ఆ తెల్లవారుజామున అర్జున్ కళ్ళు నిద్రకు నోచుకోలేదు.
తన క్యాబిన్‌లోని వైట్ బోర్డు మీద ఇప్పుడు ఆ వైరల్ వీడియో స్క్రీన్ షాట్‌లు, నిన్న రాత్రి అతను ఫోన్లో తీసిన ఆ వంగిపోయిన ఇనుప రేక్ ఫోటోలు పిన్ చేసి ఉన్నాయి.
ఆ గదిలో నిశ్శబ్దం అలుముకున్నా, అర్జున్ మెదడులో మాత్రం వేల ప్రశ్నలు యుద్ధం చేస్తున్నాయి.
టార్చ్ లైట్ వెలుతురులో వేద కళ్ళు రంగు మారడం.. ఒక సాధారణ అమ్మాయి తన అరచేతి స్పర్శతో మందపాటి ఇనుమును వెన్నలా వంచేయడం.. ఇవన్నీ ఒక మనిషికి సాధ్యమేనా?
"ఇదేదో మెడికల్ కండిషన్ అని తను నమ్మించాలని చూస్తోంది. కానీ ఆ కళ్ళలో ఉన్నది జబ్బు కాదు.. ఒక రకమైన అపరిమితమైన శక్తి. అసలు తనెవరు? ఆ శక్తికి మూలం ఎక్కడ ఏంటి?" అని అర్జున్ తనలో తాను గొణుక్కున్నాడు.
ఆ ఇనుప రేకు మీద ముద్రించబడిన వేలి ముద్రలను జూమ్ చేసి చూస్తున్నప్పుడు అతనికి ఒకటి అర్థమైంది.
అది కేవలం బలం కాదు, ఆ వేలి ముద్రల దగ్గర ఇనుము కరిగిపోయినట్టుగా ఉంది. అంటే ఆమె స్పర్శలో విపరీతమైన వేడి ఉంది!
"నువ్వు అబద్ధం చెబుతున్నావు వేద.. నీ భయం వెనుక ఏదో ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. దాన్ని నేను వెలికి తీయాలి" అని నిశ్చయించుకున్నాడు.
కొద్దిసేపటికే అర్జున్ నగరంలోని పాత ప్రభుత్వ ఆర్కైవ్స్ లైబ్రరీకి చేరుకున్నాడు. అక్కడ గాలిలో పాత కాగితాల వాసన, దశాబ్దాల నాటి దుమ్ము పేరుకుపోయి ఉంది.
గంటల తరబడి వెతికిన తర్వాత, వేద సర్టిఫికెట్లలో ఉన్న ఆమె తండ్రి 'రఘురామ్' మరియు తల్లి 'సుమతి' పేర్లకు సంబంధించిన పాత రికార్డులు బయటపడ్డాయి.
ఒక పాత న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చూసి అర్జున్ చేతులు వణికాయి. సుమారు ఇరవై ఏళ్ల క్రితం, ఒక పురాతన ఆలయ పరిశోధనలో ఉన్న రఘురామ్ దంపతులు మర్మమైన రీతిలో మరణించారు.
ఆ రిపోర్టులో పోలీసుల నోట్ అతన్ని ఆశ్చర్యపరిచింది: 'మృతదేహాల చుట్టూ ఉన్న నేల విపరీతమైన వేడికి మాడిపోయింది. కారణం అస్పష్టం.'
అర్జున్ వెంటనే తన బ్యాగ్ లోంచి వేద మెడలో ఉన్న లాకెట్ ఫోటోను తీసి, తన దగ్గర ఉన్న ఒక పురాతన మత గ్రంథంలోని చిత్రంతో పోల్చి చూశాడు. అది సాదాసీదా నగ కాదు.. అది 'శరభేశ్వరుని ముద్ర'.
పురాణాల ప్రకారం, నరసింహ స్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా తన ఉగ్రతను ఆపలేక లోకాలను దహిస్తుంటే, ఆ ఉగ్రతను అణచడానికి శివుడు తీసుకున్న అవతారమే శరభేశ్వరుడు.
"శరభ.. శరభ.. ఉగ్రతను బంధించే శక్తి!" అని చదువుతున్న అర్జున్ కళ్ళు మెరిశాయి.
"వేద మెడలో ఉన్నది ఆ ముద్రే. అంటే తన లోపల ఏదో ఉగ్రమైన శక్తి ఉంది, దాన్ని ఈ ముద్ర అదుపు చేస్తోందా? లేక తనే ఆ శక్తికి మూలమా?"
అర్జున్ ఇలాంటి ఆలోచనల్లో మునిగిపోయి ఆఫీసు నుండి బయటకు వస్తున్నాడు. అప్పటికే చీకటి పడింది. ఆకాశం మేఘావృతమై వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.
