ఎవరో ఎక్కడో నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
కానీ ఎవరు?
ఎలా?
ఎందుకు?
అతని మనసులో ఒక్కసారిగా ఒక పాత వీడియో మెదిలింది.
హృదయపూర్వక ఆహ్వానం.
రఘువరన్ వెంటనే ఆ వీడియోను మళ్లీ తెరిచాడు.
అందులో ఉన్న స్వామీజీలను ఒక్కొక్కరిగా గమనించాడు.
వారి మాటలు...
వారి సమావేశాలు...
వారి మధ్య ఉన్న సంబంధాలు...
అన్నింటినీ జోడించడం మొదలుపెట్టాడు.
అప్పుడే...
అతనికి మరో ప్రశ్న వచ్చింది.
“ఇంత పెద్ద నాటకం ఆడుతూ వాళ్లకు దక్కేది ఏమిటి?”
డబ్బా?
భక్తుల విరాళాలా?
అది మాత్రమే అయితే ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు?
అతను ఆలోచనలో మునిగిపోయాడు.
---
ఒక రోజు మార్కెట్‌లో టీ తాగుతూ నిలబడ్డాడు.
పక్కనే కొంతమంది మహిళలు మాట్లాడుకుంటున్నారు.
“మా ఊర్లో మహిమ జరిగింది.”
“పుట్టలో నుంచి దేవుడి విగ్రహం బయటకు వచ్చింది.”
“మా ఊర్లో అయితే ఒక ముసలాయన రోజూ కొంచెం కొంచెం మట్టి తీస్తూ చివరికి వినాయకుడి బొమ్మ బయటకు తీశాడట.”
“మహిమే మరి!”
రఘువరన్ చేతిలోని టీ గ్లాస్ ఆగిపోయింది.
మహిమలు...
ఒకటి కాదు.
వేర్వేరు ఊర్లలో.
వేర్వేరు దేవుళ్లు.
కానీ ఒకే సమయంలో.
అతని మెదడులో అన్ని సంఘటనలు ఒకదానితో ఒకటి కలవడం మొదలయ్యాయి.
“ఏదో మిస్ అవుతున్నాను...”
అతను గట్టిగా ఆలోచించాడు.
“ఇది కేవలం డబ్బు కోసం కాదు.”
“అయితే... ఏం కోసం?”
అప్పుడే...
అతని ఛాతిలో ఒక్కసారిగా మంట మొదలైంది.
రఘువరన్ షర్ట్ పైకి లేపి చూశాడు.
కొన్ని రోజుల క్రితం జరిగిన చిన్న ప్రమాదంలో గుచ్చుకున్న గాయం దగ్గర...
ఒక విచిత్రమైన గుర్తు ఏర్పడింది.
అది ఎర్రగా మండుతున్నట్టుంది.
రఘువరన్ ఆ ప్రదేశాన్ని చేత్తో తాకాడు.
ఒక్కసారిగా—
మంట.
“అబ్బా!”
అతను వెనక్కి తగ్గాడు.
---
డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
గాయాన్ని పరిశీలించిన డాక్టర్...
“చిన్న ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది.”
గాయాన్ని శుభ్రం చేశాడు.
ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు.
కొన్ని మందులు రాసిచ్చాడు.
“ఇవి వాడండి. తగ్గిపోతుంది.”
రఘువరన్ మందులు తీసుకుని ఇంటికి వచ్చాడు.
కానీ...
ఆ రాత్రి అతనికి తెలియని మార్పు మొదలైంది.
మందు శరీరంలోకి వెళ్లింది.
అది సాధారణ మనిషి మెదడులో ఒక రీతిగా పనిచేసేది.
కానీ రఘువరన్ మెదడు...
సాధారణంగా లేదు.
అతను ఆలోచించే విధానం...
సమాచారాన్ని కలిపే విధానం...
ప్రశ్నను విభజించి సమాధానం వెతికే విధానం...
అన్నీ భిన్నంగా ఉన్నాయి.
ఆ మందు ప్రభావం అతని మెదడులో సాధారణ స్థాయిని దాటిపోయింది.
హార్మోన్లలో మార్పులు మొదలయ్యాయి.
అతని శరీరంలో ఎక్కడో ఒక కొత్త శక్తి కేంద్రీకృతమవుతున్నట్టుగా అనిపించింది.
మొదట...
ఒక స్వరం.
తర్వాత...
రెండు.
మూడు.
పది.
వంద.
అతను గదిలో ఒంటరిగా ఉన్నాడు.
కానీ...
