Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తొలి పౌర్ణమి - 16

నువ్వు మీ నాన్న లాగే, సరే వెళ్ళు అంటూ చిన్నగా నవ్వింది..
అమ్మ నువ్వు పెళ్లి కాకముందు ఎవరితో అన్న డేట్ కి వెళ్ళావా..
లేదు రా.. మీ నాన్నతోనే నా ఫస్ట్, అండ్ లాస్ట్.., ఇప్పుడు మనుషులకు ఓపిక తగ్గిపోయింది,” జీవితాంతం ఒకే మనిషిని ప్రేమించే మైండ్ సెట్ మీ జనరేషన్ కి లేదు..
నిజంగా జీవితాంతం ఒకే మనిషిని ప్రేమించడం ఎలా సాధ్యం..
అది ప్రేమిస్తే కానీ తెలియదు.. రా, సరే చెప్తా విను
“జీవితాంతం ఒకే మనిషిని ప్రేమించడం ఒక చెట్టు నీడలో ఉండడం లాంటిది కొంచెం బోరింగ్ గా ఉన్నా లైఫ్ పీస్ ఫుల్ గా ఉంటుంది.., అదే మనసు మారినప్పుడల్లా కొత్తవాళ్ళ కోసం వెళ్తే మనకు నీడ దొరుకుతుందేమో గాని లైఫ్ లో ప్రశాంతత ఉండదు..”
అయినా ఇవన్నీ నీకిప్పుడు అర్థం కావు, పోను పోను నీకే తెలుస్తుంది..
నువ్వు బాగా మాట్లాడతావు మా, ఇలా మాట్లాడటం నీకు ఎవరు నేర్పించారు..
ఇంకెవరు మీ నాన్నే.., 
అలా చాలా కబుర్లు చెప్పుకున్నారు వాళ్ళిద్దరు 
ఒరేయ్ నాన్న నాకు నిద్దరొస్తోంది నేను పడుకుంటా, నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా పడుకో రా..
 సరే అమ్మ అంటూ, వాళ్ళ అమ్మ పడుకున్నాక ఫోన్ మరియు హెడ్ సెట్ తీసుకొని ఇంటి టెర్రస్ మీదకు వెళ్లాడు. 
కథను కొనసాగించాడు. 
  మామూలుగా ఉద్యోగానికి వెళ్లాలంటే ప్రతి మనిషిలో ఏదో ఒక చిన్న నిరాశ లేదా నిస్పృహ ఉంటుంది, కానీ నాకు మాత్రం ఆ రోజు చాలా హుషారుగా ఉంది. రాత్రి మా ఇద్దరి మధ్య జరిగిన సంఘటన అంతా ఒక కలలా అనిపిస్తోంది.
రాత్రంతా ఒకటే కలలు అన్ని మా ఇద్దరి భవిష్యత్తు గురించే భవిష్యత్తులో ఎలా ఉంటాం ఏం చేస్తాం, తనతో ఎక్కడికి వెళ్ళాలి, తను గర్భవతిగా ఉన్నప్పుడు నేను ఎలా చూసుకోవాలి, మీకు చెప్తుంటే ఎలా ఉందో తెలియదు గానీ నాకు మాత్రం భలే ఉంది. 
అమ్మ చేసిన టిఫిన్ కడుపునిండా తిన్నా. 
బయటికి వెళ్తుండగా అమ్మ ఎదురుపడింది..
రేయ్ విక్కి.
చెప్పు మా..
నాకో ప్రామిస్ చేస్తావా..
దేని గురించమ్మా..
ఎప్పుడూ ఇలానే నవ్వుతూ, హుషారుగా ఉంటావని..
కచ్చితంగా మా బాయ్ అంటూ బైక్ స్టార్ట్ చేశా..“ఇది చాందిని వల్లే అని చెప్పాలనిపించింది కానీ ఇది సమయం కాదు అని మనసులో అనుకున్నా”
ఆఫీస్ కి వెళ్లేసరికి ముగ్గురు వచ్చేసారు. 
నేను ఏమీ తెలియనట్లు వెళ్లి కూర్చున్నా.
చాందిని శృతి తో అంత చెప్పినట్టుంది, నన్ను చూసి ఒకటే నవ్వుతోంది శృతి. 
ఒక పక్క జయ గాడు చేత్తో కదిలిస్తూ కళ్ళెగరేస్తున్నాడు.
నాకేమో ఒక వైపు సిగ్గు ముంచుకొస్తోంది, దీని డైవర్ట్ చేద్దామని ఇలా అన్న.., “మహా..నిన్న నేను చెప్పిన ఆ ఫైల్ సెండ్ చెయ్యి”. 
సరే విక్రమ్ అంది తను. 
