Read The shadow is true - 1 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

  • కిల్లర్

    అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 1

నీడ-నిజం

నాంది

హిమాలయ పర్వత ప్రాంతం లో ఒక గుహాన్తర్భాగం. సాయం సంధ్యారుణ కిరణాలు గుహలో ప్రసరిస్తున్నాయి. సమస్త ప్రకృతి ప్రశాంతం గా , ప్రమోదం గా ఉంది .

గుహలో ఒక మూల శిలావేదిక పై వృద్దుడొకడు పద్మాసనం లో ఉన్నాడు. అతడికి చేరువలో నేలపై ఒక నడివయసు వ్యక్తీ . కళ్ళలో దైన్యం , మొహం లో సఘన విషాదం .

ఇందుకు భిన్నంగా వృద్ధుడి ముఖం లో అనంత దీప్తి, తృప్తి, కళ్ళు, జ్ఞానంతో , అనుభవం ప్రసాదించిన నిండుదనంతో జ్యోతుల్లా వెలుగు తున్నాయి.

“ చిన్మయా ! మనో నిగ్రహం తో ,సాధన తో, రాగ-ద్వేషాలను జయించావు. నీలో ఈ అవ్యక్తం ఏమిటి ?” వృద్ధుడి కంఠంలో రవ్వంత విస్మయం , వినోదం.

“ గురుదేవా ! ఇది అవ్యక్తం కాదు . మన ఇద్దరి మధ్య తీగె లా అల్లుకున్న అనుబంధం. ఈ సమస్త సృష్టికి మూలం. పరాత్పరి ప్రేమ తత్త్వం. ఆ ప్రేమ రాగాత్మక భక్తీ భావన కు చరమ లక్ష్యం కాదా ? భక్తీ తో అభిషిక్తం కాని జ్ఞానం ఎందుకు ? ఎవరి కోసం ? ప్రేమ హృదయం లో ఉప్పొంగే సహజ భావన.అమృతధార.మన గురు శిష్య సంబంధం ఆ ప్రేమ తత్వానికి అతీతం కాదు. ఇన్నేళ్ళ మీ సాహచర్యం నాకెన్నో అనుభవాల్ని మిగిల్చింది. నన్నొక సాధకుడిని చేసింది. పడవ ప్రమాదం లో నా వాళ్ళందరిని పోగొట్టుకున్నాను. . ఒంటరిగా మిగిలాను. మీ పరిచయం కాకపొతే నా జీవితం కూడా గంగ పాలయ్యేది. నన్ను చేరదీసారు. ఆదరించారు. జ్ఞాన బోధ చేసి స్వ స్వరూప జ్ఞానం కలిగించారు.నా సాధన, సంయమనం, స్ఫూర్తి మీరు పెట్టిన బిక్ష. మీరు పరిచయం కాకుంటే నా అస్తిత్వం మహా శూన్యంలో కలిసిపోయేది.మరి ఈ సాహచర్యం

అనుబంధం ఈ నాడు మీ మహాభి నిష్క్రమణంతో దూరం అవుతుంటే బాధగా ఉండదా ? చెప్పండి గురుదేవా. భవబంధాలు త్రెంచుకున్న మాత్రాన సహజ భావనలు ,అనుభూతులు చంపుకోవాలా ? వాటిని వ్యక్తం చేసే అధికారం సాధకుడికి ఉండకూడదా ? “ చిన్మయానందుడి స్వరం గద్గద మైంది.

గురుదేవుడు చిద్విలాసం గా చిరు నవ్వు నవ్వాడు. “ నా మాటలో అంతరార్ధం నీకు

బోధపడలేదు చిన్మయా! అవ్యక్తం లో పడవద్దన్నాను. అనుబంధం త్రెంచుకోమనలేదు. నిజమే ... హృదయం లో ఉప్పొంగే ప్రేమ తత్వానికి ప్రతి రూపమే . కాని... ఆ పవిత్ర భావన మోహం, మాయ, మాయ లాంటి మానవీయ బలహీనతలకు చిక్కి నీరసించి పోరాదు. నా నిష్క్రమణ అనివార్యం.ఎవరు తప్పించలేని ప్రకృతి ధర్మం . సహజ పరిణామం. ఈ తత్వం తెలిసి కూడా నువ్వు సామాన్యుడిలా వాపోవటం నీ వంటి వాడికి శోభిస్తుందా?”