అతని చుట్టూ వందలాది మంది మాట్లాడుతున్నట్టుంది.
ఒకరి కోరిక.
మరొకరి భయం.
ఇంకొకరి కోపం.
ఎక్కడో ఒకరి మీద పగ.
మరొకరి మీద ప్రేమ.
ఇంకొకరి మీద ఆశ.
అన్నీ ఒకేసారి అతని మెదడులోకి దూసుకొచ్చాయి.
రఘువరన్ చెవులు మూసుకున్నాడు.
“ఆపండి...”
కానీ ఆ శబ్దాలు చెవుల్లో నుంచి రావడం లేదు.
అవి నేరుగా అతని మెదడులోకి వస్తున్నాయి.
అతను కళ్లుమూశాడు.
కానీ ప్రయోజనం లేదు.
ఎందుకంటే...
అతను మొదటిసారి ఇతరుల మాటలు వినడం కాదు—
వాళ్ల ఆలోచనలను వినడం మొదలుపెట్టాడు.
మూడు రోజులు...
రఘువరన్ తన గది దాటలేదు.
ఆహారం కూడా సరిగా తినలేదు.
నిద్రపోవాలని ప్రయత్నించాడు.
కానీ ఎక్కడో ఉన్న ఒక మనిషి భయాన్ని వింటున్నాడు.
మరొకరి కోరికను అనుభవిస్తున్నాడు.
ఇంకొకరి పగను తనలోనే చూస్తున్నాడు.
అతని మెదడు ఆ భారాన్ని భరించలేకపోయింది.
కళ్ల ముందు చీకటి కమ్ముకుంది.
కుర్చీని పట్టుకున్న చేతులు వణికాయి.
“నా మెదడు...”
అతను నెమ్మదిగా నేలపై కూర్చున్నాడు.
“ఇది... నా ఆలోచన కాదు.”
అతని శ్వాస వేగంగా మారింది.
“మరి... ఎవరివి?”
అతని కళ్ల ముందు ప్రపంచం మసకబారింది.
చివరికి...
రఘువరన్ స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు.
అదే క్షణంలో...
ఎక్కడో చాలా దూరంలో ఉన్న ఒక పాత ల్యాబ్‌లో...
ఏళ్లుగా పనిచేయని ఒక నల్లటి స్క్రీన్‌పై...
ఒక్క చిన్న వెలుగు వెలిగింది.
SIGNAL DETECTED.
కొన్ని క్షణాల తర్వాత మరో మెసేజ్ కనిపించింది.
SUPER BRAIN...
స్క్రీన్ మొత్తం ఒక్కసారిగా వెలిగిపోయింది.
ACTIVATION STARTED.
రఘువరన్ శరీరం ఒక్కసారిగా వణికింది.
తన గదిలో నేలపై నిలబడేందుకు ప్రయత్నించిన అతని చేతులు కుర్చీ అంచును పట్టుకున్నాయి.
కానీ శరీరం మాట వినలేదు.
కళ్ల ముందు చీకటి కమ్ముకుంది.
తల ఒక్కసారిగా భారంగా మారింది.
తర్వాత—
ధమ్!
రఘువరన్ నేలపై పడిపోయాడు.
అతని శ్వాస నెమ్మదించింది.
గది మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది.
అయితే...
అదే క్షణంలో...
ఎక్కడో చాలా దూరంలో ఉన్న ఒక పాత ల్యాబ్‌లో, ఎన్నో సంవత్సరాలుగా వెలగని ఒక నల్లటి స్క్రీన్‌పై చిన్న తెల్లటి బిందువు వెలిగింది.
ఒక సెకను...
రెండు సెకన్లు...
ఆ బిందువు నెమ్మదిగా విస్తరించింది.
తర్వాత స్క్రీన్ మొత్తం ఒక్కసారిగా వెలిగిపోయింది.
ఎరుపు, తెలుపు, నీలం రంగుల సిగ్నల్స్ వరుసగా స్క్రీన్ మీద పరుగులు తీశాయి.
SIGNAL DETECTED
NEURAL FREQUENCY MATCHED
UNKNOWN USER DETECTED
కొన్ని క్షణాల తర్వాత...
స్క్రీన్ మధ్యలో ఒక భారీ మెదడు చిహ్నం ప్రత్యక్షమైంది.
దాని చుట్టూ ఉన్న డిజిటల్ వలయం వేగంగా తిరగడం మొదలుపెట్టింది.
అప్పుడు...
SUPER BRAIN ACTIVATED
అనే పదాలు మెరిపించాయి.
