిక, కాని ఆ అధికారం ఎవ్వరికీ లేదు- కానీ కొంతవరకు రామమే అది సంపాయించగలిగా” డంది కమల.

“అదే సత్యమయితే రామం చాల అదృష్టవంతుడు, రజనివంటి వ్యక్తి ప్రపంచమంతా కంచుకాగడాతో గాలించినా మరొక్కరు దొరకరు” అన్నాడు ప్రసాద్.

ఆమాట లెందుకోకమలకి రుచించలేదు. కొంచెం వెగటుగా కనబడ్డాయి...అయినా దానిని దిగ మింగి “కనీసం యీ ఓక్క విషయంలోనయినా నేను మీతో సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను” అంది.

చంద్రిక నవ్వుతూ “నేను సంపూర్ణంగా నే అంగీకరిస్తాను. హమ్మయ్య! కమల వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు మన ముగ్గురికి ఈ ఒక్క విషయంలోనే అంగీకారం కుదిరింది” అన్నది.

ఒక అరగంట గడిచిన తర్వాత కమల లేచి నిలబడి: “నేనింక వెళ్ళాలి చంద్రికా! వారు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు'' అంది.

“పద కమలా! నేను నిన్ను భద్రంగా మీ యింటి వద్ద కారులో దిగవిడిచి వస్తాను” అన్నాడు ప్రసాద్.

“వద్దు ప్రసాద్! టాక్సీలో వెళతాను ” అన్నది కమల భయంతో.

అతను నవ్వుతూ “భయపడకు కమలా! నీకేమి ప్రమాదం కలుగకుండా చూచేపూచీ నాది” అన్నాడు.

“నాకు దానితో సంతృప్తి లేదు. నా దారిని నన్ను పోనియండి” అన్నది కమల.

“అయితే నిస్సందేహంగా నేనంటే నువ్వు భయపడుతున్నావు” అన్నాడు ప్రసాద్.

కమల గర్వంతో “భయపడటమనేది నా స్వభావానికి విరుద్ధం ప్రసాద్! పదండి, అని కారు తలుపు తెరచి ముందు సీటులో కూర్చుంది.

ప్రసాద్ మారుమాట్లాడకుండా కారు స్టీరింగువద్ద కూర్చుని స్టార్టు చేసాడు.

కమల పౌరుషంతో, ఆత్మాభిమానంతో చేసింది కాని, మనస్సులో భయపడసాగింది. కారులో కూర్చుంటే ప్రసాద్ తనను తాను మరచిపోతాడని ఆమెకు తెలుసు, కాని యిక చేసేదేముంది? కాసేవు మెదడలాకుండా ఊరుకొని, మనస్సుని పదిలపరచుకోవటానికి ప్రయత్నించింది. విద్యుద్వేగంతో పోతున్న కారులో ఆమె గజగజ వణకి పోయింది. ప్రసాద్ కి ఇంతకు ముందొకసారి జరిగిన అపాయం జ్ఞప్తికి వచ్చింది.

కొంతసేపు పోయిన పిదప కారు నడుపుతూ నడుపుతూ ప్రసాద్ ప్రక్కకు తిరిగి చూచాడు చీర చెంగు తలమీద పూర్తిగా కప్పుకొని, కారు తలుపు కి ఆనుకొని, కళ్ళుమూసుకుని చేతనారహితంగా కూర్చునివుంది కమల. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా వుంది. ఆమె సౌందర్యం అతన్ని సమ్మోహితుని చేసింది. రెండు మూడు నిమిషములు తదేకంగా చూచాడు, పాత ఢిల్లీకి అవతలవున్న నిర్మానుష్యమైన అడవి ప్రదేశంలో కారు తీసుకు వచ్చి, ఆపి, కమలా! అని పిలచాడు అంతా గాడాంధకారం- ఎక్కడా ఏమి అలికిడి లేదు.

కమల ఉలిక్కి పడి, కళ్లు తెరచి “ఎక్కడికి తీసుకు వచ్చారు? ఏమిటీ? చీకటంతా?” అంది.

