స్ఫూర్తి
ఏ క్షణం ఈ భూమి మీద పడ్డానో అప్పటి నుంచి నడకవచ్చి నాలుగు వీధులు తిరిగే వరకు అమ్మ తిన్నా తినకపోయినా
ఒడిలో పడుకోబెట్టుకుని జుట్టు నిమురుతూ నా ఆకలి తీర్చేది.
నడకవచ్చి నాలుగు వీధులు తిరిగే వయసు వచ్చిన తర్వాత కుండలో వండిన నాలుగు మెతుకులు నాకూ వాటా పెట్టి అమ్మ పస్తులు ఉండేది. ఎందుకంటే నాతో పాటు నాలుగు మెతుకులు పంచుకునేందుకు మరో ఇద్దరు మొత్తం ముగ్గురం. మాతో పాటు అమ్మానాన్న.
ఎన్నోసార్లు అమ్మానాన్న కుండలోని మంచినీళ్ళతో కాలం గడిపేవారో. ఆకలి గురించి ఆలోచించే సమయం కానీ తీరిక గాని ఆ దంపతులకు లేవు. తెల్లవారి లేస్తే తట్టబట్ట సర్దుకుని పొలం గట్టుకు చేరకపోతే మర్నాడు మా ఇంట్లో పొయ్యిలోంచి పిల్లి లేచేది కాదు.
కాలచక్రాన్ని ఎవరు ఆపలేం. తిరిగే కాలం నాకు 10 సంవత్సరాల వయసుని మా ఇంటి పరిస్థితిని అదే సమయంలో మా ఊరిలో ఉండే పెద్ద మేడలో ఉన్న నా వయసు వాళ్ల నిత్య కృత్యాన్ని గమనించుకునే జ్ఞానం కలిగించింది. కాలం అంటే అందరూ భయపడతారు. కానీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా కున్న పరిస్థితిని దాటడానికి నా బాధ్యతను గుర్తుచేసింది. అంటే ఒకటి మా పేదరికం రెండోది నా చదువు .
చదువు నాకు అందని ద్రాక్ష . అందనిది అందుకోవాలని ఆరాటం ఉంటుంది.అందుకే ఏ పని దొరికిన అమ్మకు చెప్పకుండా చేసి పదోపరకో సంపాదించి నాన్న జేబులో పెడుతు ఉండేవాడిని. నాకు బాగా గుర్తు నేను ఎక్కువగా స్మశానంలో సమాధులు తవ్వుతూ ఉండే పనికి కుదిరివాడిని. నన్ను ఎందుకు ఎంచుకునేవారు అంటే తక్కువ కూలికి పనిచేస్తానని పనిలో నైపుణ్యం ఎక్కువగా చూపిస్తానని మా ఊరి ప్రజలకు నమ్మకం కుదిరింది. అయితే ఆ పెద్ద దినం రోజున సమాధి తవ్వే వాళ్లందరినీ పిలిచి భోజనాలు పెట్టేవారు. కొంచెం అన్నం తిన్న తర్వాత అమ్మ తమ్ముళ్లు గుర్తుకొచ్చి ఆకులో మరికొంత పెట్టించుకుని ఏదో వంకతో ఇంటికి చేరేవాణ్ణి. అలా నెలకు రెండుసార్లు కడుపునిండా భోజనం దొరికేది.
నాకు నిత్యం స్మశానoలో పనిచేయడం వల్ల భయం పోయింది. రాత్రిపూట అమ్మ పక్కన ముడుచుకుని పడుకుని కబుర్లు చెబుతూ చెబుతూ నా అరచేతులు నిమురుతుండేది. అలా బొబ్బలెక్కిన నా చేతులు చూసి నిజం చెప్పమంది. నాన్న నిజం చెప్పేసి దోషీలా తలవంచుకున్నాడు.
మర్నాడు ఉదయం అమ్మ పనికి వెళ్లకుండా నాకు స్నానం చేయించి ఉన్న వాటిలో మంచి బట్టలు వేసి (మంచి బట్టలు ఏమిటి అన్ని అలాంటివే). పక్కనే ఉన్న సర్కారు వారి బడిలో
వయసు తక్కువ వేసి మొదటి తరగతిలో జాయిన్ చేసేసింది.
ఇది నాకు ఒక పక్క ఆనందం మరొకపక్క విచారం. అమ్మకు సాయం చేయలేకపోతున్నాను అని. అయినా ఆదివారాలు క్రిస్మస్ సెలవులు సంక్రాంతి సెలవులు దసరా సెలవులు వేసవి సెలవులు నేను కుటుంబానికి ఆసరాగా ఉండడానికి సహాయం చేసాయి. పాఠశాలలో జాయిన్ అయినా నేనెప్పుడూ ఆలస్యంగానే వెళ్ళేవాడిని.
