అప్రాశ్యులు
భీమేశ్వర చల్లా (సి.బి.రావు)
12
అమెరికా నుంచి సనల్ స్నేహితుడువచ్చి విశాలను పరీక్షించాడు. కొత్తగా ఆయనేదీ చెప్పలేదు, సనల్ యిచ్చే వైద్యాన్ని సమర్ధించాడు. విశాల కోరిక ననుసరించి ఆయన మిగతా రోగులందరినీ పరీక్షించాడు. సనల్ వైద్యాన్నిఎంతో మెచ్చుకొని , “నువ్వు చేసే వైద్యంకన్నా నేను ఇంకేమీ సలహాలు యివ్వలేను, డాక్టరు సనల్ నవీన పద్దతులు అభిప్రాయాలు చికిత్స యీ వ్యాధితో పోరాడే డాక్టర్లందరికీ ఆదర్శప్రాయలు” అన్నాడు. కాని సనల్ నిరుత్సాహపడ్డాడు. ఆయనేదో ప్రత్యేకమైన చికిత్స చెబుతాడని దానితోవిశాలకు అతి త్వరలో నయమవుతుందని ఆశించాడు.
చంద్రిక ఆ రాత్రి రజనికి పెద్దవుత్తరం వాసింది. రజని వుత్తరం చదువుకోని క్షణకాలం అలాగే కూర్చుండి పోయింది. కర్తవ్యం కోసం క్షణకాలం కూడా ఆమె కాలం గడపలేదు. వుత్తరం అందకముందు కూడా ఆమె ఢిల్లీ తిరిగి వెళ్ళిపోవాలని నిశ్చయానికి వచ్చింది. తగిన సమయం కోసం మాత్రమే ఆమె ఎదురు చూస్తూంది. వృద్ధులిద్దరు స్వస్థతకు వచ్చారు. ఇక చేసేపని లేదు, శాశ్వతంగా వుండిపోయే వుద్దేశ్యం ఆమెకెప్పుడు లేదు. పైగా కొంతకాలంపట్టి వారి అయిష్టతకి ఆమె పాత్రురాలైంది. చాలాకాలం వరకు ఆమె తెల్లటి చీరెలు కడుతూ నొసట కుంకుమ బొట్టు లేకుండా వుండేది రామంతో ఆమె చెప్పినట్లు. అందులో నమ్మకముంది కాదు. కాని అదొక అనుభూతిగా పరిగణించింది. కొన్నాళ్లకామె దానితో విసుగెత్తింది. వెంటనే ఆమె అవన్నీ వదలి పెట్టేసింది. దానితో వృద్ధుల అయిష్టతకు గురి అయింది. రజని వారి విధవ కోడలుగా పరిగణిస్తూ వచ్చారు. హఠాతుగా ఆమె అవన్నీ విసర్జించేసరికి వారికి బాధకలిగింది, కాని రజని దానిని లక్ష్యం చెయ్యక సంచరించ సాగింది. అంతవరకు వారి ఆరోగ్య కారణంగా ఆమె యిల్లు వదలి బయటకుకూడా వెళ్ళలేదు. కాని వారు స్వస్థతకు రాగానే ఆమె బయట వినోదాలలో కూడా పాల్గొనసాగింది. ముస్తాబుగా అలంకరించుకొని, బయటకు వెళ్ళి ఆలస్యంగా రాత్రిళ్లు తిరిగి వచ్చేది. రజని హద్దు మిరుతూందని వారు భావించారు. అది రజని కనిపెట్టక పోలేదు. వారి అభిప్రాయాలను ఆమె గ్రహించింది. వినోద్ పరిచయంలో ఆరంభమయిన ఇంకొక అధ్యాయం తన జీవితంలో ముగిసిందని గ్రహించింది. అలాంటి సమయంలోనే ఆమెకు చంద్రిక వుత్తరం అందింది. మరునాడే ఆమె ప్రయాణమయింది, వృద్దదంపతులు ఎంతో బోధపర్చారు. రజనియెడ వారికి నిజంగానే ప్రేమానురాగాలు ఏర్పడ్డాయి. వారికి ఆమె చేసిన సేవను వారు మరువలేరు. వినోద్ యెడ ఆమె చూపిన ఔదార్వం వారింకా మరువలేదు. కాని రజని నిశ్చయాన్ని సడలించడం అసంభవమని వారు గ్రహించారు. కనీసం ధనరూపానైనా చెప్పుదామనే వుద్దేశం. రజని వీడ్కోలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ముసలాయన రజని చేతిలో పదివేల రూపాయల చెక్కు పెట్టి “వంటరిదానివి. ఏనాడు ఏ అవసరం వస్తుందో ఎవరు చెప్పగలరు? చివరకు నువ్వు ఎందుకు కాకపోతావేమో! ఎందుకయినా పనికివస్తుంది దగ్గర వుంచుకో” అన్నాడు.