“చీకటికి అంతా ఎందుకు భయపడతారో నాకర్ధం కాదు కమలా! వెలుగు లేనప్పుడే వ్యక్తుల నిజ మనస్తత్వాలు నిర్మొగమాటంగా, నిర్భయంగా మాట్లాడవచ్చి బయటపడతాయి'' అన్నాడు.

అతని మాటలు ఆమెను ఇంకా భయపెట్టాయి. వెర్రివాని మాటల్లా వినబడ్డాయి.

“మా యింటికి తీసుకు వెళ్ళమంటే ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు! నన్ను మోసగించాలని ప్రయత్నిస్తున్నారా?” అంది భయంతో.

“దారితప్పాను– కమలా! ఆజ్ఞ అయితే మీ యింటికే తీసుకు వెళతాను'' అన్నాడు.

ఎంతో నమ్రతతో అన్న మాటలవి.

ప్రసాద్ నోటి వెంట ఆమెకవి ఎంతో అసహజంగా వినబడినవి. ఆ పరిస్థితిలో కోపగించి ప్రయోజనం లేదని. ఆమె గ్రహించింది.

“నా అజ్ఞయ్యే ఇక్కడకు తీసుకొచ్చారా? చెప్పండి లోలోన మీరు సహృదయులు, ధర్మపరులని తెలుసు... వాటి సహాయాన్నే నేనిప్పుడర్ధిస్తున్నా” నంది.

“ఆలాంటి అనుమానం నీకెందుకు కలిగింది కమలా?” అన్నాడు.

“కలిగినమాట నిజమే నిజంగా దారితప్పి మీరిక్కడికి నన్ను తీసికొని రాలేదు నన్ను మభ్య పెట్టి, భయపెట్టి, నిస్సహాయను చేయటానికి ప్రయత్నించారు” అంది.

“కొన్ని కొన్ని పరిస్థితులలో సత్యం అసత్యంగాను, అసత్యం సత్యంగాను కనబడుతుంది కమలా? ఇక ఇప్పుడు తల వొగ్గడమే గత్యంతరం” అన్నాడు.

“అయితే అది అసంభవమంటావా? అంది కమల.

“అసంభవమని, అది నా చేత కాదనినేననను. కాని ఈ సమయంలో నాకు అలాంటి ఆలోచన కలగ లేదనిమాత్రమంటున్నాను” అన్నాడు.

సహజ స్వరంతో పలికినమాటలు ఆమెని విచలితను చేసాయి-క్రోధంలో అనిన మాటలు కావని ఆమె గ్రహించింది.

“మీరన్న మాటలనినే విశ్వసిస్తున్నాను ప్రసాద్ మీరెపుడైనా ఆలాంటి ఆలోచనలు పెట్టితే నేను అబలనని - నిస్సహాయనని మీరనుకోకండి - ఆత్మహత్య అందరికీ అందు బాటులోనే వుంటుంది” అంది శాంత స్వరంతో.

“ఆత్మహత్య గర్హనీయము. భీరత్వానికి నిదర్శనము కాదా? ఈ మాటలు చెప్పినన్నొకసారి నువ్వు వారించావు” అన్నాడు.

“బలాడ్యులు బలహీనులను నిర్బంధించి నిస్సహాయులను చేసి, ఆత్మాభిమానం బలవంతంగా చూరగొనడానికి ప్రయత్నిస్తే,ఆత్మహత్యకు వెనుకాడితే వారే భీరువులవుతారు. మానవులు ఆత్మహత్యకు వొడిగడతారు ప్రసాద్. జంతువులు ఎన్నడూ అలాంటి పని చెయ్యవు, ఎందు చేతంటేవాటికి విచక్షణాజ్ఞానం, ఆత్మాభిమానం మొదలయినవి లేవు, వాటిని వదలుకొని జీవితాన్ని అంటి పెట్టుకొని, ప్రాకులాడే వ్యక్తులు జంతుసమానులు” అంది.

