Read The shadow is true - 16 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 16

కోమల పద్మాసనం లో నిటారుగా, యోగినిలా ఉంది . చూపులు నేల వైపు, మొహం లో ఏ భావం లేదు . ఎవరేం చెప్పినా బదులు లేదు . మౌనం -------అందరి మతులను పోగొట్టే మౌనం .!

పన్నాలాల్ కు పరిస్థితి అర్థమైంది . ఆమెను కాస్త కదిలించే ప్రయత్నం చేయాలి . కోమల కు ఎదురు నిల్చున్నాడు . స్వరం మార్చి , విజయ్, తేజ్ సింహ లకు

అనుమానం రాకుండా అ మ్మా ! కోమలా అని మెల్లగా పిలిచాడు . కోమల ఉలిక్కిపడి పన్నాలాల్ ను చూసింది . కళ్ళు కలుసుకున్నాయి .

“ చూడమ్మా కోమలా ! ఇందరు పెద్దలు ఇంతగా ప్రాధేయ పడుతుంటే మౌనంగా ఉండటం భావ్యం కాదు . అవతల ఆ పుణ్యాత్ముడికి అంత్యక్రి యలు జరగాలి . త్వరగా నీ మనసులో మాట వారికి చెప్పమ్మా . !” పన్నాలాల్ ‘సూచన ‘ చేశాడు . అందరి లాగే అతడూ తన వంతు ప్రయత్నం చేశాడని అందరూ అనుకున్నారు.

పన్నాలాల్ సూచన తో కోమల లో కదలిక వచ్చింది . తలెత్తి అత్తగారిని, విజయ్ ను చూసింది . చుట్టూ ఉన్న జనం వైపు దృష్టి సారించింది . మెల్లగా లేచి త్రివేదికి పాదాభివందనం చేసింది .

“ బాబు గారు ! రాహుల్ బాధ్యత నాదే ----కాదనను... మరి నా పరిస్థితి ఏమిటి ? అత్తగారు నన్ను కడుపులో దాచుకోవచ్చు . విజయ్ బాబు మనసు మార్చుకొని నన్ను వదినగా అభిమానిన్చవచ్చు . .... ఇన్ని ఉన్నా నా భర్త తిరిగి రాడుగా ? ఆయనతో నా జీవితం ఓ వరం . ఆయనను మరిచిపోవటం , ఆయన లేని ఒంటరి జీవితం గడపటం నాకు సాధ్యం కాదు . అదో నరకం. అంతకన్నా చావు మేలు . ..ఆత్మహత్య మహాపాపం, అంటారు పెద్దలు . అందుకే ఈ సాహసం చేస్తున్నాను . .

రాహుల్ బాబుకు కొండంత అండగా చిన్నాన్నలు ఉన్నారు . నాన్నమ్మ ప్రేమ, రక్షణ ఉన్నాయి . అన్నగారిని దైవం లా భావించే తమ్ముళ్ళు ఆయన తీపి గుర్తుగా

మిగిలిన రాహుల్ బాబుకు ఏ లోటు రానివ్వరు . ఆ విషయం మీ అందరికీ తెలుసు . ...ఎంతటి బాధనైనా కాలం తుడిచేస్తుంది . రాహుల్ బాబు తండ్రి మరణాన్ని , నన్ను నెమ్మదిగా మరిచిపోగలడు . ఊహ పెరిగే కొద్దీ నిజం గుర్తించగలడు . నా రాహుల్ బాబు పదికాలాలు చల్లగా ఉండాలి ..! అమ్మ గాని ఈ అమ్మను చల్లని వేళ తలుచుకుంటే , ఓ కన్నీటి బొట్టు విడిస్తే నా జన్మ ధన్యమవుతుంది . పుట్టినందుకు ఓ మంచిపని చేశానన్న తృప్తి ఏ లోకం లో ఉన్నా నేను పొందగలను . “

త్రివేదికి మరోసారి నమస్కరించింది . అతిశయించిన భావావేశం తో , బాధ తో ఆయన కోమల తల నిమిరాడు .

అత్తగారి పాదాలకు చివరి సా రి గా నమస్కరించింది. భర్త పాదాలకు అభిముఖం గా మునుపటి భంగిమ లో కూర్చుంది .

పరిస్థితి అందరికీ అర్థమైంది . ఇక కోమలా దేవి సహగమనాన్ని సృష్టికర్త కూడా ఆపలేడు . ఇది అనివార్యం.

విక్రం తల్లి శిలలా కూర్చుండి పోయింది . విజయ్ మ్లానమైన మొహం తో ఒక పక్కకు వెళ్ళిపోయాడు . అజయ్ తనలో పొంగే భావాలను గంభీరముద్ర వెనుక దాచాడు .

