Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

యంత్రం వెనుక మనసు - 14

అమ్మ నోట ఆ మాట వినగానే నీల గుండె ఒక్కసారిగా జల్లుమంది. లోపల ఏదో తెలియని ఒక మధురమైన అలజడి మొదలైంది. మనసులోనే దేవుడికి వంద దండాలు పెట్టుకుంది. 

అయాన్‌తో కలిసి ఈ నడిరాత్రి వేళ, నిశ్శబ్దంగా ఉన్న లోకంలో ఒంటరిగా నడిచే అవకాశం దొరుకుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఆ ఆలోచనే ఆమె నరనరాల్లో ఒక వింత కంపనాన్ని పుట్టించింది.

మంచం మీద గుర్రుపెట్టి పడుకున్న అన్నయ్య వైపు ఒకసారి చూసింది. అంతవరకు వాడిపై ఉన్న కోపమంతా మాయమై, ఇప్పుడు ఒక చిన్న స్వార్థం మనసును కమ్మేసింది. "ఒరేయ్ అన్నయ్యా! నువ్వు ఈ రాత్రంతా అసలు లేవకపోతేనే మంచిదిరా. పొరపాటున కూడా కళ్లు తెరవకు.. అలాగే హాయిగా నిద్రపో!" అని మనసులోనే బతిమాలుకుంది. ఎందుకంటే, ఆర్య గనుక లేస్తే ఈ అందమైన క్షణం, అయాన్ తోడు తనకి దక్కకుండా పోతుందని ఆమె భయం.

ఎక్కడ ఆర్య నిద్ర లేచిపోతాడో అన్న కంగారుతో... గుండె వేగం పెరుగుతుండగా, ప్యాక్ చేసిన అన్నం పొట్లాలు సర్దుకుంది. ఒక్క క్షణం అయాన్ వైపు చూసింది. వాడి కళ్లలో ఇంకా అలాగే ఉన్న ఆరాధనను చూసి ముఖంపై నవ్వును దాచుకుంటూ, బయటకు నడవమన్నట్టు నెమ్మదిగా సైగ చేసింది.

అయాన్ కారు తీసుకుని రాగా, నీల భోజనం ప్యాకెట్లు పట్టుకుని వస్తోంది. అది గమనించి అతడు కార్లో నుండి బయటకు వచ్చాడు. నీల చేతిలోని ప్యాకెట్లను తనే అందుకుని, కారు డోర్ తీసి ఆమెకు మర్యాదగా ఆహ్వానం పలికాడు. నీల అతడినే అలా రెప్పవాల్చకుండా చూస్తూ కారులో కూర్చుంది. భోజనం ప్యాకెట్లను డిక్కీలో జాగ్రత్తగా పెట్టి, అతడు లోపలికి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు.

కారు ముందుకు సాగుతోంది... కానీ ఆ కారు వేగం కన్నా నీల గుండె వేగమే చాలా ఎక్కువగా ఉంది. ఇది ఆమె అసలు ఊహించని ప్రయాణం. అంతా ఒక కలలా అనిపిస్తోంది. అలా ఆలోచిస్తూనే అయాన్‌ వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది.
"నీల..." అని అయాన్ ఒక్కసారిగా పిలిచేసరికి, ఆలోచనల లోకంలోంచి బయటకు వచ్చిన నీల, "ఏమిటి?" అన్నట్టు చూసింది.

"మనం చేరుకోవాల్సిన చోటికి వచ్చేసాం" అని అయాన్ అనగానే... "అప్పుడే వచ్చేసామా!" అనుకుంది నీల. కానీ మనసులో మాత్రం, 'నిన్ను చూస్తూ అలాగే ఉండిపోయాను అయాన్, సమయం ఎలా గడిచిపోయిందో నాకు అస్సలు తెలియలేదు' అని అనుకుంది.

కారు డోర్ తీసుకుని ఇద్దరూ బయటకు వచ్చారు. అక్కడ అంతా చాలా చీకటిగా ఉంది, కనీసం వీధి దీపాలు కూడా వెలగడం లేదు. 'టెక్నాలజీ ఎంత పెరిగినా, కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా ఇలాగే చీకట్లోనే ఉండిపోతున్నాయి' అనుకుంది నీల.


