Read The shadow is true - 5 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 5

అఘోరి వెంటనే మాట్లాడలేదు. మౌనం గాఉండి పోయాడు. “ మీ నవీన విజ్ఞానం కార్యాకారణాల పై ఆధార పడుతుంది. ప్రతి విషయానికి మీకు కారణం కావాలి. కారణానికి అందని విషయం మీ దృష్టిలో అభూత కల్పన. ప్రతి చిన్న విషయాన్ని తర్కించి, నిజానిజాలు నిగ్గు తేల్చే మీరు ఈ అనంత సృష్టికి ఒక మహత్తరమైన కారణం ఉందని ఎందుకు ఒప్పుకోరు. ఈ మహా విశ్వం లో అనంత కాలం నుండి వాటి వాటి నిర్దిష్ట కక్ష్యల్లో క్రమం తప్పకుండా పరిభ్రమించే కోటానుకోట్ల గ్రహ నక్షత్రాలు , మరణించే వరకు లయ తప్పని గతిలో స్పందిచే మానవ హృదయం. వీచే గాలి వికసించే పుష్పాలు వీటన్నిటికి ఏ కారణం లేదా అన్నింటి కన్నా మీ నవీన విజ్ఞానాని కన్నా అద్భుతమైనది మనసు. ------అంత అద్భుతమైన మనసును భగవంతుడు మానవ శరీరం లో అమర్చాడు. ఈ అనంత విశ్వం లోనే మానవుడిది అత్యుత్తమమైన సృష్టి. అతడికి భగవంతుడు మనసు ఇచ్చింది కేవలం తన చుట్టూ ఉన్న ప్రకృతిని మాత్రం పరిశీలించమని కాదు. అంతర్ముఖుడై మనసు లోతులు కూడా అన్వేషించమని. ఆ అన్వేషణ అనంతం, అనూహ్యం, అద్భుతం . ఆ అన్వేషణ లో నే ఎన్నో మహత్తర సత్యాలు తెలుస్తాయి. అంతేకాదు. త్రికాలాతీతమై , రాగాద్యేషాలు ఏ మాత్రం సోకని ఓ ఆనంద స్థితి కూడా అనుభవమవుతుంది. ఇన్ని తెలిసిన సాధకుడు తన ఆత్మశక్తి తో యోగబలం తో భవిష్యవాణి చెప్ప లేదా . “? చివరి మాట ముగించి క్షణం ఆలస్యం చేయకుండా సుడిగాలి లా నిష్క్రమించాడు అఘోరి

విద్యాధరి నిష్చేష్టురాలైంది . ఆమె కిది విచిత్రానుభావం.అఘోరి వేషం,వాలకం చూసి అతడు పిచ్చివాడు , మోసగాడు అనుకుంది.కాని అతడొక మహత్తర సాధకు డు, సత్యాన్వేషి . తాత్విక దృష్టి తో జీవితాన్ని విశ్లేషించగల అపార ధీశక్తి అతడికి ఉంది .ఇప్పుడు అతడి రాక కాకతాళీయం కాదు.అందులో ఏదో నిగూఢమైన పరమార్ధముంది . అతడు తన కోసమే వచ్చాడు . తనను హెచ్చరించి , జీవిత పరమార్థం బోధించడానికి వచ్చాడు . తన పని పూర్తి కాగానే చిత్రం గా అదృశ్యం అయినాడు. అతి త్వరలోనే అతడి రాకలోని ఆంతర్యం తనకు అనుభవం అవుతుంది.

సాగర్ తండ్రికి పుస్తక పఠనం వ్యసనం. ఆయన బతికున్న రోజుల్లో ఎక్కువ సమయం అందుకే కేటాయించేవాడు. ఆ కారణంగానే ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉంది. సాగర్ కు నింపాది గా కూర్చొని పుస్తకాలు చదివే ఓపిక లేదు . అతడికి అదో లోకం !

విద్యదరికీ రీడింగ్ వ్యసనం లాంటిది. నచ్చిన పుస్తకం దొరికితే చాలు – లోకమే మరిచి పోతుంది . తిండి, నిద్ర గుర్తుకు రావు.

మామగారి హోం లైబ్రరీ చూడగానే విద్యాలో ఉత్సాహం ఉప్పెనలా పొంగింది . ఆ విశాలమైన గదిలో గాజు తలుపుల వెనుక బారులు తీరిన విజ్ఞాన సంపదలు ఆమెను విస్మయ పరచాయి . ఆమె కిప్పుడు ఆ పుస్తకాల తోటిదే లోకం.

ఒకరోజు హోం లైబ్రరీ లో పుస్తకాలు తిరగేస్తుండగా ఓ పుస్తకం ఆమె దృష్టిని ఆకర్షిన్చ్జింది.