కమల మాటలు ప్రశాంతమయిన ఆ చీకటిని చీల్చుకొని వెడలివచ్చాయి. ఆమె ముఖకవళికలు చూడటానికి ప్రసాదు ప్రయత్నించాడు. కాని కమల ముఖం పూర్తిగా ప్రక్కకు తిప్పి వేసింది. ఆ మాటలలోని నూతనత్వం అతనిని ఆకర్షించింది. కమల ఆందరి వంటి స్త్రీ కాదని, ఆమెలో వజ్రపుకాఠిన్యత వుందని, అగ్ని లాంటి ఆమె ఆత్మని ఆందుకోవడం అతిదుర్లభమని గ్రహించాడు. మొట్టమొదటిసారిగా అతనిలో నిస్పృహ, నిరాశాజనించాయి.

మెల్లగా “నేను కాలగర్భంలో లీనమయ్యేవరకు నా మనస్సు నిన్ను వెంటాడుతునే వుంటుంది కమలా” అన్నాడు.

కమల హృదయం వొక్కసారి క్రుంగిపోయింది. కళ్ళలో నీరు తిరిగింది. జలప్రవాహాలు చెక్కిళ్ళమీదికి కారసాగాయి, చీర చెంగుతో తుడుచుకోవడానికి అభిమానం అడ్డు వచ్చింది. చీకటిలో గమనించడని కన్నీరుని ఆవిధంగానే కారనిచ్చింది. నిజానికి ప్రసాదు గమనించలేదు కూడా.

“అయినా నీకు వొక వాగ్దానం చేస్తున్నాను కమలా? నీ యిష్టానికి విరుద్ధంగా బలవంతంగా, నిన్ను నేనేమీ చెయ్యను. నీ అంగీకారంతోనే నిన్ను నా దానిని చేసుకుంటాను” అన్నాడు.

ప్రసాద్ మాటలు కమల హృదయంలో బడబాగ్నిని లేవదీశాయి భగభగమని రగిలే ఆ మంటని ఆమె భరించలేకపోయింది. పెదిమలు గట్టిగా బిగించి కళ్ళు మూసుకుని కన్నీరును విడుస్తూ అలాగే వుండిపోయింది.

ప్రసాదు కారు సార్ట్ చేసి వెనుకకు తిప్పి “పద కమలా నిన్ను నీ ఇంటి వద్ద దిగవిడుస్తాను. ఇక ఆలస్యం చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు.

*************

రజని దాదావు ప్రతి దినము విశాల వద్దకు వెళ్తూ వుండేది. రోగులకు సేవ చేయ్యడంలోని తృప్తి, ఆనందము, ఆమెగ్రహించి , అందులో పూర్తిగా నిమగ్నురాలయింది, రోగులకు కూడా ఆమె యెడ అంతులేని అనురాగం, విశ్వాసం ఏర్పడ్డాయి. ఎప్పుడు సంతోషంతో నవ్వుతూ అందరిని నవ్విస్తూ వుండేది. ఆశారహితము, అంధకారబంధురము అయిన వారి జీవితాలకి కాంతి కిరణంలా వారికి కనబడేది. సాయంసమయాలలో వారినందరిని చేరదీసి మథురకంఠంతో పాటలు పాడి వారిని ఆనందపరిచేది. రజని సాయంకాలల్లో రెండు మూడు గంటలు మాత్రమే అక్కడ గడిపేది. మిగతా సమయాలలో విశాల వారిని కనిపెట్టి వుండేది. విరామరహితంగా ఆమె పని చేస్తూ వుండేది. ఒక వైపు రోగుల సేవ. ఇంకో వైపు వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం. రాను రాను ఆమె రెండవ అంశానికే ఎక్కువ ప్రాధాన్యత యిచ్చేది. డాక్టరు సలహాలు కోరినది కూడా అదే, భవిష్యతంతా ముందర వున్న ఆ బాలులను సన్మార్గంలో పెట్టి,సంస్కారం నేర్పి, సహృదయులను చేయడమే ఆమె ప్రధమ కర్తవ్యమని ఈయన మనస్పృతిగా వొప్పుకున్నాడు. అదే రోగులకు కూడా ఎంతో మనశ్శాంతినిచ్చింది. తమ తమ పిల్ల లేవరో వారికి తెలియక పోయినా వారంతా సురక్షితంగా వున్నారనీ, సన్మార్గంలో పెరిగి పెద్ద వారవుతున్నారని అలోచన వారికెంతో వోదార్పు కలుగజేసింది. దానికి ముఖ్య కారణభూతురాలైన విశాల వారికొక దేవతలా కనబదేది.