ఏంటి చాందిని ఆ రోజు నేను నిన్ను మహాలక్ష్మీ అని తమాషా కి పిలిస్తే నా మీద అరిచావు, ఇప్పుడు చూస్తే తెగ మురిసిపోతున్నావ్ అని అడిగింది శృతి. 
అలా ఏం లేదే పేర్లలో ఏముంది చెప్పు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు, కావాలంటే నువ్వు పిలువు..
“వద్దులే తల్లి నువ్వు ఆ పేరుని ఎవరికో పేటెంట్ ఇచ్చినట్టు ఉన్నావ్”. 
అలా ఏం లేదే శృతి.
ఇంతకీ ఏం ఫైల్ రా అది “లవ్ ఫైలా” అని అడిగాడు జయ. 
నేను ఏమీ తెలియనట్టు, “ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు? అలాంటిదేం లేదే నిన్న ఏదో చిన్న ఇష్యూ ఉంటే, దాన్ని సాల్వ్ చేసి తనని డ్రాప్ చేశా అంతే”.. అని కవర్ చేయడానికి ప్రయత్నించా..
అబ్బా….. బానే ఎక్స్ట్రాలు చేస్తున్నావ్ గా, నేను ఫైల్ గురించి అడిగా నిన్న రాత్రి ఏం జరిగిందో అడగలేదు..
ఇరుక్కున్నా, ఏదో ఒకటి మేనేజ్ చెయ్యాలి, “మహా, సారీ చాందిని కొంచెం బయటికి వస్తావా నీతో మాట్లాడాలి” అని తనని పిలిచా.
“సరే విక్రమ్” అంటూ నాకంటే ముందే బయటకు వెళ్ళిపోయింది.
ఏంట్రా ఈ కొత్త వేషాలు ఇంకా ఒక్కరోజు కూడా కాకముందే నువ్వు చెప్పినట్టు వింటోంది ఏంటి సంగతి, అన్నాడు జయ..
నేనేం మాట్లాడకుండా నాలో నేను నవ్వుకుంటునన్నా. 
అన్నయ్య వదినని పొమ్మని చెప్పి నువ్వు ఇక్కడే కూర్చున్నావు తొందరగా వెళ్ళు అంది శృతి.
 ఒకపక్క సిగ్గుగా ఉంది, మరో వైపు వాళ్ళ మొహాలను చూడలేకపోతున్నాను, తల అటువైపు తిప్పుకొని బయటికి వెళ్ళిపోయా.. 
ఏంటి మహా నువ్వు వాళ్లకు అలా ఎందుకు చెప్పావు.
 నేను జరిగింది చెప్పానంతే, వాళ్లు అలా అర్థం చేసుకున్నారు.
“అవునా, అయితే వాళ్లు అర్థం చేసుకున్న దాని గురించి నువ్వేం అనుకుంటున్నావ్” అని సూటిగా అడిగా
 నువ్వేం అనుకుంటున్నావో అదే నేను అనుకుంటున్నా, అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది…
 ఆ రోజంతా అలానే సరదా సరదాగా చాలా అందంగా గడిచిపోయింది. 
ఆరోజు సోహమ్ ఆఫీస్ కి రాలేదు.
ఎందుకో తెలియదు గాని తర్వాత రోజు నుంచి సోహమ్ మా గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు, అతను మంచిగా మారాడనే నమ్ముతున్నా. 
అలా రోజులు గడుస్తున్నాయి మేము ఒకరికొకరం చాలా దగ్గరవుతున్నాము, ఎంతగా అంటే ప్రతిరోజు పొద్దున్నే లేచి సూర్యుడిని చూసే నేను ఇప్పుడు తనని చూడాలనుకుంటున్నా. 
తనని అమ్మ నాన్నలకి ఫ్రెండ్ గా పరిచయం చేశా , వాళ్ళేమో నమ్మట్లేదు జయ ఎలాగోలా నమ్మించాడు..
   *****
 రాత్రి 8 అవుతుంది, శీతాకాలం కావడంతో గాలి చల్లగా వీస్తోంది. సరిగ్గా “ చెరువు మధ్యలో పడవ, పడవలో నేను, నా ఒడిలో తను “.
తన తలను పక్కకు వాల్చి ఆకాశం వంక చూస్తోంది, నేను సూటిగా తన కళ్ళలోకి చూస్తున్నా, తన కళ్ళు ఎప్పుడూ “రాత్రిపూట నక్షత్రాలతో నిండిన ఆకాశంలా చాలా ప్రశాంతంగా ఉంటాయి, తనకు ముద్దు పెడదామా అని నా మనసులో ఒక కొంటె ఆలోచన, అలాగే తను ఏమంటుందా ఆనే చిన్న భయం, ధైర్యం చేసి తన ముంగురులు సవరిస్తూ తన మెడను రెండు చేతులతో పట్టుకున్నాను, తను ఏం అనకుండా నా కళ్ళలోకి నెమ్మదిగా చూస్తోంది, ఇద్దరి మనసుల మద్య చిన్న ఉద్రిక్తత, గుండె వేగం ఎక్కువైంది , బహుశా తొలి ముద్దు ఇలానే ఉంటుందేమో, తల నా వైపు తిప్పగానే ఆమె పెదవులు నిదానంగా కదులుతున్నాయి, నేను మెల్లగా తన పెదాలను చేరుతున్నా..
