Read om saravana bhava 7 by LRKS.Srinivasa Rao in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఓం శరవణ భవ - 7

                             

                           దేవతలందరూ పరమేశ్వర సన్నిధి చేరారు . పరాత్పరుని  ఆర్తిగా స్తుతించారు .  వారి మనోగతం  తెలిసిన మహేశ్వరుడు  కుమార సంభవమునకు ఉద్యమించాడు . 

కరుణా సముద్రుడైన  పార్వతీ రమణు డు ప్రస్తుత రూపాన్ని విడిచి పెట్టాడు .  తన యొక్క ఆరు ముఖాలతోను , ఆరు త్రినేత్రాలతోను,  దర్శనమిచ్చాడు .  శివుని ఆరు ముఖాల్లోని గుణాలు —---- 1. ఐశ్వర్యం,( ఆదిశక్తి), 2. 3. వీర్యం( ఇచ్ఛా శక్తి),  కీర్తి(  క్రియా శక్తి ) ,  4. శ్రీ( పరాశక్తి)   , 5. జ్ఞానం ( జ్ఞాన శక్తి ) ,  6. వైరాగ్యం ( కుండలినీ శక్తి ) ,  ఇవన్నీ చేరి  దేదీప్యమానంగా ఆరు ముఖాలై ప్రకాశించుచున్నవి . 


ఈ పూర్ణ రూపం తో తదేకధ్యానం తో  పార్వతిని వీక్షించాడు పరమేశ్వరుడు .  ఆ వీక్షణం తో  ఆరు ముఖాలలో మూడో నేత్రం నుండి  కోటిసూర్య సమానమైనది , కాలాగ్ని తుల్యమైనది  అయిన  తేజస్సు  వెలువడింది .  ఈ తేజస్సు ఆరు రూపాలుగా వెలువడిన తర్వాత క్రమక్రమంగా విశ్వవ్యాప్తమైంది , ఆ తేజస్సు తీవ్రతకు  సర్వలోకాలు తల్లడిల్లిపోయాయి . దేవతలు భయవిహ్వలులై పరుగుదీశారు .  ప్రయళానికి మరో రూపం లా నున్న దాని ప్రచండతకు అనంత విశ్వం యావత్తు కంపించిపోయింది . 


శివుడు తన సహజ స్వరూపానికి  మారాడు  . అయన సంకల్పం తో ఆ ఆరు తేజో రూపాలు శాంతించినవి . వినయంగా శివుని ముందు నిలిచినవి . 


శివాజ్ఞ మేరకు  అగ్ని , వాయుదేవులు ఆ తేజో రూపాలను  గంగలో విడుచుటకు బయలు దేరారు .  ముందు వాటిని అగ్నిదేవుడు తన శిరస్సు పై నుంచి కొంతదూరం మోశాడు .  పిదప ఆ బాధ్యత  వాయుదేవునకు అప్పగించ బడినది .   వాయుదేవుడు  ఆ శక్తులను ‘ శరవణ సరోవరానికి చేర్చాడు .  ‘ శరవణ ‘ అనగా రెల్లుగడ్డి పెరిగిన సరోవరము ‘ అన్న  అర్థం వస్తుంది . 


                  ఈ  తేజో శక్తులు గంగలో విడువబడి నప్పుడు వాటి తీవ్రతకు  గంగానది ఎండి  పోయింది . తిరిగి పరమేశ్వరుని  కటాక్షము తో  జీవనదిగా పునర్జన్మ పొందింది . 
శరవణ సరస్సును చేరిన  తేజోరూపాలు  ఆరు అందమైన బాలురుగా మారినవి .  దేవత లందరూ భయభక్తులతో  ఆ తేజోవంతమైన కుమారులకు నమస్కరించారు . బ్రహ్మదేవుడు , ఆకాశం లోనూ , విష్ణుమూర్తి భూలోకం లోనూ   ఇంద్రాది దిక్పాలకులు  తమ తమ   దిక్కులలోనూ ఉంది ఆ తేజో రూపాలకు రక్షణ గా నిలిచారు . 

ఆ  ఆరు శిశు రూపాలు  సరోవరం లోని ఆరు కలువ పువ్వుల్లో  నిలిచినవి .  చెన్ను + కలువ  = చెంగలువ . రాయడు  = రాజు  . కుమార స్వామికి  చెంగలువ రాయుడు అన్న పేరు వచ్చినది పై కారణం చేతనే . 
తమిళం లో ‘ మురుగు’  అంటే ‘ అందం’ అని అర్థం . ఈ చెంగల్వ రాయండి తమిళం లో  ‘ శెందిల్ ‘ అని  ‘ మురుగా ‘ అని పిలువబడు  చున్నాడు .  
    ‘ కార్తీక కన్యలు ‘  శరవణ సరోవరం చెంత  శివ కుమారుల కొరకై  వేచి ఉన్నారు . వారి లక్ష్యం  శివ కుమారులను కొంతకాలం పెంచటమే .   శ్రీమన్నారాయణుని  ఆజ్ఞ మేరకు కార్తీక కన్యలు  శివ తనయుల ను   తమ చేతుల్లోకి  తీసుకున్నారు .  ఆ దివ్య స్పర్శ తో  వారికీ స్తన్యం సహజ ధారలా  పొంగినది . పరమేశ్వర పుత్రులకు పాలిడిన  పుణ్యమూర్తులు  కార్తీక కన్యలు.  వారి కారణం గానే సుబ్రహ్మణ్యునకు ‘ కార్తికేయుడన్న’  నామం ప్రచలితమైంది . 