రజని మందహాసం చేస్తూ “పనికి రాదని నేనను. కాని అవసరం లేదని మాత్రం అంటాను. వంటరి దానిని ఏదో ఒక పని చెయ్యకుండా వుంటే ఏమితోచదు. దానితో నా ఒక్క కడుపునిండుతుంది. ఇదంతా నేనేం చేసుకోను చెప్పండి!” అంది.
”ఏమయినా చివరకు ఇదంతా నీదే కదా రజనీ!” అన్నాడు.
“అలాంటి అవాంతరం తెచ్చి పెట్టకండి బాబాయి, ప్రపంచంలో డబ్బుకి కొరత వున్న వాళ్లు వేల మంది వున్నారు. అదంతా అలాంటి సత్కార్యానికి వినియోగిస్తే సబబుగా వుంటుంది. వినోద్ జ్ఞాపకార్థం ఏదైనా సంస్థ స్థాపించండి” అంది.
“అయితే నీకు మేమంతా ఇలా ఋణపడవలసిందేనా రజనీ?” అన్నాడు.
“ఎవరికో వొకరికి ఏదోవిధంగా ఋణపడకుండా ఏవ్యక్తి జీవించడం అసంభవం. చివరకు అంతా స్వార్ధపరులే బాబాయి. మీదంతా వొక భ్రమ “అంది.
ముసలాయన నీరసంగా నవ్వి “ అంతా నీయిష్టం. కాని వొకటి జ్ఞాపకముంచుకో రజనీ. నీకు ఎప్పుడు ఇక్కడ స్వాగతం లభిస్తుంది” అన్నాడు.
రెండు రోజుల తర్వాతనాటి సంగతి. రామం ఆఫీసు నుంచి అలాషికారుకి వెళ్ళి లాడ్జికి తిరిగి వచ్చి, అలసి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. హఠాత్తుగా నుదుటిపై చల్లటి చెయ్యి స్పర్శ తగిలేటప్పటికి వులిక్కిపడి కళ్ళు తెరిచాడు. వెర్రివాడిలాగ చూడటం మొదలు పెట్టాడు. సంగతేమిటంటేమంచంమీద రజని కూర్చుని వుంది. మృదువుగా “ఈ వేళ కాని వేళ ఇప్పుడు నిద్ర పోతున్నారేమిటి? ఒంట్లో సరిగా లేదా? “అంది
ఇంకా రామం తను చూచే దృశ్యాన్ని నమ్మలేకపోయాడు. మతిభ్రమ కలిగిందేమోనని సందేహంతో రజని వస్త్రాన్ని నెమ్మదిగా తాకి చూచాడు, రజని నవ్వుతూ “స్వప్నంలో మనమిద్దరము చాలాసార్లు కలుసుకున్నాముకాని ఇది స్వప్నం కాదు. మీముందు సాక్షాత్కరించినది రాక్షసి” అంది.
అప్పటి నుంచి రామానికి నిజంగా ఇది స్వప్నం కాదని నమ్మకం కలిగించింది. చివాలున లేచి కూర్చుని, “రజనీ నిజంగా నువ్వేనా? ఎప్పుడు వచ్చావు? అన్నాడు
“నిజంగా నేనే సందేహంబు వలదు” అంది.
“ఎప్పుడు వచ్చావు? ఎక్కడ వుంటున్నావు?” అన్నాడు
“నిన్న రాత్రే వచ్చాను. నేను పూర్వముంటున్న ఇల్లే అద్దెకు మళ్ళీ తీసుకున్నాను నా అదృష్టం. ఇల్లు ఖాళీగా లేదు. పొమ్మనమంది మొదట. కాని, అదే సమయానికి వాళ్ళబ్బాయి బయటకు వచ్చి నన్ను చూచి అలాగే నిలబడిపోయాడు. వాళ్ళమ్మను లోనికి తీసుకు వెళ్ళి ఏమని చెప్పాడో కాని బయటకి వచ్చి ఇల్లాలు ఇంటి తాళం చెవులు ఇచ్చింది. సరే ఒక పని ముగించుకొని మళ్లా పాత ఆఫీసుకి వెళ్ళాను. అక్కడ ఆ వుద్యోగంలో ఇంకొకామె వుంది. నిరాశతో బయటకు వచ్చేస్తుంటే మా మేనేజరు నన్ను చూచి, రజనీ నీ వంటి స్త్రీకి వుద్యోగం లభించకపోవడం మాఆఫీసు దురదృష్టం కంగారుపడకు. మా ఇంటిలో నీకు వుద్యోగం ఇస్తాను. నాకువొక కూతురు, వొకకొడుకు వున్నారు. వారికి చదువు చేప్పేవంటేనెలకి వంద రూపాయిలు జీతం ఇస్తాను.” అని చిరునవ్వు నవ్వుతూ “చూచేరా అందరు నా అందానికి తన్మయులయిపోతారు. మీరొక్కసారయినా నా అందాన్ని సరిగా గుర్తించారా చెప్పండి?” అంది.
