Read om saravana bhava - 4 by LRKS.Srinivasa Rao in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఓం శరవణ భవ - 4

సోదర త్రయం లో  రెండవవాడైన   సింహ ముఖుడు  అసురుడైననూ సర్వశాస్త్రములు  తెలిసిన  వివేకి .  సహజమగు  అసుర స్వభావం తో నాశము కోరి  తెచ్చుకుంటున్న  అన్నగారిని వరించ తన వంతు ప్రయత్నం చేస్తాడు .  కానీ, ఫలితం శూన్యం .  శూర పద్ముని  పట్టుదల, పంతం యుద్ధానికే  దారితీశాయి .  శూర పద్ముని 


మంత్రాంగం, మనోభీష్టం  నారదమహర్షి సమయస్ఫూర్తి , సరస సంభాషణతో  మరింత దృఢమవుతుంది .  దేవతలపై , దండయాత్ర చేయాలనీ  రాక్షసకోటి  తీర్మానిస్తుంది . 


శూర పద్ముడు  అశేష సేన వాహిని తో  అలకాపురిపై  దాడి చేస్తాడు .  ఎలాంటి  ప్రతిఘటన లేకుండా  కుబేరుడు  శూర పద్ముడికి  లొంగి పోతాడు .  కానుకలు సమర్పించి  రాక్షసపతిని  ప్రసన్నం చేసుకుంటాడు . 


      సునాయాస విజయం తో  విజృంభించిన  శూర పద్ముడు అమరావతి పై  దడి చేస్తాడు .  అతడి ధాటికి నిలువలేని  సురాధిపతి  ఆకాశమార్గాన పారిపోతాడు .  దానవేంద్రుడు  అమరావతిని ధ్వంస మొనర్చి  దేవ పత్నులను చెర పడతాడు .  భీషణ అగ్నికీలల్లో  అమరావతి శోభ దగ్ధమవుతుంటే వికటాట్టహాసం చేస్తాడు .  


      తదుపరి విజయ యాత్ర లో  అగ్నిదేవుడు  శూరునకు  శరణాగతుడవుతాడు .  శూర పద్ముని  నాశనం ముందు  యమధర్మం కూడా తలవంచుతుంది . 


రాక్షసులు  పాల కడలిని  కలచి వేశారు .  నీలాదేవి,  శ్రీదేవి భయపడి  శ్రీనివాసుని గట్టిగా కౌగలించుకున్నారు . శ్రీహరి యోగనిద్ర నుండి లేచాడు . 


 వైకుంఠ ద్వారం  ముందు నిలిచిన  శూర పద్ముడు  విష్ణువుతో  వైరం కోరినవాడు  కనుక పరుష వాక్యములతో  నిందారోపణలు  ప్రారంభిస్తాడు .  శూరుని మనసు తెలిసిన  పద్మనాభుడు  అతడితో  సమరానికి  సిద్ధమవుతాడు . 


శ్రీహరి తో సమరానికి తలపడు  సమయాన  శూరపద్ముని  అనుజుడైన తారకాసురుడు వైకుంఠవాసుని  ఎదిరించే  అరుదైన అవకాశం తనకు ప్రసాదించమని  వేడుకుంటాడు . 


తారకాసురుడు , వైకుంఠవాసుడు  చిత్ర, విచిత్ర గతులలో  కదనం సాగిస్తారు .  పోరు ఎంతకూ ఓ కొలిక్కి రాదు . చివరకు విసిగిపోయిన  మహావిష్ణువు  రాక్షస వీరుడిపై  చక్రాయుధం ప్రయోగిస్తాడు .  కానీ, అది అతడి కంఠమందు  బంగారు పతాకం గా  ఒదిగిపోతుంది . 


ఈ విచిత్ర పరిణామంతో  దేవతలు తెల్లబోయారు . దేవతా రక్షకుడైన నారాయణుడే  దానవుల ముందు ఓటమిని అంగీకరించవలసి వచ్చింది .  ఇక వారిని రాక్షసుల  బారి నుండి కాపాడే నాధుడెవ్వడు ?  

 

విజయ గర్వం తో  శూరపద్ముడు  వైకుంఠమును వీడి  సత్యలోకమునకు చేరుకున్నాడు .  అతడితో పరమేష్ఠి  మనుమడన్న   చుట్టరికం  కలిపి  దీవిస్తాడు .  బ్రహ్మ దీవెనతో  బ్రహ్మానంద భరితుడైన  శూరుడు  చివరి మజిలీలో  కైలాసం చేరాడు .  అచట  భూతనాథుని  భక్తితో  సేవించాడు . ఆయన దీవెనలు  మెండుగా అందుకొని సోదరద్వయం తో స్వస్థలం చేరాడు . 