       పరమేశ్వరుని ముఖముల నుండి  ఉద్భవించిన  జ్యోతి రూపాలు ప్రళయాగ్నుల వలె  విజృంభించిన వేళ  దేవతలు పరుగులిడినట్లు గానే  పార్వతి కూడా  కైలాసాన్ని వీడి  పారిపోయింది .   ఆలా భయపడి  పారిపోయిన సమయం లోనే  తన కాలి  అందెల  లోని  నవరత్నములు  సరము నుండి విడివడి  చెదరినవి .  చెదరిన  నవరత్నముల నుండి  ‘ నవవీరులు’  ఉద్భవించిరి .  చెంగల్వరాయనికి  ఈ తొమ్మిది మంది అనుచరులై  సేవలందించారు . 


      ఆలా తేజోరూపాల ప్రచండతకు  తాళలేక పారిపోయిన  పరమేశ్వరి  భర్త సన్నిధి చేరి  జరిగినదంతా తెలుసుకుంటుంది .  తన కుమారునికి కార్తీక కన్యలు  పాలిచ్చి పెంచిన సంఘటన  ఆమెకు సహింపరానిదవుతుంది .   తల్లీ బిడ్డలకు అవరోధం కల్పించిన దేవతలను నిస్సంతులను కమ్మని  మరొక్కసారి పరమేశ్వరి శపిస్తుంది .  సతీదేవిగా దక్షయజ్ఞ కాలమందు  దేవతలకు ఈ తీరుగనే  శాపమిచ్చిన సంగతి మనకు విదితమే .  


                తనకు పుత్రుని పవిత్ర స్పర్శను  ప్రసాదించమని  శంకరి  శంకరుని వేడుకుంటుంది .  కరుణాంతరంగుడు , కైలాసవాసుడు అందులకు అంగీకరించి సతీ సమేతుడై  శరవణ సరోవరానికి చేరాడు .  

శివాజ్ఞ మేరకు శివాని  ఆరుగురు శిశువులను  ప్రేమగా తాకగనే  వారందరూ ఏకరూపులై  గోచరించారు .  ఒక్క శరీరం, ఆరుముఖాలు , పన్నెండు చేతులతో పరమ మనోహరంగా , పరమేశ్వర ప్రతిరూపం లా  దర్శనమిచ్చాడు .  ఈ రూపం గల శివ-శక్తి  కుమారుడు ‘ షణ్ముఖుడని ‘  సార్థక నామధేయుడైనాడు . 


    జగజ్జనని , ప్రేమస్వరూపిణి  పరాత్పరి  షణ్ముఖుని చేతుల్లోకి  తీసుకుంది .  ఆ పసివాడి  నోటికి జ్ఞాన క్షీరం అందించింది .  అనంత జ్ఞాన సారాన్ని  తనలో ఇముడ్చుకున్న  శివ కుమారుడు ‘ స్కందు’ డైనాడు .  తమిళం లో ‘స్కందుని’      ‘కందన్ ’ అని  వ్యవహరిస్తారు .  పరాత్పరి  జ్ఞాన క్షీరాన్ని  గ్రోలిన  షణ్ముఖుడు  సమస్త విద్యలను  పొందిన వాడయినాడు .  ఈ సర్వజ్ఞత  అతడిని ‘ సుబ్రహ్మణ్యుని’ చేసింది .  కార్తీక కన్యల  కారణాన  సుబ్రహ్మణ్యుని కార్తీక మాసం లోను ,  కృత్తికా నక్షత్ర దినాలలోను  సేవించిన వారికి  సకల శుభాలు , సిద్ధులు లభిస్తాయి . 


      శివ తేజము  ‘ అగ్ని’  ,  ‘ వాయు ‘  దేవుల మూలంగా ‘  ఆకాశము’ నుండి  ‘ భూమి ‘ కి  తద్వారా  భూమి లోని ‘ గంగాజలం’ మీదికి చేరినందున  ‘ పంచభూతాలు’  షణ్ముఖుని వశం లో ఉంటాయి .  గంగానదీ ప్రవాహం లో  ఎదురీదిన  ఈ ‘ శివ వీర్య తేజోమయుడు ‘  గాంగేయుడు’   అని కూడా    పిలువబడుచున్నాడు . 


     ఇలా శివ కుమారుడు  సర్వశక్తిమంతుడు , సర్వజ్ఞాన నిలయుడు . ఆదిదంపతుల విశేష గుణములను  పుణికి పుచ్చుకున్న  స్కందుడు సర్వలోకారాధ్యుడు .  ఆ సనాతన దంపతులను  కొలిచిన  సమిష్టి ఫలం కేవలం స్కందుని ఆశ్రయించిననూ  పరిపూర్ణం గా  పొందగలం .

 

*********************************************************************************************************************

                                                                                                                                                                                                                                                                                                                           

కొనసాగించండి 

8 లో