రామం చివరిమాటలను సరిగా పట్టించుకోలేదు. వంద రూపాయిలా? దానితో నీకెలా గడుస్తుంది. దారిద్ర్యం కూడా అనుభవిస్తావా రజనీ?” అన్నాడు
రజని నవ్వుతూ “నాకా భయం లేదు. మీరున్నారు కదా? అవసరానికి అప్పయినా యివ్వరా?” అంది.
రామం కుతూహలంతో “అప్పుని ఎలా బదులు తీరుస్తావు?'' అన్నాడు.
“నేనంత చేతకాని దానిననుకుంటున్నారా మీరు? రాక్షసి తలచుకుంటే రత్నాలవర్షం కురుస్తుంది. అయినా తీర్చడం ధనం రూపంలోనే చెయ్యాలా ? చెప్పండి ? మీకింకే విధమైన ఆశలులేవా!?” అంది.
“ఎందుకు లేవు రజనీ. చాలానే వున్నాయి. కాని ఆవన్నీ అడియాసలు చేసేసేవు కదా?” అన్నాడు.
“చూచారా! యీ అన్యాయం. అందరు నన్ను ఆడిపోసుకునే వారే. వంటరి దానిని, అబలను జాలిపడి సహాయం చెయ్యడానికి బదులు నామీద అభియోగాలు వేస్తారు” అంది.
“అభియోగాలు కాదు రజనీ ఫిర్యాదులు. నీ మీద నాకు చాలావున్నాయి” అన్నాడు.
“ఫిర్యాదులా? ఏవీ చెప్పండి” అంది రజని.
“అన్నీ ఒక్కసారి చెప్పేస్తే యెలా ! ఒక్కొక్కటేచెప్తాను” అన్నాడు.
“చెప్పండి రాక్షసిని చూచి భయపడకండి”. అంది
“చెప్పమన్నావు కనుక చెప్తున్నాను, నేనుండగా నువ్వు వేరేయింటికి ఎందుకు వెళ్ళావు?” అన్నాడు.
“పిలవని పేరంటానికి వెళ్ళి పార్వతి దేవిలాగా అత్మహత్య చేసుకొంటారా? మీరు పరమేశ్వరులైనాకారు, పార్వతినై పుట్టి మిమ్మల్ని పొందడానికీ” అంది.
రామం బాధపడుతూ “ఈ యింటిలోనీకు పరాభవం జరుగుతుందనినీవెన్నడైనా అనుకుంటే అది కేవలం నీదోషమే రజనీ. అలాంటి భావం కలగడం నా దురదృష్టం కూడాను” అన్నాడు.
రామం ముఖంలోని విచార రేఖలు చూచి, రజని “సరే మొదటిది అయిపోయింది. రెండవది చెప్పండి” అంది.
“నువ్వు మళ్ళీ వుద్యోగం చెయ్యవలసిన అవసరమేమి వచ్చింది రజనీ?” అన్నాడు.
“ఏం చెయ్యమంటారు? బిచ్చమెత్తుకోమంటారా ? లేక నాబోటి వారికి పొట్టగడవడం కష్టంకాదంటారా!?”.
రామం రజని ప్రశ్నకు సమాధానం యివ్వలేదు. క్షణకాలం మౌనంగా వుండి, “నిన్ను తిరస్కరించగల శక్తి కల వారెవరు ప్రపంచకంలో లేరు రజని తక్కెడలో ఏవ్యక్తి నీకు సరితూగడు, అందుకేనువ్వు సగర్వంగా “రజని ఎవరిసొత్తు ఎప్పుడు కాదు” అని ఆనగలుగుతున్నావు. నిన్ను పూర్తిగా హృదయంలో యిముడ్చుకోగలశక్తిఎవరికి లేదు” అన్నాడు.