ఈ అసాధారణ ఘటన కు సూత్రధారి పన్నాలాల్ నిర్వికార స్థితిలో ఉండిపోయాడు . కోమలాదేవి పై తన మంత్ర ప్రభావం ఉన్నా ఆమె వ్యక్తిత్వం జ్యోతిలా వెలిగింది . ఆమె ప్రతి మాటలో ఆమె హృదయస్పందన వినగలిగాడు . ఆమె చివరి మాటలు అతడిలో ‘ మనిషి ని బాగా కదిలించాయి . మనసులో పాపం చేస్తున్నామన్న భావన ‘ వామనుడి ‘ లా పెరగసాగింది . అంతర్మథనం ఆరంభమైంది . ఆమెను చితిపై కూర్చోబెట్టే సమయానికే క్షుద్రశక్తిని ఆవాహన చేయాలి . ఆ తంతు ముగించడా నికే భారం గా కదిలాడు . అతడొక పాడుబడ్డ ఇంటిలో, ఊరికి దూరంగా ఈ తంతు కొనసాగిస్తున్నాడు .

ఊరి పెద్దలకు, సామాన్య జనానికి ఈ అనుభవం మరుపురాని ఓ బాధా వీచిక . సమాజం విధించిన అన్ని పరిమితులకు , ఆంక్షలకు అతీతం గా వారు కోమల అసాధారణ వ్యక్తిత్వాన్ని గౌరవిన్చసాగారు . ఓ అనామకురాలిగా ఈ ఊరు వచ్చి ,విక్రం సింహ్ లాంటి గొప్ప వ్యక్తికి భార్య గా, ఈనాడు భర్తతో సహగమనం చేసే స్థాయికి ఎదిగిందంటే అది సామాన్యమైన విషయం కాదు .

అంత్యక్రియలకు ఘనంగా ఏర్పాట్లు జరగసాగాయి . కోమలను నవ వధువు గా అలంకరించారు . అందరూ ఆమె మొహంలో ఓ అద్భుత తేజం చూడ గలిగారు .

వయోబేధం లేకుండా అందరూ ఆమెకు చేతులెత్తి నమస్కరించారు . చివరకు త్రివేది పండితుడు కూడా ! పండు ముత్తైదువులు కూడా పారాణి తో , పసుపు తో మెరిసే ఆమె పాదాలను భక్తి తో తాకారు .

తీర్తప్రజ లా మగవారందరూ ‘ రుద్రభూమి కి కదిలారు . అది ‘ శవ యాత్ర అయినా అందరి మనస్సులో ‘ శివ ‘త్వమే కోటి ప్రభల తో వెలుగుతోంది . అశుభం, అమంగళం అన్న భావన లేదు . ఈ హడావుడిలో ఎవరి ధ్యాసలో వారుండి పోయారు . అందరూ రాహుల్ ను మర్చి పోయారు. రాహుల్ ను కనిపెట్టుకున్న వ్యక్తి కూడా కింద ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ తో మేడ దిగి క్రిందికి వచ్చి ఆ పసివాడి ఊసే మర్చి పోయాడు .

తండ్రికి చివరి సారిగా నమస్కరించే అవకాశం రాహుల్ కు లభించలేదు. విజయ్ కావాలనే రాహుల్ ను క్రిందికి తీసుకు రాలేదు . కోమలా దేవి పరిస్థితి చూసి ఆ పసివాడు తట్టుకోలేడ ని అతడి భావన. ఎవరు ఎన్ని చెప్పినా ఒప్పుకోలేదు . అది పాపం అనుకుంటే ఆ ఫలితం తనే అనుభవిస్తానని ఊరి పెద్దల తో ఖచ్చితం గా చెప్పాడు .

మేడ మీద గదిలో , బయట గొళ్ళెం వేసుంటే, నిస్సహాయం గా ఏడుస్తూ నిద్ర పోయాడు . మగత నిద్ర—అయోమయ స్థితి –చాలాసేపు అలాగే ఉండిపోయాడు .

విక్రమ్ సింహ్ శవయాత్ర సాగిపోయింది . ఇంటిముందు హడావుడి తగ్గిపోయింది.

లోపలినుండి ఆడవారి ఏడుపులు సన్నగా వినిపిస్తున్నాయి . ఇల్లంతా బోసిపోయి, కళాకాంతులు తప్పి నిశ్శబ్దంగా ఉంది .

