Read om saravana bhava 10 by LRKS.Srinivasa Rao in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఓం శరవణ భవ - 10

తన మూడవ  మజిలీ లో సుబ్రహ్మణ్యుడు నేటి పంజాబు లోని  భాక్రానంగల్ ప్రాజెక్టు ప్రాంతానికి  వచ్చాడు .  అక్కడొక జన పదం లో  ఓ పుణ్యాత్మురాలి ఇంట పశుల కాపరిగా  చేరాడు . తన పశువులను మేపినందుకు 

 ఆ స్త్రీ ప్రతిఫలంగా  రెండు పూటలా గోధుమ రొట్టెలను  స్వామికి సమర్పించుకునేది .  ‘ బాలక్  నాధ్ ‘ నామధేయం తో  కుమారస్వామి పామరుని భంగి  పశు సంరక్షణలో  లీనమైపోయాడు .  విశుద్ధ జ్ఞాన స్వరూపునకు  ఈ విచిత్ర వేషమేమిటి ?  జగత్పతి పుత్రుడు జానపదుడు  కావటం కేవలం  ఈశ్వర సంకల్పమే కదా  !  

బాలక్ నాధ్  రోజూ పశువులను  అటవీ ప్రాంతానికి తీసుకెళ్లేవారు .  కానీ, పశువులు  అడవిలో పచ్చిక 

మేసే  వి కావు .  బాలక్ నాధ్  వాటిని  ఒక రక్షణ వలయం లో  ఉంచి  తను  చెంతనున్న  గుహలో  తపో సమాధి లో  ఉండిపోయేవాడు .  ఇలా కొంతకాలం సాగింది .  పచ్చిక మేయకున్నా  పశువులు  బలహీనం కాలేదు .  పైగా వాటి జీవ కళలు  మరింత పెరిగాయి .  పాల ఉత్పత్తి కూడా  ఎన్నడూ లేనంతగా  , చాలా గణ నీయంగా పెరిగింది .  ఈ అభివృద్ధితో  యజమానురాలు  ఎంతో  సంబరపడిపోయింది .  బాలక్  నాధ్ ను  చాలా ఆదరంగా , పుత్రవాత్సల్యంతో  చూసేది . 


కొంతకాలానికి జరుగుతున్న  విచిత్రాన్ని  తతిమ్మా జానపదులు  వివరించగా విని యజమానురాలు  తెల్లబోయింది .  నిజం తెలుసుకోవటానికి  బాలక్  నాధ్ ను ఆనాటి సాయంకాలమే  నిలదీసింది .  ఆమె కటువచనములకు  కినుక వహించిన  బాలక్  నాధ్  తను ఆరగించిన  రొట్టెలన్నీ  యథాతథంగా   ఆమె ముందు వమనం చేశాడు .  ఈ పరిణామంతో  ఆమె మళ్ళీ తెల్లబోయింది .  నిజరూపం ధరించిన  బాలక్  నాధ్ ను దర్శించి  ఆ తల్లి  పునీతురాలై  పరమపదం చేరుకుంది .  ఇలా సుబ్రహ్మణ్యుడు  దక్షిణాపథమునే కాక  ఉత్తర భారతాన్ని కూడా  జ్ఞానక్షేత్రం గా మలిచాడు .  నేటికీ ఉత్తర దేశం లో  మహనీయులు , ప్రజా సామాన్యం , శివకుమారుని , శుద్ధ చైతన్య స్వరూపుని  ‘ బాబా బాలక్  నాధ్ ‘ అని భక్తి తో సేవిస్తుంటారు . 


ఈ దశ లో అన్నగారు  తమ్ముడిని వెదుక్కుంటూ  ఈ ప్రాంతానికి వస్తాడు .  తండ్రి తనకు ఇచ్చిన  జ్ఞాన ఫలం తమ్ముడికి ఇచ్చి  అతడిని ప్రసన్నం చేసుకోవాలని  సంకల్పిస్తాడు .    అన్న గారి  అభిమతం విన్న  కార్తికేయుడు ఇలా అంటాడు —----”  అగ్రజా !  నీవు సాక్షాత్తూ ఓంకార స్వరూపుడవు .  జ్ఞాని  వి !  నీపై నాకు అలుక ఏమిటి ?  ఇదంతా తండ్రి గారి  సంకల్పం .  జ్ఞాన ఫలం నీకు ప్రసాదించి  నన్ను అజ్ఞానిలా మెలగమన్నది  తండ్రిగారే . 

