Read The shadow is true - 31 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 31


అజయ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు .

“ నువ్వు తెర వెనుక వ్యక్తివి . పైగా మేము నియమించిన వ్యక్తివి . నిన్నెవరూ అంతగా పట్టించుకోరు . ఈ లోకం దృష్టి నా మీద ఉంది . నేనీ తాకిడి తట్టుకోవాలంటే ఆమెను ఎలాగైనా కలవాలి . చేసిన తప్పు ఒప్పుకొని ఆనాటి సంఘటనలు బయటపెట్టొద్దని మంచిగా, మన్ననగా ఒప్పించాలి . ఆమెకు నా వల్ల ఎలాంటి అపాయం ఉండడని భరోసా కలిగించాలి . నా సమస్య కు సమాధానం నేనే ! సమస్యా పరిష్కారం నా బాధ్యత .

“ మీది చాలా మంచి నిర్ణయం అజయ్ బాబు ! మీరు అప్పటిలా ఆవేశపడక , నాలాంటి మరో క్షుద్రున్ని సంప్రదించక ప్రశాంతమైన మనసుతో ఆలోచించారు .

తప్పక మీ ప్రయత్నం ఫలిస్తుంది . నాదొక చిన్న మనవి . దైవం ఇచ్చిన తల్లిని దూరం చేసి రాహుల్ బాబుకు మనం చాలా అన్యాయం చేశాం . ఆమె రాహుల్ బాబు కోసమే పుట్టింది . తల్లీ కొడుకులను కలిసి మీ గుండె బరువు దిమ్పుకోండి . ఆనాటి తప్పు సరిదిద్దుకొనే అవకాశం జార విడుచుకోకండి ” దీనం గా వేడుకున్నాడు పన్నాలాల్ .

“ ఇద్దరి మధ్య ఉంటేనే అది రహస్యం అవుతుంది . మూడో వ్యక్తికీ తెలిసిందంటే ---తర్వాత పదిమందికి తెలియటం చాలా తేలిక. రాహుల్ కు నాకు నేనై చెప్పను . అన్న కొడుకు ముందు దోషిలా తలవంచుకోవటం నాకు ఇష్టం లేదు . నాకు తెలిసి ----ఆమెకూ రాహుల్ని కలిసే ఉద్దేశ్యం లేకపోవచ్చు . తనకన్నా పదేళ్ళ పెద్దవాడు ‘ అమ్మా అంటూ ఆమెను పిలుస్తూంటే భర్తకు ఏమని సమాధానం చెబుతుంది .? ఆమె కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు ? తెలిసి తెలిసి ఎవరూ తలనొప్పి తెచ్చుకోరు . ఒకవేళ వారిద్దరూ కలవటం తప్పదంటావా –అందుకూ సిద్ధమే ...” పన్నాలాల్ బదులు పలక లేదు . నిట్టూర్చి, నెమ్మదిగా లేచి కర్రపోటు వేసుకుంటూ వెళ్ళిపోయాడు . అల్లంత దూరం లో చీకటి లో పొదలమాటు న ఉన్న రూపాదేవి స్థాణువులా ఉండిపోయింది .

అరకు లోయ అందాలు కనువిందుగా ఉన్నాయి . ఎటు చూసినా సముద్రం లా వ్యాపించిన పచ్చదనం. మధ్య లో పాము మెలికలా సాగిపోతున్న తారు రోడ్డు మీద ఆ సెవెన్ సీటర్ వ్యాన్ బాణం లా దూసుకు పోతోంది . భరత్ రామ్ , సుదర్శనం, రాహుల్, జస్వంత్ వెనక సీట్ల లో సర్దుకున్నారు . ముందు సీట్లో విద్యాదరి కూర్చుంది . గాలి తాకిడికి ముంగురులు ముఖంపై నాట్యం చేస్తున్నాయి . ముఖం ప్రశాంతం గా ఉంది . రాహుల్ ఆమెనే గమనిస్తున్నాడు . కోమలాదేవి లో అమాయకత్వం , అమ్మతనం, విద్యాదరి లో సాహసం, సమయస్ఫూర్తి , జ్ఞానం ఆమెను పరిపూర్ణంగా మలిచాయి . ఆమె పరిపూర్ణమైన స్త్రీ .