రోగులలో అనేక రకాల వ్యక్తులుండే వారు. అనేక రాష్ట్రాలకు చెందిన వారున్నారు. వారిలో ఒక వినోద్ అనే పంజాబీ యువకుండుడేవాడు, సుమారు ముప్పై సంవత్సరాల వయసు వుంటుంది. గత మూడు సంవత్సరాల బట్టి హాస్పటల్ లో వున్నాడు . వ్యాధి ఇక కుదరదని నిస్పృహ చెందాడు బి. ఏ, వరకు చదువుకున్నాడు ఉన్నత కుటుంబానికి చెందిన వాడే, ఒకప్పుడు నిండుయవ్వనంలో తొణకిసలాడే అంద మయిన యువకుడు, తనకు సోకిన వ్యాధి కుష్టురోగమని ఎంతో ఆలస్యంగా గ్రహించాడు. వెంటనే యిల్లు వదలి వచ్చేసాడు. తిరిగి తిరిగి చివరకు ఈ ఆసుపత్రిలో చేరాడు. తన స్వగ్రామమేమిటో తల్లిదండ్రులెవరో యింత వరకు ఎవరికి చెప్పలేదు. చెప్పమని డాక్టరు సనల్ కూడా అ బలవంతం చెయ్యలేదు.

ఆశలుడిగిన అతని జీవితానికి ఆశాజ్యోతిలా వెలిగింది. నిరాశతో మరణం కోసం ఎదురు చూసే ఆతని మనస్సులో జీవించాలనే అశ తిరిగి అంకురించింది. రజని ఎక్కువ కాలం ఆతని వద్దే గడుపుతూ వుండేది. అతను కుష్టు రోగి అన్న విషయాన్నే పూర్తిగా మరచీ పోయేటట్లు చేయడానికి ప్రయత్నించేది. ఆ విభేదమేమి పాటించకుండా, అతనితో చనువుగా కలసి వుండేది. అనేక విషయాలు గురించి చర్చించేది. అతనిలో అడుగంటిన ఆత్మవిశ్వాసాన్ని పునరుద్దరించింది. కాని శరీరకంగా ఆతని పరిస్థితి దిన దినము క్షిణించ సాగింది. డాక్టరు సనల్ శక్తి వంచన లేకుండా ప్రయత్నించేడు. ఒక రోజున వినోదు “రజనీ” నీ పరిచయ గత సంవత్సరం కలిగినట్లయితే నా జీవితమే సమకూరి వుండేది. ఈపాటికి నీ సహాయంతో నేను ఈ వ్యాధిని జయించి వుండే వాడిని. అప్పుడు శారీరకంగా శత విధాలా బాగుండేది. కాని మానసికంగా నీ స్నేహంకోసం జీవించాలనితీవ్రమయిన వాంఛ ఏర్పడింది. కానీ శరీరం మరణానికి సంసిద్ధ మవుతూంది. కాని నేను పోరాడుతాను. దైవ కటాక్షము, నీ సహాయము వుంటే నేను సరళలీకృతుడవు తాను” అన్నాడు.

“తప్పక జయిస్తావు వినోద్, జీవించాలనే తీవ్రమయిన కోరిక వున్నప్పుడు ఈ వయస్సులోదేనినైన జయించవచ్చు. క్షణకాలం గూడా మరణం గురించి తలపెట్టవద్దు. శరీరంలోని శక్తులన్నీ కూడదీసుకొని పోరాటం సలుపు, విజయం నీదే! కావాలని మనస్ఫూర్తిగా నేను కాక్షింస్తున్నాను” అంది.

“జీవితంలోని విలువైన వస్తువులన్నీ సమయం మించి పోయిన తర్వాత లభించుతాయి రజనీ, ఇది అతి విషాదకర మయిన విషయం” అన్నాడు వినోద్.