ఇంతలో, ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే నాన్న..
(కొంచెం సీరియస్ టోన్ లో) చెప్పు నాన్న..
ఏంటి విక్రమ్ చిరాగ్గా ఉన్నావ్.
(నువ్వు ఫోన్ చేసిన టైమ్ లాంటిది అని మనసులో అనుకుని), ఫ్రెండ్ ను కలవటానికి వచ్చా… 
ఎవరు చాందినీ నా…
నీకెలా తెలుసు నాన్న..
నేనూ నీ వయసు నుంచి వచ్చా రా, సరే త్వరగా వచ్చేయ్ అంటూ కట్ చేశాడు
మూడ్ అంతా పోయింది, కాసేపు ఇద్దరి మద్య నిశ్శబ్దం, ఒకపక్క చిన్నగా “జామురాతిరి జాబిలమ్మ” అని పాట వినిపిస్తోంది మొబైల్లో.
తను మళ్ళీ నా ఓడిలోకి జారింది..
 తనను చేతితో హత్తుకొని ఆకాశం వంక చూసా...
ఓయ్ మహా..
ఏంటీ..
నాకు అసలు అమావాస్య అనేది రాదు తెలుసా..
అదెలా. 
ఎందుకంటే అమావాస్య రోజు చందమామకు బదులు నువ్వు నా పక్కనే ఉంటావుగా..
అబ్బా… భలే చెప్పావు, ఎక్కడ నేర్చుకున్నావ్ ఇలాంటివన్నీ.. 
నిన్ను చూసాకే.. 
అయితే ఒక కవిత చెప్పు చూద్దాం…
“నీతో బ్రతుకుతా లేదంటే నీ ఆలోచనలతో బ్రతుకుతా ఈ రెండు లేనప్పుడు ఆలోచించడం ఆపేస్తా”
ఇది కవితలా లేదే, ఏదో డైలాగ్ లాగా ఉంది..
ఏ.. బాగోలేదా..
బావుంది, కానీ నాకు కవిత కావాలి..
ఇప్పటికిప్పుడు కవిత చెప్పమంటే ఎలా, ఆ సందర్భం కావాలి కదా..
ఇంతకంటే మంచి సన్నివేశమా, ముందు నీ జీవితం ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేనున్నా, దీన్ని ఊహించుకొని ఒక కవిత చెప్పవా.. అంటూ నా కాలర్ పట్టుకుంది.
సరే ఇది విను..
అమావాస్యతో నిండిపోయిన నా జీవితానికి
పరిచయమైన తొలి పౌర్ణమి నువ్వే,
గుండె గదిలో దాగిన తారల్ని
మెల్లగా వెలిగించిన వెన్నెలవి నువ్వే.
చివరగా ఒక్క మాట …
నన్ను మళ్ళీ అమావాస్యలోకి తొయ్యవు కదా...?
అంటూ తన కళ్ళలోకి చూసా..
తొయ్యను లే.. అంటూ నా నుదుటి పై ముద్దు పెట్టింది….

****

 మరుసటి రోజు ఏదో ముఖ్యమైన పనుందంటూ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది చాందిని.
 నేను యధావిధిగా ఆఫీస్ కి వెళ్లా.., నేను తప్ప ఎవరు రాలేదు, జయ, శృతి వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు, చాలా బోరింగ్ గా ఉంది.., 5 గంటలు ఉండి ఇంటికి వచ్చేశా..
ఎందుకో గుడికి వెళ్ళాలనిపించింది వెంటనే జయ కి ఫోన్ చేశా…,ఆ శనివారం అంతా ఇస్కాన్ టెంపుల్ కి వెళ్లాం. 
గుడి లోపల శ్రీకృష్ణుని భజన జరుగుతోంది.., ఆయన జీవిత చరిత్రను ఉద్దేశించి ఉన్న విగ్రహాల గురించి చెప్పక్కర్లేదు వాటిని చూసి మైమరిచి పోవడం అంతే, ఇక పోతే లోపల ఉన్న పెద్ద మందిరం మనశ్శాంతికి మారుపేరులా ఉంది, అక్కడికి వెళ్తే బయటకు రావాలనిపించట్లేదు.నిజంగా ఆయన దర్శనం మనోహరం., ఎన్నో రకాల పుస్తకాలు, అక్కడి విశేషాలు చూస్తూ బయటికి రావడానికి 2 గంటల సమయం పట్టింది.
