Read The shadow is true - 39 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 39

విద్యాదరి రాహుల్ ఇంటికి వచ్చి వారం రోజులైంది . ఈ వారం రోజుల్లో తన అత్తగారికి మరింత చేరువైంది . ఆమెతో అనుబంధం పుర్వజన్మదే అయినా

ఆ భావం విద్యాధరి లో లేదు . ఆమె తో ఉన్నప్పుడు విద్యాధరి తన ఉనికి మరిచిపోయి పూర్తిగా కోమలాదేవి లా ప్రవర్తిస్తుంది . ఈ విషయం లో ముసలావిడ ఆశ్చర్యం, ఆనందం అంతా , ఇంతా కాదు. ఇప్పుడు ఆమెకు ఒకే బాధ . కోడలుంది . పెద్ద కొడుకు లేడు . విక్రం సింహ్ ప్రస్తావన వచ్చినప్పుడు ముసలావిడే కాదు , కోమలా దేవి లా స్పందించే విద్యా కూడా ఉదాసీనం గా మారిపోతుంది . కానీ—ముసలావిడకు విక్రం లేని లోటు ప్రత్యక్ష అనుభవం. విద్యాధరి కి ఓ బాధా వీచిక , మధుర స్మృతి .

ఒక సాయంకాలం విద్యాలయం రోడ్డు వెంబడి విద్యాధరి , రాహుల్ నడవ సాగారు . పచ్చటి పర్వతాలపై నుండి మలయ మారుతం శరీరాలను తాకి వెళ్లిపోతుంటే ఇద్దరికీ చాల హాయిగా ఉంటుంది .

రెండు విభిన్న వ్యక్తిత్వాల మిశ్రమ స్పందన చాలా చిత్రం గా ఉంటుంది . ఎవరు, ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలుసుకోవటం చాలా కష్టం . ఆ వ్యక్తి మనసు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తినే నీడలా అనుసరించాలి . ఆ పని భరత్ రామ్ రాహుల్ కు అప్పగించాడు . పైగా విద్యాధరి ( ఆమె లో కోమల ) ఎక్కువగా రాహుల్ సాన్నిహిత్యం కోరుకుంటోంది . తన మనసులో భావాలు కొడుకు లాంటి రాహుల్ తో పంచుకోవటం సహజం .

“ మీ చిన్నాన్నను అందరి ముందు దోషిలా నిలబెట్టాలంటే ఒక సంధర్భం కలిసి రావాలి . ఆ సంధర్భం అతడి పై మనం చేసే ప్రతిఘటన కు అనుకూలంగా ఉండాలి . we need a common platform ...”

“ అలాంటి సంధర్భం కోసం భరత్ రామ్ అంకుల్ , జస్వంత్ జీ తెగ ఆలోచిస్తున్నారు . ఏవో రెండు మూడు ప్రపోజల్స్ వారి మనసుకు నచ్చాయి . అందులో ఏది మన ప్రయత్నానికి అనుకూలంగా ఉంటుందో అన్న అభిప్రాయానికి

వారింకా రాలేక పోతున్నారు . ఇంకా ఏవో సందేహాలు , అనుమానాలు, అవన్నీ తొలగి పోవాలి . .. ఏ ప్రపోజల్ అయినా నీకు అన్నివిధాలా నచ్చితేనే అడుగు వేసేది . నిన్ను కాదని , నీకు నచ్చని ప్రయత్నం ఏదీ చేయం . “ అతడి చివరి మాటకు చిన్నగా నవ్వింది .

“ నాకెందుకో మన ప్రయత్నం లేకుండానే మనకో సంధర్భం కలిసి వస్తుందనిపిస్తూంది . “

“ అదెలా ?” ఆశ్చర్యం గా చూశాడు రాహుల్ .

“ నా విషయం లో ఇప్పటి వరకు అన్నీ అద్భుతాలే జరిగాయి . నా పునర్జన్మకు ఒక ప్రయోజనం ఉందని మీరందరూ ఒప్పుకున్నారు . మరి- అది నిజం కావాలంటే మరి కొన్ని అద్భుతాలు జరగాలిగా ?”

“ నిజమే . కాని ఏదో జరుగుతుందని , జరగాలని చేతులు ముడుచుకొని కూర్చోలేముగా ?”

అతడి ప్రశ్నకు ఆమె జవాబు మరో చిరునవ్వు . ఈ విషయం లో తనకు అఘోరి తోడ్పాటు ఉంటుందని ఆమె అంతర్వాణి పదే పదే చెబుతోంది . కానీ, ఆ మాట రాహుల్ తో అనలేదు . “ మీ చిన్నాన్నను కలవటానికి ముందు ఒక్కసారి మన దేవిడీ లో అప్పటి కోమలాదేవిలా తిరగాలని ఉంది . వీలవుతుందా ?”

