ఆ భారీ మేనార్ లోపలికి అడుగుపెడుతుంటే వేదకు తన సొంత ఇంటికి వెళ్తున్నట్టు లేదు, కాలం గడ్డకట్టుకుపోయిన ఒక రహస్య సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తున్నట్టు అనిపించింది.
గాలిలో పురాతన ధూపం వాసన, వందల ఏళ్ల నాటి తడి ఆరిన గోడల వాసన కలిసి వేదంలో ఒక వింతైన అనుభూతిని కలిగిస్తున్నాయి.
వేద అడుగులు తడబడుతున్నా, లోపలి నుండి ఏదో అదృశ్య శక్తి ఆమెను ముందుకు నడిపిస్తోంది.
అర్జున్ ఆమె వెంటే లోపలికి రాబోతుండగా, గురుస్వామి హఠాత్తుగా ఆగి, తన చేతిలోని కర్రను నేలకు ఆనించి గంభీరంగా వెనక్కి తిరిగారు. ఆయన కళ్లలో ఒక హెచ్చరిక మెరిసింది.
"అక్కడే ఆగు నాయనా..! లోపలకు సామాన్య మనుషులకు ప్రవేశం లేదు..! నీది కాని లోకంలోకి, నీకు సంబంధం లేని రహస్యాల మధ్యలోకి ఎందుకు రావాలని అనుకుంటున్నావు? ఈ గడప దాటడం అంటే నీ జీవితంలోకి సమస్యలను ఆహ్వానించినట్టే. వెనక్కి వెళ్ళిపో.." అని అన్న ఆయన స్వరం లోయలో ప్రతిధ్వనించినట్టు వినిపించింది.
గురుస్వామి అన్న మాటలకు అర్జున్ ఒక్క క్షణం ఆగిపోయాడు, కానీ అతని కళ్లలో వెనకడుగు వేసే ఆస్కారం కనిపించలేదు.
అతను తన జాకెట్ జేబులో నుండి పాతబడిన, అంచులు నలిగిపోయిన తన తండ్రి డైరీని బయటకు తీశాడు.
"నాకు ఈ రహస్యంతో సంబంధం లేకపోవచ్చు స్వామీ.. కానీ నా తండ్రికి దీనితో సంబంధం ఉంది. ఆయన తన జీవితాంతం ఈ గుర్తుల కోసమే వెతికారు. మరియు వేదను ఇలాంటి చోట ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదు..!" అని దృఢంగా చెప్పాడు.
అర్జున్ సమాధానాన్ని విన్న గురుస్వామి ఒక్క నిమిషం అర్జున్ వైపు, ఆ డైరీ వైపు తీక్షణంగా చూశారు. ఆయన పెదవుల మీద ఒక చిన్న నవ్వు మెరిసి మాయమైంది.
గురుస్వామి అర్జున్ వైపు చూస్తూ, "కాలం ఎవరిని ఎక్కడ కలపాలో ముందే నిర్ణయిస్తుంది. రా.. నీ గమ్యం వైపు అడుగు వేయి." అంటూ అర్జున్ ను కూడా లోపలికి ఆహ్వానించాడు.
గురుస్వామి, వేద మరియు అర్జున్, ముగ్గురూ కలిసి ఒక వృత్తాకారంలో ఉన్న విశాలమైన గదిలోకి ప్రవేశించారు.
అది ఒక పురాతన గ్రంథాలయంలా ఉంది. వేల సంఖ్యలో తాళపత్ర గ్రంథాలు, పాతబడిన కాగితపు చుట్టలు అల్మారాల్లో పేర్చి ఉన్నాయి.
గురుస్వామి గది మధ్యలో ఉన్న ఒక పెద్ద రాతి బల్ల వైపు అడుగు వేస్తూ, దానిపై ఉన్న దుమ్మును తన చేత్తో తుడిచారు. ఆ బల్ల మీద ఒక అద్భుతమైన చిత్రం చెక్కి ఉంది.
ఆ చిత్రంలో ఉన్నది సగం సింహం, సగం పక్షి రూపంలో ఉగ్రంగా కనిపిస్తున్న శరభేశ్వరుడు.. తన రెండు చేతులతో భయంకరమైన నరసింహుడిని అదుపు చేస్తున్నట్టు ఉంది ఆ చిత్రం.
ఆ బొమ్మను చూడగానే అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. "ఈ చిత్రం అచ్చు నా తండ్రి డైరీలో గీసిన చిత్రంలాగే ఉంది! అంటే ఆయనకు ఇవన్నీ ముందే తెలుసా..?" అని తనలో తాను అనుకున్నాడు.
ఆ చిత్రాన్ని చూడగానే ఉన్నట్టుండి వేద ఆ రాతి పీఠం దగ్గరకు వెళ్లి, అందులోని శరభేశ్వరుని రూపాన్ని తాకింది. ఆమె వేళ్లు ఆ రాతిని తాకగానే, ఆమె గుండెలో ఏదో ఒక వింతైన అలజడి మొదలైంది.
"వేద.. ఈ చిత్రాన్ని చూడు." గురుస్వామి తన గంభీర స్వరాన్ని సవరించుకుంటూ చెప్పారు.