దర్శనం అయ్యాక బయటకు వచ్చి చేపల కొలను వద్ద కూర్చున్నాం. 
కొలను చాలా నిర్మలంగా ఉంది, దానిలో ఈదుతున్న చేపలను చూస్తూ, కబుర్లు చెప్పుకుంటున్నాం…
ఎందుకో నా చూపు ఒక వైపుకు మళ్ళింది, చూస్తే రమణ అంకుల్ అండ్ శాంతి ఆంటీ అదే ఆకాష్ వాళ్ళ అమ్మానాన్నలు. 
వాళ్లు నాకు కనిపించిన విషయం మా అమ్మానాన్నలకు చెప్పలేదు, కొంచెం పనుందంటూ జయా ను పక్కకు పిలిచి వాళ్ళు కనిపించిన విషయం చెప్పా..
వాళ్లతో మాట్లాడాలని ముందుకు కదిలాం, దగ్గరికి వెళ్లే కొద్ది నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది.
జయ నా భుజం మీద చేయి వేసి, “ఎన్నాళ్ళని దాచుకుంటావు ఈ బాధ, వెళ్లి మాట్లాడు”,అన్నాడు.
వెళ్లి వాళ్ళ ముందు నిలబడ్డా, నేనెవరా అన్నట్టుగా చూశారు..
“ అంకుల్ బాగున్నారా “..
హా బాగున్నా బాబు, ఇంతకీ ఎవరు నువ్వు, అడిగాడు రమణ అంకుల్..
నేను.. “విక్రమ్ అని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు” వాసు అంకుల్.. ఆకాష్ ఫ్రెండ్ నీ..
అవునా “ఎలా ఉన్నావ్ బాబు” అంటూ తిరిగి పలకరించారు..
అలా వాళ్ళతో కాసేపు మంచిగా మాట్లాడా..
 ఇంతలో వెనక నుంచి అమ్మాయి గొంతు “మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో , గతాన్ని గుర్తు చేసి మమ్మల్ని బాధ పెట్టొద్దు”అంటూ వినిపించింది 
వెనక్కి తిరిగి చూస్తే అది హేమ, తనేమి మారలేదు అలానే ఉంది చిన్నపిల్లలా.
“వీళ్లు మన ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మ” అన్నాడు రమణ అంకుల్.
ఫ్రెండ్స్ అంటే ఒకరినొకరు చంపుకుంటారా నాన్న. 
“అంటే ఇతను..” అంటూ ఏదో చెప్పబోయాడు రమణ అంకుల్..
మీరు మనసులో అనుకున్నది నిజమే, “ఇతనే విక్రమ్”, ఇందాక వీళ్ళ అమ్మానాన్నలతో కలిసి ఉన్నప్పుడే గుర్తుపట్టా, వీళ్ళ కంటికి కనపడకుండా వెళ్ళిపోదామని ఎంత ప్రయత్నించినా మళ్లీ వచ్చాడు చూడు మన జ్ఞాపకాలను గుర్తు చేసి బాధ పెట్టడానికి. 
అది కాదు హేమ ఆకాష్ నా బెస్ట్ ఫ్రెండ్, ఆరోజు పొరపాటున అలా జరిగిపోయింది, ఇన్ని రోజులు ఆ బాధ నేను అనుభవిస్తూనే ఉన్నా. 
“నువ్వేం చెప్పినా నేను వినదల్చుకోలేదు” అంది హేమ.
“ ఆ సంఘటన వల్ల విక్రమ్ కూడా చాలా సమస్యలు అనుభవించాడు” అని హేమా తో అన్నాడు జయ..
“నువ్వు వాడికి వత్తాసు పలకడానికి వచ్చావా” అన్నాడు రమణా అంకుల్..
ప్లీజ్ నేను చెప్పేది కాస్త వినండి..
“ దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి. లేదంటే, మిమ్మల్ని ఏదన్నా చేస్తానో లేదా నన్ను నేనే ఏమన్నా చేసుకుంటానో నాకే తెలియదు” అంటూ సీరియస్ గా అన్నాడాయన..
ఆ రెండో మాట వినగానే భయమేసింది. ఈ సంభాషణ కొనసాగించలేక అక్కడినుంచి వెళ్లి పోయా..
దీన్నంతా మా అమ్మానాన్నలు చూస్తూనే ఉన్నారు, చేసేది లేక తిరిగి ఇంటికి వెళ్లిపోయాం..
వాళ్ల మనసులో నాకు క్షమాపణ లేదు అన్న బాధ నన్ను కుదిపేస్తోంది.