రుద్రకోట శిథిలాల మధ్య నుండి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగు తీస్తోంది వేద.
అడవి మార్గంలో ఆమె అడుగులు పడుతుంటే ఎండుటాకులు చిటపటలాడటం బదులుగా, ఆ వేగానికి అవి కాలిపోతున్నాయేమో అన్నట్టుగా పొగలు వస్తున్నాయి.
వేద గుండె దడదడలాడుతోంది. అది భయం వల్ల వచ్చే వేగమో, లేక తన నరాల్లో ప్రవహిస్తున్న ఆ వింత శక్తి వల్ల కలిగిన ఉద్రేకమో ఆమెకు అర్థం కావడం లేదు.
దారిలో ఒక చిన్న నీటి గుంట కనిపించగానే వేద ఒక్కసారిగా ఆగింది. ఆగి, ఆయాసపడుతూ ఆ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది.
నీటి అలల మధ్య కనిపిస్తున్న తన ముఖం ఆమెకే కొత్తగా, భయంకరంగా అనిపించింది. కళ్ళలోని ఆ రక్త వర్ణం మెల్లిమెల్లిగా తగ్గుతూ సాధారణ స్థితికి వస్తోంది. కానీ వేద మెడలోని ఆ 'శరభ ముద్ర' లాకెట్ మాత్రం ఇంకా సెగలు కక్కుతూనే ఉంది.
"నేను మనిషినా? లేక మనిషి రూపంలో ఉన్న మృగన్నా? అసలు నాకేమవుతోంది?" అని అనుకున్న ఆమె గొంతులో వణికింది.
"ఆ కోటలోని అమ్మాయి నన్ను చూసింది.. నా రాక్షస రూపాన్ని తను చూసింది. ఒకవేళ ఈ ప్రపంచం నన్ను అలా చూస్తే? నన్ను కూడా ఏదో ఒక మృగంలా చూసి వేటాడి చంపేస్తుందా?" అని తలచుకోగానే వేద ఒళ్ళు జలదరించింది.
తనను తనే అసహ్యించుకుంటూ, ఆ చీకటిలోనే రహస్యంగా, ఎవరి కంటా పడకుండా అడవిని దాటి తన గది వైపు పరుగు తీసింది.
మరోవైపు, అనన్య హోమ్ ఆఫీసులో వాతావరణం ఉత్కంఠభరితంగా ఉంది. బయట వర్షం మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి, కానీ గది లోపల అనన్య కళ్లలో అంతకంటే పెద్ద తుఫాను కనిపిస్తోంది.
విక్కీ వణుకుతున్న చేతులతో కెమెరాను లాప్‌టాప్‌కి కనెక్ట్ చేశాడు. వీడియో ప్లే అవుతుంటే, ఏదో హార్రర్ మూవీ చూసినట్టు ఇద్దరి శ్వాసలు ఆగిపోయినంత పని అయింది.
స్క్రీన్ మీద.. ధూళి మేఘాలను చీల్చుకుంటూ ఒక ఆకారం, ఆ భారీ ఇనుప స్తంభాన్ని ఒక అగ్గిపుల్లలా విసిరికొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ అమ్మాయి కళ్ళలోని ఎరుపు రంగు ఆ చీకట్లో ఒక మండుతున్న అగ్నిగుండంలా వెలిగిపోతోంది.
"అనన్యా.. ఇది.. ఇదేదో ఏలియన్ లా అనిపిస్తుంది, మనిషయ్యే అవకాశమే లేదు. మనం పోలీసుల దగ్గరికి వెళ్లాలి. ఇదేదో చాలా ప్రమాదంలా ఉంది!" అన్నాడు విక్కీ, చెమటలు పడుతున్న ముఖంతో.
కానీ విక్కీ చెబుతున్నవి ఏవీ అనన్య చెవిని కూడా చేరడం లేదు. ఆమె చూపులు ఆ వీడియో నుండి పక్కకు మరలడం లేదు.
"పోలీసులా? వాళ్లకు ఇస్తే ఏమొస్తుంది, దీన్ని ఏ మూలనో పడేస్తారు విక్కీ. కానీ ఇది.. నాకు ఇది ఒక డిజిటల్ గోల్డ్ మైన్! నా కెరీర్‌నే మార్చేసే అద్భుతం అవకాశం. 'సూపర్ వుమెన్ ఆఫ్ ఇండియా'.. ఆలోచించు! ఈ ఒక్క వీడియోతో మనం రాత్రికి రాత్రే ఇంటర్నేషనల్ సెలబ్రిటీలం అయిపోతాం." అని అంటున్న ఆమె కళ్లలో భయం కంటే అత్యాశే ఎక్కువగా కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా, ఇంకోవైపు..