ల్యాబ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా కదలకుండా నిలబడిపోయారు.
ముసలివాళ్లు...
యువ శాస్త్రవేత్తలు...
కొంతమంది చిన్న వయసు పరిశోధకులు...
అందరి కళ్లూ స్క్రీన్‌పైనే.
అయితే వెంటనే వారి ముఖాల్లో ఆశ్చర్యం కంటే గందరగోళం ఎక్కువైంది.
స్క్రీన్‌లో చూపిస్తున్న ఎనర్జీ మ్యాప్‌ను ఒక వృద్ధ శాస్త్రవేత్త వేగంగా పరిశీలించాడు.
“ఏంటి ఇది?”
“సిగ్నల్ వచ్చింది...”
“సూపర్ బ్రెయిన్ యాక్టివేట్ అయింది...”
“కానీ పవర్ ఎక్కడికి వెళ్తోంది?”
మరో వ్యక్తి వెంటనే సిస్టమ్‌ను చెక్ చేశాడు.
“బ్రెయిన్ సిగ్నల్ ఇక్కడ కనిపిస్తోంది.”
“అంటే యూజర్ దగ్గర సిస్టమ్ కనెక్ట్ అయి ఉండాలి కదా?”
“అవును.”
“మరి ఎనర్జీ మ్యాప్ ఎందుకు వేరే దిశలో వెళ్తోంది?”
స్క్రీన్‌పై మెదడు చుట్టూ తిరుగుతున్న సిగ్నల్స్ ఒక్కసారిగా ఒక దిశగా దూసుకెళ్లాయి.
అక్కడికి చేరుకునేలోపే...
మాయమయ్యాయి.
“మళ్లీ ట్రేస్ చేయి!”
“చేస్తున్నాను సర్!”
“యూజర్ లొకేషన్?”
“తెలియడం లేదు!”
“అసాధ్యం.”
“మన సిస్టమ్ బ్రెయిన్ సిగ్నల్‌ను ఫాలో అవుతుంది. అది వ్యక్తి ఎక్కడున్నాడో కనుక్కోవాలి.”
మరో శాస్త్రవేత్త నెమ్మదిగా అన్నాడు.
“కానీ ఈసారి...”
అతని గొంతులో భయం.
“సిగ్నల్ బ్రెయిన్ దగ్గరికి వెళ్లకముందే వేరే దారిలోకి మళ్లుతోంది.”
అందరూ ఒకరినొకరు చూశారు.
ఒక వృద్ధుడు నెమ్మదిగా అడిగాడు.
“అయితే మనం కనెక్ట్ అయినది ఎవరితో?”
ఎవరూ సమాధానం చెప్పలేదు.
కొన్ని క్షణాల తర్వాత ఇంకొకరు భయంగా అన్నాడు.
“ఈ విషయం రాకకు తెలిస్తే...”
ఆ మాటతో ల్యాబ్‌లోని వాతావరణమే మారిపోయింది.
“అతను మనల్ని వదిలిపెట్టడు.”
“ఇన్ని సంవత్సరాల ప్రయోగాలు...”
“ఇన్ని మందిని ఎమోషనల్‌గా ట్రిగ్గర్ చేసి చేసిన పరీక్షలు...”
“ఈ పవర్ కోసం మనం ఎంత దూరం వెళ్లామో అతనికి తెలుసు.”
“ఇప్పుడు ఎవరో ఈ శక్తిని మన సిస్టమ్ కంటే ముందే వాడుకుంటున్నారని అతనికి తెలిస్తే?”
ఎవరూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
---
అదే సమయంలో...
రఘువరన్ శరీరంలో ఏదో జరుగుతోంది.
అతని రక్తంలో ఉన్న లవణాలు ఒక్కొక్కటిగా కదలడం మొదలుపెట్టాయి.
ముందుగా చాలా నెమ్మదిగా...
ఆ తర్వాత వేగంగా...
అతని ఛాతిలో ఉన్న గాయం చుట్టూ వాటన్నింటి కదలిక కేంద్రీకృతమైంది.
ఒక్కసారిగా—
బ్లాస్ట్!
గాయం నుంచి నలుపు, తెలుపు రంగుల వెలుగు బయటికి వచ్చింది.
లవణ కణాలు చిన్న చిన్న కాంతి బిందువుల్లా ఆ గాయం చుట్టూ తిరుగుతున్నాయి.
ఒక చక్రంలా.
ఒక రహస్యమైన యంత్రం తిరుగుతున్నట్టుగా.
ఆ శక్తి నెమ్మదిగా చర్మం లోపలికి చొచ్చుకుపోయింది.