“అది నిజమే కాని ఇంకొకటి కూడా వుంది. లభించిన వస్తువుల విలువపారవేసుకున్న తర్వాత కాని మానవులుగ్రహించరు” అంది.

“నీ స్నేహము, సాంగత్యము , ప్రేమ, లభించాయి, నా కిక వేరే ఇంకేమీ జీవితంలో ఆక్కరలేదు రజనీ! వీటి విలువపార వేసుకోకుండానే గ్రహించగలిగాను. కాని సమయం మించిపోయిందేమోనన్న భయం మాత్రం పడుతున్నాను” అన్నాడు.

రామానికి రజనీఈ విధంగా రోగులతో యింత చనువుగా కలసివుండటం ఇష్టం లేకపోయింది భయంకరమైన ఆ వ్యాధి రజనికి సోకుతుందేమోనని గజగజ వణకిపోయేవాడు, రజనినిబ్రతిమిలాడాడు, బెదిరించాడు, కాని ఫలితం లభించ లేదు. అప్పుడప్పుడు ఆమె వెంట వచ్చేవాడు. కాని అతని రాక వినోద్ కి ఇష్టం వుండేది కాదు. రజనితో వంటరిగా కాలం గడిపే అవకాశం లభించాలని అనేక సార్లు రజనితో ఫిర్యాదు చేసేవాడు. అతను రజనికి రామానికి మధ్య వున్న సంబంధం గ్రహించి ఈర్ష్యతో అనిన మాటలవి. అది రజనిగ్రహించింది. ఒకటి రెండుసార్లు అని మందలించినా అతను వూరుకునేవాడు కాడు కాని “నేను కుష్టు రోగిని నన్నిలా అవమానిస్తున్నావు రజనీ, రోజుకి రెండు మూడు గంటలు నాకు నీ సాంగత్యం లభిస్తోంది. మిగతా కాలమంతా వారి వద్ద గడపు. ఈ రెండు మూడు గంటలలోను, వారెందుకు నా ఆనందానికి అడ్డు రావాలి? అనేవాడు. ఒకటి రెండుసార్లు రామంతోనే ఆ విధంగా మాట్లాడాడు. దానితో రామం చాలా బాధపడి చాలావరకు రావడమే మానేసాడు. ఎప్పుడయినా వచ్చినావిశాలవద్ద కాలం గడిపేవాడు, రజని ప్రవర్తనలో కూడా ఒక విధమైన మార్పును గమనించాడు, పూర్వపు చిలిపితనం, ఆమెలో క్షీణించి పోయింది. ఒక విధమయిన వుదాసీనత్వము జడత్వము ప్రవేశించాయి. అప్పుడప్పుడతనిని తప్పించుకుంటున్నట్లు కూడా అనుమానం వేసింది. దీనికంతా వినోద్ కారణమని భావించాడు. ఒక రోజున విశాలతో ఈ విషయం చెప్పాడు.

“రజనిని అపార్థం చేసుకుంటున్నారు. మీరు రోగి మనస్తత్వం మీరు గ్రహించలేకపోయారు. రజని గ్రహించింది. ఇలాంటి విషయాలను వారు హృదయానికి పట్టించుకుంటారు. వారికి మానసిక తృప్తి లభిస్తే వ్యాధి కుదిరిత్వరగా నయమవుతుంది. రజని తన బుద్ధి కుశలతని శక్తి సామర్ధ్యాలను అంతా వినియోగించి వినోద్ ప్రాణాలను రక్షించాలని ప్రయత్నిస్తోంది . కొంతవరకు మీకు బాధ కలిగినా ఆమె ప్రయత్నానికి అడ్డు వెళ్ళటం సమంజసం కాదు. అనవసరంగా ఆమెను కూడా కష్టపెట్టినవారవుతారు” అంది విశాల.

“ప్రాణపదంగా ప్రేమించి రజనిని పరాయి పురుషుడు ‘ప్రేయసీ' అని నా యెదుటే సంచరిస్తూవుంటే నే నెలా ఊరుకోను విశాల? అన్నాడు.