ఎందుకంటే ఉదయమే లేచి కడుపునింపుకుందామంటే ఇంట్లో ఖాళీకుండలే దర్శనం ఇచ్చేవి. నేను అమ్మ పొద్దున్నే లేచి ఒక సత్తుగిన్నె చేతిలో పట్టుకుని ప్రతి ఇంటికి తిరిగి తిరిగి ఇంత ముద్ద సంపాదించుకునేవాళ్లం. మా ఊర్లో మా పరిస్థితి తెలిసిన వాళ్లు ఇంత ముద్ద పెట్టేవారు . లేని వాళ్ళు దున్నపోతులా ఉన్నావు అంటూ కసిరి కొట్టేవారు. ఆ మాటకు అర్థం నాకు తెలిసేది కాదు.అమ్మకు తెలిసి చాటుగా కన్నీళ్లు తుడుచుకునేది. అలా సంపాదించిన అన్నం గబగబా నాలుగు ముద్దులు తిని స్కూలుకు వెళ్లేటప్పటికి ఆలస్యం అయ్యేది. మాస్టర్ ఎప్పుడు నిలబెట్టి తిట్టి దెబ్బలు కొట్టేవారు. అందరి ముందు అలా నిలబెట్టి తిడితే అవమానంగా ఉండే ది.ఒకరోజు ఏడుస్తూ నాకున్న పరిస్థితిని మా కుటుంబం గురించి చెప్పేసాను. ఆ మాట చెప్పగానే మాస్టర్ కంట్లో నుంచి రెండు నీటి బొ ట్లు రాలిపడ్డాయి. మనసు అనేది ఉంటే పక్కవాడి పరిస్థితి గురించి అర్థం చేసుకో వచ్చు. అదే కదా మనకు కలిగిన జ్ఞానం.
ఆ రోజుల్లో ఉపాధ్యాయుడికి ఒక విద్యార్థికి మధ్య సంబంధం తండ్రి కొడుకులు సంబంధంలా ఉండేది. గురువు అంటే శిష్యుడ్ని ఉన్నత స్థాయిలో చూసుకోవాలని ఆరాటపడేవాడు.
అదే రోజు నాకు ఆయన ఒక సలహా ఇచ్చారు. నువ్వు పొద్దున్నే స్కూల్ కి టైముకి వచ్చెయ్యి. సమయాన్ని పాటించడం అనేది క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే నీ జీవితం చాలా మెరుగుగా ఉంటుంది. ఫలితాలు నువ్వే చూస్తావ్. రేపటి నుంచి ఉదయం నాతో పాటే నువ్వు రెండు మెతుకులు తిందువుగాని అంటూ ఆ మరునాటి నుంచి రెండు గిన్నెల క్యారేజీ నాకోసం ప్రత్యేకంగా తెచ్చేవారు. మధ్యాహ్న పూట సర్కారు వారు ఎలాగా పాఠశాలలో భోజనాలు పెట్టేవారు. సాయంకాలం పూట
అమ్మానాన్న పస్తులుండి మా కడుపు నింపేవారు.
.అవసరం మనిషికి ఎంతైనా చేయిస్తుంది.ఆ అక్షరాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా కడుపు నింపుతుందని నాతోపాటు కుటుంబానికి అన్నం పెడుతుందని అక్షరం విలువ గురించి ప్రధానోపాధ్యాయులు వారు ప్రతిరోజు చెప్పే మంచి మాటలు నాలో కసి పట్టుదల పెంచేయి.
నాలో ఉత్సాహం చూసి మా మాస్టర్ గారు సాయంకాలం పూట ఉచితంగా ట్యూషన్ చెప్పేవారు. పాత పుస్తకాలు సేకరించి ఇచ్చేవారు. పాఠశాలకు సంబంధించినంత వరకు నా బాగోగులు చూసేది ఆ ఉపాధ్యాయుడే .
నాకు సెలవు రోజుల్లో కూలి పనికి వెళ్లడం, తరగతి గదిలో ఉన్నంతసేపు పాఠాలను శ్రద్ధగా వినడం, ఇంటికి వచ్చిన తర్వాత
దీపం వెలుతురులో శ్రద్ధగా చదువుకోవడం ఇంతకు తప్ప నాకు ఏ ప్రపంచం లేదు. ఆ దీపానికి కావాల్సిన నూనె కోసం నాన్న కోమటి గారి దగ్గర గానుగెద్దులా పనిచేస్తున్నాడని నాకు తర్వాత తెలిసింది.