పుస్తకం పేరు ‘రాజపుత్ర వనితలు’ . ఆసక్తిగా చదవసాగింది . ‘ చారిత్రక వనితలు అన్న శీర్షిక క్రింద ఆమెకు రాణి పద్మిని కధ బాగా నచ్చింది . ఆమె అద్వితీయ అందం , సుగుణ సంపద,సతీత్వం,ఆత్మ త్యాగం(జౌహర్) విద్యాధరి మనసుపై చెరగని ముద్ర వేశాయి . ఆ సంఘటనలే మననం చేసుకుంటూ ఆమె నిద్రలో జారుకుంది.(జౌహర్—ఖిల్జీ చేతుల్లో తమ రాజ్య పతనం తప్పదని తెలిసిన పద్మిని తురకల చేతిలో చిక్కి మాన మర్యాదలు , సతీత్వం పోగొట్టు కోలేక అంత:పుర స్త్రీల తో అగ్ని ప్రవేశం చేసింది.

ఆ రాత్రి ఆమె కెందుకో కలత నిద్ర మిగిలింది. ఏవేవో కలలు. ---కలల్లో అడుగడుగునా డిఫరెంట్ ప్రొఫైల్స్ లో రాణి పద్మిని కనిపించింది. ముఖ్యంగా ఆమె అగ్నిప్రవేశం విద్యాధరిని ఉద్వేగం తో కుదిపేసింది.

మరునాడు ఉదయం తనలో ‘సంచలనం అనలైజ్ చేసేందుకు ప్రయత్నించింది. ఎంత ఆలోచించినా ఆమె కు క్లూ దొరక లేదు. ఆనాటి రాత్రి కూడా మళ్ళీ అదే పరిస్థితి .అవే కలలు .విద్యా కంగారు పడింది. ఎందుకిలా జరుగుతుందన్న ప్రశ్న ఆమె కు ఐరన్ వాల్ లా దుర్బేధ్యంగా అనిపించ సాగింది.

ఇలా వారం గడిచింది. ఆమె ముఖంలో నిద్ర లేమి , అలసట సాగర్ గమనించాడు. కారణం అడిగాడు. చెప్పింది. అతడికి ఏం పాలు పోలేదు. . రెమిడీ గా ట్రాన్ క్విలైసెర్ వాడమన్నాడు. వాడింది. ఫలితం శూన్యం . పైగా రోజులు గడిచే కొద్దీ ఆమె ‘స్వప్న ప్రపంచం మరో కొత్త రూపు సంతరించుకుంది . ఆమె కలల్లో మంటలు కనిపిస్తున్నాయి . అందులో ఓ అపరిచిత వ్యక్తి(స్త్రీ) కాలిపోతూ హృదయ విదారకం గా ఆర్తనాదం చేస్తోంది . ఈ డెవలప్మెంట్స్ విద్యాధరిని కృన్గదీశాయి .

సాగర్ ఫ్యామిలీ డాక్టరు సుదర్శనం ను సంప్రదించాడు . అయన విద్యాధరి చెప్పింది ఓపిగ్గా విన్నాడు. ఆమె మెంటల్ కమోషన్ కు కారణం పూర్తిగా బోధపడలేదు .అయినా టైం లీ సజెషన్ తో శాంతపరిచి ఏవో కొన్ని మందులు వాడమన్నాడు .

విద్యాధరి స్టేట్ మెంట్ విశ్లేషించిన తర్వాత డాక్టర్ కు ఓ అవగాహన వచ్చింది . ఆమె లో గత జన్మ తాలూకు నీడలు అస్పష్టం గా మెదులుతున్నాయి . కేసు చాల క్రిటికల్ గ అనిపించింది.వెంటనే కేసును ఢిల్లీ లో తన మిత్రుడైన ఓ సైకియాట్రిస్ట్ కు రెఫెర్ చేసాడు . ఆ మిత్రుడు పారా సైకాలజి లో విశేషం గా కృషి చేసాడు. అతడికి కేసు చాల టిపికల్ అనిపించింది. వెంటనే సుదర్శనానికి కొన్ని సూచనలు చేసాడు.

మిత్రుడి సూచనలు పాటిస్తూ సుదర్శనం విద్యాధరిని కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలు అడిగాడు. ఆమె అన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్పింది. తామిద్దరి సంభాషణ విన్నాడు. విషయం పూర్తిగా బోధపడింది.

విద్యాధరి కలల్లో రోజూ కనిపించే అస్పష్టమైన ఆకారాలు, నీడలు గత జన్మకు సంబంధించినవే . ఆమె ‘సబ్ కాన్షస్ లో నిక్షిప్తమైన పూర్వ జన్మ సంఘటనలు ‘ట్రిగర్ లాంటి సూచన తో సాగర కెరటాల్లా ‘కాన్షస్ ప్లేన్ ను ధీ కొన్నాయి . ఆ తాకిడికి ఆమె ఉక్కిరి బిక్కిరి అయింది . గత జన్మ గురించి ఓ స్పష్టమైన అవగాహన వచ్చేవరకు ఆమెకు టెన్షన్, అయోమయం తప్పవు. పైగా విద్యాధరి పేరు , ఆమె కేసు వివరాలు వినగానే సుదర్శనం మిత్రుడు సైకియాట్రిస్ట్ కుమనసు లో ఏవేవో పాట సంఘటనలు మెదిలాయి. కొన్ని సందేహాలు కలిగాయి. వాటిని వెంటనే నివృత్తి చేసుకోవాలి.