“అది నిజమే కావచ్చు రామంబాబూ. కాని నేను అల్ప సంతుష్టురాలిని. నేను ఇతరులనుంచి ఎక్కువగా ఏమి ఆశించను” అంది.
అయితే ఇది చెప్పు రజనీ “తిన్నగా ఇక్కడకు వచ్చి “రామం బాబూ శాశ్వతంగా ఇక్కడ వుండటానికే వచ్చాను. ఇక నుంచీ నాభారంమీది.” అని ఎందుకనలేదు. ఆ మాత్రంచనువు నావద్ద నువ్వు తీసుకోలేవా?“ అన్నాడు.
“చనువు తీసుకోగలను రామంబాబూ. కాని నా భారం మీరు మొయ్యలేరు. దానికి కారణం మీరే ఇంతకు ముందు చెప్పారు. ఎప్పుడయినా సమయం వచ్చినప్పుడు మీ భారమే నేను వహించాలి కాని దానికి సమయం ఇంకా రాలేదు” అంది.
“దానికోసం జీవితంలో ఇంకా ఎంతదూరం ప్రయాణం చెయ్యాలి రజనీ. వంటరి ప్రయాణంతో విసిగెత్తి పోయాను. ఇంత జరిగిన తర్వాత ఇంకా దాపరికమెందుకు రజనీ. ఆలోటు నీవే భర్తీ చెయ్యలి, కాని నేను ప్రసాద్ లాటి వాడిని కాను. నడిసముద్రంలో నానావను వదిలిపెట్టేవంటే మునిగిపోతాను. ప్రసాద్ లాగ నావికుని మార్చలేను” అన్నాడు.
“అది నాకు తెలుసు రామంబాబూ. అందుకనే ఆలోచించి ముందు వెనుక చూసుకున్న తరువాతనే సారధ్యం వహించాలి” అంది.
రామం నీరసంగా “ఇంకెంత కాలం రజనీ! ఇన్నాళ్లు నువ్వు కలకత్తాలో వున్నంత కాలం నేనెంత బాధ ననుభవించానో నీకు తెలియదు. రాత్రింబగళ్లునీఆలోచనతోనే సతమతమయ్యే వాడిని. చూడు నేనెంత చిక్కిపోయానో?” అన్నాడు.
రామం కళ్ళలోకి రజని వొకసారి నిండుగాచూచి, స్వచ్చమైన కరుణాభరిత కంఠస్వరంతో “మీకు నేనొక సారి చెప్పాను రామంబాబూ, మీకంటే మీగురించి నాకే ఎక్కువ తెలుసు. అంతకంటే భరోసానేనివ్వలేను. అవసరం లేదు కూడాను” అంది.
“అయితే కలకత్తా శాశ్వతంగా వదలివచ్చేసినట్టేనా రజనీ” అన్నాడు.
“శాశ్వతంగా అని నేనెలా చెప్పగలను చెప్పండి? భవివ్యత్తుని భంధన చేసే శక్తి నాకెక్కడిది ? ప్రస్తుతం తిరిగి వెళ్లే ఆలోచన లేదు” అంది.
“ఈసారి తిరిగి వెళ్ళటమే తటస్థిస్తే వంటరిగా వెళ్ళవు రజనీ, అంతవరకే నాకు తెలుసును” అన్నాడు.
“ఇప్పటికే బాగా చీకటి పడింది. రజని లేచి నిలబడి ఆలస్యమయిపోయింది. రామం బాబూ ఇక నేను వెళ్ళాలి”అంది.
“ఎక్కడికి! విశాలవద్దకే?” అన్నాడు.
“విశాల వద్దకు ఇక్కడకు వచ్చేముందే వెళ్ళాను. ఇప్పుడు కమల వద్దకు వెళ్తున్నాను” అంది.
“విశాల ఏమంటోంది రజనీ ? ఆమెకెలా వుంది?” అన్నాడు.
“విశాల భారంకూడా నేనే మొయ్యాలి. ఇక నేను వీలున్నప్పుడల్లా అక్కడికే వెళ్తూ వుండాలి. చెయ్యవలసినది చాలా వుంది. ఈ కొత్త వుద్యోగంలో చాలా వ్యవధి కూడా దొరుకుతుంది. ఉదయం రెండుగంటల పని అంతే” అంది.
“రాత్రింబగళ్ళు అందరికి సేవ చేస్తూంటావు రజనీ, అందుకని నేనేమి అనను. కానీ కర్తవ్యమనేది నాయెడ కూడా నీకు వుందని మరచిపోకు” అన్నాడు.
