Read OM SARAVANA BHAVA 09 by LRKS.Srinivasa Rao in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఓం శరవణ భవ - 9

          మహేశ్వరుడు పరంధాముని  కధనం ద్వారా ఈ విడ్డూరం తెలుసుకొని కుమారుని వారింప  స్కందగిరిని దర్శిస్తాడు .  తండ్రి ఆగమనం  తనయునకు పరమానందభరితమవుతుంది .  జనకుని ఆనతి మేరకు స్కందుడు సృష్టి కర్తను  బంధవిముక్తుని చేస్తాడు .  అజ్ఞానం తొలిగిన  బ్రహ్మదేవుడు  వినయశీలుడై , తన తప్పును గ్రహించి శివకుమారునకు  శరణాగతుడవుతాడు . 

  తండ్రికి  తనయుడి పాండిత్య ప్రకర్ష తెలుసుకోవాలన్న పితృసహజమైన  ఉబలాటం  మదిని జనిస్తుంది .  పరాత్పరుడు ప్రణవ రహస్యం వివరించమని షణ్ముఖుని  ఆదేశిస్తాడు .  మంత్ర  రహస్యం  బహిర్గతం చేయటం  పధ్ధతి కాదు  గనుక  బాలుడైనా తాను గురు స్థానం లో ఉండి   జగదీశ్వరుడికే  తారక మంత్రం  వివరించాలనుకుంటాడు  సుబ్రహ్మణ్యుడు .  తండ్రిని మించిన తనయుడి ఆలోచన  అభయంకరుడికి  ఆమోదయోగ్యం అవుతుంది . 


   నేటి ‘ కుంభకోణం’  పట్టణానికి  చేరువై యున్న ‘ స్వామి మల’ అను క్షేత్రమున  సుబ్రహ్మణ్యుడు  సదాశివునకు ‘ ప్రణవ’ రహస్యమును  వివరించాడు .  


   కుమారస్వామి  ‘ గురుస్వామి’ స్థానం లో  ఆసీనుడై  — సనక సనందాదులకు , కేవలం   మౌన వ్యాఖ్య ద్వారా  సమస్త జ్ఞానమును  అందించిన  శుద్ధ చైతన్య  స్వరూపుడైన  చిదంబరేశ్వరునికే  ప్రణవార్థమును  విశ్లేషించాడు . 


పరాత్పరునే  శిష్య స్థానం లో  నిలిపిన షణ్ముఖుడు ‘ స్వామినాథుడై ‘  భక్త జన హృదయాలలో  కొలువైనాడు . 

పరంధాముడు , పరమేష్ఠి, సమస్త దేవతా గణం   ఈ అపూర్వ దృశ్యమును  తిలకించి తన్మయులైనారు . 

పరాత్పరుడైనా ప్రేమకు వశీభూతుడే .  స్కందుని విజ్ఞత , సర్వజ్ఞత  సదాశివుని  పితృహృదయమును  పాలవలె  పొంగింపజేసినవి . 


శిష్య స్థానం లో  కూర్చున్న శివుడు ప్రణవ రహస్యం  వింటున్నంత సేపు  లక్షణయుక్తంగా  ముక్కును మూసుకున్నాడు .  శివ చైతన్యం సమస్త  జీవ కోటికి  ఆధారం .  అలాంటి బ్రహ్మాండ నాయకుడు కొంత సేపైనా ముక్కు మూసుకున్నందువలన  విశ్వం లోని ప్రాణులన్నీ  చైతన్య రహితమై , చేష్టలుడిగి నిశ్చలమైనాయి . 

శివుడు శిష్య భంగిమను వీడిన పిదపే  సర్వ లోకాలు చైతన్య వంతమైనాయి . 


తండ్రిని శిష్య స్థానం లో కూర్చుండబెట్టిన  కుమారస్వామికి ఒక శాపం ఉందంటారు .  ఏ ఆలయం లో నైనా కార్తికేయుడు నిలబడి  దర్శనమిస్తాడు .  ఇది శివుని శాపమని  కొందరి అభిప్రాయం . 

 

           సదాశివుని తనయులిరువురూ  తండ్రికి ఏమాత్రం తీసిపోరు .  ఓంకార స్వరూపుడు వినాయకుడు . 

నిండైన శివతేజమే షణ్ముఖుడు .  ఇరువురిలో అన్నదమ్ములన్న  అన్యోన్యత ఉంది . ఒకరి గురించి మరొకరికి  స్పష్టమైన అవగాహన  ఉంది .  సోదరులిద్దరూ శుద్ధ చైతన్య స్వరూపులే . 


