Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తొలి పౌర్ణమి - 18

చూడండి నేను మీరనుకున్నట్టు చేసేవాడిని ఐతే చాందిని నన్ను వదిలేసినప్పుడే వేరే అమ్మాయిని చూసే వాడిని కానీ నా మనసు అలా యాక్సెప్ట్ చెయ్యదు, నేను ఆకాష్ కి చేసింది మనసులో పెట్టుకొని మీరు ఏది బడితే అది మాట్లాడితే నాలో వేరే విక్రమ్ ని చూస్తారు..”
నేనేం మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావా రా.., అయినా నువ్వేదో చేస్తే.. చూస్తూ కూర్చోవడానికి నేనేం చేతకాని వాడిని కాదు..
ఆయన అలాగే మాట్లాడుతుంటే నాకు కోపం పెరిగిపోతోంది.
ఇంతలో చాందిని వచ్చి నన్ను వెనక్కి తోసింది.., నేను కాలర్ వదిలేసా.., 
“నాన్న వెళ్దాం పదండి” అంది చాందిని..
ఇంకా వీడితో మాటలు ఏంటి, అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకెళుతున్నాడు.
మహా… నాకు సమాధానం చెప్పు, నాతో మాట్లాడు, ఒకవేళ నేను తప్పే చేసి ఉంటే, సరే అంగీకరిస్తున్నా, కానీ తప్పు చేసిన వాళ్ళకి ఈ లోకంలో బతికే హక్కు లేదా, నీతో‌ మాట్లాడకూడదా…, నిన్ను ప్రేమించకూడదా…, “చెప్పు చాందినీ” అంటూ అరిచా. 
తనను తీసుకెళ్తున్న వాళ్ళ నాన్న ఆగి, “తను హంతకులతో మాట్లాడానని నాతో చెప్పింది విక్రమ్ నువ్వు చాందినీ ని వదిలెయ్“ అన్నాడు.
ఆ మాట తర్వాత చాందిని నుంచి శ్వాస కూడా బయటికి రావట్లేదు, అంటే తను నిజంగానే ఆ మాట… , నేను అక్కడే కూలబడిపోయాను.
వాళ్ల నాన్న బైక్ లో కూర్చొని తను వెళ్లిపోవడం నేను గమనిస్తూనే ఉన్నా…తన కను చూపు పొరపాటునైన నా వంక వాల్చలేదు..
తను వెళ్ళిపోయాక అక్కడ నుంచి లేచి చెరువు వైపు నడుచుకుంటూ వెళ్ళా, అక్కడ మేమిద్దరం ఆరోజు రాత్రి తీసుకున్న బోట్ తీసుకొని సరిగ్గా చెరువు మధ్యలోకి వెళ్ళిపోయా.
నా జీవితంలో ఎప్పుడూ ఒక అమ్మాయి కోసం ఏడుస్తా అనుకోలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తున్న, దీనమ్మ జీవితమంటే ఇంతే మనం చేయకూడదనుకున్న ప్రతి దాన్ని చేయిస్తుంది.
నా ఏడుపు పట్టించుకోవడం దేవుడికి కూడా ఇష్టం లేదు అందుకే వర్షం మొదలైంది, వర్షంలో ఏడిస్తే కన్నీళ్లు కనపడవు అంటారు కదా, అది చూసేవాడికి ఏడ్చే వాడికి కాదు, ఎందుకంటే ఆ కన్నీళ్లు నా గుండె నుంచి ఉప్పొంగుతున్న విషయం నాకు స్పష్టంగా తెలుస్తోంది. 
ఇంతలో బోట్ లో ఏదో అలికిడి వినిపించింది..
మెల్లగా తల కుడివైపుకు తిప్పా, చూస్తే ఆకాష్ మౌనంగా కూర్చున్నాడు, నన్ను ఎలాంటి ప్రశ్న అడగట్లేదు…
ఏంటి ఆకాష్ కనపడగానే నన్ను భయపెట్టేవాడివి ఏంటి మౌనంగా ఉన్నావ్?..,అని వాడిని ప్రశ్నించా..
ఆకాష్ నవ్వుతూ, “ఇంతలా బాధపడేవాడిని ఇంకేం భయపెడతావ్..” అన్నాడు
నువ్వు చిన్నప్పుడే వెళ్ళిపోయి మంచి పని చేశావ్ రా, లేదంటే ఇలాంటి బాధ నీ వల్ల అయ్యేది కాదు..
“నన్ను పంపించింది నువ్వే కదరా” అంటూ నవ్వాడు..