రజని నవ్వి వెళ్ళిపోయింది.
* * * * *
ఆనాటి నుంచీ రజని, తీరిక చిక్కినప్పుడల్లా విశాల వద్ద గడుపుతూవుండేది. దానితోపాటు అక్కడ వున్న అనాధ బాలలను చేరదీసి విశాల ఆంతవరకు చేసినకృషి వృథా కాకుండా చెయ్యాలి. రజని రాక అక్కడ వున్న వారి అందరి మనస్సు రంజింపచేసింది. ఆమె సరళ స్వభావం, సహనం, మందహాసం, అందరిని సమ్మోహితులనుజేస్తాయి. ఆమెలోని ప్రత్యేకత ఏమంటే ఇతరులు ఆమెకి రుణపడి వున్నారనే భావం కలగకుండా ప్రవర్తిస్తుంది. రజనీ వారికి సేవ చెయ్యడం కేవలం, ఆమె తనకర్తవ్యాన్ని నెరవేర్చడమనే భావం కలిగేటట్లు సంచరిస్తుంది. రజని ప్రవర్తన సనల్ లో కూడ మార్పును కలిగించింది. ఇతర రోగులను, నిర్లక్యం చెయ్యడం మానివేశాడు. విశాలదగ్గర రాత్రింబవళ్ళు పూర్వపురీతిగా గడపడం లేదు. సగంభారాన్ని రజని భుజస్కందాల మీద మోపేరు. ఆమెపై అతనికి పూర్తి విశ్వాసముంది. ఆమె బుద్ధి కుశలత పై గౌరవముంది. అతను ఇంకొక విషయాన్ని గుర్తించేడు. రజని వచ్చిన తరువాత, విశాలలో ఒక విధమైన మానసిక సంతృప్తి పొడ చూపింది. ఆమెలోని పూర్వపు ఆవేదన, ఆగ్రహం అశాంతి మాయమయ్యేయి. వీటి స్థానంలో ఆత్మవిశ్వాసం, చిరునవ్వు, మనశ్శాంతి ప్రవేశించాయి. ఈ విధంగా సుమారొక నెలగడిచిపోయింది. ఈలోపున విశాల ఆరోగ్యం చాలా బాగా వుంది. నెమ్మది నెమ్మదిగా శరీరంలోని ప్రతిఘటనా శక్తి వల్ల వ్యాధి పట్టు సడలింది. విశాల ముఖములోని పూర్వపు వెలుగు రాను రాను కానవొచ్చింది. సనల్ చేసే వైద్యం చాలా అల్పమయినది చేసేది, ఇంకేమి లేక సతమతమయ్యేవాడు, రాత్రింబగళ్ళు ఆమె రూపం కళ్ళకు కట్టినట్లు కనబడేది. శ్రీఘ్రంగా ఆమెకు స్వస్థత చిక్కడానకి ఏమి చెయ్యాలా అని, రాత్రింబగళ్ళు ఆలోచించేవాడు. మానసికంగా విశాల తనకు దూరమయిపోతుందేమోననికూడా భయపడేవాడు. రజని వచ్చిన తర్వాత ఆమె కొంచెం అతనిని నిర్లక్ష్యం చేయజొచ్చింది. మొదట అది పట్టించుకోకపోయినా కొంతకాలంపోయిన తర్వాత మనస్సులో భాధపడవొచ్చాడు, విశాల అలా ఎందుకు ప్రవర్తించిందో అతను గ్రహించలేకపోయాడు. అప్పుడప్పుడు విశాలకి ఇష్టం లేకుండా వివాహం జరిగిందా అని అనుమానంపడేవారు. కాని అది అలాంటి ఆలోచన క్షణకాలం మాత్రమే నిలచేది. మరుక్షణంలోనే అలాంటి ఆలోచన వచ్చినందుకు తనను తానే నిందించుకునేవాడు.
ఇంకొక నెల కాలం గడచిపోయింది. విశాలకు బాగా నయమయిపోయింది. ఇంకొక నెలకు పూర్తి స్వస్థత వస్తుందనే నమ్మకం కలిగింది. ఈలోపున అనేక మంది డాక్టర్లు వచ్చి విశాలను పరీక్ష చేసారు. విశాలకు అవేమి ఇష్టం వుండేది కాదు. కాని పూర్వంలా రభస చేసేది కాదు. మొదటిసారి రజని అంది “ఇందులో నాకేమి అసహమయినది కాని, అసమంజసమనది కాని కనబడటం లేదు విశాలా. డాక్టర్లకు భార్య వుండటం సహజమయితే ఆమెపై అనురాగం ఉండటం కూడా సహజమే. ఇందులో సిగ్గుపడవలసింది ఏమి లేదు, ఇతర రోగులను నిర్లక్యం చేయనంత కాలం ఇది సమంజసమైనది కాదు. సమర్ధనీయమైనది కూడా” అంది.