గాయం నుంచి...
నరాల్లోకి.
నరాల నుంచి...
గుండె వైపు.
గుండెను దాటి...
మెదడు వైపు.
రఘువరన్ మెదడు చుట్టూ ఒక తెలుపు-నలుపు వలయం ఏర్పడింది.
అతని మెదడులోకి దూసుకొస్తున్న వందలాది శబ్దాలు...
ఆలోచనలు...
సిగ్నల్స్...
ఒక్కసారిగా ఒక చోట ఆగిపోయాయి.
ఎర్ర సిగ్నల్ దగ్గర బస్సులు వరుసగా ఆగిపోయినట్టుగా.
అన్నీ ఆగిపోయాయి.
ఒక్క శబ్దం కూడా లోపలికి రాలేదు.
---
రఘువరన్ కళ్లను మెల్లగా తెరిచాడు.
తలలో భారంగా ఉంది.
శ్వాసను సరిచేసుకుంటూ పక్కనే ఉన్న కుర్చీని పట్టుకుని నెమ్మదిగా లేచాడు.
కూర్చున్న వెంటనే తల పట్టుకున్నాడు.
“బాబోయ్...”
“నాకేం అయింది?”
“అసలు...”
అతను చుట్టూ చూశాడు.
“ఇవి ఎవరి మాటలు?”
ఒక్కసారిగా...
నిశ్శబ్దం.
పూర్తి నిశ్శబ్దం.
పిన్ డ్రాప్ సైలెన్స్.
రఘువరన్ భయపడ్డాడు.
“ఏంటి ఇది?”
తన చెవులను రుద్దుకున్నాడు.
“చెవుడు వచ్చిందా?”
గుండె వేగంగా కొట్టుకుంది.
“కింద పడిపోవడం వల్ల చెవులు పోయాయా?”
అతను గట్టిగా చెవులు మూసుకున్నాడు.
అదే సమయంలో...
టిక... టిక్...
గడియారం శబ్దం.
వ్ర్ర్ర్...
ఫ్యాన్ శబ్దం.
క్లిక్...
లైట్ స్విచ్ చిన్న శబ్దం.
రఘువరన్ ఆశ్చర్యపోయాడు.
“ఇవి మాత్రమే ఎందుకు వినిపిస్తున్నాయి?”
బయట నుంచి ఒక్క హారన్ లేదు.
వీధి శబ్దం లేదు.
మనుషుల మాటలు లేవు.
కుక్కల అరుపులు లేవు.
“ప్రపంచం మాయమైందా?”
అతను నెమ్మదిగా కిటికీ వైపు తిరిగాడు.
“లేక...”
“ప్రపంచం నుంచి నేనే మాయమయ్యానా?”
అప్పుడే—
దూరంగా ఆగిపోయినట్టున్న ట్రాఫిక్ ఒక్కసారిగా మళ్లీ కదిలింది.
హారన్‌లు.
కుక్కల అరుపులు.
వాహనాల శబ్దాలు.
మానవ కేకలు.
అన్నీ ఒకేసారి అతని మెదడులోకి దూసుకొచ్చాయి.
రఘువరన్ చెవులు గట్టిగా మూసుకున్నాడు.
“ఆపండి!”
“ఆపండి!”
“ఎవరో ఆపండి!”
ఆ క్షణంలో...
అతని కళ్ల ముందే ఒక స్క్రీన్ తెరుచుకుంది.
రంగులు లేని పారదర్శక ఇంటర్‌ఫేస్.
వీధి మ్యాప్.
గదిలోని శబ్దాలు.
ప్రతి శబ్దానికి ఒక స్థానం.
ఎక్కడి నుంచి వస్తోంది...
ఎంత దూరంలో ఉంది...
ఎంత తీవ్రతతో ఉంది...
అన్నీ కనిపిస్తున్నాయి.
రఘువరన్ నోరు తెరిచాడు.
“ఇదేంటి...?”
అతని చూపు ఒక్కసారిగా స్క్రీన్‌పై నిలిచిపోయింది.
VOLUME CONTROL
INPUT SOURCE
LOCATION
SIGNAL
అతను కదలలేదు.
---
అదే క్షణంలో...
పాత ల్యాబ్‌లోని స్క్రీన్‌పైనా అదే ఇంటర్‌ఫేస్ తెరుచుకుంది.
అక్కడున్న వాళ్లందరూ నిశ్చేష్టులయ్యారు.
“ఇది మన సిస్టమ్ ఇంటర్‌ఫేస్!”
