Aprasyulu - 6 books and stories free download online pdf in Telugu

అప్రాశ్యులు - 6

అప్రాశ్యులు

భీమేశ్వర చల్లా (సి.బి.రావు)

6

మరునాడు సాయంకాలం రామం, రజని కలుసుకొని విశాలకోసం ఎదురు చూడసాగారు. రైలు గంటన్నర లేటు అని తెలిసింది. ప్లాటు ఫారంమీద వున్న బెంచీపై కూర్చుని మౌనంగా వున్నారు.

రామం హఠాత్తుగా జేబులోంచి వొక ఉత్తరం తీసి రజని చేతిలో కిచ్చి “యిది చదువుకో రజనీ” అన్నాడు.

“ఎవరి ఉత్తరం” అంది రజని.

“మా నాన్నగారిది. నువ్వు చదవకూడనిది ఇందులో ఏమి లేదు అన్నాడు. రామం.

రజని వుత్తరం చదివి నవ్వుతూ “శుభవార్త ఎప్పుడు పెళ్ళి” అంది.

ఆ మాటలు విని రామం మనస్సు చివుక్కుమంది. రజని బాధపడుతుందనీ, విచారం వ్యక్తం చేస్తుందనీ అనురాగపువాక్యాలు పలికి పూరడిస్తుందనీ వూహించుచున్నాడు.

“నీకిది శుభవార్త కావచ్చు రజనీ కాని నాకిది ఎంతో దుఃఖవార్త. నువ్వింక చెప్పవలసింది ఇంకేమీ లేదా? అన్నాడు రామం.

“చెప్పవలసిందింకేమి లేదు రామం బాబూ కాని మీరు గ్రహించవలసింది చాలా వుంది” అంది రజని.

రామం ప్రక్కకు ముఖం త్రిప్పుకుని మౌనం వహించాడు. ఆతని ముఖంమీద వేదనా రేఖలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీర్ఘంగా నిట్టూర్చి “భవిష్యత్తంటే నాకెందుకో యీ రోజుల్లో భయం వేస్తుంది రజనీ. జీవితపు శకటానికి నేను సారథ్యం వహించుకోలేననీ, యితరుల సహాయం అర్థించవలసిన అగత్యం ఏర్పడిందనీ నాకనిపిస్తుంది. ఆ బిక్ష్యం ఎవరినుంచి యాచించనా అని ఆలోచిస్తున్నాను ”అన్నాడు.

“సహాయం లభించవచ్చు. కాని సారథ్యం మీరే వహించాలి రామం బాబూ ! ఆ శక్తి ఎవరికయినా లోపించే వుంటే వారు అర్ధ జీవులు మాత్రమే జీవితమంతా వారికి దుఃఖమయంగానే వుంటుంది. దుర్బలత్వంనుంచే దుఃఖం ఆవిర్భవిస్తుంది” అంది.

రజని మాటలలో కాఠిన్యతా, నిశ్చయము రామాన్ని ఎంతో దుఃఖపరచాయి.“అవసరమయితే జీవితంలో నీ సహాయం నాకు లభిస్తుందా రజనీ?” అన్నాడు.

“అది ఎప్పుడూ అందరికీ లభిస్తుంది రామం బాబూ! కాని ఒక విషయం మీకు చెప్పాలని చాలా కాలంపట్టి అనుకుంటున్నాను. ఇది సరియైన సమయం కాకపోయినా చెప్తాను. యింకొకరి పై హద్దును మించిన అనురాగము ప్రేమా కలిగినట్లయితే అది ఎప్పుడూ దుఃఖానికే దారితీస్తుంది. ఆకర్షణ సహజమే కాని, అది అయస్కాంతపు ఆకర్షణలాంటిదయితే అది అసంతృప్తి, అశాంతి కలుగజేస్తుంది” అంది.

రామం దుఃఖపూరిత కంఠస్వరంతో “మనస్సుని శాసించి అదుపులో వుంచుకోవడమెలాగో చెప్పురజనీ! ఈ విద్యే నాకు నేర్పావంటే నేను నీకు జీవితాంతం దాసోహం చేస్తాను. నీమాట జవ దాటను” అన్నాడు.

రామం మాటలలోని వేదన, అశాంతి రజని గ్రహించింది. సాధారణంగా ఆమె జవాబుగా ఏదో పరిహాస వాక్యాలు పలికి వుండేది. కానీ రామం ముఖకవళికలు కంఠ స్వరం ఆమెని వారించాయి. క్షణ కాలం మౌనం వహించి “ఈ ప్రశ్నకు సమాధానం నేనేమి చెప్పలేను రామం బాబూ! బహుశా విశాల చెప్పగలదేమో” అంది.

“విశాల చెప్పగలిగినా అది అక్కరలేదు రజనీ. మనస్సులోనే అణచుకోలేని అనురాగానికి ఆమెకీయేమి సంబంధం లేదు” అన్నాడు.

రజనికి రామం ఆ విధంగా విచారంగా మాట్లాడం యిష్టం లేకపోయింది ఆ సంభాషణ కట్టిపెట్టుదామనే ప్రయత్నంలో నవ్వుతూ “సంబంధం వున్న వారు సంశయిస్తున్నారని బాధపడకండి రామం బాబూ! సమయానికి వారు సంసిద్ధులై వుంటారు. ముందర కాస్త ఆ స్టేషన్ మాస్టారిని వెళ్ళి అడగండి. కౌల్లా మెయిల్ తరలి వస్తోందో, లేదో కనుక్కోండి ఈ రాత్రి సింహాసనం మీద కూర్చుని, కూర్చొని వొళ్ళంతా కాయలు కాచిపోయాయి. మీకు బొత్తిగా యితరుల ధ్యాసే వుండదు. కాస్త ఆ వెయిటింగ్ రూమ్ లో కూర్చోబెడితే మీ సొమ్మేమయినా పోతుందా చెప్పండి” అంది.

“తప్పు నాదే. కాని నువ్వు అంత సుకుమారివని నేనూహించలేదు” అన్నాడు.

“సుకుమారిని కాక శూర్పణఖనా నేను? నా శరీరం కేసి ఒక సారి చూడండి, ఎంత పల్చగా మెత్తగా నున్నగా వుందో ఈ కుడి చెయ్యి ఒక్కటే కాస్త బండ తేరింది అని అంటూ అర చేయి రామానికి చూపింది. అ చేయి మృదువుగానే వుంది. కాని చూపుడు వేలు చివర కాస్త గోధుమ రంగులో వుంది.

అది చూసి రామం వ్యాకులపాటుతో "అదేటిమి రజని”

“ఏమి లేదు. వీణ వాయిస్తున్న వాళ్ళందరికీ అలాగే వుంటుంది. తీగలను మీటుతూ వుంటే కొన్నాళ్ళకి అది కూడ మాసిపోతుంది” అంది రజని.

“నువ్వు వీణ వాయిస్తావని నాకు తెలియదు రజనీ. నీ దగ్గర ఇప్పుడు వీణ లేదే? అన్నాడు రామం.

“ఒకప్పుడు వుండేది రామం బాబూ! కాని యిప్పుడు లేదు, అవసరానికొకసారి అమ్మివేసాను. ప్రసాద్ కొని వొకటి ఇచ్చాడు. కాని అది అక్కడే వదలివచ్చాను” ఉంది.

