Read Om Saravana Bhava - 2 by LRKS.Srinivasa Rao in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఓం శరవణ భవ - 2

 

రాక్షస నాయకుడైన మహా సురుని పుత్రిక మాయాదేవి . కారణజన్మురాలు . శుక్రాచార్యుని ప్రియ  శిష్యురాలు . 

అపూర్వ లావణ్య శోభిత మాయాదేవి . అసమాన ప్రజ్ఞాధురందరి .  రాక్షస జాతి సముద్ధరణ కై కంకణం కట్టుకున్న ఈ  కారణజన్మురాలు గురువు ఆనతి మేరకు కశ్యప ప్రజాపతి ని ఆశ్రయిస్తుంది.   దైత్య కులవర్ధనుడైన ఆ మహాపురుషుని సేవించి , అయన సంపర్కము చే అసమాన బాల సంపన్నులు , అసహాయ శూరులు అయిన  సోదర త్రయమునకు తల్లి అవుతుంది . సహస్రాధికమైన రాక్షస వీరుల జన్మకు కారణమవుతుంది . 

           శూరపద్ముడు ,సింహ ముఖుడు, తారకాసురుడు   తల్లిదండ్రులైన మాయాదేవి, కశ్యప ప్రజాపతులకు ప్రణమిల్లి మాతృవాక్య పరిపాలకులై ఘోర తపము చేయ తరలి వెళ్లి పోతారు . 

          శివ ధిక్కార పాపము  దక్ష ప్రజాపతి నే కాదు దేవతలను కూడా  కష్టాల పాలు చేస్తుంది . సాధ్యాసాధ్యములను విశ్లేషించక దక్షుని ప్రాభవ , పరాక్రమములకు  భయపడి , మాయామోహితులై , లోభ దృష్టి తో నిరీశ్వర యాగమును సందర్శిస్తారు దేవతలు . ఈ  అనాలోచిత చర్య ఫలితంగా నాడు యజ్ఞ వాటిక లో సతీ దేవి దేవతలను నిస్సంతులను కమ్మని శపిస్తుంది . వీరభద్రుని కరవాలమునకు బలియై అంగహీనులై, అంగలార్చినది ఈ కారణం గానే . ఆ పాపం అంతటి తో సమసి పోలేదు . రాక్షస రూపం లో దేవతలను కబళించుటకై ప్రభవించి , పల్లవించి  వట వృక్షము వలె  వ్యాపించనున్నది . 

             

           తామసులైననూ, అసురులైననూ, కశ్యప ప్రజాపతి తను జులు అచంచల దీక్షాదక్షతలు మెండుగా గల మాయాదేవి గర్భ సంజాతులు .     తల్లి ఆశీర్వాదం కవచమై ఆ రాక్షస త్రయమును సదా రక్షిస్తుంది . 


            శూర పద్మాదులు ఘోర తపస్సు  చేస్తున్నారు . అది సుదీర్ఘ కాలము  సాగిన ఉగ్ర తపస్సు . ఇలా వారి తపస్సు పదునాలుగు వేల  సంవత్సరాలు సాగినందుకు ఓ ప్రబల కారణముంది . తామసులై తపము చేయు రాక్షసులు విపరీతమైన కోర్కెలు సాధించుకొని ముల్లోకాల్లో విలయం సృష్టిస్తారు .. ఇచ్చట , ఈ  సందర్భములో కూడా సోదర త్రయం మనసు తెలిసిన మహాదేవుడు విశ్వ హితము కోరే కాలయాపన చేస్తున్నాడు . వారి సహనానికది అగ్ని పరీక్ష . ఈ పరీక్షలో నెగ్గి , వారు నటరాజును ప్రసన్నం చేసుకుంటారో లేదో నన్న ఉత్కంఠ దేవతలను పట్టి  కుదిపేస్తూంది . కారణం, ఈ పరిణామం పైన దేవతల  భవితవ్యం ఆధారపడి ఉంది . సోదర త్రయం యోగభ్రష్టులైతే దేవతల కస్టాలు గట్టెక్కినట్లే . అలా కాక , వారికి అభయంకరుడు ప్రసన్నుడైతే వీరి పరిస్థితి కడు  హీనమవుతుంది . 

 

             కాలయాపన భరించలేని శూర పద్ముడు హోమాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటాడు .  అగ్రజుని వియోగం భరించలేని  తారకాసుర , సింహ ముఖులు “ శూరుని ” వలె తాము కూడా  హోమాగ్ని లో సమిధలు కాదలచు కుంటారు .  శివుడు ప్రసన్నుడై సాక్షాత్కరించి వారి ప్రయత్నమును నివారిస్తాడు . శూర పద్ముడు పునర్జన్మ నెత్తి  సోదర సమేతంగా సదాశివుని స్తుతిస్తాడు . కపర్ది కరుణాంతరంగుడై ఆ రాక్షస త్రయం కోరిన వరమెల్ల ప్రసాదిస్తాడు . 


               అసాధారణ వర ఫలితం గా  శూరపద్ముడు వెయ్యిన్ని ఎనిమిది అండములను , నూట ఎనిమిది యుగములు పరిపాలించు అర్హత పొందుతాడు . లిప్త కాలం లో అనంత విశ్వమునే చుట్టిరాగల విలక్షణమైన విమానమును తన అచంచల భక్తి కి కానుకగా అందుకుంటాడు . ఇలాంటివే మరెన్నో వరములను  పొందిన శూర పద్ముడు  మహాదేవుని కృప చే సర్వ శక్తిమం తుడవుతాడు . 

                పిమ్మట అసురాచార్యుడు శుక్రుడు ప్రత్యక్షమై శూరా పద్మాదులకు రాక్షస నీతి  బోధిస్తాడు . దేవతల

ప్రాభవ పరాక్రమములు  తగ్గించి అసుర పాలన సర్వ లోకాలలో వ్యాపించేలా విక్రమించమని , విలయం సృష్టించమని  ప్రోత్సహిస్తాడు . 

 

             ఈ విపరీత పరిణామం తో  హడలి పోయిన ఇంద్రాది దేవతలు బ్రహ్మ విష్ణువులు వెంట రాగా సదాశివుని  శరణు వేడుతారు .   పరమ శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై  ఇలా అన్నాడు —---- “ దక్ష ప్రజాపతి నిర్వహించిన నిరీశ్వర యాగమునకు వెళ్లి కష్టములు  కోరి తెచ్చుకున్నారు .   అమరులైననూ కర్మ ఫలము అనుభవింపక తప్పదు .   అకళంక భక్తి ప్రపత్తులతో , అకుంఠిత దీక్షతో నన్ను సేవించిన శూరపద్ముడు  యాగఫలమును తప్పక అనుభవిస్తాడు . అతడి ఆగడాలు , అసుర నీతి మిమ్మల్ని  ఆపదల పాలు చేస్తాయి . కానీ, మీ కష్టాలు కలకాలం కొనసాగవు . అజేయుడైన శూర పద్ముని  నిర్జించగల అమేయ బల సంపన్నుడైన బాల సుబ్రహ్మణ్యుడు శివ-శక్తి సమాగమం తో ఉదయించనున్నాడు . “ కుమార సంభవం “మీ జీవితాల కొక ఆశాకిరణం .   దైత్యుల నాశనానికి , దమన నీతికి  అదే చరమ గీతం . 

 

            మహేశ్వరుని ఆశ్వాసన  దేవతలను స్వస్థ చిత్తులను గావించింది . 

 

                   XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX 

                                                                                                                                                 కొనసాగించండి    3 లో