దేవుడిచ్చిన తెలివితేటలు, మా పాఠశాల ఉపాధ్యాయులు నా మీద చూపించిన ప్రత్యేక శ్రద్ధ, నా పట్టుదల ,చదువు మీద నాకు ఉండే శ్రద్ధ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నా నంబరు మొదటి శ్రేణిలో ఉండడం చూసి నా తల్లిదండ్రులు నా ఉపాధ్యాయులు నా తోటి విద్యార్థుల ఆనందం ఏరులై పొంగింది.
నాకు ఒకపక్క ఆనందం మరో పక్క విచారం .ఊరిలో ఉన్న పాఠశాల అక్కున చేర్చుకుని అక్షరాలు నేర్పింది. మరి ఏరు దాటి ఊరు దాటి కళాశాల లో చేరాలంటే మా ఇంట్లో సత్తు రూపాయి కూడా ఎక్కడ కనపడదు. మరి కళాశాలలో చేరాలంటే అన్ని తడుకోవాల్సిందే. అమ్మా నాన్నలకు ఏమి తెలియదు. ఇంకెవరు దిక్కు నాకు. మా మాస్టర్ కేసి ఆశగా చూసా.
ఆయన కూడా బతకలేని బడి పంతులు. అయినా గొడుగు వేసుకొని కాళ్లకు చెప్పులు వేసుకుని మా ఊరి పెద్ద జమీందారు మేడలోకి వెళ్లి నవ్వు ముఖంతో బయటకు వచ్చాడు.
గవర్నమెంట్ ఆఫీసులు తిరిగి తిరిగి పేద విద్యార్థుల స్కాలర్షిప్ సంపాదించి ఆయన ముఖంలో ధైర్యం తెచ్చుకునీ నా భుజం తట్టి నా కళ్ళలోకి ధైర్యంగా చూశాడు. వెళ్లే ముందు అమ్మకి నాన్నకి మాస్టారికి భార్యకి నమస్కారం చేసి బయలుదేరుతుంటే మాస్టర్ గారు భార్య మాస్టారు గారి పాత చొక్కాలు, పాత ప్యాంట్లు, రెండు దుప్పట్లు, రెండు చాపలు, తలగడ ఇచ్చి ఆశీర్వదించారు. మాస్టారు గారి బట్టలు ఇవ్వడమేమిటి అనే సందేహం అందరికీ కలుగుతుంది. నేను పొడవుగా బలంగా ఉండేవాడిని . అయినా తప్పదు ఏమీ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అనుకొని మా ఏరు దాటి ఊరు దాటి ఆ మహాసముద్రంలోని ఒక వీధిలో ఉన్న ఆ పెద్ద కళాశాలలో నా రెండవ అధ్యాయం ప్రారంభం అయ్యింది.
పేద విద్యార్థుల శరణాలయంలో కాపురం. రెండు పూటలా భోజనం వసతి అన్నీ ఉచితమే. మాస్టారు మా ఊరు జమీందారు గారి మేడలోకి ఎందుకు వెళ్లారో అర్థమైంది. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడు ఏదో రూపంలో దిక్కు చూపిస్తాడు.
నాకు మా మాస్టారు దిక్కు. ఆయనే దిక్సూచి. నా దిన చర్య మామూలే. ఆడపిల్ల లాగ వంచిన తలెత్తకుండా కాలేజీకి వెళ్లి రావడం పుస్తకాలు నా ప్రపంచం. సెలవుల్లో మటుకు మాత్రమే అమ్మానాన్న దర్శనం. సెలవు రోజుల్లో ఎప్పటిలాగే గోచి పె ట్టుకుని పనిలోకి వెళ్లడం . నేను పనిని చదువునీ నమ్ముకున్న వాడిని పట్టుదల నా ఆయుధం. పాపం సరస్వతి దేవి కూడా నా మీద జాలి చూపించింది.
ఎక్కడ పరీక్షల్లో తప్పనివ్వకుండా గుప్తంగా నా పక్కనే ఉండే పరీక్షలు వ్రాయించింది. ఏ పరీక్ష రాసిన ఫలితం నేను ఆశించిందే వచ్చింది. మధ్య మధ్యలో మాస్టర్ వచ్చి నా బాగోగులు నా విజయాలు చూసి ఆనంద భాష్పాలు కార్చి అమ్మానాన్నలకి నా కబుర్లు అందించేవారు.