తన మిత్రుడు కేసు మరింత వివరం గా స్టడీ చేసేందుకు ఢిల్లీ నుండి వస్తున్నట్లు సుదర్శనం సాగర్ తో చెప్పాడు. సాగర్ కలవర పడ్డాడు. విద్యాధరి గురించే అతడి ఆరాటం. ఒకరోజు ఉదయాన ఆ ప్రొఫెసర్ హైదరాబాద్ వచ్చాడు. సుదర్శనం , సాగర్, విద్యాధరి, ఆయనను ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నారు.

ఆయనను చూడగానే విద్యాధరి అదిరి పడింది. ఆయన భరత్ రామ్ ! బాల్యం లో విద్యాధరిని ఇదే సమస్య పై కౌన్సిల్లింగ్ చేసిన వాడు.

ఇక్కడ మరో ఆసక్తి కరమైన సంఘటన వివరించాలి. విద్యాధరి పదేళ్ల వయసు లో ఉన్నప్పుడు మాధవరావు కుటుంబం సపరివారం గా తిరుమల యాత్ర చేసింది.అక్కడే అ సందర్భం లో నే అఘోరి మాధవరావు కు భవిష్యవాణి వినిపించింది .

తిరుపతి ప్రయాణం ముగించుకొని ఇల్లు చేరాక ఓ విచిత్రం జరిగింది.

ఆ రోజు భోగి. తెల్లవారు జామున ప్రతి ఇంటి ముంగిట భోగి మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. పిల్లలు ఎండిన తాటాకులు వేసి మంటల్ని ఎగదోస్తూ ఒకరికొకరు పోటీ పడుతున్నారు . అప్పుడే నిద్ర కళ్ళతో తూలుతూ వచ్చిన విద్యాధరి నెగళ్ళను చూసి హిస్టీరిక్ అయిపొయింది. గోల చేస్తూ గంతులు వేసింది. ఇంటిల్లిపాదీ ఈ అనూహ్య పరిణామానికి బెంబేలెత్తి పోయారు. ఇలా జరగటం ఇదే మొదటి సరి విద్యాధరిని లోపలి తీసుకు వచ్చి మంచి మాటలతో సముదాయించారు.

విషయం చివరకు సైకియాట్రిస్ట్ వరకు వెళ్ళింది. ఆ సందర్భం లో విద్యాధరి , మాధవరావు భరత్ రామ్ ను కలిశారు.

భరత్ రామ్ ఉత్తర భారతీయుడు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చాడు. వ్యక్తీ చాల మంచివాడు. సౌమ్యుడు. ఆ వృత్తికి కావలిసిన అన్ని లక్షణాలు పుష్కలం గా ఉన్నవాడు.

భరత్ రామ్ వచ్చీ రాని తెలుగు లో కొంత, ఇంగ్లీష్ లో కొంత మాట్లాడి విద్యాధరి సడన్ పానిక్ స్టేట్ కు కారణం తెలుసుకోవాలని ప్రయత్నం చేసాడు. విద్యాధరి పసి మనసు అతడి ప్రశ్నలకు స్పష్టం గ సమాధానం చెప్పలేక పోయింది. తెలిసీ తెలియని ఊహ తో ఆమె చెప్పే వివరాల సాయంతో భరత్ రామ్ ఓ నిర్ణయానికి రాలేక పోయాడు. ఏవో కొన్ని సూచనలతో అ అమ్మాయిని సమాధాన పరిచాడు. క్రమక్రమంగా వయసు పెరిగి , బుద్ధి వికసించే కొద్దీ యా భయం, జ్ఞాపకం ఆనవాలు లేకుండా పోయాయి. విద్యాధరి కేసు స్టడీ తో భరత్ రామ్ కు పాత సంఘటన మెదిలింది .

విద్యాధరి , భరత్ రామ్ ఒకరినొకరు గుర్తు పట్టారు. వారి ఆశ్చర్యానికి , ఆనందానికి అంతులేక పోయింది. భరత్ రామ్ లో విద్యాధరి విజ్ఞానం , లోకానుభవం, వయసు తో వచ్చిన గాంభీర్యం గమనించింది.

భరత్ రామ్ విద్యాధరి సంపూర్ణ వ్యక్తిత్వం పరిశీలించాడు. ఆమె మానసిక స్థితి విశ్లేషించాడు. అమెది నిస్సందేహం గా గత జన్మకు సంబంధించిన సంఘర్షణే. . ఈ మెంటల్ స్టేట్ ఇలాగే కొనసాగితే ఆమె ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆమె ముందా అయోమయ స్థితి నుండి బయట పడాలి.

*************************************************

కొనసాగించండి 6 లో