ఆసమయంలో సనల్ కూడా అక్కడ వున్నాడు. రజని యెడ కృతజ్ఞతతో మనస్సంతా నిండిపోయింది. నిశ్శబ్దంగా కృతజ్ఞతలో వందనాలు సమర్పించాడు.
విశాల అస్వస్థత కారణంగా అందరు వీలున్నప్పుడల్లా అక్కడకువచ్చి కొంత కాలం గడుపుతూ వుండేవారు. కమల కమలాకరం, చంద్రిక, రామం తరచుగా అక్కడికి వచ్చేవారు. ఇంకొక నెలగడిచే సరికి విశాలకు పూర్తి స్వస్థత చిక్కింది. విశాలను పూర్తిగా పరీక్ష చేసి సనల్ తీసుకువచ్చినముగ్గురు డాక్టర్లు ఆమెలో ఆవ్యాధి పూర్తిగా నిర్మూలింపబడినదనిచెప్పారు. వార్త విని సనల్ సంతోషం పట్టలేకపోయాడు. డాక్టర్లను బయటకు పంపించి తన గదిలోకి వెళ్ళి ఏకధారగా కన్నీరు కార్చాడు. భరించలేని బరువైన ఆతని హృదయం భరించలేనంత తేలికయిపోయింది. కరడుగట్టిన కన్నీరు పరవళ్ళు తొక్కింది. ఆ సంతోషాన్ని సహించలేక పోయాడు. అలాగే కన్నీరు కారుస్తూ ఆ శుభవార్త చెప్పడానికి విశాల వద్దకు వెళ్ళాడు. అక్కడ కమల, రజని, విశాల వద్ద వున్నారు. సనల్ ని చూచి అందరు ఆశ్చర్యపోయారు. విశాల కంగారుపడుతూ ఏమన్నారు “డాక్టర్ ? అలా వున్నారేమిటి?”అంది.
“విశాలా నీకు పూర్తిగా క్యూర్ అయిపోయింది. పూర్తిగా నయమయిపోయింది.” అని నవ్వుతూ కన్నీరు తుడుచుకున్నాడు. అయినా కళ్లలోంచి ఆ నీరు కారుతూనే వుంది.
రజని వైపు తిరిగి “ఈ కన్నీటికి నేను సిగ్గుపడటం లేదు రజనీ.కాని నన్ను ఆశ్చర్యపరచేదేమంటే యిదంతా ఎక్కడ దాగివుంది. పదినిమిషాల నుంచి ఏకధారగా కారుతూంది” అన్నాడు నవ్వుతు .
సమాధానం కమల యిచ్చింది. “సిగ్గుపడవలసింది అందులో ఏమి లేదు సనల్ బాబూ - ఇది సహజమయినది కాదు - ఇలా జరుగకపోతే అది అసహజం కూడాను” అని ఆమె కూడా చెమర్చిన నేత్రాలని చీర చెంగుతో తుడుచుకుంది.
సనల్ “కాని యింత కన్నీరు ఎక్కడ దాగింది కమలా? కన్నీటి కర్తవ్వమేమిటి” అన్నాడు.
“సప్తసముద్రాల లోతును కొలచవచ్చు సనల్ బాబూ కాని కన్నీటిలోతుని కొలచటం అసాధ్యం” అంది కమల.
రజని అంత వరకు మౌనంగా వుండిపోయింది. ఈసారిమీరెండవ ప్రశ్నకి సమాధానం కమల చెప్పలేదు. “కన్నీరు విశాలకి నిష్కృతి సునల్ బాబూ”
“అయితే కన్నీరును నువ్వెందుకుగర్హిస్తావు కమలా?’
“గర్హించనుకాని ఎందుకో నాకీ నిష్కృతి లేదు” అంది కమల.
విశాల సంతోషాన్ని పట్టలేక కళ్లుమూసుకుని వుంది. సనల్ విశాల ప్రక్కను కూర్చుని విశాలా - అని పిలచాడు- విశాల కళ్లువిప్పి మందహాసం చేసి, సనల్ కన్నీరు తుడచి, “ఇక దీని అవసరం లేదు సనల్ బాబూ” అంది.