“కానీ ఇది ఎలా...?”
ఒక శాస్త్రవేత్త నెమ్మదిగా అన్నాడు.
“సిస్టమ్ అక్కడ లేదు.”
“అయితే?”
“యూజర్ బ్రెయిన్‌లోనే ఇంటర్‌ఫేస్ జనరేట్ అవుతోంది.”
మరో వ్యక్తి ఆశ్చర్యంగా అడిగాడు.
“అంటే... బ్రెయిన్‌నే AIలా పనిచేస్తుందా?”
వృద్ధుడు స్క్రీన్‌నే చూస్తూ అన్నాడు.
“బ్రెయిన్ ఆజ్ఞ ఇస్తోంది.”
“సిస్టమ్ దానికి ప్రతిస్పందిస్తోంది.”
“అది సాధారణ AI కాదు.”
“బ్రెయిన్‌కు సంబంధించిన ఆలోచనను సిస్టమ్ అర్థం చేసుకుని... దానికి తగిన ఇంటర్‌ఫేస్‌ను సృష్టిస్తోంది.”
అక్కడున్న వాళ్లందరికీ ఒకే ప్రశ్న.
ఆ బ్రెయిన్ ఎవరిది?
---
ఇంకో చోట...
ఒక మసకబారిన గదిలో రాక నిలబడి ఉన్నాడు.
అతని రూపాన్ని చూసినవారెవరైనా క్షణం వెనక్కి తగ్గేంత భయంకరంగా మారిపోయాడు.
తలపై జుట్టు దాదాపు లేదు.
ముఖంపై కాలిన మచ్చలు.
చేతుల మీద గాయాలు.
వేళ్ల చివరల్లో పొడవాటి పదునైన గోర్లు.
అతని శరీరమే ఏదో ప్రయోగం తర్వాత మిగిలిన అవశేషంలా ఉంది.
అతని ఎదురుగా ఒక స్వామీజీ వణుకుతూ నిలబడ్డాడు.
రాక కళ్లల్లో కోపం మండుతోంది.
“నేను ఏం చెప్పాను?”
స్వామీజీ ఏదో చెప్పబోయాడు.
“కొంతమందికే ఈ డ్రగ్ వెళ్లాలి అన్నాను!”
రాక గొంతు గర్జించింది.
“కానీ మీ అత్యాశతో...”
“ఎవరెవరికి అమ్మారో మీకే తెలియదు!”
“ఎక్కడికి వెళ్లిందో తెలియదు!”
“ఇప్పుడు నా సిస్టమ్‌ను ఎవరో వేరే వ్యక్తి కంట్రోల్ చేస్తున్నారు.”
“అది నీ వల్లే.”
స్వామీజీ వెనక్కి తగ్గాడు.
“స్వామీ... నేను—”
రాక ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చాడు.
అతని చేతిలోని గోర్లు మెరుపులా మెరిశాయి.
తర్వాతి క్షణం...
అక్కడ నిశ్శబ్దం మాత్రమే మిగిలింది.
---
రాక అద్దం ముందు నిలబడ్డాడు.
తన ప్రతిబింబాన్ని చూస్తూ ఉండిపోయాడు.
అద్దంలో కనిపిస్తున్న మనిషి...
ఒకప్పుడు తాను కాదు.
అతను వేళ్లతో తన ముఖాన్ని తాకాడు.
“నేను...”
అతని కళ్లు ఒక్కసారిగా మూసుకున్నాయి.
ఒక పాత జ్ఞాపకం అతని మెదడులో మెరిసింది.
ఒక యువకుడు.
తెలివైన కళ్లతో.
చేతిలో పుస్తకం.
స్కాలర్‌షిప్‌తో చదువుకుంటూ...
రాత్రింబవళ్లు కంప్యూటర్ ముందు కూర్చుని కోడింగ్ నేర్చుకుంటూ...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చదువుతూ...
ఒక కలతో ముందుకు సాగుతున్నాడు.
అతని పేరు...
రాక.
ఇరవై ఐదేళ్ల క్రితం...
అతను కేవలం ఒక విద్యార్థి.
కానీ ఆ రోజు...
అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు.
మనిషి మెదడుతో AIని కలపాలి.
అదే నిర్ణయం...
అతని జీవితాన్ని మార్చింది.
అదే నిర్ణయం...
రఘువరన్ పుట్టుకకు కారణమైంది.
అతనికి తెలియకుండా...
తాను వెతికిన “సూపర్ బ్రెయిన్”...
ఇప్పటికే మేల్కొంది.