ఎపిసోడ్ - 1
[ ఓ నిశ్శబ్ద ప్రయాణం ]
"ఒక నిమిషం కొన్ని గంటల కథలు మోసుకెళ్లింది…
ప్రతి మాట ఒక కవితను పలికింది…
కళ్ళల్లో కనిపించేది చూపు మాత్రమేనని
వెన్నెల నీడలో నీ... నా ప్రేమ దాగింది."
కృష్ - ప్రియా
ఇద్దరూ రాత్రి బీచ్‌లో నడుస్తున్నారు. చుట్టూ మొత్తం నిశ్శబ్దం… ఎలాంటి మాటలు లేవు. దూరంగా చంద్రుడు… చుట్టూ చల్లటి గాలి… అప్పుడప్పుడూ కాళ్లను తాకి వెళ్లే అలలు.
నచ్చిన మనిషి ఇంత దగ్గరలో ఉండగా, కృష్ కళ్లను ప్రియా చూస్తోంది… ప్రియా కళ్లను కృష్ణ చూస్తున్నాడు. కానీ ఏమి మాట్లాడుకోలేదు. ఒక నిమిషం మౌనం మాత్రమే ఉంది.
ఆ ఒక రాత్రి… ఆ ఒక నడక… మొత్తం మార్చేసింది.
ప్రియా: కృష్… ఈ రోజు స్పెషల్ ఏంటో గుర్తుందా?
కృష్: అబ్బా! ఇంత స్పెషల్ డేని నేను ఎలా మర్చిపోతాను? ఈ రోజే నేను నిన్ను మొదటిసారి చూశాను... నిన్ను చూసిన దానితోపాటు, నీ పైన నాకూ ప్రేమ కలిగిన రోజు!
ప్రియా: (చిరునవ్వుతో) ఇంకా గుర్తుందా? నువ్వు ఎప్పుడో మర్చిపోయుంటావేమో అనుకున్నాను. రెండు సంవత్సరాలు అయ్యాయిగా...
కృష్: రెండు సంవత్సరాలు, ఏడు నెలలు, పదిహేను రోజులు... ఇంకా కొనసాగుతూనే ఉంది!
ప్రియా: (నవ్వుతూ) మనం 'మూవ్ ఆన్' కావాలనుకున్నాం. కానీ మనస్సు మాత్రం అక్కడే ఆగిపోతుంది కదా...
కృష్: మనస్సే కాదు ప్రియా... నా ప్రపంచం కూడ అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే, నువ్వే నా ప్రపంచం!
ప్రియా: ఇంకా కోపం తగ్గలేదు?
కృష్: (నెమ్మదిగా) అసలు కోపం వస్తేనే తగ్గుతుంది. కానీ ఆ సమయంలో నువ్వు ఉన్న పరిస్థితి అర్థమైంది నాకు. అందుకే, నేనే తగ్గిపోయాను. నీకు గుర్తుందా మనం మొదటిసారి ఎలా కలిశామో?
---
[ఫ్లాష్‌బ్యాక్]
కృష్: 2022, అక్టోబర్ 13 తారీఖు… సాయంత్రం 5:30.
నాన్నగారి ఆఫీస్ టెన్షన్ నుంచి బయటపడేందుకు, చిన్న బ్రేక్ తీసుకోవాలనుకుని బీచ్‌కి వచ్చాను. అప్పుడు ఓ చిన్నపాపతో ముద్దుగా ఆడుకుంటూ నువ్వు కనిపించావు. అదే క్షణం… నా టెన్షన్ అంతా మాయమైపోయింది.
అప్పటిదాకా "లవ్ అట్ ఫస్ట్ సైట్" అంటే నమ్మేవాడిని కాదు. కానీ నిన్ను చూసిన ఆ క్షణం నాకు నమ్మకం వచ్చింది.
---
[ప్రస్తుతం]
ప్రియా: ఒక్క చూపుతోనే నచ్చేసానా నీకు?
కృష్: అవును! ఆ సముద్ర రంగు చీర, చెవిలో తెల్లటి చిన్న జ్యూమ్కా, మెడలో చిన్న లోకెట్, వదులుగా వదిలిన వెంట్రుకలు... అలా అలా నీ కళ్ల దగ్గరకి వచ్చి వెళ్ళడం…
ఆ అలల శబ్దం... నీ నవ్వులో కూడా వినిపించిందనిపించింది!
అప్పుడు గుండె బలంగా కొట్టుకుంది.
నా గుండెపై చేయిపెట్టి నిన్నే చూస్తున్నప్పుడు… నువ్వు కూడా నవ్వుతూ… చూడనట్టుగా చూశావు!
ఆ రోజు వరకూ నా జీవితం ఒకలా ఉండేది.
ఆ రోజు తర్వాత నా ప్రపంచమే మారిపోయింది.