“నేను కానుకగా యిస్తే స్వీకరించగల సహనం నీలో వుందా రజనీ? లేక కృతజ్ఞతను ఆశించే నన్ను ఈ విధంగా బంధించాలని చూస్తున్నానని నన్ను నిందిస్తావా!” అన్నాడు.

“సహనం వుంది రామం బాబూ! కాని సమయం కాదు నేను ఏది ఇతరులవద్ద నుండి వొక విధమైన అంగీకారము, ఒడం బడిక లేకుండా స్వీకరించిను పరులకు ఋణపడటమనేది నాకు గిట్టదు” అంది రామం నిట్టూర్చి “అది సహజమని నేననను. కాని నేను పరాయి వాడిని కాను ఆత్మీయుడనని నువ్వే వొకసారి అన్నావు అది అప్పుడే మరచిపోయావా?” అన్నాడు.

“మరవ లేదు. కాని మీరు ఋణపడదగిన ఆత్మీయులు కారు. దానికి కారణంకూడ యిప్పుడే చెప్పాను. జీవితంలో మీరు బంధనాల్ని, గొలుసుల్ని తెంచి వేసుకోవాలి. అంత వరకు మీరు ఆత్మీయులయినా పరాయి వారు మాత్రమే'' అంది.

మాటలలో పడి వారిరువురు రైలు ప్లాటుఫారంమీదకు వచ్చేవరకు వారుగుర్తించలేదు. కంగారుగా లేచి వారు ఫస్టుక్లాసు, రెండవ క్లాసుపెట్టెలు వెదక సాగారు. కాని ఎక్కడా విశాల కనబడలేదు. వ్యాకుల చిత్తురాలైన రజని వెనకాల ఎవరో వచ్చి ఆమె కళ్లు మూసి “విశాలని ఎక్కడ వెదకాలో నీకింకా తెలియలేదా రజనీ? అంది.

రజని కళ్లు తెరచి “లేదు విశాల? నాకు అనుమానంగానే వుంది. కాని మాటలలోపడి రైలు రాకను గుర్తించలేదు. అందుకనే దగ్గరగావున్న పెట్టతో మొదలు పెట్టాను” అంది.

రామాన్ని ఇప్పటివరకు విశాలగుర్తించలేదు. కాని రామం విశాలను పరీక్షించి పరిక్షించి చూస్తున్నాడు. విశాల రజని రూపంతో పోల్చి చూసుకుంటున్నాడు. రజనికి ఆమెకివున్న వ్యత్యాసము గమనిస్తున్నాడు, రజనిది పచ్చనిబంగారుఛాయా. విశాలది లేత తెలుపు. రజనికన్న కాస్త బొద్దుగా వుంది కళ్లు అట్టే పెద్దవి కాక పోయినా ఆమె చిన్నది లక్క పిడతవంటి నోరు, చిన్నముక్కు, వాటికి అందాన్నిస్తున్నాయి. నల్లటి జుట్టు చక్కగా సిగ చుట్టబడివుంది కలిమిరంగు చీర నిండుగ ధరించివుంది. అప్పుడే రజని. రామాన్ని విశాలకు పరిచయం చేసింది. విశాల సన్నగా నవ్వుతూ, మీ గురించి రజనీ చాలా వ్రాసింది రామం బాబూ! కానీ మీ పరిచయం కలిగే భాగ్యం యింత త్వరగా లభిస్తుందని నేనూహించ లేదు” అంది.

రామం సమాధానం చెప్పేలోపల “రజని నువ్వువూహించక పోవచ్చు. కానీ వారు యీ తరుణంకోసం ఎంతో కాలంపట్టి ఎదురు చూస్తున్నారు” అంది విశాల.

అసంగతమైన ఆ మాటలు రామంలోని కోపాన్ని ప్రేరేపించేయి, ముఖమంతా ఎర్రబడింది. అది గమనించి రజని‘ఇంకొక విషయం నీకు ముందరే చెప్పి హెచ్చరించాలి. విశాలా! వీరికి కోపం ఎప్పుడూ ముక్కు మిద మఠం వేసుకు వుంటుంది. చీటికి మాటికి గంతులు వేసి క్రిందకు వూరుకుతూవుంటుంది. అది నిజంగా విజృభించిందంటేమనమంతా భస్మమయి పోతాము” అంది.

విశాల మందహాసం చేసి రామం కళ్ళలోకి చూస్తూ నవ్వింది.

“మీరు రజని మాటలని ఆట పట్టించుకోకూడదని నేను చెప్పనవసరం లేదనుకుంటాను. ఆమె చిలిపితనం మీకు తెలియలేదనుకుంటాను” అన్నాడు రామం.

“ఆ విషయంలో మీరేమి ఆపోహపడనవసరము లేదు రామం బాబు, రజని నాకు బాగా తెలుసు పరాచకాలాడుతుంది. కాని ఆమె అసత్యం పలుకదని నాకు గట్టి నమ్మకం” అంది విశాల.

పోర్టరు నెత్తిన సామాను యెత్తుకుని, కాసేవు ఎదురు చూచి వీరి సంభాషణకు అంతం లేక పోయేటప్పటికి విసుగుతో బయటకు వెళ్ళిపోయాడు. అది గమనించి రజని “అరె! మాటల్లో పడి సామాను మాట మరచిపోయాము, పోర్టరు బయటకు వెళ్ళినట్టున్నాడు. నేను బయటకు వెళ్ళి వెతుకుతాను అని వెళ్ళబోతూంటే రామం కంగారుగా రజని చెయ్యిపట్టుకొని ఆపి, ఆగు రజనీ! నేను వెళతాను” అని చరచరా బయటకు వెళ్ళిపోయాడు, విశాలతో వంటరిగా వుంటానికి భయపడి అలా ప్రవర్తించాడని గ్రహించింది.

“పద విశాల, మనం కూడా బయటకు వెళదాము. సామాను గుర్తు ఆయనకు తెలియదు, పోర్టరునికూడా ఆయన చూచివుండరు. ఇక ఆయన గుర్తుపట్టడం అసంభము” అంది రజని.

విశాల- “కాని వారు అప్రయోజకులు కారు రజనీ! అసహాయశూరులా అని అనుమానంగావుంది. బయటకు పోయి చూద్దాం . నువ్వనేది నిజమో కాదో తెలుస్తుంది రజని”

స్టేషను బయటకు రామం పోర్టరు కోసం వెదుకుతూ విశాల ఎదుట తన ఆప్రయోజకత్వం కనబడిపోతుందేమో నని భయపడసాగాడు. కాని పోర్టరు రామాన్ని గుర్తించి సామాను దగ్గరకు తీసుకువచ్చాడు. దానితో రామం మనస్సు కుదుటపడింది. సామాను టాక్సీలో వేయించి పోర్టరుకి డబ్బులు యిచ్చి పంపించి వేసాడు. సరిగ్గా అదే సమయానికి రజనీ, విశాల స్టేషనులో నుంచి బయటకు వచ్చారు. సామానంతా టాక్సిలో వుండటం చూచి విశాల రజని కళ్ళలోకి చూచి చిలిపిగా నవ్వింది. రజనికూడా ఆ దృశ్యం చూచి ఆశ్చర్యపోయింది. విశాలతో వేసినపందెంలో ఓడిపోయినా ఆమెకెందుకో సంతోషం కలిగింది. రామం ఆమె భయపడినంత నిస్సహాయుడు, నిర్భలుడు కాదనుకుంది.

