Read The shadow is true - 6 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 6

ఇప్పుడు ఆమె కలల్లో అస్పష్టత తొలగి, కొన్ని స్పష్టమైన రూపాలు , ప్రదేశాలు కనిపించసాగాయి. అ వివరాల ప్రకారం ఆమె మనసులో మెదిలే ప్రదేశాలు, పరిసరాలు, భౌగోళిక స్వరూపం రాజస్థాన్ రాష్ట్రానివని భరత్ రామ్ గుర్తించాడు.

విశాల రాజస్థాన్ లో ఆమె వర్ణించే ప్రదేశాలు ఎక్కడని వెదకటం ? వెంటనే భారత్ రామ్ కు ఓ రాజస్థాన్ మిత్రుడు గుర్తుకొచ్చాడు.అతడే శాంతిలాల్ .వృత్తిరీత్యా వ్యాపారస్తుడు. రాజస్థాన్ లో మూల మూల పరిచయం వుంది. భరత్ రామ్ అతడిని సంప్రదించాడు. విద్యాధరి కధనం సాంతం విన్నాక శాంతిలాల్ మనసులో రెండు ప్రదేశాలు మెదిలాయి. అ రెండు ప్రదేశాలు గ్రామీణ వాతావరణం లో ఉన్నవే.

భరత్ రామ్ అన్ని కోణాల్లో సమస్యను పరిశీలించాక ఒక నిర్ణయానికి వచ్చాడు.

అయన సూచన ప్రకారం సాగర్, విద్యాదరి ఒకసారి రాజస్థాన్ లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించాలి. ఇందువల్ల విద్యాధరి సమస్యకు ఒక బ్రేక్ త్రూ వస్తుంది.

,గాలి మార్పు, ప్రదేశం మార్పు వల్ల ఆమెకు రిలీఫ్ కూడా ఉంటుంది. ఈ ప్రయాణం లో విద్యాధరిలో కలిగే మార్పు , మానసిక స్థితి సాగర్ ఎప్పటికప్పుడు భరత్ రామ్ కు తెలియ చేయాలి.

విషయం పూర్ణ తిలకానికి తెలిసింది. ఆమెలో మిక్స్డ్ ఫీలింగ్స్ కనిపించాయి. కోడలి పరిస్థితి పై ఆందోళన కొంత,ఎజ్ద్ హోం వ్యవహారం లో తన పెద్దరికాన్ని , పెంపకాన్ని సవాలు చేసిన కారణంగా శాడిజం తో కూడిన ఆనందం కొంత కనిపించాయి.

అపూర్వ చరిత్ర గల రాజస్థాన్ సందర్శనం విద్యాదరి , సాగర్ కు నిజం గానే మంచి రిలీఫ్ ఇచ్చింది. ఈ ట్రిప్ తో విద్యాధరిలో ఆశించిన మార్పు కనిపించింది. ఆమె లో దైన్యం ద్వంద్వ మానసిక స్థితి అంతరించి పోయాయి. ఓ విధమైన చలాకి తనం , హుషారు ఆమెను కెరటాల్లా చిందులు వేయించాయి. ఆమె లో ఇన్నాళ్ళు గుంభనం గా ఉన్న బావ వల్లరి , ఓ చిత్రమైన ఎమోషనల్ స్టేట్ ఒక్కసారిగా జలపాతం లా ఉరికాయి. ఆమె ప్రతి కదలిక, ప్రతి మాట సాగర్ కు విలక్షణం గా , విచిత్రం గా అనిపించ సాగాయి. ఆమె లో ‘ మరో మనిషి ‘ ఉన్నట్లు అనిపించింది.