“ఇక వేరే గత్యంతర లేదు. రామం బాబూ ప్రపంచములో అందరు ప్రియులే అనే భావం మీరు అలవరచుకోవాలి? రజనీ ఆ పిలుపు అంగీకరించడానికి కారణం వుంది. రోగులకు, ముఖ్యంగా యీలాంటి వారికి తనను యింకొకరు ప్రేమిస్తున్నారని వారి ప్రేమ కోసం జీవించాలని, తీవ్రమైన కోరిక కలిగినప్పుడు వ్యాధి నయమవడానికి అవకాశాలు చాలావున్నాయి. అందుకోసమే రజని ఇలా సంచరిస్తోంది. మృత్యువునే ఎదిరించడానికి రజని ప్రయత్నిస్తోంది. మీరు యీర్ష్య, ఆభిమానాలు ప్రదర్శించకుండా ఆమె ప్రయత్నానికి సహాయం చేసి వుంటేమీరంటే ఆమె హృదయంలో గౌరవం ఏర్పడుతుంది. చివరకు అది మీ మంచికే దోహదమవుతుంది” అంది.

రామం దీర్ఘంగా నిట్టూర్చి, “ఏమో విశాలా? చివరకు ఏమవుతుందో ఎవరికి తెలుసు. అపరిచితులంటే రజని కెందుకో ఇంత అప్యాయత. అపరిచితులయిన అమెరికన్ దంపతులు రజనిని తీసుకుపోవటానికి , ప్రయత్నించారు. ఎంతో కష్టం మీద ఆమెను దక్కించున్నాను. చివరకు ఈ అపరిచితుడు నాకు ఆమెకు కాకుండా చేస్తాడేమోనని భయంగా వుంది” అన్నాడు.

“అధైర్యపడకు రామం చివరకు అన్నీ సవ్యంగా జరిగిపోతాయి” అంది.

“వినోదుని మరణం నుంచి రక్షించడానికి రజని వేస్తున్న పధకమని నాకు నమ్మకం గలిగినట్లయితే నేను నిశ్చితంగా వుంటాను. కాని అదే కుదరటం లేదు. ఆమె నిజంగా మనస్సులో నా కన్యాయం చేస్తోందేమోనని నాకు భయంగా వుంది” అన్నాడు.

“రజనినే అడగకూడదా? రాంబాబు నిస్సంశయంగా ఆమె మీకు ఆమె మనస్సు విశదపరుస్తుంది” అంది.

“అడగటానికి నాకు ధైర్యం చాలటం లేదు విశాలా! ఆమెపై నా అధికారాన్ని ఆమె ఏ విధంగానూ ఎప్పుడు గుర్తించలేదు. నా ప్రశ్నకి ఆమె సమాధానంఊహించినంత మాత్రనే నాకు భయం వేస్తోంది” అన్నాడు.

రామం మనోవేదన విశాల అర్థం చేసుకుంది. రజని విషయం ఆమెకు తెలుసు. ఆ విషయంలో ఆమె చేయగలిగింది శూన్యం .

“రజని మనస్సుని అర్థం చేసుకోవడం చాలా కష్టం రామం బాబూ? ఏ క్షణంలో ఆమె ఏం పని చేస్తుందో ఊహించడం కూడా కష్టం. అధికంగా ఆమెపై ఆశలు పెట్టుకోవడం అనర్థానికీ అథారమవుతుందేమోనని నాకనిపిస్తోంది” అంది.

రామం నిట్టూర్చి “అది నాకు తెలుసు విశాలా? నాకు రజనికి భూమ్యాకాశాల వ్యత్వాసముంది. భూమి ఆకాశాన్ని ఎప్పుడూ అందులో లేదు, కనికరం కలుగుతే. ఆకాశమే భూమినందుకోవచ్చు. “అదే నా ఆశ” అన్నాడు.