"పురాణ కాలంలో హిరణ్యకశిపుని సంహరించాక కూడా నరసింహుని ఆగ్రహం చల్లారలేదు. ఆ ఉగ్రత లోకాలను దహించివేస్తుంటే, పరమశివుడు శరభేశ్వరుని రూపం ధరించి ఆ క్రోధాన్ని బంధించాడు. ఆ ఉగ్రతను పూర్తిగా నాశనం చేయడం సాధ్యం కాదు, అందుకే దాన్ని ఒక వంశంలోని రక్తంలో నిక్షిప్తం చేసి బంధించారు. ఆ బంధనాన్ని కాపాడే బాధ్యత శతాబ్దాలుగా మీ వంశస్థులదే. మీరే ఆ శక్తికి కాపలాదారులు.. అంటే ద్వారపాలకులు!"
గురుస్వామి చెప్పిన విషయాన్ని వినగానే వేద కళ్లలో నీళ్లు తిరిగాయి.
"ఏంటి స్వామీ మీరు అంటున్నది.. నేను కూడా అందరిలాగే ఒక మామూలు అమ్మాయిని అనుకున్నాను.. పొద్దున్నే లేచి కాలేజీకి వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం.. నా ప్రపంచం ఇంతే అనుకున్నాను. కానీ నా ఉనికి ఇంత భయంకరమైనదా? నాలో అంతటి ఉగ్రత దాగి ఉందా?" అని తల్లడిల్లిపోయింది.
ఆమె వేదనను అర్థం చేసుకున్న గురుస్వామి ఆమె దగ్గరకు వచ్చి, ఆమె మెడలో నీలిరంగులో మెరుస్తున్న ఆ శరభ ముద్రను చూశారు.
"ఇది కేవలం నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన జ్ఞాపకం కాదు వేద.. ఇది ఒక తాళం లాంటిది. నీలో ఉన్న ఆ ఉగ్ర శక్తి బయటకు రాకుండా నొక్కి ఉంచే బంధనం ఇది. నీలో కోపం పెరిగినప్పుడు నీ రక్తం ఎందుకు ఉడుకుతుందో తెలుసా? ఈ ముద్ర దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడే ఆ వేడి పుడుతుంది."
అది విన్న వేద వణుకుతున్న చేతులతో ఆ లాకెట్‌ను తాకింది. ఆ మరుక్షణమే.. ఆ గదిలో నిశ్చలంగా వెలుగుతున్న దీపాలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
ఆ వెలుగులో గోడల మీద ఉన్న తాళపత్ర గ్రంథాల నీడలు ప్రాణం పోసుకున్నట్లు కదలడం మొదలుపెట్టాయి. ఆ నీడలు యుద్ధం చేస్తున్నట్లు, ఎవరో అరుస్తున్నట్లు వింత వింత ఆకృతులుగా మారుతుంటే అర్జున్ భయంతో వెనక్కి జరిగాడు.
గురుస్వామి ఒక్కసారిగా వేద చేయి పట్టుకున్నారు. ఆయన వేళ్లు ఆమె నాడిని గమనిస్తుండగా, ఒక పాత మంత్రాన్ని గొనుగుతున్నట్టు చదివారు.
మరుక్షణమే వేద కళ్లలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఆమె కనుపాపలు ఎర్రగా మారి, లోపల ఏదో అగ్ని జ్వాలలు కదులుతున్నట్టు అనిపించింది.
ఆమె చర్మం కింద ఉన్న రక్తనాళాలు నీలిరంగులో మెరుస్తూ ప్రస్ఫుటంగా కనిపించాయి.
వేద శ్వాస వేగంగా మారి, ఆమెకు తన శరీరమే ఒక అగ్నిపర్వతంలా అనిపిస్తోంది. గురుస్వామి ఆమె కళ్లలోకి నేరుగా చూస్తూ, ఆ కళ్లలోని తీవ్రతకు ఒక్క క్షణం వణికిపోయారు.
"సమయం లేదు వేద.. ఆగ్ని జ్వాలలు మేల్కొంటున్నాయి!" అని ఆయన గొంతులో భయం ధ్వనించింది.
గురుస్వామి వేద భుజాలను పట్టుకుని ఆమెను కుదిపి, గంభీరమైన స్వరంతో, "నీ రక్తంలో ప్రవహిస్తోంది రక్తం కాదు వేద... అది యుగాల క్రితం ఆరిపోని నరసింహుని క్రోధాగ్ని! అది నిన్ను దహించివేసేలోపు, దాన్ని ఎలా అదుపు చేయాలో నువ్వు నేర్చుకోవాలి. లేదంటే నువ్వే ఈ ప్రపంచం అంతానికి కారణం అవుతావు!" అని అన్నాడు.
ఆయన మాట పూర్తి కాగానే.. బయట ఆకాశంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఆ శబ్దానికి ఆ భారీ మేనార్ కోట మొత్తం పునాదులతో సహా కదిలిపోయినట్లు కంపించింది.
కిటికీ రెక్కలు దడదడలాడాయి. వేద నోటి నుండి ఒక అస్పష్టమైన గాండ్రింపు లాంటి శబ్దం వెలువడింది.
గురుస్వామి చెప్పిన ఆ క్రోధాగ్ని వేదను మింగేస్తుందా? లేక ఆమె దాన్ని తన వశం చేసుకుంటుందా?
వచ్చే ఎపిసోడ్ లో.. వేద తనలోని శక్తులను ఎలా అర్థం చేసుకుంటుంది? తనలోని ఉగ్రతను ఎలా అదుపు చేస్తుంది?