ఈ ప్రయాణం లో వారికీ చాల మంది స్థానికులు పరిచయమైనారు. వారిలో మనోహర్ సింగ్ అనే గైడు విద్యాధరి, సాగర్లకు చాలా సన్నిహితుడైనాడు. వయసులో , అనుభవం లో పెద్దవాడు. మంచి మనసు, సంస్కారం గల వ్యక్తీ, పరిచయం అయిన కొద్దిరోజుల్లోనే వారికీ సన్నిహితుడై పోయాడు.

రోజులు గడిచే కొద్దీ విద్యాధరి ప్రవర్తనలో అలవాట్లలో ఊహించని మార్పులు కనిపించ సాగాయి. అక్కడి ప్రదేశాలు అంతకు ముందే తెలిసినట్లు , వాటితో తనకేదో ‘బంధంవున్నట్లు ప్రవర్తించ సాగింది. అసంకల్పితం గా ఆమె వ్యక్తపరిచే భావాలు, కొన్ని కొన్ని సత్యాలు సాగర్ ని, మనోహర్ సింగ్ ను విస్మయ పరిచేవి. ఆమె చూపులో , కదలిక లో, మాట తీరు లో మరో వ్యక్తిత్వపు ఛాయలు స్పష్టం గా కనిపించాయి. ఈ మార్పులు ఎప్పటికప్పుడు సాగర్ భరత్ రామ్ కు తెలియ చేస్తుండే వాడు.

విద్యాధరి లో మరో ఆసక్తి కరమైన మార్పు : నిద్ర లో పలవరింతలు : ఆ పలవరింతల్లో ఆందోళన, ఆవేదన తీవ్రస్థాయిలో వ్యక్తమవ సాగాయి. ఈ మార్పు తో సాగర్ పూర్తిగా కంగారు పడి పోయాడు. అతడికి సుదర్శనం , భరత్ రామ్ లోకేషన్స్ కు వచ్చారు. విద్యాధరి పరిస్థితి సమీక్షించారు. ఆ సమీక్ష లో , పరిశీలన లో ఆమె పూర్వజన్మ రాజస్థాన్ ప్రాంతానికి సంబంధించిందన్న విషయం రూడి అయింది.

గత జన్మ అనుభవాలు ఓ మంచు తెరలా మనసును ఆవహించి కాలంతో పాటు కరిగి పోవటం మాములుగా కొందరి విషయం లో జరిగే ఆస్కారముంది. కానీ—విద్యాధరి పరిస్థితి ఇందుకు భిన్నం గా ఉంది. పూర్వ జన్మ స్మృతులు ఆమె మెంటల్ ప్లేన్ ను క్రిందు మీదు చేస్తున్నాయి. ఆమె తీవ్రస్థాయి లో మానసిక అశాంతికి గురి అవుతోంది.నాటి జీవితానికి సంబంధించిన ఓ ‘కీ పాయింట్ పజిల్లా విద్యాధరిని పట్టి కుదిపేస్తుంది. అది తెలిసే వరకు ఆమె కు ఈ నరకం తప్పదు.

విద్యాదరి లో క్రమక్రమం గా రూపు దిద్దుకుంటున్న ‘ మరో మనిషి సాగర్ ని తీవ్ర ఆందోళన కు గురి చేస్తుంది చూస్తుండ గానే విద్యాధరి వ్యక్తిత్వం కనుమరుగై ఆమె లో నే మరో వ్యక్తీ కనిపించడం అతడు తట్టుకోలేక పోతున్నాడు . తన భార్యే తనకు పరాయి స్త్రీ లా , కొత్త గా అనిపిస్తోంది. దీనికి తోడు అతడి లో మరో అసంతృప్తి చోటు చేసుకుంది . విద్యాధరి లో ఈ అనూహ్య మార్పులు చోటు చేసికోన్నాక అతడు దాదాపు దాంపత్య జీవనానికి దూరమయ్యాడు. ఒక రకం గా రాజస్థాన్ ట్రిప్ వారికి హనీమూన్ యాత్ర లాంటిది. పగలంతా అందమైన ప్రదేశాల్లో ఆనంద విహారం. రాత్రి వేళ సర్వం మరిపించే ఏకాంత వాసం . హద్దుల్లేని శృంగారానికి ఇంతకూ మించి అవకాశం ఉంటుందా ?