అది కూడా నిజమే అనుకో…, అయినా నువ్వు నా కంటపడ్డపుడల్లా చంపాలని ఆరాటపడేవాడివి కదా..ఇప్పుడేంటి ఇంత సైలెంట్ గా ఉన్నావ్
“ అది నేను కాదు, నువ్వు నీపై నాలా పెట్టుకున్న ఒక ఆలోచన అంతే, నా మరదలు పుణ్యమా అని, నువ్వు మారి నన్ను కూడా మార్చావ్” అన్నాడు ఆకాష్..
నేను చిన్న చిరునవ్వుతో.., “ఇంకేంటి మిత్రమా నీతో ఇలా మాట్లాడాలన్నది నా ఎన్నో రోజుల కల”…
నాకు కూడా విక్రమ్, బహుశా నేను నీకు మళ్ళీ కనిపించక పోవచ్చు, నేను చెప్పేది జాగ్రత్తగా విను, చాందినీ ని ఒంటరిగా వదిలెయ్యకు తను కూడా నీలానే ఇన్నాళ్లు ఒంటరితనం వల్ల చాలా బాధలు అనుభవించింది..
ఇన్నాళ్ళు భయపెట్టిన, నువ్వు నాతోనే ఉన్నావ్, ఇప్పుడు వెళ్ళిపోతుంటే ఏడుపొస్తుంది రా…
“జీవితం ప్రతి ఒక్కరినీ ఏడిపిస్తుంది మావ కొంత మందిని లోపల కొంత మందిని బయట”, “నువ్వు బయటికి ఏడుస్తుంటే, తను లోపల ఏడుస్తోంది..”, తనని కోల్పోకు.
 “సరే విక్రమ్ వెళ్తున్నా అంటూ చిరునవ్వుతో కనుమరుగైపోయాడు ఆకాష్.”
నాకు ఆకాష్ కోసం బాధపడాలా లేక చాందిని కోసం బాధపడాలా అన్న అయోమయంలో సమయం తెలియట్లేదు”, మళ్లీ ఆలోచనల్లోకి కూరుకుపోయి, ఒక గమ్యం లేని నావలా మిగిలిపోయా…..
టైం 10 అవుతోంది. మేడ మీద బాగా చలిగా ఉంది, గాలి విరుచుకుపడుతోంది.
“హే మ్యాన్” అంటూ వినపడింది..
చూస్తే, డెల్టా నిదానంగా మెట్లెక్కుతూ వస్తున్నాడు.
కిందకు వెళ్దాం పదా బాగా చలిగా ఉంది..
నువ్వు వెళ్ళు డెల్టా కాసేపయ్యాక వస్తా అన్నాడు ఆకాష్..
నువ్వు ఇప్పుడు రాకపోతే అమ్మని నిద్రలేపుతా ..
అమ్మ పైకి వస్తే కథ విననివ్వకుండా నిద్రపోమంటుంది అని మనసులో అనుకొని, “ సరే వెళ్తున్నా” అంటూ తన గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు..
కథలో ఉండే ఆసక్తి అతన్ని నిద్రపోనివ్వట్లేదు..
“ఏదైనా సరే… ఈరోజు కథ మాత్రం పూర్తిగా వినాలి!” ఎలాగూ రేపు స్కూల్‌కి సెలవే, అని మళ్లీ హెడ్ ఫోన్ పెట్టుకున్నాడు.

“ విక్రమ్” 
“రేయ్ విక్రమ్” ఎవరో కదిలించారు.
 జయా గాడు..
ఒరేయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా రాత్రంతా వర్షం లో ఇక్కడ తడుస్తూనే ఉన్నావా? ఇప్పుడు టైం ఉదయం 9 అవుతోంది.
నాకు స్పర్శ సరిగ్గా లేదు, జయ నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు , ఏమి తినకుండా ఉన్నందుకు చాలా నీరసంగా ఉంది…
జయ ని పట్టుకుని నడుస్తూ ఉన్నాను సరిగ్గా వెళ్లి డాక్టర్ ముందు నుంచున్నా, కళ్ళు మసకబారిపోయాయి తల తిరిగినట్టు అనిపించింది కింద పడిపోయా, నాకు అంతవరకే గుర్తుంది. 
       **
కళ్ళు తెరిచి చూస్తే అమ్మా నాన్న ఉన్నారు, ఒకరోజు దాకా నేను లేవలేదంట, అమ్మ ఒకపక్క ఏడుస్తోంది, నాన్న కళ్ళలో కూడా నీళ్ళు, కానీ ఆయన కూడా ఏడిస్తే అమ్మ భయపడుతుందని ఊరికే ఉన్నట్టున్నాడు. 
నేను లేవగానే నాన్న నా దగ్గరకు వచ్చి గట్టిగా కౌగలించుకున్నాడు…., నాకు అర్థం కాలేదు కొడతాడనుకుంటే కౌగిలించుకున్నాడేంటి.
“ఇలాంటివేమన్నా జరిగితే మాకు చెప్పొచ్చు కదా రా”.. 