నా జీవితాన్ని నీకు అంకితం చేయాలని అనిపించిన క్షణం – అదే క్షణం.
ప్రియా: నాకింకా అర్థం కాలేదు… ఒక మనిషికి ఎదురుగా ఉన్న వ్యక్తిపై ఇంత ఇష్టం ఎలా కలుగుతుంది?
అది కూడా ఒక్క చూపులోనే…
వారి కేరక్టర్ ఏంటి, వ్యక్తిత్వం ఏంటీ తెలీకుండానే… అలా ప్రేమలో పడిపోతామా?
కృష్: మిస్ ప్రియా… నిజమైన ప్రేమ ఎప్పుడూ మనిషి రూపానికి కాదు, మనసుకు కలుగుతుంది.
వాళ్ళు ఎలా ఉన్నా, రూపాన్ని కాకుండ మనస్సు ను చూసి ప్రేమిస్తే… అది నిజమైన ప్రేమ!
ప్రతి అమ్మాయి అందాన్ని చూసి పడిపోతే అది ఆకర్షణ.
ప్రియా: మరి నీవైతే ప్రేమ చేశావా లేక ఆకర్షితమయ్యావా?
కృష్: (చిరునవ్వుతో) హలో మేడం! నా ప్రేమ నిజమైనదే. నేను ప్రేమించిన అమ్మాయి నా కళ్లకి ఎంత అందంగా కనిపించిందో చెపుతున్నాను అంతే..
ప్రియా: (నవ్వుతూ) నాకు కూడా అప్పట్లో ఓ ఫీలింగ్ కలిగింది… కానీ అది "లవ్ అట్ ఫస్ట్ సైట్" ఆ లేక నిజమైన ప్రేమ అప్పుడు నాకూ తెలీదు...
2021, సెప్టెంబర్ 10, రాత్రి 9 గంటలు… షేర్ ఆటోలో నేను ఒక అమ్మాయి వెళ్తున్నాం… ఆ ఆటో డ్రైవర్ మిర్రర్లో పదే పదే చూస్తున్నాడు.
పక్కనే బస్టాప్ దాటి పోతూ, ఆలోచనల్లో…
ఒక్కసారిగా బస్టాప్ నుంచి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో ఎక్కావు.
ఎవరనో తెలియకుండా… నన్ను, ఆ అమ్మాయిని సేఫ్‌గా ఇంటికి దింపి, ఏ మాటాడకుండా వెళ్లిపోయావు.
ఇలా చేసే వారు ఇప్పుడెక్కడా కనిపించరు.
నీవు నమ్మదగిన వ్యక్తివని, నిజమైన జెంటిల్మన్వి అనిపించింది.
తన పేరు Mr.క్రిష్..
కృష్: (ఒక క్షణం ఆలోచిస్తూ) అది… నువ్వు?
ప్రియా: (నవ్వుతూ) హా… ఆ రెడ్ చున్నీ ముఖానికి చుట్టుకుని కూర్చున్నది నేనే!
కృష్: (చిరునవ్వుతో) అది హ్యూమానిటీ… ఆ పరిస్థితిలో ఎవరున్న అలాగే చేసేవాన్నీ. కానీ, నా గురించి నువ్వు ప్రత్యేకంగా ఆలోచించేలా చేసింది ఏమిటి?
ప్రియా: (నవ్వుతూ) నువ్వు బ్లూ షర్ట్, బ్లాక్ జీన్స్, పాత వాచ్ ధరించావు. చేతికి పని చేయకపోయినా, మా సేఫ్టీ కోసం 35 నిమిషాలు అసలు నెంబర్ కూడ డయిల్ చేయకుండా గట్టిగా మాట్లాడుతూ ఉన్నావ్..
అప్పుడే నాకు నీ క్యారెక్టర్ అర్థమైంది.
మీ అబ్బాయిలు చూడగానే ప్రేమిస్తారు కాని, మేము అమ్మాయిలు మాత్రం… క్యారెక్టర్ చూసి ప్రేమిస్తాం!
కృష్: (నవ్వుతూ) అది నిజమే! అలాగే ప్రేమలో పడతావనుకోలేదు కానీ, నన్ను గమనించావంటే ఆశ్చర్యంగా ఉంది.
ప్రియా: ఎ, మీ అబ్బాయిలకేనా "లవ్ అట్ ఫస్ట్ సైట్" మా అమ్మాయిలకి ఉండకూడదా?
క్రిష్: కాదు కాదు, అంత కంగారు లోను నువ్వు నన్ను గమనించావు కదా.. ఇంకా నవ్వుతూ..
ప్రియా: ఐనా నేను పడిపోయింది నీ క్యారెక్టర్ కి, నేను ప్రేమించిన వాడి క్యారెక్టర్ ఏంటో చెప్తున్నాను అంతే..
--------------