విద్యాధరి మానసిక అశాంతి సాగర్ కు దాంపత్య సుఖానికి ఆస్కారం ఇవ్వ లేదు. భర్త తో సహకరించే మూడ్ ఆమె కు అసలు లేదు. ఉదయం పూట చారిత్రక ప్రదేశాల్లో సందర్శనం చలాకీగా అనిపించినా రాత్రి అవుతుందంటే చాలు భయంతో వణికి పోయేది. హాంటింగ్ ఇమేజెస్ ఆమెను నెర్వస్ గా మార్చి వేశాయి. ఇక వేరే ఆలోచనలకు అవకాశామేది. ? ఈ మార్పు తో సాగర్ లో చిరాకు, అసహనం చోటు చేసుకున్నాయి.

ఆ మార్పుకు బాధ పడటం తప్ప విద్యాధరి ఏమి చేయలేక పోయింది. నిజానికి ఆమె నిస్సహాయత సాగరే సానుభూతి తో అర్ధం చేసుకోవాలి. అది జరగ లేదు. పైగా రాను రాను అతడు మూడీ గా , ముక్తసరిగా ఉంటున్నాడు. ఉన్న బాధల్లో విద్యాధరికి ఇదొకటి.

భరత రామ్ సాగర్ ప్రవర్తన లో మార్పు చూసాడు. అతడు అన్ని విధాలా విద్యాధరికి దూరమవుతున్నాడు. ..త్వరగా విద్యాధరి అశాంతికి క్లూ తెలుసుకొని వారిని దగ్గర చేయాలి.

విద్యాధరికి తరచూ కనిపించే గ్రామాల్లో ఒక గ్రామానికి తరతరాల చరిత్ర ఉంది. రాజస్థాన్ సంప్రదాయాలకు , ఆచారాలకు ఆగ్రామం కేంద్రం.ముందు ఆ గ్రామాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు.

గైడ్ మనోహర్ సింగ్ ,శాంతిలాల్, భరత్ రామ్, సుదర్శనం, సాగర్ ,విద్యాధరి ఆ గ్రామానికి బయలు దేరారు.వాన్ లో అందరూ సూర్యోదయానికి ముందే ప్రయాణ మయ్యారు. ప్రయాణమంతా విద్యాధరి సీటుకు జారగిలబడి మగతగా ఉండిపోయింది. భరత్ రామ్ విద్య ను ఈ ప్రయాణానికి మానసికం గా సిద్ధం చేసాడు.

తెలతెల వారు తుండగా వ్యాన్ గ్రామం ప్రవేశించింది. అక్కడ అడుగడుగునా రాజపుత్ర

సంప్రదాయం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. చుట్టూ ఎంతో చైతన్యం.

గ్రామం లో సందడితో విద్యాదరి కళ్ళు తెరిచింది. ఎంతో ప్రజా చైతన్యం . పనులకు వెళ్ళే గ్రామవాసుల కలకలం. పొలం పనికి వెళ్ళేవారు, నెత్తిమీద మూటలతో, బుట్టలతో, కుండలతో పొరుగు బస్తీ కి కూరగాయలు పలు, పెరుగు అమ్మడానికి వెళ్ళేవారు -ఆ గ్రామం ప్రధాన వీధిలో అంతా కోలాహలమే.

భరత్ రామ్ సూచనతో వ్యాను నెమ్మదిగా ముందుకు పోతుంది. గ్రామస్తులు వ్యాను వైపుకు కుతూహలం గా చూస్తున్నారు .