కాలం గడిచిన కొలది రజనీ, వినోదుల సఖ్యత రామానికి నిజంగా ఎంతో మానసిక సంక్షోభ కలిగించింది. ప్రతి రోజు సాయంత్రపు కాలమంతా అతనివద్దే గడుపుతూవుండేది. శలవుదినాల్లో అతని ప్రక్కనే కూర్చుని కాలం గడుపుతూ ఉండేది. చూపరులకు వారిరువురు ప్రేమికులులా కనబడేవారు. రజని రామంతో పూర్వపు చనువుని కొంచెం సడలించింది. బాహ్వనేత్రాలకి అది ఏమంత మిన్నగా కనబడదు. కాని అది రామం గుర్తించకపోలేదు. అతను గుర్తించినది ఇంకొక విషయముంది. ఒక వినోద్ తో తప్ప ఆమె మిగతా అందరితోను ఆవిధంగానే ప్రవర్తిస్తోంది. అందులో విచక్షణ, పక్షపాతము లేదు. కమల కమలాకరం కూడా ఆమె ప్రవర్తననుచూచి ఆశ్చర్యపోయారు. కమల నిర్భయంగా ఒక రోజున రజనిని ప్రశ్నించింది“కొత్త స్నేహితులు దొరికారని, పాతమిత్రులను చిన్న చూపు చూడటం సమంజసం కాదు రజనీ!” అంది.

రజని నవ్వి “నూతన మిత్రులు కూడా కలకాలం నూతనంగా ఉండరు కమలా! వారుకూడాపాతబడతారు. అప్పుడు పాతవారు కొత్తవారవుతారు. ఆ సమయంకోసమే మనమంతా వేచివుండాలి” అంది.

రజని ఒక రోజు డాక్టర్ సనల్ ని ప్రశ్నించింది “డాక్టర్! వినోద్ పరిస్థితి ఎలావుంది? ప్రాణప్రమాదం ఇంకా వుందా?” అన్నది.

సనాల్ మందహాసం చేస్తూ ”నీ ప్రయత్నంవల్ల పరిస్థితి ఎంతో మేలయింది రజనీ! పూర్తిగా ఆశలువదలి వేసిన అతని ఆరోగ్యంలో ఇంత మార్పు వచ్చిందంటే అదంతా నీ కృషి ఫలితమే, ఇదేరీతిలో యింకా కొంతకాలం పురోగమిస్తే ప్రమాదం తప్పవచ్చు. కాని ప్రస్తుతం గండం యింకా పూర్తిగా గడవలేదు”అన్నాడు.

“ఈ ప్రమాదం ఏవిధంగా సంభవిస్తుంది డాక్టర్ ? కుష్టురోగులు కేవలం ఈ వ్యాధి కారణంవల్లనే మరణించరని నేను ఎక్కడో చదివాను” అంది.

“అది నిజమే రజనీ! ఎవరూ కేవలం ఈ వ్యాధి కారణము చేత మరణించరు. ఈ వ్యాధి శరీరాన్ని ఎంతో బలహీనము చేస్తుంది. శరీర పరిస్థితి అలా వున్నప్పుడే ఏ యితర వ్యాధులైనా లోన ప్రవేశించి, పూర్తిగా వశపరచుకొని, మరణము కలిగించవచ్చు. ఇదే ప్రమాదం” అన్నాడు.

“అయితే ఈ ప్రమాదం నుంచి అతన్ని రక్షించటానికి చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటి?” అంది.

“రజనీ! చెయ్యగలిగినదంతా నువ్వు చేస్తున్నావు... నేను చేస్తున్నాను. ఇంతకు మించినదంతా దైవం చేతుల్లో వుంది” అన్నాడు.

రజని వినోద్ లో మానసిక స్థయిర్యాన్ని నెలకొల్పగలిగింది. కాని దాని ఫలితంగా రజని వినోద్ కి ఎంతో సమర్పించవలసి వచ్చింది. ఎప్పుడు అతను ఆమెనోటి వెంట ప్రేమపూరిత వాక్యాలు ఆశించేవాడు. ఇతరుల ఎదుట కూడా గర్వంగా ఆమె తన ప్రేయసి అనే భావం కలిగేటట్టు ప్రవర్తించేవాడు. ఆమె సాధారణంగా మౌనం వహించేది. కాని ఆ మౌనంలో కూడా అయిష్టతని ప్రదర్శించేది కాదు. అదే ఆమెలోనీ ఔన్నత్వమనేది విశాల “అదే నన్ను బాధపెడుతోంది” అనేవాడు రామం.