వేద, అడవిలో నుండి పరుగులు తీస్తూ, తన గదిలోకి వచ్చి తలుపులు గట్టిగా గడియ పెట్టుకుంది. తనకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది.
అద్దం ముందుకు వెళ్లి తన ముఖాన్ని తాకి చూసుకుంది. తన చర్మం ఇంకా వేడిగానే ఉంది. వెంటనే ముఖంపై నీళ్లను వేసుకొని, గది మూలన ఉన్న తన తల్లిదండ్రుల పాత ఫోటోను బయటకు తీసింది.
దానిపై ఉన్న దుమ్మును తుడుస్తుంటే ఆమె కళ్లు నీళ్లు తడిశాయి. ఆ ఫోటోలో ఉన్న ఆమె తల్లి మెడలో కూడా సరిగ్గా, వేద మెడలో ఉన్న అదే 'శరభ ముద్ర' లాకెట్ ఉంది.
"అమ్మా.. నాలో దాగున్న ఈ మంట ఏమిటి? దీన్ని ఆపడం నా వల్ల కావడం లేదు. నేను ఏదైనా శాపాన్ని మోస్తున్నానా? లేక నేనే ఒక శాపమా?" అని అడుగుతూ వెక్కి వెక్కి ఏడ్చింది.
కాసేపు తర్వాత, తన మనసులోని వేదనను డైరీలో రాయాలని పెన్ను పట్టుకుంది. కానీ ఆమె చేతి నుండి వెలువడుతున్న ఆ వింత అగ్ని సెగలకు పెన్ను ప్లాస్టిక్ మెల్లిగా కరిగిపోవడం చూసి, భయంతో దాన్ని కింద పడేసింది. తన సొంత శరీరం తనకే ఒక శత్రువులా కనిపించింది.
ఇటువైపు, అనన్య స్టూడియోలో ఎడిటింగ్ పనులన్నీ పూర్తయ్యాయి. విక్కీ పదే పదే వద్దని వారిస్తున్నా, అనన్య ఒక్క మాట కూడా వినలేదు.
ఆమె మనసులో ఇప్పుడు కేవలం వ్యూస్, లైక్స్, ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు.
వీడియో థంబ్ నెయిల్ మీద వేద ఎర్రని కళ్ళను జూమ్ చేసి, దానిపై పెద్ద అక్షరాలతో "The Mystery Girl with Red Eyes: నిజ జీవిత దెయ్యమా లేదా దేవతా?" అని టైటిల్ పెట్టింది.
"అనన్యా, ఇంకోక్కసారి ఆలోచించు.. ఒకవేళ అది నిజంగా ఒక మనిషైతే, ఇది ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయవచ్చు" అని విక్కీ ఆఖరి ప్రయత్నం చేశాడు.
"అది ఎవరైనా నాకు అనవసరం, విక్కీ.. లైఫ్ లో రిస్క్ లేకపోతే చివరికి మిగిలేది చేతిలో రస్క్ మాత్రమే, టీ లో అద్దుకొని తినడం తప్పా ఏం చేయలేం!" అంటూ అనన్య కరుకుగా సమాధానమిచ్చి, మౌస్ పట్టుకుని 'UPLOAD' బటన్ మీద వేలు పెట్టింది.
సరిగ్గా అదే క్షణంలో.. అనన్య ఫోన్ గట్టిగా మోగింది. ఒక నోటిఫికేషన్ టోన్ ఆ గదిని నిశ్శబ్దంలో దద్దరిల్లేలా చేసింది. ఎవరో తెలియని ఒక 'ప్రైవేట్ నంబర్' నుండి మెసేజ్ వచ్చింది.
మెసేజ్ ఓపెన్ చేసిన అనన్య ఒళ్ళంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది. అందులో ఇలా ఉంది:
"ఆ వీడియో అప్‌లోడ్ చేస్తే నీ ప్రాణానికే ప్రమాదం! దాన్ని ఇప్పుడే డిలీట్ చెయ్.. లేదంటే నీ మరణానికి నువ్వే కారణం అవుతావు!"
అది చదివిన వెంటనే అనన్య చేతులు వణకడం మొదలయ్యాయి. కిటికీ బయట మెరుపు మెరిసింది. ఆ కాంతిలో ఎవరో ఒక నీడ తన కిటికీ బయట నిలబడి చూస్తున్నట్టు ఆమెకు అనిపించింది.
వణుకుతున్న వేళ్లతో అనన్య స్క్రీన్ వైపు చూసింది.. ఆ మెసేజ్ పంపింది ఎవరు? ఆమెను గమనిస్తున్నది ఎవరు?