భరత్ రామ్ విద్యాధరి ముఖం లో మారుతున్న భావాలు గమనిస్తున్నాడు . ఆమె కళ్ళలో సంభ్రమం, సంతోషం, పోటీ పడుతున్నాయి. ఆమె క్రమక్రమం గా తన ప్రస్తుత మానసిక, భౌతిక అస్తిత్వం మరిచిపోతోంది.

మరి కొంత దూరం వ్యాన్ ముందు కు వెళ్ళాక విద్యాధరి నోటి వెంట ఓ వ్యక్తీ పేరు బులెట్ లా దూసుకు వచ్చింది. ఆమె చూపులు ఒక ఇంటిపై నిలిచిఉన్నాయి. వ్యాన్ ఆగింది. డోర్ తెరుచుకొని విద్యాధరి పరుగులాంటి నడక తో ఆ ఇల్లు సమీపించింది.అప్పుడే లోపల్నుంచి ఓ వృద్ధుడు వచ్చాడు.అతడిని చూడగానే ఆమె నోటివెంట మాటలు వరదలా పొంగాయి. విద్యాధరి వాలకం, వాగ్ధాటి చూసి అతడు తెల్లబోయాడు. ఆమె చెప్పే విషయాలకు , వివరాలకు ఆ వృద్ధుడు నిశ్చేస్టుడైయ్యాడు.

ఆమె కట్టు-బొట్టు ఆధునికం గా ఉంది. పైగా ఈ ప్రాంతానిది కూడా కాదు. ఆమె లో తనకు చిరపరిచితమైన ఓ వ్యక్తి రూపురేఖలు , లీలగా గోచరిస్తున్నాయి.

మాట మాట కలిసిన కొద్ది క్షణాల్లోనే ఆమె ఎవరో అ వృద్ధుడికి తెలిసిపోయింది. ఆమె దాదాపు మూడు దశాబ్దాల క్రితం గతించిన తన యజమాని భార్య ... కోమలాదేవి.!!

అతడిలో అవధులు మించిన ఆనందం, ఆశ్చర్యం కనిపించాయి. ఇదెలా సాధ్యం ? మరణించిన మనిషి ఇలా- ఇన్నాళ్ళకు మెరుపులా కనిపించటం ఏమిటి ? అతడు కంగారు పడ్డాడు .

శాంతిలాల్, మనోహర సింగ్, భరత్ రామ్ సూచన తో సందర్భం వివరించి అ వృద్ధుడిని శాంత పరిచారు. వాళ్ళ చొరవ తో అతడి ఆరాటం తగ్గింది. విద్యాధరి పట్ల భక్తీ, గౌరవం కలిగాయి. వారిద్దరు గతం లోకి వెళ్ళిపోయారు. ఆనాటి రోజుల్ని , అప్పటి సంఘటనల్ని నెమరు వేసుకున్నారు.

విద్యాధరికి గత జన్మ పూర్తిగా అవగాహనకు వచ్చింది. కోమలాదేవిగా తన వ్యక్తిత్వం, ఆనాటి అనుభవాలు , అనుభూతులు , జీవన గమనం లో చవి చూసిన చేదు నిజాలు పుస్తకంలో పుటల్లా రెపరెపలాడాయి.

వాటి ప్రభావానికి ఆమె నిలువెల్లా కదిలి పోయింది. పేరుపేరు నా గుర్తు చేసుకుంటూ ఆ గ్రామం లో మూల మూల తిరిగింది. వెల్లువలా పెరుగుతున్న జ్ఞాపకాలు ఆమె నోటివెంట జలపాతం లా ఉరకలు వేశాయి. ఆమె చిత్ర విచిత్రమైన కధనానికి సాగర్ , తదితరులు దిమ్మెర పోయారు.

అన్నీ శాస్త్రీయం గా అధ్యయనం చేయగల భరత్ రామ్ అడుగడుగునా ఆశ్చర్య పోతున్నాడు. ఇక సామాన్యుల సంగతి ఎంత ?


************************************************"**. కొనసాగించండి 7లో