ఒకనాడు బ్రహ్మ మానస పుత్రుడు  సత్యలోకం జేరి  తండ్రికి నమస్కరించాడు . చతుర్ముఖుడు  తనయుడి చేతిలో  ఒక ఫలము నుంచి , అది జ్ఞాన ఫలమని , తనకు అన్ని విధాలా నచ్చిన వారి చేతిలో  ఆ పండు ఉంచామని చెబుతాడు . 


సత్య లోకం నుండి  నారదుడు తిన్నగా కైలాసం చేరుతాడు .  ఆ పండును పరమేశ్వరునకు  సమర్పించి , అర్హత గల  వాని చేతిలో దానిని ఉంచామని బ్రహ్మ అభిప్రాయమును వ్యక్తం చేస్తాడు . 

ఇది చిత్రమైన సంకట పరిస్థితి . గణేశుడా  ?  షణ్ముఖుడా ?  —--- ఎవరికీ  ఆ జ్ఞాన  ఫలమును ప్రసాదించాలి ?  ఇరువురూ వివేక బ్రహ్మలే  .  శుద్ధ చైతన్య స్వరూపులే  .  ఒకరిని అవునంటే మరొకరిని కాదన్నట్లేగా  ! 


ఈ సమస్యకు నారదుడు ఉపాయం చెబుతాడు .  అనంత విశ్వమును  తృటిలో చుట్టి రాగలిగిన  వాడే పండును పొందగలడన్న దేవర్షి మాట పూర్తి గాకుండానే  షణ్ముఖుడు శిఖి వాహనం పై  వినీల విశ్వం లోకి ఉల్కల్లా దూసుకు పోతాడు .  ఈ పరిణామం తో మూషిక వాహనుడైన  కుబ్జ రూపుడు  విషణ్ణ వదనం తో మిన్నకుండి పోతాడు .  వినాయకుని మనోగతం గ్రహించిన  నారదుడు  ‘ సూక్ష్మం లో గల మోక్షాన్ని’  సూచన ప్రాయం గా తెలియ జేస్తాడు . 
       బ్రహ్మాండ నాయకుడైన  పరమేశ్వరుడు , ప్రకృతి  స్వరూపిణి అయిన   పరమేశ్వరి  ఈ చరాచర జగత్తుకు ఆధారం గనుక  వారిని ముమ్మారులు చుట్టి వచ్చిన వారు విజేతలగుట  తథ్యమే  కదా  ! 


నారదుని సూచన  అక్షరాలా పాటించిన  సూక్ష్మగ్రాహి  వినాయకుడు విజేత కావటం ‘ కుమారుని’ కోపానికి, అలకకు కారణమవుతుంది .  జ్ఞానఫలం  తనకు దక్కలేదన్న ఉక్రోషం తో  షణ్ముఖుడు  కైలాసం వీడి నేటి ‘ పళని ’ ప్రాంతం లో  సన్యాసి రూపం లో  భీష్మించుకుని కూర్చుంటాడు .  ( పళని  కొండపై హిడింబాసురుని  అనుగ్రహించిన కారణం గానే  నేటికీ సుబ్రహ్మణ్యుని భక్తులు  కావడి మోసి  కైవల్య పదమీయమని  స్వామిని వేడుకుంటాడు ) 

 

అలిగిన తనయుని అనుతాపము తీర్చుటకు అంబ కైలాసం వీడి ‘పళని ‘ చేరుకుంటుంది .    తల్లి అనునయంగా చెప్పిన మాటలు  కార్తికేయుని మనసును కరిగించలేకపోయాయి . 


పంతము వీడని పరమేశ్వర పుత్రుడు  పళని  నుండి  ఓ అటవీ ప్రాంతమునకు  అరుదెంచాడు .  ఆ ప్రాంతమే నేటి  బళ్లారి లోని  సాం డూరు    .   పరమేశ్వరి పుత్రుని  అనుసరిస్తూ వచ్చి ‘ నా జ్ఞాన క్షేత్రమును గ్రోలిన నీవు  నా పిలుపును నిర్లక్ష్యం చేయుట తగదు ‘ అని మందలించింది .  అందుకు సమాధానంగా అంబ తనయుడు ‘ ఇది నీ జ్ఞాన క్షీరము ‘ అని రక్త రూపమున తల్లి పాలను క్రక్కివేశాడు .  ఈ సంఘటన లౌకిక దృష్టికి విచిత్రంగా ,  సత్యదూరంగా  ఉన్ననూ ఇందులో గొప్ప పరమార్థము ఇమిడి ఉంది .  ‘ ఈ కర్మ భూమిని జ్ఞాన క్షేత్రముగా  మలచి విశ్వమునకే తలమానికంగా  తీర్చిదిద్దాలన్నది  షణ్ముఖుని సంకల్పం.  ఆ సంకల్ప ఫలితమే  పై సంఘటన .