తన బైక్ వైపు వెళ్తున్న అర్జున్‌కు అకస్మాత్తుగా వెనుక ఎవరో గమనిస్తున్నారన్న స్పృహ కలిగింది.
అదే సమయంలో, కొద్ది దూరంలో నిలబడి ఉన్న ఒక నల్లటి కారులో ఇద్దరు వ్యక్తులు అర్జున్ కదలికలను నిశితంగా గమనిస్తున్నారు.
వారి చేతుల్లో ఉన్న అత్యాధునిక కెమెరాలు అర్జున్ తీసిన ప్రతి ఫోటోను క్లిక్ మనిపిస్తున్నాయి.
"బాస్.. ఈ కుర్ర జర్నలిస్ట్ చాలా లోతుగా తవ్వుతున్నాడు. అతనికి శరభ ముద్ర గురించి తెలిసిపోయినట్టుంది." అని ఒకడు ఫోన్లో మాట్లాడాడు.
అవతలి వైపు నుండి రుద్ర భైరవ గంభీరమైన గొంతు వినిపించింది.
"అతన్ని ఇప్పుడే చంపకండి. అతనే ఆ ప్రాచీన రహస్యం వైపు మనల్ని తీసుకెళ్లే దారి కావచ్చు. కానీ అతనికి ఒక హెచ్చరిక అవసరం. మనకు పనికొచ్చేలా కేవలం భయపెట్టండి.. దారి మళ్ళించండి!"
అర్జున్ తన బైక్ స్టార్ట్ చేయబోతుండగా, హఠాత్తుగా ఆ నల్లటి కారు హెడ్ లైట్స్ రెండు కళ్ళలా వెలిగాయి. ఒకేసారి ఇంజిన్ గట్టిగా గర్జించింది. అర్జున్ వెనక్కి తిరిగి చూసేలోపే ఆ కారు మెరుపు వేగంతో అతని వైపు దూసుకువచ్చింది.
"హేయ్!" అని అరుస్తూ అర్జున్ పక్కకు తప్పుకోబోయాడు, కానీ ఆ కారు వేగం భయంకరంగా ఉంది.
అది అతన్ని ఢీకొట్టడానికి కొద్ది అంగుళాల దూరంలో ఉన్నప్పుడు.. టైర్ల అరుపుతో సడన్ బ్రేక్ వేసింది. ఆ వేగానికి వచ్చిన గాలి తాకిడికి అర్జున్ అదుపు తప్పి బైక్ మీదనుండి కింద పడిపోయాడు.
కారు కిటికీ అద్దం నెమ్మదిగా కిందకు దిగింది. లోపల ఉన్న వ్యక్తి మొహం కనిపించడం లేదు కానీ, అతని వేలికి ఉన్న ఒక వింతైన ఉంగరం అర్జున్ కంట పడింది. దానిపై Cult of Chaos గుర్తు ఉంది.
"ఇది నీకు సంబంధం లేని విషయం అర్జున్.. ప్రాణాలు మీద ఆశ ఉంటే దీనికి దూరంగా ఉండు. లేదంటే ఆ అమ్మాయితో పాటు నువ్వు కూడా బూడిదైపోతావు..!" అని ఆ వ్యక్తి హెచ్చరించాడు.
కారు ఎంత వేగంగా ఐతే వచ్చిందో అంతే వేగంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది.
అర్జున్ ఆయాసపడుతూ లేచి నిలబడ్డాడు. అతని చేతులు గీసుకుపోయి రక్తం వస్తోంది.
కారు వెళ్లిపోయాక, అర్జున్ కింద పడి ఉన్న చోట ఒక చిన్న కాగితం ముక్క అతనికి కనిపించింది. వణుకుతున్న చేతులతో దాన్ని అందుకుని చూశాడు.
దాని మీద కేవలం మూడు మాటలు ఉన్నాయి:
"The Threshold - 11:11"
Adi చదివిన వెంటనే అర్జున్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఈ 'ట్రెషోల్డ్' అంటే ఏమిటి? ఆ సమయం దేనికి సంకేతం? వేదను వెంటాడుతున్నది కేవలం ఒక నీడ మాత్రమే కాదు, ఒక వ్యవస్థ అని అతనికి అర్థమైంది.
మరి అర్జున్ ఈ ప్రమాదాన్ని ఎదిరించి వేదను కలుసుకోగలడా? ఆ కాగితం ముక్క అతన్ని ఎక్కడికి నడిపిస్తుంది?
మరిన్ని మలుపులతో వచ్చే ఎపిసోడ్ లో…