క్షమించండి నాన్నా ఇంకెప్పుడూ ఇలా జరగదు. 
“అమ్మా” అంటూ పిలిచా, అమ్మ నా వైపు కూడా చూడలేదు, ఆ రోజు నుంచి అమ్మ నాతో మాట్లాడటం మానేసింది..
ఆరోజు సాయంత్రం డిస్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాం..
నన్ను చూడడానికి శృతి వచ్చింది, తను నా ఆరోగ్యం సంగతి అడిగి, చాందిని విషయం ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. 
చాందిని లేకుండా ఉండబోయే నా జీవితాన్ని ఇక మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాను, మరుసటి రోజు నుంచి ఆఫీస్ కి వెళ్లడం మొదలుపెట్టాను. 
తను వేరే క్యాబిన్ లో కూర్చుంటోంది, అది కూడా నాకు మంచిదే అయ్యింది.
 రోజూ ఆఫీస్ కు వెళ్లడం, పనిచేసి తిరిగి ఇంటికి రావడం ఇలా గడిచింది ఒక వారం అంతా..
రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టక పోయే సరికి నేను చిన్నగా మందు తాగడం మొదలు పెట్టా.., కానీ అమ్మా నాన్నలు నన్ను ఒక్క మాట అడగలేదు, వాళ్లకు నేను తగ్గుతున్న విషయం తెలీదనే అనుకుంటున్నా..
   **
ఒకరోజు ఉదయం క్యాబిన్ డోర్ తెరవగానే చాందిని కనిపించింది,
చూడటానికి ఎంత ముద్దుగా ఉందో , ఏంటో ఈ అమ్మాయిలు మనం కావాలన్నప్పుడు కాకుండా కాదనుకున్నప్పుడే ఇంకా ముద్దుగా ఉంటారు.
శృతితో ఏదో కంగారుగా చెప్తోంది, నేను వెళ్లి కూర్చున్న కాసేపటికి చాందిని వెళ్ళిపోయింది.
“ఏమైంది శృతి” అని అడిగా..
ఏం లేదు విక్రమ్..
పర్లేదు చెప్పు శృతి, నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మాత్రమే అడుగుతున్నా..
వాళ్ల మావయ్యకి డెంగ్యూ వచ్చిందంట, ప్లేట్లెట్ కౌంట్ 20000 ఉందంట, వేంటనే ఏ నెగిటివ్ బ్లడ్ కావాలి, అందుకనే బ్లడ్ డోనర్స్ ను వెతకాలి అని చెబుతోంది, a- చాలా అరుదు అంత ఈజీ గా దొరకదు, అందుకే కంగారు పడుతోంది..
 “నా బ్లడ్ గ్రూప్ అదే”, శృతి ఒక పని చెయ్యి నా పేరు చెప్పకుండా ఒక వ్యక్తి బ్లడ్ ఇవ్వడానికి వస్తున్నాడు అని చెప్పు..
 రేయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా, పోయిన వారమే నువ్వు జ్వరం నుంచి కోలుకున్నావు, ఇంకా వీక్ గా ఉన్నావ్, ఇప్పుడు నువ్వు అమర ప్రేమికుడు అని నిరూపించడానికి ఇలాంటివన్నీ దయచేసి చేయొద్దు నీకు ఏదైనా అయితే.
మావ ఇది తన కోసం చేయట్లేదు, వాళ్లకు ఆకాష్ ని దూరం చేసి చాలా ఇబ్బంది పెట్టాను, అంకుల్ కి ఏమన్నా అయితే హేమ, వాళ్ళ అమ్మ ఎలా బ్రతుకుతారు రా, అసలే హేమా పెళ్ళి కావాల్సిన పిల్ల.
 అదికాదు విక్రమ్..
మావా నిన్ను ఎప్పుడు ఏది అడగలేదు దయచేసి ఇది కాదనకు. 
నువ్వు సినిమా డైలాగులు చెప్పొద్దు, ‘ నీ ఇష్టం..,దీంతో నాకేమి సంబంధం లేదు ‘.
వెంటనే బయలుదేరాం 10 నిమిషాలకు హాస్పిటల్ దగ్గర ఉన్నా, 20 నిమిషాల్లో బ్లడ్ ఇవ్వడం అయిపోయింది..
డాక్టర్ లోపలకొచ్చారు..
థ్యాంక్యూ సో మచ్ ఒక లైఫ్ ను కాపాడవ్ , “చూడడానికి కొంచెం నీరసంగా ఉన్నావే, నీకు హెల్త్ అంతా బానే ఉందా..”
ఓకే డాక్టర్, తింటే సెట్ అయిపోతా..
నీ పేరేంటి బాబు, వాళ్లకు నిన్ను పరిచయం చేస్తా..