మా అమ్మానాన్నలకి కడుపున పుట్టిన వాడిని. మా మాస్టారికి దత్తపుత్రుడునీ. ఎందుకంటే మా మాస్టారు కి కడుపున పుట్టిన పిల్లలు లేరు. అలా అయిదు సంవత్సరాలు గడిచిపోయాయి. యూనివర్సిటీ వారు గోల్డ్ మెడల్ నా మెడలో వేసి పట్టా నా చేతిలో పెట్టి ఇంటికి పంపించేశారు. నా జీవితంలో రెండో అధ్యాయం ముగిసింది. ఈలోగా తమ్ముళ్లు కూడా మా ఊరు స్కూల్లో నాలాగే అష్ట కష్టాలు పడుతూ నన్ను ఆదర్శంగా తీసుకుని ఒక్కో క్లాసు దాటుతున్నారు.
కాలం నన్ను ముందు ఒక మెట్టు ఎక్కించింది. అమ్మానాన్నల శక్తి ఒక మెట్టు తగ్గించింది.ఇదివరకట్లాగా శ్రమ పడలేక శరీరం అప్పుడప్పుడు హెచ్చరిస్తోంది. ఇది కూడా నాకు హెచ్చరిక కాబోలు. నా బాధ్యతను గుర్తు చేస్తోంది. జన్యుపరంగా వచ్చిన ఆరడుగుల పొడుగు, అందమైన ముఖం కండలు తిరిగిన శరీరం చూసి మా ఊర్లో ఉండే రిటైర్డ్ కానిస్టేబుల్ గారు పేపర్ కటింగ్ తీసుకొని వచ్చి నన్ను ప్రోత్సహించారు. మళ్లీ పోటీ పరీక్ష . మౌఖిక పరీక్ష. మెడికల్ పరీక్ష. అసలు మానవుడు జీవితం అంతా పరీక్షలే. దేవుడు పెట్టిన పరీక్షలు కొన్ని అయితే జీవితంలో నిలబడాలంటే నాలో కూడా ఏదో ప్రత్యేకత ఉందని చూపించాలంటే ఈ పరీక్షలు తట్టుకోవాలి.
పరీక్షలు తట్టుకోవాలంటే పరీక్ష పెట్టిన భగవంతుడే మరొక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు. సహాయం అంటే డబ్బే కాదు. ఒక్కొక్క మాట మనిషిని మార్చేస్తుంది. మంచి దారి చూపిస్తుంది.నా దారి ఆ భగవంతుడు ఆ రిటైర్డ్ కానిస్టేబుల్ ద్వారా చూపించాడు.
అయితే ఆ మెట్టు చేరుకోవాలంటే ఒకటి కాదు రెండు కాదు అన్ని పరీక్షలే.ఏపరీక్షలోవిజయంసాధించకపోయినా మనకు మిగిలేది శూన్యం. మళ్లీ మొదటి నుంచి ప్రయత్నించాలి.
సంవత్సరం పాటు నాకు పగలికి రాత్రికి తేడా లేకుండా పోయింది.నేను నా పుస్తకాలు. అమ్మ వేళకి ఇంత ముద్ద నోట్లో పెట్టేది. అంటే ఆ సమయం కూడా నేను నష్టపోకూడదని.
కాలం మనకు సహకరించినప్పుడు విజయం కూడా మన కూడా వస్తుంది. పరీక్షలన్నిటిలో మెట్టెక్కించేసింది.
ప్రభుత్వం నా సమర్థతను గుర్తించింది. ఖాకి డ్రెస్సు, తల మీద టోపీ ,చేతిలో లాఠీ ఇచ్చి లూటీ చేసే వాళ్ళని ఎలా పట్టుకోవాలో
తగిన సమయస్ఫూర్తి గవర్నమెంట్ వారి ఆదేశాలు అన్ని నేర్పడానికి ఒక సంవత్సరం పాటు రాజధాని నగరం ఢిల్లీలో శిక్షణ ఇచ్చి ఆంధ్రాలో ఒక జిల్లాకి పోలీస్ అధికారిగా చేసింది.
నా పదవి హోదా గురించి అమ్మకు తెలియదు. కానీ నెల జీతం ఎంత అని అడిగింది. ఎందుకంటే ఆమెకు మిగిలిపోయిన బాధ్యతలు తీర్చుకోవాలంటే అమ్మానాన్నలకి ఇద్దరికీ శరీరంలో శక్తి లేదు. వయసు తరుముతోంది. ఈమధ్య మాటిమాటికి అనారోగ్యం పాలవుతోంది. నన్ను ఇన్నాళ్లు ఆదరించిన మాష్టారు
పదవి విరమణ చేసి ఆ ఊర్లోనే ఉంటున్నారు. నాలో మానవత్వం మేలుకొంది. కన్న తల్లిదండ్రులని తమ్ముళ్లు ని
మాస్టార్ ని భార్యని తీసుకుని నాకు గవర్నమెంట్ వారు ఇచ్చిన పెద్ద బంగ్లాలో కాపురం పెట్టేసాను.
ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి. నన్ను కన్న తల్లిదండ్రులు మాస్టారు, భార్య వయసు రీత్యా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు
తమ్ముళ్లు నన్ను ఆదర్శంగా తీసుకుని నాలాగనే డిపార్ట్మెంట్లో చేరడానికి పోటీ పరీక్షలు హాజరవుతున్నారు. నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే సందేహం కలగొచ్చు. రోజు అనేక సమస్యలు చూస్తున్నాను. కొంతమంది తల్లిదండ్రులు కొడుకులు చూడట్లేదని, భర్తలు బాధిస్తున్నారని భార్యలు, భార్యలు సరిగా చూసుకోవటoలేదని భర్తలు అనేక వందల కేసులు రోజు మేము కౌన్సిలింగ్ ఇచ్చి పరిష్కరిస్తాం. ఆ వచ్చిన భార్య నాకున్న బాధ్యతలను సరిగా చూసుకుంటుందో లేదని నా సందేహం అంటూ ఆ జిల్లా సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ రాణా ప్రతాప్ సింగ్ ఆ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా వచ్చి తన కథ చెప్పుకుంటూ పోతున్నాడు. ఈరోజుల్లో అన్ని ఉండి చదువునీ నిర్లక్ష్యం చేస్తున్న వారికి ఈ జీవిత గాథ ఒక ఆదర్శమని ప్రధానోపాధ్యాయులు తన ప్రసంగoల్లో ఆ ముఖ్య అతిధి ని కొనియాడారు.
ఆ హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. విద్యార్థులు ఉపాధ్యాయుల కళ్ళ వెంట కన్నీరు కారుతూనే ఉంది. పోలీస్ ట్రైనింగ్ లో ఎన్నో వేల కఠిన సమస్యలను పరిష్కరించి గుండె కరడు కట్టిన ఆయన కళ్ళు ఇంకా కన్నీరు కారుస్తూనే ఉన్నాయి. కానీ ఆయన పాత రోజులు మర్చిపోలేదు కాబట్టి. బాధలను తొందరగా మర్చిపోలేము. అవి గుండెల్లో తలుచుకున్నప్పుడల్లా సంబంధిత దృశ్యం చూసినప్పుడల్లా బాధని రేపుతుంటాయి. బహుశా పాఠశాల చూసి తన చిన్నతనం గుర్తుకొచ్చి ఉంటుంది. ఎందుకంటే అది తనకు విద్య నేర్పిన పాఠశాల. ఆధునికంగా తయారైన ఆ పాఠశాల అంతా త్రిప్పి ప్రధానోపాధ్యాయులు చూపిస్తుంటే ఒక్కసారి ఆయనకి తన గతం గుర్తుకొచ్చింది. తన గతం నిజంగా ఒకరికి స్ఫూర్తిదాయకమే. విప్పి చెపితే తప్పేముంది ఇది ఆయన ఆలోచన.
ఇది ఊహించి వ్రాసిన కథ కాదు. కొన్ని మాత్రమే కల్పితం. అనేక మాధ్యమాలలో ఒక పోలీస్ ఆఫీసర్ స్వయంగా చెప్పిన జీవిత గాధ. ఒక రచన చేస్తే ఏదో సమాజానికి కొంత ప్రయోజనం ఉండాలి. స్ఫూర్తిదాయకమైన పోలీస్ ఆఫీసర్ జీవితం మనకి చదువుతుంటే వింటుంటే నాకు కన్నీరు ఆగలేదు.
మనకి పురాణ గాథలు చదువుతుంటే రాముడిలా పితృ వాక్య పరిపాలన చేయాలని కర్ణుడు, శిబి చక్రవర్తిలా దానగుణం ఉండాలని, భరతుడు పాత్రలో అన్నగారి పట్ల అభిమానం అలా ఉండాలని తెలుసుకున్నాం.
నేడు ఆధునిక కాలంలో కూడా ఎంతోమంది జీవితాలు ఆదర్శవంతంగా ఉంటాయి. అవి కథలుగా చెబితే నేటి మన పిల్లలకి స్ఫూర్తిదాయకమే కదా మరి.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279