ఆశ్చర్యం గా చూశాడు రాహుల్ . ఈ కోరిక ఉద్దేశ్యమేమిటి ? . కారణం ఊహించలేక పోయాడు .

కొన్ని అనూహ్యమైన సంఘటనలు ఒక్కొక్కసారి నిర్ణయాలనే తారుమారు చేస్తాయి . దాచాలనుకున్న కొన్ని రహస్యాలను వెలుగులోకి తెస్తాయి .

హైదరాబాదు లో సాగర్ తో మాట్లాడిన తర్వాత రుపాదేవికి రాహుల్ ను కలవాలనిపించింది. అందుకే తిరుగు ప్రయాణం లో రెండు రోజులు అరకు లోయ లో ఉండిపోయింది . ఇది ఎవరూ ఊహించని పరిణామం . ముందుగా వస్తున్నట్లు ఫోనులో మాట్లాడింది గనుక రాహుల్ జాగ్రత్త పడ్డాడు . విద్యాధరిని తప్పించగలిగాడు . నాన్నమ్మకు విద్యాధర వివరాలు చెప్పవద్దని సూచనలు చేశాడు . ఆమె ‘ఎందుకు అన్న ప్రశ్నకు అతడి వద్ద జవాబు లేదు . జవాబు చెప్పలేని నిస్సహాయ స్థితి లో దిక్కుతోచక కాళ్ళబేరానికి దిగాడు .

రూపాదేవి వచ్చింది . తన హైదరాబాదు ప్రయాణానికి ఏదో కారణం చెప్పింది . ఆమె చూపుల్లో, మాటల్లో అడుగడుగునా ఏదో చెప్పుకోలేని బాధ . కనిపించింది . ఎప్పుడూ లేనిది అత్తగారి ఒల్లో తలదాచుకుని కరువుదీరా ఏడ్చింది . ముసలావిడకు సంధర్భం అర్థం కాలేదు . మనవడు విద్యా వివరాలు రుపాదేవితో చెప్పవద్దన్నాడు . అందుకు కారణం తెలియక అయోమయం లో ఉంటే రూపాదేవి ఒళ్ళో పడుకొని బోరుమనేసరికి ఆమెకు పూర్తిగా మతిపోయింది . వెర్రిగా మనవడిని చూసింది . రాహుల్ రెండు చేతులు జోడించాడు .

తిరిగి వెళ్లేముందు తనను ఉద్దేశించి రూపాదేవి అన్న మాటలు రాహుల్ని కదిలించాయి . చలించని ఆత్మవిశ్వాసంతో నిండు కుండలా కనిపించే పినతల్లి లో మొదటిసారి సంఘర్షణ , తనపై సానుభూతి చూడగలిగాడు .

“ ఊరిని పూర్తిగా మరిచిపోయావు . మా సంగతి సరే సరి . మాతో మాట్లాడటం ఎప్పుడో మానేశావు . కనీసం మీ నాన్నమ్మ యోగక్షేమాలు తెలియ జేయటానికి మాతో అప్పుడప్పుడు మాట్లాడవచ్చు గదా ?” రూపాదేవి స్వరం లో లాలన, అర్తింపు, రాహుల్ ను కలవరపెట్టాయి . జవాబు చెప్పలేక తలవంచుకున్నాడు . తన భర్త కిరాతకం ఆమెను ఎంత కృంగదీసిందో వడలిన ఆమె మొహమే చెబుతుంది .

“ మీ చిన్నాన్న అంటే నీ కంత అభిమానం లేదు . వీలైనంతవరకు ఆయనకు దూరంగా ఉండాలనే ప్రయత్నిస్తావ్ .” రాహుల్ చూపులు తిప్పుకున్నాడు .

“ అందుకు కారణాలు అడిగి నిన్ను విసిగించను . కారణం తెలుసుకొని నిన్ను సమధానపరచవలసిన మీ చిన్నాన్నే మౌనం గా ఉంటే నేనెలా జోక్యం చేసుకోను ? ..ఒక్కటి మాత్రం చెప్పగలను .ఆయనకు భార్యనైనంత మాత్రాన ప్రతి విషయం లో ఆయనకు అనుకూలంగా ఉండాలని లేదు . ...ఉండను . నా ఆలోచనలు, నా నిర్ణయాలు నావి . “ రాహుల్ ఆర్తిగా ఆమెనే చూస్తున్నాడు . ఆమె ప్రేమగా అతడి భుజం పై చెయ్యివేసింది . కళ్ళల్లో తడి .

“ రాహుల్ ! నన్ను అమ్మా అని పిలుస్తావా ? ఆ పిలుపు కోసం నేనేం చేయాలి ? నా ప్రాణాలు ఇవ్వమంటావా ?” ఆమె గొంతు వణికింది .

******************************

కొనసాగించండి 40లో