Read Veda - 11 by Eshwarchandra Rathnapalli in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

వేద - 11

వికాస్ చెప్పిన నమ్మలేని నిజానికి బైక్ హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకున్న అర్జున్ చేతులు వణుకుతున్నాయి. చెవుల్లో వికాస్ చెప్పిన మాటలు ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. "డాక్టర్ శివరామ్ మూడేళ్ల క్రితమే చనిపోయాడు అర్జున్!"

అంటే.. వేద తనకు చూపించిన ఆ రిపోర్టులు, ఆ కన్నీళ్లు, ఆ అరుదైన జబ్బు కథ.. అంతా పక్కాగా అల్లిన ఒక అబద్ధం! 

కానీ ఎందుకు? తనలోని అసాధారణ శక్తిని దాచుకోవడానికా? లేక తనను అనుసరిస్తున్న వారి నుండి తనను తాను కాపాడుకోవడానికా? 

వేద చుట్టూ ఏదో అదృశ్య వలయం ఉంది. అది తనను మోసం చేస్తోందా లేక ప్రమాదంలో పడేస్తోందా అన్నది అర్జున్‌కు అర్థం కావడం లేదు. 

కానీ ఒక్కటి మాత్రం నిజం.. వేద ప్రమాదంలో ఉంది. ఆ నిజాన్ని గ్రహించిన మరుక్షణమే అర్జున్ తన బైక్‌ను వేగంగా వెనక్కి తిప్పాడు. ఇంజిన్ గర్జన ఆ నిశ్శబ్ద రాత్రిని చీలుస్తూ వేద ఉన్న చోటుకి పరుగు తీసింది.

అక్కడ.. వేద ఇంటికి వెళ్ళే దారిలో ఉన్న ఆ పాత పార్కు దగ్గర వీధి దీపాలు వెలుగుతూ ఆరుతూ ఉన్నాయి. ఆ మసక వెలుతురులో వేద ఒంటరిగా నడుస్తూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. 

అప్పుడే ఒక నల్లటి వ్యాన్ వేగంగా వచ్చి ఆమెకు అతి సమీపంలో ఆగింది. టైర్ల రాపిడికి వచ్చిన శబ్దం ఆ ప్రాంతంలో పెద్ద శబ్ధం చేసింది. 

ఆ నల్లటి వ్యాన్ తలుపులు తెరుచుకున్నాయి. అందులోనుండి ముగ్గురు ముసుగు మనుషులు మెరుపు వేగంతో బయటకు వచ్చారు.

ఈ దృశ్యాన్ని చూసిన వేద గుండె ఆ క్షణం ఆగిపోయినంత పనైంది. 

వారి చేతుల్లో మెరుస్తున్న వెండి రంగు సిరంజీలు చూస్తుంటే అవి ప్రాణాలు తీయడానికి కాదు, ఆమెలోని రక్తాన్ని పిండుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నాయి. 

వారు ఆమెను బలవంతంగా వ్యాన్ లోపలికి లాగడానికి ప్రయత్నిస్తున్నారు.

"వదలండి నన్ను! ఎవరు మీరు?" వేద అరుపు ఆ నిర్మానుష్య ప్రదేశంలో మోగిపోయింది. 

ఆమెకు తెలుసు, తను ఒక్క దెబ్బ కొడితే వారు గాలిలో ధూళిలా కలిసిపోతారని. కానీ ఆమె లోపల ఏదో భయం కదులుతుంది. 

తనలోని శక్తి బయటపడితే, తను ఒక వింత మనిషిగా లోకానికి ముద్ర పడిపోతానని, అది తన ఉనికికే ప్రమాదమని ఆమె సంకోచిస్తోంది. ఆ సంకోచమే ఆమెను బలహీనపరుస్తోంది.

సరిగ్గా వారు ఆమెను వ్యాన్‌లోకి తోయబోతుండగా, ఒక తీక్షణమైన కాంతి వారి కళ్ల మీద పడింది. ఒక బైక్ వేగంగా వచ్చి ఆ ముసుగు మనుషులను ఢీకొట్టింది. అది అర్జున్!

బైక్ మీద నుంచి దూకిన అర్జున్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకడి ముఖం మీద గట్టిగా పంచ్ ఇచ్చాడు. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లో ఇంతటి పోరాట పటిమ ఉంటుందని వేద ఊహించలేదు. 

అర్జున్ ఒక పోరాట వీరుడిలా పోరాడుతున్నాడు. ఇద్దరిని కింద పడేసి, వేద చేయి పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. "వేద, నా వెనుకే ఉండు!" అని ఆదేశించాడు.

కానీ ఆ ముసుగు మనుషులు సాధారణమైన వారు కాదు. అంతటి గట్టి దెబ్బ తిన్నా, వారికి ఏమీ కాలేదు అన్నట్టుగా వెంటనే కోలుకుని అర్జున్ మీద విరుచుకుపడ్డారు. 

ఒకడు వెనక నుండి కత్తి తీసి అర్జున్ వీపులోకి పొడవడానికి సిద్ధమయ్యాడు. ఆ దృశ్యం వేద కళ్లలో పడింది.