అలా ఇద్దరూ భోజనం ప్యాకెట్లు పట్టుకుని కొంచెం లోపలికి వెళ్ళారు. అక్కడ ముసలివాళ్లు, చిన్నపిల్లలు, ఆడ మగ తేడా లేకుండా చాలా మంది ఆకలితో అలమటిస్తూ కూర్చుని ఉన్నారు. అంతలోనే అక్కడ ఒక చిన్న బాబు, "నాన్న! ఈ రోజు కూడా మనం పస్తులతోనే పడుకోవాలా నాన్న?" అని అడుగుతున్న మాట నీల చెవిన పడింది. ఆ మాట వినగానే ఆమె మనసు తరుక్కుపోయింది.

వెంటనే నీల ముందుకు వెళ్తూ, "అవసరం లేదమ్మా... నేను భోజనం తీసుకుని వచ్చాను. మీరంతా కడుపునిండా తినవచ్చు" అని గట్టిగా చెప్పింది.

అక్కడ ఉన్న ఒకరు దీపం పట్టుకుని వస్తూ, "ఎవరమ్మా మీరు?" అని అడిగారు.
"మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది. అందుకే భోజనాలు తీసుకువచ్చాను. తింటారో లేదో అని..." అంది నీల నసిగుతూ.

"ఎందుకు తినమమ్మా! ఆకలితో అలమటిస్తున్న మాకు, ఇలా భోజనం పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఆ భగవంతుడితో సమానం కదా అమ్మ!" అని ఆయన అనగానే...

నీల కంగారుపడుతూ, "అంత పెద్ద మాటలు ఎందుకండీ... అందరూ తినగా మిగిలిన భోజనాన్నే కదా మేము తీసుకువచ్చింది" అంది.
దానికి ఆయన బాధపడుతూ, "అలా అనకమ్మా... చాలా మంది గొప్ప గొప్ప ఇళ్ళల్లో ఫంక్షన్లు చేసుకుని, మిగిలిన అన్నాన్ని ఇలాంటి ప్రాంతాలకు తీసుకురావడం చేతకాక మురికికుప్పల్లో పారేస్తారు. కానీ మా లాంటి వాళ్ళు కూడా ఉన్నారని గుర్తుపెట్టుకుని వచ్చారు చూడు... అది చాలమ్మా" అంటూ తమ ఆకలి గోడును చెప్పుకుంటుంటే నీల మనసు చివుక్కుమంది.

అప్పుడు అయాన్ నీల వంక చూసి, పిల్లలను ఉద్దేశించి, "పిల్లలూ! భోజనం ప్యాకెట్లు తీసుకోండి" అని ప్రేమగా పిలిచాడు. పిల్లలందరూ పరుగెత్తుకుంటూ వచ్చి ప్యాకెట్లు తీసుకుని ఆత్రుతగా తింటుంటే, ఆ దృశ్యం చూసి నీల కళ్లలో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.

అయాన్ ఆమె బాధను గమనించి, నీల భుజం మీద చేయి వేసి నిశ్శబ్దంగా సముదాయించాడు. మనుషుల మనోభావాలను కేవలం డేటా రూపంలోనే విశ్లేషించగల ఒక AI, ఈ క్షణంలో నీల అనుభవిస్తున్న బాధను, ఆమె గుండె చప్పుడులోని మార్పులను తన ప్రత్యేక సెన్సార్ల ద్వారా కాకుండా, నేరుగా తన అంతరాత్మతోనే స్పృశిస్తున్నట్లుగా ఆమెకు అండగా నిలబడ్డాడు.

అదే సమయంలో అన్నం తింటున్న ఒక బాబు నీల దగ్గరకు వచ్చి, "అక్కా! ఇతను నీ భర్తా?" అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే నీలకు ఒక్క క్షణం ఏం చెప్పాలో తెలియలేదు. గుండె వేగంగా కొట్టుకోగా, సిగ్గుతో ఆమె ముఖం మొత్తం ఎర్రగా మారిపోయింది.

ఆమె మౌనాన్ని, ముఖంలో మారుతున్న రంగులను చూసి పక్కనే ఉన్న అయాన్ మనసులో కూడా ఏదో తెలియని వింత అలజడి మొదలైంది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌కు ఇలాంటి మానవ సహజమైన భావాలు సాధ్యం కాకపోయినా, నీల పక్కన ఉన్న ఆ క్షణం అతనికి ఎంతో ప్రత్యేకంగా, ఒక మధురమైన అనుభూతిగా అనిపించింది.