సమాధానం చెప్పలేని చిన్మయుడు తలవంచుకున్నాడు.

“ నీ ప్రేమను పామరుడిలా సంకుచితం కానీకు ! విశ్వ వ్యాప్తం చేయి. మానవ కల్యాణానికి వినియోగించు .” గురుదేవుడి స్వరంలో ఉద్వేగం.

కొన్ని క్షణాలు పరమ మనోహరంగా మౌనం గా గడిచాయి. తత్వం బోధపడినట్లు చిన్మయానందుడు గురువుగారిని సాభిప్రాయం గా చూసాడు. ఆ చూపులో భావం గుర్తించిన గురుదేవుడు మంద్రస్వరం లో చివరి సందేశం వినిపించాడు.

"చిన్మయా! నీ అనితర సాధన , అమేయ సంకల్పం నిన్నొక పూర్ణ పురుషుడు గా తీర్చిదిద్దాయి. నీకిక ఎవరి సహకారం ,సాంగత్యం అవసరంలేదు. నీవిప్పుడు మరొకరికి మార్గదర్శివి. ఎంతో శ్రమ కోర్చి, ఇంత జ్ఞాన సంపదను సంయమ స్థితిని పొందగాలిగావు . కానీ నాలాగ ఈ మంచు కొండలకే పరిమితమై పోకు. జనస్రవంతి నుండి ఇటు వచ్చిన అరుదైన వ్యక్తివి. ఘోర నిరాశావాదం నిన్ను కబలించి వేస్తున్నప్పుడు దైవికం గా నాకు దొరికావు. నేడు ఈ స్థాయికి ఎదిగావు. ఇప్పుడు నీకొక బాధ్యత అప్పగిస్తున్నాను. లఘులోలకం లా సుఖదుఃఖాల నడుమ ఊగిసలాగే మానవాళికి మాటలతో, చేతలతో ఊపిరి పోయి.......! ఊతం కా ! వారిని కర్తవ్య పధం లో ముక్తి మార్గం లో నడిపించు.మానవ సేవకు మించిన మహాదాశయం ఇంకొక్కటి లేదు. మహాత్ములంతా జనజీవనం తో కలగలిసి తమ విశుద్ధ వర్తనంతో ఉపదేశంతో మార్గదర్శకులైనారు. ముక్తిని సాధించారు. అదే ఆదర్శం నీకు శిరోధార్యం . ఆచరణతో

ఆత్మ విమర్శతో అందరికీ నువ్వు ఆదర్శం కావాలి. . మరో మాట-‘ అతిథి దేవో భవ’ అని నిన్ను ఆదరించిన ఇల్లాలు కోమలాదేవి ఋణం నువ్వు తీర్చుకుంటావు . ఇది నా భవిష్యవాణి .” చివరి మాట ముగించి మందహాసం చేసాడు గురుదేవుడు.

శిష్యుడి కి ఆ మందహాసం లో అంతరార్థం ఎంత ఆలోచించినా స్ఫురించ లేదు . గతించిన కోమలాదేవి ఋణం తీర్చుకోవటం ఏమిటి ?

గురుదేవుడు కాలం చేసాడు. చిన్మయానందుడు ఒంటరిగా మిగిలాడు .అతడి సందేహం కూడా శేషప్రశ్న లా మిగిలి పోయింది.

రోజులు గడుస్తున్నాయి. భవిష్యత్తు ఎలా ఉందో. ?

చిన్మయుడు ధ్యాన ముద్ర లో కూర్చుని ఉన్నాడు. అతని ధ్యానం అద్వితీయం. మనసు ను ఏకాగ్రత చేసి, అంతరంగ మధనం చేయడంలో సిద్ధహస్తుడు. సమాధి స్థితి లో పొందే చైతన్యం కోసం నిరంతరం తపిస్తుంటాడు.. ధ్యానం లో తనను తాను పరీక్షించుకుంటూ ఉంటాడు. అంతర్లీనంగా కలిగే సందేహాలను తీర్చుకుంటూంటాడు..

అతడొక సత్యాన్వేషి. నిత్యాన్వేషి.


*************************************************

కొనసాగించండి 2 లో