ముగ్గురూ టాక్సీలో బయలుదేరారు. విశాల “నన్ను ఎక్కడకు తీసుకు వెళుతున్నావు రజనీ! ప్రసాద్ ఇంటికేనా?” అంది

“కాదు, విశాలా! రజని ఇంటికి” అంది.

అప్పుడు రజనికి విశాలకు జరిగినదంతా విశదీకరించి వెల్లడి చేసింది. అంతా విని, విశాల దీర్ఘంగా నిట్టూర్చి “నీలోని నిర్భయతే నన్ను భయపెడుతూవుంటుంది రజనీ?” అంది,

“భయపడవలసినదేదీ లేదు విశాలా! బాధ్యతలు ఎక్కువయ్యాయి. అంతే” అంది.

“కాని నీ బాధ్యతలు బరువుగా వుంటాయి రజనీ! మనస్సు చిక్క పెట్టుకోవడం అప్పుడే కష్టం” అందివిశాల.

“రామం బాబు నన్ను మనస్సుని శాసించటమెలాగో చెప్పమని నన్ను అడిగారు, నేను చెప్పలేను కాని మీ విశాల చెప్పగలదేమో అన్నాను – అంది.

“చెప్పమంటారా రామం బాబూ!” అంది విశాల

“చెప్పండి” అన్నాడు రామం.

“మనస్సుకి స్వేచ్ఛా స్వాతంత్యాలు యిచ్చేమంటేఅది మనస్సు సన్మార్గంతోనే నడుపుతుంది. అణచి వుంచాలని ప్రయత్నించినప్పుడే అది విజృంభిస్తుంది. సాధారణంగా మనస్సు కోరే కోరికలు అసహజమయినవి కావు సహజమే వాటిని అసహజంగా పరిగణిస్తుంది. మన నవీన నాగరికతే వాటికి ప్రబల శత్రువు.కాని కోరికలకి లొంగిపోవడంలో ఘనత లేదు. వాటిని నిగ్రహించుకోవడంలోనే మానవతత్వం వుంది” అంది విశాల.

“నేనడిగింది మనస్సుని ఎందుకు శాసించాలని కాదు. ఎలాశాసించాలని మాత్రమే” అన్నాడు రామం.

“ఆలోచనల్ని మనం అరికట్టలేము కాని ఆచరణని అదుపులో వుంచుకోవచ్చు. దీనికి ఇంద్రియ నిగ్రహం కావాలి. దీనిని ప్రయాసతో, పట్టుదలతో అభ్యసించవచ్చును. ఈ విద్య కరతలామలకమయినవారే వుత్తములు” అంది విశాల.

విశాల దృక్పథానికి, రజని ధృక్పథానికి వున్న వ్యత్యాసం రామాన్ని ఎంతో ఆశ్చర్యపరచింది. కట్టుదిట్టాలు, క్రమబద్ధాలు ఉంటే రజనికి గిట్టవు. సభ్యతా సభ్యతలు, నీతి నియమాలు మానవనిర్మితా లంటూంది. పరులకు హాని కలిగించక పోవటమే జీవితంలోని ఓకే ఒక సత్యం ఉంటుంది. కోరికల్ని అణచుకోకూడదు పాపమునే పేరుతో పిరికివారు మనల్ని చెదరగొట్టుతూవుంటారు. కాని విశాల కోరికల్ని అణచుకోవటంలోనేఔనత్యముందంటుంది.ఆశక్తి లభించినవారే వుత్తములు. జంతుజాలానికి మనకి వున్న ముఖ్య విభేదమీదే. కోరిక కలిగిన వెంటనే ఆ వాటిని తీర్చుకుంటాయి. మానవులు సమయా సమయాలు, యుక్తాయుకాలు, పరిసరాలు, పరులు-వీటన్నింటిని గుర్తించి ఆలోచించాలి.

“మీ మాటలు రజని అంగీకరించదని మీకు తెలుసును కాదా? నేనే ఆ మాటలు అనినట్లయితే ఆమె ఎగతాళి చేసి “ఆత్మవంచకులు, అప్రయోజకులు అని వుండును” అన్నాడు రామం.

“ఆలాంటివారు మీరు కారని నిరూపించుకునే బాధ్యత మీ మీదే వుంది రామం బాబు.” అంది విశాల.

రజని కూడా నవ్వుతూ “అదికూడా అవసరం లేదు విశాలా, వారలాంటివారు కారని వారికే నమ్మకం లేదు. ఇతరులను నమ్మమనుట న్యాయమా చెప్పు! పైగా ఆయనకి ఏమన్నా పట్టపగ్గాలు లేనంత కోపం వచ్చి నోటికొచ్చినట్లు నానామాటలు అంటారు. నన్ను వారన్న మాటలన్ని చెప్పేనంటే... అమ్మోయి” అని గట్టిగా అరిచింది.

తను ఆమెను అన్న మాటలు చెప్పి వేస్తుందేమోనే భయపడుతూ కంగారుగా రామం ప్రక్కనే కూర్చునివున్న రజని కాలు గట్టిగా తన బొటన వ్రేలుతో ఒక్కసారి నొక్కాడు. బాధతో గట్టిగా ఆరిచి కుడి వేలు బయటకు తీసి చూసుకుంది. పచ్చటి ఆ చిన్న పాదమంతా ఎర్రబడింది. ఒక చోట కొంచెం చర్మం కూడా వూడివచ్చింది. అది చూచి రామం ఎంతో వ్యధనపడ్డాడు. రజనియెడ అపరిమితమైన జాలి, తన యెడ అసహ్యముతో హృదయమంతా నిండిపోయింది.

“చూడు విశాలా! ఎప్పుడూ ఇలాంటి పనులే చేస్తారు, బొత్తిగా మొండిమనుష్యులు. లేకపోతే అందరూ పూజించే యీఅందమైన పాదాన్ని అహంభావంతో ఇలా బూటుతో తంతారా రా చెప్పు! ఇదేనా వారి మగతనం” అంది రజని.

రామం వ్యాకులపాటుతో విశాల కేసి తిరిగి, “మీరు నన్ను అపార్థం చేసుకోకండి. నేనలాంటి కఠినహృదయుడనని కిరాతకుడనని, మీరనుకున్నారంటే నాకు చాలా బాథగా వుంటుంది” అన్నాడు.

“చూచావా విశాలా! వీరు కనీసం విచారమైనా వ్యక్తం చెయ్యలేదు. నాతో ఒక్క మాటైనా మాట్లాడకుండా నీతో ప్రగల్భాలు పలుకుతున్నారు” అంది రజని.

విశాల నవ్వుతూ.“నీరన్నదే నిజం రజనీ, చేష్టలకే మనం ప్రాధాన్యతనిచ్చేమంటే ప్రపంచంలో అంతా తల క్రిందులవుతుంది. అయినా మీ యిద్దరిమధ్యా నాకెందుకు? ఇంతకు ఈ టాక్సీ ఢిల్లీ అంతా తిరుగుతున్నట్లుంది. అప్పుడే మీటరు అయిదురూ రూపాయిలు చూపిస్తున్నది. ఇంకా ఎంత దూరం రజనీ!'' అంది.