పేరు వద్దులే డాక్టర్, జస్ట్ బ్లడ్ దొరికింది అని చెప్పి ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేయండి ..
సరే అయితే, ఏదైనా తినేసి వెళ్ళు…
సరే డాక్టర్ అంటూ బయటకు వెళ్ళడానికి డోర్ తీసా.. చాందిని, హేమ నా ఎదురుగా నిలబడి ఉన్నారు.
అలా ఒక్క నిమిషం గడిచింది, ఎవరేం మాట్లాడలేదు ఒకరినొకరు చూసుకుంటున్నాం..
జయ మాట్లాడుతూ, “విక్రమ్ నువ్వేమన్నా మాట్లాడాలంటే త్వరగా చెప్పు, ఇక వెళ్దాం మళ్లీ తినకుంటే నీరసం వచ్చి పడిపోతావ్..”.
“ వద్దులే జయ తను హంతకులతో మాట్లాడదు” , “తనను ఇబ్బంది పెట్టి మాట్లాడించడం నాకు ఇష్టం లేదు వెళ్దాం పదా”, అక్కడినుంచి వెళ్ళిపోయాం..
 కనీసం ఆ మాట అన్నదానికైనా నేను ఎంత బాధ పడుతున్నానో తనకు తెలుస్తుందని అలా అన్నా!...
జయ గాడు అప్పుడప్పుడు మందు కొట్టేవాడు ఇప్పుడు వాడి కంటే ఎక్కువ నేనే తాగుతున్నా,ఎలా తాగుతున్నానంటే “తెచ్చింది మొత్తం నువ్వే తాగేస్తున్నావ్ రా” అని వాడు నేను గొడవపడేంతలా..
ఆ శనివారం ఇద్దరం తాగడానికి కూర్చున్నాం..
రే జయ అసలు మన లైఫ్ లోకి ఈ అమ్మాయిలు ఎందుకురా వస్తారు..,అని జయ ని అడిగా.
మనల్ని నాశనం చెయ్యడానికి మావ..
కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావ్, కానీ ఈ అమ్మాయి ఏంట్రా నా లైఫ్ ని సరిచేసి, తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది…
అయినా ఇప్పుడేమయ్యింది.., నువ్వు మళ్ళీ రీస్టార్ట్ చేసావ్ గా, చాందిని లేకుండా ఉండటం అలవాటు చేసుకుంటున్నావ్..
ఎక్కడ మర్చిపోవడం మావ, నా లైఫ్ టైమ్ లూప్ లా అయిపోయింది నా ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ తన దగ్గరే ఆగుతున్నాయి..
ఇప్పుడేం చేద్దాం..
మందు తాగుదాం మావ..
నేనడుగుతోంది చాందిని విషయం లో ఏం చేద్దాం అని..
దాన్ని వదిలేయ్ , నీకో విషయం చెప్పనా..
చెప్పరా..
“ఈ కాలంలో ఎవడన్నా పిచ్చి పిచ్చిగా ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాడిని పిచ్చోడు అంటారు గాని ప్రేమికుడు అని ఎవరు అనరు..”
ఏదో చెప్పావ్ కానీ ఎక్కట్లే…
తాగింది ఎక్కింది గా ఇక మూసుకొని పడుకో..
మరుసటి రోజు ఆదివారం జయ ఆరోజు తాగడం వద్దన్నాడు, అందుకే నా రూమ్ లో తాగుతున్న, ఇంట్లో అమ్మ, నాన్న ఎప్పుడు నా రూమ్ లోకి వచ్చేవాళ్ళు కాదు, ఆ ధైర్యంతోనే కూర్చుని తాగుతున్నా..
తాగడం పూర్తి కావస్తోంది, నాకు ఆల్రెడీ ఎక్కింది.
“డబ్….!” అంటూ డోర్ ఓపెన్ అయింది, నేను మద్యం మత్తులో ఉన్న..కళ్ళు కాస్త మసకగా కనబడుతున్నాయి ఎవడో ముసలోడు నా వైపు నడుచుకుంటూ వస్తున్నాడు, కళ్ళు తుడుచుకొని చూస్తే మా తాత గారు.
“రండి తాతగారు ఈ మంచం మీద ఆసీనులు కండి” అన్నాను…
తాత నేరుగా వచ్చి నా చెంప మీద ఒక్కటి పీకాడు, దెబ్బకు తాగింది సగం దిగిపోయింది..
వేడినీళ్లు పెట్టించి నన్ను స్నానానికి పంపించారు, స్నానం చేసేసరికి తాగింది మొత్తం దిగిపోయింది..
రూమ్ నుంచి బయటికి వచ్చా..
అందరూ హాల్లో డిస్కషన్ పెట్టారు, జయ కూడా వచ్చాడు.