రాహుల్ ఉలిక్కిపడి లేచాడు . చుట్టూ చూసాడు . నిశ్శబ్దంగా ఉంది . ఏ అలికిడి లేదు . ఇంతలో ఎవరో తలుపులు తెరిచారు . రాహుల్ అటు చూశాడు . పాలగ్లాసు తో ఒక ఆడమనిషి అతడి వైపే వస్తుంది . క్షణం ఆలస్యం చేయలేదు రాహుల్. మెరుపులా కదిలి ఆడమనిషిని ఒక్క తోపు తోసి బయటకు పరుగెత్తాడు . ఆమె తేరుకొని లేచేలోపే పెద్ద అంగలు వేస్తూ వసారా చివరి మెట్టుపై ఉన్నాడు .క్షణాల వ్యవధిలో సింహద్వారం దాటి వీధిలోకి వచ్చాడు .

ఆ ఆడమనిషి కేకలు వేస్తూ క్రిందికి వచ్చింది. అంతే కొంతమంది కుర్రాళ్ళు వీధిలోకి పరుగెత్తారు . ఈ లోపల రాహుల్ సుడిగాలిలా వీధి మలుపు కూడా దాటి వెళ్ళిపోయాడు .

శ్మశానం లో కర్మకాండ లోని ప్రతి అంశం చాలా శ్రద్ధగా శాస్త్రోక్టంగా నిర్వహించారు .సహగమనానికి సంబంధించిన విధి విధానం కూడా చాలా ఘనంగా నిర్వహించబడింది .

కో మలాదేవి చితిపై కూర్చుంది . భర్త తలను ఒడిలోకి తీసుకుంది. చివరి సారిగా అశ్రు నయనాల తో అందరికీ నమస్కరించి, అంతే –కళ్ళు మూసుకొని దేవుడిని ధ్యానిస్తూ ఉండి పోయింది . అజయ్ చితికి నిప్పంటించాడు . ఆ తరువాత జరిగే కార్యక్రమం కూడా శ్రద్ధ గా నిర్వహించి పక్కకు తప్పు కున్నాడు . అతడిలో దుఖం వరదలా పొంగుకొచ్చింది. అలానే మోకాళ్ళపై కూర్చొని పసివాడిలా ఏడ్చాడు .విజయ్ ఆర్తిగా అజయ్ ను దగ్గరకు తీసుకున్నాడు .నెమ్మది నెమ్మదిగా అగ్నిజ్వాలలు చితిని కమ్ముకుంటున్నా యి . చిటపటమంటున్నాయి . చుట్టూ చేరిన వారు విక్రం , కో మలకు జేజేలు పలుకుతున్నారు . పూలు చల్లుతున్నారు .

అతిశయించిన దుఖం వారిని వివశుల్ని చేస్తోంది

అప్పుడే ఎవరూ ఊహించని సంఘటన జరిగింది . రాహుల్ అక్కడికి బాణంలా దూసుకు వచ్చాడు . అందరినీ తోసుకుంటూ వచ్చి చితిపై సజీవంగా దహనం కాబోతున్న కోమలను చూశాడు . ఆ దృశ్యం తో ఆ పసివాడి గుండె పగిలింది .

ఊపిరంతా కూడదీసుకొని గుండె లవిసేలా “ అమ్మా ! “ అని కేక పెట్టాడు .

ఆ రెండు అక్షరాల పిలుపు రుద్రభూమిని కంపింపజేసింది . జేజేలు ఒక్కసారిగా ఆగి పోయాయి . అందరూ నివ్వెర పోయి రాహుల్ ను చూస్తున్నారు . “ అమ్మా” మరోసారి శక్తిని కూడ దీసుకొని ఇంకా బిగ్గరగా పిలిచాడు .

ఆ పిలుపు ఈసారి కోమలాదేవి చెవులను శక్తివంతమైన శబ్దతరంగం లా తాకింది . ఆమె ఉలిక్కి పడింది . చివాలు న తల తిప్పి చూసింది .”రాహుల్ బాబు “ ఆ పిలుపు ఆమె కంఠ నాళాన్ని త్రెంచుకొని వచ్చిందా అనిపించింది.

ఈ లోపల అగ్ని కీలలు ఆమెను చుట్టుముట్టాయి . విష నాగుల్లా ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి . దిక్కు తోచని స్థితిలో ఆమె ఆర్తనాదం చేయసాగింది . హృదయవిదారకంగా వినిపిస్తున్న ఆ కేకలకు రాహుల్ మూర్ఛ పోయాడు .

కంగారుగా విజయ్ ముందుకు వెళ్ళబోతే అజయ్ అతడిని ఆపాడు . ఈ ఊహించని పరిణామంతో అందరూ తెల్లబోయారు .

కోమల కేకలు వెయ్యకముందే పన్నాలాల్ క్షుద్రశక్తిని ఆవాహన చేశాడు. కేకలు వేసింది. క్షుద్రశక్తి కోమలను ఆవహించినందునా , కోమల రాహుల్ ను చూసినందు వల్లనా ? .....రెండింటి వల్లనా ?

****************************************

కొనసాగించండి 17లో