“అదిగో! ఆ కనబడే పెద్ద మేడ పక్కన చిన్న యిల్లు వుంది. చూచావా!?” అంది.

ఇంటికి చేరుకునేసరికి తొమ్మిది గంటలయింది. లాడ్జికి వెళ్లి పోతానంటే విశాల వెళ్ళనివ్వలేదు. భోజనం చేసినతర్వాత బయలు దేరిపోతూంటే, రజని “రామంబాబు రేపు ఆదివారం విశాలను కాస్త అటు యిటు త్రిప్పుదాము. టూరిస్టు బస్సొకటి ఉదయమే బయలు దేరి ముఖ్యమైన ప్రదేశాలను త్రిప్పి తిరిగి సాయంకాలం చేరుస్తుంది. దానిమిద వెళ్ళితే యెంతో సునాయాసంగా అన్నీ చూపించవచ్చు. మీరు వుదయమే యిక్కడకు వచ్చేయండి...” అంది.

“అవునందామా? కాదందామా? అని ఆలోచనలో పడ్డాడు. విశాల ఏమైనా అనుకుంటుందేమోనని సంశయిస్తూ వుంటే “రజనీతోకబుర్లు చెప్పుతూ వుండడానికి ఒకరు చాలరు. పైగా నన్నుమాటల్లో పడవేసి సరిగ్గా అన్నీ చూపించడం మాని వేస్తుంది” అంది విశాల రామంతో.

రామం సరే నన్నాడు.

ముగ్గురు మరునాడు టూరిస్టు బస్సులో బయలు చేరారు. బస్ను చాలావరకు ఖాళీగానే వుంది. కొంత మంది విదేశీయులు కూడా అందులో వున్నారు. ఒకరిద్దరు నూతన దంపతులు కూడా వున్నారు. అందులో ఒక అమెరికన్ దంపతుల పరిచయం రజని చేసుకుంది. వారిద్దరు వివాహమైన తరువాత ప్రపంచ యాత్రకి బయలుదేరారు. యువకుడి పేరు డేవిడ్, అతని భార్య పేరు మేరీ. రజనితో వారికి స్నేహం ఏర్పడింది. అనేక విషయాలనుగురించి వారితో చెప్పింది. కనబడిన ప్రతి దానికి ఆమె వ్యాఖ్యాసం చేసి చర్చించింది. ఇక విశాలకు విశదీకరించవలసిన బాధ్యత రామంమీద పడింది.

రెడ్ ఫోర్టులో అందరు తలొకవైపు పచార్లు చేస్తున్నారు. రామం విశాలకి లోనవున్న భవనాలకి గల చారిత్రక ప్రాధాన్యతను విశదీకరించి చెప్తున్నాడు తిరిగితిరిగి అలసి, తిరిగివచ్చేసరికి రజనీ, అమెరికన్ దంపతులతోటి ఏదో గట్టిగా నవ్వుతూ మాట్లాడుతోంది. ఆ యువకుడు ఇంగ్లీషులో అంటున్నాడు . నీలాంటి స్త్రీ పరిచయం కలిగినందుకు నాకెంతో సంతోషంగా వుంది రజనీ! ఇండియా దేశ స్త్రీలు ఇంత ఫార్వర్డ్ గావుంటారని నేనూహించలేదు అయినా నాకిది చెప్పు యువతీ! మీ దేశీయులందరు ఇంత అందంగా ఏలా వుంటారు! మా దేశంలో ఇంత విశాల నేత్రాలు నేను ఎప్పుడూ చూడ లేదు” అన్నాడు.

రజని నవ్వుతూ, “పరదేశీయులంటే ఆ ఆకర్షణ అందరికి వుంటుంది డేవిడ్, నాకు కూడా మీ దేశం చూడాలని కోరికగా వుంది. కానీ ఏం చెయ్యను? అడపాతడపా నీబోటి నమూనాలతో సరిపెట్టుకోవాలి” అంది.

మేరీ ''అయితే మాదేశం వచ్చేయ్యకూడదా? అక్కడ వుద్యోగం ఇప్పించే బాధ్యత మాది. ఇక్కడ నీకెవరు లేరని చెప్పారు. ఇక్కడ నుంచి రేపే మేము వెళ్ళిపోతాము. మాతోపాటు నువ్వు మిగతా దేశాలన్ని తిరిగి అమెరికా రావచ్చు లేక నీ కిష్టం లేకపోతే మేము కూడా” శాపేరాతో తిరిగి అమెరికా వెళ్ళిపోతాము. అవసరమయితే రెండుమూడు రోజులుండి వెళతాము. డబ్బు గురించి నువ్వాలోచించకు. మా వద్ద కావలసిన ధనముంది. నువ్వు తిరిగి యివ్వవలసినఅవసరము లేదు.

చక్కటి ఆలోచన చేశావు మేరీ! ఇక దీనికి తిరుగు లేదు. నువ్వు మాతో రావలసినదే రజనీ! బలవంతంగానైనా నిన్న మేము తీసుకు వెళతాము. నువ్వు మాతో రావలసిందే” అన్నాడు డేవిడ్.

హఠాత్తుగా సంభవించిన ఆలోచన క్షణకాలం, రజనిని చకితురాలిని చేసింది. సంతోషంతో “సరే అయితే అలాగే చేస్తాను. రెండురోజులు తరువాత బయలు దేరి వెళదాము ఈ లోపున అన్నీ సర్దుకోవచ్చు” అంది.

డేవిడ్ రజని చెయ్యి పట్టుకుని షేక్ హాండు చేస్తూ సంతోషంతో థాంక్స్, నీవంటి ధైర్యవంతురాలిని, సాహసవంతురాలిని నేనిక్కడ యింతకుముందు చూడలేదు. క్షణంలో నిశ్చయానికి వచ్చేవు అది దృఢమైనదని, అచంచలమన, తెలుస్తునే వుంది. అమెరికాలో నీ అందం, నీ మాటలు అందరినీ తన్మయులని చేస్తాయి. పురుషులంతా నీకుదాసోహం మవుతారు” అన్నాడు.

రజని, వుత్సహంలోపడి రామం, విశాల సంగతే మరచిపోయింది. సరిగ్గా యిదే సమయానికి వారిరువురు తిరిగి వచ్చారు. వారిని చూచి రజనీ, విశాలతో జరిగిన సంగతి చెప్పింది. ఆ మాటలు విని రామం వ్యాకులత్తు డయ్యాడు. అది నిజమని నమ్మలేక పోయాడు. కాని రజని స్వభావం తనకు తెలుసు. తలచుకున్నది చెయ్యక మానదు ఆమెను అడ్డగించే అధికారం ఎవ్వరికీ లేదు. రజని ఎవ్వరిపొత్తు కాదని ఆమె పదే పదే చెపుతుంది. ఇక ఇప్పుడు ఏమి చెయ్యాలో అతని కేమి తోచలేదు. రజని శాశ్వతంగా దూరమయే భయంకరసమయమదేనని గ్రహించాడు. అది ఎలా భరించటం? హఠాత్తుగా హృదయమంతా దు:ఖంతో కరడుకట్టిపోయింది. పూర్తిగా చేతనారహిడయి పోయాడు, అతనికి ఏం చెయ్యాలో, ఏమనాలో అర్థంకాలేదు.