 

కైలాసగిరి పై చెరగని చిన్ముద్రలో  దక్షిణామూర్తి  సనకసనందాది  ఋషులకు  మౌనవ్యాఖ్య ద్వారా  జ్ఞానబోధ చేస్తాడు .  అది అఖండమైన ఏకాంతం . 


నారాయణ సహిత బ్రహ్మాదిదేవతలు,   కైలాసపతిని   ఆర్తిగా పిలిచారు . కపర్ది వారి పిలుపును అందుకొని సాక్షాత్కరించాడు .  వారి మనోగతం గ్రహించిన  మహేశ్వరుడు “ కుమార సంభవమునకు “  తరుణం ఆసన్నమైనది  అని.  దేవతలను ఊరడించి ,  సృష్టి, స్థితి, కారకులను తగు రీతిని  గౌరవించి  యధావిధిగానే  మళ్ళీ చిన్ముద్ర ధారి అయినాడు . 


సతీ వియోగము చే సదాశివుడు మౌన ముద్ర దాల్చాడు .  పార్వతిగా  మరు జన్మ ధరించిన పరాత్పర  శివుని పొందుకై  తపోదీక్షలో ఉన్నది .  మరి , వీరిరువురి  సమాగమం జరిగేదేప్పుడు ? కుమారుడు సంభవించేదెప్పుడు ?


     బ్రహ్మ, విష్ణు , ఇంద్రాది దేవతలు సమావేశమయ్యారు .  వారు తలచినంతనే  మన్మధుడు  రతీదేవితో ప్రత్యక్షమయ్యాడు .   బ్రహ్మ అతడు నిర్వహించవలసిన కార్యం  వివరిస్తాడు .  ఆ పలుకులు  విని  మన్మధుడు  నిలువెల్లా కంపించి పోతాడు . సదాశువుని పై  సుమ బాణ ప్రయోగమా ? సతీ వియోగం తో  భీష్మించుకున్న  భూతనాథుని  కదిలించటం  భావ్యమేనా ?  అలా చేయటం  దుస్సాహసమవుతుందని  మన్మధుడు వెనుకంజ వేస్తాడు .  కానీ ఈ కార్యం అనివార్యం .  పైగా చతుర్ముఖుని  ఆనతి మీరితే  అధోగతి తప్పదు .  అంతకన్నా మహాదేవుని  క్రోధాగ్నికి  ఆహుతి కావటం ఉత్తమం .  . తన ఆత్మార్పణ తో   ఒక మహాకార్యం నెరవేరుతుందన్న తృప్తి తో  మన్మధుడు  మృత్యు కౌగిలి కి సిద్ధపడతాడు . 


        మన్మధుడు  రతీ సమేతుడై  సర్వ సన్నాహాలతో  కైలాసగిరి చేరుకుంటాడు .  ఆ తపోభూమిని  క్షణాలలో  రసరమ్యంగా మార్చివేస్తాడు .  మోహాభినివేశం తో  భార్యాసమేతుడై  ఆ ప్రాంగణం లో నర్తిస్తాడు .  నంది  అక్కడ నిలిచి సర్వం  మోదం తో తిలకిస్తాడు . 


               తన ప్రవేశానికి  శివుని  అభ్యంతరం  లేదన్న  నంది పలుకులు  సుమశ రుని  ఎదలో  ఆత్మ విశ్వాసాన్ని     ప్రోది చేస్తాయి .  మహాదేవుని  మనోగతం  తనకు అనుకూలంగా ఉందని  మన్మధుడు పొంగిపోతాడే తప్ప  ఆ రుద్రమూర్తి మహాసంకల్పం ఊహించలేక పోతాడు .  రెట్టించిన ఉత్సాహం తో  చెరకు వింటిపై   సుమశరాన్ని  సంధిస్తాడు  .    పరిణామం ఎలా ఉంటుందోనన్న భీతితో  రతీ దేవి గుండె చిక్కబట్టుకొని  చూస్తుంటుంది . 

 

                                      సుమశరుడు  సంధించిన  పూలబాణం  శంకరుని  సమీపించి  ఆ ఉగ్ర మూర్తిని  తాకలేక తిరోగమిస్తుంది .  ఈ పరిణామానికి  అతడు తెల్లబోతాడు .  చేష్టలుడిగి  శంకరుని  చూస్తుండిపోయాడు . 

 

 

                                                                                                            కొనసాగించండి  5 లో