*************
విశాల సనల్ విశ్రాంతి కోసమని, కాశ్మీరు ప్రయాణమయ్యారు. ఇద్దరూ అలసివున్నారు. విశాల భయంకరమైన వొక యుద్దంలోంచి బయటపడింది. విజయం లభించింది. కాని ప్రయాణంతో అలసిపోయింది, సనల్ ఆవేదనతోటి, ఆతురతతోటి పూర్తిగా అలసిపోయాడు. అది కాక వివాహమయిననాటి నుంచి నూతన దాంపత్యపు సుఖం వారొక్కరోజుకూడాఅనుభవించలేదు. సనల్ తన భాద్యతలన్నిటిని తనతోటి డాక్టర్లకప్పగించి బయలు దేరాడు. విశాల అందరిని తనతో రమ్మని ఆహ్వానించింది. అందరు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. విశాల రజనిని మాత్రం రమ్మనమని పట్టుపట్టింది. మా అందరిలోకి శాంతి నీకు ఎక్కువ రజనీ యంత్రంలాగ రాత్రింబగళ్లు చాలా కాలంబట్టి పని చేస్తున్నావు. నువ్వనకపోయినా నీ శరీరం మానవ మాత్రమేచల్లటి, మనోరంజకమైన ఆ వాతావరణంలో శరీరానికి విశ్రాంతి, మనస్సుకి శాంతి లభిస్తాయి, ప్రకృతి సౌందర్వంలో వంటరితనమనే అవాంతరం కూడా తప్పుతుంది అంది.
విశాల మాటలు, రజనిలో అణచి పడిన అలసటని లేవతీసింది. నిజంగా ఆమెకు వెళ్లాలనే కోరిక కలిగింది. ఇంతకు ముందు రెండుసార్లు ఢిల్లీ వదలి వెళ్లిపోయే సమయంలో రామం చేసిన రభస జ్ఞప్తికి వచ్చింది. ఆ సమయంలో రామం అక్కడే వున్నాడు. ఒకసారి అతని వైపు చూసింది. ముఖం ప్రక్కకు త్రిప్పుకుని కూర్చున్నాడు. దీని అర్ధం ఆమె గ్రహించింది. మొట్టమొదటసారిగా రామంపై కొంచెం కోపంకూడా వచ్చింది.
“నాకు విశ్రాంతి అవసరమనే విషయం నువ్వు మాత్రమే గుర్తించగలిగావు విశాలా.ఆ బాధ్యత వున్న వాళ్లు పెడముఖంపెట్టుకు కూర్చున్నారు. అయినా రాలేను విశాలా మంచి వుద్యోగం దొరికింది. ఈసారి వదలుకుంటే ఇక బిచ్చమెత్తుకోవాలి. ఈ రోజులలో అందమైన ఆడవాళ్లకు బిచ్చం పెట్టె అన్నదాతలు కూడా కరవయిపోతున్నారు” అంది.
రామం యింకా ఏమి మాట్లాడలేదు. ముఖం కాస్త ఎర్రబడింది. విశాల సంగతి గ్రహించింది. ఒకసారి దీర్ఘంగా నిటూర్చి “నీకు యిలాంటి మాటలు అనడం ఇష్టం లేదని నాకు తెలుసు రజనీ, కాని నువ్వంటుంటావు. ఆవేశాలనుకుంటాను. జీవితంలో నీకు నేను ఋణపడినంత ఇంకెవరికి ఋణపడలేదు. ఇంకొకటి కూడా చెప్పడం నాధర్మం. నిన్ను అర్ధం చేసుకున్నంతగా యింకెవరు నిన్నింతవరకు అర్ధం చేసుకోలేకపోయారు. నిజమైన నీ విలువను పూర్తిగా గ్రహించిన వ్యక్తులు ఎవరూ లేరు” అంది.
“ఇతరులు విలువలు గ్రహించేమంటే వారి విలువను మీరు మొదట గ్రహించాలి విశాలా! అది లోటయి నప్పుడు మనం ఫిర్యాదు చెయ్యడం అవివేకం” అంది.