“బాగా ఆలోచించుకున్నారా?రజనీ హఠాత్తుగా అనాలోచితంగా యిలా చేసేవంటే తరువాత బాధపడతావేమో?” అంది విశాల.

“బాధపడడానికేమి లేదు విశాల. బంధనాలు బాధ్యతలు నాకు లేవు. ఇలాంటి అవకాశం మళ్ళీ నాకు దొరకదు. నూతన ప్రదేశాలు చూడాలనీ, నూతన వ్యక్తులను కలుసుకోవాలని, నాకు చిన్న తనంనుంచీ కోరికగా వుంది. అక్కడ నాకు జీవనోపాధి లభించగలదని, శేష జీవితం సరదాగా, సాఫీగా పోగలదని నాకు నమ్మకంగా వుంది” అంది రజని.

వీరిద్దరి సంభాషణ అమెరికన్ దంపతుల కర్ధం కాక పోయినా విశాల ఆటంకాలు కల్పిస్తోందని గ్రహించారు. డేవిడ్ విశాలతో “మీరు రజనీ దారికి అడ్డం రాకండి. ఆమెను తీసుక వెళ్ళకుండా మేమూరుకోము. లేకపోతే మీరు వచ్చేయండి మాతోటి” అన్నాడు.

విశాల మెల్లగా నవ్వి “నేనేమి ఆటంకాలు కల్పించలేదు మిష్టర్ డేవిడ్. జీవితంలో ముందడుగు వేసే సమయంలో మరువకూడని విషయాలని జ్ఞప్తికి తెచ్చుకుని నిశ్చయానికి రావాలి. అదే ఆమెను హెచ్చరిస్తున్నాను”అంది.

“అది అసత్యమని నేననను విశాల! ముందు వెనుకా చూడకుండా సాహసించి చెయ్యవలసిన పనుల కూడా వుంటాయి. వాటికి పరిస్థితులతోటీ, పరిణామాలతోటి ప్రమేయం లేదు”అంది రజని.

రజని పట్టుదల, అచంచలమైన నిశ్చయము, విశాల గ్రహించింది. ఆమె రామం ముఖ కవళికలు గమనిస్తూనే వుంది. అతని తరవునే ఆమె ఆ వాక్యాలు పలికింది.

కనీసం రేపటి వరకు గడువు తీసుకో రజనీ అంతా తరువాత ఆలోచిద్దాము, ప్రసాద్ సలహా కూడా తీసుకోవచ్చు” అంది.

ఆ అవసరం నాకిప్పుడు లేదు విశాలా! నేను ఇప్పుడు ఏకాకిని ... ... అని ఏదో అనబోతుంటే రామం గర్జించాడు. “రజనీ! నేను నీతో మాట్లాడాలి” అని.

పిడుగులాంటి ఆమాట వినినప్పటి నుంచి రామం హృదయంలో బడబాగ్ని చెలరేగింది. రజని ఒక్కమాట కూడా తనతో మాట్లాడలేదు. ఆది గాయానికి కారం చల్లినట్లు అయింది. క్రోధంతో అన్న మాటలవి.

రామం మాటలకన్నా ఆతని కంఠస్వరమే అందరినీ ఆశ్చర్యపరచాయి. రజని అది మొదట గుర్తు కూడా పట్టలేకపోయింది. విశాల త్రుళ్లిపడింది

అమెరికన్ దంపతుల మాటలు అర్ధం కాకపోయినా, రామం ముఖ కవళికలు, కంఠ స్వరం విచలితుని చేసాయి.

“మిమల్ని మాట్లాడవద్దని నేనెప్పుడన్నాను రాంబాబు.ఇతరుల మాటలు వినననే అధికారం నా కెప్పడూ లేదు” అంది రజని.

“ఒంటరిగా మాట్లాడాలి” అన్నాడు రామం.

“ఆది ? సబబుగా కాదు వీరందరిని ఇక్కడ వదలి మీతో రహస్యమంతనాలు చేయటం న్యాయం కాదు. ఐనా మీరు చెప్పదలుచుకున్నది నాకు తెలుసు. నా స్వభావం మీరు గ్రహించినట్లయతే సమాధానం కూడా మీరూహించుకోవచ్చు” అంది రజని.

ఆ మాటలతో రామం హృదయంలోని ఆవేదన, విచారము, ఆప్యాయత, కాని క్రోథం పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆది గమనించి విశాల ''రజనీ స్వభావం నాకు తెలుసు కానీ ఇతరులని కూడా నువ్వు నీ ఆలోచనలతో సర్దుబాటు చేయాలి, వారితో కొంతగా సంప్రదించడంమనేది నీ ధర్మం. వారి అధికారము కూడాను. నీవు సర్వస్వతంత్రురాలివని దురహంకారతోటి సర్వాన్ని కాలదన్నుకోకు, ఇతరులను బాధించే అధికారం కూడా లేదు. ఇదేసంగతి నీవే నాకోసారి బోధ చేసావు. కాని ఇది నువ్వు మరచి ప్రవరిస్తున్నావు'' అంది.

విశాలమాటలు రామానికి ఎంతో వూరట కలిగించాయి . నిశ్శబ్దంగా, చేతనారహితంగా కృతజ్ఞతాపూర్వక వందనాలు నివేదించాడు. ఆమె మాటలు రజనినికూడా కదలించాయి.

“నువ్వు వ్యక్త పరచిన అభిప్రాయాలను నేనంగీకరించక పోయినా, ఆచరణలో నీ సలహానే పాటిస్తాను, కాని రాంబాబు వీరందరిని ఇక్కడ వదలటం సమంజసం కాదు. మనం టాక్సీలో వెళ్లిపోదాం. వీరు చూడవలసినవన్నిటిని చూచి తిరిగి చేరుకునేసరికి నా నిశ్చయం వారికి వెల్లడిచేయవచ్చు” అంది రజని.

అమెరికన్ దంపతులతో ఆవిధంగానే చెప్పి ఎంతో కష్టంమీద వారిని ఒప్పించింది. ఏమైనా సరే, రజనిని వదలకూడదనే పట్టుదల వారిలో కలిగింది. రజనిని చూచినకొలది ఆమె ఔన్నత్యం వారికి స్పష్టంగా కనబడజొచ్చింది. ఐదున్నర గంటలకి హోటల్ జన్ పద్ లో కలుసుకొని తన నిశ్చయాన్ని వెల్లడిస్తానని మాట యిచ్చి రజని, రామం విశాలతోకూడ బయటకు బయలు దేరింది. దారిలో “రజనీ నన్ను ప్రసాద్ ఇంటి వద్ద వదలిపెట్టండి ఒక సారి చూచివస్తా” అంది విశాల.