అర్జున్ ప్రమాదంలో ఉన్నాడన్న ఆలోచన ఆమె మెదడులోకి చేరగానే, ఆమె లోపల ఏదో పేలింది. 

అప్పటివరకు అదుపులో ఉన్న ఆ ఉగ్ర రూపం కట్టలు తెంచుకుంది. ఆమె కళ్లు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. శరీరంలో విద్యుత్ ప్రవహిస్తున్నట్లు అనిపించింది.

"అర్జున్.. పక్కకు తప్పుకో!" అని అరుస్తూ, ఆమె మెరుపు వేగంతో ముందుకు దూకింది. కత్తి పట్టుకున్న వాడి చేతిని పట్టుకుని ఒక్క తోపు తోసింది.

అంతే..! వేద తోసిన ఆ బలమైన తోపుకి, ఆ మనిషి గాలిలోకి లేచి, దాదాపు పది అడుగుల దూరంలో ఉన్న పార్కు గోడకు బలంగా తగిలి కింద పడ్డాడు. 

ఆ దెబ్బకు గోడ కూడా ముక్కలుగా పగిలిందంటే, ఆమె ప్రయోగించిన బలం ఎంతటిదో అర్థమవుతోంది.

పక్కనే ఉన్న అర్జున్ ఆ దృశ్యం చూసి స్తంభించిపోయాడు. తన కళ్లముందు జరిగింది నమ్మలేకపోతున్నాడు. 

ఒక సామాన్య అమ్మాయిలో ఇంతటి అద్భుత శక్తి ఎలా సాధ్యం? అనే ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

వేద కూడా తను చేసిన పనికి షాక్ అయ్యింది. భయంతో ఆమె చేతులు వణుకుతున్నాయి. తన శక్తి ఒకరిని చంపేంత స్థాయిలో ఉందా అని ఆమె కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది.

దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన ముసుగు మనుషులు తమ సహచరుడికి పట్టిన గతి చూసి భయపడ్డారు. ఆమె మనిషి కాదు, ఏదో మృగం అని భయపడి అతన్ని తీసుకుని వ్యాన్ లో పారిపోయారు.

ఆ దృశ్యం జరిగిన చోట చీకటి రాజ్యమేలుతోంది. ఆశ్చర్యంతో కూడిన భయంతో, అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. 

ఇటువైపు వేద మోకాళ్ల మీద కూర్చుని ఏడుస్తోంది. అర్జున్ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లి, మరలా ఆ రిపోర్టుల గురించి, అబద్ధాల గురించి అడగాలనుకున్నాడు. 

కానీ అక్కడ జరిగిన సంఘటన మరియు ఆమె ప్రస్తుత స్థితి చూసి మౌనంగా ఉండిపోయాడు. ఆమెను బైక్ మీద ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు.

వేదను ఆమె ఇంటి దగ్గర దింపిన తర్వాత, అర్జున్ తన షర్టు మీద అంటుకున్న రక్తాన్ని తుడుచుకుంటూ కిందకు చూశాడు. 

అక్కడ ఆ పోరాటంలో కింద పడిపోయిన ఒక ముసుగు మనిషి చేతికి ఉన్న గుర్తు అతనికి గుర్తుకొచ్చింది. ఆ ముసుగు మనిషి మణికట్టు మీద ఒక వింతైన పచ్చబొట్టు ఉంది.

అది ఒక త్రిశూలం చుట్టూ పాము చుట్టుకున్నట్లు ఉన్న గుర్తు.
అర్జున్ ఒక్కసారిగా వణికిపోయాడు. ఆ గుర్తు.. అది Cult of Chaos చిహ్నం. ఆ గుర్తును తను ఎక్కడో చూసినట్టు అనిపించింది.. 

అవును! తన తండ్రి మరణించిన తర్వాత దొరికిన ఆయన పాత డైరీలో, చివరి పేజీలో రక్తం మరకలతో గీసిన గుర్తు ఇదే!

అంటే.. తన తండ్రి మరణానికి, ఇప్పుడు వేదను వెంటాడుతున్న ఈ మనుషులకు ఏదో సంబంధం ఉందని అనుమానం మొదలైంది. 

అసలు వేద ఎవరు? తన తండ్రి డైరీలో ఈ రహస్యం ఎందుకు ఉంది?

అర్జున్ కళ్లలో ఇప్పుడు కేవలం వేద గురించిన ప్రశ్నలు మాత్రమే కాకుండా, తన తండ్రి మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని ఛేదించాలన్న కసి కూడా తోడైంది. 

వేద కేవలం ఒక అమ్మాయి కాదు.. ఆమె ఎవరూ చేధించలేని ఒక రహస్యంగా అనిపించింది!

ఆ రహస్యం అర్జున్ జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతోంది? Cult of Chaos అనే ఒక సంస్థ వేద కోసం ఎందుకు వెతుకుతోంది?

వచ్చే ఎపిసోడ్ లో.. మరిన్ని సంచలన నిజాలు!