ఒకనాడు సాయంకాలం రజనీ ఆస్పత్రికి ఆలస్యంగా వచ్చింది. వినోద్ పక్క వద్దకువచ్చి చూస్తే అక్కడతను కనబడలేదు. కంగారుపడుతూ ఆమె బయటకు వచ్చి అంతా వెతికింది. వెదకగా వెదకగా ఆస్పత్రికి దూరంలో వున్న ఒక చెట్టు క్రింద కూర్చుని వున్నాడు.

రజని కంగారుపడుతూ “ఇక్కడ ఏం చేస్తున్నావు వినోద్ - ఎవరికీ చెప్పకుండా ఎందుకిలా వచ్చేసావు” అంది.

వినోద్ కోపంతో “నేను ఎక్కడ వుంటే నీకెందుకు” రజనీ! నీ ఆప్తులు, కావలసిన వాళ్ళు వేరొక చోటున్నారు. వారి వద్దకు వెళ్ళు, నా దారిన “నేను చస్తాను” అన్నాడు.

ఆమె అతని కోపానికి కారణం అతని ఆలోచనలు గ్రహించింది. నవ్వుతూ “అదంత సులభం కాదు వినోద్! దానికి కూడా నా అనుజ్ఞ కావాలి” అంది .

“నేను పగలల్లా సాయంకాలం ఆరుగంట లెప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంటాను. అరుగంటలయిన తరువాత కూడా ఆలస్యమయితే నేను భరించలేను” అన్నాడు.

రజని కాస్త విసుగ్గా ఆలస్యానికి కారణాలుంటాయి వినోద్. ఆఫీసులో ఆలస్యమవుతూంటుంది. బస్సు సమయానికి దొరకకపోవచ్చు. వెంటనే తనను తాను సంబాళించుకొని ఓక్షణకాలం ఆగి “నాకుమట్టుకు ఆలస్యం అయితే బాధగా వుండదా?” అంది.

చివరి వాక్యంలో అతని కోపం అంతరించిపోయింది. ఆమె కళ్ళల్లోకి ఆశగా చూస్తూ “నామీద నీకు నిజంగా ఇంత ప్రేమ ఉందంటే నేను అప్పుడప్పుడు నమ్మలేక పోతుంటాను రజనీ! నీలాంటి అపురూపు సౌందర్యవతి నన్ను ప్రేమించటానికి నాలో ఏముంది? అందరు అసహ్యించుకొనే నామీద నీకు ఇంత ఆదరం ఎందుకు?”అన్నాడు.”

“ఇతరుల అసహ్యానికి అర్ధం లేదు వినోద్. ఎవరికైనా జబ్బు చేస్తే మనం ప్రదర్శించవలసింది ఆదరం, సానుభూతి కాని అసహ్యం కాదు” అంది.

“రజనీ! నేను నిజంగా తిరిగి ఆరోగ్యవంతుడవడమే తటస్థిస్తే నీకోసమే. జీవితంలో నాకిక వేరే కర్తవ్యం లేదు” అన్నాడు.

“అది తరువాత ఆలోచించవలసిన విషయం. నీ మొదటి కర్తవ్యం ఆరోగ్యం బాగు చేసుకోవడమే. ఇప్పటికీ నీగమ్యస్థానమది” అంది.

“జీవితంలో చేరవలసిన గమ్యస్థానాలన్నిటికి నీ చేయూత కావాలి రజనీ! లేకపోతే నేను నిస్సహాయుడను” అన్నాడు.

ఆ మాటలు రజనికి రామాన్ని గుర్తుకుతెచ్చాయి . ఈ యిరువురిది సుమారు ఇవే మాటలు. అతని నోటి వెంటకూడా వచ్చాయి. ఈ యిరువురిలోను తన కర్తవ్యం ఎక్కడుంది? సమాధానంకోసం ఆమె ఆట్టే తడుములేదు. అతని ఆరోగ్యం బాగయేవరకు ఇతనియందే వుంది. ఆ తర్వాత ... ఆ తరువాత అప్పుడాలోచించవచ్చు. అయినా ఆమె హృదయంలో ఆ ప్రశ్నకు కూడా సమాధానం తెలుసు.

****