ఆమె మాటలు రజనీ అర్థం చేసుకుంది. “అలాగే కానీ విశాలా! వారు నిన్ను చూచి సంతోషిస్తారు. అకారణంగా నేను వారిని వదలివచ్చాను. ఆయన బాధపడ్డారు. మానసికంగాఆయన కూడా బలహీనులని నేనానాడు గ్రహించాను” అంది.

రజని, రామం కారు దిగలేదు, టాక్సీ రజని ఇంటికి దారి తీసింది. ఆ తరువాత కొన్ని నిమిషాల వరకు రామం కాని రజని కాని మాట్లాడలేదు సర్దార్ జీ అద్దంలో రజని రూపాన్ని పదేపదే చూస్తూ వువ్విళ్ళూరుతున్నాడు.

నిశ్శబ్దాన్ని నిర్దాక్షిణ్యంగా చిందర వందర చేస్తూ రజని “మీరు ఏకాంతంకోసం పరితపించి కాంక్షించారు. అది లభించినప్పుడు మీరిలా మౌనము దవహించడము ముదావహంగా లేదు రాంబాబు” అంది.

“ఆత్మీయులందరినీ వదలి అపరిచితుల వెంట అన్యదేశాలకు వెళ్లి పోతావా! రజనీ హఠాత్తుగా వచ్చిన నీ నిశ్చయంలో నా ధ్యాసే లేదా?” అన్నాడు రామం.

“ఇదే మనస్సుని వేధించే మమత రామం బాబూ! ఇదే మానవుని కష్టాలన్నింటికీ కారణ భూతం దీనిని జయించనివారు జీవితంలో దేనిని జయించలేరు” అంది.

అదే సమయానికి టాక్సీ రజని ఇంటి వద్దకు వచ్చి ఆగింది డబ్బులు ఇవ్వబోతూంటే, సర్దారు ఓ సలాం జేసి హిందీలో “వద్దు మేమ్ సాబ్, మీ అందానికి కానుకగా నేను మీ వద్ద డబ్బులు పుచ్చుకోను” ఇక సమాధానంకి ఎదురు చూడకుండా టాక్సీ నడపుకుని వెళ్ళిపొయ్యాడు.

రజనీ పక పక నవ్వుతూ “సరిగ్గా పన్నెండుగంటలైయింది. సర్దార్జీకి పిచ్చిపట్టింది'' అంది.

దుఃఖంలో కూడా రజని మాటలు రామానికి కూడా నవ్వు తెప్పించాయి. అని గంభీర వదనంమీద క్షణకాలం చిరునవ్వు వెలిసింది. రజని చూస్తుందేమోనన్న భయంతో ముఖం ప్రక్కకు త్రిప్పుకున్నాడు.

లోపలకు వెళ్ళిన వెంటనే రజని వంట ప్రయత్నం చెయ్య నారంభించింది. “ఈ దారిద్యం, ఈ బాధ అన్నీ తప్పుతాయి. అని నేను సుఖపడతానని మీ బాధ” అంది.

“ఈ విధంగా వెళ్ళిపోతే నువ్వు సుఖపడతావని నాకు తెలుసు. కాని యిక నేను సహించలేను రజనీ? ఇన్నాళ్ళ నుంచీ నేను ఏ సంగతి చెప్పడానికి సంకోచించి అభిమాన పడి నాలోదాచుకొనివున్నానో అది యీ నాడు చెప్పక తప్పదు. నువ్వు శాశ్వతంగా నానుంచి దూరమవుతే నేను జీవించలేను రజని నిన్ను నేను అప్పుడప్పుడు చూడగలుగుతుండాలి. నీ కంఠ స్వరం అప్పుడప్పుడు వినబడుతూవుండాలి. అంతకంటె నేనేమీ కాంక్షించాను, అనర్హుడనని కూడా తెలుసు” అన్నాడు రామం.

రజని, నవ్వుతూ “ఈ అనురాగపు నివేదన వంట యింటిలో జరిగిందని ఏ నవలా రచయిత అయినా వ్రాస్తే అది ఎంత హాస్యాస్పదకంగా వుంటుంది చెప్పండి” అంది.

రామం చేతులు జోడించి, గద్గద స్వరంతో “నీకు నేను నమస్కారం పెడతాను రజనీ ? ఇది జీవన్మరణాల సమస్య. పరిహసించదగిన సంగతి కాదు” అన్నాడు.

రజని రామం చేతులురెండు విడదీసి, “పరిహసించటంలేదు బాబు. పరిస్థితి విషమించక ముందే పారిపోతున్నాను. మీ హృదయంలోని భావాలు నాకు తెలుసు. వాటిని నిర్మూలించడానికి నేను శక్తి కొలది ప్రయత్నించాను కాని ఫలితం లభించలేదు. ఎన్నోసార్లు మీ హృదయం భద్రపరుచుకోమని హెచ్చించాను. కానీ మీరు నా సలహాని పేడ చెవిని పెట్టారు. దాని ఫలితమే యీప్రమాదం” అంది.

రామం“అయితే నన్ను ప్రమాదంనుంచి తప్పించడానికేనా నువ్వీపనికి పూనుకున్నావు?” అన్నాడు.

“అది పూర్తిగా నిజం కాదు. ఇది స్వార్ధత్యాగమని పగల్భాలు పలకటం నాకిష్టం లేదు. నిజంగానే నాకు పర దేశాలు చూడాలని నాకు చిన్న తనంనుంచి కోరికగా వుంది . అదీకాక నా స్వభావానికి ఆశయాలకీ పశ్చిమదేశ పరిస్థితులు అనుకూలంగా వుంటాయనీ నాకు నమ్మకంగా వుంది” అంది.

“ఇది లాభదాయకం కాదని నేననను. కాని నేను స్వార్థపరుడను రజనీ! నా జీవితంలో నువ్వు నిర్వహించవలసిన పాత్ర ఎంతైనా వుంది. నేను నిన్ను విడువను. కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకువెళ్లు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్వదేశం-ఇవన్నీ వదలుకొంటాను. కాని నిన్ను విడచినేను జీవించలేను రజనీ?”అన్నాడు.

రామం మాటలు నిశ్చలమైన రజనీ హృదయంలో తుఫాను లేవదీశాయి.

“మీరన్న మాటలు నాలోని నిశ్చయాన్ని ఇంకా దృడత్వం చేస్తున్నాయి. ఉభయులకు ఇదే వుత్తమమయినదని నాకనిపిస్తోంది, కొద్ది కాలం బహుశా మీరు బాధపడుతారు. కాని భవిష్యత్తులో మీరు నా మాటలలోని నిజాన్ని గుర్తిస్తారు” అంది.

రామం రజని రెండు చేతులు హృదయానికి హత్తుకుని, “నేనంటే నీకీ విముఖత ఎందుకు రజనీ?'' అన్నాడు..

‘‘విముఖత లేదు. మనయిద్దరి స్వభావాలు, వొక దానికొకటి సరిపడవు. శాశ్వతమైన మీ అనురాగము, ఆదరము, ప్రేమ నాకు సరిపోవు. వీటిల్లో నాకు నమ్మకం లేదు. నానుంచి ఎవరికీ అవి లభించవు. ప్రసాద్ లాంటి వ్యక్తులే నాకు సరిసమానులు. నానుంచి మీకు జీవితాంతం దుఃఖమే లభిస్తుంది సహజీవనం మనకు సరిపడదు. సంఘాన్ని ఎదిరించే ధైర్యసాహసాలు కూడా మీకు లేవు. ఇది నేను నిందాపూర్వకంగా అనటం లేదు. వొక సత్యాన్ని మాత్రము వెల్లడి చేస్తున్నాను” అంది రజని.