విశాలకు వీడ్కోలు చెప్పడానికి, రజనికి వీడ్కోలు చెప్పటానికివచ్చిన వారంతా వచ్చారు. ఈసారి రజని ఫ్లాటుఫారం మీద నిలబడి వుంది. రజని కేవలం విశాల రైలులో వుంది. ఆనాడు రజని వివాహిత యీనాడు విశాల వివాహిత యీరెండు సంఘటనల మధ్య నున్న వ్యవధిలో వ్యక్తుల జీవిత కాలలో ఎన్నో మార్పులు జరిగాయి, అందరు ఫ్లాటుఫారం మీద నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయం పటాన్ కోట వెళ్ళే ఆ రైలు బయలుదేరడానికి ఇంకొక పదినిమిషాల వ్యవధి వుంది. అందరి ముఖాల్లోను ఒక విధమైన విచారం వ్యక్తమవుతుంది. వారందరిలోను నిజంగా సంతోషంగా వున్నది ప్రసాద్ వొక్కడే. “ఇంకొక నెలరోజుల్లో నేను మిమ్మల్ని శ్రీనగర్ లోనో లేక వేగాములోనో కలుసుకుంటాను విశాల. వంటరిగా రావడం యిష్టం లేదు. ఎవరినో తోడుతీసుకువస్తాను” అని కమల వైపుక్రీగంట చూచాడు.
అతని దృష్టి ఆమెమీద పడి క్షణంముందరే ఆమె దృష్టి మరల్చింది.
“కాశ్మీరులో కేవలం కాలం గడపడానికి చాలామంది వస్తారు ప్రసాద్. కాని అంతకు మించి, అందరి వద్ద నుంచి ఆశించకు,నన్ను తీసుకు వెళ్తావా ప్రసాద్” అని నవ్వింది.
“గర్వంతో అడిగిన ప్రశ్నయినా నేను దానిని గౌరవిస్తున్నాను. ప్రపంచంలో ఎవరయినా నీ తర్వాతే రజనీ! “కాని నువ్వు రావని నాకు తెలుసు ఆరోజులు శాశ్వతంగా గడచిపోయాయి అన్నాడు”.
కమల ఎందుకో ప్రసాద్ మాటలని సహించలేకపోయింది. మౌనంగా కూడా వుండలేకపోయింది. “వ్యక్తుల లాగే వ్యక్తుల విలువలు కూడా చంచలమయినవని మొదటిసారి నువ్వు మాయింటికి వచ్చి నప్పుడన్నావు రజనీ జ్ఞాపక ముందా?” అంది.
కమల అకస్మాత్తుగా అడిగిన ప్రశ్న అందరికి అసందర్భంగా కనబడింది.
రజని మాత్రం అర్థం చేసుకుంది.
“ఎందుకు జ్ఞాపకం లేదు కమలా, నువ్వప్పుడు చాంచల్యం గర్హనీయం కాదా అన్నావు. అది కూడా జ్ఞాపకం వుంది” అంది.
రజని మాటలు విన్న తరువాత ప్రసాద్ కి కమల ఆ ప్రశ్న ఎందుకు వేసిందో అర్థమైంది.
విశాల వీరిమాటలు వింటూనే వుంది. కాని ఆమె దృష్టి రెండుమూడు గజాల దూరంలో వంటరిగా నిలబడి వున్న రామంమీద పడింది. దగ్గరకు వెళ్ళి “రామంబాబు వెళ్ళే లోపల మీతో ఒక మాట చెప్పాలని వుంది. చెప్పమంటారా? అంది.
“చెప్పు విశాలా” అన్నాడు రామం.
విశాల “మీకు పూర్వజన్మపై నమ్మకముందా చెప్పండి? అంది.
విశాల ప్రశ్నవిని రామం ఆశ్చర్యానికి అంతం లేదు. “ఎందుకు విశాలా! అన్నీ వుంటే మనమిద్దరము క్రిందటి జన్మలో కవలపిల్లలమని, నామనస్సు ఈనాడు చెప్తోంది. మన యిద్దరి స్వభావాల్లో ఏకీభవించినంతగా ప్రపంచకంలో ఇంక యేఇతర హృదయాలు సన్నిహితం కాలేదు. ఇది మీరు గుర్తించారో లేదో నాకు తెలియదు” అంది.
“పూర్తిగా గుర్తించకపోయివుండచ్చు విశాలా, కానీ నా వ్యధకి హృదయానికి మొదటి నుంచీ నేనంటేసానుభూతి సహాయం లభించాయి. అది నేను మరచిపోలేదు ” అన్నాడు.
గార్డ్ ఆకుపచ్చటి దీపం వూపడం మొదలు పెట్టాడు. అది చూచి విశాల కంగారుగా అందరివద్ద చివరిసారిగా వీడ్కోలు తీసుకుని రైలెక్కింది. గంభీరంగా శబ్దం చేసుకుంటూ రైలు ముందుకు సాగిపోయింది.
******