వ్యాన్ గురుకులం లాంటి విశాలమైన విద్యాలయం మెయిన్ గేటు సమీపించింది .

మెల్లగా విద్యాలయం మెయిన్ బిల్డింగ్ దాటి వెనక వైపుకు వచ్చింది . అక్కడ వరుసగా బారులు తీరిన రెసిడెన్సియల్ క్వార్టర్స్ ఉన్నాయి . వ్యాన్ ఒకదాని ముందు ఆగింది . అందరూ దిగారు .

బండి శబ్దానికి తన కన్నా వయసులో కాస్త పెద్దదైన యువతి, బుట్టబొమ్మలాంటి ఆరేళ్ళ పాప విద్యాదరికి ఎదురొచ్చారు . ఆ యువతి అందరినీ సాదరంగా లోనికి

ఆ హ్వానించింది .

అందరూ హాల్లో కూర్చున్నారు . విద్యాదరి పక్కన ఆ యువతి కూర్చుంది . ఆమె చూపుల్లో స్నేహం, ఆప్యాయత .

“ మిమ్మల్ని విద్యాధరీ గారు అని పిలవనా ?” అని సందేహం గా ఆగింది . ఆమె మాటలకు విద్యా గలగల నవ్వింది .

“ నా కొడుకు, కోడలు వయసులో నాకంటే పెద్దవాళ్ళు . విచిత్రమైన అత్తగార్ని నేను . “

“ వయసు లో మా కన్నా చిన్నవారే ---మనసు మాత్రం చాలా పెద్దది . (రాహుల్)

మా ఆయన పాతికేళ్ళ కళను నిజం చేశారు . ఇదిగో మీ మరో ప్రతి రూపం కోమలాదేవి .”

పాపను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొం ది . “ అమ్మా ! పాప ఎంతో అదృష్టం

చేసుకుంది . నాకే కాదు తనకూ నాన్నమ్మ ఉంది . “

ఆ పాపలో పదేళ్ళ రాహుల్ లీలగా మెదిలాడు . పాపను గుండెకు హత్తుకుంది . కళ్ళు మూసుకుంది . కళ్ళు తడి అయినాయి . ముఖ కవళికలు మారాయి . స్వరం మారింది . మాట తీరు మారింది . భాష మారింది .

“ రాహుల్ ! నీకు చాలా అన్యాయం చేశాను .” ఆమె ప్రతి అక్షరం లో బాధ, పశ్చాత్తాపం . కాలం కాసేపు ఆగిపోయిందా అనిపించింది . అందరూ ఆ అద్భుతం చూస్తూ తమ ఉనికి మరచి పోయారు .---- చివరకు భరత్ రామ్ కూడా .

“ నాన్నమ్మా ! నేను కోమలను . నాన్నను కాను . నాన్న అక్కడ ఉన్నారు . “ పాప మాటలతో విద్యా ఉలిక్కి పడింది . క్షణం లో తేరుకుంది .

“ సారీ పాపా ! నవ్వుతూ మళ్ళీ ముద్దుపెట్టుకుంది . “ పాప కదిలించక పొతే గతం లో చాలా దూరం వెళ్ళిపోయే దాన్ని !”

“ ఈ పరిస్థితి కొంత కాలమే . నువ్వు పూర్తిగా విద్యాధరిగా మారే రోజు ఎంతో దూరం లో లేదు . అందుకోసం , నువ్వు కొంత కాలం నీలో విద్యాధరిని మరిచి పోవాలి . ‘ నేను కొమలను అన్న స్పృహ లోనే ఉండాలి . ఇప్పటికే ఆ స్పృహ నీలో కొంత ఉంది . అందుకు నిదర్శనం ఈ సంఘటన . నీ ఎమోషనల్ స్టేట్ .

“ నాలో కోమలను గుర్తించాను . ఆమే ఈ జన్మలో నేను అన్న భావన నాలో బలం గా నాటుకు పోయింది . ఆనాటి సంఘటనల తో , వ్యక్తులతో కనెక్ట్ అవుతున్నాను . అజయ్ ను నేను ధైర్యం గా ఎదుర్కొంటాను . “ విద్యా మాటల్లో ఆత్మ విశ్వాసం . భరత్ రామ్ మొహం లో తృప్తి .

****************************************

కొనసాగించండి 32 లో