రజని మాటలు రామం హృదయంలో భరింపలేని దుఃఖాన్ని లేవదీశాయి. చేతులతో ముఖం కప్పుకుని రజని పాదాలవద్ద కూలిపోయాడు.

గద్గద స్వరంతో “ నాకిక ఆత్మహత్య గత్యంతరం రజనీ!” అన్నాడు.

రజనీ రామం ప్రక్కన కూర్చుని మృదువుగా చేతులు విడదీసి కన్నీరు చీర చెంగుతో ఆప్యాయంగా తుడుస్తూ “అలాంటి అనర్థకపుమాట అనకండి రామంబాబు, మీరంత మానసిక భీరులు కారు. ఒక వ్యక్తికోసం ఇంకొకరు ప్రాణాలు తీసుకోవటమనేది దౌర్బల్యంకూడాను” అంది. “బాటంతా ముళ్ళు-హృదయమంతా చీకటి చేయూత లేదు. ఇక ప్రయాణం చెయ్యడమెలాగ రజనీ” అన్నాడు గద్గద స్వరంతో.

“అధైర్యపడకండి రామం బాబు, చేయూతనిచ్చే వారు భవిష్యత్తులో మీకు తప్పక లభిస్తారు. కాస్త వోరిమి వహించండి” అంది రామం తలనిమురుతూ.

రజని క్షణ కాలం మౌనము వహించి నిట్టూర్చి, “సరే రామం బాబు లేవండి” అంది.

అదేసమయంలో తలువుతోసుకుని, విశాల ప్రవేశించింది. కాని ఆమె వంటరిగా లేదు. ఆమె వెంట చంద్రిక, కమల, కమలాకరంకూడా వున్నారు. వీరంతా ఏలాగు కలిసారో? విశాలకు కమల, కమలాకరం పరిచయం ఎలా అయిందా రజనికి అర్థం కాలేదు, కాని జరిగినదేమంటే విశాల ప్రసాద్ యింటికి వెళ్ళేసరికి ఇంటిలో ప్రసాద్ లేడు. కాని చంద్రిక ప్రసాద్ ఇంటిలోనే వుంటూవుంది విశాలవద్ద నుంచి సంగతి తెలుసుకొని, ఆమెను వెంట తీసుకొని కమల ఇంటికి వెళ్ళింది. కమలకు, ఆమెకు ఆ సమయంలో సహాయం అవసరమని తోచింది. అదృష్టవశాత్తు కమలాకరంకూడా ఇంటిలోనే వున్నాడు, అందరూ ఒకే ఒక దృఢ నిశ్చయంతో బయలు దేరారు. రజని ప్రయాణం ఆపు చెయ్యాలి. వారందరిని చూచి రామం కంగారుగా లేచి నిలడ్డాడు.

రజని నవ్వుతూ “వీడ్కోలు చెప్పడాని కిదా సమయం చెప్పండి? మిట్టమధ్యాహ్నం, జబర్దస్తీగా యింట్లోయింతమంది జొరబడితే, యిల్లాలికి యిష్టంగా వుంటుందా?” అంది.

కమల నవ్వుతూ ముందుకు వచ్చి “ఇప్పుడు యిల్లాలి యిష్టాయిష్టాలతో మాకు ప్రమేయం లేదు రజనీ, స్వార్థపరులమంతా గుమిగూడి వచ్చాము.స్వదేశాన్ని పరిత్యజించి వెళ్ళ నిశ్చయించుకున్న నీ సదుద్దేశాన్ని పటాపంచలు చేద్దామనే దృఢ నిశ్చయంతో నలుగురముకూడబల్కుకుని వచ్చాము” అంది.

“కమలా! మగువల మనస్సు మార్చటం అంత సులభము కాదని నీకు తెలియదా?” అంది రజని.

“అది బాగా తెలుసు రజనీ! ముఖ్యంగా నీ పట్టుదలను సడలించడం సాధారణమయినది కాదని కూడా తెలుసు. అందుకనే అందరము కలసి దండయాత్రకు వచ్చాము. విడి విడిగా అందరము నీముందు ఓటమి అంగీకరించవలసిందే" అన్నాడు కమలాకరం.

“నామీద మీ కెందుకింత కక్ష కమలాకరం బాబు?” ఆంది రజని.

“ఆత్మీయతని అణచుకోలేక అందరు బాథపడతారు. అది త్రుంచుకోడానికే నేను ప్రయత్నిస్తూంటాను అందరు అడ్డగిస్తున్నారు ఇది అన్యాయం కాదా?” అంది.

“మామయ్యను వదలి వేసావు మమ్మల్ని కూడా విడచి వెళ్ళిపోతావా? అవసరానికి ఆదుకునేవారు లేరని అధైర్యపడకు చంద్రిక? నేనున్నాను” అని వొకసారి నువ్వన్నావు.ఈ అవసరానికి నువ్వే నన్ను ఆదుకోవాలి' అని అంది చంద్రిక.

“అవసరానికి ఆదుకునేవారు నీకిప్పుడు చాలామంది వున్నారు చంద్రిక! కమలవుంది, ప్రసాద్ వున్నాడు. రాంబాబు వున్నాడు అన్నట్టు మరచిపోయాను రాంబాబు నీకు తెలియదేమో”అని ఆ యిద్దరికి పరిచయం చేసింది.

“రాంబాబు. మీ కృషికూడా ఫలించలేదా?” అంది చంద్రిక.

“సమయానికి మీరు రాకపోతే బహుశా ఫలించేది? అంది రజని నవ్వుతూ. “రసవత్తమైన విషాదఘట్టంలో మీరు తలుపుతోసుకొని లోపలకు వచ్చారు”.

రామం ముఖం సిగ్గుతో ఎర్రబడింది. చంద్రిక కూడా నవ్వుతూ “అయితే రాంబాబు అదృష్టవంతులు అంది.

“అది వారి అదృష్టం నా దురదృష్టం చంద్రికా. నా పట్టుదలను మించిన పట్టుదల ఆయనిది. క్రోధంలో వారేమి చేస్తారో వారికే తెలియదు. అందుకనే నేను నిజంగా ఇప్పుడు సంకోచిస్తున్నాను'' అంది.

రజని మాటలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ఆమె నిశ్చయాన్ని సడలించగల శక్తి రామాని కెక్కడిది?.

“సంకోచన సరిపోదు రజనీ! మా కందరికీ మాట ఇవ్వాలి” అంది కమల.

“మీ అందరిలో నా సుఖాన్ని కాంక్షించేవారెవ్వరు లేరా?” అని ఏదో అంటూంటే.

“ఎందుకులేరు రజనీ! నేనున్నాను” అని ఒక కంఠ స్వరం పలికింది. అంతా తుళ్ళిపడ్డారు. ప్రసాద్ లోనికి వచ్చి పక పక నవ్వుతూ “ఇక ఫరవాలేదు రజనీ! నేను వచ్చాను. వీరి ఆటలు ఇక సాగవు” అన్నాడు.