 అజ్ఞానిలా అహంకరించిన నేను  నాన్నగారి తత్వం బోధపడగానే  భూతలానికి చేరాను .  జంబూ ద్వీపాన్ని  జ్ఞాన క్షేత్రంగా మలచాను .  భావి తరాలకు    ఈ జ్ఞాన క్షేత్రమే  ముక్తి మార్గమును ప్రసాదించు  పుణ్యక్షేత్రమవుతుంది . మన ఇరువురి పాద స్పర్శ తో  పునీతమైన జంబూ ద్వీపం  ఓంకార జనితమైన విశుద్ధ జ్ఞానమునకు  నిలయమవుతుంది .  జగతికి తలమాని కమవుతుంది .  అగ్రజా !  నువ్వు జ్ఞాన నిధివి  .  నీ అనుజుడను, అనుగామిని అయిన  నేను నీ సంకల్పమును  సాకారమొనరించు  సారధిని మాత్రమే .  “ కుమారగురువు’ గా   అగ్రపూజలందుకొనే అదృష్ట శాలివి నీవే అన్నయ్యా  !” 


      ఒకనాడు నారదుడు వైకుంఠవాసుని దర్శించి  భక్తితో  సేవిస్తాడు .  మాటల  సందర్భంలో  శ్రీమన్నారాయణుని పుత్రికలైన అమృతవల్లి , సుందరవల్లి  ప్రసక్తి వస్తుంది . ఇరువురూ నవజాత పుష్పాల్లా  వైకుంఠమంతా కలియతిరుగుతూ  సందడి చేస్తుంటారు .  ‘ యుక్తవయస్కులైన’  ఆ కన్యామణుల  మనోరధం ఏమిటని  నారదుడు నారాయణుని ప్రశ్నిస్తాడు .  వైకుంఠవాసుడు తెలివిగా వారి మనోరథం  తెలుసుకొనే బాధ్యత నారదునికి అప్పగిస్తాడు .  తన కర్తవ్యమేమిటో గ్రహించిన  దేవర్షి  ఆ దివ్య లలనామణుల హృదయాలలో మేనత్త కొడుకైన  షణ్ముఖుని పై ఆసక్తి కలిగిస్తాడు .  శివకుమారుని సుమనోహర రూపాన్ని  సుందరంగా వర్ణించి  వారి మనసుల్లో  ప్రేమ బీజం నాటుతాడు .  ఆ జ్ఞాన స్వరూపుని పొందు  పరిపూర్ణ సిద్ధికి  సంకేతమని , కేవలం నిశ్చల  ధ్యానమే ఆ  నిరాకార , సాకార సమన్వయ రూపుని చేరుకునే మార్గమని  వారిరువురికీ బోధిస్తాడు . 

      

    ఆనాటి నుండీ అమృతవల్లి  తదేక ధ్యానం లో షణ్ముఖునికై  తపిస్తుంటుంది .  అమృతప్రాయమైన  షణ్ముఖుని సాంగత్యం  అమృతవల్లి లక్ష్యం .  ఆమె సాధనకు ప్రతిరూపం .  లక్ష్య సిద్ధి కొరకు  క్రియాశీలయై  ఉగ్రతపస్సుకు  ఉద్యమించింది .  అందుకే అమృతవల్లి ‘ క్రియాశక్తి’ కి  సంకేతమైంది. 

సుందరవల్లి  తత్త్వం  తన సోదరి మనస్తత్వానికి  పూర్తిగా భిన్నం .  ఆమెకు సుబ్రహ్మణ్యుని పై మనసు ఉన్నా , సౌందర్యాతిశయం మెండు .  తన అందచందాలకు తానే మురిసిపోయే  చాపల్యం ఆమెను తదేక ధ్యానానికి  దూరం చేస్తుంది . తోటి చెలులతో ఆటపాటలతో తేలిపోయే సుందరవల్లి ‘ ఇచ్ఛాశక్తి’ కి సంకేతం.  లౌకిక పరమైన అష్టభోగములను ఇచ్చు శక్తి సుందరవల్లిది .