చంద్రిక ప్రసాద్ దగ్గరకు వచ్చి “మామయ్య! పిన్ని పరదేశాలకు పోతుందంట” అంది.

“మంచిదే చంద్రికా! కావాలంటే తోడు నేను కూడా వెళ్తాను ” అన్నాడు ప్రసాద్.

“ఎవరివద్ద నుంచి పారిపోవాలనుకున్నానో వారినే వెంట తీసుకుని పొమ్మంటావా? ప్రసాద్” అంది రజనీ నవ్వుతూ.

“పారిపోయేవారు పరుగెట్టాలి రజనీ! నెమ్మదిగా నడుస్తే లాభం లేదు” అన్నాడు ప్రసాద్.

“వూరుకో మామయ్యా! ఈ పిన్నిని వెళ్ళనివ్వకూడదని మేమంతా కంకణము కట్టుకున్నాము. ఇక దీనికి తిరుగులేదు. నీ సహాయం కూడా మాకు కావాలి” అంది చంద్రిక.

“నిస్సహాయులకే ఇతరులసహాయం అవసరం ఉంది చంద్రికా! అయినా ఇతరుల మార్గానికి అడ్డు రావటమనేది నా స్వభావానికి విరుద్దం ముఖ్యంగా రజని ఏం చేసినా దానిని వ్యతిరేకించే అధికారం మనకెవ్వరకు లేదు” అన్నాడు.

కమల ఇంతవరకు మాట్లాడకుండా వుంది. ప్రసాద్ రాక ఆమెకేమంత ఆనందం కలిగించలేను. అతనిని క్రిందటిసారి చూచి కొద్దిదినాలుమాత్రమే అయినా ఎంతో కాలం తరువాత తిరిగి చూచినట్లనిపించింది. అతని కంఠస్వరం ఇంటి బయటి నుంచి పిలిచినప్పుడే ఆమె అది గుర్తుపట్టగలిగింది.ఈసారి మెల్లగా “ఆ అధికారం మీకు లేకపోవచ్చు. ప్రసాద్ బాబూ! కాని అది వున్నవారు కూడా వుండి వుండవచ్చునని మీరు మరచిపోకండి” అంది.

“నీ విషయంలో ఇది నిజమే కమలా! కాని రజని విషయంలో ఇది నిజం కాదని నా నమ్మకం'' అని రజనితో తగవుకు నువ్వే తీర్పు చెప్పాలి రజనీ!” అన్నాడు ప్రసాద్.

“అధికారం లేకపోయినా కొంతమంది చెలాయిస్తూ వుంటారు. అప్పుడప్పుడు మనం అయిష్టంగానే అది శిరసావహిస్తూ వుంటాము. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. నేను లొంగిపోయాను” అంది రజని.

రజనీమాటల అర్దం రామం గ్రహించాడు. విశాల కూడా చూచాయగా గ్రహించింది. కమల అనుమానపడింది, కమలాకరం కంగారుపడ్డాడు, ప్రసాద్ ఆశ్చర్యానికి మేర లేదు. చంద్రిక ముఖం మబ్బులలోని చంద్రబింబంలా వికసించింది,

రజనీ ప్రయాణం ఆగిపోయింది. ఆమె రామం కోసంచేసినయీ త్యాగపు విలువను ఎవరు గుర్తించలేకపోయారు, రజని కూడా మనస్సులో ఎంతో దుఃఖించిది. విదేశాలకు వెళ్ళే అవకాశం పోయిందని కాదు. జీవితంలో అంత వరకు ఎవరి ఇష్టాయిష్టాలను లెక్క చెయ్యని ఆమె వొక వ్యక్తి కన్నీటికీ, క్రోధానికి భయపడి అలాంటి సదవకాశాన్ని జారవిడుచుకుని, బలహీనతను ఆమె తన మనస్సులోనే గుర్తించుకుంది. ఆదే ఆమెను ఎందుకో కలవరపెట్టింది. మొదటి నుంచీ రామాన్ని ఆమె చులకనగా చూస్తూనే వుంది. మొదట్లో ఆమె యెడ అతను ప్రదర్శించిన క్రోధము, ఏవగింపు ఆమెలోని పౌరుషాన్ని రెచ్చగొట్టాయి. కాని ఆమె మనసే అతని యధికారాన్నంగీకరించేటప్పటికి ఆమె విచలితయింది. ఆమెరికన్ దంపతులిరువురు రజని నిశ్చయం విని ఎంతో దుఃఖించారు. ఆరోజల్లా అమె వారితోనే గడిపి, మరునాడు విమానాశ్రయానికి వెళ్ళీ వీడ్కోలు చెప్పింది. చిరకాలపరిచయం శాశ్వతంగా చీలి పోయేటప్పుడు పడే బాధ వారనుభవించారు.

“రజనీ! నీలాంటి యపూర్వ స్త్రీ పరిచయం కలిగినందుకు నేనెంతో సంతోషించాను మా దేశంవస్తారనీ, మన పరిచయం చిరకాలం వర్ధిల్లుతుందని కలలుకన్నాను. అవన్నీనాడు నేలకూలి పోయాయి. ఐనా వొక విషయం గుర్తుంచుకో రజనీ! నువ్వు ఎప్పుడు వచ్చినా నీ కక్కడ స్వాగతం లభిస్తుంది. అక్కడ నీకు ఏవిధమైన కష్టము కలుగకుండా చూసుకునే భారం మాది” అన్నాడు డేవిడ్.

రజనికి కూడా ఆ మాటలు ఎందుకో బాధను కలిగించాయి. “నీకు కృతజ్ఞతనే పదంమీద అట్టే నమ్మకం లేదు డేవిడ్ కాని ఇప్పుడదే గత్యంత మేమోననిపిస్తోంది” అన్నది.

“ఇక మళ్ళీ మనం శేషజీవితంలో కలుసుకుంటామో లేదో తెలియదనుకుంటాను. పరిచయం ఒక రోజైనా స్మృతి జీవితాంతం వరకు నిలిచిపోతుంది. అప్పుడప్పుడు వుత్తరాలు వ్రాస్తూవుండు. పరదేశమయినా నీ వివాహానికి మేము తప్పక వస్తాము” అంది మేరి.

రజనీ నవ్వుతూ “పునర్జన్మంలో నాకు నమ్మకం లేదు. లేకపోతే మీ రాక కోసమయినా వివాహమాడుదును, సమయమంతా మించిపోయాక సంధికి వస్తానన్నారు మీరు” అంది.

రజనీ మాటలు అర్ధం పూర్తిగా వారు గ్రహించకపోయినా, ఆ సమయంలో ఆమెతో వాదించటం యిష్టం లేక యిరువురు ఊరుకున్నారు. విమానం ఎక్కవలసిన సమయం ఆసన్నమయినది. డేవిడ్ రజని చెయ్యి పట్టుకొని “రజనీ, ఏకాంతంలో అప్పుడప్పుడు నన్ను గుర్తుకు తెచ్చుకుంటూ వుండు” అన్నాడు , రజనికి ఆతని కళ్ళలో నీరు సన్నగా కనబడింది.

*****

షేర్ చేయబడినవి

NEW REALESED